కాసింత ఉనికిని కోరుకునే కలం

Spread the love

  కవిత్వం అవడం మామూలు స్థితి నుండి వేరుచేసి నిన్ను నీకు పరిచయం చేస్తుంది. అక్కడ అంతా మనసు వేసే ప్రశ్నల తివాచీని ఎదుర్కొంటూ చిక్కుముడుల దారులని విప్పుతూ ఓ ఆశావాహ వాక్యమై నిలబడాలనుకోవడం అన్నిసార్లు అందరికీ దొరికే నిధి కాదు.

      నీవు ఎవరు? అనే ప్రశ్నను సంధిస్తూ… ఆ ప్రశ్నలో నిండి తేరుకొని,  నీవు చూసే చూపు, నీ ఆలోచనల పదును పెడుతుంది. అటువంటి దారిని వెతుకుతుంది ఈ సూక్ష్మజీవి.

       నేటి యువత ప్రశ్నను స్వాగతిస్తుందా?

 సమాధానాల కోసం అన్వేషిస్తుందా? అన్నిసార్లు అవునని చెప్పలేము. కానీ

 కొన్నిసార్లు కొందరు తమలోపలి తమని వెతుకుతూ  అన్వేషణని చేస్తారు. ఇక్కడ ఈ సూక్ష్మజీవిగా చెప్పుకునే బాలు అగ్నివేష్ ది కూడా ఓ రకమైన అన్వేషణే.

  గొర్రెల మంద నుండి కాస్త దూరంగా జరిగి అంబేద్కర్ని చదివిన మెలుకువ అందుకోవాలని,  మార్క్ ని అర్థం చేసుకునే తపన కనిపిస్తుంది.

     కులం కంచెలు ఈనాటికీ దాటలేని వెలివాడల జాడ్యాల్ని చాలా సరళంగా ప్రశ్నిస్తాడు బాలు నీలి మేఘం కవితలో   

     “నిషిద్ధ వృక్షపు పళ్ళు తెంపి  

      వేలాడదీయబడ్డాను,

       ఆజాది అని అరిచి

       చెరసాలలో ఉన్నాను”

 అంటూనే ఈ దేశపు వెలివాడల్లోకి స్వతంత్రం ఇంకా రాలేదని చెప్తాడు.

 అంటరానితనాన్ని ఈనాటికీ మనుషుల్లోని ఆలోచనల్లో ఎంతగా కూరుకుపోయి ఉందో చెప్పడానికి ప్రయత్నిస్తాడు.

         ఈ దేశపు ప్రగతి పథంలో స్త్రీని గురించి మాట్లాడుతూ.,.

 “ చీకటి పడింది అంతా క్షేమమే ఆమె నడిచే దారి తప్ప” అని అన్నప్పుడు ఈ నేల మీద ఆడపిల్లల బతుకు చిత్రాన్ని గుర్తు చేస్తాడు.

           బాలు అక్షరాల్లో కాస్త ఫెమినిజం జాడలు ఉంటాయి, అమ్మలోని మాధుర్యాన్ని తట్టిచూపి ఆగిపోడు, ఆమె చెమట వాసనల్లోని గంధాన్ని స్పృశిస్తాడు.

   రాజ్య హింసను ప్రశ్నిస్తాడు.

“ రాజ్యాలెప్పుడు రాజ్యమేలేలానే ఉంటాయి. / శిస్తుల మీద సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ఆగిందని”

అంటూ తిరుగుబాటు జెండాని ఎగరవేస్తాడు.

  యుద్ధము గురించి, నేల మీద ప్రవహిస్తున్న  రక్తాన్ని గురించి మాట్లాడుతూ…

     ‘సామాన్య మానవుని కంటే రోబో లైఫ్ ఉత్తమంగా ఉంద”ని ఈరోజు కూడా నువ్వు నడవలేని దారి ఈ భూమిపై ఉందని ఆ రోబో తోనే మాట్లాడుతూ

 “నువ్వు నడవడానికి ఈ దారి అంతా పచ్చి రక్తపు బొట్ల వాసనే ఉంటుంది” అంటూ నేటి మన సమాజ దుస్థితిని, యుద్ధ నేలని విమర్శిస్తాడు.

   అంతేనా ఈ చిన్ని పుస్తకంలో వెంటాడే కవితలు ఉన్నాయి స్వాతంత్రం గురించి మాట్లాడుతాడు ఈ 75 సంవత్సరాల స్వాతంత్రంలో పాతికేళ్ల కుర్రాడికి ఎన్ని రకాల స్వాతంత్రాలు అణిచివేయబడ్డాయో చెప్తున్నప్పుడు ఒక్క నిమిషం మనం ఆలోచనలకు గాలం వేయకుండా ఉండలేము.

 నగర విషాదాన్ని పాలస్తీనా దుఃఖాన్ని, నెర్రలు బారిన నేలని, మసిబారినచోట మళ్లీ ఉదయించాల్సిన సూర్యులని గూర్చి,  అద్దే ఇళ్లలో వెజిటేరియన్ సమతూకాల శాస్త్రంలోని ఎద్దేవని,     ప్రజల గొంతులో పాట మాయం అవ్వడాన్ని  ఇప్పుడు వస్తున్న పాటల్లో జనం ఆవేదన ఆ  గొంతుల్లో లేదని, చెప్తూనే ప్రేమ సారుప్యాల్ని గురించి మాట్లాడతాడు. గులాబీ కి ముళ్ళు ఉండడం ఎంత అవసరమో చెప్తాడు.

    ఇలా  అక్కడక్కడ ఆవేశాలోచనలనుండి  తెగిపడిన వాక్యాలున్న పుస్తకం. 

మొత్తంగా చూస్తే మాత్రం మనకు ఓ కొత్త ఉనికిని చాటే స్వరం వినిపిస్తుంది.

స్వతంత్రమైన, కాసింత స్వేచ్ఛను కోరే గొంతు నుండి జాలువారిన కవిత్వం ఇది.

        ఎన్నెపిట్ట ఓ మంచి స్వరాన్ని వెతికి పట్టుకుంది.

      అభినందనలు సూక్ష్మజీవి అలియాస్ బాలు అగ్నివేష్.

    ఏమాత్రం ఆవేశం తగ్గకుండా, ఆలోచనలు పెంచుకొని కలాన్ని జుళిపిస్తావని ఆశిస్తూ.

      ~                 

                    

Rupa Rukmini

Spread the love

One thought on “కాసింత ఉనికిని కోరుకునే కలం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *