నగరంలోని ఒక కాలనీలో ఉన్న పార్కు వసంత కాలం అవడం వలన వింత అందాలతో పచ్చగా మెరసిపోతున్నది. పార్కులో ఒక మూల పున్నాగ చెట్టు క్రింద ఉన్న సిమెంట్ బెంచి తనలో తాను స్వగతంగా మాట్లాడుకుంటున్నది.
“ఆహా! ఎంత అందంగా ఉన్నాయి ఈ పరిసరాలు? రంగు రంగుల పూలు, వాటి మీద వాలే సీతాకోక చిలుకలు, లేతపచ్చని చిగుళ్ళతో ఊగిసలాడే కొమ్మలు, చెట్టుక్రింద, నా మీద పరచుకుని సువాసనలు వెదజల్లే పున్నాగపూలు… అసలు నేనున్న ఈ ఏకాంత ప్రదేశంలో కూర్చుని మాట్లాడుకోడానికి చాలా మంది ఇష్టంగా వస్తుంటారు. వాళ్ల కబుర్లతో నాకు మంచి కాలక్షేపం సుమా!
ఇంతలో ఇద్దరబ్బాయిలు వచ్చి అక్కడ కూర్చున్నారు. వారిలో ఒకడు “ఒరేయ్! అనంత్! టెన్త్ క్లాస్ రిజల్ట్స్‌లో మనిద్దరికి తొంబై పర్సెంట్ పైన వచ్చింది కదా! మా ఇంట్లో వాళ్లందరూ తెగ ఆనందపడిపోతున్నారు. నా భవిష్యత్తుకు మార్గాలు వేసే పనిలో పడ్డారు. వాళ్ళ ఇష్టాల ప్రకారం అన్నీ జరిగి పోవాలంటారు. మనకీ ఇష్టాయిష్టాలు ఉంటాయన్న సంగతే మర్చిపోతున్నారు.
“అదేంటిరా అశ్విన్ అలా అంటున్నావు? ఇంట్లో ఏమన్నా ఈ విషయంలో గొడవ జరిగిందా?”
“నీకు తెల్సుకదరా? చిన్నప్పటి నుంచి నాకు ఫిజిక్స్ ఇష్టమైన సబ్జెక్ట్. ఐన్‌స్టీన్ నాకాదర్శం! ఫిజిక్స్‌లో ఎమ్.ఎస్.సి., చేసి, డాక్టరేట్ సంపాదించుకుని, గొప్ప ఫిజిసిస్టుగా పేరు తెచ్చుకోవాలని కలలు కంటున్నాను. నా కలలన్నీ కరిగిపోయేలా ఉన్నాయి. నువ్వు చెప్పే చదువుకు చాలా సంవత్సరాలు పడ్తుంది. ఆ తర్వాత ఉద్యోగావకాశాల గురించి కూడా ఆలోచించాలి కదా? శుభ్రంగా ఇక్కడ ఇంజనీరింగ్ చదివి, అమెరికాలో ఎమ్.ఎస్. చెయ్యి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం వస్తుంది. తొందరగా సెటిల్ అయి, సంపాదనలో పడిపోతావు అని వత్తిడి పెడుతున్నారురా! ఇంట్లో అక్క తప్ప నన్ను సమర్థించే వాళ్లు ఇంకెవరూ లేరు. మీకు చిన్నతనం. అనుభవం లేదు. అందుకే ఇలా మాట్లాడుతున్నారు అంటున్నారు. వాళ్లనెలా ఒప్పించాలో తెలియడం లేదు.”
“అలాగా! నా పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉందిరా! నాకు బాడ్మింటన్ అంటే ఏంతిష్టమో నీకు తెల్సు కదా! ఈ సెలవల్లో బాడ్మింటన్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటానన్నాను. అకాడమీ వాళ్లు కూడా అందుకు ఒప్పుకున్నారు. ఎందుకంటే డిస్ట్రిక్ లెవల్లో చాంపియన్‌ని కదా? మా వాళ్లు ఇష్టపడటం లేదు. ఈ సెలవల్లో కంప్యూటర్స్ బాగా నేర్చుకో! ఇంజనీరింగ్‌లో కంప్యూటర్స్ తీసుకోవడానికి ఉపయోగపడ్తుంది. ఈ ఆటలు, ఇతర వ్యాపకాలు కట్టిపెట్టి చదువు మీద, కెరీర్ మీద ధ్యాస పెట్టు అని ప్రెషర్ పెడుతున్నారు.
“అంతేరా! ఈ పెద్దవాళ్ళింతే! మనం అనుకున్నది సాధించాలంటే కష్టనష్టాలు భరించాలి కదా? సులువైన మార్గాలుంటే కష్టాల బాటలో వెళ్ళాలనుకోవడం పిచ్చితనం అంటున్నారు. ఏమోరా! చివరికి ఏమవుతుందో మరి! ఇక పోదాం పద. ఆలస్యం అయితే మళ్లీ చివాట్లు తప్పవు.”
* * *
ఆ పిల్లల మాటలు విని బెంచి బాధగా నిట్టూర్చింది. వాళ్ళను గురించిన ఆలోచనలు తెమలక ముందే పద్దెనిమిది, ఇరవై ఏళ్ళ లోపున్న ఇద్దరు అమ్మాయిలొచ్చి బెంచి మీద కూర్చున్నారు. కూర్చున్న వెంటనే ఒక అమ్మాయి అంతవరకు ఉగ్గబట్టుకున్నట్లు ఒక్కసారిగా ఏడవడం మొదలెట్టింది. బెంచి విస్తుపోయింది.
“అదేంటి లచ్మి! అలా ఏడస్తన్నవ్? ఏటైందే? ఎవన్నా జరిగిందా?” అడిగింది మరో అమ్మాయి.
అది విని లచ్మి మరింతగా ఎక్కిళ్ళు పెడుతూ ఏడవసాగింది. అలా ఆమెని ఏడ్వనిచ్చి, ఆ ఉదృతం తగ్గి, నెమ్మదించాక,
“ఇప్పుడు సెప్పవే! నాతో సెప్పుకుంటే నీ బాధ తగ్గుతుంది.”
“నీకు తెల్సుగా సీతా! ఆ వీధి చివర్లో ఉన్న బులుగు రంగు డాబాలో మా అమ్మ పనిజేస్తన్న సంగతి. ఆ ఇంట్లో ఉద్దోగం చేసే సాయిత్రమ్మగోరు సాలా మంచోరు. మా అమ్మకి డబ్బు అవసరమైనా, ఇంకేం కావాలన్నా ఆ దయగల తల్లి సాయంగా ఉంటాది. ఇంకే ఇంట్లో పని మానినా, ఆ ఇంట్లో మా అమ్మ పని మానకుండా చేస్తది. ఈ మధ్య అమ్మ వయస్సు మూలంగా అన్ని ఇళ్ళల్లో పని సెయ్యలేక మూడిళ్ళ పని నాకు అప్పచెప్పింది. అందులో ఒకటి సాయిత్రమ్మగోరిది. ఆమె అంటే నాకు సానా ఇష్టం. నన్ను కూడా సిన్నదాన్నని పేమగా సూసుకుంటారు” అని గబగబా చెప్పి ఊపిరి పీల్చుకుంది.
కాసేపాగి మళ్ళీ “సాయిత్రమ్మగారి మొగుడే అసలు సమస్య! దొంగ యెదవ! ఈ మధ్యనే రిటైరు అయి ఇంట్లోనే ఉంటున్నాడు. వాడు, వాడి యవ్వారం! వంకర చూపులు! చూస్తుంటేనే చీదరపుడతాది. అమ్మగారు ఆఫీసుకు పోకముందే పని సేసుకుని బయటపడతాను. ఈ రోజు నేనెళ్ళేసరికి అమ్మగారు ఏదో పని మీద ఆఫీసుకు తొందరగా యెళ్ళారు. ఇక వాడి యెఖలి చూపులు, గుండెల వంక సూడటాలు భరించలేక గబగబా పనిసేసుకు వత్తంటే ఎనగ్గా వచ్చి కావలించుకున్నాడు. మొగం తిప్పిముద్దులు పెట్టబొయ్యాడు. ఎలా వచ్చిందో పిచ్చ బలం వచ్చింది. వాడ్ని ఒక్క తోపు తోసి బయటికి పరుగెట్టాను. ఈ రోజుకి గండం గడిచింది. వాడు ముట్టుకున్న ఒళ్ళు కారం రాసుకున్నట్లు మంట పుడతంది” అంది మళ్ళీ వెక్కుతూ.
“ఊరుకోవే! ఈ సంగతి మీ అమ్మకు, సాయిత్రమ్మ గారికి సెప్పు. వాడి అంతు తేల్సుకో! నీ వల్ల గాకపోతే నన్ను తీసకపో! నే చెబుతాను” ఓదార్చింది సీత.
ఇద్దరూ కాసేపు మౌనంగా ఉన్న తర్వాత సీత కలుగజేసుకుని “నా బతుకూ తెల్లవారేటట్టుంది. ఏం సెయ్యాలో తెలవడం లేదు” అంది దిగులుగా.
“ఏవయిందే? ఎంతో ద్దయిర్యంగా ఉండే నువ్వు ఇలా మాట్లాడతన్నవేటి?”
“నీకు తెలుసుగా నాకు మేనరికం ఉందని. మా అమ్మ అన్న కొడుకు శేషగిరిని నాకిచ్చి పెళ్ళి చెయ్యమని బంధుగులంతా మా అమ్మ యెనక పడతన్నరు. వాడు వట్టి తాగుబోతు. ఉద్యోగం సేతన్నా, సగం తాగుడుకే పోతది. పైగా ముఫై ఏళ్ళు! నాకంటె సానా పెద్దోడు!”
“నీ కిట్టం లేదని మీ అమ్మకి సెప్పొచ్చుగా!”
“అదీ అయింది. మన కాలనీ పోస్ట్‌మేన్ యెంకటకృష్ణ తెల్సుగా? ఈ మధ్యనే ఉద్దోగం వచ్చి మన కాలనీలో ఉత్తరాలు అవీ ఇంటింటా ఇస్తన్నాడు.”
“అవును తెలుసు. సైకిల్ మీద ఎడతంటే చూసాను.”
“నన్ను సాలా సార్లు సైకిల్ మీద పోతా సూసాడంట! ఒక రోజు దారి కాసుకుని, నన్నాపి సీతా! నువ్వంటే నాకిష్టమైంది. నువ్వు ఒప్పుకుంటే పెళ్ళి చేసుకుంటాను. నీ కిష్టమైతే చెప్పు మీ అమ్మతో మాట్లాడతా. కానీ కట్నం లేకుండా మనువాడతా అన్నాడు. మొదట్లో బిత్తరపోయినా, నెమ్మది మీద నన్ను ఇట్టపడే సేసుకుంటానన్నాడని అనిపించి అమ్మకి సెప్పా. అమ్మ మొదట్లో అగ్గి మీద గుగ్గిలం అయినా, అతన్ని కల్సినాక మంచోడని గహించుకుని మా పెళ్ళి సెయ్యడానికి సిద్దపడింది. ఈ విషయం మా బంధుగుల దాకా పోయింది. వాళ్ళు గుండాలని పంపి యెంకటకృష్ణని బెదిరించారు. అమ్మకేం సెయ్యటానికి తోచట్లేదు. చివరికేమవుతుందో మరి!” అని కళ్ళు తుడుచుకుంది.
ఇద్దరూ దిగులుగా మాటల్లేకుండా కూచున్నారు కొంతసేపు. ఇంతలో పనిచెయ్యవల్సిన ఇళ్ళు గుర్తుకొచ్చాయి.
“ఇక పోదాం పదవే! మన బతుకులు ఆ ఏడుకొండలవాడే బాగుసెయ్యాల! అని సీత ప్రేమగా లచ్మి చెయ్యి పట్టుకుని లేపి, తనతోపాటు తీసుకెళ్ళింది.
ఈ మాటలు ఆలకించిన బెంచికి ఏం చెయ్యాలో పాలు పోలేదు. ఆలోచనలు తెగక నిద్రలోకి జారింది.
* * *
హఠాత్తుగా మాటలు వినబడగా లేచి చూసింది. ఇద్దరు వృద్ధ దంపతులు కూర్చుని సంభాషించుకుంటున్నారు.
“అది కాదు భవానీ! నువ్వు సరిగ్గా ఆలోచించు. మనం ఇల్లు, ఆస్తులు అమ్ముకుని శాశ్వతంగా అమెరికాలో అబ్బాయి దగ్గరకు వెళ్ళడం సరైన నిర్ణయం అంటావా? వాళ్ళు మనల్ని సరిగ్గా చూస్తారా? కోవిడ్ వచ్చిన దగ్గర నుండి ఇండియా రావడమే మానేశారు. మా పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. వాళ్ళ చదువులూ, భవిష్యత్తూ మేం దృష్టిలో పెట్టుకోవాలి. మేం కూడా మా ఉద్యోగాల్లో మంచి పొజిషన్‌లోకి వచ్చాం. బాధ్యతలు ఎక్కువయ్యాయి. ఇదివరకులా ఇండియా రావడం కుదరదు. మీరైనా వంటరిగా అక్కడ ఎందుకు? అన్నీ అమ్మేసుకుని వచ్చేయండి అన్నారు కొడుకు, కోడలు. అది సరే! అక్కడ మనకి స్వాతంత్య్రం ఉండదు. వాళ్ళ ఇష్ట ప్రకారం నడుచుకోవాలి. ఇక్కడ మనకి మంచి స్నేహితులు, బంధువులు ఉన్నారు. అవసరం అయితే కలుస్తారు, సహాయపడతారు. అక్కడ మనకెవరున్నారు? వంటరితనంతో బాధపడాలి. ఎప్పుడన్నా వెళ్ళి చూసి రావడం వేరు, శాశ్వతంగా అక్కడ ఉండిపోవడం వేరు” అన్నాడు మగాయన.
“మీరు అన్నీ సరిగ్గానే చెప్పారు. కానీ అబ్బాయి మనం రామంటే బాధపడతాడేమోనండీ?” అంది తల్లి ప్రేమను చంపుకోలేక.
“వాడు బాధ పడతాడేమొనని మన జీవితాల్ని ఇరకాటంలో పడవేస్తామా? అసలు వాడికి మన మీద ప్రేముంటే మనల్ని చూడటానికి ఇన్ని రోజులు రాకుండా ఉంటాడా? కోడలు సంగతైనా ఆలోచించావా? కొన్ని విషయాల్లో ఎలా కొరకరాని కొయ్యలా వ్యవహరించేదో గుర్తుందా? ఇంతెందుకు? నీ స్నేహితురాలు శారద, ఆమె భర్త మాధవరావు అన్నీ వదుల్చుకుని అమెరికాలో కొడుకు దగ్గరకు వెళ్ళారుగా? ఏం బాపుకున్నారు? పిల్లలు వాళ్ళ ఉద్యోగాల్లో బిజీగా ఉంటారని, మనవడు, మనవరాలు మాట వినరని, ఇంటి బాధ్యత వాళ్ళ మీద పడిందని చెప్పలేదూ? ఈ వయస్సులో హాయిగా కృష్ణా! రామా! అనుకుంటూ ఏ బాదరబందీ లేకుండా ఉండాలనే కదా మనలాంటి వాళ్ళు కోరుకునేది? సరైన స్నేహితులు, బంధువులు లేకుండా వంటరిగా ఫీలవుతున్నామని నీకు శారద ఫోన్లో ఎన్నిసార్లు చెప్పలేదూ? నిర్ణయాలు తీసుకునే ముందు సాధకబాధకాలు ఆలోచించుకోవాలి భవానీ!”
“అవుననుకోండి! ఇప్పుడు చెయ్యి, కాలు సరిగ్గా ఉంది కాబట్టి బాగానే ఉన్నాం. ఇంకా వార్థక్యం పైనబడి చేసుకోలేక పోయినప్పుడు ఎలాగండీ?”
“అప్పుడు మన పిల్లల మనల్ని చూసుకుంటారన్న ఆశ నీలో ఇంకా మిగిలుందా భవానీ? నాకైతే లేదు! మనం మన పనులు చేసుకోలేనినాడు ఓల్డేజ్ హోమ్‌కి వెళ్ళిపోదాం! అన్ని సదుపాయాలు, సౌకర్యాలు అందించే హోమ్‌లు చాలా ఉన్నాయి. నా స్నేహితుడు ఆనందరావు, అతని భార్య సుశీల ఓల్డేజ్ హోమ్‌లో ఉన్నారుగా! మాకిక్కడ బాగానే ఉంది. మా వయస్సు వాళ్ళతో హాయిగా కాలం గడిచిపోతున్నదని వాళ్ళు చెప్పలేదూ? ఈ విషయంలో నువ్వేమి అనుమానాలు పెట్టుకోకు. మనకెప్పుడైనా పిల్లల్ని చూడాలనిపిస్తే వెళ్ళి, కొద్ది రోజులుండి వచ్చేద్దాం. పర్మనెంట్‌గా వెళ్ళడం మాత్రం నాకిష్టం లేదు” అన్నాడు ముసలాయన నిక్కచ్చిగా.
భవానీ భర్త చెప్పిన మాటలు విని ఆలోచనల్లో పడింది. ఆమెను కొద్దిసేపు ఆలోచించుకోనిచ్చి,
“ఇక వెళ్దాం పద! దారిలో కూరగాయలు, పళ్ళు కొనుక్కుని నెమ్మదిగా గూడు చేరుకుందాం. నీకు చాలా సమయం ఉంది. నేను చెప్పిన విషయాల గురించి తాపీగా ఆలోచించుకుని నిర్ణయానికి రా! తుది నిర్ణయం నీదే!” అని ఆమెను బయలుదేరదీశాడు.
అలా నెమ్మదిగా నడుచుకుంటూ పోతున్న ఆ వృద్ధ దంపతుల్ని దిగాలుగా చూడసాగింది బెంచి.
* * *
సాయంత్రం ఐదయింది. ఇంకో గంటలో పార్కు మూసేస్తారనగా ఒక యువతీ, యువకుల జంట గబగబా వచ్చి కూర్చున్నారు. యువకుడు మంచి పర్సనాలిటీతో బాగున్నాడు. యువతి చామనఛాయగా, కళగా ఉంది. ఆమె వేసుకున్న లేత గులాబీ రంగు షెల్వార్ కమీజు ఆమె ఒంపుసొంపులకి వింత అందానిచ్చింది.
“కబీర్! ఏదో చెప్పాలన్నావుగా? త్వరగా చెప్పు! ఆఫీసు ఇక్కడకి దగ్గర్లో ఉంది కాబట్టి పర్మిషన్ తీసుకుని వచ్చాను. ఈ మధ్య ఇంట్లో నామీద నిగా ఎక్కువయింది. ఆఫీస్ నుండి ఇంటికి త్వరగా వచ్చెయ్యమని రూలు పెట్టారు. వాళ్ళకు మన విషయం తెల్సిందని నాకు అనుమానంగా ఉంది. తాతయ్య, నాన్న టివి చూస్తూ లవ్ జీహాద్, లవ్ జీహాద్ అంటూ నాకు తెలిసేలా చర్చించుకుంటున్నారు. తమ్ముడు నాకు సపోర్ట్‌గా ఉన్నా, వాడొక్కడు ఏం చెయ్యగలడు? సంబంధాలు చూడటం మొదలెట్టారు. త్వరగా పెళ్ళి చేసి పంపాలని చూస్తున్నారు” అంది అమ్మాయి దిగులుగా.
“సాన్యా! మన విషయం గురించే నేనీమధ్యంతా ఆలోచిస్తున్నాను. మా ఇంట్లో కూడా వాతావరణం అనుకూలంగా లేదు. కానీ ఒక మంచి వార్త ఏంటంటే నా చెల్లెలు పెళ్ళి కుదిరింది. వచ్చే నెలే నిఖా. చెల్లి పెళ్ళయితే ఇక ఏ బాధ ఉండదు. నా బాధ్యత తీరిపోతుంది. మా సాఫ్ట్‌వేర్ కంపెనీలో మా బెంగాలీ బాసు చాలా మంచివాడు. సిన్సియర్‌గా పని చేస్తానని నేనంటే ఇష్టంగా ఉంటాడు. ఆయనకి మన విషయం చెప్పి, ఇక్కడ మన పెళ్ళి జరగడం అసాధ్యమని వివరించాను. ఇంకో రెండు నెలల్లో నీ ఆర్కిటెక్చర్ కోర్సు కూడా పూర్తవుతుందని చెప్పాను. యు.కె. ఆఫీస్‌కి నన్ను ట్రాన్స్‌ఫర్ చెయ్యమని ప్రాధేయపడ్డాను. ఆయన అర్థం చేసుకుని సరే అన్నాడు. అక్కడకి వెళ్ళాక ప్రతి నెలా అబ్బూకి, అమ్మీకి డబ్బులు పంపుతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదుల్కోను సాన్యా. మనిద్దరం యు.కె. వెళ్ళిపోదాం!” అని ఆమెను దగ్గరికి తీసుకుని నుదుటిమీద ముద్దు పెట్టాడు.
“నీజంగానా కబీర్? నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను. ఎప్పుడు మనిద్దరం ఒక దరికి చేరతామా అని ఎదురు చూస్తున్నాను. రెండు సంవత్సరాల మన ప్రేమ కథకు అందమైన ముగింపు ఉందా?” అని బేలగా అడుగతూ అతని భుజం మీద తలపెట్టుకుని కళ్ళు మూసుకుంది.
కబీర్ ఆమెను మరింత దగ్గరకు తీసుకున్నాడు. అలా వాళ్ళిద్దరూ మౌనంగా, తన్మయత్మంగా చాలా సేపు కూర్చున్నారు. బెంచి వాళ్ళ ప్రేమను చూసి ముచ్చటపడింది. చివరకు కబీర్ తేరుకుని,
“సాన్యా! ఇక పద! నీకు లేటవుతుంది. ఆలస్యమైతే మీ ఇంటి వాళ్ళు యక్షప్రశ్నలు వేస్తారు” అన్నాడు.
సాన్యా అయిష్టంగానే లేచి బయలుదేరింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని పార్కు బయటికి వేగంగా నడుస్తూ వెళ్ళారు. బెంచి వాళ్ళు కనుమరుగయ్యేంత వరకు చూస్తూ ఉండిపోయింది.
* * *
ఆరయింది. చీకట్లు క్రమేపి ముసురుకుంటున్నాయి. పార్కు మూసేసే టైం అయింది. వాచ్‌మెన్ పార్క్‌లో ఇంకా ఉన్నవాళ్ళని బయటికి వెళ్ళమని హెచ్చరించాడు. కొద్దిసేపట్లో పార్కు నిర్మానుష్యంగా మారింది.
బెంచి దీర్ఘంగా నిట్టూర్చి, సద్దుకుని కూర్చుంది. మనుష్యుల బాధలతో, సమస్యలతో బరువెక్కిన హృదయాన్ని నెమ్మదపరచింది. రేపటి కొత్త కథలు వినడానికి సిద్ధపడింది. రేపయినా మనస్సుని ఆహ్లాదపరచే కథలు వింటానేమొ అనుకుంటూ నిద్రకు ఉపక్రమించింది.

శాంతిశ్రీ బెనర్జీ
శాంతిశ్రీ బెనర్జీ గుంటూరు లో పుట్టి పెరిగారు. ఎమ్.ఏ., వరకు వారి విద్యాభ్యాసం అక్కడే జరిగింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, డిల్లీ లో ఎమ్.ఫిల్., చేసారు. తీన్ మూర్తి భవన్, డిల్లీ లో నెహ్రూ కి సంబంధించిన 'సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ' ప్రాజెక్టు లో అసోసియేట్ ఎడిటర్ గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అప్పటి నుంచి కథలు, కవితలు, వ్యాసాలు, ట్రావెలాగ్స్ రాస్తున్నారు. అవి వివిధ ప్రింట్, వెబ్ పత్రికల్లో ప్రచురించ బడ్డాయి. 2022లో వారి కథా సంపుటి 'మానుషి', కవితా సంపుటి 'ఆలంబన' వచ్చాయి.

పార్క్ లో బెంచీ కేంద్రంగా సమాజంలోని భిన్న వయసుల వారి సమస్యల విభిన్న కథనాలను చెప్పటం వైవిధ్యంగా వుంది.అన్ని కథనాలు నిత్య జీవన దృశ్యాలే.శాంతిశ్రీ బెనర్జీ గారికి అభినందనలు.
ధన్యవాదాలు సుభద్ర గారు.