ఎగుడుదిగుడు గతుకుల రోడ్డు. రోడ్డుకు రెండువైపులా విస్తారంగా పరుచుకున్న పచ్చటి పంటపొలాలు. నీళ్ళు అందినంతమేరా వరిపొలాలు, వరిపొలాలు అంతమై తాటిచెట్ల గుంపు మొదలైనాక మళ్ళీ మెల్లిమెల్లిగా పచ్చటి వేరుశెనగ చేలు. ఎటుచూచినా భూమి ఎలాగుంటుందో కనబడకుండా కప్పేసిన నీళ్ళు. పూర్తిగా నీళ్ళల్లో తేలుతున్న పొలాలు. నాలుగు రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన ‘నిశా’ వర్షాల వెల్లువ.
నిజానికైతే మునిగిపోయిన పంటచేలను చూడటానికి, పంటనష్టం పరిహారం లెక్కలు తేల్చడానికి రావల్సింది. ఇప్పుడదంత ముఖ్యంగాదు. అకాల ఋతువులు,
అతివృష్టి వర్షాలు, పంటలు మునిగిపోవడం గురించి ఇవాళ ఎవరికీ పట్టడంలేదు. అంతా ఒక్కటే మాట వార్తాపత్రికల్లోను, మీడియాలోను, పంటపోయినా ఫర్వాలేదంట పండకపోయినా రేపు పండించుకుంటారంట. పండించుకుంటానికి చారెడు నేల మిగిలుంటే చాలునంట – ముందొక జీబు, వెనకొక జీబు, మధ్యలో కారు డ్రైవరు పక్కన కూర్చుని అడ్డపట్టీ సవరించుకుంటూ ఏడుకొండలు అన్నాడు.
“మనం వెళ్ళే పంచాయితీకి ఇదే ముఖద్వారం సార్. అన్ని సరుకులూ సరంజామా ఈడ నుంచే వెడతాయి సార్.”
సెల్ మోగింది. “క్యాంపులో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను.” మళ్ళీ ఆలోచనా స్రవంతి.
నిజమేనా! చారెడు నేలుంటే చాలునా? చారెడు నేలతో పోయేదానికి వేలవేల ఎకరాలు పొగెయ్యడమెందుకు. ఇదంతా ఎక్కడకు దారి తీస్తోంది?
ఊరు దాటగానే హఠాత్తుగా కుదుపు. ముందు జీబు ఆగింది. పెద్ద దుమ్ముతెర కమ్మింది. కళ్ళు నులుముకొని చూస్తే రోడ్డుదాటుతూ వందలాదిగా గొర్రెల గుంపు.
ఒక చేత్తో కర్రపట్టుకుని మరో చేతి సంకలో గంటల క్రితం కళ్ళు తెరిచిన గొర్రెపిల్లను అపురూపంగా పట్టుకుని గొర్రెల్ని రోడ్డు దాటిస్తూ పదేళ్ళ పిల్లవాడు.
ఆగిపోయిన వాహనాల్ని చూసి హడావుడిగా వాడు గొర్రెల్తో వాటి భాషను మాట్లాడుతున్నాడు. నాలుకతో రిచ్చకొట్టి వాటిని ఉత్సాహపరుస్తున్నాడు. పెదాలతో సంగీతం పలికిస్తూ అవి త్వరత్వరగా పరుగెత్తాలని పురమాయిస్తున్నాడు.
వాడెంత అలవోకగా ఆ గొర్రెల్ని కాస్తున్నాడు?
ఆ రోడ్డంతా ఒక రకం మైకం వాసన. గొర్రెల మల, మూత్రవాసనకు వాహనాల్లో వాళ్ళందరూ ముక్కులు మూసుకున్నారు. ముందున్న వాహనంలోని విలేఖర్లు విసుక్కుంటూ వాడ్ని ఏదో తిడుతున్నారు. వాడు ఏమీ పట్టనట్లు కర్రను నేలకేసి తాటించి గొర్రెలు అన్నీ రోడ్డు దాటగానే వాడూ పక్కకు తొలగి గొర్రెల్తో పాటు ముభావంగా రోడ్డు పక్కకు డొంకలోకి తప్పుకున్నాడు.
ముందు జీబులో ఉన్న విలేఖర్లు ఏదో నవ్వుకుంటున్నారు. వెనక జీబులో ఉన్న పోలీసువాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలీడం లేదు. మళ్ళీ కదిలిన వాహనాలు.
తాటిచెట్ల గుంపు అంతకంతకూ పెరుగుతోంది. ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా గట్లుగట్లుగా గుంపులు గుంపులుగా తాటివనాలు. తాటివనాల మధ్య నీళ్ళల్లో మునిగిన వేరుశెనగ చేలు.
“చేలల్లో ఈ నీళ్ళు వెనక్కి లాగడానికి నాలుగైదు రోజులు పడుతుందా కొండలూ?”
“ఏం నాలుగైదు రోజులయ్యా? ఈడకి సముద్రం మూడుమైళ్ళే. భూమి లోపలంతా నీళ్ళే, భూమిపైనంతా వాన కురిసిననీళ్ళే, నేలలోకి ఒకచుక్క గూడా ఇంకదు. ఎటు పోవడానికి దారిలేదు. బాగా ఎండలు గాస్తే నెలరోజులకిగాని తగ్గదు ఈ జల” ఏడుకొండలు చెప్పేడు.
“పంటేమైనా చేతికొచ్చుద్దంటావా?”
“పంటా పాడా? ఇంకో నాలుగైదు రోజుల్లో ఆ నిలబడ్డ పైరంతా కుళ్ళిపోవల్సిందే.”
మళ్ళీ కుదుపు. ముందు జీబు ఆగింది.
ఈసారి పశువుల మంద వందలాదిగా పశువులు. అవి రోడ్డు దాటటం గాదు. రోడ్డు మీదే వెడుతున్నాయి. వాటిని అదిలించడం, రోడ్డు మీద దారి ఇయ్యటం వాటిని కాస్తున్న ఆడవాళ్ళకు పెద్ద శ్రమే అయింది.
“ఇట్టయితే మధ్యాన్నానికైనా చేరుకుంటామా?”
“అంతేనయ్యా!”
మళ్ళీ సెల్ మ్రోగింది. ఎలాగోలా పని ముగించుకుని రావాలని హుకుం!
“అట్లాగే సర్! మాట్లాడతాను సార్! ఆ ప్రయత్నం మీదే ఉన్నాను సార్.”
పచ్చటి తాటిచెట్ల మధ్య నుంచి ప్రవాహం దిశ మార్చుకున్నట్లు రోడ్డు కుడివైపుకి మలుపు తిరిగింది. రోడ్డు గతుకులు ఇంకాస్త ఎక్కువైనాయి. వాహనాలు ముందుకు కదలడమే కష్టంగా ఉంది. ఎక్కడా ఊరు ఉన్న జాడలేదు. ఎటు చూసినా చెట్లు.
ఏడుకొండలు పక్కనున్న రెవెన్యూ
ఇన్స్పెక్టరు చెప్పడం మొదలుపెట్టేడు.
“ఈడనుంచే మనం వెళ్ళే పంచాయితీ మొదలు సార్. ఆరు పాలేలు కలిపి ఒక పంచాయితీ సార్, మూడువేల జనాభా సార్, మూడువేల ఎకరం సార్. అంతా గొర్రెలకాపర్లు, కల్లుగీతవాళ్ళు, పల్లెకార్లే సార్. మరో వర్ణమంటూ ఏదీలేదు సార్. వీళ్ళు చాలా ఎగ్రెసివ్ సార్.”
ఎక్కడో చురుక్కుమంది. కడుపుమండితే, పేగుకాలితే ఎవుడు ఎగ్రెసివ్ కాడు. కాళ్ళకింద నేలను లాక్కుని చాపలా చుట్టుకుంటుంటే ఎవుడు ఎగ్రెసివ్ కాడు?
దూరంగా గుట్టలుగుట్టలుగా రాసులు పోసినట్లుగా ఇసుక సముద్రం కనబడుతోంది. అప్పుడప్పుడు కాస్తకాస్త సముద్రం హోరు
గాలివాటంగా వినబడుతోంది.
మళ్ళీ మరో కుదుపు . జీబు ఆగింది.
ఈసారి పశువులూ కాదు, గొర్రెలూ కాదు.
రోడ్డుకు అడ్డంగా రెండు తాటిదుంగలు! వాటికి కాస్త అవతలగా రోడ్డుకడ్డంగా పెద్దబొంగుతో గేటు. చెక్పోస్ట్ అని అట్టముక్కమీద రాసి ఉంది.
ఒక ముసలాయన రోడ్డుపక్కన బండమీద కూర్చుని ఉన్నాడు. జీబులో ఉన్న విలేఖర్లు ముసలాయనతో మాట్లాడి వచ్చారు.
“కొత్తవాళ్ళు ఎవరూ అనుమతి లేకుండా ఊళ్ళోకి రాకుండా కట్టుదిట్టం చేసేరంట సార్! పంచాయితీ తీర్మానం చేసి ముసలాయన్ని కాపలా పెట్టేరంట సార్” కారు దిగిన రెవెన్యూ ఇన్స్పెక్టర్తో చెబుతున్నాడు విలేఖరి.
వెనక జీబులో ఉన్న పోలీసులు హడావుడిగా వెళ్ళి ముసలాయనతో గొడవ పడుతున్నారు. అప్పుడప్పుడూ కారు వైపు వేలుపెట్టి చూపిస్తున్నారు.
ముసలాయన జంకడం లేదు. తాపీగా చుట్టచుట్టుకుంటూ బండమీద కూర్చునే, “పెద్దాయనే! నిజమే! నాకూ జీతమిచ్చి పంచాయితీ ఉద్యోగానికి పెట్టుకుంది గదా! మీకు మల్లేనే! రోజుకి అరవై బత్తెం. నా డూటీ నేనూ చెయ్యాల గదా!” అని సాగదీస్తున్నాడు.
ఇంతలో ఊళ్ళో నుంచి పిల్లవాడొకడు పరుగెత్తుకుంటూ వచ్చేడు. ఎలా వచ్చాడో అలానే మాయమై పోయాడు. మళ్ళీ పదిమంది పెద్దవాళ్ళను తీసుకొచ్చేడు. వాళ్ళు నెమ్మదిగా కారు దగ్గరకు వచ్చి ఆగేరు. నమస్కారాలు అయినాయి.
సర్పంచి వెంకటేశ్వర్లు హడావుడిగా ముందుకొచ్చి, “ఇక్కడి పరిస్థితులేం బాగాలేవు సార్! ఎవరెవరో వస్తున్నారు, వెడుతున్నారు. గవర్నమెంటోళ్ళో అర్ధంకాదు. ప్రైవేటోళ్ళో తెలీడంలేదు. అంతా గందరగోళంగా తయారైంది. భూముల్ని అమ్మటం కుదరదన్నామని మమ్మల్ని శత్రువుల్ని చూసినట్టు చూస్తున్నారు. ఈ గోలపడలేక చెక్పోస్ట్ పెట్టుకున్నాం సార్,” అని ఆగి, “మునిగిపోయిన పంటల్ని చూడటానికి వచ్చేరా సార్,” అని అడిగేడు.
“కాదు, వాన్ పిక్ భూముల గురించి మాట్లాడటానికొచ్చేం.”
“కారిడారే రద్దు చేసినట్లు ప్రకటిస్తిరి గదా సార్. పేపర్లో రాస్తిరి. మళ్ళీ భూములు దేనికి సార్,” తలగుడ్డ విదిలిస్తూ ఒకరైతు ప్రశ్నించేడు. చుట్టూ విలేఖర్లు రాసుకుంటున్నారు.
దూరంగా పోలీసులు ఏవో మాటల్లోపడ్డారు.
“పోర్టుకోసం, కంపెనీలు పెట్టుకోవడంకోసం భూములు కావాలి కదా!”
“అట్లయితే ఇంక మాట్లాడటానికేముంది సార్. ఎవురూ భూములు ఇయ్యమంటున్నారు.” అన్నాడు వెంకటేశ్వర్లు.
“అదంతాగాదు, పెద్దాయన జనంతో మాట్లాడాలంటున్నాడు.”
పోలీసులు ఒకడుగు ముందుకేసేరు. మేం వచ్చిందే అందుకన్నట్లు. సెల్ఫోన్ మోగింది.
మళ్ళీ కర్తవ్యం గుర్తు చెయ్యబడింది.
“అయితే మీరెవ్వరూ ఊళ్ళోకి రావడానికి వీల్లేదు. పెద్దాయన్ని లోపలకు పంపించండి. జనంతో మాట్లాడి వస్తారు.” ఒక రైతు తలగుడ్డ విదిలించి విసురుగా అన్నాడు.
తర్జనభర్జనలు జరిగేయి.
జరగబోయేదేమిటో ముందే తెల్సు, అయినా తప్పదు. వెళ్ళాల్సిందే. ఏదో ఒకటి మాట్లాడాల్సిందే. లేదూ మాట్లాడినట్లు నటించి వచ్చెయ్యాల్సిందే. చుట్టుపక్కల పంచాయితీల భూములన్నీ ఒక కొలిక్కి వచ్చినట్లే. ఇక్కడే మెలిక పడింది. మెలిక తియ్యడం కుదురుతుందా?
వాళ్ళతో నడవడం ఎంత కష్టంగా ఉందో!
వాళ్ళు గబగబా నడవడం, మళ్ళీ నాకోసం నాలుగడుగులు వెనక్కి వేయడం. పక్కన బంట్రోతు లేడు. కరుడు గట్టిన అధికారమూ లేదు. అధికారులూ లేరు.
ఎంతో హాయిగా ఉంది. స్వేచ్చగా ఉంది. తాటి చెట్ల వనం దాటితేగాని అక్కడో ఊరు ఉందన్న ఆనవాలు దొరకదు. చుట్టూ వేరుశనగపొలాలూ, పొలాలమధ్య ఇండ్లు , పొలాలనీ ఇండ్లనీ కలిపేసిన నీళ్ళు . అన్నీ తాటాకుల ఇండ్లు. ఇంటికప్పుకే కాకుండా గోడలకు సైతం తాటాకుల ఆచ్చాదన. ప్రతి ఇంటినీ ఆనుకుని పశువుల కొష్టం. చుట్టూ మందంగా ఉన్న దోమతెరలు. సెజ్ ప్రత్యేక అధికారి వచ్చేడన్న సంగతి ఊరందరికీ తెల్సినట్లుంది.
తాటితేగల్ని తవ్వుతున్న ఆడమనిషి మట్టి చేతుల్తోనే నిలబడి చూస్తోంది. వంటకు కట్టెలమోపు తెస్తున్న ముసలామె నిలబడి ఆరాగా చూస్తోంది.
మునిగిపోయిన పంటను చూస్తున్న రైతు ఏ భావమూ లేకుండానే నిలబడి ఉన్నాడు.
సర్పంచి వెంకటేశ్వర్లు అందరితో ఏదో మాట్లాడుతున్నాడు. అందర్నీ రామ
మందిరం దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు.
అంతా మొరటు వాసన బర్రెగొడ్ల రొచ్చు వాసన, నీళ్ళు నిలవ వున్న నీచు వాసన.
అవన్నీ ఎంతో మామూలుగా, అలవాటైనవిలాగా, నీళ్ళలోంచి, పొలంలోంచి తడుస్తూ వెళ్ళి రామమందిరం మంటపం మీద కూర్చుంటే, సముద్రం మధ్యలో తెరచాప మీద కూర్చుని వల వేసినట్లుగా ఉంది.
వల – నిజంగానే వల విసురుతున్నానా – అన్ని మూలాలు బిగుసుకుపోతే అన్ని మార్గాలూ మూసుకుపోతే ఆఖరుకు ఈ వల పనిచేస్తుందని వచ్చేనా?
“వెంకటేశ్వర్లూ! నువ్వు ఇట్లా కూర్చో.
వెంకటేశ్వర్లు కూర్చున్నాడు.
నడిజామైంది. సముద్రంహోరుతోపాటు చల్లటిగాలి వీస్తోంది. పక్కనే సెల్ టవర్ నిటారుగా నిలబడి సముద్రాన్ని చూస్తున్నట్లుగా ఉంది.
“నేనూ మీలాంటివాడినే వెంకటేశ్వర్లూ! నేనూ మారుమూల పల్లెనుంచి వచ్చినవాడినే.”
“మాకెందుకు తెలీదు సార్! తెలిసే ఊరు ఊరంతా మిమ్మల్ని కలవడానికి రెండుసార్లు వచ్చేం సార్. మీ సలహా తీసుకుందామనుకున్నాం సార్. ఒకసారి వస్తే ఆఫీసు గేట్లు మూసేసినారు. మరోసారి బంగళా కాపలా పోలీసులు వెనక్కి తరిమేశారు. మాకేమన్నా న్యాయం చేస్తారనే నమ్మినాం సార్.”
“ఇక్కడకు ఫ్యాక్టరీలు వచ్చేది ఖాయం. పోర్టు పడేది ఖాయం. ఎకరాకు ఎంత కావాలో చెబితే అంత ఇప్పించే ఏర్పాటుచేస్తా,” నేరుగా అసలు విషయంలోకి వస్తూ, “నాకు చాతనైన న్యాయం చేపిస్తా.”
“జనం వస్తారుగా సార్! మీరే మాట్లాడండి. వాళ్ళేంచెబితే అట్లా చేద్దాం. నాదేముంది,” అన్నాడు వెంకటేశ్వర్లు అయిష్టంగానే.
కనుచూపుమేరంతా ఇసుక సముద్రం. ఇసుకను చేతిలోకి తీసుకుంటే అంతా ఇసుక కాదు. సగానికి పైగా నల్లగా మెరుస్తున్న రజను. దీనికోసమేగా ఇప్పుడీ ఆరాటమంతా, జల్లెడ పడితే చాలు కారుచవకగా ఖనిజాన్ని పట్టుకోవచ్చు
అత్యంత ఖరీదైన ధార్మికపదార్థం తీయొచ్చు. పైపెచ్చు సముద్రమిక్కడ ఒంపు తిరిగింది. నిజాం పట్నం నుంచి చీరాల దాకా.
అందుకే ఏ తుఫాను ఈ ప్రాంతాన్ని పెద్దగా నష్టపరచలేకపోయింది. పదివేల మందిని పొట్టన పెట్టుకున్న దివి తుఫాను కూడా ఈ ప్రాంతం మీంచి అలవోకగా దాటి వెళ్ళింది. ఊళ్ళన్నిట్నీ వెల్లువెత్తించిన సునామీ కూడా ఈ ఇసుకదిబ్బల్ని తాకలేకపోయింది. అందుకే ఈ ఆరాటమంతా.
అందుకే ఈ వలలన్నీ – ఒక్కొక్కడు వేల కోట్లు పెట్టుబడులు పెట్టాలని-నేలమీద పిచ్చిగీతలు గీస్తూ వెంకటేశ్వర్లు అన్నాడు.
“పాలు కొనుక్కెల్లే వ్యాపారులే మాకు తెల్సు సార్. నేతిడబ్బాలు పట్టుకెళ్ళే సెట్టిగార్లనే మేమెరుగుదుము సార్. కల్లుకోసం, కట్టెలకోసం వచ్చే పక్కూరి ప్రజల పాదగుర్తుల్నే మేం పోల్చగలం సార్, యాటపిల్లలకోసం వచ్చే కసాయి మనుషులే మా ఊరికి పరిచయం సార్,” అని ఆగి, “అట్టాంటిది ఒకరోజు తెల్లగుడ్డలోల్లు వచ్చేరు సార్. మన దేశమోళ్ళు కాదు సార్. మాకు చెప్పకుండానే మా పొలాల్లోకి దిగి టెలిస్కోపులు బయటకు తీసేరు. చెక్క స్టాండులకు వాటిని కట్టేరు. భూముల్లోకి ఏవో మీటర్లు దించేరు. టేపుల్తో కొలిచి ఎంత భూముందో లెక్కలు వేసేరు. మేము కళ్ళు తెరిచి వాళ్ళ దగ్గరకు జరిగి విషయమేమిటో అడిగేలోపే వచ్చిన దారినే మాయమైనారు.”
“వాళ్ళు వెళ్ళిన నాలుగురోజులకు పంచాయితీలో ఉచితవైద్య శిబిరం పెట్టేరు. జనం నాడులు చూసేరు. స్వచ్ఛంద
సంస్థలంటూ మందులు పంచేరు. పండ్లు ఇచ్చేరు. పిల్లలకు పలకలిచ్చేరు. మళ్ళా నెల తర్వాత మందుల కంపెనీ వాళ్ళం, మందులు తయారుచేసే కంపెనీకి అయిదారొందలు ఎకరాలు పొలం కొంటామంటూ వాళ్ళే వచ్చేరు. ఎకరం డెబ్బైవేలన్నారు. ముక్కు మీద వేలేసుకున్నాం. మరొకడొచ్చేడు. లక్షన్నాడు. ఇచ్చేది లేదన్నాం. ఎక్కడెక్కడి నుంచో బ్రోకర్లు వచ్చేరు. చుట్టుపక్కల ఊళ్ళన్నీ కొనేసాం, మీ పంచాయితే మిగిలిందన్నారు. అప్పుడూ ఇవ్వమన్నాం. లక్ష తర్వాత రెండన్నారు.. మూడన్నారు. ఆఖరికి నాకు ఎకరానికి యాభై వేలు కమీషను బేరం పెట్టేరు. నా పొలానికి అందరికంటే మరో లక్ష అదనం రేటన్నారు. ఈ జనాన్ని మభ్యపెట్టి ఊరిని కొల్లగొట్టి ఈ కరాకును ముంచేసి నేను పెద్దోడ్ని కాదలుచుకోలేదు సార్!”
ఎకరానికి యాభైవేలు కమీషను. మూడు వేలెకరాలు. కోటీశ్వరుడు వెంకటేశ్వర్లు. కింద మెట్టు మీదున్న వెంకటేశ్వర్లే కోటీశ్వరుడైతే మరి పైనున్నవాడు.
“ఆఖరుకు ఇందాక మీతో కార్లో ఉన్నాడే, ఆ అధికారి వచ్చేడు. మీరు చేసుకునేవన్నీ అసైన్డు భూములన్నాడు. అసైన్డ్ భూములన్నీ ప్రభుత్వానివే నన్నాడు. గవర్నమెంటు రేటు ప్రకారం ఎనక్కి తీసుకోవాల్సిందేనన్నాడు. కుదరదన్నాం. అధికారిని బెదిరించేమన్నారు. కిడ్నాప్ చేసేమన్నారు. పేపర్లో రాసేరు. టీవీల్లో చూపించేరు. మామీద దొమ్మీ కేసు పెట్టేరు. అప్పుడే మీ కాడి కొచ్చేం సార్. మా గోడు చెప్పుకుందామనుకున్నాం సార్,” వెంకటేశ్వర్లు అర్ధంతరంగా ఆగేడు.
అంతా నిజమే. తను కలవని మాటా నిజమే. కలిసి మాట్లాడినా ఒరిగేదేముంటుంది. కావాలని తనే మొహం చాటేసేడు. ఎక్కడో ఏదో మూల తనలోనూ తప్పు చేస్తున్నానన్న భావన.
ఈ భూముల్ని ఎన్ని తరాల కింద బాగు చేసుకున్నారో! ఇసకమేటలు, గోతులు చదును చేసి వ్యవసాయానికి సాగులోకి తేవడానికి, ఎన్ని తరాల మనుషులు రాత్రింబగళ్ళు నిద్రాహారాలు మానుకుని ఈ స్థాయికి తెచ్చుంటారో! ఇంత అభివృద్ధిని ఒకే ఒక్క రాత్రిలో మరింత అభివృద్ధి పేరుతో ఎవడి గుప్పెట్లో ఇరికించాలనో! ఒకప్పుడు భూమి అంటే అన్నం గుర్తుకొచ్చేది. రైతు గుర్తుకొచ్చేవాడు. గొప్ప సంస్కృతి గుర్తుకొచ్చేది. ఇవ్వాల భూమి ఒక పెట్టుబడి
అయింది. ఒక సంపద అయింది. విధ్వంసానికి రంగస్థలమైంది. ఒక సమూహాన్ని భయపెట్టో, భ్రమపెట్టో, అదీ వీలుకాకపోతే బెదిరించో కకావికలు చెయ్యడానికి హేతువైంది. సంవత్సరం రోజులుగా ఊళ్ళను ఖాళీ చేయించడానికి, భూముల్ని గుప్పెట్లో ఇరికించుకోవడానికి ఒక్కొక్క ప్రయత్నమే జరుగుతోంది. మనసు నిండా ఆలోచనల సుళ్ళు.. తను చేసేది మంచి పని కాదని తెలుస్తూనే ఉంది. ఇక్కడ తనొక పరికరం మాత్రమే. పనిముట్టు మాత్రమే. ఎవడొచ్చి ఎట్లా పని చెయ్యమంటే అట్లా చెయ్యాలి. వాళ్ళు తనని వాళ్ళవాడనే అనుకుంటున్నారు. నిజానికి తను వాళ్ళ మనిషేనా! తను ఊరు మనిషేనా?
****
జనం ఒక్కొక్కరే మంటపం మీదికి
చేరుకుంటున్నారు. అన్నివైపుల్నించీ ఆరుపాలేల నుంచి- రైతులు, పల్లెకార్లు, పశులకాపర్లు- ముసలీ ముతకా ఎక్కువగా వున్నారు.
ఎవరో చిన్న స్పీకరు తీసుకొచ్చి వెంకటేశ్వర్లు చేతికిచ్చేరు. అందర్నీ కూర్చోమన్నాడు. కాస్త వయసు మళ్ళినవాళ్ళు మంటపం మీద గుండ్రంగా కూర్చున్నారు. కుర్రకారు మంటపం చుట్టూ కింద నిలబడ్డారు. కాస్త దూరంగా తాటిచెట్ల మొదళ్ళలో పెళ్ళికాని ఆడపిల్లలు, నడివయసు ఆడవాళ్ళు- నిలబడి కొందరు, మెరకమీద కూర్చుని కొందరు ఉన్నారు.
“సార్. వాన్ పిక్ భూముల గురించి అడగడానికొచ్చేరు. గవర్నమెంటు సర్వేలో మనూరు కూడా ఉందంట.” అన్నాడు
వెంకటేశ్వర్లు.
“భూములేనా! ఇళ్ళూ వాకిళ్ళూ కొంపా గోడూ కూడానా,” ఎవరో వెటకారంగా అన్నారు.
ఎక్కడో చురుక్కుమంది. అయోమయంగా ఉంది. ఉన్నపళంగా అక్కడి నుంచి మాయమైపోవాలన్పించింది. అయినా తప్పదు. భరించాలి. ఎలాగోలా చేతిలోకి స్పీకరొచ్చింది..
ఎవరో ఒక ముసలమ్మ, వందేళ్ళు దాటి ఉంటాయేమో తాటితోపులో నుంచి నడుచుకుంటూ వచ్చింది. మంటపం ముందు నిలబడి కళ్ళకు,చేతులడ్డం పెట్టుకుని చూసింది. దగ్గరకు రమ్మని చేతులూపింది. బోసినోటిని కదిలిస్తూ, “మావాడివేనంట గదయ్యా! పైస్థాయిలో ఉన్నావంట గదయ్యా. ఈ పాపం నువ్వెందుకు నాయనా మూటగట్టుకుంటావ్,” అంటూ బుగ్గల్ని తడిమింది.
“మా యమ్మ సార్,” అన్నాడు వెంకటేశ్వర్లు. ఒక కలవరపాటు. ఒళ్ళంతా జలదరింపు . తల తిరుగుతున్నట్టు ఒక పురాతన జ్ఞాపకం , ఒక కటువైనగాటు, గాయం సలుపుతున్నట్టు ఒకానొక ప్రశ్న తను వాళ్ళవాడేనా! వాళ్ళకోసం వచ్చేడా? ఒక ఏజంటుగానా! ఒక దళారిగానా!
హఠాత్తుగా ఎక్కడో సుదూర ప్రాంతాన ఉన్న ఊరు గుర్తుకొచ్చింది. తండ్రి చావు గుర్తుకొచ్చింది. తల్లిపడ్డ తండ్లాట మదిలోకొచ్చింది.
పురాతనమైన పెంకుటిల్లు ఇంటి ముందు కప్పు పెండేలకు వేళ్ళాడుతూ అందరికీ కనబడేట్టు కల్లుముంత. ఇంటికి కల్లుముంత వేలాడగట్టడం పురాతన సాంప్రదాయం. వృత్తికి గౌరవం. అంతెత్తు తండ్రి , ఒకానొక సద్దికూటివేళ సూర్యుడు కరకరమంటూ పైకి రావాలని చూసేవేళ, నడుముకు కల్లుముంత వేలాడగట్టుకుని కాళ్ళకు నడుముకు బంధనా లేసుకున్న తండ్రి , తాటిచెట్టు పైకెక్కి కత్తితో మొవ్వుకు గాటుపెట్టి ముంత కట్టి దిగబోతుంటే నడుముకున్న బంధనం తెగి వెనక్కి విరుచుకుపడ్డ తండ్రి, కాళ్ళకూ, తాడికీ బిగుసుకున్న బంధనం తల వెనక్కి విరుచుకు పడి, కాళ్ళను తాకుతూ ఎంత ప్రయత్నించినా చేతులు చాచి చేతుల్తో చెట్టును అందుకోలేక కాపాడమని అరిచి అరిచి, కింద చేరిన జనాన్ని తలకిందులుగా చూస్తూ ప్రాధేయపడి నాలుకెండి ఒంట్లో
తడారిపోయి కిందనుంచి తనూ, తల్లీ దీనంగా ఏడుస్తుంటే – అంతా అశక్తులై, అసహాయులై, సాయం అందే లోపే కళ్ళముందే అట్ల దాటి వెళ్ళిపోయిన తండ్రి. తన కోసం తల్లి పడ్డ అవస్థలు – తమ వంతు తాళ్ళ కోసం ఆమె పడ్డ ఆరాటం. గొప్ప ధైర్యంతో బతికిన తల్లి . గోచీ పెట్టి తమవంతు వచ్చిన తాళ్ళకు కల్లుగీచిన తల్లి. పిల్లల బాగోగుల కోసం తపనపడ్డ తల్లి.
గతం చెదిరింది. చుట్టూ జనం. ఏదో ఒకటి చెప్పాలి. “మీ ప్రాంతంలో కంపెనీలు పెట్టడానికి చాలామంది వస్తున్నారు. ఎంతకాలం ఈ చెట్లమ్మట, గెట్లమ్మట, తాతముత్తాతల కాలంనాటి పనులు చేసుకుంటూ బతుకుతారు. ఫ్యాక్టరీలు పెడితే ఉద్యోగాలు మీకే ఇస్తామంటున్నారు. మీకు ఎంతరేటు కావాలో చెబితే నేను మాట్లాడతాను. మీవైపు నిలబడతాను.”
ముందు కూర్చున్న ముసలాయన మెల్లిగా చెబుతున్నాడు.
“ఆ సెల్ టవర్ కట్టేటప్పుడు గూడా మా ఊరోల్లకి ఇద్దరికి ఉద్యోగాలిస్తామంటే సరేనని పంచాయితీ తీర్మానం చేసి టవర్ కట్టుకోమన్నాం. టవర్ కట్టి అయిదేళ్ళు. కరంటుపోతే ఇంజను కూడా దానంతటదే ఆడటం మొదలయిద్ది. ఇంక మనుషుల్తో ఏం పని, ఉద్యోగాల్లేవు, పాడులేవు. ఇదీ అంతేగదయ్యా,” అన్నాడు.
“కాకపోతే దాని గోలకి రేత్రిళ్ళు జనానికి నిద్ర పట్టటంలా,” ఎవరో నవ్వేరు. సెల్ మోగింది.
“భోం చేసేరా?” “ఆ! ఆ!” ముక్తసరి జవాబు.
“కార్లో జ్యూస్ ఉంచేను. ఏడుకొండలుకు తెల్సు. వేళకు తాగండి.”
“ఆహ్!”
సెల్ టవర్ ఇంజన్ ఆడే శబ్దం భీకరంగా వినబడుతోంది.
“ఏమిటి వినబడటం లేదా?”
“పెట్టేస్తావా? లేదా?” గొప్ప విసుగు.
“నాయనా! నీ మాట ప్రకారమే పోదాం. వాళ్ళు మా పిల్లలకి ఉజ్జో గాలిస్తారనే అనుకుందాం. ఎవుడూ ఈడ అయిదో తరగతి దాటినోడు లేడు గదా. ఇప్పటికీ
మేము బువ్వనే అంటాము. కూడనే పలుకుతాము. అన్నం అనే మాట మా నోటమ్మట రాదు గదా. ఇంక మేం చేసే ఉద్యోగాలు ఏముంటాయి నాయనా. వాళ్ళ గేట్లకాడ కాపలాదార్లుగానో వాళ్ళ ఇళ్ళకాడ ఆడోల్లకు పాచిపన్లు చేస్తానో, గుడ్డలుతికి పెడతానో, ఇయ్యే గదా మాకియ్య బోయే ఉద్యోగాలు. మేమెందుకు చేస్తామయ్యా” ఇటీవలే బాప్తీజం తీసుకుని వాక్యం చెబుతున్న ఏసోబు అన్నాడు.
“అంత పనేం వచ్చింది. పొలాలు అమ్ముకుని వచ్చే డబ్బుల్తో లక్షణంగా మళ్ళీ పొలం కొనుక్కుని వ్యవసాయం చేసుకోవచ్చుగా?”
“ఎకరాల్లో అమ్ముకుని గజాల్లో కొనుక్కోవాల్సిందేగా నాయనా! ఏడ చూసినా భూముల రేట్లు అమ్మబోతే అడివి
కొనబోతే కొరివే. అయినా ఒక ఊరి మునసబు పక్కూరికి ఎట్టి నాయనా, ఇయ్యన్నీ వొదిలి పెట్టి ఏ ఊరు పొమ్మంటావు చెప్పు, చెట్టోచేమో బతికిచ్చుకుంటాం. కాయో కసురో కాపిచ్చుకుంటాం. వారానికి అయిదురోజులు సముద్రమ్మీద వేటకెళ్ళి చేపలో, రొయ్యలో పట్టుకొచ్చుకుంటాం. మాకు ఏదీ కొనే పనిలేదు. ఎకరం నలభై బస్తాలు శనక్కాయ పండుద్ది. కాయకష్టం చేసుకుంటాం. కరువు కాటకాలకి తాటికాయలో ఈతపళ్ళో తిని బతుకుతాం. అంతేగాని ఉన్న ఊరొదిలి మేం బతగ్గలమంటయ్యా! ఉన్నళ్ళో ఎగసాయం పెట్టుద్ది. పక్కూళ్ళో ఎగసాయం తినుద్ది నాయనా, చెప్పినంత తేలిగ్గాదు నాయనా! భూములిడిసి ఊరు ఖాళీ చేసి పోవడం,” ఒక ముసలాయన సర్దుకుని పైకి లేచి మంటపం దిగి వెడుతూ అన్నాడు.
చాలాసేపు నిశ్శబ్దం.
వెంకటేశ్వర్లు అందరి వైపు చూసి కాసేపు తర్వాత అన్నాడు.
“మా ముసిల్దానికి వందేళ్లు ఎప్పుడో దాటుంటాయి. ఇట్టాంటి ముసిలోల్లు ఇంటికిద్దరో, ఒక్కరో ఉంటారు. వీళ్ళు ఒక్క ఇంజక్షన్ ఎరగరు, ఒక్క మందుబిళ్ళ మింగలేదు. సముద్రం కరవాకున సవ్వనీళ్ళు తాగుతున్న బతుకులు సార్. అదే ఈ ఊరిడిసిపెట్టి ఈ గాలిడిసిపెట్టి పోతే ఈ వందేళ్ళలో ఎన్ని మందులు, ఎన్ని ఆపరేషన్లు చెయ్యాల్సొచ్చేవో? ఎన్ని జన్మలెత్తాల్సి వచ్చేవో!”
“ఇదంతా మాయలేరా! కంపెనీల మాయరా
వెంకటేశ్వరా! మొత్తం పొలమంతా ఎత్తెయ్యాలని చూస్తన్నారు. దేశమంతా వాటేసుకోవాలని లక్షలకు లక్షలు పోసి కొనాలని చూస్తున్నారు,” ఏసోబు పైకి లేచి కండువా విదిలించి విసురుగా వెళ్ళిపోయేడు.
దూరంగా, తాటిచెట్ల మొదల్లోంచి ఒక నడీడు ఆడమనిషి జుట్టు విరబోసుకుని అందరికీ వినబడేటట్టు హఠాత్తుగా అరవడం మొదలు పెట్టింది..
“ఈల్ల ధ్వంసం గూల. ఈల్లకు దినాలు చెయ్య. ఈ గెడ్డ పుట్టి ఎన్ని వందల ఏండ్లయిందో! ఈడనే పుట్టినాం. ఈడనే సస్తన్నాం. అంత లావు సునామీ వచ్చి ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోతున్నాయని తెల్సినప్పుడు గూడా భయపడలేదమ్మా.
గంగమ్మ తల్లికి రైకగుడ్డలిచ్చి పసుపుకుంకుమల్తో ఎదుర్కోలు చెప్పేం. ఆ మహాతల్లి శాంతించింది. ఊరికి బతుకునిచ్చింది. ఈ నా బట్టలకేమయిందమ్మా. మనూరెమ్మటబడినారు? మన పేనాలు తోడేత్తన్నారు. సంవత్సరం నించికంటినిండా కునుకులేదు. కడుపు నిండా తినింది లేదు. ఎప్పుడు ఎవుడొస్తాడో ఏం చెబుతాడోనన్న భయమే. భూములున్నోల్లకి లచ్చలకి లచ్చలు ఎదబెడతామంటున్నారు. ఏమీలేని నాబోటి దాని సంగతేందమ్మా. నిద్దర లేచింది మొదలు సముద్రమ్మీదికి పోకపోతే పొట్ట గడవదే. ఏడేడనో ఉన్న ఫ్యాక్టరీలు, పోర్టులు కడితే మమ్మల్ని సముద్రమ్మీదికి రానిస్తారా? రానిచ్చినా మాకు యాట దొరుకేట్టు చేత్తారా?” అని అరుపును కాస్త పెద్దగా ఏడుపులోకి మార్చింది.
“నాయనా? రోజుకి కాస్తకాస్త ఎందుకు చంపుతారు. మీ డబ్బు లున్నోళ్ళు, పదవులున్నోళ్ళు మాక్కాస్త ఎండ్రిన్ పొయ్యండి,” ఇంకో ఆడమనిషి అరుస్తూ చెప్పింది.
“రేయ్! ముందు వాళ్ళ నోరు మూయించండ్రా! అవతల పెద్దాయనతో మాట్లాడతంటే దీన్తల్లి మట్టూ మర్యాద లేకుండా అరిస్తే ఎట్ట. దాన్ని అవతలకు లాక్క పొండి.” ఒక మగమనిషి లేచి నిలబడి అరిచేడు.
వాతావరణం వేడెక్కింది. అంతా గందరగోళంగా తయారైంది.
“ఏందిరా! నోరు మూయించేది. ఎవుడాడు.
ముందుకు రమ్మను. అదన్న దాంట్లో తప్పేముందో తేలుత్తాం. ఇప్పటికే ఒకళ్ళిద్దరు తయారైనారు చెట్టూ చేమా అమ్మి పట్నాలెల్లి జల్సాలు చెయ్యడానికి, సిగ్గులేదు ఎదవలకు, భూములమ్మి పొలాలమ్మి అడుక్కు తింటారంటనా? మాకు డబ్బుతో పనేంలేదు. అమ్మితే భూములకు భూములు చూపించమనండి. అంతేకాని,” అంటూ ఒక ముసలాయన చుట్ట తుపుక్కున ఊసి కర్ర నేలకేసి కొట్టి చరచరా మంటపం దిగి వెళ్ళిపోయాడు.
అంతా నిశ్శబ్దమైంది. ఎండ కరకరలాడుతోంది. మంటపం చుట్టూ ఉన్న చెట్ల సందుల్లోంచి పడే ఎండ చురుగ్గా ఉంది. ఒక్కొక్కరే మంటపం దిగి వెళ్ళిపోతున్నారు. తాటిచెట్ల మొదళ్ళలో ఉన్న ఆడవాళ్ళు మెల్లిగా ఇళ్ళ దారి పట్టేరు. “అసైనుమెంటు
భూములు, మాయి కావని బెదిరిస్తున్నారుగా, సరే కానియ్యి! వాళ్ళకు చేతనయింది వాళ్ళు చేత్తారు. మనకు వల్లయిన మటుకు మనమూ చూస్తాం. కుంటోడి పని కుంటోడు చేత్తాడు,” ఒక ఆడమనిషి జనాంతికంగా అందరూ వినేట్టుగానే అంటోంది. మంటపం మీద కూర్చున్న మగవాళ్ళు చెప్పాపెట్టకుండా నడిచిపోయినారు.
ఇంకా కరంటు వచ్చినట్టు లేదు. సెల్ టవరు ఇంజను అక్కడి నిశ్శబ్దాన్ని చీలుస్తోంది. దూరంగా పాలవాగు దగ్గర రొయ్యపొట్టు ఫ్యాక్టరీ నుంచి వస్తున్న దుర్గంధం మైళ్ళ తరబడి ప్రయాణిస్తూ సముద్రమ్మీదికి పోతోంది.
కాకి ఒకటి ఎక్కడినుంచి తెస్తుందోగాని ఎండుపుల్లల్ని, చిల్లకంపనీ, ఒక్కొక్కటి ఏరుకొచ్చి చెట్టుమీద గూడు అల్లుకుంటోంది.
“కాకి గూడు పెడుతుందంటే ఇప్పుడల్లా వానలు కురవ్వు సార్! చేలల్లో నీళ్ళు తియ్యంగానే మళ్ళీ దుక్కిదున్నాల, విత్తనం చల్లాల. ఏదో ఒక పైరు పండించాల. లెండి సార్, ఎప్పుడు తిన్నారో ఏమో కాస్తంత అన్నం తిందురుగాని,” వెంకటేశ్వర్లు కూడా పైకి లేస్తూ అన్నాడు. మంటపం దిగి మళ్ళీ నీళ్ళల్లో నడుస్తూనే ఊళ్ళోకి – వెంకటేశ్వర్లు వెనకే – అన్ని ఇళ్ళనూ తన్నిపెట్టిన వర్షం నీరు.
ఇంటి ముందర మంచం వాలుస్తూ వెంకటేశ్వర్లు భార్య, “పది రోజుల్నుంచి యాట లేదయ్యా పచ్చి సరుకే లేదు. ఎండుచేపల పులుసు, రొయ్యల కారం చేశా. నీసు తింటావుగా, పాడి ఉందిలే,” అంటూ
మంచమ్మీద దుప్పటి పరిచింది. అవతల మంచమ్మీద పడుకోనున్న వెంకటేశ్వర్లు తల్లి సైగ చేస్తూ ఏదో అడగబోయి మానుకుంది.
ఎవరో ఆడమనిషి హడావుడిగా ఇంట్లోకి వెళ్ళి కొంగుచాటు నుంచి గిన్నె తీసి లోపల పెడుతూ, “బంగాళాదుంప కూరలే వదినా, నీసు తింటాడో తినడోనని,” అంటూ అంతే హడావుడిగా వెళ్ళిపోయింది.
నీళ్ళ వాసన, ఖాళీగా ఉన్న పశువుల కొష్టంలోంచి తొక్కిడి వాసన. పంచలో పొయ్యిలోంచి సుడులు సుడులుగా వస్తున్న కట్టెల పొగవాసన.
ఎక్కడో ఏదో మరుగుతోంది. చిటపట చిటపట – నేతిచిట్టిలో వెన్నపూసకరిగి నెయ్యి కాగుతున్నవాసన లోపల్లోపల ఏదో
సలసలా ఉడుకుతోంది.
వెంకటేశ్వర్లు తల్లి లేచి వచ్చి మంచమ్మీద పక్కన కూర్చుంది. నెయ్యి కాగటం అయినట్లుంది. కమ్మటివాసన వేస్తోంది.
“అమ్మా, నాయిన ఉన్నారా?” ముసలామె పలకరించింది.
ఏదేదో అడుగుతోంది. ఏదేదో చెబుతోంది. అంతా ఆత్మీయంగానే, తనవాడి నన్నట్లుగానే.
వెంకటేశ్వర్లు వచ్చి కాళ్ళకు నీళ్ళిచ్చేడు.
పంచలోంచి ఇంట్లోకి వెళ్ళగానే కాస్తంత చీకటి . మెల్లిగా వెల్తుర్ని పట్టుకున్న కళ్ళు.
వాల్చిన పీట – పక్కనే పెద్ద దాపుడు పెట్టి వేలాడుతూ దండెం బొంగు – తోక ఊపుతూ చిన్న పిల్లిపిల్ల కొత్తమనిషినని బయటకు వెళ్ళిపోయింది.
పల్లెంలో చెయ్యి పెట్టి అన్నం ముద్ద చేతిలోకి తీసుకోగానే ఎండురొయ్యల వాసన మత్తు వాసన మైమరిపించే వాసన .
“వెంకటేశ్వర్లు! నాతో వచ్చినవాళ్ళకు భోజనం.”
“అన్ని ఏర్పాట్లూ రామమందిరం దగ్గర చేశాను సార్. మీరు కానియ్యండి,” వెంకటేశ్వర్లు అన్నాడు.
తొలి ముద్ద నోట్లో పెట్టుకోబోతూ అప్రయత్నంగా వచ్చిన మాటలు “వెంకటేశ్వర్లూ అన్ని ఊళ్ళల్లో సర్పంచులో, మాజీలో నిలబడి భూములమ్మిస్తున్నారు. భూములు నిలబడాలంటే చాలా కష్టమే చెయ్యాల్సుంటది. ఊరుని నిలబెట్టుకోవడం మామూలు కష్టం కాదు. ఇదేదో మీ ఒక్క పంచాయితీకే అనుకోవద్దు. తుపానుల్ని ఎదుర్కొన్నట్లు, సునామీలకు ఎదురీదినట్లు గాదు. అంతకంటే బలంగా నిలబడాలి. అట్టయితేనే మనుషులూ, మట్టీ మిగిలుండేది.”
మళ్ళీ సెల్ఫోన్ మోగసాగింది.

కాట్రగడ్డ దయానంద్
1965 సంవత్సరంలో ఒంగోలుకు తూర్పునున్

రచయితగా తను చెప్పదలుచుకున్న విషయాల్ని దృశ్యబద్ధం చేయడం తద్వార పాఠకుణ్ణి కథా గమనం లోని కాల, మాన పరిస్థితుల్లోకి లీనమయ్యేలా చెయ్యడం అంత సులువైన పని కాదు.దానికి లోతైన పరిశీలన, పరిజ్ఞానం. చెప్పదలచుకున్న అంశాలపై, నిజాయితీతో కూడిన నిబద్ధత కావాలి. అంతేకాదు పరిణితి తో శిల్ప నిర్వహణ కూడా దానికి తోడవ్వాలి .అప్పుడే ఆ కథకు ఒక నిండుదనం సంప్రాప్తిస్తుంది. కాట్రగడ్డ దయానంద్ గారు చేయి తిరిగిన రచయిత..ఇలాంటి వస్తువు గల కథల్ని ఎంత వరకు కథనం చేయగలరో అంతవరకు చేసి కృత కృత్యులయ్యారు. ఆలోచనాత్మక కథ.దయానంద్ గారికి అభినందనలు.