ఏ కథ పండాలన్నా అందులో రెండు విరుద్ధ శక్తులు ఉండి తీరాలి. కథానాయకుడు సర్వగుణ సంపన్నుడు, త్యాగాలకు వెరవడు. పేదల పక్షపాతి. ధర్మాచార పరాయణుడు. దుష్ట శిక్షకుడు. భక్తజన రక్షకుడు. ప్రతి నాయకుడు సర్వ దుర్గుణ సంపన్నుడు. స్వార్థమే పరమార్ధం. పేదల ద్వేషి. వక్రమార్గమే శిరోధార్యం. చెడ్డ వారంతా అతని చుట్టూ చేరి ఉంటారు. విలన్‍ను ఎంత దుర్మార్గంగా చూపగలిగితే హీరో దాత్తత అంతగా పండుతుంది. స్ట్రాంగ్ విలన్ ఉంటే కదా, హీరోగారి ప్రతాపం లోకానికి తెలిసేది. రామాయణం భారతాలు మొదలుకొని ఈ కాలం సినిమాల వరకు ఇదే ఫార్ములా. ప్రపంచంలోని చాలా భాగం సాహిత్యమంతా నాయక, ప్రతినాయకుల మధ్యే పరిభ్రమిస్తుంది. ఈ మధ్య సినిమాల్లో ట్రెండ్ మార్చి విలన్‍కి హీరో ముసుగు వేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్‍ను కూడా హీరోగా మెప్పిస్తున్నారు. ఆ స్మగ్లర్ ని అడ్డుకోలేని పోలీస్ ఆఫీసర్‌ని మాత్రం ‘జోకర్’గా మలుస్తున్నారు. ఇలాంటి మినహాయింపులు మినహా మొత్తం మీద పాత్రలు, సందర్భాలు, నేపథ్యాలు మారవచ్చేమోగాని మూల సూత్రం మాత్రం సేమ్ టు సేమ్.
ఒక కథలో మంచి రాజుగారు, చెడ్డ సైనికాధికారి ఉండవచ్చు. మరో కథలో ఊరి భూస్వామి, పేదల రక్తం తాగుతూ ఉండవచ్చు. ఆ సామాన్యుల్లో నుంచే ఒక అసామాన్యుడు బయలుదేరి వారి భరతం పట్టవచ్చు.
ఇలాంటి కథలు, ఇతివృత్తాలు సాహిత్యానికి, సినిమాలకే పరిమితం కావు. ఏ సమాజంలోనైనా మన చుట్టూ నిజజీవితంలోనూ ఇలాంటి కథలకేం కొదవలేదు . పబ్లిసిటీ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో మేక వన్నె పులులకేమీ కొదవలేదు. పైకి అమాయకుడిగా, నిరాడంబరుడుగా కనిపిస్తూ తడి గుడ్డలతో గొంతులు కోసే రకాలు ఆధునిక పెట్టుబడుదారుల్లోనూ తయారయ్యారు. ఎవరి నిజస్వరూపం ఏమిటో, ప్రచార ముసుగుల వెనక అసలు నైజాలేమిటో కనిపెట్టి మసులుకోవడంలోనే అసలు కథంతా ఉంది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఈ మధ్య దేశం బాగుకోరి అద్భుత చిట్కా చెప్పారు. పనిగంటలను పెంచేసి శ్రమ పిండుకుంటే ఉత్పాదకత అమాంతం పెరిగి అద్భుత ఫలితాలు సాధించేయవచ్చని ఉచిత సలహా పారేశారు. తక్కువ డబ్బుతో ఎక్కువ శ్రమను పిండుకోవడమే పెట్టుబడిదారుల లాభాలకు రాచబాటగా మారిపోయింది. ప్రపంచమంతటా ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోగల అవకాశాలు అందివచ్చాక, పెట్టుబడుదారులు తెగ బలిసిపోయాక ప్రశ్నించే ఎర్ర దండు ఎనక పట్టేశాక నారాయణ మూర్తి లాంటి వాళ్లు అలాగాక మరింకెలా మాట్లాడుతారు.
నారాయణమూర్తి అర్ధాంగి శ్రీమతి సుధా మూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్‍కు చైర్ పర్సన్. ఈ పదవిని అడ్డం పెట్టుకుని బోల్డంత వ్యక్తిగత బ్రాండ్ ఇమేజ్ కోసం ఆమె తహతహలాడిపోతుంటారు. సోషల్ మీడియాలో చాలా సుద్దులు చెబుతుంటారు సుధమ్మ. గుళ్ళకెళ్ళి కింద కూర్చుని కుంపట్ల మీద పొంగళ్ళు వండి వారుస్తూ, ఔరా! ఎంతటి సాదాసీదామనిషి. ఎంతటి నిగర్వి అనే పాత్రను అద్భుతంగా పండిస్తారు. ఎయిర్పోర్టులో కాటన్ చీర కట్టుకుని, బిజినెస్ క్లాస్ క్యూలో నిలబడి తన సింప్లిసిటీ గురించి ఘనంగా ప్రచారమూ చేసుకోగలరు. తాను స్వయంగా చీరలు కొనడం మానేశానని సగర్వంగా ప్రకటించుకోవడమూ ఆవిడకే చెల్లు. ఇతరులు కానుకగా సమర్పించే చీరలను సైతం స్వీకరించ బోననే విషయం మాత్రం ఆవిడ చెప్పినట్లు లేరు. సుధా మూర్తిగారి సింప్లిసిటీ కథలను ఆవిడే స్వయంగా ప్రచారం చేసుకోకుంటే అవి మన దాకా చేరి ఉండేవా? సుధా మూర్తి ఏ రాళ్ళెత్తి, శ్రమ చేసి ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు నిధులు సమకూర్చారో మరి! ఇన్ఫోసిస్ సిబ్బంది నుంచి ప్రతినెలా వారి జీతాల నుంచి ఫౌండేషన్‌కు విరాళంగా ముక్కు పిండి వసూలు చేసిన డబ్బుతో ఉదారంగా పేరు ప్రతిష్టలను సుధా మూర్తి సొంతం చేసుకుంటున్నారు.
లోతుగా తరిచి చూసినప్పుడు కలిగే అభిప్రాయం ఒక రకంగా ఉంటుంది. లోతుపాతుల జోలికి వెళ్ళకుండా సోషల్ మీడియా పబ్లిసిటీకే పరిమితం చేసి చూస్తే కలిగే అభిప్రాయం వేరుగా ఉంటుంది. పెట్టుబడిదారుడెవరైనా వారు సాగించే దాతృత్వ క్రతువు వెనక మతలబులు ఇలాగే ఉంటాయి. ఎంప్లాయిస్ గడియారాలు చూసుకోకుండా, నడుములు, మెడలు విరిగేలా పనిచేసి తమ లాభాలు పెంచాలి. ఆ లాభాల నుంచి కార్పోరేట్ సామాజిక బాధ్యతగా కొన్ని పైసలు ధర్మకార్యాలకు విదుల్చుతారు.
మీరు కూలీ చీమా? రాణీ చీమా? అని తేల్చుకోవాలి. ఈ స్పృహ మీలో ఉంటే మీరు ఏ పక్షాన ఉండాలో ఎవరి తరఫున ఆలోచించాలో బోధపడుతుంది. ఇంతకీ సాహిత్యకారుడిగా మీరు ఏ గట్టున నిలబడి ఏ పక్షానికి బాసటగా నిలుస్తారు?
