వాకాటి పాండు రంగరావు గారిని తలచుకుంటేనే గుర్తు కొచ్చే కథలు మూడు: సృష్టిలో తీయనిది, ఆర్. చక్రారావు, అపరాజిత. ఆ మూడు కథలూ నేను ఆయన్ని కలవకముందే చదివాను. 1990 ప్రాంతాల్లో ఆయనను తొలిసారిగా కలిశాక కూడా ఆయన చాలా కథలు రాశాడు. వాటిలోనూ చాలా మంచి కథలు గుర్తుకొస్తుంటాయి గానీ ,చిన్ననాటి నా మనసు పైన ఆ మూడు కథలు భిన్నగా, బలంగా ముద్ర వేసుకున్నాయి.
‘సృష్టిలో తీయనిది’ కథను మొదటిసారిగా చదివినప్పుడు నా వయస్సు యిరవయ్యేళ్లయినా వుండదు. యిప్పుడా కథేమిటో జ్ఞాపకం లేదు. కానీ టేబుల్ ఫాన్ తిరుగుతోంది అనే వాక్యం తో ఆ కథ ముగుస్తుందని మాత్రం బాగా గుర్తుంది.
మా నాన్నగారికి బాగా యిష్టమైన తెలుగు కథల్లో ఆర్ చక్రారావు ముఖ్యమైనది. దాన్నాయన ఎన్ని వ్యాసాల్లో పేర్కొన్నారో లెక్క లేదు. ఆర్ చక్రారావు కింది మధ్యతరగతి వాళ్లకో ప్రతినిధి. అతను గొడుగు కొనుక్కుందా మనుకుంటుండగానే వర్షా కాలం వెళ్ళిపోతుంది. యిక గొడుగెందుకులే అనుకుంటాడు. అతను శాలువాలు కొనాలనుకుంటూ వుండగానే చలికాలం వెళ్ళిపోతుంది. యే ఋతువుకు తగ్గట్టు ఆ ఋతువులో బతకలేని ఆ బడుగు జీవి అసలుపేరు ఋతు చక్రారావు.
అపరాజిత అనే పేరంటేనే తనకెంతో యిష్టమని వాకాటి గారే చెప్పుకున్నారు. అవసరమైన ఆపత్కాలం లో కుటుంబాన్నంతా ఆదుకున్న సబల కథ యిది. వాకాటి గారు తమ పెద్దమ్మాయికి అపరాజిత అనే పేరు పెట్టుకున్నారు.
సమకాలీనులైన తోటి రచయితలపైన గౌరవమూ, స్నేహమూ వుండిన మంచి కాలానికి చెందినవాళ్ళు వాకాటి గారూ, మా నాన్న గారూ. వాళ్లిద్దరికీ మధ్య వుండిన స్నేహం చాలా విశిష్ట మైంది. వుద్యోగ రీత్యా వాకాటి గారు డిల్లీ, విశాఖపట్నం, హైదరాబాదు లాంటి వూర్లన్నీ తిరిగారు. ఆయన విశాఖలో పోర్టు లో ఉద్యోగి గా వున్నప్పుడు, యేదో సాహిత్య సభలో పాల్గొనడం కోసం మా నాన్న గారు విశాఖ కెళ్లారు. అంతవరకూ వుత్తరాల ద్వారా కొనసాగిన వాళ్ళ స్నేహం ఆ తర్వాత వ్యక్తిగత స్నేహంగా మారి ప్రగాఢ మైపోయింది.
వాకాటి గారు ఆంధ్ర ప్రభ వార పత్రికకు సంపాదకుడైన తర్వాత దాన్ని తెలుగు కథకు, నవలకు పెద్ద ఆలంబనగా తీర్చి దిద్దారు. కథాప్రభ పేరుతో ప్రతి వారమూ మంచి కథలెన్నో ప్రచురించారు. ఆ శీర్షిక కింద మా నాన్న గారి కథలతో బాటూ, నేను రాసిన కథలూ, మా తమ్ముడు రాసిన కథలూ చాలా వచ్చాయి. ఆంధ్రప్రభలో మిత్ర వాక్యం పేరుతో ఆయన రాసిన సంపాదకీయాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.
ఆ సమయం లోనే వాకాటి గారు తిరుమల తిరుపతి దేవస్థానాల పనిపైన తిరుపతి కొచ్చారు. అప్పుడు మా నాన్న గారిని కలవడానికి ఆయనతో బాటూ, తిరుమల రామచంద్ర గారూ , మంజుశ్రీ గారూ మా యింటికి వచ్చారు. వొకరోజున వాకాటి గారు అప్పలాయగుంట కు వెళ్లాలన్నారు. యిప్పటిలా అప్పుడు ఆ వూరికి మంచి రోడ్డు లేదు. మిట్టలూ, పల్లాలూ వుండే ఆ గతుకుల రోడ్డు పైన నా బజాజ్ కబ్ వాహనం పైన నేనాయనను జాగ్రత్తగానే తీసుకెళ్లగలిగాను. అప్పలాయగుంటలో వెంకటేశ్వరుడి గుడి పెద్దదుంది. తిరుమలలో , శ్రీనివాస మంగాపురం లో లాగే అప్పలాయిగుంట గుడిలో కూడా వెంకటేశ్వరుడి విగ్రహం పెద్దగా అందంగా ఉంటుంది. ఆ గుడిలో కెళ్లాక వాకాటి గారు ఆలయ ముఖ్య పూరోహితుడిని కలిశారు. ఆయన కూడా వాకాటి వాడే! వాకాటి గారికి బంధువు గూడా! వాకాటి గారి పూర్వీకులది ఆ వూరేనని అప్పుడు గానీ నాకు తెలియలేదు. యిప్పటికీ వాకాటి గారు చిత్తూరు జిల్లా వాడే నన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయన మద్రాసు లోనే పుట్టాడు. ఆయన రాసిన చాలా కథలు మదరాసు నేపధ్యంలోనే సాగుతాయి. ఆయన తండ్రి బహుశా అప్పలాయగుంట ప్రాంతంనుంచీ మదరాసుకు వెళ్ళివుండవచ్చు. వాకాటి గారి బాల్యమూ, యవ్వనమూ మదరాసులోనే జరిగినట్టు ఆయన కథలు నిరూపిస్తాయి. ఆయన రాతల్లో ఎక్కడా యే ప్రాంతీయ మాండలిక వాసనలూ కనిపించక పోవడంతో ఆయనే ప్రాంతం వాడో చెప్పడం కష్టమై పోయింది .
ఆంధ్ర ప్రభ నుంచీ వాకాటి గారు ఆంధ్ర ప్రదేశ్ టైమ్స్ అనే యింగ్లీషు పత్రికకు సంపాదకుడిగా వెళ్లారు. తెలుగు సాహిత్యానికా పత్రికలో పెద్ద పీట వేశారు. ఆ పత్రిక కోసం ప్రతి నెలా వొక తెలుగు కథను యింగ్లీషు లోకి అనువాదం చేసి పంపమని చెప్పారు. నేను చిలుకూరి దేవపుత్ర గారి కథ బందీ ని అనువదించి పంపితే ప్రచురించారు. యింతలోనే ఆయన ఆ పత్రికనుంచీ బయటి కొచ్చేశారు. లేకపోతే ఆయన నా చేత మరికొన్ని అనువాదాలు చేయించి వుండేవాడు.
వాకాటి గారు నిరంతర అధ్యయన శీలి. మన సంప్రదాయ సాహిత్యం తో బాటూ పాశ్చాత్య సాహిత్యాన్ని కూడా బాగా చదువుకున్నవాడు. ఆయనకు హిందూ మతం పైనా , దాని సిద్ధాంతాలపైనా చాలా నమ్మకముండేది. అందుకే ఆయన అప్పటి రాష్ట్రీయ స్వయక్ సేవక్ సంఘ్ కు దగ్గరయ్యాడు. వాళ్ళ సిద్ధాంతాల వ్యాప్తి కోసం చాలా చోట్లకు వెళ్ళి వుపన్యాసాలిచ్చేవాడు. అలా తిరుపతికి కూడా వచ్చి వెంకటేశ్వరా యూనివర్సిటీ లో కొన్ని ప్రసంగాలు చేశాడు. నేనే తీసుకెళ్ళి ఆ సభాప్రాంగణాల్లో విడిచి పెట్టి వచ్చేవాడ్ని. నేనా సిద్ధాంతాలకు దూరమని తెలిసినా ఆయన నాతో ఆ ప్రసక్తి తెచ్చేవాడు కాదు.
ఆయనంతగా సైన్సును చదువుకున్నవాళ్ళు బాగా అరుదు. ఆయనలా సైన్సు, తాత్విక, ఆద్యాత్మిక విషయాల గురించి నిరంతర అన్వేషణలా అధ్యయనాన్ని కొనసాగిస్తూ జీవించిన ఆలోచనా జీవులు అరుదుగా ఉంటారు. ఓ వ్యక్తికి చికిత్స చేయకపోయినా, తనకు చికిత్స అందినట్టు భావించినప్పుడు , అతడా అనారోగ్య పరిస్థితి నుంచి బయటపడతాడనే ప్లేసిబో ఎఫెక్ట్ గురించి కథ రాసేందుకు ఆయన ఆర్థర్ షేపిరో, హెన్రీ బీచర్ , స్టూవర్ట్ వుల్న్ , లూయీ లాసాగ్నా , వోల్టర్ బి కానన్ , బ్లాక్ వెల్ ల వంటి శాస్త్రజ్ఞుల రచనలు చదివాడని తెలిసి నప్పుడు ఆశ్చర్య పోతాం. అయితే భౌతిక శాస్త్రాలకూ అధిభౌతిక విషయాలకూ మధ్య ఆయనదే అయిన తార్కిక విశ్లేషణలూ, నమ్మకాలూ చాలా వుండేవి. యెదుటి వ్యక్తిని శాస్త్రీయమైన చర్చతోనే తన నమ్మకాలపైన విశ్వాసం కుదిరేలాచేయడానికి ఆయన ప్రయత్నించే వాడు. తాను నమ్మిన వాటిని స్పష్టంగా బాహాటంగా చెప్పటానికి ఆయనెప్పుడూ వెనుదీసింది లేదు. పునర్జన్మ ను గురించిన నమ్మకాల్ని గురించి ఆయన రాసిన మరణం ఒక కామా పుస్తకం శాస్త్రీయ మైన చర్చ గా మారి భౌతిక శాస్త్రజ్ఞులకు కూడా ఆలోచింప చేసేలా వుంటుంది.
దేవుడున్నాడా లేడా అనే విషయాన్ని గురించి ఆయన శివాన్విత అనే కథలో చేసే విచికిత్స యెంత ఆలోచనాత్మకంగా ఉంటుందో గమనించండి: “కనబడేది పదార్థం. ప్రత్యక్షంగా కనపడనిది శక్తి. కానీ అవి రెండూ ఒకటేనని నేటి సైన్సు చెబుతూంది. సూక్ష్మాణు లోకంలో జరిగే సృష్టి సంహారాలను చూస్తుంటే పదార్థం అనేది శక్తి కెరటాల మధ్య అతి తాత్కాలికంగా వుండే సంబంధం మాత్రమే అని తేలుతుంది. కనుక నమ్మడానికి ప్రమాణం ఏది ? ఇంద్రియాలా? లేక వాటి కతీతమైన ఇంకోటి దేదయినానా ?… నన్ను నేను నమ్ముతున్నాను , అంటే సిల్లీ గా వుంటుంది. నమ్మను అంటే అబద్దం అవుతుంది. కనుక నాలో నేను ఎప్పుడూ వుంటాను అని చెబితే కొంత బాగుంటుందేమో- దేవుడన్నా, శక్తి అన్నా, ఇన్ అన్నా నేనే గనుక మల్లెల వాసనను మల్లెలు తెలుసుకుంటాయా, ఆనందిస్తాయా అన్న దానికి అవునంటే మీ ప్రశ్నకు ఔననే చెప్పాలి.” అని చెపుతూ క్లాసికల్ ఫిజిక్స్ , క్వాంటమ్ మెకానిక్స్ లను గుర్తు చేసి, కాంతి వేగం కన్నా ఎక్కువ వేగంగా సమాచారం అందే ప్రయోగాన్ని వివరించి , సైకాలజీ లోని కలెక్టివ్ ఆన్కాన్సస్ దాకా తీసుకొస్తా డా యన.
కోణార్క లోని మైధున శిల్పాలను ఫ్రిజిడిటీ వున్న భార్యకు చూపెడుతూ ఆమె భర్త వివరించే పద్దతిని చూడండి: “జీవితాన్ని దోసిళ్ళ నిండా ఎత్తి తాగిన జాతి మాత్రమే సృష్టించగలవీ శిల్పాలు. జీవితానికి నాలుగు గమ్యాలని నిర్ణయించి , అందులో కామం ఒకటిగా గుర్తించి, అన్నిటితో బాటు దానినీ నిండుగా నీతిబద్దంగా పరిపూర్ణంగా అనుభవిం చాక, ఈ శరీరపు పరిధి నుండి ఎగరడానికి, హారి జాంటిల్ ప్లేను లో అత్యంత వేగం పుంజుకున్నాక వర్టికల్ టేకాఫ్ కు ఒక ప్రయత్నం చేయమని వానప్రస్థం అంటూ ఒక దశను నిర్దేశించిన వివేకవంత మైన నాగరికత యొక్క యవ్వనపు పండు వెన్నెల ఇది. ఈ శిల్పాలను మన ఈనాటి మూసుకుపోయిన దృష్టి తో, నీరసపడిపోయిన జవసత్వాలతో , మేడిపండులాంటి నీతి కళ్ళద్దాలతో చూస్తే అర్ధం కావు. మనిషి అంతరాంతాల్లోకి వెళ్ళి దర్శించిన ద్రష్టలు సృష్టించిన వ్యవస్థలో శరీరానికి తగు ప్రాధాన్యం ఇచ్చారు. శరీరాన్ని తోసిరాజన లేదు- అలాగని అవసరానికి మించి ఆరాధించానూ లేదు. భోగాన్ని, యోగాన్ని, ఒకే ఏకాగ్రతతో చూసి, దాని నుండి దీనికి క్వాంటమ్ లీప్ చేసిన మహా మనీషులు వదలి వెళ్ళిన గుర్తులివి.”( శివాన్విత)
భారతీయ మైన ఆద్యాత్మికత లోని శాస్త్రీయతల్ని చాటి చెప్పడమూ, పాశ్చాత్య శాస్త్రీయత లోంఛీ అవసరమైన జ్ఞానాన్ని అందిపుచ్చుకోవదమూ లక్ష్యం గా ఆయన తన సృజనాత్మక, శాస్త్రీయ రచనలను ఆయనదే అయిన విశిష్ట మైన పద్దతిలో చివరివరకూ అదొక వుద్యమంలా కొనసాగించాడు. అభిప్రాయ బేధాలను గుర్తించినా వాటిలోని సామంజస్యాలను తెలుసుకో బూనటమూ , సహించడమూ ఆయన వ్యక్తిత్వంలోని విశిష్టత. సంప్రదాయం లో మంచి ఉంటే దాన్ని నిలుపుకోవడం, ఎప్పటికప్పుడు శాస్త్రీయంగా జీవితాన్ని మలచుకోవడం అయిన వ్యక్తిత్వం లోని విశిష్టత . మౌలికంగా వాకాటి గారు గొప్ప మానవతావాది, నాగరికుడు.
మా నాన్నగారు వెళ్ళిపోయిన నెల తిరగకముందే వాకాటిగారు కూడా యీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆ నెలరోజులపాటూ ఆయన మా నాన్నగారిని గురించే తలచుకుంటూ వుండేవాళ్ళని ఆయన్ని కలిసిన మిత్రులందరూ చెప్పేవాళ్ళు.
యిన్నాళ్ళ తర్వాత యిప్పుడు వాకాటి గారిని గురించి నాలుగు మాటలు రాయదలచుకుంటే మళ్ళీ ఆయన ‘సృష్టిలో తీయనిది’ కథే గుర్తుకొస్తోంది. యింతకూ ఆకథలో జరిగిందేమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో దాన్ని సంపాదించి చదువుకున్నాను. అది ఎమెస్కో సంస్థ అప్పుడు యింటింటా తెలుగు గ్రంధాలయం స్కీము లో ప్రచురించిన ‘అపరాజిత’ కథల సంపుటంలో వుంది. అందులో వాకాటి గారు ప్రతి కథకూ దాని పుట్టుక, పెంపుదలలను గురించి ఆసక్తికరమైన వుపోద్ఘా తాలు రాశారు. ‘సృష్టిలో తీయనిది’ గురించి చెబుతూ, “తాను యెంతో చక్కటి అపూర్వమైన చమత్కారాన్నో , అందాన్నో , కల్పననో, వర్ణననో , మలుపునో తన రచనలో ఒక చోట రత్నం లా పొదిగి , పాఠకుడు ఆ రచనను అలా చదువుతూ వస్తూ, వస్తూ, హటాత్తుగా యీ మిరుమిట్లు గొలిపే రత్నం ఎదుట పడి , ఆశ్చర్యపడి భళీ అంటాడు కదా అని ఎదురు చూస్తాడు ప్రతి రచయితా. కానీ సాధారణంగా ఆ రత్నం పాఠకుడి దృష్టికి ఆనకుండానే పోతుంది. పైపెచ్చు రచయిత అతి సామాన్యంగా భావించిన ఒక భాగాన్ని ఎత్తి చూపి,’ఆహా! ఏమి రాసారండీ!’ అంటాడు పాఠకుడు. సంస్కార సూచకంగా నవ్వి వూరుకుంటాడు రచయిత. యిది అందరూ రచయితలకూ ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు అనుభవంలోకి వస్తుందని నా ఊహ,” అని రాశారు. నేను మొదటిసారిగా చిన్నప్పుడెప్పుడీ మాటల్ని చదివానో గుర్తులేదుగానీ వాకాటి గారిలా అన్నారని యెన్ని సార్లు యెందరితో చెప్పానో లెక్క లేదు. అంతే కాదు, ‘సృష్టిలో తీయనిది’ కథ చివరి వాక్యంలో అలాంటి రత్నం దాచిపెట్టాననీ అది పాఠకుడు గుర్తించ గలిగితే తాను ధన్యుడననీ వాకాటి గారా వుపోద్ఘాతంలో రాశారు. ఆ కథను చదివిన నాలుగు దశాబ్ధాల తర్వాతకూడా నన్నా వాక్యం వెంటాడుతూనే వుందంటే వాకాటిగారి ధన్యతకొచ్చిన అనుమానమేదీ లేదు.
‘సృష్టిలో తీయనిది’ లోని కథ సంగతికేం గానీ ఆ కథ చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దుల్లోని నగరి, పల్లిపట్టు లాంటి చిన్న గ్రామాలకు చేరడం చూసినప్పుడు విశ్వమానవుడుగా యెదిగిన వాకాటి గారు మా తొండనాడు వాడే ననుకోవడం ఆనందంగానూ, గర్వం గానూ వుంటుంది.
- మధురాంతకం నరేంద్ర

మధురాంతకం నరేంద్ర
మధురాంతకం నరేంద్ర తెలుగు సాహిత్యంలో అగ్రశ్రేణి కథా రచయిత. కుంభ మేళా, అస్తిత్వానికి అటూ ఇటూ, వెదురు పువ్వు,, రెండేళ్ల పధ్నాలుగు మొదలైన కథా సంకలనాలతో పాటు 'కొండకింద కొత్తూరు', 'భూచక్రం', మనోధర్మ పరాగం వంటి నవలలు వెలువరించారు. 'మనోధర్మ పరాగం' నవలకి 'ఆటా' బహుమతి, కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు అందుకున్నారు.




