ఎనభయ్యేళ్ళకు ఇరవై కథలు

Spread the love

గంభీరమైన విషయాలను హాస్యం జోడించి చెప్పడం ఓ గొప్ప కళ. చాలా తక్కువ మంది సాహిత్యకారుల్లో అది కనిపిస్తుంది. ఆశ్చర్యంగా ఇలాంటి లక్షణం ఉన్నవారు చాలా తక్కువగా రాస్తారెందుకో. వేమూరి సత్యంగారి ఈ “ఎనభైలో ఇరవై” కథా సంకలనం చాలా సరదాగా సాగె కథలతో మొదలవుతుంది. 1971 నుంచి 2024 దాకా ఈయన రాసుకున్న కథలన్నిటినీ ఒకే సంకలనంగా తీసుకొచ్చారు. అందుకని ఈ కథలలో కాలంతో పాటు మారే రచయిత కథనశైలి కథావస్తువులను మనం ఒకే పుస్తకంలో గమనించే అవకాశం దొరుకుతుంది. ఇది అరుదుగా జరిగే విషయం. హాస్య కథలుగా కనిపించేవి నవ్వు పుట్టిస్తాయి.   కాని ఆ కథా విషయాన్ని మరో సారి పరిశీలిస్తే అందులో కొత్త కోణాలు కూడా కనిపిస్తాయి. ఒక సినిమాలో ప్రధాన పాత్ర అంటుంది “గోదావరి నిండా నీళ్ళే కాని చెంబుతో వెళితె చెంబుడే దొరుకుతాయి” అని. ఈ కథలన్నీ సరళంగా అరటి పండు విప్పి అందించినట్లు ఉన్నా ఒక్కో కథ లోతైన విషయాలను కూడా ప్రస్తావిస్తుంది. పాఠకులు ఎలా అర్ధం చెసుకుంటారో వాళ్ళిష్టం కాని ప్రపధమంగా ఈ కథలు చదివిన వారి పెదవులపై చిరునవ్వులు పూయాలి అన్న సంకల్పంతో ప్రధానంగా రాసినట్లున్నారు సత్యంగారు మొదటి సగ భాగం కథలను రాసుకున్నారని అనిపిస్తుంది. 

ఇందులో మొత్తం 22 కథలున్నాయి. ‘పారిజాతం’ కథలో రోజూ భర్త చేతిలో దెబ్బలు తినే ఓ స్త్రీ దాన్ని ప్రశ్నించిన మరో పెద్దావిడతో అది తన భర్త ప్రేమ అని భలే కన్వింసింగా చెప్తుంది. ఇది విని ఆ పెద్దావిడ తన భర్తతో గొడవ పడుతుంది.  ఆయన మౌనంగా భార్య చేయమన్న పనులను చేస్తాడు. బట్టలుతుకుతున్న ఆ భర్తను చూసి ఆ భార్య తల గొడకు కొట్టుకుని మరీ ఏడవడం హాస్యంగా అనిపిస్తుంది. కాని ఇందులో ఆ తన్నులు తినే భార్య బస్తాల క్రింద పడి నలిగిపోయే తరుణంలో వాటిని తొలగించిన తరువాత కలిగే ఆ తేలికపాటి ఆనందాన్ని వర్ణిస్తూ అది చాలా గొప్ప అనుభవం అని భర్త చేతిలో తన్నులు తిన్నాక ఆ తరువాత ఆయన కనపరిచే ప్రేమ అంతటి గొప్ప ఆనందాన్నిస్తుందని చెప్పడం చదువుతుంటే నాకు అందులో అతి గొప్ప స్ట్రాటేజీ కనిపించింది. దేన్ని అయినా కన్వింసింగ్ గా చెప్పగలిగితే ఎంతటి దోపిడి అయినా ఇష్టపడే అవసరంగా మారిపోతుందన్న సిద్దాంతాన్ని రచయిత ఎంత సరళంగా వ్యక్తీకరించారో ఈ కథాలో. ఇలాగే కదా సుఖవంతమైన జీవితాలు గడిచిపోయేది.

చాలా మంది స్త్రీలు తమ జీవితాలను కొద్దో గొప్పో ఇదే పద్దతిలో interpret చేసుకుని ఆనందంగా గడిపేస్తారు. దాన్ని చూసి చాలా మంది అదే ఆనందం తమకూ కావాలని కోరుకుంటారు. “ఆడది కోరుకునే వరాలు రెండే రెండూ చల్లని సంసారం, చక్కని సంతానం….” పాటలోని మాధుర్యానికి పడిపోయిన స్త్రిలు వివాహం గురించి పిల్లల గురించి మాత్రమే కలలు కన్నట్లు, ఆ పెద్దావిడ కూడా అలా తన భర్త చేతిలో  తన్నులు తిని ఆ ప్రేమానుభూతిని పొందాలి అని కోరుకుంటే ఆయన ఆమె కోసం ఎప్పుడూ చేయని పనులు చేయబోతాడు. అది చూసి భరించలేని ఆ పత్ని భర్తను ఆ స్థితికి తీసుకెళ్లానని తల బాదుకుంటుంది. స్తీ హ్రుదయాన్ని ఇంత చక్కగా ఎలా పట్టుకున్నారో కాని సత్యంగా గారి ఈ కథ కేవలం హాస్యకథగా నాకు అనిపించలేదు. 

“అడిగేవాడికి చెప్పేవాడు లోకువ” అంటాడు ఆకలిరాజ్యంలో కమల్ హాసన్. “గోల్డ్ కవరింగ్” కథ లో ఇంటర్వ్యు కి వచ్చిన ఓ అభ్యర్ధి తాను ఓ అందమన అమ్మాయిని ఇంటర్వ్యూ చేసే ఆఫిసర్ నని కలగంటాడు. చివరకీ కల చెదిరి అతనే బిక్కు బిక్కు మంటూ ఇంటర్వ్యూ రూంలోకి ప్రవేశించడం కొసమెరుపు. కలకు వాస్తవానికి ఉన్న దూరాన్నిచూపించే కథ ఇది. కాని కలలోనూ వాస్తవంలోనూ అధికారి స్థానంలో ఉన్న ఆ వేరు వేరు వ్యక్తులలో మాత్రం ఒకే రకమైన అహం కనిపిస్తుంది.  “నాలుగో నెల మొదలయింది” కథలో ఈ ప్రెగ్నెంట్ ఎవరబ్బా అని ఎదురు చూస్తూ ఉండగానే కథ ముగిసింది. అప్పుడు అర్ధం అయింది నాలుగో నెల అంటే ఏప్రెల్ నెల అని, ఈ టైటిల్ చూసి తరువాత కథ చదివుతుంటే అందులో పాత్రలు ఒకొకరిని ఏఫ్రెల్ ఫూల్ చేసుకుంటుండగానే , అది చదువుతున్న మనమూ ఫూల్ అయిపోయాతాం. నేనైతే చివరకు ఇది ఏప్రెల్ కాదులే అని సరిపెట్టుకోవలసి వచ్చింది. తస్మాత్ జాగ్రత్త, నాలుగో నెల మొదలవడం అంటే ఏప్రెల్ మొదటీ తారిఖు అని అర్ధం చేసుకుని చదవండీ. లేదా సత్యం గారు ఫూల్ చేసిన వారి లిస్ట్ లో మీరు కూడా చేరతారు.

పిచ్చివాళ్లు, పిల్లలు, కవులు ఈ ముగ్గురే ఆనందంగా తమదైన ప్రపంచంలో ఉంటారని అంటారు. దాన్ని బలపరుస్తూ ఇద్దరు పిచ్చి మిత్రుల కథ చాలా హృద్యంగా రాసారు రచయిత. ఏదో ఒక పిచ్చిలో మునిగి ఉండకపోతే జీవితంలోని వాస్తవాలు ఎవరినైనా ముప్పుతిప్పలు పెట్టేస్తాయి మరి.

 సినిమాకు వెళదాం అని చెప్పిన భర్త అది మర్చిపోయి ఇంటికి ఆలస్యంగా వస్తాడు. ఎదురు చూస్తున్న భార్య అతనిపై కోపాని ప్రదర్శించబోతే మధ్యలో ఇంటికి చుట్టాలు వచ్చిపడతారు. వారి ఆతిధ్యంలో కోపాన్ని మరిచి ఒకటయిన భార్యా భర్తల కథ “చుట్టం దేవుళ్ళు” టికెట్లు దొరకలేదని మరునాటికి దొరికాయని ఆ భర్త చెబుతుంటే ఆన్ లైన్ బుకింక్ చెక్ చేసుకోవచ్చుకదా అనుకుంటూ  నాలుక్కరుచుకున్నాను క్రింద కథ రాసిన సంవత్సరం చూసి 1976లో ఫోన్, నెట్ లేని రోజులలోని సినిమా ప్రేమికుల కష్టాలు ఇవి. కాని ఇది చదవడానికి భలే బావుంది. పాత సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది.

సినిమా నటుల్ని రాజకీయాల్ని కలిపి 1977లో రాసిన సత్యం గారి “అసెంబ్లీ లో తారాబలం” కథ చదువ్తుతుంటే జయసుధ జయప్రద గార్లు రాజకీయాలలో చేరతారనే భవిష్యవాణిని ఈయన ముందే వినిపించారనిపిస్తుంది. సత్యం గారి మ్యూజిక్ తో సుశీల గారి గానంతో సరదాగా సాగుతుందీ కథ.  “ఓటమి” కథలో పూర్వ జన్మ వృత్తాంతం చెప్పగల మెషీన్ తో వచ్చే కష్టాలను ఊహాత్మకంగా రాసారు రచయిత. గడిచిపోయిన చాలా విషయాలను అక్కడితో వదిలేస్తే తప్ప జీవితాలలో పశాంతత ఉండదన్న విషయాన్ని మర్భగర్భంగా చెప్పారు రచయిత. భార్యను పాదదాసిగా చూడాలనే మగవారి అహాన్ని అంగీకరిస్తూనే దాని మధ్యనుండే స్తీ హృదయాన్ని చూడమనే సందేశాన్ని వినిపిస్తారు “పాదదాసి” కథలో.

ఓ ప్రేమ కథ లో తండ్రి విలన్ అయితే ఆయన జీవితం నేర్పిన పాఠాలతో మారి తన కొడుకుని ప్రియురాలితో కలిపడానికి ప్రయత్నిస్తుంటే, ఆ కొడుకు తన ప్రెయిసి కోసం వేచి చూస్తున్న రైల్వే స్టేషన్ లో త్రివికం అత్తారింటికి దారేది సినిమా ఆఖరి సీన్ షూటింగ్ పెట్టుకున్నారట. అందుకన్ ఆ పెద్దాయన ఏర్పోర్ట్ ఏరియాలో లోకి సీన్ మార్చమని వారికి కోరుతుండగా కథ ముగుస్తుంది. రవి కానని చోట కవి గాంచును అన్నట్లు రచయిత ఎక్కడికన్నావెళ్లిపోగలడు మరి త్రివిక్రం లాంటి మరో దర్శకుడి సెట్ మీదకు కూడా. సీరియస్ గా సాగే కథకు ఓ సినిమాటిక్ ట్విస్ట్ ఇచ్చారు రచయిత.

“ఆ నాటి వాన చినుకులు” కథను అదే సంకలనంలో ఇంతకు ముందు చదివాను. మంచి ఫీల్ ఉన్న కథ ఇది.  రిక్షా వెనుక రాసి ఉన్న ఓ వాక్యం చూసి దాని కథను తెలుసుకోవాలని తపిస్తూ వెళ్లి  అన్వేషణను ప్రశ్నగా మార్చుకున్న ఓ వ్యక్తి అనుభవాన్ని ఈ కథ చాలా గొప్పగా వ్యక్తీకరిస్తుంది. నిజానికి ప్రతి తీగ కూడా డొంకను కదిలిస్తే ఎన్నో జీవిత వాస్తవాలు, వెటి వెనుక కాలం ఆడే నాటకాలను మనిషి తెలుసుకోగలడు.

రచయిత రాసిన ‘బైపాస్’ కథ వారి ఇంతకు ముందు కథలను దాటుకుని నిలుస్తుంది. ఇక్కడ రచయితలోని పూర్తి ఆధునిక దృష్తికోణం కనిపిస్తుంది. అంటె ఇక్కడి నుండి స్కీన్ కలర్ లోకి మారుతుందన మాట. కొన్ని ప్రేమలు చనిపోవని, అవకాశం వస్తె వాటిని అనుభవంలోకి  మార్చుకోవాలని  మనిషి హృదయం కోరుకుంటుందనే నిజాన్ని ఈ కథ వ్యక్తీకరిస్తుంది.  ఓ ప్రేమికుని ప్రేమను తిరస్కరించిన ఓ యువతి కొన్నేళ్ళ తరువాత అతన్ని మళ్ళీ కలిసి, ఆ తప్పిపోయిన ప్రేమనుభవాన్ని ఆ రాత్రి అతనితో గడపి పొంది దాన్ని అందమైన జ్ఞాపకంగా  దాచుకుని  మళ్ళి తన కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంటుంది.

వన్ నైట్ స్టాండ్ లపై చాలా కథలే వచ్చాయి. కాని వాటిలో ఓ కన్య్పూజన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కథలో ఇలాంటి అనుభవాన్ని కోరుతున్న స్త్రీలో ఓ స్పష్టత కనిపిస్తుంది. మొదటి  నుండి తనకేం  కావాలో ఆమెకు బాగా తెలుసు. అందుకే అప్పుడు కూడా ఆ అనుభవం కోసం ఆమె ముందడుగు వేస్తుంది.  ప్రేమలేని వివాహంలోని అసంతృప్తి, ప్రేమను పొందలేకపోయిన అసంతృప్తి, జీవితంలో మరింకేదో కావాలనే కోరిక ఇవన్నీ ఈ వన్ నైట్ స్టాండ్ లకు కారణం. ఇవన్నీ సమపాళ్లలో ఆ స్త్రీ పాత్రలో కనిపిస్తాయి. ఆ ప్రేమను ఆస్వాదించి తమ జీవితాలలోని లోటుని భర్తీ చేసుకోవాలనే ఆలోచనను కార్యరూపంలోకి ఆమె తెవడం లో నీతిని వెతకవద్దనే ఆధునిక ఆలోచనకు దగ్గరగా చాలా కన్వింసింగ్ గా రాసిన కథ ఇది.

 “కాలుష్యం” కథ చాలా సున్నితమైన అంశాని లేవనెత్తుతుంది. పిల్లల పై ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాలను గమనించి భయంతో రోజులు గడుపుతున్న కుటుంబాల మధ్య, స్నేహాల  మధ్య ఒకరిపై మరొకరికున్న నమ్మకాన్ని మర్చిపోయి అనుక్షణం అనుమానంతో జాగరూకతతో జీవించవలసిన స్థితిలో మనం ఉండడంలోని విషాదాన్ని ఈ కథ చాలా బాగా చర్చిస్తుంది. “ఈ కథనాది కాదు” లో టైటిల్ లోనే మూల కథ తనది కాదని రచయిత చెప్పేసారు. ఓ హెన్రీ “ది లాస్ట్ లీఫ్” కథను తెలిగీకరించే వీరి ప్రయత్నం చాలా బాగా వచ్చింది.

ఈ సంకలనంలో నాకు బాగా నచ్చిన కథ “ఆస్తి” తల్లి తండ్రులు ఆస్థిని డబ్బు రూపంలోనే కాదు ఇంకా అనేక విధాలుగా ఇస్తారు. కాని దాన్ని అర్ధం చేసుకునే పిల్లలు చాలా తక్కువ. ఈ కథ చాలా మంది పిల్లలకు ఆస్థిలోని మరో రూపాన్ని చూడడానికి సహాయపడుతుంది. పైగా ఈ కథలోని కొడుకు సత్యం గారి మితృడని తెలిసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. అలాంటి  మనుష్యుల గురించి తెలుసుకోవడంలోనే ఓ పాజిటివిటీ ఉంది. ఇక ఆ తరువాత వచ్చే కథలన్నీ కూడా రచయిత స్వీయ జీవితానుభవాలే.

 “అమ్మకు ఆహ్వానం” వీరి జీవితంలోనుండి వచ్చిన మరో కథ. తల్లి సంవత్సరీకం రోజున జరిగే కార్యక్రమాల నడుమ ఆమె జ్ఞాపకాలను ఆహ్వానించి నలుగురి నోట ఆమె గురించి వింటూ తమందరి జీవితాలను ఆమె ప్రభావితం చేసిన విధానాన్ని తలచుకోవడంలోని ఆ ఆత్మీయతను ఈ కథ చాలా గొప్పగా చూపింది. ఈ కథను రాసిన విధానం చాలా బావుంది. రచయిత మనసులోని చెమ్మ అక్షరాలుగా మారి పాఠకులకు చేరుతుంది. వారిలో ఇలాంటి కార్యక్రమాలలోని అర్ధవంతమైన కోణాన్నిచూపిస్తుంది.  

తన కాబ్ లో ఎక్కిన ప్రతి ఒక్కరికీ జనరంజకంగా తన జీవిత కథను చెప్పి వారి దగ్గర సానుభూతిని గౌరవాన్ని సంపాదించే ఓ యువకుడి కథ “కథకుడు”. ఉన్నంతలో తృప్తిగా బతికే ఓ బడుగు జీవీ దగ్గర జీవిత పాఠాన్ని నేర్చుకున్న ఓ వ్యాపారస్తుని కథ “రూపాంతరాలు”. ఇవి రెండూ కూడా రచయిత కల్పనా శక్తికి, పరిశీలనా శక్తిని ప్రతీకలుగా నిలుస్తాయి.

“సలహా కావాలి” అనే కథలో అనుకోకుండా ఓ పురుషుడిపై క్షణకాలంపాటు ఓ స్త్రీకి కలిగే ఆకర్షణ గురించి రాస్తారు రచయిత. ఒకే చోట కుటుంబలకు దూరంగా జీవిస్తూ ఉద్యోగాలు చేసే స్త్రీ పురుషులు ఎన్నో రకాల ఒత్తిళ్లను ఎదుర్కోవాలి. అందులో ఈ రెలేషన్ షిప్స్ ఒకటి. సమయం, సందర్భం, అవకాశం, అవసరం మనుషులను చాలా సందర్భాలలో బలహీనపరుస్తయి. అప్పుడు ఎదురయ్యే స్థితిగతులను ఒకొక్కరూ ఒకో విధంగా ఎదుర్కుంటారు. ఈ కథలో నాయిక ఆ ఒత్తిడిలో ఓ చిన్న తప్పు చేస్తుంది. తరువాత పశ్చాత్తాపడుతుంది కూడా. ఓ క్షణికమైన ఆకర్షణ, ఒత్తిడిని ఈ కథలో చాలా బాగా డీల్ చేసారు రచయిత. కథ ముగింపు కూడా బాగా వచ్చింది

 తన అవసరాల కోసం ప్రేమ నటించిన ఓ యువతి చేసిన మోసాన్ని తెలుసుకుని , ఆ మోసాన్ని స్వీకరించే విధానంలోనే తనను విజేతగా నిలుపుకున్న ఓ వ్యక్తి కథ “లవ్లీ”. దేన్ని అయినా మనం చూసే విధానంలో మన ప్రశాంతత ఆధారపడి ఉంటుందని చెప్పే ఈ కథలో రచయిత చర్చించే పాయింట్ చాలా బావుంటుంది. కవి సాహిర్ చెప్పినట్లు “వో అఫ్సానా జిసే అంజాం తక్ లానా న హో ముంకిన్ ఉసే ఎక్ ఖూబ్సూరత్ మోడ్ దేకర్ చోడనా అచ్చా”. దీన్ని రచయిత అచ్చు ఇలాగే ముగించారు. 

“చలపతి చక్రభ్రమణం” అనే కథతో పాటు మరో నాలుగు రెండు పేజీల కథలూ ఉన్నాయి. ఈ నాలుగూ హాస్య కథలే. ఈ సంకలనంలో విశేషం ఏంటంటే డేబ్భైలలోని సమాజ వాతావరణం, ఆనాటి మనుషుల ఆలోచనల నుంచి ఈ నాటి ఆధునిక స్త్రీ ఆలోచనల దాకా వచ్చిన సాంస్కృతిక మార్పులను చూడవచ్చు. అలాగే కాలంతో పాటు ఎదిగిన రచయిత ఆలోచనాక్రమాన్ని ఆస్వాదించవచ్చు. పైగా ప్రతి కథను ఆయన ఇచ్చిన వివరణ ఆ కథా నేపధ్యంతో పాటు, దాన్ని కథగా ఎన్నుకోవడం వెనుక రచయిత కారణాన్ని కూడా వివరిస్తుంది. ఇది అరుదైన విషయం. ఎందుకంటే ఈ ప్రక్రియతో ప్రతి కథలోనూ రచయితను వెతుక్కుంటారు పాఠకులు. పాఠకులను తనకు దగ్గర చేసుకునే ప్రక్రియతో పాటు ఆ కథా నేపద్యానికి సంబంధించిన విషయాలలో పాఠకులనూ భాగం చేయడంతో కథలను రచయిత జీవిత ఘటనలుగా పాఠకులు తీసుకోవడం జరుగుతుంది.

వీరి కథలను ఓ క్రమంలో చదువుతుంటే ముందు ఓ కథకుడిగా ఇతరుల కథలను చెప్పే రచయిత కనిపిస్తాడు. తరువాత క్రమంగా ఉత్తమ పురుషలోకి మారి తన దృష్టితో కథావస్తువు చూపే మార్గదర్శకుడు కనిపిస్తాడు. ఇతను ఆ తరువాత  తనలోకి తాను తొంగి చూసుకునే ఓ దార్శనికుడిగా మారతాడు ముఖ్యంగా “అమ్మకు ఆహ్వానం” లో. 1961 లో రాసిన మొదటి కథ దొరకకపోతే దాన్ని మళ్ళీ 2024లో గుర్తు చేసుకుని “చలపతి చక్రభ్రమణం”గా  రాసుకున్నారు రచయిత. ఒకే కథను రచయిత రెండు సార్లు ఇన్నేళ్ళ తేడాతో రాయడం ఇంతకు ముందు ఏ రచయిత జీవితంలోనూ జరిగి ఉండకపోవచ్చు.

మరో సంగతి గమనిస్తే రచయిత మొదటి కథలు పూర్తి హాస్యరసంతో ఉండి క్రమంగా గాంభీర్యాన్ని సంతరించుకున్నాయి. వీరి హాస్య కథలలో కూడా చాలా పరిశీలనాత్మకత ఉంది. చాలా కథలు నిజ జీవిత పాత్రల స్పూర్తితో రాసారు. తన చుట్టు ఉండే పరిసరాలను, మనుషులను నిశితంగా పరిశీలించే గుణం రచయితలో ఎక్కువని అనిపిస్తుంది. అలాగే సినిమాతో వీరి స్నేహం కూడా చాలా కథలలో కనిపిస్తుంది. రచయిత తన కథల ముగింపులను చాలా భిన్నంగా రాసుకున్నారు. వీరిపై ఓ హెన్రీ ప్రభావం మామూలుగా లేదు. మొదటి కథ నుండి కూడా ముగింపు లో ట్విస్ట్ ఉండేలా ఈయన తన కథా రచనను సాగించడం గమనిస్తే వీరి శైలిపై ఓ హెన్రీ ప్రభావం అర్ధం అవుతుంది. రచయిత సాహిత్య పఠనాన్ని వీరి శైలి స్పష్టపరుస్తుంది.

ఓ రచయిత తన ఇరవై ఏళ్ళ వయసు నుండి ఎనభై దాకా రాసుకున్న కథలను ఒకే సంకలనంగా తానే స్వయంగా తీసుకురావడం సాహితీ ప్రపంచంలో ఇంకెక్కడయినా జరిగిందో లేదో తెలియదు కాని తెలుగులో బహుశా ఈ “ఎనభైలో ఇరవై” తోనే ఆ ఒరవడికి శ్రీకారం చుట్టబడిందని నాకు అనిపిస్తుంది. అందుకే ఇదో గమ్మత్తయిన పుస్తకం, ఓ గమ్మత్తయిన రచయిత, భావుకుడి కలం నుండి జాలువారిన హస్త భూషణం.   

పి. జ్యోతి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *