ఇంకా పుట్టని బిడ్డ కథ

Spread the love

ఫ్యామిలీ కోర్ట్ లో వాదోపవాదాలు జరుగుతున్నాయి

కోర్ట్ హాల్  లో ఎక్కువ మంది జనం లేరు. క్లయింట్లు లేని ఒకరిద్దరు న్యాయ వాదులు వరండాలో అటూ ఇటూ తిరుగుతున్నారు. కొంతమంది ప్రేక్షకులు కూర్చునే బల్ల మీద వెనుక కూర్చుని తమలో తామే మెల్లగా మాట్లాడుకుంటున్నారు. స్నిగ్ధ ఆమె తల్లి తండ్రులు మౌనంగా కూర్చున్నారు. వాళ్లకు కొంచెం దూరంగా ప్రదీప్ స్నేహితులు ఇద్దరు అమర్, దినేష్ కూర్చుని జరుగుతున్న తతంగాన్ని ఆసక్తి గా చూస్తున్నారు. కోర్ట్ హాల్  అంత పెద్దగా ఏమీ లేదు. ప్రదీప్ తన అడ్వొకేట్  కి ఎదురుగా నిల్చుని వున్నాడు.

” ఈ కేసు ఏదో   మామూలు విడాకుల కేసు కాదు.  కాస్త కాంప్లికేట్ అయ్యేట్టు వుంది. ఇది. మీ సహాయం పూర్తిగా కావాలి.” అన్నారు అడ్వొకేట్

“సరే! సర్.” అన్నాడు ప్రదీప్ అభావంగా

“మీ భార్య కి మానసిక స్థితి సరిగ్గా లేదు. ఆమెకు పిచ్చి అవునా?”

“అవును”

“కానీ ఆమెను థరోగా పరీక్షించిన డాక్టర్ చోప్రా అలాంటిది ఏమీ లేదు అని రిపోర్ట్ ఇచ్చారు”

“నిజమే సర్. కానీ ఆయన, మానసిక స్థితి సరిగ్గా వున్నవాళ్లు ఎవరూ ఆమె చేసిన పని చేయరు. అని కూడా అన్నారు కదా సర్”

ప్రదీప్ జవాబు కి అడ్వొకేట్ ఒక్క క్షణం పాటు మౌనం వహించాడు

“సరే! మీకు పెళ్ళై ఎన్నాళ్ళు అయింది”

“దగ్గర దగ్గర రెండేళ్లు అవుతోంది. మాకు జనవరి 2, 1984 న పెళ్లైంది.”

“మీ ఇద్దరికీ పెళ్ళికి ముందే పరిచయం ఉందా?”

“ఉంది సర్.”

“ఎంత కాలం నుండి?”

“పెళ్ళికి ఒక సంవత్సరం ముందే మాకు పరిచయం కలిగింది.ఆమె పెద్ద అన్న నాకు క్లాస్ మేట్. మేమిద్దరం రూర్కెలా కాలేజీ లో చదువుకున్నాము. ఒకసారి సెలవులలో వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆమె పరిచయం అయింది. ఆ పరిచయం మెల్లగా ప్రేమగా మారింది” కాస్త ఇబ్బంది పడుతూ చెప్పాడు ప్రదీప్.

“ఒక పర్సనల్ క్వశ్చన్ వేస్తాను. మీ వైవాహిక జీవితం ఎలా వుంది?”

ఆ ప్రశ్న కి జవాబు చెప్పడానికి ముందు ప్రదీప్ కోర్ట్ హాల్ అంతా కలియజూశాడు. ఎదురుగా స్నిగ్ధ.

మరింత ఇబ్బంది పడుతూ “ఫైన్ సర్ ” అన్నాడు

“మీ ఇద్దరి మధ్యా తీవ్రమైన అభిప్రాయ బేధాలు ఏవైనా ఉన్నాయా?”

“నాకు గుర్తున్నంతవరకు ఏమీ లేవు సర్ “

“ఈ సంఘటన ఎప్పుడు జరిగింది?”

“ఆర్నెల్ల క్రితం”

” మీ భార్య అలా ఎందుకు చేసిందో మీకు వివరించే ప్రయత్నం చేసిందా?”

“నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఏదో తాత్కాలిక చిత్త చాంచల్యం తో  అలా చేశానని చెప్పింది. మీరు కూడా అలాంటి అభిప్రాయమే ఏర్పరచుకున్నారు కదా ఆమె పై” అన్నాడు ప్రదీప్

ప్రదీప్ మాటలు పట్టించుకోకుండా “సో! ఆమెకు మానసిక స్థితి సరిగా లేనందున ఆమె నుండి మీరు విడాకులు కోరుతున్నారు అంతేనా?’

అని ప్రదీప్ తో అని అడ్వొకేట్, న్యాయ మూర్తి వంక తిరిగి

 ” యువర్ హానర్. ఈ క్షణం నేను మీకొక విషయం స్పష్టం చేయాలి. ఆమెను పరీక్షించిన డాక్టర్ చోప్రా ఆమెకు ఎలాంటి మెంటల్ డిజార్డర్ లేదని చెప్పారు.” అని ముగించారు

కోర్ట్ హాల్ అంతా సందడిగా మారింది. కొంత ఎక్సయిట్మెంట్ తో ప్రేక్షకులు, కక్షిదారులు తమలో తామే మాట్లాడుకోసాగారు. స్నిగ్ధ తాను కూర్చున్న స్థానం లోనే కొంచెం పక్కకు తిరిగింది చుట్టూ చూడటానికి. ఆమె భర్త, ఇద్దరు స్నేహితులు అటువైపు తిరిగి కూర్చుని వున్నారు. బహుశా రిలాక్స్ అయి వుంటారు ఊహించనిది ఏదీ జరగక పోవడం తో!

కోర్ట్ ప్రొసీడింగ్స్ చూడటం ఇబ్బందిగా ఉంటుందని ఆమె అత్తా మామ లు కోర్ట్ కే రాలేదు. కాస్త ఎడమవైపు తిరిగితే ఆమె తల్లితండ్రులు. తల్లి మొహం పాలిపోయి వుంది. మొహం లో నుండి నెత్తురు అంతా ఎవరో తోడేసినట్టు.

 తండ్రి కుర్చీ కి ఎవరో కట్టేసినట్టు అతుక్కుని పోయి కూర్చున్నాడు. ఏ కాస్త సందు దొరికినా సరే, కట్టు తెంచుకుని పారిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు. ఎప్పుడూ ఆహ్లాదంగా కనిపించే తండ్రి మొహం అవమాన భారం తో ఎరుపెక్కింది. కోర్ట్ ఆ రోజు ఫైనల్ ఆర్డర్ ఏదీ ఇవ్వడం లేదు. అంటే మరొక రోజు హియరింగ్ ఉన్నదన్న మాట. మరొక రోజంతటి దుఃఖం

***********************

“మేడమ్! నేను అడ్వొకేట్ చౌదరిని!” ఆమెకు దగ్గరగా వినిపించిందో స్వరం. స్నిగ్ధ లేచి ఆ స్వరం వినిపించిన వైపు చూసింది

“మీకు నేను పర్సనల్ గా తెలియదు. కానీ కేస్ హిస్టరీ మొత్తం నేను మీ నాన్న గారి ద్వారా తెలుసుకున్నాను. రెండు మూడు సార్లు మీ ఇంటికి వచ్చాను కూడా! కానీ అప్పుడు మీరు బయటకు వెళ్లారు. కనుక మనం కలుసుకోలేకపోయాము. కోర్ట్ కి రావడానికి ముందే కేసు గురించి మీతో డిస్కస్ చేసి ఉండాల్సింది. కానీ ఫరవాలేదు లెండి. జడ్జి గారు ఇవాళ ఫైనల్ ఆర్డర్ పాస్ చేస్తారు లీగల్ సెపరేషన్ కు. కానీ మనం ఇన్సానిటీ ఆరోపణ ను అంగీకరించవద్దు. ఆ ఆరోపణకు సరి అయిన ఆధారాలు ఏవీ లేవు. డాక్టర్ కూడా తన రిపోర్ట్ లో మానసిక స్థితి గురించి ఎలాంటి నెగెటివ్ వ్యాఖ్యా చేయలేదు. మీరు ఆందోళన పడవద్దు” అంటూ చౌదరి మాట్లాడుతూ ఉండగానే అటుగా డాక్టర్   బెహరా వచ్చారు.

ఆమెను  చూస్తూనే “ఓ బెహరా! మీరూ వచ్చారా?” అని పలకరింపుగా నవ్వి చౌదరి తన సీట్ వైపు వెళ్ళిపోయాడు.

“సారీ అమ్మా! నాకు కాస్త లేట్ అయింది. ఏమీ అవుకోవద్దు” అన్నది స్నిగ్ధ వంక చూస్తూ

“ఫరవాలేదు లెండి ” అన్నది స్నిగ్ధ తాను కూర్చున్న చోటునే పక్కకు జరిగి డాక్టర్ బెహరా కి చోటిచ్చి “కూర్చోండి డాక్టర్ ” అన్నది. బెహరా కూర్చునేలోగానే ఆమె భర్త అడ్వొకేట్

 “డాక్టర్ బెహరా! ఇలా రండి” అని పిలిచాడు

డాక్టర్ బెహరా పొడవాటి టేబుల్ కి క్రాస్ గా కూర్చుని పవిత్రమైన గీత మీద ప్రమాణం చేసారు. తన చీర కొంగు భుజం చుట్టూ సరి చేసుకుని హ్యాండ్ బాగ్ లో నుండి కర్చీఫ్ తీసి ఒక సారి మొహం తుడుచుకుంది.

“మీకు స్నిగ్ధ, మిస్ట్రెస్ ప్రదీప్ మిశ్రా మీకు తెలుసా?” డాక్టర్ బెహరా కాస్త కుదురుకున్నాక అడ్వొకేట్ అడిగాడు.

“తెలుసు. ఇంటర్మీడియట్ లో మేమిద్దరమూ ఒకటే కాలేజీ. ఆమె నాకంటే ఒక సంవత్సరం జానియర్. ఒకే వూరిలో ఉండటం వలన మేము తరచూ కలుసుకుంటూ ఉంటాము.” చెప్పింది డాక్టర్ బెహరా

“మీరు ఆమెకు అబార్షన్ చేసారు కదా! గర్భస్థ పిండము ఎంత వయసు వుంది మీరు ప్రేగ్నెన్సీ  టెర్మినేట్ చేసినప్పుడు?”

“పది వారాలు”

“ఆమె ఎనుదుకు అబార్షన్ చేయించుకోవాలి అనుకుందో మీకు చెప్పిందా?”

“అవును చెప్పింది. తను మానసికంగా పిల్లల్ని కనడానికి సిద్ధంగా లేదని, అంత త్వరగా పిల్లలను కనటం తనకు ఇష్టం లేదని చెప్పింది. నీ భర్త కూడా అలాగే అభిప్రాయపడుతున్నాడా?” అని అడిగాను.

“అంతే కాదు అబార్షన్ చేసేటప్పుడు తనకు తోడుగా భర్త ప్రదీప్ కూడా రావాలని చెప్పాను.”  కానీ ప్రదీప్ ఆఫీస్ పని మీద వేరే వూరు వెళ్లాడని అతడు వచ్చే వరకు పది పన్నెండు రోజులు పడుతుందని స్నిగ్ధ చెప్పింది.ఆ అఫీషియల్ టూర్ లేకుంటే తను కూడా పక్కనే ఉండేవాడు అని చెప్పింది. స్నిగ్ధ నాకు చాలా కాలంగా తెలిసి ఉండటం వలన, ఆమె చెప్పే దానిలో అనుమానించవలసినది ఏదీ నాకు కనిపించలేదు.”

“ఓకే! మంచిది ” అని అడ్వొకేట్ తన ప్రశ్నల పద్దతిని మార్చాడు

“డాక్టర్ బెహరా!” ఇంతకుముందు ఇలాంటి కేసు ఏదైనా మీ దగ్గరకు వచ్చిందా?’

“నో! లేదు”

“స్నిగ్ధ చెప్పిన కారణం సరి అయినదే అని, నిజమే అని  మీరు అనుకుంటున్నారా?

“నో సర్ ! నో ఐడియా!”

“ఒక డాక్టర్ గా ఇలాంటి కేసు మీరు ఎప్పుడూ వినలేదు ఎక్కడా చదవలేదు. అంతేనా?”

“ఇప్పటివరకూ నా అనుభవం లోకి రాలేదు”

“ఇదేమైనా ఒక రకమైన మెంటల్ ఇంబ్యాలన్సు వలన జరిగింది అనువైకోవచ్చా? మీ అభిప్రాయం ఏమిటి?” అడ్వొకేట్ కాస్త మిస్చీవియస్  గా ప్రశ్నించాడు

“నా కెలా తెలుస్తుంది. నేను గైనకాలాజిస్ట్ ను కానీ సైక్రియాటిస్టు ను కాను”

అడ్వొకేట్ తన క్రాస్ ఎక్సమినేషన్ ముగించి అడ్వొకేట్ చౌదరి వంక తిరిగి ” మీరేమైనా ప్రశ్నించాలి అనుకుంటే ప్రశ్నించవచ్చు” అన్నాడు

చౌదరి డాక్టర్ బెహరా వంక చూస్తూ “అబార్షన్ చేయడం చట్ట విరుద్ధం కాదు కదా” అన్నాడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నట్టు కాక ప్రశ్నిస్తున్నట్టు.

“అవును. చట్ట విరుద్ధం కాదు” డాక్టర్ బెహరా కూడా అదే టోన్ లో చెప్పింది

“మీరు ప్రాక్టీస్  ప్రారంభించి కొద్ది కాలమే అయింది. ఇలాంటి కేసు ఏదీ మీ అనుభవం లోకి రాలేదు.  కానీ భవిష్యత్తు లో ఏవైనా ఇలాంటి కేసులు వచ్చే అవకాశం ఉన్నది అని మీరు అనుకుంటున్నారా?” చౌదరి కొంత క్యూరియాసిటీ, కొంత వూహ కలగలసిన స్వరం తో అడిగాడు.

“నిజం చెప్పాలి అంటే నాకు ఎలాంటి ఐడియా ఈ అంశం మీద లేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ కేసు” అన్నది డాక్టర్ బెహరా

” కొద్దిగా అయినా సరే, తాత్కాలికమైన న్యూరోటిక్ డిజార్డర్ ఏమైనా మీకు కనిపించిందా?”

“లేదు. ఆమెను నేను చాలా థరో గా పరీక్షించాను. అబార్షన్ కి ముందు తరువాత కూడా! ఇందాక మీకు  చెప్పినట్టు మేమిద్దరమూ మంచి స్నేహితులం కూడా! అలాంటి  డిజార్డర్ ఏమీ లేదు” సానుభూతి నిండిన గొంతు తో చెప్పింది బెహరా

“చివరి ప్రశ్న డాక్టర్ బెహరా! ఆమె అబార్షన్ కోసం చెప్పిన కారణం సరియైనదే  అని మీరు నమ్ముతున్నారా? “

“బహుశా! సరి అయినది కాక పోవచ్చు. ఏది ఏమైనా నేను ఆమె భర్త ను పిలిచి మాట్లాడి ఉండవలసింది”

“మీరిక వెళ్ళవచ్చు!” అని బెహరా కి చెప్పి జడ్జ్ గారి వంక తిరిగారు అడ్వొకేట్ చౌదరి.

 “యువర్ హానర్! స్నిగ్ధ తన భర్త కు తెలియకుండా అబార్షన్ చేయించుకుంది. విడాకులు మంజూరు చేయడానికి ఈ కారణం చాలు. ఆమెకు మతిస్థిమితం లేదు అన్న విషయాన్ని గౌరవనీయ కోర్ట్ విస్మృతి లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆమెను పరీక్షించిన ఇద్దరు డాక్టర్లు ఆమెలో ఎలాంటి అబ్ నార్మల్ ప్రవర్తనా లేదని కచ్చితంగా చెప్పారు. ఆమెకు మతి స్థిమితం లేదు అన్న ఆరోపణ ను సబ్ స్టాంషియేట్ చేయడానికి ఎలాంటి ఆధారమూ లేదు. ఒక అసాధారణ సంఘటన జరిగినప్పటికీ, ఆమె చెప్పిన దాని ప్రకారం అలా జరగడానికి  అవకాశం వున్నది అన్న విషయాన్ని మనమెందుకు తోసిపుచ్చాలి?”

అడ్వొకేట్ చౌదరి మాటలు విని కొంతమంది ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు నిశ్శబ్దంగా

ప్రదీప్ అడ్వొకేట్ ” మిస్ట్రెస్ మిశ్రా మీరు రండి? ” అన్నాడు స్నిగ్ధ వంక చూస్తూ. స్నిగ్ధ లేచి మెల్లగా వచ్చి “అంతా నిజమే చెప్తాను. నిజం తప్ప మరేదీ చెప్పను ” అని ప్రమాణం చేసింది.

“మీ వైవాహిక జీవితం ఎలా వుంది? మీ భర్త తో ఏమైనా గొడవలు ఉన్నాయా?”

” లేదు. ప్రదీప్ చాలా మంచివాడు” ఆ మాట చెప్తూ ప్రదీప్ వంక చూసింది స్నిగ్ధ. ఆమె చూడగానే తన చూపులు తిప్పేసుకున్నాడు ప్రదీప్ భార్యను  చూడటం ఇష్టం లేనట్టుగా!

“మీరు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు మీకెలా అనిపించింది?”

“నా మనసు ఆనందం తో ఉప్పొంగింది. మా అత్తగారికి నేను చెప్పేలోగానే ఆమె కనిపెట్టేసింది. ఆమే ప్రదీప్ కి చెప్పింది. ఇంట్లో అందరం

 ఒక పండుగ వచ్చినట్టు సంతోషంగా ఫీల అయ్యాము. ఆ రాత్రి నేను మా అమ్మకి వుత్తరం రాశాను.” ఈ మాటలు చెపుతున్నప్పుడు ఒక అసాధారణమైన కాంతి ఏదో  స్నిగ్ధ మొహం మీద తారాడింది.

“బావుంది. మరి అబార్షన్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు మీరెందుకు ప్రదీప్ మిశ్రా కి చెప్పలేదు?”

“అబార్షన్ కి అతడు ఒప్పుకోడు”

“మీరు అతడికి చెప్పి ఉండవలసింది. ఎంతైనా తండ్రి కదా!”

“నాకు వేరే దారి లేకపోయింది.” స్నిగ్ధ గొంతు స్థిరంగా వుంది. ఆ మాట చెప్తూ ఆమె తన తల్లి తండ్రుల వంక చూసింది. వాళ్ళు తలలు నేలకు  వాల్చుకుని నేల  మీది రాసినదానిని చదువుతున్నట్టు కూర్చుని వున్నారు.

“మీ భర్త ప్రదీప్ మీకు ఏవేవో భ్రమలు, హాలూసినేషన్స్ ఉన్నట్టు చెప్పారు. కొంచెం మొరటుగా చెప్పాలి అంటే మీకు పిచ్చి పట్టింది అని ఫిర్యాదు చేసారు. అతడా అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి దారి తీసిన ఆ సంఘటన గురించి కోర్ట్ వారికి మీరు వివరిస్తారా?”  

“ప్రదీప్ కి అంతా చెప్పాను నేను”

“కానీ ఈ కోర్ట్ మీ ద్వారా వినాలి అనుకుంటోంది”

స్నిగ్ద మాట్లాడటానికి ముందు ఒకసారి కోర్ట్ హాల్ అంతా కలయ చూసింది. ఆ తరువాత ఒక్కొక్క మాటా కూడదీసుకుంటున్నట్టు మెల్లగా చెప్పసాగింది.

“గత సంవత్సరం జూన్ 5 వ తేదీన ఇది జరిగింది. మా అత్త గారు ఇంట్లో లేరు. మా ఆడపడుచు ఇంటికి వెళ్లారు. ప్రదీప్ క్లబ్ హౌస్ లో డిన్నర్ ప్రోగ్రాం వున్నది అని బయటకు వెళ్ళాడు. ఇంట్లో నేను మా మామయ్య గారు ఇద్దరమే వున్నాము. ఇద్దరం కలసి భోజనం చేసాము. నాకు కళ్ళ మీదకు నిద్ర ముంచుకు రావడం తో ప్రదీప్ కాస్త ఆలస్యంగా వస్తాడు కనుక ఇంటి ముందు తలుపు తీసి ఉంచమని  పనివాడికి చెప్పి బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాను. ఇలా పక్క మీద వాలానో లేదో అలా నిద్ర లోకి జారుకున్నాను. హఠాత్తుగా మధ్య రాత్రి ఒక చిన్న పసిపాప గొంతు వినిపించింది.

 “అమ్మా! అమ్మా!” అని పిలుస్తున్నట్టు. నేను నిద్రలోంచి లేచాను. అప్పుడు సరిగ్గా ఒకటిన్నర అయింది. పక్కన పడుకున్న ప్రదీప్ సన్నగా పెడుతున్న గురక  తప్ప మరే శబ్దమూ వినిపించలేదు”

అడ్వొకేట్ కలుగజేసుకుని ” ఆగండి. ఆగండి  అప్పుడు ఒకటిన్నర అయింది అని మీకెలా తెలిసింది?”  అన్నాడు

“మంచం పక్కనే వున్న చిన్న గడియారం లో చూసాను”

“ఓహ్! కంటిన్యూ చేయండి!”

” ఆ రోజు పౌర్ణిమ. చల్లటి గాలి రావడం కోసం రెక్కలు తీసి వుంచిన కిటికీ లో నుండి వెన్నెల దూసుకుని వచ్చి గదిని దేదీప్యమానం చేస్తున్నది.  ఒక రకంగా గది  వెన్నెలలో స్నానం చేస్తున్నట్టు వున్నది.

 “అమ్మా! అమ్మా!” అని ఆ గొంతు మళ్ళీ పిలిచింది. ఒక్క క్షణం పాటు నాకేమీ అర్ధం కాలేదు. లేచిపక్క మీద అలాగే కూర్చున్నాను. వెన్నెలలో అంతా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గదిలో నేను ప్రదీప్ తప్ప మరెవరూ లేరు.”

“అప్పుడే తెలిసింది నాకు”

“అమ్మా! అమ్మా! అన్న పిలుపు నా లోంచి వస్తున్నదని. ఒక్క క్షణం పాటు భయం కలిగింది నాకు. నా లోపలి నుండి ఎవరో పిలుస్తున్నారు చాలా మెత్తటి,మృదువైన, మార్మికమైన స్వరం తో! నా లోపల ప్రాణం పోసుకున్న జీవం అంతా స్వరం గా మారి నన్ను పిలుస్తోంది.”

“నా కూతురు”

“నా కూతురు నన్ను పిలుస్తోంది”

ప్రదీప్ అడ్వొకేట్ ఆమె వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ “కూతురు అని మీకెలా తెలిసింది?” అని అడిగాడు.

స్నిగ్ధ చాలా నమ్మకంగా గట్టిగా చెప్పింది.

“నాకు తెలుసు. నా కూతురే! అందులో సందేహం లేదు. అంత మెత్తగా మృదువుగా వుండే స్వరం కచ్చితంగా ఆడపిల్లదే ! జరుగుతున్న సంఘటన పట్ల నాకు ఆశ్చర్యం తో పాటు భయం కూడా కలిగింది. ఆ స్వరం నన్ను మెల్లగా బతిమిలాడింది. “అమ్మా! దయచేసి నన్ను ఈ లోకం లోకి తీసుకుని రావద్దు. పుట్టినప్పటి నుండీ మరణించేవరకు, నేను అస్తిత్వం లో వున్న  ప్రతి క్షణం నెత్తురోడేలా నన్ను చేయవద్దు”

స్నిగ్ధ ఒక్క క్షణం పాటు ఊపిరి తీసుకోవడానికి ఆగింది. ఆమె నుదుటి మీద అలుముకున్న చెమట ఆమె హృదయం లో కలుగుతున్న సంచలనాన్ని చెప్పకనే చెపుతున్నది.

“సరిగ్గా ఆ క్షణం లో నేను ఆమెను చూసాను. కిటికీ లో నుండి పడుతున్న వెన్నెల  ప్రవాహం లో తేలుతూ ఆమె వచ్చింది”.

“చెప్పమ్మా! ఈ లోకం లో నాలాంటి ఆడపిల్లలు నిర్భయంగా ఉండగల స్థలం ఏదైనా ఉన్నదా? ఎంత దయనీయమైన అభ్యర్ధన అది! నా కళ్ళనుండి నీళ్లు ధారాపాతంగా వర్షించసాగాయి. గదిలో ఉన్న  ప్రతి అంశమూ, మసకమసకగా అలుక్కుపోయినట్టుగా కనిపిస్తున్నాయి. ఆ గది , నాలుగు గోడలు, కిటికీ లోనుండి పడుతున్న వెన్నెల, ప్రదీప్ తో సహా అన్నీ క్షణం లో అదృశ్యమైపోయాయి. కేవలం ఆ చిన్న పాప మాత్రమే నా ఎదురుగా నిల్చుని ఉన్నది. నేనా చిన్న పాప ను   స్పష్టంగా చూడలేకపోయాను. కానీ కచ్చితంగా తను  నా కూతురే!  

నేనిక ఎంతమాత్రమూ ఆగలేకపోయాను. నా బిడ్డను దగ్గరకు తీసుకుని మనసారా ముద్దాడాలని వుంది. ఆ చిన్నిచిన్ని కళ్ళను. ఆ లేలేత చేతులను, ఆ మంజులమైన పెదవులను స్పశించాలని వుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు కలిగిన ఆనందం అంతా ఆవిరి అయిపొయింది.ఎందుకిలా ఈ చిన్న పాప ఇలా మాట్లాడుతోంది అన్న ప్రశ్న నన్ను వెంటాడింది. నేను చేతులు పాప వంక సాచి ” రా ! పాపా రా!” అని తన్యత తో అయినా సరే చాలా మార్దవంగా పిలిచాను.”

“కానీ పాప అక్కడనుండి కదలలేదు. కనీసం మాట్లాడలేదు. వెన్నెల వెండి ప్రవాహం లో నేనప్పుడు చూశాను ” స్నిగ్ద మాటలు రానట్టు కాసేపు ఆగింది. ఆమె శరీరం అణువణువూ వణికిపోతోంది. మాటలు తడబడుతున్నాయి.

” ఏం  చూశారు  మీరు?” స్పష్టంగా చెప్పండి అడ్వొకేట్ ఉత్కంఠత భరించలేనట్టు అడిగాడు

“నా చిన్న పాప కళ్ళనుండి కన్నీళ్లు ప్రవాహంలా దూకడాన్న్ని  చూసాను నేను. నా దగ్గరకు రావాలి అనుకునీ  రాలేకపోవడాన్ని చూసాను. చేతులు లేపలేకపోతున్నది. పెదవులు వణుకుతున్నాయి. బహుశా తను  ఏదో  నాకు చెప్పాలి అనుకుంటున్నది. కానీ పదాలు ఏవీ తన నోటి నుండి బయటకు రావడం లేదు. పాప వంక నేను చూస్తూ ఉండగానే, పాప కళ్ళ నుండీ, ముక్కు నుండీ, బుగ్గలనుండీ, చేతులు, కాళ్ళు ఇలా ప్రతి అణువు నుండీ భయం గొలిపేలా నెత్తురు ఎగజిమ్మింది. నెత్తుటి జలపాతం లో పాప మునిగిపోతున్నట్టు వుంది. నేను గట్టిగా అరవడానికి ప్రయత్నం చేసాను. కానీ గొంతు పైకి పెగలడం లేదు. అందరినీ లేపి చెప్పాలి అనుకున్నాను. కానీ అక్కడ ఎవరూ లేరు. నెమ్మదిగా నెత్తురు లో నానిన నా బిడ్డ రూపం మెల్లగా అదృశ్యం అయింది

 నేను మళ్ళీ వెనక్కు నా గది లోకి, నా స్పృహ  లోకి వచ్చాను. అంతకుముందు ఎలా వుందో అంతా అలాగే వుంది. ప్రదీప్ అటువైపు తిరిగి  పడుకున్నాడు, నేనంతా చెమటతో తడిసి ముద్దయిపోయాను. నా భర్తను నిద్ర లేపి జరిగింది అంతా చెప్పాలి అనుకున్నాను.

కొద్దీ క్షణాల తరువాత నేను మనసు మార్చుకున్నాను. నేను నిద్ర లేపి చెప్పినా “అదొక పీడ కల ” అని అతడు కొట్టిపారేస్తాడు. పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా నిద్ర పొమ్మని సలహా ఇస్తాడు. అంతకు మించి ఏమీ జరగదు. “అందుకే నేను మౌనంగా మంచం మీద అలాగే పడుకున్నాను. దడ దడ  లాడుతున్న గుండెను దిండుకు అదిమిపెట్టి పడుకున్నాను. కొద్దీ క్షణాల తరువాత ప్రదీప్ లేచి మంచినీళ్లు తాగి మళ్ళీ పడుకున్నాడు. అప్పటికి నేను లేచిఉన్నాను అన్న విషయం  ప్రదీప్ కి తెలియదు. నెమ్మదిగా తూర్పు రేకులు విచ్చుకుని ఉదయం వచ్చేసింది. మా ఇంటి పక్కనే ఉన్న  చెట్టుమీద పక్షులు గోలగోల గా శబ్దాలు చేయసాగాయి, అప్పటికి  నేను ఒక స్థిర నిర్ణయానికి వచ్చి మనసును గట్టిపరచుకున్నాను.”

స్నిగ్ద మాట్లాడటం ఆపి కోర్ట్ హాల్ అంతా కలయచూసింది. అందరి కళ్ళూ  అపనమ్మకం తో వెడల్పు అయి ఆమె వంకే చూస్తున్నాయి. ఆమె తల్లి తండ్రులు ఇంతకుముందు లాగే  తమ చూపులను భూమిలోకి పాతేసి మరింత కిందకు వంగి కూర్చుని వున్నారు. ప్రదీప్, అతడి స్నేహితులు నిశ్శబ్దంగా కూర్చుని వున్నారు. వాళ్ళు కూడా నేల  చూపులే చూస్తున్నారు. ఒక అపనమ్మకం, ఒక బాధ కోర్ట్ హాల్ అంతా వేలాడుతున్నట్టు అనిపించింది.

అప్పుడు ప్రదీప్ అడ్వొకేట్

 ” సో! ఇదంతా మీరు కావాలనే చేసారు. ఉద్దేశ్య పూర్వకంగా పాప ప్రాణాన్ని బలితీసుకున్నారు. పాప అభ్యర్ధించింది మీరు చేశారు. అంతేనా? రేపు ఎప్పుడైనా మీ తల్లి తండ్రులు కూడా ఇలాంటి అభ్యర్ధనే చేస్తే మీరు వాళ్ళను కూడా చంపేస్తారా? ” అని గద్దిస్తున్నట్టు ప్రశ్నించాడు.

“లేదు! నేను మనుషులనుఁ హత్య చేసేంత కఠినాత్మురాలిని కాను. మీరు నన్ను హంతకిని చేయాలని చూస్తున్నారు. కానీ మీకేం తెలుసు నేను నా పాప ని ఎంత ప్రేమించానో!పాప  బాధలో వున్నదని మీకు చెప్పాను. భరించలేని బాధ అది. ఆ బాధ నుండి పాపను విముక్తి కలిగించడానికి నేనేమి చేయగలను?నా కెవరూ సహాయం రారు. అంత బాధను పాప ఎందుకు భరించాలి? ఆ బాధకు బాధ్యత ఎవరు తీసుకుంటారు? నిజంగా ఆ పాప లేలేత చిగురాకు పాదాలు మోపడానికి కావలసిన రవ్వంత స్థలం సురక్షితమైన స్థలం ఈ భూమ్మీద ఉన్నదా? ఆ పాపను ఈ లోకం లోకి తీసుకుని వచ్చి చిత్ర హింసల పాలు చేయడానికి నాకేమి హక్కువున్నది? “

ఆమె తనలో తాను మాట్లాడుతుంటే ఆ మాటలు మెల్లగా ఉండి  సరిగ్గా వినపడటం లేదు. ఎవరో అదృశ్య వ్యక్తి అక్కడ ఉన్నట్టు, ఆమె చూపులు ఆ అదృశ్యవ్యక్తి మీద నిలిచినట్టు వున్నాయి

“కానీ మీరు మాతృత్వం మీద, దాని పవిత్రత మీద దారుణమయిన దాడి చేశారు” అన్నాడు ప్రదీప్ అడ్వొకేట్ దీర్ఘ నిశ్వాస విడచి.

స్నిగ్ధ అడ్వొకేట్ మొహం లోకి సూటిగా చూస్తూ “నేను మాతృత్వాన్ని అర్ధం చేసుకోవడానికీ, గౌరవించడానికి ప్రయత్నం చేశాను” అన్నది చాలా కాన్ఫిడెంట్ గా

“అబార్షన్ అనేది లీగలైజ్ కాకపోతే, చట్టబద్దం కాకపోతే బహుశా మీరీ నిర్ణయం తీసుకునవారు కాదు అనుకుంటాను” అన్నాడు అడ్వొకేట్ చాలా సేపు ఆలోచింది తన క్లయింట్ ని సపోర్ట్ చేయడానికి  తీసిన తన చివరి అస్త్రం లా

“కొన్ని వందల  సంవత్సరాలు వెనక్కు వెళ్లినా, నేనిలాగే చేసి ఉండేదానిని” అన్నది స్నిగ్ధ స్థిరంగా

కోర్ట్ హాల్ మొత్తం మాట రానట్టు నిశ్శబ్దంలో మునిగిపోయింది  

                                                     *******

పరమిత శతపథి
వంశీకృష్ణ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *