ఆరబ్బీ

Spread the love

ఒక చివరన మూసివేయబడినట్టుండే ఆ నార్త్ రిచ్మండ్ వీధి, ‘క్రిస్టియన్ బ్రదర్స్ బాయ్స్ స్కూల్’ తమ పిల్లలను వదిలిపెట్టినప్పుడు తప్ప మిగిలిన సమయంలో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. వీధి చివరన చతురస్రపు స్థలంలో ఇరుగుపొరుగుతో సంబంధం లేనట్టుగా ఖాళీగా, నిర్మానుష్యంగా ఒక రెండంతస్తుల భవనం ఒంటరిగా నిలబడ్డట్టు ఉంది. వీధిలోని ఇళ్ళన్నీ వాటిల్లో పద్దతిగా బతికే మనుషులు నివసిస్తున్నారనే స్పృహతో ఉన్నట్టుగా ముదురుగోధుమ రంగు ముఖాలతో, ప్రశాంతంగా ఒకదాన్నొకటి చూసుకుంటున్నాయి.

మా ఇంట్లో ఇంతకుముందు అద్దెకున్న పాస్టర్, వెనకవైపున్న డ్రాయింగ్ రూమ్ లో చనిపోయాడు. ఆ గది చాలాకాలంగా తెరవకపోవడం వల్ల గాలి ఆడక, దుమ్ముకొట్టుకుపోయి, పాతగాలి ‘ముక్క’ వాసన కొడుతోంది. అన్ని గదుల్లోనూ అదే గాలి నిండిపోయి ఉంది. కిచెన్ వెనకున్న స్టోర్ రూమ్, పనికిరాని పాత పేపర్లతో నిండిపోయి చిందరవందరగా ఉంది. బాగా తడిసిపోయి, కాగితాలు ముడుతలుపడిన మూడు పుస్తకాలు ఆ పేపర్ల మధ్యన దొరికాయి నాకు. అవి- వాటర్ స్కాట్ రాసిన ‘ది అబాట్’, ‘ది డివౌట్ కమ్యూనికెంట్’, ‘ది మెమాయిర్స్ ఆఫ్ విడాక్’. చివరి పుస్తకంలోని పేజీలు పసుపురంగులో ఉండడం వల్ల కాబోలు, అది నాకు బాగా నచ్చింది. ఇంటి వెనక అడ్డదిడ్డంగా ఎదిగిన పెరడు మధ్యలో ఒక యాపిల్ చెట్టు, అస్తవ్యస్తంగా పెరిగిన గుబురుపొదలు ఉండేవి. చనిపోయిన పాస్టర్ తాలూకు తుప్పుపట్టిన సైకిల్ పంపు ఒక పొదకింద దొరికింది. దానగుణమున్న దయామయుడు ఆయన. తన డబ్బు మొత్తం విద్యా సంస్థలకూ, ఫర్నిచర్ మాత్రం వాళ్ళ చెల్లికి చెందేలా వీలునామా రాసి పోయాడు.

పగటి సమయం తక్కువుండే శీతాకాలపు రోజులు వచ్చేసరికి మేము ఇంకా రాత్రి భోజనం చేయకముందే చీకట్లు భళ్ళున కమ్ముకునేవి. మంగన్, నేనూ వీధిలో కలుసుకునేటప్పుడు ఇళ్ళన్నీ చీకటి ముసుగు తొడుక్కున్నట్టు నిశ్శబ్దగంభీరంగా ఉండేవి. మా పైన అనంతాకాశం అనుక్షణం ఊదారంగులో అనేక ఛాయలు మారుస్తూ కనిపించేది. వీధిదీపాలు ఆకాశం మీదకు తమ మసకకాంతిని ప్రసరించే ప్రయత్నం చేస్తుండేవి. చలిగాలి గుచ్చుకుంటున్నా పట్టించుకోకుండా మా దేహాలు వెచ్చబడేంత వరకూ ఇద్దరం ఆడుకునేవాళ్ళం. నిశ్శబ్దం నిండిన ఆ వీధి మొత్తం మా అల్లరికేకలతో ప్రతిధ్వనించేవి.

మా ఆటల ప్రస్థానం- మమ్మల్ని ఆ ఇళ్ల వెనకు చీకట్లో బురదమయమైన మట్టిగల్లీలను దాటించి, అడ్డొచ్చే కరకు ఆటవిక సమూహాల కుటీరాల్లోంచి సాహసోపేతంగా ఉరికించి, వానకు తడిసాక నీటిబింధువులు రాలుస్తున్న దట్టమైనతోటల వెనుకున్న తలుపుల వరకూ నడిపించి, బూడిద కుప్పల్లోంచి పైకి లేస్తున్న పల్చటి పొగల మధ్యగుండా పయనించి, గాఢదుర్గంధాన్ని వెదజల్లే గుర్రపు గరిడీల వరకూ తీసుకొచ్చి చేర్చేది. అక్కడున్న గుర్రాల ట్రైనర్ తన గుర్రాన్ని సుతారంగా శుభ్రం చేసి, దాని జుట్టుని ప్రేమగా దువ్వుతూనో, దాని జీను పట్టీల గంటలను కదిలించి సంగీతాన్ని వినిపిస్తూనో కనిపించేవాడు.

మళ్ళీ మేం మా వీధిలోకి తిరిగొచ్చేసరికి, కిచెన్ కిటికీలలోంచి వచ్చే వెలుతురుతో పరిసరాలన్నీ  ప్రకాశవంతంగా ఉండేవి. మా మామయ్య గాని వీధిమలుపు దగ్గర్నించి వస్తూన్నట్లు కనిపిస్తే, ఆయన జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళేవరకూ మేము చీకట్లో నక్కినక్కి దాక్కునేవాళ్లం. ఒకవేళ ‘మంగన్’ వాళ్ల అక్క గాని తమ్ముణ్ణి టీ తాగడానికి పిలవడం కోసం గుమ్మం బయటకొచ్చి నిలబడితే, మేము ఆ చీకటినీడల్లోనే  దాక్కుని అమె వీధంతా ఎగాదిగా ఎలా చూస్తుందో గమనించేవాళ్లం. ఆమె ఇంట్లోకి వెళ్ళిపోతుందా లేక బయటే నిలుబడిపోతుందా అని కాసేపు చూసేవాళ్లం. ఆమె అలాగే ఉండిపోతే మాత్రం ఇక మేము అనివార్యంగా ఆ చీకట్లోంచి బయటకొచ్చి మంగన్ వాళ్ళ ఇంటి అరుగు దాకా వెళ్ళేవాళ్లం. ఆమె మాకోసం అలాగే ఎదురుచూస్తూ నిలబడి ఉండేది. సగం తెరిచిన తలుపులోంచి బయటకు చిమ్మే కాంతిలో ఆమె సౌష్టవం నాకు స్పష్టంగా తెలిసేది. మంగన్ ఎప్పుడూ ఆమెను కాసేపు ఆటపట్టించాకే లోపలికి వెళ్ళేవాడు. అందాకా నేనామెనే తదేకంగా చూస్తూ రెయిలింగ్ దగ్గరే నిలబడిపోయేవాణ్ణి. ఆమె అటుఇటూ కదులుతున్నప్పుడు తన డ్రెస్సుతో పాటు, తాడులాంటి జడ కూడా అటూఇటూ ఊగుతూ ఉండటం గమనించేవాణ్ణి.

నేను ప్రతీ ఉదయం మా ఇంట్లో ముందుగదిలో నేలమీద పడుకుని ఆమె గుమ్మం వైపు చూస్తూ వుండేవాణ్ణి. కిటికీ తెరని పూర్తిగా కిందికి దించి- అట్నుంచి నేనామెకి కనబడకుండా ఒక అంగుళం సందు మాత్రం వదిలేవాణ్ణి. ఆమె వాళ్ళ గుమ్మంలోకి రాగానే నా హృదయం తుళ్ళిపడేది. వెంటనే హాల్లోకి పరుగెత్తి బుక్స్ తీసుకుని ఆమెని అనుసరించేవాణ్ణి. ఆమె గోధుమవర్ణాకృతి ఎప్పుడూ నా కళ్ళల్లో నింపుకునే ఉండేవాణ్ణి. మా ఇద్దరి బాటలు వేరయ్యే మలుపు వస్తుందనగా గబగబా నడిచి ఆమెను దాటేసేవాణ్ణి. ప్రతీ ఉదయం ఇదే తంతు.

ఒకట్రెండు మామూలు పలుకులు తప్ప ఆమెతో నేరుగా ఎప్పుడూ మాట్లాడింది లేదు. అయినా ఆమె పేరు వినగానే నా అమాయకపు రక్తం ఏదో ఆదేశం అందుకున్నట్టు ఉరుకులు పెట్టేది.

ప్రేమ తలపులకి అనువుగా లేని చోటుల్లో కూడా ఆమె రూపం నాకు తోడుగా ఉంచుకునేవాణ్ణి.  శనివారపు సాయంత్రాలు మా అత్తమ్మ సంతకెళ్ళేటప్పుడు సంచులు మోయడానికి నేనూ ఆమెతో వెళ్ళాల్సొచ్చేది. కిటకిటలాడే సంత వీధుల్లో నడుస్తూ- తాగుబోతు మగాళ్ళనూ బేరమాడే ఆడవాళ్లను తోసుకుంటూ, హమాలీల బండ బూతులూ వినుకుంటూ, మాంసపుకొట్ల ముందు పంది తలకాయలు చేత పట్టుకుని పదేపదే అరుస్తూ రేట్లు చెబుతున్న కుర్రాళ్ళును దాటుకుంటూ, నాసిక స్వరాలతో ‘రండి… వినండి’ అంటూ స్థానిక సమస్యల గురించో ’డోనవాన్ రోస్సా’ గురించో ఆలపించే జానపద వీధిగాయకుల పాటలను వినుకుంటూ- మునుముందుకు సాగిపోయేవాళ్ళం. ఈ కలగాపులగపు శబ్దాలన్నీ కలగలసిపోయివినిపించే ఏకధ్వని నాకొక జీవనరవళిగా తోచేది. మనసులో ఆమె తలపులని మోసుకుంటూ, శత్రుసమూహం మధ్యలోంచి ఒక పవిత్ర కలశాన్ని భద్రంగా మోసుకెళ్తున్న వీరుడిలా నన్ను నేను ఊహించుకునేవాణ్ణి. అలాంటి అద్భుతక్షణాల్లో నా ప్రార్థనల్లో, దైవస్తుతుల్లో హఠాత్తుగా అమె పేరు నా పెదాలమీంచి ఎందుకు దూకేదో నాకు అస్సలు అర్థమయ్యేది కాదు.     

కారణం చెప్పలేను గాని, ఆమె ఊహల ఉద్వేగంతో నా కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయేవి. కొన్నిసార్లైతే హృదయంలోంచి ఒక ఉప్పెన దానంతటదే పొంగిపొరలి ఉర్రూతలూగుతూ నా ఛాతీలోకి ప్రవహిస్తున్నట్టు అనిపించేది. భవిష్యత్తు గురించి నేనెప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. ఎప్పటికైనా ఆమెతో మాట్లాడగలనా లేదా, ఒకవేళ మాట్లాడితే నా అయోమయ ఆరాధనను ఆమెకి అర్థమయ్యేలా ఎలా వివరించాలి అని  సతమతమయ్యేవాణ్ణి. నా దేహమంతా ఒక వీణలా మారిపోయినట్టూ, ఆమె మాటలూ కదలికలూ వేళ్ళలా మారి దాని తంత్రులమీద పరువులిడుతున్నట్టూ అనిపించేది.

ఒక సాయంత్రం, పాస్టర్ చనిపోయిన ఆ డ్రాయింగ్-రూం లోకి వెళ్లాను. ఇల్లంతా నిశ్శబ్దం నిండిన ఒక చీకటి వర్షపు సాయంత్రం అది. పగిలిన అద్దం సందులోంచి భూమిని తాకుతున్న వాన శబ్దం, తడిసిన తోటలాంటి నేలను మెత్తటి సూదులతో గుచ్చుతున్నట్టు చినుకుల సవ్వడి వినిపించాయి. దూరంగా ఎక్కడో- అది  దీపమో, కిటికీ వెనకున్న వెలుగో- మసకగా మెరుస్తూ కనిపించింది. ఏది స్పష్టంగా కనిపించకపోవడం నాకు ఊరటనిచ్చింది. ఆక్షణంలో నా సకల జ్ఞానేంద్రియాలూ ముసుగేసుకున్నట్టు మూసుకుపోవాలని తహతహలాడాయి. ఏక్షణమైనా వాటిల్లోంచి నేను బయటకు దూకేస్తానని అవి అనుకున్నాయి. నా రెండుచేతులను కలిపి గట్టిగా పట్టుకుని అరచేతులను వణుకు పుట్టేంతగా  రుద్దుకుంటూ ‘ఓ ప్రేమా! ఓ ప్రేమా! అని గొణుక్కున్నాను… చాలాసార్లు.

చివరికోసారి ఆమె నాతో మాట్లాడింది!

మొదటిసారి ఆమె నన్ను ఉద్దేశించి మాట్లాడినప్పుడు నేను చాలా తికమకపడ్డాను. తిరిగి ఎలా జవాబు చెప్పాలో కూడా నాకర్థం కాలేదు. ‘నువ్వు ‘అరబీ’కి వెళ్తున్నావా?’ అని అడిగిందామె. అవునని చెప్పానో కాదని చెప్పానో నాకు గుర్తులేదు. అదొక అద్భుతమైన బజారు అనీ, తనకు కూడా అక్కడికి వెళ్ళాలనుందనీ ఆమె చెప్పింది.

‘మరి వెళ్ళొచ్చు కదా?’ అని అడిగాను నేను.

తన మణికట్టుకున్న గాజుని మెల్లగా, గుండ్రంగా, తిప్పుతూతిప్పుతూ… ‘ఆ వారం వాళ్ళ కాన్వెంట్‌లో ఒక ఆధ్యాత్మిక శిబిరం జరుగుతుంది కాబట్టి తాను వెళ్లలేనని’ ఆమె చెప్పింది. ఆ సమయంలో ఆమె తమ్ముడు మంగన్ టోపీల కోసం ఇంకో ఇద్దరు అబ్బాయిలతో గొడవపడుతుండటం వల్ల గేటు దగ్గర నేనొక్కణ్ణే ఉన్నాను. ఆమె రెయిలింగ్ ఊచను ఆసరాగా పట్టుకుని, తలను కొంచెం నా వైపు వంచి నిలబడింది. ఎదురుగా ఉన్న గుమ్మంలోంచి దీపపు వెలుగు ఆమె తెల్లని మెడవొంపు మీద పడి, ఆమె కేశాలను ప్రకాశింపజేసి, కాసేపు అక్కడే దోబూచులాడి, నెమ్మదిగా కిందకి రాలుతూ కులాసాగా ఊచను పట్టుకున్న ఆమె వేళ్ళను వెలిగించి, ఆమె వేసుకున్న స్కర్ట్ మీద ఒకవైపుకు పడి, దాని మీదున్న తెల్లటి బోర్డర్ని ఆవిష్కరించింది.

‘అరబ్బీ కి నువ్వెళ్ళు, నీకు నచ్చుతుంది’ అందామె.

‘నేను వెళ్తే, నీ కోసం ఏదోటి తెస్తాను’ అన్నాన్నేను.

ఆమెతో మాట్లాడిన ఆ సాయంత్రం తర్వాత, నాకు మెలకువలోనూ నిద్రలోనూ వచ్చే మంచి ఆలోచనలని ఎన్ని అర్థంలేని ఆశలు ఎంతలా చెడగొట్టాయో! ఈ రోజుకూ- అరబీ బజార్‌ వెళ్ళే ఆ రోజుకూ- మధ్యలో అడ్డుగా ఉన్న ఈ నిరాసక్త రోజులు ఠక్కున అంతమైపోతే బావుండు అని ఎంత తపించానో! బడికి వెళ్ళాలంటే ఎంత అసహనం కలిగేదో! పగలు తరగతిగదిలో, రాత్రి పడకగదిలో నేను చదువుకోవాలని ఎంత గింజుకున్నా సరే, పజీలకూ నాకూ మధ్య ఆమె రూపం అడ్డంగా నిలబడి అటకాయించేది. అత్యంతనిశ్శబ్ద సమయాల్లో కూడా ‘అరబ్బీ’ అనే పదంలోని అక్షరాలు నన్ను పిలిచినట్టు అనిపించి నా మనసు పరవశంలో తేలిపోయేది. తూర్పున ఉన్న అరబిక్ దేశాలన్నీ ఇంద్రజాలన్ని ప్రయోగించి నన్ను వశం చేసుకున్నట్టు అనిపించేది.

శనివారం రాత్రి బజారుకు వెళ్తానని అత్తయ్యను అనుమతి అడిగాను. ఆమె ఆశ్చర్యపోయింది. రాత్రి పూట ఏదైనా రహస్యకార్యానికి వెళ్ళట్లేదు గదా అని అనుమానపడింది. క్లాస్ రూంలో కూడా నేను చాలా ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేకపోయేసరికి ప్రశాంతంగా ఉండే మా మాస్టారు మొహం గంభీరంగా మారడం  గమనించాను. నేను పనికిరాని వెధవలా తయారౌతున్నానేమో అని ఆయన అనుమానించాడు. నా ఆలోచనలన్ని అస్తవ్యస్తంగా చక్కర్లు కొడుతూ ఏకాగ్రత లేకుండా చేస్తున్నాయి. రోజూవారి దినచర్యలో అతిముఖ్యమైన పనులు చేయడానికి కూడా నాకు ఓపిక ఉండటం లేదు. అవి, నాకూ- అరబ్బీ కి వెళ్ళాలన్న నా కోరికకూ- మధ్యలో అడ్డుగా ఉన్న చిన్నపిల్లల ఆటల్లాగా, విసుగెత్తించే పిల్లచేష్టల్లాగా కనిపిస్తున్నాయి.

శనివారం ఉదయం మామయ్యతో ‘సాయంత్రం బజార్‌కు వెళ్ళాలనుకుంటున్నాను’ అని చెప్పాను. ఆయన  ‘కోట్ స్టాండ్’ దగ్గర టోపీల దుమ్ము తుడిచే బ్రష్ కోసం అసహనంగా వెతుకుతూ ‘నాకు తెలుసురా, తెలుసు’ అన్నారు. ఆయన హాల్‌లో ఉండటం వల్ల, నేను ముందు గదిలోకి వెళ్లి కిటికీ దగ్గర కూర్చుని ఆమెను చూసే అవకాశం లేకుండా పోయింది. ఇంట్లోంచి చిరాగ్గా బయటకొచ్చి నెమ్మదిగా స్కూల్ వైపు నడిచాను. చల్లగాలి ఈడ్చి కొడుతోంది. నా మనసేదో కీడు శంకిస్తోంది.

రాత్రి భోజనాల సమయానికి నేను ఇంటికి తిరిగొచ్చేసరికి మామయ్య ఇంకా రాలేదు. ఆయన రావడానికి ఇంకా టైమ్ ఉంది. కొద్దిసేపు గడియారాన్ని చూస్తూ కూర్చున్నాను. అది చేసే టిక్కు టిక్కు శబ్దం విసుగ్గా అనిపించడంతో గదిలోంచి బయటకు వచ్చి మెట్లెక్కి పైకి వెళ్ళాను. అక్కడున్న చల్లటి నిశ్శబ్ద నిర్మానుష్య ఖాళీగదులు నాకు స్వేచ్ఛని ప్రసాదించినట్టనిపించి హాయిగా పాటలు పాడుతూ గదులన్నీ తిరిగాను. కిటికీ దగ్గర నిలబడి కింద వీధిలో ఆడుకుంటున్న నా స్నేహితులను చూశాను. దూరం నుంచి వాళ్ళ అరుపులు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. చల్లటి కిటికీ అద్దానికి నుదిటిని ఆనించి చీకట్లో ఉన్న ఆమె ఇంటిని చూస్తూ ఉండిపోయాను. నిజంగా అక్కడేమీ కనబడకపోయినా, దాదాపు ఒక గంటపాటు నేను అక్కడే అలాగే చూస్తూ నిల్చుండిపోయాను. బ్రౌన్ డ్రెస్ వేసుకున్న ఆమె రూపాన్ని నా ఊహల్లో చిత్రించుకుంటూ, లాంతరు కాంతి ఆ రూపాన్ని మృదువుగా తాకుతున్నట్టూ, అమె మెడవొంపులో, చేతి పైనా, దుస్తుల అంచుల దగ్గర  ఆ కాంతి పడి మెరుస్తున్నట్టూ నేను ఊహల్లో విహరించాను.

నేను తిరిగి కిందకు వచ్చినప్పుడు, మేడమ్ మర్సర్ చలి నెగడు దగ్గర కూర్చుని ఉంది. ఆమె వాగుడుకాయ లాంటి ఒక వృద్ధ విధవరాలు. చనిపోయిన భర్త ఒక తాకట్టు వ్యాపారి. పాత స్టాంపులు సేకరించి పుణ్యకార్యాల కోసం ఉపయోగిస్తుంది. ఆమెతో కలిసి టీ తాగుతున్నప్పుడు ఆమె సొల్లు వాగుడంతా నేను భరించాల్సి వచ్చేది. ఆమెతో మాట్లాడుతూ గంటకు పైగా కూర్చుని భోజనం చేసినా, మామయ్య ఇంకా రాలేదు. అప్పుటికే ఎనిమిది దాటడంతో మర్సర్ మేడమ్ ఇక బయలుదేరతానని లేచింది. రాత్రిపూట చలిగాలిలో బయట ఉండటం తన ఆరోగ్యానికి మంచిది కాదనీ, అందుకే ఇంకాసేపు ఉండలేకపోతున్నందుకు మన్నించమనీ చెప్పింది. ఆమె వెళ్ళిపోయాక నేను పిడికిలి భిగించి గదిలోపల అటూఇటూ అసహనంగా తిరుగుతున్నాను. అది గమనించి అత్తయ్య అంది, ‘ఈ రాత్రి నువ్వు బజార్ కి వెళ్ళడం వాయిదా వేసుకోవాలని ప్రభువు తలచిన్నట్టున్నాడు.’

రాత్రి తొమ్మిది అవుతుండగా మావయ్య తాళంచెవితో హాల్ డోరు తీస్తున్న శబ్దం వినపడింది. తర్వాత ఆయన తనలో తానే గొణుక్కోవడం వినిపించింది. హాల్‌ లో ఉన్న కోటుస్టాండ్ కదిలిన శబ్దం విని దాని మీద తన బరువైన కోటును ఉంచారని అర్థమైంది. ఈ సంకేత శబ్దాలన్నీ నేను స్పష్టంగా అర్థం చేసుకోగలను. ఆయన భోజనం మధ్యలో ఉండగా నేను బజార్‌కి వెళ్ళటానికి డబ్బులివ్వమని అడిగాను. ఆయన ఆ విషయమే మర్చిపోయారు.

‘ఇప్పుడు అందరూ పడుకున్నారు, ఒక నిద్ర కూడా తీసుంటారు.’ అన్నారు.

నేను నవ్వలేదు.

అత్తయ్య మాత్రం గట్టిగా చెప్పింది:

‘వాడికి డబ్బులిచ్చి పంపేయొచ్చు కదా, ఇప్పటికే చాలా ఆలస్యం చేసారు.’

మర్చిపోయినందుకు మామయ్య నాకు సారీ చెప్పారు. ‘విజ్ఞానంతో పాటు వినోదం కూడా లేకపోతే పిల్లలకు బుద్ధిమాంధ్యం వస్తుందని’ పెద్దలు చెప్పిన మాటను తాను నమ్ముతానని అన్నారు. ఎక్కడికి వెళ్తున్నావు అని మళ్ళీ అడిగారాయన. నేను మళ్ళీ రెండోసారి చెప్పగానే ‘The Arab’s Farewell to His Steed అనే కవిత తెలుసా నీకు’ అని నన్ను అడిగారు. నేను ఇంటి బయటకు వస్తుండగా ఆయన ఆ కవిత మొదటి ఫంక్తులు అత్తయ్యకు చెప్పడం వినిపించింది.

మావయ్య ఇచ్చిన రెండు షిల్లింగుల నోటును గట్టిగా పట్టుకుని బకింగ్ హామ్ వీధి గుండా స్టేషన్ వైపు వేగంగా నడుస్తున్నాను. రకరకాల దుకాణాలతో రద్దీగా ఉన్న వీధులు, గ్యాస్ దీపాల వెలుగు చూసి నా ప్రయాణం ఉద్దేశం మళ్ళీ గుర్తు చేసుకున్నాను. ఖాళీగా ఉన్న రైలులో థర్డ్ క్లాస్ బోగీ ఎక్కి సీట్లో కూర్చున్నాను. విసుగెత్తించేంత ఆలస్యం అయ్యాక రైలు నెమ్మదిగా స్టేషన్‌లోంచి కదిలింది. శిథిలగృహాల మధ్యలోంచి, వెన్నెల్లో మెరుస్తున్న నది మీదుగా అది ప్రయాణించింది. ‘వెస్ట్‌లాండ్ రో స్టేషన్’ దగ్గర ఒక ప్రయాణికులు గుంపు మా బోగీలోకి తోసుకుంటూ వచ్చారు. కానీ, ‘ఇది బజార్ కు వెళ్ళే ప్రత్యేక రైలు’ అని పోర్టర్లు వాళ్ళని వెనక్కు తోసేసారు. ఆ ఖాళీ బోగీలో నేనొక్కడినే మిగిలిపోయాను. కొద్ది నిమిషాల్లోనో రైలు తాత్కాలికంగా కట్టిన ఒక చెక్కప్లాట్‌ఫాం పక్కన ఆగింది. బయటికొచ్చి, రోడ్డుమీద నడుస్తూ చీకట్లో  మెరుస్తున్న వాచీ డయల్ ని చూశాను. పది నిమిషాలు తక్కువ పది.

నా ఎదురుగా ఒక పెద్ద భవనం- దాని మీద మెరుస్తూ ఇంద్రజాలం లాంటి ఆ పేరు- ‘అరబ్బీ బజార్’

ఆరుపెన్నీల ఎంట్రన్స్ ఎక్కడా కనిపించలేదు నాకు. బజారు మూసేస్తారని భయమేసి, గేటు దగ్గర బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్న వ్యక్తికి ఒక షిల్లింగ్‌ ఇచ్చి, గబగబా లోపలికి వెళ్ళి పెద్ద హాల్ లోకి  ప్రవేశించాను. హాల్ సగం ఎత్తు నుంచి చుట్టూరా ఒక చెక్క గ్యాలరీ నిర్మించబడి ఉంది. దాదాపు స్టాళ్లు అన్ని మూసేయడం వల్ల హాల్ లో చీకటే ఎక్కువ ఉంది. ప్రేయర్ తర్వాత చర్చి హాల్లో ఉండే మౌనంలాంటి నిశ్శబ్దాన్ని అక్కడ గమనించాను నేను. కొంచెం సంకోచిస్తూనే బజార్ నడిమధ్యకు నడుచుకుంటూ వెళ్లాను. ఇంకా తెరిచి ఉన్న స్టాళ్ల దగ్గర మాత్రం కొంతమంది జనం గుమిగూడి ఉన్నారు. ఒక తెర మీద కలర్ లైట్లతో ‘కఫే చాంటెంట్’ అని రాసి ఉన్న స్టాల్ ముందు, ఇద్దరు వ్యక్తులు వెండి పళ్లెం డబ్బులు  లెక్కపెడుతున్నారు. పళ్లెంలో నాణాలు పడుతున్న శబ్దం వినిపిస్తోంది.

వచ్చిన పనిని మళ్ళీ గుర్తు చేసుకుంటూ, ఒక స్టాల్ దగ్గరకు వెళ్లి పింగాణీ కుండీలను, పువ్వులు ముద్రించబడిన టీ-సెట్టులను పరిశీలించాను.

ఆ స్టాల్ తలుపు దగ్గర నిలబడి ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో మాట్లాడుతూ, నవ్వుతూ ఉంది. వాళ్ళ ఇంగ్లీష్ ఆక్సెంట్ గమనిస్తూ, అస్పష్టంగా వినిపిస్తున్న వాళ్ళ మాటలు వింటున్నాను.

‘ఓహ్, నేనెప్పుడూ అలా చెప్పలేదు!’

‘లేదు, నువ్ చెప్పావ్!’

‘లేదు, నేను చెప్పలేదు!’

‘ఆమె అలా చెప్పిందా లేదా?’

‘చెప్పింది, నేను విన్నాను.’

‘ఆహ్, అది… అబద్ధం!’

ఆ యువతి నన్ను గమనించి, దగ్గరికొచ్చి, ‘ఏదైనా కొనాలనుకుంటున్నారా’ అని అడిగింది. ఆమె స్వరంలో నాతో కొనిపించాలన్న ఆసక్తి కన్నా తన డ్యూటీ తాను చేస్తున్న నిబద్ధతే ఎక్కువ ఉంది. స్టాల్ ఎంట్రన్స్ కు రెండు వైపులా ‘ఈస్టర్న్ గార్డ్స్‌’ లా కనిపించే రెండు పెద్దపెద్ద కుండీల వైపు చూస్తూ గొణిగాను:

‘వద్దు, థాంక్స్.’

ఆమె ఒక కుండీని అటూఇటూ జరిపి, తిరిగి ఆ ఇద్దరు అబ్బాయిల దగ్గరకు వెళ్లింది. వాళ్ళు మళ్లీ అదే విషయం మాట్లాడడం మొదలుపెట్టారు. ఒకట్రెండుసార్లు ఆమె తన భుజమ్మీదుగా తలతిప్పి నన్ను చూసింది.

అక్కడ ఉండటం అనవసరమని తెలిసినా, ఆమె వస్తువుల మీద నాకు నిజంగానే ఆసక్తి ఉందని అనుకోవాలని కాసేపు స్టాల్ ముందు తచ్చాడాను. తర్వాత నెమ్మదిగా వెనక్కి తిరిగి, బజారు మధ్యలోకి నడవటం ప్రారంభించాను. నా చేతిలోఉన్న రెండు పెన్నీలను జేబులో ఉన్న ఆరు పెన్నీలపై జారవిడిచాను. గ్యాలరీ చివరనుండి ఎవరో- ‘లైట్ ఆఫ్ అయ్యింది!’ అని అరిచిన శబ్దం వినిపించింది.

ఇప్పుడు హాల్ పైభాగం కూడా పూర్తిగా చీకట్లో మునిగిపోయింది.

ఆ చీకట్లోకి తలెత్తి చూసాను.

ఆమె పట్ల నా కలలు, నా ఆరాధనలు అన్నీ నా అహం, అమాయకత్వం, అవాస్తవ ఆలోచనల ఫలితాలే అని అర్థమయ్యి నాకు నేనే ఒక వింతజీవిలా కనిపించాను.

బాధతో, కోపంతో నా కళ్లల్లో మంటలు చెలరేగాయి.

జేమ్స్ జాయిస్
రమేష్ సామల

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *