ఆమె లేని వెలితిలో…

Spread the love

ఆమె లేని వెలితి కాగితం మీద 
ఆమె చిత్రాన్ని గీసాను

అవును...
మన్నులోంచే
మిన్నుల్లో దాగిన స్వర్గానికి
దారిని వేస్తున్నాను

నా ముందు తరాల
అరబ్బు సంస్కృతీ మూలాలు దాగిఉన్న
ఆ పురాతన "జాహిలీ" కవితా వాక్యాల
వైశాల్యాన్ని అంచనా వేస్తున్నాను

'వెలితి' ఒక దారి!
మండుతున్న అవసరమే
కాగడా గా గమ్యం దాకా నడిపిస్తుంది

స్థిర నివాసం కోల్పోయిన నేను
నా పద్యంలోని ప్రతీ ప్రాస అక్షరం దగ్గర
ఒక తాత్కాలిక నివాసాన్ని నిర్మించాను
గాలిలోని ఊగిసలాటకూ
ఒక ప్రాసను ఊహించాను

వెలితి ఎంత వేధించినా
విలువైన పాఠం నేర్పుతుంది
బతికించే ఆశలాంటి
ఎండమావి కూడా లేకపోతే
నీకు నిలకడేది

మినుకు మినుకుమనే
భ్రమలు కూడా లేకపోతే
బ్రతుకు చుక్కలు లేని ఆకాశమే కదా!

నేనొక పురాతన వర్ణమాల నుండి
ఓ అక్షారాన్ని తీసి
ఆ వెలితి మీద చేరగిలపడుతాను!

మానవాతీతమైన
భావ సందర్శన తర్వాత నేనెవరిని ?
గూడు చెదిరిన పక్షినా?!
కొన్ని కొండ గురుతులు
కొన్ని జ్ఞాపకాలను అమ్ముతూ
నడుస్తున్న బాటసారినా?!

నేను ఒక పురాతన వస్తువునో *యాబూస్*నుంచి దూరమైన ఆత్మనో అనిపించి
నా మసున నాతో అన్నది
"పోదాం పద ఆ పురాతన 'ఏడు కొండల' యెరూషలేముకు!"

అప్పుడు నేను నా ముసుగును తీసి
చరిత్ర రాయి మీద పెట్టి
నన్ను నడిపిస్తున్న కల వెంట
నిద్రలేని నడకనయ్యాను!

ఒక కాలచంద్రుని మీది నుంచి
మరో కాలచంద్రుని మీదికి దూకాను
చరిత్ర నుంచి విషయాలను
విముక్తం చేసేంత అచేతనా శక్తి నాకుంది
అలాగే
అచేతనను విముక్తం చేసే చరిత్రా ఉంది

నా మొదటి స్నేహితురాలు అడుతుంది
మన తొలినాళ్ళకు తీసుకెళ్ళమని!
నేనంటాను
నీ కల మీద
శాంతి రెక్కల ఊరపిచ్చుక వాలడానికి
కిటికీని తెరిచి ఉంచమని

ఆ తర్వాత ,
నేను కల నుంచి మేల్కొని చూస్తే
చుట్టూ ఏ నగరమూ లేదు
'ఇక్కడ'ఏమీ లేదు
'అక్కడ' తప్ప!
'అక్కడ' ఉండాల్సిన నేనేమో
'ఇక్కడు'న్నాను

ఇక
ఎండమావి లేకపోతే
నేనా "ఏడు కొండల" దాకా నడవ లేను
ఎండమావయినా లేకపోతే
నడిచే అడుగుకు బలమేదీ?

******
మూలం :
(In Her Absence I Created Her Image) - మహమూద్ దర్వీష్
స్వేచ్ఛానువాదం : రహీమొద్దీన్


ఫుట్ నోట్:

దర్వీష్ ఈ కవిత లో 'అక్కడ'అంటే దూరంగా ఉన్న పాలస్తీనా నేలను తనకు దూరమైన స్నేహితురాలుగా ఊహిస్తూ , 'ఇక్కడ' అంటే తన ప్రవాస జీవితంలో ఆ విరహాన్ని గొప్ప చారిత్రక విశేషాలతో తన అస్తిత్వ మూలాలను తడుముతూ తాత్వికంగా రాసాడు.

* "యాబూస్ "కనానీ వంశీయులు నివసించిన కాలంలో జెరూసలేం నగరం పేరు
మహమూద్ దర్విష్

పాలస్తీనా జాతీయ కవి‌గా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్‌కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్‌కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్‌లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...

రహీమొద్దీన్

కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్‌ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *