లోపల

Spread the love

ఒక తెలిసీ తెలియని వేదన
లో లోపల సుళ్లు తిరుగాడుతుంది

మనోసముద్రంలో సుడిగుండం
తుఫాన్ అయ్యి తీరాన్ని పొద్దున
నిండిన స్త్రీ మాదిరి
భారంగా దాటలేకపోతుంది

ఏకకాలంలో నూరు అశ్వాల శక్తిని
కూడా తీసుకొని గాలి వీస్తుంది

ఆకాశమంత నీళ్లను గర్భంలో
దాచుకున్న మేఘాలు
ఉరుము మెరుపుల తబలా మోగిస్తున్నాయి

అతి భారీ వర్ష సూచన
రేకుల మీద చినుకులు
వాయిస్తున్న భాజా భజంత్రీలు

వరదలు పారి వాగులు పారి
పొంగిన నదులుగా సాగి
తిరిగి తిరిగి సముద్రాన్ని
శరణుజొచ్చింది వాన

ప్రకృతిని లొంగదీసుకోవాలని మనిషి
మనిషిని అదుపు చేయాలని ప్రకృతి
ఆది నుంచి ఓకే కంచంలో తిని
ఒకే మంచంలో పడుకున్న పాత మిత్రులే కానీ
పరస్పర విరుద్ధ శత్రువులుగా మారారు

ఒకానొక బొమ్మ కట్టని
అసంపూర్ణ పద చిత్రం

పిండ రూపం లో తల్లి కడుపులో
వింత వింత చేష్టలు చేస్తున్న శిశువు

దుక్కి దున్నిన తడిసిన నేల
విత్తనాలు నాటడానికి సిద్ధమైంది

లో లోన మసిలిన విషయం సందర్భం
ఎరుకలోకి వచ్చి కాగితం మీద
కవితా అక్షరమై జన్మించింది
జూకంటి జగన్నాధం

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *