అండమాన్ దీవుల్లో .. 3

Spread the love

పైన నీలాకాశం, కింద నీలి సముద్రం మధ్యలో నేనుంటే .. !

ఈ ఊహ గత ఎనిమిదేళ్లుగా నాతోనే ఉంది.  ఆస్ట్రేలియాలోని వోలంగాంగ్ సమీపంలోని బాల్డ్ హిల్ పై నుండి పసిఫిక్ మహాసముద్రం పై ఎగిరే హ్యాంగ్ గ్లైడర్స్ ని చూసినప్పటి నుండి నేను అలా వెళితే.. అంతటి సాహసం చేయగల ధైర్యం నాకుందా అనే ప్రశ్న నాతో ఉంది.  

అలా ఓ బాలిక వెళ్లినట్లుగా ఊహించి ఓ బాలల నవల కూడా రాశాను. కానీ నాకు అటువంటి అనుభవం లేదు. 

పారా గ్లైడింగ్ కాకపోయినా పారా సెయిలింగ్ చేసే మంచి అవకాశం ఇప్పుడు వచ్చింది.  ఇక వదిలే ముచ్చటే లేదుగా.. 

నా జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజుగా, మర్చిపోలేని గొప్ప అనుభవం గా నిలిచిన విషయాలను ముచ్చటించే ముందు మరి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. 

మా పర్యటనలో రెండో రోజు ఎనిమిదిన్నర కల్లా అందరం పూరీ సుష్టుగా తిని  సిద్ధంగా ఉన్నాం.  మా కోసం వచ్చిన వాహనంలో రాజీవ్ గాంధీ స్పోర్ట్స్  కాంప్లెక్స్ కి  చేరాం. మేం అడుగు పెట్టినప్పుడు పలచని ఎండ ఉంది.  

మా కోసం ఏర్పాటు చేసిన గైడ్ ని కలిసి ముందుకు సాగుతుంటే గొడుగులు, హాట్ లు, కాప్ లు, రైన్ కోట్ లు, బట్టలు వంటి అనేక వస్తువులు అమ్మే అంగళ్ళు.. మమ్మల్ని కొనమని  అడుగుతూ, వెంటపడుతూ.. 

అలాగే టూర్ గైడ్ లు. వాళ్ళ ప్యాకేజీ గురించి చెప్తూ, మా వెంట అనుసరిస్తూ..  

మాకు  వై హెచ్ ఏ వాళ్ళు ఏర్పాటు చేసిన గైడ్ ఉన్నాడు. అతన్ని కాంటాక్ట్ చేసి ఉన్నాం కాబట్టి మా వెంట పడేవాళ్ళను వదిలించుకుంటూ ముందుకు సాగుతుండగా మా గైడ్ మమ్మల్ని కలిశాడు.  

కొద్ది క్షణాల్లోనే వాతావరణం మేఘావృతమై సన్నని తుంపర మొదలైంది.  ఏ నిమిషమైనా కుమ్మరించేస్తానన్నట్టుగా తయారైంది.  

ఆ రోజు మేం బ్రిటిష్ వారు పరిపాలన కార్యక్రమాలు నిర్వహించిన రాస్ ఐలాండ్,  ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం నార్త్ బే ఐలాండ్ కి వెళ్ళాలి.  

ప్రయాణానికి ముందు మా గైడ్ మమ్మల్ని ప్రైవేట్ ఏజెన్సీ కి చెందిన వ్యక్తి ముందు పెట్టాడు.  అతను నార్త్ బే ఐలాండ్ లో ఉండే వాటర్ స్పోర్ట్స్ గురించి, రాస్ ఐలాండ్ గురించి వివరించారు. 

రాస్ ఐలాండ్ మాకు కనిపిస్తూనే ఉంది. అక్కడి నుంచి పది నిమిషాల ప్రయాణం.  

నార్త్ బే ఐలాండ్  దాదాపు 42 కిలోమీటర్లు దూరం. ఎక్కడికి వెళ్లాలన్నా ఫెర్రీ లో వెళ్ళవలసిందే.  ప్రయాణ సమయం అరగంట నుంచి 45 నిమిషాలు పెట్టొచ్చని చెప్పారు.   మధ్యాహ్నం వరకు ఫెర్రీ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 

నార్త్ బే ఐలాండ్ వాటర్ స్పోర్ట్స్ కి ప్రసిద్ధి. 

స్నోర్కెలింగ్, స్కూబా డైవింగ్ చేయొచ్చు. కయాకింగ్,  పారా సెయిలింగ్, జెట్ స్కీయింగ్, సబ్  మెరైన్ లో సముద్ర అంతర్భాగంలో ఉన్న పగడాల దీవుల్లోకి వెళ్లడం వంటి వాటి గురించి చెప్పారు. అందుకు అయ్యే ఖర్చు ఎవరికి వారే భరించుకోవాలి. మా ప్యాకెజీ లో లేదు. 

ఎవరి శక్తి ఆసక్తి, ఆరోగ్య స్థితిని బట్టి వాళ్ళం ఎంచుకున్నాం.  స్కూబా డైవింగ్, స్నోర్కెలింగ్ హావ్ లాక్ ఐలాండ్ లో చేయొచ్చు అక్కడ నీళ్లు మరింత పరిశుభ్రంగా ఉంటాయని నిర్ణయించుకున్నాం. 

మేం ఎంచుకున్న వాటర్ స్పోర్ట్స్ కి మాకు అనుమతి లేదన్నారు. కారణం మేమంతా 60 లోకి వచ్చిన వాళ్ళమే. 55 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళని మాత్రమే అనుమతిస్తాం అని చెప్పారు. మాతో ఉన్న యంగ్ అడల్ట్ నవరంగ్ తప్ప ఎవరికీ అవకాశం లేదు. 

ఎలా..? మేము కోరుకున్న వాటర్ స్పోర్ట్స్ కావాల్సిందేనని మళ్ళీ మళ్ళీ ఒత్తిడి తేవడంతో ఒప్పుకున్నారు. మేం చేయాలనుకున్న వాటర్ స్పోర్ట్స్ కి సొమ్ము చెల్లించాం.   అప్పటి వరకు తుంపరగా పడిన వర్షం పెద్దదైపోయింది.  మా ఫెర్రీ కోసం ఎదురు చూస్తూ  అంతా అక్కడున్న కాంటీన్ లోనే .. అప్పటికే ఆ కాంటీన్ నిల్చోవడానికి కూడా జాగా లేకుండా కిక్కిరిసిపోయింది.  అలాగే మేమూ నెమ్మదిగా అందులో దూరిపోయాం.  ఆ చల్లటి వాతావరణంలో ఊరికే కూర్చోలేక కొందరు కాఫీ, టీ లతో గొంతు వేడి చేసుకుంటూ కాంటీన్ కి గిరాకీ చేశారు. 

వర్షం కొద్దిగా తగ్గాక మా ఫెర్రీ వాళ్ళ నుంచి పిలుపు వచ్చింది. ఫెర్రీ లో ఒకప్పుడు బ్రిటిష్ వారి అధికారిక పాలనా భవనాలున్న రాస్ ఐలాండ్ కి వెళ్ళాలి.  

గత రాత్రి మేం చూసిన దీపాలు రాస్ ఐలాండ్ వే.  దాన్నే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అంటున్నారు.  సెంట్రల్ పోర్ట్ బ్లెర్ నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. 

వర్షం వల్ల రాస్ ఐలాండ్ లో ఫెర్రీ దిగి తిరిగి చూడటం కష్టం కాబట్టి తిరుగు ప్రయాణంలో రాస్ ఐలాండ్ చూడొచ్చని ముందుగా నార్త్ బే ఐలాండ్ కు తీసుకువెళ్లారు.  వర్షం వస్తూ పోతూ దాగుడుమూతలాట ఆడింది.   

దూరంగా జరుగుతున్న పోర్ట్ బ్లెయిర్ సుందర దృశ్యాలకు ముగ్దులవుతూ,  నీలి సముద్రంలో మణిహారాల్లాంటి చిన్న చిన్న దీవులను పలుకరిస్తూ, దట్టంగా కమ్ముకొచ్చే మేఘమాలలు వీక్షిస్తూ, సముద్రం మధ్యలో పడే వర్షపు చినుకుల చూడ సొగసు చెప్పతరమా..!  అద్భుతమైన అందాలకు మేలిముసుగు వేసినట్లు పొగమంచో, తుంపరలో.. 

వర్షపు జల్లులతో పాటు, విసిరికొట్టే గాలికి ఎగిసిపడే అలల  తాలూకు జల్లులు మమ్మల్ని తడిపేస్తుంటే కేరింతలు కొడుతూ కుప్పపోసిన అద్భుత సౌందర్యరాశుల్ని మా కళ్ళలో నింపుకుంటూ, మనసులో ఒంపుకుంటూ… మా గమ్యం  నార్త్ బే బీచ్ చేరుకున్నాం. 

చిన్న చిన్న షాప్స్ , టీ షాప్స్ , కొబ్బరి బొండం షాప్స్ , బీచ్ బట్టల షాప్స్, షెల్స్ వంటి కొద్ది దుకాణాలున్నాయి.  కొందరు ఇక్కడ ఔత్సాహికులైన సాహసికులు స్నోర్కెలింగ్ , సీ వాకింగ్ చేస్తూ కనిపించారు. 

నార్త్ బే ఐలాండ్ చేరాక సబ్ మెరైన్ కి వెళ్ళడానికి మాకు కొంత సమయం ఉంది.  మాకంటే ముందు వచ్చిన రెండు బాచ్ ల తర్వాత మా వంతు. 

ఈ లోగా మాలో కొందరు తడిసిన బట్టలు మార్చుకోవాలని తమతో తెచ్చుకున్న డ్రెస్ మార్చుకుంటే కొందరు  బీచ్లో దొరికే కొత్త బట్టలు కొనుకున్నారు. అదీ శ్రీకాకుళం వైపు నుండి వలస వచ్చిన వారితో మాట కలిపి ముచ్చట పెట్టి బేరం చేసి. ఆ క్రమంలో మేం బృందాలుగా విడిపోయి తిరిగాం. 

ఎవరికి తోచినట్టు వారు ఆ బీచ్ లో తిరిగి ఫోటోలు తీసుకుంటూనో,  షాపింగ్ చేస్తూనో ఉంటే గిరిజ, సుభద్ర , అనిత, నేను అలా నడుస్తూ వెళ్ళాం. కాస్త జారుడుగా ఉన్న కొండ దోవలో ఎదురుగా వస్తున్న వారిని అక్కడేముందని అడిగాం.  లైట్ హౌస్ అని సమాధానం వినగానే ఛలో అంటూ అటు వెళ్లిపోయాం. మిగతా వాళ్లకు చెప్పడానికి ఫోన్ సిగ్నల్ అందలేదు. 

నాచు పట్టి జారుతున్న సిమెంట్ చేసిన బాటలో వర్షానికి మాగిన ఆకులూ ఎండు కొమ్మల వాసన పీల్చుకుంటూ లైట్ హౌస్ దగ్గరకు వెళ్లే బాటలో ఎడమవైపు ఓ గెస్ట్ హౌస్ కి మార్గం చూపుతూ.. మేం అటువైపు వెళ్లకుండా లైట్ హౌస్ దగ్గరకు చేరేసరికి వర్షంలో తడిసి ముద్దయిన ఉయ్యాలలు మమ్మల్ని రమ్మని పిలిచాయి. కాసేపు ఊయలలూగి  లైట్ హౌస్ (టికెట్ ఒక్కొక్కరికి రూ. 10) చూడ్డానికి వెళ్ళాం.  200 మెట్లు ఎక్కి  లైట్ హౌస్ పై నుండి విహంగ వీక్షణం చేస్తుంటే సోయగాలు పోయే నీలి సముద్రానికి నేనేం తీసిపోయానంటూ పచ్చదనం లోని వివిధ షేడ్స్ అద్దుకున్న కొండకి అందాన్నిచ్చే కొబ్బరి, పనస ఇంకా ఏవేవో పెద్ద పెద్ద వృక్షాలు ఆకాశానికేసి చూస్తూ .. మరి కొన్ని నేలకు దగ్గర్లోనే మేమున్నాం అంటూ .. కనుచూపుకు అందే రాస్ ఐలాండ్, పోర్ట్ బ్లెర్, మౌంట్ హారియట్. 

మీకు తెలుసా ఈ లైట్ హౌస్ మనం వాడే 20 రూపాయల నోటు మీద కనిపించేది. 

మేం లైట్ హౌస్ పై ఉన్నప్పుడు సిగ్నల్స్ అంది మమ్మల్ని రమ్మంటూ సబ్ మెరైన్ వారి నుండి ఫోన్.  కౌంటర్ దగ్గర రిపోర్ట్ చేయమంటూ. 

మా టర్న్ వచ్చింది.  అప్పటికే భోజన సమయం అయింది. కానీ భోజన హోటళ్లు ఉన్నట్లు కనిపించలేదు.  కానీ చేపలు, ఇతర సముద్ర జీవులు కాల్చి /వేపి అమ్ముతున్నారు. ఫాస్ట్ ఫుడ్ అందుబాటులో ఉంది. 

మా ట్రిప్ నిర్వాహకులు భోజనం రాస్ ఐలాండ్ లో చేయొచ్చు. ఇప్పుడు కొబ్బరి బొండం తాగమని చెప్పారు. అలా సరి పెట్టుకొమ్మని చెప్పకనే చెప్పారు.  మా అందరి వివరాలు మరోసారి సరిచూసుకుని మమ్మల్ని సిద్ధంగా ఉండమని చెప్పారు. 

అందరం కొబ్బరి బొండం దుకాణం ముందు వాలిపోయాం.  కొబ్బరి బొండం తాగి సెమి సబ్ మెరైన్ కి వెళ్లినా , ఆ తర్వాత పారా సెయిలింగ్ చేసినా కడుపులో తిప్పుతుందేమోనని శంక నాలో.  ఏదైతే అదయిందని దప్పిక తీర్చుకోవడానికి కొబ్బరి బొండం తాగడమే శ్రేయస్కరం అని తాగేసి లోన ఉన్న లేత కొబ్బరి కూడా లాగించేశా.  అదే ఆరోజు మా లంచ్ అవుతుందని అప్పటికి తెలియదు మరి! అది చాలా శక్తిని ఇచ్చింది.

నార్త్ బే లో పగడాల దీవులు చాలా విస్తృతంగా ఉన్నాయి. కానీ మానవ నివాసం మాత్రం లేదు.  అక్కడ వివిధ రకాల వస్తువులు అమ్మేవారు, టూరిజం డిపార్ట్మెంట్ స్టాఫ్ అంతా ఏ రోజుకి ఆ రోజు వచ్చి పోతుంటారు.  

 ఛేంజింగ్ రూమ్స్ అస్సలు బాగోలేదు. టాయిలెట్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మొత్తం మీద ఈ బీచ్ పరిశుభ్రంగా లేదనే చెప్పాలి. 

సెమీ సబ్ మెరైన్ కోసం బోలెడంత సమయం వెచ్చించాల్సి వచ్చింది.  చివరికి సెమీ సబ్ మెరైన్ లో అండమాన్ సముద్రం అంతర్భాగంలో ఉన్న పగడాల దిబ్బలు , చేపలు, నత్తలు, పీతలు, తాబేళ్లు వంటి అనేక రకాల జీవజాలం చూడడానికి బయలుదేరాం. 

సెమి సబ్ మెరైన్ లో కూర్చుని నీటి అడుగున ప్రయాణం. ఓ వింతైన అనుభవం. 

అదో విశాలమైన నీటి ప్రపంచం. ఆ ప్రపంచంలో అనేక రకాల జీవులు. ఈ నీటి అడుగు ప్రపంచంలో ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో .. 

సెమి సబ్ మెరైన్ లో నుంచి పగడపు దిబ్బలు అదేనండీ కోరల్ రీవ్స్ చూడడం అంటే ఓ మాయ లోకాన్ని చూస్తున్నట్టు అనిపించింది.  పారదర్శకంగా ఉన్న నీటిలో సెమి సబ్ మెరైన్ నెమ్మదిగా ప్రయాణిస్తున్నది.  రకరకాల చేపలు , స్టార్ ఫిష్ ,  సీ హార్స్,  తాబేళ్లు, నత్తలు, నీలి, ఎరుపు , లేత పసుపు రంగుల్లో కోరల్ రీవ్స్ .. ఇంకా రకరకాల సముద్ర జీవులు కనిపిస్తున్నాయి. మాలో కొందరు వాటిని చూసి ఉద్వేగంతో అరిచేస్తున్నారు.   వాటి గురించి చెప్పేందుకు ఒక గైడ్ ఉంటే బాగుండేది. 

స్వచ్ఛమైన నీటి అడుగున  అడవుల్లా విస్తరించిన రంగురంగుల కోరల్ రీవ్స్.  కొన్ని పువ్వులా కనిపిస్తే కొన్ని పెద్ద చెట్లలాగా, మరి కొన్ని పొదల్లాగా.., వాటి చుట్టూ స్వేచ్ఛగా తిరుగుతున్న అద్భుతమైన చేపల గుంపులు, మెరిసిపోతున్న సముద్ర జీవులు స్పష్టంగా కనిపిస్తుండగా కొందరు తమ మొబైల్ లో బంధిస్తున్నారు .  

కోరల్ రీఫ్స్ రంగుల ప్రపంచంలో వేర్వేరు రంగులు, ఆకారాలు, పరిణామాల్లో ఉన్నాయి.  గుంపులు గుంపులుగా తిరిగే బుల్లి బుల్లి చేపల నుండి పెద్ద పెద్ద చేపల, పొట్టి చేపలు పొడవు చేపలు, సన్న చేపలు వెడల్పు చేపలు, వివిధ రంగు రంగుల్లో చారలు, గీతలు, మచ్చలతో ఉన్న చేపలు.. అబ్బ ఎన్ని రకాలో.. 

ప్రకృతి ఎంత అద్భుతంగా, వైవిధ్యంగా ఉన్నదో కదా.. అద్భుత సృష్టిని నా కళ్ళతో చూడడం అపురూపమైన అనుభవం. స్కూబా డైవింగ్ చేసి వాటి దగ్గరకు వెళ్తే మరింత అపురూపంగా ఉంటుందేమో అనుకున్న నేను హేవలాక్ ఐలాండ్ లో స్కూబా డైవింగ్ చేయాలని నిశ్చయించుకున్నా.  

మన సంతోషం కోసం, సరదా కోసం వాటి సహజ నివాసాల్లోకి వెళ్లి వాటికి అంతరాయం కలిగించడం సరైంది కాదేమో అనే సంశయం ఓ పక్క ఉన్నప్పటికీ, ఎటువంటి హాని తలపెట్టకుండా నియమాలు పాటిస్తూ జాగ్రత్తలతో వెళ్లడం ముఖ్యం అనుకున్నా.   

నీటి అడుగున కూడా కొండలు గుట్టల ఎత్తుపల్లాలు స్పష్టంగా అగుపించాయి. 45 నిమిషాలు తెలియకుండా గడిచిపోయాయి. 

సబ్ మెరైన్  కదలికల వల్లనో లేక గాలి వెలుతురూ తక్కువ ఉండటం వల్లనో నా పక్కన కూర్చున్న యువతి వాంతులు వచ్చేలా ఉందని కళ్లుమూసుకు కూర్చుంది. మా బృందంలో కొద్దిసేపటి తర్వాత నవరంగ్ మాత్రమే కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. 

పారా సెయిలింగ్ 

నార్త్ బే ఐలాండ్ నుండి పారా సెయిలింగ్ చేసే మా బృంద సభ్యులు ఆరుగురితో పాటు మరికొందరిని తీసుకుని స్పీడ్ బోట్ రాస్ ఐలాండ్ వైపు బయలుదేరింది. మిగతా వాళ్ళు మరో పడవలో రాస్ ఐలాండ్ బయలుదేరారు.  వర్షం తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. చల్లటి గాలులు మమ్మల్ని పరామర్శిస్తూ సాగిపోతున్నాయి. నీలి సముద్రం ప్రశాంతంగా ఉంది. 

బోట్ లో ఎక్కగానే లైఫ్ జాకెట్ ఇచ్చారు. కాస్త దూరం వెళ్ళాక మాకు కొన్ని బెల్టులు తగిలించారు. ప్రత్యేకంగా తయారు చేసిన పారాచూట్ విప్పారు. దానికి ఉన్న హుక్స్ , బోట్ కున్న తాడు హుక్స్ మా బెల్ట్ కి తగిలించి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. స్పీడ్ బోట్ వేగం తగ్గించి ఆపరేటర్ ఆపరేట్ చేస్తుంటే పారాచూట్ పైపైకి పోతూ ఉంది.  పారాచూట్ కు ఉన్న తాడు బోట్ కి కట్టి ఉంది.  ఆ నియంత్రణ అంతా ఆపరేటర్ చేతిలోనే ఉంటుంది. 

నా వంతు కోసం ఉత్సుకతతో ఎదురుచూశా. ఆ సమయం రానే వచ్చింది. నాకు అమర్చిన బెల్ట్స్ కి రంగురంగుల పారాచూట్ హుక్స్ పెట్టారు. ఇంజన్ స్టార్ట్ చేశారు. నెమ్మదిగా కూర్చున్న పొజిషన్ లో పైకి లేస్తున్నా. అలా పైకి పైపైకి.. గాలిపటం ఎగిరినట్లు నేను ఆకాశంలో తేలియాడుతూ.. అద్భుతమైన అనుభవం సొంతం చేసుకుంటూ .. 

నీలి సముద్రం పై తేలుతూ పక్షి ఆకాశంలో ఎగిరే అనుభూతి పొందుతూ.. హుర్రే .. అని అరిచా . నా స్వరం గాలి ఎటు మోసుకు పోయిందో..

చుట్టూ పరికించి చూశా. చిక్కని నీలి సముద్రం పై సన్నని ఎండపొడ పడి మెరుస్తూ..  కాస్త దూరంగా కనిపించే నిండు పచ్చని దీవులు. 

అద్భుతమైన దృశ్యాలు కళ్ళనిండా నింపుకుంటూ ఉన్నా.  దాదాపు 150 మీటర్ల పైనే సముద్రంపై గాలిలో తేలుతూ ఆస్వాదిస్తూనే..  ఇలా సముద్రంలోకి జేరిపోతే .. అన్న ఊహ వచ్చి నాలో నేనే నవ్వుకున్నా .. 

ఇటువంటి సాహసకృత్యం చేయాలని కలగన్నా కానీ చేస్తానని, చేయగలనని అస్సలు ఊహించలేదు.  ఈ  పారా సెయిలింగ్ చేయడం నాలో నిబిడీకృతమై ఉన్న సాహసిని బయటకు తెచ్చింది.  

అరుదైన ఈ జీవితానుభవాన్ని నేనెప్పటికీ మరువలేను. 

వాతావరణం అనుకూలించకపోతే పారా సెయిలింగ్ చేయలేము. గాలి వల్లే పైపైకి వెళ్ళగలం. సంధ్య కి బెల్ట్ లు అన్నీ పెట్టిన తర్వాత గాలి సరిగ్గా లేదని ఆపేశారు. అలా ఆరుగురిలో నలుగురు మాత్రమే చేయగలిగాం. 

ఏదేమైనా పారా సెయిలింగ్ చేయించడం ఒక కళ. అందుకే స్పీడ్ బోట్ ఆపరేటర్ కి థాంక్స్ చెప్పి వచ్చాము. 

మూడు నాలుగు నిమిషాల పారా సెయిలింగ్ కి మూడువేల రూపాయలు చెల్లించాలి. 

రాస్ ఐలాండ్

పారా సెయిలింగ్ తర్వాత అదే బోట్ లో రాస్ ఐలాండ్ చేరుకున్నాం. 

డేనియల్ రాస్ అనే బ్రిటిష్ ఎం మెరైన్ సర్వేయర్ పేరు మీద ఈ దీవికి రాస్ ఐలాండ్ అనే పేరొచ్చింది.  1789-92 మధ్య కాలంలో ఈ దీవిలో ఒక ఆసుపత్రి, శానిటోరియం నిర్వహించారు. 1857 లో అండమాన్ దీవుల్లో శిక్షాస్మృతి అమలుపరచాలని బ్రిటిష్ వారు నిర్ణయించిన తర్వాత పాలనా కార్యకలాపాలకు  ఈ బుల్లి ద్వీపం వేదిక అయింది. 1943 డిసెంబర్ 29 – 31 లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోర్ట్ బ్లెయిర్ పర్యటన సందర్భంగా నేతాజీ ఈ ద్వీపంలో ఉన్నాడట. ప్రభుత్వ భవనం పై భాగంలో జాతీయ త్రివర్ణ పతాకం ఎగుర వేశాడట. 

అందుకే 2018లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ గా పేరు మారిన రాస్ ఐలాండ్ ఒక చారిత్రక ప్రదేశం. 

పోర్ట్ బ్లెయిర్ కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా చిన్న దీవి.  ఈ ఐలాండ్ లో తిరగాలంటే టికెట్ తీసుకోవాలి. మాకు నడిచి చూడాలని ఉన్నప్పటికీ సమయాభావం వల్ల వాహనం లోనే తిరిగాం.  వాహన చోదకుడే గైడ్ గా కూడా వ్యవహరించాడు. 

ఈ ద్వీపాన్ని 1941లో జపాన్ ఆక్రమించుకున్నది.  రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తిరిగి భారతదేశ ఆధీనంలోకి వచ్చింది. 

మొదట్లో వెదురు, గడ్డి తో బారక్స్  నిర్మించి ఖైదీలను ఉంచారు. 

గతకాలపు వైభవానికి చిహ్నంగా నిలిచిన బ్రిటిష్ కాలం నాటి  భవనాలు, చర్చి, ప్రింటింగ్ ప్రెస్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, చీఫ్ కమిషనర్ నివాసం, బారక్స్, బంకర్లు శిథిలమై కనిపించాయి.  చెట్లు ఊడలు దిగి అల్లుకుపోయాయి.  ఆలనాటి అవశేషాలను మేం వాహనంలోంచే చూశాం.  ఈ ద్వీపం మొత్తం 24 మంది ప్రధాన కమిషనర్లకు నివాసంగా ఆతిథ్యం ఇచ్చింది. 

1979లో ఈ ద్వీపాన్ని భారత ప్రభుత్వం నౌకాదళానికి అప్పగించింది.  ఇక్కడ ఉత్తర దిక్కున బ్రిటిష్ కాలంలో నిర్మించిన లైట్ హౌస్ ఉంది. 2004 సునామీ సమయంలో ధ్వంసం అయింది. దాని దగ్గరకు బోట్ లో మాత్రమే వెళ్ళగలం.  కానీ మాకు చూసే సమయం లేక దూరంగా కూడా చూడలేకపోయాం. 

జింక పిల్లలు , దుప్పి చెంగు చెంగున అలరిస్తున్నాయి. 

సమయం ఉంటే ఈ ద్వీపం మొత్తం తిరిగి రావచ్చు . ఇక్కడ స్థానికంగా ప్రజల నివాసం లేదు. పర్యాటకులు వచ్చి వెళుతుంటారు. పర్యాటక రంగంలో పనిచేసే కొద్ది ఉద్యోగులు మాత్రం అక్కడ ఉంటారట. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అక్కడికి వెళ్లడం కష్టం . 

ఐదు గంటలకు రాస్ ఐలాండ్ నుంచి అంతా బయటకు వచ్చేయాలి. చివరి బోట్ వచ్చేసింది. మేమంతా బయలుదేరి పదిహేను నిమిషాల్లో పోర్ట్ బ్లెయిర్ లోని వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గరకు చేరుకున్నాం. అక్కడ జెట్ స్కీయింగ్ చేశాం. 

జెట్ స్కీయింగ్ 

సాయం సంధ్యా సమయంలో నీలిరంగు నీటిపై జెట్ స్కీయింగ్ చేయడం అద్భుతమైన అనుభవం . 

ఎగిసిపడే అలలపై స్కూటర్ లాంటి వాహనంలో ప్రయాణం సాహసం మాత్రమే కాదు అద్భుతం కూడా.  ఎదురుగా ఎగిసి వచ్చే అలలు స్కూటర్ కి తగిలి విరిగిపోతూ..  ముక్కలై పడిపోయే అలలు విసిరే నీళ్లు మనని తడిపేస్తూ… ఉప్పదనం నోట్లోకి, కళ్ళలోకి చేరుతూ… మరో పక్క తెరలు తెరలుగా వచ్చే గాలికి జుట్టు గాల్లోకి ఎగురుతూ..  

ఆ థ్రిల్ అనుభవించి తీరాల్సిందే. కొద్ది సేపటి తర్వాత  నాకు స్కూటర్ నడపడం వచ్చు. నేనే నడుపుతాను అంటే నా రైడర్ ఒప్పుకోలేదు. ఒక చేత్తో స్కూటర్ పట్టుకుని మరో చేత్తో వీడియో తీయడం మొదలుపెట్టాడు.  అతని వయసెంతో ఉండదు. ఇరవై ఏళ్ళు ఉంటాయేమో.. అంతే.  కానీ ఎంతో నైపుణ్యంతో ఒంటి చేత్తో అలలపై దూసుకుపోవడం సాహసమేగా! 

ఇక్కడ నీరు జెట్ స్కీయింగ్ కి అనుకూలంగా ఉంటుందట.  ధర కూడా ఏమంత ఎక్కువ కాదు కాబట్టి అవకాశం వస్తే మరోసారి జెట్ స్కీయింగ్ చేయాలని అనుకున్నా . ఒకరిద్దరు మినహా దాదాపు మా బృంద సభ్యులంతా జెట్ స్కీయింగ్ చేశారు.  సాయం సంధ్యా సమయం కావడంతో మా వీడియో లు మాత్రం అంత స్పష్టంగా రాలేదు. 

అలా అండమాన్ లో మా రెండవ రోజు అద్భుతంగా గడచింది. 

వి. శాంతి ప్రబోధ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *