రాత్రి నుండీ నా మనసు మనసులో లేదు. విజయ్ మాటలే నా చెవుల్లో మారు మ్రోగుతున్నాయి.రాధ విషయంలో నేను తప్పుచేసానేమో అనిపిస్తోంది. తనని అర్థం చేసుకోకుండా ఎన్ని మాటలన్నాను..ఎంత భాదపెట్టాను. నా మాటలకు తను ఎంత మనోవేధన అనుభవించుంటుందో అసలు .అవన్నీ గుర్తొచ్చి నా కళ్ళు తడెక్కాయి. అసలేం జరిగిందంటే….
***
మాది మధ్యతరగతి కుటుంబం. నా కష్టంతో, స్కాలర్ షిప్ లతో బీ.టెక్ పూర్తి చేసి ఓ ప్రభుత్వ ఇంజినీర్ గా సెటిల్ అయ్యాను. ఇంట్లో పెళ్ళి ప్రస్తావనొచ్చినప్పుడు, “నాకు డిగ్రీ వరకూ చదివిన పల్లెటూరమ్మాయే కావాలి”అని పట్టుబట్టాను.అందుకు కారణం లేకపోలేదు. పట్నంలో, మా కాలేజీలో ,అమ్మాయిల విచ్చలవిడితనం, తలబిరుసుతనం చూసిన నాకు ఎందుకో పట్నం అమ్మాయిలన్నా, బాగా చదువుకున్న అమ్మాయిలన్నా మొహం మొట్టింది.సాధారణ కుటుంబం నుండొచ్చి, పల్లెటూరి నేపథ్యం ఉండి, డిగ్రీ వరకూ చదివుంటే అమాయకంగా, అణుకువగా ఉంటారనేది నా ఆలోచన. అలాగే ఇద్దరి నేపథ్యం వేరే అయితే జీవితాన్ని ఎక్కువ ఎక్స్ ప్లోర్ చేయొచ్చని, భిన్న దృవాల్ల బాగా కలిసిపోతామని నా నమ్మకం.
నేనకున్నట్టుగానే రాధ ను పెళ్ళి చేసుకున్నాను.రాధ అమాయకురాలు,నేనే తన లోకం. అంతర్ముఖుడైన నాకు, తనే ప్రపంచం. కష్ట, సుఖాల్లో నా వెన్నంటే ఉండే మనిషి ఉంటే చాలు,జీవితంలో ఇంకేదీ అవసరం లేదు అనుకునే వాడ్ని నేను.అలాంటి ఓ వ్యక్తి నా జీవితంలోకి రావడంతో ఇన్నాళ్ళ నా ఒంటరితనానికి, మనోవేధనలకు చమరగీతం పాడేసాననే అనుకున్నాను.కానీ మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది!!!.
***
కొన్నిరోజులు సంసారం సాఫీగానే సాగింది.మద్యలో పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. భరించలేకపోయాను.
ఓ రోజు రాధతో “నా వల్ల అవ్వట్లేదు.బాగా టార్చర్ చేస్తున్నాడు మా బాస్” అన్నాను.
“ఎందుకూ??” తన మొహంలోనే కాదు మాటల్లో కూడా అమాయకత్వం ఉట్టిపడుతుంటుంది.
“ఓ టెండర్ లో ఓ కాంట్రాక్టర్ కి మాండేటరీ డాక్యుమెంట్స్ లేకపోయినా ఏదో విదంగా క్వాలిఫై చేయమంటున్నాడు.మాండేటరీ అంటే మాండేటరీయే. వాటిని ఎలా బైపాస్ చేస్తానసలు.రేప్పొద్దున ఆడిటొచ్చిన,ఏదైనా ఎంక్వైరీ జరిగినా సెక్షన్ నుండే మొదలవుద్ది.నువ్వే చెప్పు అలా చేస్తే దొరికిపోయే చాన్స్ లేదా.రేప్పొద్దున్న దొరికిపోయి
నా మీద చార్జెస్ ఫ్రేం చేస్తే, అది డ్రాప్ అవ్వడానికి యేళ్ళు పట్టదూ. అన్నేళ్ళు ఇంక్రిమెంటు ,ప్రమోషన్ అన్నీ ఆపేస్తారు.కెరీర్ నాశనం అవుద్ది.ఆయనకేం ఇంకో మూడు నెలల్లో రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకుంటాడు.ఏదైనా అయితే ఇంకో ముప్పైయేళ్ళు నేను శిక్షను అనుభవించాలి.”నా భాదనంతా వెల్లగక్కాను.
“ఎక్కువ టెన్షన్ తీసుకోకు రాం.ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది.నువ్ మాత్రం ఎవరెంత ఒత్తిడి తెచ్చినా నీ మనసుకు నచ్చినట్టు ఉండూ.” అంటూ నా భుజం మీద వాలి నా చేయిని తన చేయిలోకి తీసుకుంది.
అంత సేపు నా భాదని వెల్లగక్కితే ,ఆమె చెప్పిన రెండు ఓదార్పు మాటలు,నా మనసులో మంటను చల్లార్చలేకపోయాయి.
డిగ్రీ చదువుకున్న అమ్మాయికి టెండర్ల గురించి,చార్జి మెమోల గురించి చెబితే అర్దమవుతుందా ???.
***
నాకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టం.యద్దనపూడి ,యండమూరి వారి లాంటి రచనలు నమిలి మ్రింగేసాను. ఇంగ్లీష్ లో గేం ఆఫ్ థ్రోన్స్, హ్యారీపాటర్ , ప్రిజన్ బ్రేక్ వంటి వెబ్ సిరీస్ ల బ్యాక్ స్టోరిలతో సహా కంఠతా వచ్చు.ఇవన్నీ నా ఇష్టాలు.
రాధ కి మొక్కలంటే ఇష్టం. నేను పుస్తకాలు చదివి వాటిల్లో నాకు నచ్చినవి ,ఆశ్చర్యకరంగా అనిపించినవీ చెబితే వినడం ఇష్టం. అసలు హాలీవుడ్ అంటే తెలీదు తనకి. నాతో కలిసి తెలుగు సినిమాలు చూడడం మాత్రం ఇష్టం.
మేమిద్దరం భిన్న దృవాలమే. మరి ఫిజిక్స్ లో చెప్పినట్టు భిన్న దృవాలు ఫిజికల్ గా ఆకర్షించబడతాయా??.ఏమో, రాను రానూ నాకా నమ్మకం పోతూ ఉండింది..
ఓ రోజూ ఆఫీసులో ఉన్నప్పుడు నాకు ఏ.ఈ నుండి డి.ఈ గా ప్రమోషనొచ్చినట్టు తెలిసింది.అది తెలిసి ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాను.వెంటనే ఇంటికి బయల్దేరాను. రాధకి ఈ వార్త చెబితే ఎంత సంతోషిస్తుందో,నాకు ఏ బహుమతినిస్తుందో అని ఊహించుకుంటూ సిగ్గుపడిపోయాను.
ఇంటికి చేరుకోగానే “ఏమయింది..అంత సంతోషంగా ఉన్నారు” అంది.
“చెప్పుకో చూద్దాం…నాకు డీ.ఈ ప్రమోషనొచ్చింది” అంటూ ప్రశ్న,సమాధానం నేనే చెప్పేసాను.
“కంగ్రాట్స్ భావా” అంటూ నన్ను యాంత్రికంగా హత్తుకున్న తను “నీకింకా ఎక్కువ పనుంటుందా ఇప్పటినుండీ” అంది.
నా ఉత్సాహం నీరుగారిపోయింది,ఆనందం పటాపంచలయింది. నా సంతోషాన్ని తనతో పంచుకుంటే రెట్టింపు అవ్వాల్సింది పోయి,మటు మాయమైంది.
చిరాకుతో, కోపంతో “ఎహే ఎంటే నువ్వు..ఏం చెప్పినా అర్థం కాదు..నాకు ప్రమోషన్ ఒచ్చిందని చెబితే ఆనందపడాల్సింది పోయి,నీ లేనిపోని అనుమానాలతో భాదపడతావ్.అనవసరంగా పెళ్ళి చేసుకున్నాను నిన్ను.పట్నం అమ్మాయినో , నాలా ఉద్యోగం చేసుకునే అమ్మాయినో చేసుకుంటే అయిపోయేది. “అంటూ పక్కకి నెట్టేసాను.
తనేం మాట్లాడలేదు.
మళ్ళీ నేనే “మనిద్దరికి కంపాటిబిలిటీ లేదు” అన్నాను.
మళ్ళీ తన మౌనం.
“ఓహో అదీ అర్దమయి ఉండదు నీకు.మనిద్దరికి అస్సలు జత కుదరదు. పల్లెటూరి భాషలో చెప్పాలంటే ,సంసారం అనే బండి సరిగా నడవాలంటే జోడెద్దుల్లా భార్య భర్తలు ఒకే దిక్కులో నడవాలి. నువ్వో దిక్కు నేనో దిక్కూ నడిస్తే ఆ బండిలాగానే మన సంసారమూ కూలిపోతుంది.నువ్ ఎప్పటికీ నాలాగ మారలేవు.నాలాగా ఆలోచించలేవు.నా ఆనందాన్ని,దుఖాన్ని అర్థం చేసుకోలేవు.నీకు దండం తల్లీ.నీతో ఉండి ఈ నరకం అనుభవించలేను నేను. వెళ్లిపో మీ ఇంటికి,విడాకుల పత్రాలు ఇంటికే పంపుతాను.”అన్నాను ఆవేశంగా
ఈ సారి నా మాటల తూటాలకు , ఆమె కన్నీళ్ళే సమాధానమాయ్యాయి.అది చూసి ఇంకా చిరాకుతో “సరే నేనే వెళ్ళిపోతాను.. నువ్వే ఉండూ” అంటూ బయటకెళ్ళిపోయాను.
***
“ఈ రోజు సాయంత్రం పిల్లల్ని తీసుకురా”అఫీసుకెళ్తూ అంది గీత.
“అదేంటీ?” తనకి సంబందం లేని విషయం చెప్పినట్టు అడిగాడు విజయ్.
“ఆఫీసులో లేటవుతుంది ఈ రోజు. ఎస్టిమేట్ సబ్మిషన్ డెడ్ లైన్ ఉంది. ఇంటికొస్తే పని చేయలేను.అందుకే ఈ రోజు రాత్రి ఏ టైం అయినా ఆఫీసులోనే పని పూర్తి చేసుకునొస్తాను”.
“మరి డిన్నర్???”
“నేను ఆఫీసులోనే తినేస్తాను.మీరు వీలైతే వంట చేస్కోండి లేదంటే బయట నుండి తెచ్చుకోండి.కన్నయ్య కి మాత్రం కుక్కర్ లో రైస్ పెట్టి, ఫ్రిజ్ లో ఉన్న పెరుగుతో కర్డ్ రైస్ పెట్టు”.
“కన్నయ్యకి తినిపించడం నా వల్ల కాదబ్బా..వాడు ఆ డయానా, రోమా చూస్తూ రెండు గంటలు తింటాడు.నాకు ఓపిక లేదు.నువ్వే ఒచ్చెయ్.రేపు చేసుకోవచ్చు నీ పని”
“అలా అంటావెందుకు..రోజూ నేనే కదా చూసుకునేది. ఒక్క రోజు చూసుకోడానికి ఎందుకంత భాద.కన్న కొడుకే కదా.అప్పుడే బరువైపోయాడా.నీకు వర్క్ ఉండి ఇంటికి లేటొస్తే నేనమన్నా అన్నానా?.మరి ఒక్కరోజు నేను లేటొస్తానూ అంటే ఎందుకొప్పుకోవు.నాదీ నీలా ఉద్యోగమే కదా”.
అప్పడిదాకా మామూలుగా ఉన్న వాతావరణం కాస్త వేడెక్కింది. నా ముందర తన భార్య తనను డామినేట్ చేయడం తట్టుకోలేకపోయాడు విజయ్.
“ఎందుకు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావ్.. జస్ట్ నేను చెప్పినట్టు విను” అన్నాడు కోపంగా.
“చెప్పినట్టు వినడం ఏంటీ..అరుస్తున్నారెందుకు.. భాద్యతల్ని ఇద్దరం పంచుకోవాల్సిందే” గీత కూడా తగ్గలేదు.
“వినకుంటే ఇంటికి రాకు”
“ఇది నా ఇల్లు. నెల నెలా ఈ.ఎం. ఐ నా జీతం నుండి కట్ అవుతుంది.”
“సరే నేనే వెళ్ళిపోతా.. ఆ కారు కీస్ ఇచ్చేయ్..దానికి ఈ.ఎం. ఐ నేను కడుతున్నాను” అంటూ గీత చేతిలోంచి కారు కీస్ లాక్కున్నాడు విజయ్.
“మంచిది. నేను సాయంత్రం ఒచ్చేసరికి మూటా ముళ్ళ సర్దుకుని వెళ్ళిపోండి నా ఇంటి నుండి” అని చెప్పేసి విస విసా వెళ్ళిపోయింది గీత.
“చూసావారా.. ఉద్యోగం, డబ్బు ఉందని ఎంత పొగరుగా మాట్లాడుతుందో. అందుకే మనలాంటి రుచులు, అభిరుచులూ, ఉద్యోగాలున్న వాల్లని అస్సలు పెళ్ళి చేసుకోకూడదు. ఒకళ్ళ విలువ ఇంకొకల్లకి తెలీదు. ఒకళ్ళంటే ఇంకొకళ్ళకి బోర్ కొట్టేస్తాం. “భాదని వెల్లగక్కాడు విజయ్.
***
రాధతో గొడవ పడి, విజయ్ దగ్గరికొస్తే, అక్కడా ఆ గొడవలు చూసేసరికి నాకు చిరాకేసి ఉదయాన్నే బయటకొచ్చాను. లగేజ్ తీసుకుందామని సాయంత్రం మళ్ళీ విజయ్ దగ్గరికెళ్ళి బయల్దేరాను.
వెళ్ళేసరికి విజయ్ ఏదో డెకరేషన్ చేస్తూ ఉన్నాడు.
“ఏంట్రా ఇదంతా.. గీత వెళ్ళిపోమంది కదా..నువ్వేం చేస్తున్నావ్” అన్నాన్నేను.
“దాని మొహం. అది అలానే మాట్లాడుతుంది.కాసింత ముక్కు మీద కోపం నాలాగే.రేపు దాని బర్త్ డే.. ఎలాగో మిడ్ నైట్ వరకూ ఒస్తా అంది కదా. సర్ ప్రైజ్ ఇద్దామని ఇళ్ళంతా డెకోరెట్ చేస్తున్నా.తనకి నేను ఇచ్చే ఇలాంటి చిన్న చిన్న సర్ ప్రైజులు చాలా ఇష్టం.”అన్నాడు.
“నువ్ కూడా రుచులు,అభిరుచులూ అంటూ ఏదేదో అన్నావ్”
“రేయ్..ఆ టైంలో అలా మాట్లాడాను కాని,తర్వాత ఆలోచించి చూస్తే నాదే తప్పు అనిపించింది.ఒక్కరోజు కన్నయ్యని చూసుకోమంటేనే తెగ బిల్టప్ ఇచ్చాను.”
“మరి గీత?”
“నీ ముందర అలా మాట్లాడనని తను ఫీలయ్యింది. ఇదిగో పొద్దున్నుండి సారీ అని మెసేజులు పెడుతుంది.అఫ్ కోర్స్ నేను చూడకుండా తనని ఉడికిస్తున్నానుకో”నవ్వాడు విజయ్.
నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు.
అర్థం చేసుకున్న విజయ్ “రేయ్..మన భాగస్వామి మనలా ఉన్నా ,పూర్తి వ్యతిరేకంగా ఉన్నా,కలిసి బ్రతికుతున్నప్పుడు కోప తాపాలు, గొడవలు,అలకలు సాధారణం. అవి లేకుంటే మన జీవితం నిస్సారంగా ఉంటుంది.ఓ పెద్ద క్రికెటర్, అసలు క్రికెట్ అంటే తెలియని అమ్మాయిని పెళ్ళి చేసుకుని సక్సెస్ ఫుల్ గా కెరీర్ ని ముగించడం మనకు తెలిసిందే.ఒక పెద్ద హీరో, తన సహచర నటిని పెళ్ళి చేసుకుని ఏడు పదుల వయస్సులో ఇప్పటికీ నటిస్తున్నాడు. ఇక్కడ ఇద్దరి నేపథ్యం ముఖ్యం కాదు. అర్థం చేసుకునే మనస్తత్వం ముఖ్యం. నీ గురించి అంతలా ఆలోచించే భార్య దొరకడం నీ అదృష్టం. తనని వదులుకోకు. ఓ రెండ్రోజులు పోతే నువ్వే ఆలోచించి తనని అర్థం చేసుకుని తన దగ్గరికెళ్తావని నేనేం చెప్పలేదు.”అన్నాడు.
విజయ్ మాటలు నన్ను ఆలోచనల్లో పడేసాయి.
***
ఇంటికి బయల్దేరానే గాని రాధ ఇంట్లో ఉందో లేదో అన్న అనుమానం, ఇంట్లో లేకుంటే ఒక్కత్తే ఎటెళ్ళిందో ఎలా ఎళ్ళిందో అన్న భయం నాలో మొదలైంది.
ఇంటికెళ్ళగానే తను కనిపించింది.నన్ను చూసి భాష్పాకుల అయింది.ఆమె కళ్ళలో నేనొస్తానన్న నమ్మకం కనిపించింది. నన్ను అంతలా అర్థం చేసుకున్న తనను, అసలు అర్థం చేసుకోంది నేనేనని,అన్న ఆలోచనతో నా హృదయం ఆద్రితం అయింది. నా దగ్గరకి రమ్మని కళ్ళతో సైగ చేసాను. తన కళ్ళలో సిగ్గుల దొంతర్లు దొర్లాయి. తన చిరునవ్వు నా పెదవుల మీద ప్రత్యక్షమయింది. బహుశా నేను కూడా తనని అర్థం చేసుకోవడం మొదలెట్టానేమో.

