ఈ ఉపన్యాసాల ప్రధాన ఉద్దేశం దోస్తాయివ్స్కీ ఉత్తమ రచనలను చదివి, వాటిలోని ప్రధానమయిన సాహిత్య, భావజాల అంశాలను పరిచయం చేయడం.
దోస్తాయివ్స్కీ మరీ అంత కష్టపడి అర్థం చేసుకోవాల్సిన రచయిత కాదు. కానీ తను, తన రచనలను చదవడానికి యోగ్యంగా, ఆసక్తిదాయకంగా, ఉధ్విగ్నభరితంగా ఉండేలా వీలయినంత ప్రయత్నం చేస్తాడు. తన రచనలు పాశ్చాత్య సంస్కృతికి సంబంధించిన గాఢమయిన నైతిక, తాత్విక విషయాలను లేవనెత్తుతాయి. అలాగే పాఠకుల ఆసక్తిని పట్టి ఉంచుతాయి.
తన రచనలను అలా కొనసాగించడం అతనికి తప్పనిసరి అయింది. తన కాలంలో జీవిక కోసం, ఆదాయం కోసం రచనల మీద ఆధారపడిన ముఖ్యమైన రష్యన్ రచయిత తనొక్కడే కావడం దీనికి కారణం. అంటే తన ప్రజాధరణ మీదనే తన ఆదాయం ఆధారపడి ఉందన్నమాట. దీని కారణంగా ఆయన తన రచనలలో మిస్టరీ, సస్పెన్స్ లను ఉపయోగించాడు. ఇవి సాధారణంగా ప్రజా బాహుళ్యాన్ని ఆకట్టుకొనేందుకు ఉపయోగించే విధానాలు. రష్యాలో అప్పటి రచనా ధోరణి అయిన పొయటిక్ ట్రాజెడీకి వ్యతిరేకమైన, భిన్నమైన, గంభీరమైన అంశాలను ఆయన తన రచనలలో రాసాడు. అలా చేయడం కోసం, వాస్తవంగా ఆయన రష్యనేతరులయిన హ్యూగో, బాల్జాక్, డికెన్స్ వంటి రచయితల అడుగుజాడలలో నడిచాడు. వీరందరూ గంభీరమయిన సామాజిక అంశాలను అదే విధమయిన మిస్టరీ, అడ్వెంఛర్ కథన పద్దతులలో చెప్పిన వారే.
ఈ రెండు రకాల రచనా విధానాల మధ్య ఉన్న దూరం యూరప్ లో కన్న రష్యాలో చాలా ఎక్కువ. ఎందుకంటే, బహుశా- రష్యాలో నిజమయిన మాస్ ఆడియన్స్ లేరు. అత్యధిక ప్రజానీకం నిరక్షరాశ్యులు. అన్ని రకాల పుస్తకాలూ ఉన్నత వర్గాల మధ్యనే తిరుగుతూ ఉండేవి. ఈ పరిస్థితి కాలక్రమేణా మారుతూ వచ్చింది. దోస్తాయివ్స్కీఅనుసరించిన ఈ రష్యనేతర రచనా ధోరణి వలన తను ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక పాఠకులు చదివిన రష్యన్ క్లాసిక్ రచయిత కాగలిగాడు. సంవత్సరాలు గడిచేకొద్దీ నాటకంలోనూ, సినిమాలోనూ తన రచనలు చోటు చేసుకోవడం కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి.
వర్తమాన పాఠకులకు, దోస్తాయివ్స్కీ ఎంతో సమకాలీన రచయితగానూ, తన రచనలు గతాన్ని గురించి కాకుండా సమకాలీనానికి దగ్గరివన్నట్టుగానూ భావింపబడుతున్నాయి.
టాల్స్టాయ్ వంటి వారిని చదివినపుడు మనకు ఇలాంటి అనుభూతి కలగదు. సార్వత్రిక సమస్యలనదగినవి తన రచనలలో కనపడుతున్నప్పటికీ , తన నవలలోని ముఖ్య పాత్రలన్నీ దోస్తాయివ్స్కీకి భిన్నమయిన వాతావరణంలో జీవిస్తుంటాయి. అది రష్యన్ ప్రపంచపు గతము.
దోస్తాయివ్స్కీ ప్రపంచము దీనికి భిన్నమయినది. అది ప్రవాహ సదృశంగా నిరంతరమూ మారుతూ ఉండేది. ఇది గతం తాలూకు స్థిరత్వం ఎక్కడయితే బలంగా నాటుకొని ఉన్నదో ఆ నమ్మకాన్ని, భగవంతుని ఉనికిని సీరియస్ గా ప్రశ్నించడంతో మొదలవుతుంది. తన కాలపు ప్రపంచము- బుద్ధిజీవులుగా పిలువబడుతున్న ఒక కొత్త సముహపు మెదళ్ళనూ, హృదయాలనూ ప్రభావితం చేస్తున్న ప్రపంచము. విద్యావంతులయిన ప్రజలు తమను ఎంతమాత్రమూ పాత సామాజిక మత నిర్మాణాలలొ భాగంగా పరిగణించుకొనేందుకు ఇష్టపడకుండా, తమను తాము మౌలికంగా మార్చుకొనేందుకు చూస్తున్న కాలము. దోస్తోవ్స్కీ తన ప్రధానమైన నవలలో వీరిపై దాడి చేసాడు. కానీ అదే సమయంలో వారిని గాఢంగా, లోతుల నుండీ అర్థం చేసుకున్నాడు. మన ఈ ఉపన్యాసాల లక్ష్యము ఒకే సమయంలో పరస్పర వ్యతిరేకమయిన ఈ రెండు పనులనూ దోస్తాయివ్స్కీ ఎలా చేయలిగాడో అర్థం చేసుకోవడమే. మార్పును కోరుకొనే ఆ ప్రజానికాన్ని సానుభూతితో, ఆంతరంగికమయిన సమగ్రతతో, ఇంకా దయతో ఎలా చిత్రించాడో పరిశీలించడమే.
మొదటి ప్రపంచ యుద్ధానంతరం, మన అంతరంగంలోకి దోస్తాయివ్స్కీ అంతకంతకూ దగ్గరవడం మొదలయింది. అప్పటికి పాశ్చాత్య నాగరికతా ప్రపంచపు ఆత్మ విశ్వాసం కుప్పకూలింది. అప్పటివరకూ దోస్తాయివ్స్కీ నవలా ప్రపంచంలో రష్యన్ సమాజానివిగా ఎత్తిచూపిన సమస్యలు ఒక్కసారిగా పాశ్చాత్య సంస్కృతికంతటికీ చెందినవిగా అయ్యాయి.
దోస్తాయివ్స్కీ కాలపు సాహిత్య, భావజాల నేపథ్యం నుండీ తన రచనలను అధ్యయనం చేయడం ఈ ఉపన్యాసాల మరో ముఖ్య లక్ష్యం. తద్వారా తన కాలానికి సంబంధించి తను ఏమి చెప్పదలుచుకున్నాడో వెలికి తీయడానికి వీలవుతుంది. గొప్ప రచయిలందరిలాగానే దోస్తాయివ్స్కీ రచనలు కూడా వాటి చారిత్రక నేపథ్యాలను అధిగమిస్తాయి. తన కాలం తనకు ఎలా అవగతమయిందో నేను వివరించడానికి ప్రయత్నిస్తాను.
రష్యన్ సంస్కృతి:
పాతకాలపు రష్యన్ సాహిత్యము దాదాపుగా మతసంబంధమయినదిగా ఉండేది. భైజాంటియన్ క్రిస్టియానిటీకి చెందిన భావజాలం, విలువల చేత అది నియంత్రించబడేది. పదిహేడవ శతాబ్ధం చివర పీటర్ ది గ్రేట్ అధికారంలోకి వచ్చేంతవరకూ అది అలాగే కొనసాగింది. ఆయన తన కాలంలో అక్షరాశ్య వర్గాన్ని, దేశాన్ని పరిపాలించే ఉన్నత వర్గాన్నంతటినీ దాదాపుగా ఆ కాలపు పాశ్చాత్య విలువలను అనుసరించే వర్గం కిందకు కుదించివేశాడు. ఇది సంప్రదాయాలలో అనేక విధాలయిన మార్పులకు దారి తీసింది. అంటే హేతువాద భావాలను అనుసరించేలా చేయడం ద్వారా యూరపియన్ భావధారను ఆధిక్యతలోనికి తీసుక రావడం జరిగిందని చెప్పడమే ఇక్కడ ముఖ్యమయిన విషయం.
యూరప్ లో సైన్స్, మతాల మధ్య అనేక వందల ఏళ్ళుగా జరుగుతూ వచ్చిన ఘర్షణ, అప్పటికే ఒక రకమైన సర్దుబాటు దశకు చేరుకొని ఉన్నది. కానీ ఈ మార్పు రష్యాలో అమిత వేగంగా, నిరంకుశంగా సంభవించింది. అందువలన దీని ప్రభావం కొద్ది సంఖ్యలో ఉన్న అక్షరాశ్య, పాలక వర్గానికి మాత్రమే పరిమితమయింది. అత్యధిక సంఖ్యాక నిరక్షరాశ్య రైతాంగం ఈ మార్పుకు దూరంగానే ఉంది. ఇది రష్యన్ సాంస్కృతిక జీవనాన్ని- భిన్నమయిన నైతిక, ఆధ్యాత్మిక ప్రపంచాలుగానూ, వాటిలో నివసించే పాలక వర్గం, ప్రజలుగానూ చీలికను సృష్టించింది. ప్రతి ఒక్కరికీ ఈ అగాధమయిన చీలిక పరిచయమే. కానీ దోస్తాయివ్స్కీ దీనిని లోతుగా తనదయిన రీతిలో గాఢంగా అనుభవంలోనికి తెచ్చుకున్నాడు. 1849లో కారాగారంలో సహచర రైతాంగ ఖైదీలతో తను ఉండాల్సి వచ్చినపుడు ఈ చీలిక ఎంత వైశాల్యంలో విస్తరించి ఉన్నదో ఆయన తెలుసుకున్నాడు. తనూ, ఇంకా కొద్దిమందిగా ఉన్న విద్యావంతులయిన బంధీలు దాదాపు విదేశియుల మాదిరిగా, రైతుబంధీల నడుమ పరాయీకరణకు గురి అయ్యారు. సాధారణమయిన సామాజిక జీవితంలో బహిరంగంగా ఎన్నడూ అనుభవంలోకి రాని ఈ ధ్వేషాన్ని వారు చవి చూసారు. అందుకే ఈ దూరాన్ని ఒకటిగా చేయడం అతి ముఖ్యమయిన అంశంగా దోస్తాయివ్స్కీ భావించాడు. విద్యావంతుల వర్గం రైతాంగపు మత, సామాజిక విలువలను గౌరవించాల్సి ఉండిందని ఆయన అనుకున్నాడు. ఇలా అనుకోవడం కేవలం దోస్తాయివ్స్కీలోనే కాదు. టాల్స్టాయ్ లోనూ ఇలాంటి ఆలోచనలే తలెత్తడం మనం గుర్తించవచ్చు.
యూరోపియన్ విద్య కారణంగా, పంతొమ్మిదవ శతాబ్దంలో పాలక వర్గం తన సొంత సంస్కృతి, భాషలనే కించపరచడం మొదలయింది. రష్యన్ బదులుగా ప్రెంచి మాట్లాడడం సంస్కార చిహ్నంగా మారింది. టాల్స్టాయ్, “వార్ అండ్ పీస్” నవల ఆరంభంలో కులీన వర్గం నెపోలియన్ చొరబాటు గురించి ఈ విధంగా ప్రెంచిలో మాట్లాడుకోవడం మనం గమనించవచ్చు. ఈ స్థాయిలో, పాలక వర్గంలో జరిగిన పాశ్చాత్యీకరణ- తనంతట తానుగా రష్యన్ సమాజంలో వెస్ట్రెనైజర్స్, స్లావోఫిల్స్ అనే ద్వంద్వాలుగా విడిపోయేందుకు దారితీసింది.
మొదటి వర్గము- యూరప్ అనుసరించే సామాజిక, రాజకీయ విధానాలను రష్యా యధాతథంగా అనుసరించాలని నమ్మింది. రెండవ వర్గము- యూరోపియన్ ఆదర్శాలకు రష్యా నిబద్ధం కాకుండా, తనదయిన ప్రత్యేకతలతో ఉండాలని, అవి వృద్ధి చెంది, వ్యాపించాలనీ అభిలషించింది. దోస్తాయివ్స్కీ గురించి స్థూలంగా చెప్పాలంటే, తను వెస్త్రనైజర్ గా ఆరంభమయి, స్లోవోఫిల్ గా అభివృద్ధి చెందాడు. అయితే తను స్లోవోఫిల్ ఆలోచనలను ఎన్నింటినో ఆమోదించాడు కానీ, మొత్తంగా ఎన్నడూ అంగీకరించలేదు.
దీనికి ముఖ్యమయిన కారణం- స్లోవోఫిల్స్, భూదాస్యంతో సహా రష్యన్ గతాన్ని ఆదర్శవంతమయినదిగా ప్రస్తుతిస్తూ ఉండడమే. తన తొలినాళ్ళలో దోస్తోవ్స్కీ కొన్ని పాశ్చాత్య లక్ష్యాలను సదా అంటిపెట్టుకొని ఉండేవాడు. అయితే ఆ లక్ష్యాలు జారిజాన్ని బలహీన పరచనవసరం లేకుండానే సాకారం అవుతాయని ఆయన నమ్మాడు. పాశ్చాత్య అర్థంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం కానీ, మరే ఇతర ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ రష్యాకు సరిపోతుందని ఆయన అనుకోలేదు. కానీ ప్రచురణ, వాక్ స్వేచ్చలకు సదా అనుకూలుడుగానే ఉన్నాడు. తను ఎంతగానో కోరుకున్న వాటిలో భూదాస్యము రద్దు కావాలన్నది, 1861 లో జరిగింది. తద్వారా మరింత ఎక్కువ భూమి రైతులకు పంపకం జరగాలనీ ఆయన ఆశించాడు. సమాజంలోని అధిక అశాంతికి ఇదే కారణమని, ఈ విపత్తును తప్పించడానికి జార్ ప్రభుత్వం చర్యలను చేపడుతుందని తను మరణం వరకూ ఆయన నమ్ముతూ వచ్చాడు.
జీవిత చరిత్ర:
దోస్తాయివ్స్కీ తొలి, ముఖ్యమయిన నవల, “పూర్ ఫోక్”(POOR FOLK) గురించి చర్చించడానికి ముందుగా, మనం తప్పని సరిగా తన జీవితపు తొలి దశ గురించి కొన్ని మాటలను చెప్పుకోవాలి. నా విశ్లేషణా విధానం ప్రధానంగా సాంస్కృతిక, భావజాల కేంద్రంగా ఉంటుంది. కానీ తన జీవితానికి సంబంధించిన కొన్ని సంఘటనలు నిజానికి ఎంతో సాంస్కృతిక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.
దోస్తాయివ్స్కీ 1821లో విద్యకున్న ఆవశ్యకత ద్వారా, రష్యన్ సమాజంలో ఒక స్థాయిని అందుకోగలిగిన కుటుంబంలో పుట్టాడు. ఆయన తండ్రి సైనిక వైద్యుడు. తల్లి బాగా చదువుకున్న వ్యాపార కుటుంబం నుండి వచ్చింది. తండ్రి తన చదువు ద్వారా ఉన్నత వర్గ (NOBLE) స్థాయిని పొందాడు. కానీ అది రష్యాలో పౌర సేవల కోవకు చెందినది. అందువలన, భూస్వామ్య కుటుంబాలు, వాటికున్న పారంపరికమయిన ఉన్నత వర్గపు స్థాయిలో- అవి పొందేటంతటి గౌరవాన్నిఆయన పొందలేకపోయాడు. ఈ లోపం, దోస్తాయివ్స్కీని, మరీ ముఖ్యంగా తన తొలి రచనలలో-సామాజిక అవమానాల పట్ల తను ఎందుకంత సున్నితంగా ఉన్నాడో అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది.
బాల్యంలో తను పొందిన మత విద్య మరొక ముఖ్యమయిన విషయం. దోస్తాయివ్స్కీ తండ్రిది రష్యన్ ఆర్ధోడాక్స్ మతబోధకుల కుటుంబం. ఆయన గొప్ప భక్తుడు. తల్లి కూడా మతంపట్ల శ్రద్ధ కలదే. దోస్తాయివ్స్కీ కూడా తన నేపథ్యం గురించి చెబుతూ ఈ విషయాలను ఎంతో ముఖ్యమయినవిగా పేర్కొన్నాడు. తన చిన్నతనంలో తనకూ తన తమ్మునికీ ప్రెంచ్ నేర్పేందుకు ఇంటికి ఒక ట్యూటర్ వస్తుండేవాడు. అదే విధంగా ఆర్థోడాక్స్ పద్ధతులను నేర్పేందుకు ఒక మత బోధకుడు కూడా వచ్చేవాడు. పారంపరికంగా ఉన్నత స్థాయిని పొంది, ప్రెంచ్ లో పాశ్చాత్య విద్యను అభ్యసించే కుటుంబాలతో పోలిస్తే మతం పట్ల ఈ కుటుంబ వైఖరి దాదాపుగా భిన్నమయినదనే చెప్పాలి. తన జీవితపు మలి దశలో తన తల్లితండ్రుల నుండి పొందిన మత విద్యను, తన తల్లితో చేసిన తీర్దయాత్రలను ముఖ్యమమయినవిగా ఆయన రాసుకున్నాడు. ఆయన తల్లితండ్రులు తమ ఇద్దరు బిడ్డలనూ మంచి ప్రైవేట్ స్కూళ్ళలో చదివించారు. అలాగే రాత్రుళ్ళు పేరెన్నికగన్న రష్యన్ రచనలను, రష్యన్ లోకి అనువాదమయిన యూరోపియన్ రచనలను వినిపించేవారు.
దోస్తాయివ్స్కీని, ఆయన తండి తప్పని సరిగా మిలటరీ ఇంజనీరు కావాలని నిర్ణయించాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ కు చదువు కోసం పంపించాడు. కానీ తను అప్పటికే రచయిత కావాలని అనుకున్నాడు. పాఠశాలలో సాంకేతిక విద్యలో నెగ్గుకొస్తున్నప్పటికీ, సాహిత్యం పట్ల మెండయన ఆసక్తి తన చదువును దాటి పోతుండేది.
1839లో ఆయన తండ్రి చనిపోవడం దోస్తాయివ్స్కీ జీవితంలో ముఖ్యమయిన ఘటన. ఆయనను తమ ఊళ్ళో ఉన్న పొలంలో పని చేసే భూదాసులు (PEASANT SERFS) హత్య చేసి ఉంటారనే వదంతి ఏర్పడింది. కానీ అధికారికంగా తలలో నరాలు చిట్లి చనిపోయినట్టుగా నమోదయింది. ఈ చావు గురించిన వదంతే ప్రాయిడ్ కు దోదోస్తాయివ్స్కీ గురించి రాయడానికి ముఖ్యమయిన వనరుగా మారింది. తన ప్రఖ్యాత రచన “దోస్తాయివ్స్కీ అండ్ పారిసైడ్”(DOSTOEVSKY AND PAARICIDE) లో దోస్తాయివ్స్కీ స్వభావంపై, అలాగే మరీ ముఖ్యంగా “ద బ్రదర్స్ ఆఫ్ కరమజోవ్” రచనపై ఈ హత్య వదంతికున్న ప్రభావాన్ని ఊహించి విశ్లేషణ చేసాడు.
దోస్తాయివ్స్కీ అకాడమీ నుండి పట్టా పుచ్చుకొని ఇంజనీరుగా కూడా పనిచేసాడు. కానీ తన పనిలో మంచి పేరు గడించలేదు. కొంత వారసత్వ సంపద చేతికి రాగానే ఉద్యోగానికి చెల్లుచీటీ ఇచ్చేసాడు. తన తొలి నవల బాగా పోయింది. ఒక్కసారిగా గొప్ప పేరు వచ్చింది. అప్పటినుండి తన బతుకు రచనలపై వచ్చే అడ్వాన్సులు, చెల్లింపుల మీద ఆధారపడి నడవడం మొదలయింది. తనను తాను “సాహిత్య కార్మికు”డని ఆయన పిలుచుకున్నాడు.
తన మొదటి నవల విజయవంతమవడంతో తను వసరియన్ బెలిన్స్కీ(VASSARION BEINSKY) అనే పేరున్న విమర్శకుని పరిచయయంలోకి వచ్చాడు. ఆయన ద్వారా రాడికల్, సోషలిష్టు భావాల ప్రభావంలో ఉన్న యువ రచయితల సమూహంతో పరిచయం ఏర్పడింది. కానీ రెండేళ్ళలోనే ఆయన బెలిన్స్కీతో నాస్తికత్వం, సాహిత్యం విషయాలలో పేచీ పడాల్సి వచ్చింది. మనుషులను దేవుడు సృష్టించలేదు. మనుషులే దేవుడిని సృష్టించారు అని ప్రకటించిన జర్మన్ తాత్వికుడు లుడ్విగ్ ఫూయర్ బాగ్ ప్రభావంలో బెలిన్స్కీ ఉండేవాడు. ఈ సంపూర్ణ నాస్తికతను దోస్తాయివ్స్కీ నిరాకరించాడు.
అప్పటినుండీ దోస్తాయివ్స్కీ, పెట్రషెవ్ స్కీ బృందపు (పెట్రషెవ్ స్కీ, చార్లెస్ ఫోరియర్ అనుచరుడు) సమావేశాలకు హాజరవడం మొదలుపెట్టాడు. వారంతా వారానికి ఒకసారి హాజరయి ఆధునిక యూరోపియన్ భావజాలంపై చర్చిస్తుండేవారు. వాళ్లలో చాలామంది చార్లెస్ ఫోరియర్ శిష్యులు. విప్లవ హింసపై వారికి నమ్మకం లేకపోయినప్పటికీ, నూతన సాహసోపేత ప్రపంచనికి తామే ఉదాహరణగా నిలవాలని కోరుకునేవాళ్ళు. వీరి సోషలిస్టు కార్యక్రమాలకు దోస్తాయివ్స్కీ అంగీకారం ఉండేది కాదు. అవన్నీ మనిషి వ్యక్తిత్వంలో జోక్యం చేసుకొనేవిగా ఆయన అనుకునేవాడు. కానీ భూదాస్యత పట్ల ఆయనకున్న హింసాత్మక ద్వేషం వల్ల ఆ బృందాన్నే అంటిపెట్టుకొని ఉండేవాడు.
ఈ ద్వేషమే ఆయన, అదే గ్రూపులో ఎనిమిది మందితో కూడిన రహస్య బృందంలో చేరేందుకు తోడ్పడింది. వాళ్ళ లక్ష్యం భూదాస్యతకు వ్యతిరేకంగా విప్లవాన్ని నిర్మించడం. కానీ 1848లో యూరప్ అంతటా విప్లవాలు వ్యాపించడంతో పెట్రషెవ్ స్కీ బృందం అరెస్టయింది. రహస్యబృందపు ప్రణాళికలు ఆగిపోయాయి. ఈ విప్లవకర రహస్య బృందపు ఉనికి దోస్తోవ్స్కీ చనిపోయిన చాన్నాళ్ళ తర్వాత, 1922 లోబయటపడింది. కానీ ఈ ప్రభావాన్నీ దోస్తాయివ్స్కీ తన జీవితమంతటా చవి చూశాడు. విప్లవం కోసం హత్య చేయాడానికి, తన అంగీకారమున్నదనే ఎరుక భారంతో ఆయన జీవితాన్ని మోసాడు. గాఢమయిన ఈ మానసిక అవస్థ పట్ల ఉన్న అవగాహన- తనవయిన పాత్రలను నవలలో రాయడానికి ఆయనకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుంది.
తన అరెస్టు తర్వాత ఒక సంవత్సరంపాటు ఆయన ఏకాంత నిర్బంధాన్ని గడిపాడు. ఉన్నత స్థాయి వర్గపు వ్యక్తిగా ఆయనను అక్కడ బాగానే చూసుకున్నారు. కానీ తర్వాత ఆయనను ఫైరింగ్ స్క్వాడ్ ముందు నిల్చోబెట్టారు. చివరి నిమిషంలో మాత్రమే ఆయనకు ప్రాణభిక్ష పెట్టారు. ఆ తర్వాత ఆయన నాలుగేండ్ల పాటు కఠినమైన నిర్బంధ శ్రమ శిక్షను అనుభవించాడు. శిక్షానంతరం రష్యన్ సైన్యంలో సిపాయిగా పని చేసాడు. అధికారి స్థాయికి కూడా తిరిగి రాగలిగాడు. తన ఆధ్యాత్మిక, భావజాల సంబంధ ఆలోచనలు తిరిగి రూపొందడంలో ఆయన అనుభవించిన కారాగార శిక్ష, మాక్ ఎగ్జిక్యూషన్ నిర్ణయాత్మకమయినవయ్యాయి. ఈ కాలమే తన స్వీయజీవితానుభవ కథనంగా చెప్పుకోనే, అతి తక్కువ మంది పాఠకులు మాత్రమే చదివిన, ముఖ్యమయిన రచన “హౌస్ ఆఫ్ ద డెడ్” (HOUSE OF THE DEAD)కు ప్రేరణ అయింది. దీన్ని టాల్స్టాయ్ రష్యన్ సాహిత్యపు మాస్టర్ పీస్ గా అభివర్ణించాడు.
సాహిత్య నేపథ్యం:
రష్యన్ సాహిత్యపు ప్రత్యేకమయిన దశలో దోస్తాయివ్స్కీ రచయిత అయ్యాడు. తనను అర్థం చేసుకోవాలంటే ఈ నేపథ్యం నుండీ పరిశీలించడం చాలా ముఖ్యమయిన విషయం. స్థూలంగా చెప్పాలంటే; పీటర్ ది గ్రేట్ ఆరంభించిన సంస్కరణల వల్ల మొత్తంగా రష్యన్ సంస్కృతిలో వచ్చిన మార్పులు- వాటితో పాటుగా రష్యన్ మెటీరియల్ ను యూరోపియన్ శైలిలో, దానికి అనుగుణంగా మార్చుకుంటూ పోవడమనే ధోరణినే ఆ కాలపు రష్యన్ సాహిత్యమని మనం అనుకోవచ్చు.
దోస్తోవ్స్కీ పిల్లవాడిగా ఉన్నప్పుడే, మహా రచయిత ఎ. ఎస్. పుష్కిన్, బైరన్, షేక్స్పియర్ లను మోడల్ గా తీసుకొని, రష్యన్ కథాంశాలను ఆ మోడల్ ల ఆధారంగా ఎలా కళాఖండాలుగా మార్చవచ్చునో తన సృజన ద్వారా నిరూపించి చూపాడు.
ప్రజాధరణ పొందిన నవలలెన్నో ఈ రకమైన ఉన్నత స్థాయి రొమాంటిక్ శైలిలో వచ్చాయి. వీటికి వికట ప్రస్తావనలు(parodistic references) “పూర్ ఫోక్” లో ఉన్నాయి. కానీ 1840 తొలినాళ్లలో విమర్శకుడు బెలిన్స్కీ, రష్యన్ రచయితలు తప్పని సరిగా బాల్జాక్, జార్జ్ సాండ్, డికెన్స్ వంటి రచయితలను అనుసరించాలని వాదించడం మొదలు పెట్టాడు. తను ప్రస్తావించిన రచయితలందరూ వారి కాలానికి చెందిన సామాజిక సమస్యల మీద, సమాజం మీదా దృష్టి పెట్టారు. తద్వారా ఆయా సమస్యల గురించి పాఠకులలో చైతన్యాన్ని లేవనెత్తారని మనం చెప్పవచ్చు.
బెలిన్స్కీ ఈ విషయాలను నికొలాయ్ గోగల్ రాసిన “డేడ్ సోల్స్”(DEAD SOULS) అనే నవల, “ద ఓవర్ కోట్”(THE OVER COAT) అనే కథ ఆధారంగా బలంగా చెప్పగలిగాడు. గోగల్ ను ఉదాహరణగా తీసుకోమని ఆయన రష్యన్ రచయితలకు బోధించాడు. దోస్తాయివ్స్కీ అప్పటికే బాల్జాక్ ను ఆరాధిస్తుండేవాడు. అచ్చులోకి వచ్చిన తన తొలి రచన, “యూజిని గందే” (EUGENIE GRANDET) అనే బాల్జాక్ ప్రెంచ్ నవలకు అనువాదమే. దోస్తాయివ్స్కీ, గోగల్ ను కూడా ఆరాధించేవాడు. తన “పూర్ ఫోక్” నవలలోని ప్రధాన పాత్ర , గోగల్ రాసిన “ద ఓవర్ కోట్” లోని ప్రధాన పాత్ర- రెండూ, ఒకే రకమైన సోషల్ టైప్ నుండి వచ్చినవే. అయితే దోస్తాయివ్స్కీ, గోగల్ రాసిన “ఓవర్ కోట్” ను కేవలం ధరించడమే కాకుండా దానిని తిరగదిప్పి చూపాడు.
ఇతర సాహిత్య ప్రభావాలు:
దోస్తాయివ్స్కీ తొలి నవలను చర్చించడానికి నికొలాయ్ కరామ్జిన్, పుష్కిన్ అనే ఇద్దరు రచయితలు చాలా దోహదపడతారు. వీరిద్దరూ “పూర్ ఫోక్” నవలకు బాగా సంబంధం ఉన్నవాళ్ళు. ఈ వాస్తవం దోస్తాయివ్స్కీ గురించిన ఒక విషయాన్ని తెలియజేస్తుంది. ఆయన, తన వ్యక్తిగత అనుభవాలనుండి రచనను సృజియించే రచయిత. అంతేకాక తన కాలపు సంస్కృతి, భావజాలాల కారణంగా తలెత్తిన ఆయా అనుభవాలకు ప్రతిస్పందించే గుణమున్నవాడు. తన రచనలను అర్థం చేసుకొనేందుకుగానూ నిరంతరంగా సాంస్కృతిక ఆధారాలను (cultural clues) వాటిలో పొందుపరిచేవాడు. తన రచనలలోని పాత్రలను, వాటి వైయక్తిక మానసిక స్థితి, సంఘర్షణల నుండి మాత్రమే కాకుండా రష్యన్ సాంస్కృతిక వాతావరణంలో వాటికున్న విస్తృతమైన అర్థం ఆధారంగా అవి తెలియజేసే అంశాలను అవగాహన చేసుకోవాలని ఆయన కోరుకుంటాడు.
కరామ్జిన్ రష్యాకు బయట అంతగా పేరున్నవాడు కాదు. కానీ, ఆయన రష్యాలో విస్తృత ప్రభావశాలి అయిన ఒక ముఖ్య రచయిత. ఆయన కథలే కాకుండా, “లెటర్స్ ఆఫ్ ఎ రష్యన్ ట్రావెలర్” పేరుతో ఒక ట్రావెలాగ్ ను, చదివించే ఆధునిక శైలిలో ఒక రష్యన్ చరిత్ర పుస్తకాన్ని కూడా రాశాడు. దానిలో, మొత్తం రష్యన్ చరిత్రలోనే జార్ ఆధ్వర్యంలో ఒక వంద ఏళ్ళుగా సాగుతున్న పరిపాలన లాంటి సహేతుకమయిన పాలన మరొకటి లేదని ప్రస్తుతించాడు. దోస్తాయివ్స్కీ తన మలి దశలో, తను కరామ్జిన్ రచనలను చదువుతూ ఎదిగినవాడినని రాసుకున్నాడు. ఇది 1840లలో ఎదిగిన తరానికంతటికీ వర్తిస్తుంది. కరామ్జిన్ కు దోస్తాయివ్స్కీ “పూర్ ఫోక్” కు ఉన్న సంబంధం ఏమిటంటే, కారామ్జిన్ రాసిన కథలలో బాగా పేరున్న ఒక కథ పేరు “పూర్ లిజా”. దానిలో అణకువ కలిగిన, పీడిత వర్గానికి చెందిన ఒక అమ్మాయి తలరాతను అయన గొప్ప కరుణతో రాశాడు.
“పూర్ లిజా”లోని రైతుల అమ్మాయిని రచయిత గొప్పగా ఆదర్శీకరిస్తాడు. ఆమె వీధుల వెంట పూలు అమ్ముతుంటుంది. అందానికి, సధ్గుణాలకు ఆమె పరాకాష్ట. ఆమె ఒక సంపన్నుడయిన ఉన్నతవర్గ యువకునితో ప్రేమలో పడుతుంది. కానీ ఆ యువకుడు తన వర్గానికే చెందిన సంపన్న యువతిని వివాహమాడతాడు. బాధతో “పూర్ లిజా” తాము ఎప్పుడూ కలుసుకునే మఠం తోటలోని చెరువులో పడి ప్రాణాలు తీసుకుంటుంది. ఈ కథా ప్రాముఖ్యత వల్ల ఆ తోట, చెరువు బాగా పేరులోకి వచ్చి ప్రేమికుల కలయికలకు గొప్ప నెలవుగా మారింది. దోస్తాయివ్స్కీ తన నవలకు పెట్టిన పేరు పాఠకులకు “పూర్ లిజా”ను గుర్తుకు తెస్తుంది. కానీ ఆయన శైలీ, సంవిధానము పూర్తిగా వేరు. ఆయన నవలలో పొందుపరిచిన వివరాలు మరింత కటువుగా, పచ్చిగా ఉన్నాయి. అయితే, దోస్తాయివ్స్కీ కథ ’పూర్ లిజా”లోని విషయాలనే తనదయిన పద్దతిలో పాఠకుల ముందుకు తెస్తుంది.
“పూర్ ఫోక్” నవలలో ప్రస్తావనకు వచ్చే మరో రచయిత పుష్కిన్. యువకుడిగా ఉన్నప్పుడు దోస్తాయివ్స్కీ ఆయనని చాలా ఆరాధించాడు. పుష్కిన్ ఒక ద్వంద్వ యుద్ధంలో చనిపోయినప్పుడు, అదే సంవత్సరం అతని తల్లికూడా చనిపోతుంది. తన తల్లి, పుష్కిన్ కంటే ముందుగా చనిపోయి ఉన్నట్లయితే ఆయన కోసం కన్నీరు కార్చడానికి ఏమీ మిగలనంతగా దుఃఖంతో తాను అరిగిపోయుండే వాడినని ఆయన అంటాడు. దోస్తాయివ్స్కీ తన చివరి ఏడాదిలో, ఒక ప్రఖ్యాత ఉపన్యాసంలో పుష్కిన్ కూడా షెక్స్పియర్, సెవాంటిస్, గూటే వంటివారితో సమానుడని, ఇంకా కొన్ని విషయాలలో వారిని మించిపోతాడని కూడా ప్రకటించాడు.
దోస్టాయివ్స్కీ “పూర్ ఫోక్” రాయడానికి పుష్కిన్ కథ “ద స్టేషన్ మాస్టర్” ఒక ప్రేరణ. ఈ కథారంభం సెంటిమెంటలిజం ప్రభావాన్ని తెలియజేస్తుంది. “పూర్ లిజా”లోని కథాంశాన్నే ఇక్కడా కొనసాగించడం – అధికారం, ఆధిపత్యాల ముందు దిగువతరగతి ప్రజల నిస్సహాయ స్థితి కొనసాగింపునే చూపుతుంది. దీనిలో ఎలాంటి సానుభూతిని పైకెత్తడానికి పుష్కిన్ కథ రాస్తాడో, తర్వాత రోజుల్లో అదే లక్ష్యంతో “ఇన్సల్టెడ్, ఇంజ్యూర్డ్ “ను దోస్తయివ్స్కీ రాశాడు. పుష్కిన్ కథలో- ఇక్కడ కూడా ఒక దిగువతరగతి అమ్మాయి ఉంటుంది. ఆమె ఒక స్టేషన్ మాస్టర్ కూతురు. అతని పని ప్రయాణీకుల బండ్ల గుర్రాలను తన మజిలీలో సంరక్షణ చేయడం. కథానాయికను ఆ దారిలో ప్రయాణిస్తున్న ఒక ఉన్నతశ్రేణి వ్యక్తి లొంగదీసుకుంటాడు. అయితే్, ఆమెను తండ్రి నుండి తీసుకపోయి భార్యగా చేసుకుని గౌరవంగా చూసుకుంటాడు. కానీ అవమాన భారం తండ్రి గుండెను బద్దలు చేస్తుంది. కూతురుని తిరిగి వెనక్కి తెచ్చుకొనే ప్రయత్నంచేస్తాడు. అతనిని ఉన్నత స్థాయి వ్యక్తి మనుషులు తరిమికొడతారు. అతను దుఃఖంతో తాగుడుకు చనిపోతాడు. ఆ తర్వాత కూతురు ఏడుస్తూ వచ్చి తండ్రి సమాదిపై పడుతుంది. కథలో మరలా ఇక్కడ దిగువస్థాయి తరగతి హీన స్థితి, దీనులైనప్పటికీ ఉధ్వేగ గాఢతలో ఉన్నత వర్గాలతో వారికున్న సమానత, నిస్సహాయత వంటి వాటిపై పాఠకుల సావధానతను రచయిత మళ్ళిస్తాడు.
“పూర్ ఫోక్” లో స్పష్టంగా సూచించబడిన రచయిత గోగల్. అతని పూర్వాపరాలు కొద్దిగా చెప్పుకోవాలి. 1840 ల మధ్య ఉన్న కాలాన్ని గోగల్ దని రష్యన్ సాహిత్యంలో పిలిచారు. దోస్తొయెవ్స్కీ అప్పటి నూతన సాహిత్య పోకడలను బాగా అనుసరించేవాడు.
సాహిత్య విమర్శకుడు బెలిన్స్కీ, ఆ కాలంలో వస్తున్న కొన్ని రకాల రచనలను “ఫిజియాలజికల్ స్కెచెస్” అని అన్నాడు. ఇవన్నీ సాధారణ నగరజీవితం గురించినవి. నగరంలో నివసిస్తూ, తమ రోజువారీ పనుల ద్వారా తమ ఉనికిని తమపై ఉన్నవారు గుర్తెరిగేలా చేసే బతుకు వర్ణనలు ఇవి. ఇళ్ళలో పనిచేస్తూ మంచును ఊడ్చేవాళ్ళు, వీధులలో సంగీతం వాయిస్తూ బిక్షాటన చేసేవాళ్లు- వీళ్ళలో కొందరు. ఈ అలగా జనాలకు సాహిత్యంలో చోటు సంపాదించే విలువ ఉన్నదని గతంలో అనుకునేవాళ్ళు కాదు. ఒక వే్ళ అక్కడక్కడా కనపడినా ఏదో హాస్యానికన్నట్లూ ఉండేవారు.
ఈ సమయంలో బెలిన్స్కీ, యువ రష్యన్ రచయితలను “ద ఓవర్ కోట్” కథను రాసిన గోగల్ ను ఉదాహరణగా తీసుకోమని విఙ్ఞప్తి చేసాడు. ఈ కథలో ప్రధాన పాత్ర అకాకి అనే ఒక గుమస్తా. అతను రష్యన్ సామాజిక నిచ్చెనలో కింద వరుసలో ఉన్న ఆసక్తికరమైన పాత్ర. పీట్స్ బర్గ్ లోని బ్యూరోక్రసీ కింద పనిచేస్తూ, జార్ సామ్రాజ్యాన్ని కొనసాగేలా చేసే గుమస్తాల సైన్యంలో సభ్యుడు. రచయిత అతని కథను ఊర్ధ్వ(superior) స్వరంతో, వ్యంగ్యంగా(ironic) చెబుతూ, పాఠకుడిని కూడా అదే స్థితిలో ఉంచుతాడు. అధికార పత్రాలకు నఖలు రాస్తూ మన కథానాయకుడు కూడా సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఇంట్లో కూడా తను ఇదే పని చేస్తూ ఉంటాడు. కానీ
ఒక డాక్యుమెంట్ లో ఉన్న విషయాన్ని సంగ్రహం చేసి రాయమని పై అధికారి తనను అడిగినపుడు నఖలు మాత్రమే రాయడానికి అలవాటు పడిన అకాకి ఆ పని చేయలేకపోతాడు.
గోగల్ దిగువ తరగతి వారి గురించి రాస్తుంటాడు కానీ అతని పాత్రలకు అనుకూల అంశాల వెలుగులేవీ ఉండవు. కథలోని గుమస్తాను అతని తోటి వారే తమాషా చేసి ఏడిపిస్తుంటారు. అప్పుడు అతను వారిని వ్యతిరేకిస్తూ, “నేను మీకేమి చేసాను ?” అని అడుగుతాడు. ఈ పిర్యాదుకు అప్పుడే కొత్తగా పనిలో చేరిన మరో గుమస్తా చలించిపోతాడు. చీల్చుకపోతున్నట్లుగా ఉన్న ఈ ప్రశ్న ఇంకా అలా ఉండగానే “నేను మీ సోదరుడను” అని అకాకి అంటున్న మాటలు అతనికి ప్రతిధ్వనిలా వినిపిస్తాయి. క్రైస్తవీయమయిన ఈ రకపు కరుణను ఒక వైపు పాఠకులకు క్లుప్తంగా పరిచయం చేస్తూ, మరో వైపు ఈ ఘటన ఆ యువ గుమస్తా మీద జీవితాంతం చెరగిపోని ముద్ర వేసిందని రచయిత అంటాడు.
ఇలాటి దీన స్థితిలో ఉన్న అకాకి ఓవర్ కోట్ పూర్తిగా చిరిగిపోయి, రష్యన్ శీతాకాలానికి పనికిరానిదవుతుంది. అతనికి ఒక కొత్త ఓవర్ కోట్ అవసరమవుతుంది. కొత్త ఓవర్ కోట్ ధర అతను మోయలేనిది. అతను దాని కోసం తినే తిండిని కూడా తగ్గించుకొని డబ్బు పొదుపు చేస్తాడు. చివరకు తను అనుకున్నది సాధించడంతో తన జీవితం మారిపోయిందని ఎంతో గర్వపడతాడు. తన సహచరులు కూడా తనను అంతో ఇంతో గౌరవించడం మొదలుపెడతారు. ఎందుకంటే అతను ఇప్పుడు చిరుగుల బొంత కాదు. అతను మనిషిగా అవుతున్న క్షణాలవి. కానీ అతని కోటును ఒకరాత్రి ఎవరో దొంగిలిస్తారు. తను స్థానిక పోలీసు అధికారికి ఫిర్యాదు చేస్తాడు. అతనిని అక్కడ ఎవరూ పట్టించుకోరు. బయటకు నెట్టివేస్తారు. చివరకు దిగులుతో జబ్బుపడి అతను చనిపోతాడు. కానీ కథ అక్కడితో ఆగకుండా, గోగల్ సహజ ధోరణి అయిన మానవాతీతమైన(super natural) పద్ధతిలో ముగుస్తుంది. అకాకి ఎక్కడైతే తన కోటును పోగొట్టుకుంటాడో అక్కడ ఒక భూతము దారిన పోయే ప్రతీవారి కోటునూ తస్కరించడం మొదలుపెడుతుంది. చివరకు ఆ భూతం ఎవరైతే ఆకాకీను బయటకు గెంటివేసారో ఆ పోలీసు అధికారి కోటును కూడా ఊడబెరకుతుంది.
భూతం చేసే ఈ దొంగతనాలు ఇప్పుడు ఇతర జిల్లాలకు కూడా పాకిపోయాయని, “భూతాలు” తయారయ్యాయనీ, అవి ఎవరో, ఏమిటో కూడా అసలు స్పష్టం కావడం లేదని అంటూ, ఇవన్నీ పోలీసు వారి అసమర్ధతకూ, లంచగొండితనానికీ గుర్తులని ఒక పాఠకుడు వ్యంగ్యంగా అనడంతో కథ ముగుస్తుంది.
బెలిన్స్కీ సూచనను పాటిస్తూ, ఇదే విధమైన సామాజిక స్థాయిలోని (same social level) పాత్రలను తన నవలలలో రాసి, దోస్తాయివ్స్కీ తన కాలపు సంప్రదాయాన్ని అనుసరించాడు. కానీ ఆయన పుష్కిన్ రాసిన సామాజిక ఉద్వేగాలను(social pathos), గోగల్ రాసిన బ్యూరోక్రటిక్ ప్రపంచాన్నీ కలిపి పాత్రలను మార్చివేసాడు. అన్నిటికన్నా ముఖ్యమైన మార్పు- కథలోనూ, రూపంలోనూ చొరబడి దిగువ తరగతి ప్రపంచపు లోతులను పాఠకుడికి చూపించే ఉన్నతవర్గపు కథకుడిని(narrator )ఆయన పూర్తిగా రద్దు చేయడం.
మా సత్యం
అవ్వారి నాగరాజు గారు
రాసిన ‘దోస్తాయివ్స్కీ ప్రపంచము భిన్నమయినది’ వ్యాసం లో
వారి జీవిత నేపథ్యాన్ని వారి నవలలోని ఇతివృత్తన్ని ఎంతో క్లుప్తంగా విశ్లేషణాత్మకంగా వివరించారు. సందర్భాన్ని బట్టి సిగ్మాండ్ ఫ్రైడ్ కూడా పేర్కొనడం ప్రశంసనీయం.