ఏలియన్స్

Spread the love

ఎవరి ఉనికి వారికొక యూనివర్స్
పుటక నుండి పుడకల వరకు
ఏపూటకాపూట
నా గతి ఏమిటనే తపన
ఒక ఆత్మభ్రమణం

యూనివర్స్ కూడా నాలా ఒంటరిదేనా?
లేక మల్టీవెర్స్ మాదిరిగా
బహుళ విశ్వాలు కలసి ఉండే కూటమా?
చీకటిబయలును దాటి వెలిగే స్థలకాలాల్లో
కాంతి శక్తి నడిపే కాస్మిక్ ఆవరణలో
అగణిత అభంగుర పదార్థం మొత్తానికి
నేనూ ఒకానొక ప్రతిపదార్థాన్నేనా..?

గ్రహాలు నక్షత్రాలు గెలాక్సీల
గతి నియమాల గురించి ఎందుగ్గానీ..
ఏ అణువులూ గోళాలూ బ్రహ్మాండాలైనా
నా ఆశల కుందేలు పరుగుతో
ఎంతమాత్రం పోటీ పడలేని
కుంక తాబేళ్ల కుంటి నడకలే కదా!

ఎక్కడో ఏ 'ఫిష్ బౌల్ ప్రపంచం'లోనో
గ్రహాంతర నాగరికతలు ఉండొచ్చు గాక
మరెక్కడో ఏ కైవారం ఉనికిపట్టులోనో
వింత జీవులు సంచరిస్తుండొచ్చు గాక
నా చుట్టున్నవాళ్ళెందరో నాకు ఏలియన్లు!
ఇక పాలపుంత అనంత భూగ్రహాలను వెదికి
వేరొక జిజ్ఞాసి చెయ్యందుకునేదెపుడు?

పోనీ 'ఫెర్మి పారడాక్స్' సంగతేంటో చూద్దామంటే
పక్క వీధిలోకి పనిమీద వెళ్ళిరావడమే కష్టం
ఇక ఖగోళం మూల మూలల్ని దర్శించేదెపుడు?

ఏ తర్కంతో వెళ్ళి రావాలనుకున్నా
నా నుండి నా వరకే
నా నిజ సంభావ్యత
ఊహల రెక్కల మీద మాత్రం
నాదొక అంతర్విశ్వ స్వప్నసంచారం!
కంచరాన భుజంగారావు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *