ఊపిరి పీల్చడానికి కూడా అనుమతిని కోరే కట్టుబాట్ల కంచెలు

Spread the love

నిశ్శబ్దం నిండిన వీధుల్లోనుండి నడుస్తున్నప్పుడు, నిర్మానుష్యపు వాసనలు వెదజల్లే చోట గుండెచప్పుడు కూడా గుర్రంలా దౌడు తీయడాన్ని ఎంత మంది తమ అనుభవంలోకి తెచ్చుకున్నారో కానీ.., ఈ పుస్తకంలోని ఆమెల్లోని అలజడి అలాగే ఉంటుంది.

మనకు పరిచయం ఉన్న వీధిలో తలుపులన్నీ మూసి ఉంటాయి. ఒక్కో ఇంటికి వెళ్లి, తలుపు తట్టి చూస్తే…! ఆ నిశ్శబ్దంలో నుండి చీల్చుకు వచ్చిన ఇంటి గోడలు, మనకు కాలం పడ్డ ఆవేదనతో నిండిన చెమట చుక్కల సేద్యాన్ని, పరిచయం చేస్తాయి.
పన్నే పన్నే పే జిందగీ పడా హువా హే !! అన్నట్లు

ప్రతీ పేజీలో ఎన్నో జీవితాల ప్రతిబింబాలని మనం చదవచ్చు.

ఇక్కడ మనుషులు వారి మనస్తత్వం గురించి చర్చిస్తుంది రాషీద్ జహాన్.

రాషీద్ చెప్పే విషయాలు కథగా చదువుతున్నాం అనే కంటే, మనతో బాగా పరిచయం ఉన్న వ్యక్తులు ఎదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నట్లు కథని చెప్పడం రచనలోని స్పెషాలిటీగా చెప్పవచ్చు.

” ఆమె కాలిపోయింది” ఈ పుస్తకం టైటిల్ ఎందుకు పెట్టారా అనిపించింది. కానీ ఈ కథల్ని చదివాక ఆమె ఎన్ని రకాలుగా కాల్చబడింది..!, ఈ నేలపై ఎన్ని ముసుగులు కప్పుకుంధీ సంస్కృతి, సాంప్రదాయం.

ఆమెలుకాలిన వాసన ప్రతి మాటలో వినిపించింది కథకురాలు.
ఇందులో 11 కథలు, 2 నాటకాలు ఉన్నాయి. ప్రతి కథ పాత్రలో మాటలు మాట్లాడుతున్నట్టు, వారి కష్టం మనతో చెప్పుకుంటుంటే ఏమి చేయలేని ఈ సమాజపు సహజ కట్టుబాట్లు కట్టలు తెంచలేమా!!.
కాస్త ఊపిరి పీల్చే అవకాశం ఈ కథలోని పాత్రలకు ఇవ్వకూడదా.! అన్నట్లు నడిచింది కథా గమనం.

ఆమె కాలిపోయింది కథలోని విమలాదేవికి అందని న్యాయాన్ని, దొంగతనాలు చేసే ‘కమ్మన్’ చెప్పిన చట్టాల్లోని లొసుగుల్ని, అనారోగ్యం పాలై కన్ను ముక్కు లేని ఓ వేశ్యపై నసీబన్ బువా నిస్సహాయత ప్రవర్తనని, అత్తా – కోడళ్ళ మధ్య అంతులేని అస్తిత్వాన్ని, సిద్ధి వాళ్ళ అమ్మ… మతాన్ని అడ్డుపెట్టుకొని చేసిన అమానుషమైన ప్రవర్తనను తెలియజేసే కథాగమనాలు మనల్ని ఆ పరిసర ప్రాంతాల్లో ప్రయాణింప చేస్తాయి.
సాంప్రదాయ రీతిలో మునిగిపోయి, కూతురు పెళ్లికి తానే అడ్డయిపోయిన సిద్ధికి వాళ్ళ అమ్మని పరిచయం చేస్తున్న సమయంలో…, ముస్లిం సాంప్రదాయ వాదుల పరదా దాటని బతుకులు ఎంత చిధ్రమవుతున్నాయో, మనుషులు ఎంత మోసపోతున్నారో, విద్య ఎంత ముఖ్యమో ఆ విద్యలేని ఆడపిల్లల జీవితాల్లో ఏ మాత్రం మార్పు తీసుకురాలేకపోయిన ఈ సాంప్రదాయాల అసలు రూపాన్ని చక్కగా అనువదించి చెప్పారు గీతాంజలి గారు.
సామాజికంగా ముస్లిం మహిళల ఆలోచనలు తీరు చెప్తూ సంఘ పరమైన మెలుకువ మారుతున్న సమాజంలో మారాల్సిన అవసరాల్ని పాత్రల మాటల్లో చాలా స్పష్టమైన పదాలతో అర్థవంతంగా కథల్లో చర్చిస్తారు.
ఈ కథల్లో ఫెమినిజం స్పష్టంగా కనిపిస్తుంది. స్త్రీ ఆవేదన మతంలోని కట్టుబాట్ల మధ్య నలిగిపోయి పాత్రల సంభాషణ ద్వారా నాటకాన్ని చక్కని ప్రయోగంగా కూర్చుకున్నారు రచయిత్రి.
కథల్లోకి వెళితే.., తన ఇంట్లోనే దొంగతనం చేసిన వాడిపై జాలిపడే డాక్టర్, అవకాశం వచ్చినా ఆ దొంగ గురించి ఎవరికీ చెప్పలేకపోవడంలోని మానవత్వం, సామాజిక పరమైన హింస, సమాజంలో వృత్తిపరమైన అవసరం, ఆ వృత్తిని నిలబెట్టుకోవడంలోని నిబద్ధత,

డాక్టర్ – దొంగ కి జరిగిన సంభాషణలో చర్చకు వస్తుంది.

” గుడ్డివాని చేతి కర్ర ” ఈ కథకో ప్రత్యేకత ఉంటుంది. ప్రతి స్త్రీ తల్లి అవ్వడానికి పడే వేదన కనిపిస్తుంది. కుటుంబంలో ఆస్తి కలిసి వచ్చినప్పుడు అయిన వాళ్లే వేసే చిక్కుముడులు కనిపిస్తాయి., కాలం కలిసి వచ్చి ఆడపిల్లల్ని కన్న తల్లి తన చుట్టూ ఉన్న దుర్మార్గమైన ఆలోచనలు పిల్లలపై పడకుండా భర్తనీ, కుటుంబాన్ని, బంధువులని, ఎదిరించి నిలబడే ధైర్యం కనబడుతుంది. తల్లి కూడా గుర్తించడం కష్టమైపోయిన కవల పిల్లల ఆస్తి కోసం.., ఆ పిల్లల పెళ్లిళ్ల మీద పడ్డ ప్రభావాన్ని ఎదుర్కొనే సమయంలో… ఆ పసి హృదయాలు పడే ఆవేదన, సంప్రదాయ రీతుల వెనక పెళ్లి చేసుకున్నది ఎవరిని!? కాపురం చేస్తోంది ఎవరితోనో..!? తేల్చుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు, ఆ…ఆడపిల్లల ఆవేదనని కథగా మలచడంలో రాషీద్ చాలా జాగ్రత్త తీసుకున్నారు అనిపించక మానదు. ఈ కథకి అనువాదం కూడా చక్కగా కుదిరింది. ఈ ఉర్దూ కథల అనువాదంలో స్త్రీ తన డెలివరీ సమయంలో పడే వేదనని, ఆమె నొప్పులు పడే సమయాన్ని, స్త్రీలంతా గుంపుగా చర్చించుకునే విధానంద్వారా…, మాయపొర బయటికి రానప్పుడు, పేగు ముడి వేసే సమయంలో పడే వేదనలోని ఆంతర్యాన్ని కథలో పొరలు పొరలుగా ఓ ముచ్చట రూపంలో చెప్తారు ” ఆసిఫ్ జహాన్ కోడలు ” కథలో. ఈ పుస్తకం మొత్తం ముస్లిం మహిళలు అనుభవిస్తున్న మానసిక హింసకి ప్రతిరూపంగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ కేంద్రకంగా సాగే కథా గమనాలు ఉంటాయి. అయితే ఈ కథలు చదువుతున్నప్పుడు ఆ పేర్లు నాకు కాస్త అలవాటు కావడానికి సమయం పట్టింది. గందరగోళానికి గురిచేసింది, కొన్ని సాంప్రదాయ రీతుల్ని చదువుతున్నప్పుడు ఆ సాంప్రదాయాల వెనక ఉన్నది కేవలం సంపద(ఆస్తి ) మూలం అని తెలుసుకున్నప్పుడు మాత్రం ఏ సాంప్రదాయ రీతులైనా, అనుసరించే పద్ధతులైనా, స్త్రీ స్వాతంత్ర్యాన్ని, ఆమె గమనాన్ని శాసిస్తూ మగవాళ్ళ జీవితాల్ని పరిమళింప చేస్తూ… ఉంటుందని!!, చెప్పకుండా.. ఉండలేని పరిస్థితి. ఎందరో ఆమెలు మాటల చలికి గడ్డకట్టుకు పోవడాన్ని, అస్తిత్వ పోరాటానికి కూడా సాంప్రదాయాల చక్రంలో పోరాడి గెలిచి, ఓడిన పాత్రలని ఈ పుస్తకంలో చదవచ్చు. గీతాంజలి గారి రచనా విధానం అలవాటు ఉన్న నాకు ఇది కాస్త కొత్తగా అనిపించినా.., అనువాదంలో చాలా చక్కగా తన శిల్పాన్ని తాను తీసుకొని వచ్చారని చెప్పవచ్చు. స్త్రీ ఆవేదనని కథగా నిర్మించడంలో గీతాంజలి గారి రైటప్ తోడవడం వల్లనే ఈ అనువాదం రీడర్ కి చేరువైందేమో..!! డాక్టర్ రాషీద్ జహాన్ రచనని, ఉర్దూ మూలాన్ని, అనువదించి ఈ పుస్తకంగా తీసుకువచ్చిన గీతాంజలి గారికి అభినందనలు. పుస్తకం కోసం ఎన్నేలపిట్టని అడగండి

ఆమె కాలిపోయింది!
✍️- రాషిద్ జహాన్
అనువాదం- గీతాంజలి

Rupa Rukmini

Spread the love

One thought on “ఊపిరి పీల్చడానికి కూడా అనుమతిని కోరే కట్టుబాట్ల కంచెలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *