విప్రతీసారము

Spread the love

“నేను అలా చేయకుండా ఉండాల్సింది. కొంచెం సంయమనంతో వ్యవహరించుంటే ఇలా జరిగేదే కాదు. దిద్దుకోలేని తప్పే చేశాననుకున్నా.  కానీ దిద్దుకునే అవకాశం వచ్చింది. మరోసారి ఇలాంటి పొరపాటు చేయనే చేయరాదు” అని మనసులో తనకు తాను సమాధానం చెప్పుకుంటున్నాడు నారాయణస్వామి.

          నారాయణస్వామి ఆదోని రైల్వేస్టేషన్లో ముంబై ట్రైన్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. భార్య కోమలాదేవి కూడా బరువెక్కిన హృదయంతో మౌనంగా అతని పక్కనే కూర్చోనుంది. ఆమెకు తన జీవితం శూన్యమైనట్లుగా తోస్తోంది. రైల్వేస్టేషన్ అంతా హడావుడిగా వుంది. వెండర్స్ ఆ.. ఛాయ్, ఆ….సమోసే, ఆ….. బటర్మిల్కే… అని గట్టిగా అరుస్తూ  ప్రయాణికుల మధ్య తిరుగుతున్నారు. ఎవరి హడావుడిలో వారున్నారు. మురికిపట్టిన బట్టలు, చెదిరిపోయిన రాగిరంగు జుట్టుతో వున్న పిల్లవాడొకడు “సా! ఆకలౌతోంది. తినడానికి ఏమైనా ఇప్పించండి సా!”అని ప్రాధేయపడుతూ అందరినీ వేడుకొంటున్నాడు. కొందరు చీదరించు కుంటున్నారు.  కొందరు మొహం తిప్పుకుంటున్నారు. మరికొందరు సెల్ఫోన్లో ట్రైన్ ఎక్కడ వస్తోందో తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లవాడు నారాయణస్వామి దగ్గరకు వచ్చి “సా! ఆకలిగా వుంది.  తినడానికి ఏమైనా ఇప్పించండి సా!” అని వేడుకున్నాడు. సాదారణంగా  అయితే నారాయణస్వామి ఇటువంటి వారు తారస పడినప్పుడు ‘దిట్టంగా ఉన్నావు పనిచేసుకోవచ్చుగా’ అని క్లాస్ తీసుకొనేవాడే. కానీ ప్రస్తుతం అతడున్న పరిస్థితి అతడిచే అలా మాట్లాడించేటట్లు లేదు. వాడిని షాప్ దగ్గరకు తీసుకెళ్లి సమోసా, ఆలుచిప్స్ పాకెట, వాటర్ బాటిల్, కూల్డ్రింక్ బాటిల్ ఇప్పించి వాటన్నిటిని ఒక క్యారీబ్యాగులో వేసి వాడిచేతికిచ్చాడు. పిల్లవాడు ఆశ్చర్యముతో ఆనందంతో అతడి వైపు చూస్తూ ఉండిపోయాడు. పిల్లోడి బుగ్గను తన చేతితో తాకి, తినమన్నట్టుగా సైగచేసి తన భార్య కూర్చున్న బెంచీ దగ్గరకు వచ్చాడు.

          షాపు వాడు “రేయ్ ఇక వెళ్ళు! ఈరోజు నక్క తోక తొక్కి వచ్చావ్ పో! వెళ్ళు ఇక్కడినుండి”  అంటూ వాడిని గద్దిస్తూ అక్కడి నుండి పంపించేశాడు. తనవైపేచూస్తూ సంతోషంగా వెళుతున్న పిల్లవాడిని చూసి ఆందోళనతో కూడిన నారయణస్వామి మనసు  కొంత ఉపశమనం పొందింది.

          నారాయణస్వామి ఎమ్మినూరులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఎమ్మిగనూరు సమీపంలోని దివందిన్నె గ్రామంలో ఉన్నత పాఠాశాలలో ఇంగ్లీష్ బోధిస్తుంటాడు. భార్య కోమలాదేవి గృహిణి. మనోజ్ వారికున్న ఏకైక సంతానం. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో మనోజ్ ఏడో తరగతి చదువుతున్నాడు. వాడిని ఖరగ్పూర్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదివించి గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలనేది నారయణస్వామి ఆశయం.  ఇటీవలే తన కొలీగ్ కొడుకుకు జపాన్లో ఇండియన్ కరెన్సీలో కోటిరూపాయల ప్యాకేజీతో ఉద్యోగం రావడంతో నారాయణస్వామి ఆశయం మరింత బలపడింది. కోమలాదేవికి తన కుమారుడిపై భర్త ఇలా ఒత్తిడి పెట్టడం ఇష్టం లేదు. అట్లని అతడిని అడ్డుకొనే శక్తీ ఆమెకు లేదు.  ఒకసారి అలాంటి  ప్రయత్నం చేసింది.

          “ఏడో తరగతే ఫెయిల్ అయిన దానివి. నీ మొహం! నీకేం తెలుసు నోరు మూసుకో!” అంటూ ఆమెను మరోసారి నోరెత్తకుండా చేశాడు.

          మనోజ్ కు సోషల్ స్టడీస్ అన్నా, జనరల్ నాలెడ్జి అన్నా చాలాఇష్టం. ఉదయం ఇంటికి వచ్చిన న్యూస్పేపర్లో ముఖ్య వార్తలన్నీ చదువుతుంటాడు. తను చదివిన వార్తావిశేషాలు అన్నీ వాళ్ళమ్మతో చెబుతాడు. నారాయణస్వామికి  మనోజ్ సోషల్ స్టడీస్ ను ఇష్టపడడం నచ్చలేదు. మ్యాథ్స్ మనోజ్ కు ఇష్టమైన సబ్జెక్టు కావాలన్నది నారాయణస్వామి కోరిక. మనోజ్ కు గణితంపై అభిరుచి కలిగించడానికి వాళ్ళ స్కూల్లో పనిచేసే మ్యాథ్స్ టీచర్ తో తరచుగా మాట్లాడిస్తూ ఉంటాడు. ప్రతి ఆదివారం అబాకస్ అనీ, వేదిక్ మ్యాథ్స్ అనీ  స్పెషల్ క్లాసులకు పంపిస్తాడు. మ్యాథ్స్ బాగా వస్తే మిగిలిన అన్ని సబ్జెక్టులు వాటంతట అవే వస్తాయని అతని నమ్మిక. మనోజ్ కు తరచుగా శ్రీనివాస రామానుజన్ జీవిత విశేషాలు చెబుతూ ఉంటాడు. ఆరవ తరగతిలో రామానుజన్ ప్రతిపాదించిన సిద్దాంతాలు ఇంటర్ వారికి సిలబస్ గా ఉండేవని చెబుతాడు. ఇవేవీ కూడా మనోజ్ కు గణితం పట్ల ఆసక్తిని కలిగించలేకపోయాయి. తనకు మాథ్స్ సరిగా అర్థం కావడం లేదనీ, ఎంత ప్రయత్నించినా మెరుగు పరచుకోలేక పోతున్నాననీ, నాన్నకు చెప్పమనీ మనోజ్ తన అమ్మకు తరచుగా చెబుతున్నా నారాయణస్వామి దబాయింపులకు, హేళనలకు భయపడి కోమలాదేవి మౌనంగా ఉండడం తప్ప మరేమీ చేయలేకపోయింది.

           ఇటువంటి పరిస్థితుల్లో పాఠశాల యాజమాన్యం పిల్లల్లో గణితంలో సరైన పెర్ఫార్మెన్స్ సాధించడంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుడు విఫలమైనాడని భావించి అతనిని తొలగించి ఇంజనీరింగ్ చదివి గణితంలో ప్రతి తరగతిలో వంద మార్కులు సంపాదించిన కొత్త మాథ్స్ టీచర్ ను రిక్రూట్ చేసింది. అతడికి ఉపాధ్యాయ శిక్షణ లేదు అని కొంతమంది తల్లిదండ్రులు అభ్యంతర పెట్టారు. సంవత్సరం చివర ఫలితాలు చూసి మాట్లాడండి అని యాజమాన్యం దబాయించి అందరి నోర్లు మూయించింది. మన పిచ్చి గాని లెక్కలు చెప్పడానికి లెక్కలు రావాలి గాని శిక్షణ ఎందుకు అనేది ఆ పాఠశాల యాజమాన్యం నమ్మిక.  ఈ కొత్త లెక్కలు సార్ రాకతో మనోజ్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా అయ్యింది. తరగతి మొత్తంలో అత్యధిక మార్కులు, అత్యల్ప మార్కులు వచ్చే వారితోనే తన వ్యవహారం అని అతడు తన మొదటి క్లాసులోనే ప్రకటించాడు. కొత్త మాథ్స్ టీచర్ క్లాస్ లో అతితక్కువ మార్కులు వస్తున్న మనోజ్ ను  నిల్చోపెట్టి ‘రేపటినుండి నీకు లెక్కలు ఎలారావో చూస్తా!’ అని ఛాలెంజ్ చేశాడు. కుక్కలకు కూడా లెక్కలు నేర్పించగలిగిన సత్తా తనకుందని డాంభికాలు పలికాడు.

          ఆరోజు రాత్రి మనోజ్ కు నిద్ర పట్టలేదు. పాతమ్యాథ్స్ టీచరే నయం అనిపించింది. ఈ కొత్త రాక్షసుడితో ఎలారా దేవుడా అని భయపడుతూ రాత్రంతా నిద్ర పోలేదు. కొత్త మ్యాథ్స్ టీచర్ మనోజ్ ను ఫుట్బాల్ మాదిరి ఆడుకున్నాడు. హోంవర్క్ చేయలేదని గోడకుర్చీ వేయించాడు. ఫెయిల్ మార్కులు వచ్చాయని అమ్మాయిలతో ముక్కుచెంపలు వేయించాడు. జవాబు చెప్పలేదని  మోకాళ్ళపై నిలబెట్టాడు. పదిసంవత్సరాల తన ట్రాక్ రికార్డు మనోజ్ వలన బ్రేక్ అవుతోందని ఆక్రోషం వ్యక్తం చేశాడు.   మనోజ్ ను వేదించని రోజు లేదు. తన సబ్జెక్ట్ లో గత పది సంవత్సరాలుగా వందశాతం పాస్ అవుతున్నారనీ, అదీ తన ట్రాక్ రికార్డ్ అనీ , మ్యాథ్స్ మీద మమకారంతో ఇంజనీరింగ్ ఉద్యోగం వదలుకొని వచ్చాననీ గొప్పలు చెప్పుకున్నాడు. క్లాసులో అందరకూ పాస్ మార్కులు తెప్పించేంత వరకు వదిలేది లేదనీ శపథం చేశాడు. తనకున్న గణిత లాజికల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి మనోజ్ ను విపరీతంగా కొడితే వాడు తట్టుకోలేక భయపడి స్కూలు వదిలి వేరే స్కూల్ కి వెళ్ళిపోతాడనీ, అప్పుడు తన ట్రాక్ రికార్డు దెబ్బతినదనే కుటీల నీతిని ప్రదర్శించాడు.  అయితే అతడు అనుకున్నట్లుగా అలా జరగలేదు.

          మాథ్స్ టీచర్ వేధింపులనుండి తప్పించుకోవడానికి మనోజ్ స్కూల్ ఎగ్గొట్టడం ప్రారంభించాడు. ఉదయం ఇంటి నుండి పుస్తకాల బ్యాగ్, క్యారియర్ తో సైకిల్ పై  స్కూల్ కు అని బయలుదేరుతాడు. అయితే స్కూలుకు వెళ్లడు. ఊరిబయట ఉండే ఉచ్చంగిఎల్లమ్మ గుడి దగ్గరకు వెళతాడు. గుడిముందు రావిచెట్టు చుట్టూకట్టిన కట్టపై కూర్చుంటాడు. తనకి ఇష్టమైన సోషల్ స్టడీస్ ను చదువుకుంటాడు. ఇంటి నుండి స్కూల్లో వార్తలు రాసి చదివే డ్యూటీ నాదే అనిచెప్పి తెచ్చుకున్న న్యూస్ పేపరును మొదటి పేజీ నుండి చివరి పేజీదాకా అక్షరం వదలకుండా చదువుతాడు. మధ్యాహ్నం తెచ్చుకున్న క్యారియర్ తింటాడు. కొద్దిసేపు అక్కడకు వచ్చే పశువుల కాపర్లతో ఆడుకుంటాడు. స్కూలు వదిలే సమయానికి ఇంటికి వెళ్లిపోతాడు. గత నెల రోజులుగా ఇదీ మనోజ్ దినచర్య.

          ఒకరోజు నారాయణస్వామి తను పనిచేస్తున్న బడి నుండి ఇంటికి వస్తూ మనోజ్ పెర్ఫార్మన్స్ తెలుసుకొనేందుకు నేరుగా మనోజ్ చదువుతున్న స్కూలుకు వెళ్ళాడు. నారాయణస్వామి స్కూలు ప్రాంగణంలో ప్రవేశించేప్పటికీ అక్కడే ట్యూషన్ తీసుకొంటున్న పిల్లలు, పదో తరగతి పిల్లలు మినహా మిగిలిన  పిల్లలందరూ వెళ్లిపోయారు. పదవతరగతి పిల్లలు గ్రౌండ్లో కూర్చొని చదువుకొంటున్నారు. నలుగురు ఉపాధ్యాయులు చేతుల్లో కర్రలు పట్టుకొని వారిమధ్య యమ భటుల్లా తిరుగుతూ కాపలా కాస్తున్నారు. ట్యూషన్ పిల్లలు హోంవర్క్ చెసుకొంటున్నారు. పిల్లల అందరి మొహాలు వాడిపోయిన ఆకుకూరలు మాదిరున్నాయి. గ్రవుండ్ లో పరాచికాలు ఆడుకొంటున్న కుక్కపిల్లలను చూసి ఈర్ష్య పడుతున్నారు. స్కూలు కార్యాలయంలోకి వెళ్లిన నారాయణస్వామి మనోజ్  విద్యాప్రగతి గురించి తెలుసుకొనే  ప్రయత్నం చేయగా గత నెల రోజులుగా మనోజ్ బడికి రావడం లేదని చెప్పారు.

          “పిల్లవాడు స్కూలుకు రాకపోతే తల్లిదండ్రులకు తెలియపరచాలనే కనీస బాధ్యత లేదా?” అని నారాయణస్వామి వారిపై కోపపడ్డాడు.

          “మాకు తెలియదు సార్! మేనేజ్మెంట్ తో మాట్లాడండి” అని వాళ్ళు ప్రశాంతంగా బదులిచ్చారు. 

          “మీకెలా తెలుస్తుందిలే? ఫీజ్ పెండింగ్ ఉంటే తెలుస్తుంది. పుస్తకాలు అమ్మడం తెలుస్తుంది.  బెల్టు, షూస్, టైలు అమ్మడం తెలుస్తుంది. పిల్లవాడు బడికి రానిది మాత్రం తెలియదు” అంటూ కోపంగా కార్యాలయం బయటకు వచ్చాడు. ఇవన్నీ తమకు మామూలే అని సిబ్బంది తమ పనిలో తాము నిమగ్నమయ్యారు.

            మనోజ్ బడికి రాకపోవడం వలన తన ట్రాక్ రికార్డుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఆనందంగా ఉంటున్న మ్యాథ్స్ టీచర్ నారాయణ స్వామికి ఎదురుపడ్డాడు.  “మీరు మనోజ్ ఫాదర్ కదా! అసలు మీ వాడికి లెక్కలే రావండి.  మీ వాడు వేస్ట్ అండీ. లెక్కలు చేసే ప్రయత్నమే చేయడండీ” అని చాడీలు చెబుతూ “ఏదైనా చిన్న స్కూల్లో చేర్పించండి” అంటూ ఒక ఉచిత సలహా పారవేశాడు. నారాయణస్వామికి అతడిమాటలతో తల కొట్టేసినట్టు అయ్యింది. అవమాన భారంతో రగిలిపోయాడు.  తన కలల ప్రపంచం కూలిపోతున్నట్లు, తన ఆశలు అడియాశలు అవుతున్నట్లు భావించాడు. కోపంతోఉగిపోతూ ఇంటికి బయలుదేరాడు.

          ఆరోజు సాయంత్రాన కోమలాదేవి ఇంటిముందు కసవు చిమ్ముతోంది. మనోజ్ ఇంట్లో సోఫాలో కూర్చుని టీవీలో నేషనల్ జాగ్రఫీ చానెల్ చూస్తున్నాడు. నారాయణస్వామి ఇంట్లోకి ప్రవేశిస్తూ “ ఆ గాడిద కొడుకు ఎక్కడ?” అని ఆవేశంగా ప్రశ్నించాడు.

          తండ్రి అరుపులు విన్న మనోజ్ వణకిపోతూ సోఫా నుండి దిగ్గునలేచి నిలబడ్డాడు.  కోమలాదేవి        “ ఏమయింది?” అంటూ ఉగ్రనరసింహుడైన నారాయణస్వామి వెనకాల పరిగెత్తుకొంటూ ఇంట్లోకి వచ్చింది.

          “ స్కూల్ కి ఎందుకు వెళ్లడం లేదు? యూస్లెస్ ఫెలో” అంటూ కోపంగా పటపటా పళ్ళు కొరకుతూ  మనోజ్ ను ప్రశ్నించాడు.    

          “ వెళుతున్నాను నాన్నా” అంటూ భయం భయంగా చెప్పాడు మనోజ్.

          “వెళుతున్నాడు కదండీ!  ఉదయం మీరు స్కూలుకు బయలుదేరిన పది నిమిషాలలో ప్రతి రోజూ తాను కూడా క్యారియర్, పుస్తకాలు తీసుకొని సైకిల్ పై  వెళుతున్నాడు కదా! “ అని ఆందోళనగా అన్నది కొమలాదేవి.  

          “నీ మొహం. నోరు మూసుకో. ఎందుకు వాడిని వెనకేసుకు వస్తున్నావు. వాడు నెల రోజులుగా బడికి పోవడం లేదు తెలుసా నీకు?”

          “అవునా! ఏరా మనోజ్ పోవడం లేదా?”

          మౌనంగా ఉండిపోయాడు మనోజ్.

          “మాట్లాడురా!” అని ప్రాధేయపడింది కొమలాదేవి.

          “వాడి మొహం. వాడేమి మాట్లాడతాడు? బడిదొంగ. నా కడుపున చెడపుట్టాడు” అంటూ ఊగిపోయాడు. తను కట్టుకున్న బెల్టును తీశాడు.  తను కలలుకన్న  ఆశలు అడియాశలు అవుతున్నాయనే నిరాశ అతడిని దిగజారేటట్టు చేసింది. విచక్షణారహితంగా మనోజ్ ను బెల్ట్ తో గొడ్డును బాదినట్టు బాదడం మొదలుపెట్టాడు. ‘కొట్టొద్దండి’ అంటూ అడ్డంగా వెళ్లిన కోమలాదేవికి కూడా దెబ్బలు తగిలాయి. మనోజ్ ఆ దెబ్బల తీవ్రతకు బాధతో అరుస్తుండగా కోమలాదేవి బెల్ట్ దెబ్బలు వాడికి తగలకుండా వాడిని వాటేసుకుంది.        అయినా  నారాయణస్వామి “ వాడిని వదలతావా? లేదా?  నీకు పడాల్నా?” అంటూ కోమలాదేవిని కూడా కొట్టడం ప్రారంభించాడు. తనకోసం అమ్మ దెబ్బలు తినడాన్ని భరించలేని మనోజ్ అమ్మ చేతుల నుంచి విడిపించుకుని ముందుకు వచ్చాడు.

          “చంపేయ్ నాన్న! చంపేయ్! ఒకేసారి గొంతు నులిమి చంపేయ్ నాన్నా! స్కూలుకు వెళితే ఆ లెక్కల సార్ కొడతాడు. అమ్మాయిలతో ముక్కుచెంపలు వేయిస్తాడు. మోకాళ్ళపై నిలబెడతాడు. హేళనగా మాట్లాడుతాంటే క్లాసులో అందరూ నవ్వుతారు. నాకు ఎంత బాధగా ఉంటాదో నీకు తెలుసా?  వెళ్లకపోతే నీవు కొడతావు. వెళితే ఆయన కొడతాడు. మీ ఇద్దరితో తన్నులు తినేదానికన్నా నేను చచ్చిపోవడమే మేలు.  గొంతు నులిపి ఒక్కసారిగా చంపేయ్ నాన్నా” అంటూ గట్టిగా ఏడ్చాడు.

          వాడిమాటలతో కోమలాదేవి భయంతో శిలలా నిల్చుంది. నారాయణస్వామి మనోజ్ మాటలువిని ఒక్కసారిగా ఆగిపోయాడు. చేతిలోని బెల్ట్ ను నేలకేసి విసిరి కొడుతూ “నిన్నునేను చంపడం ఎందుకురా? మీ అమ్మ నీవు కలిసి నన్నే చంపండి. ఇద్దరూ కలిసి నాకు తోటి టీచర్లమధ్య తల ఎత్తుకొని తిరగలేని స్థితిని తెచ్చారు. నీపై ఎన్నో ఆశలు పెట్టుకొన్నాను.  అన్నీ కూలగొట్టినారు. నాకు చావన్నా రాకపోయే” అంటూ విసురుగా బయటకు వెళ్ళిపోయాడు.

          ఆ రాత్రి ముగ్గురూ భోజనం చేయలేదు. ఆ ఇంటిని నిశ్శబ్దం ఆక్రమించింది. నారాయణస్వామి ఒక గదిలో, కొమలాదేవి, మనోజ్ మరో గదిలో పడుకొన్నారు.  తండ్రి కోపాన్ని ఆస్థాయిలో ఎప్పుడూ చూడని మనోజ్ విపరీతంగా భయపడిపోయాడు. ఆ భయానికి వేకువన మనోజ్ కు విపరీతమైన జ్వరం వచ్చింది. ‘నాన్నా! కొట్టొద్దు నాన్నా! అంటూ కలవరిస్తున్నాడు. ‘సార్ నాకు లెక్కలు రావు సార్! కొట్టొద్దు సార్! మీకు మొక్కుతా సార్!’ అని వణకిపోతూ గొణుగుతున్నాడు. కొమలాదేవి వాడి కలవరింతలకు కన్నీరు పెడుతోంది. ఆమె వాడి ఒళ్ళును తడిబట్టతో తుడుస్తున్నా టెంపరేచర్ తగ్గలేదు. ‘డోలో’ మాత్ర వేసినా ప్రయోజనం కనిపించలేదు.

          ఉదయం కోమలాదేవి నారాయణస్వామితో “మనోజ్ కు రాత్రి తీవ్రమైన జ్వరం వచ్చింది. రాత్రంతా కలవరిస్తూనే ఉన్నాడు”అని చెప్పింది.

          “డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళు. తగ్గుతుందిలే” అని చెప్పాడు నారాయణస్వామి.

          నారాయణస్వామి స్కూలుకు వెళ్ళడానికి  తయారై క్యారియర్ లేకుండానే వెళ్లిపోయాడు. పదిగంటల సమయంలో కోమలాదేవి మనోజ్ ను  డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. డాక్టర్ పరీక్షచేసి హై ఫీవర్ వుందని చెబుతూ మందులు రాసి ఎలా వాడాలో చెప్పాడు. తగ్గకపోతే ఐదు రోజుల తర్వాత రమ్మన్నాడు. ఐదు రోజులు అయినా మనోజ్ కు జ్వరం తగ్గలేదు. పైగా తనలో తానే నవ్వుకోవడం, అర్థంలేని విధంగా తనలోతనే మాట్లాడడం, కేకలు వేయడం, తన తలను తానే కొట్టుకోవడం వంటి చేష్టలతో అసాధారణంగా ప్రవర్తించాడు. ఆందోళన చెందిన నారాయణస్వామి కోమలాదేవిలు మనోజ్ ను మరలా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. నారాయణస్వామి జరిగినదంతా డాక్టర్ కు చెప్పాడు. అన్ని విషయాలు విన్నడాక్టర్ బాబు మనసుకు తీవ్రమైన అఘాతం కలగడం వలన ఇలా అయ్యుండొచ్చనీ, సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసుకెళ్లమనీ సలహా ఇచ్చాడు. కర్నూలులో సైకియాట్రిస్ట్ దగ్గరకు మనోజ్ ను తీసుకెళ్లారు. సైక్రియాటిస్ట్ అన్నిరకాల పరీక్షలు చేసి తీవ్రమైన మానసిక అఘాతము వలన వ్యాకులతకు గురైయ్యాడనీ, కొన్ని రోజులు మందులు వాడమనీ, బాగయ్యెంత వరకూ కనిపెట్టుకొని ఉండాలనీ చెప్పాడు. వాడవలసిన మందులు రాసి రెండు నెలల తరువాత రమ్మన్నాడు. రెండు నెలలు గడిచినా మనోజ్ మామూలు పరిస్థితికి రాలేకపోయాడు.

          ఒకరోజు రాత్రి హఠాత్తుగా మనోజ్ ఇంట్లోనుండి వెళ్లిపోయాడు. ఉదయం చూస్తే ఇంట్లో లేడు. నారాయణస్వామి, కొమలాదేవీలు ఎక్కడైనా దాచిపెట్టుకొన్నాడేమో అనుకొని ఇల్లంతా వెదికారు. ఎక్కడా కనపడ లేదు. చుట్టుపక్కల వీధుల్లో వెతికారు. ఉచ్చంగిఎల్లమ్మ గుడి దగ్గర ఉండేవాడనీ, పశువుల కాపరులతో ఆడుకొనేవాడనీ తెలిసి అక్కడి పిల్లలను కూడా అడిగారు. రెండు నెలలనుండి అక్కడకు రావడం లేదని వారు చెప్పారు. బస్టాండ్లోని షాపుల్లో ఉన్నవారికీ, క్యాంటీన్లో పనిచేస్తున్న వారికీ, పూలఅంగళ్ళ వారికీ, ఆటోవాళ్ళకీ ఫోటో చూపిస్తూ ఆందోళనగా ‘ఈ పిల్లవాడిని మీరు చూశారా?’ అని అడిగాడు. ఎవరూ  చూడలేదని చెప్పారు. కోమలాదేవి తన బంధువుల ఇళ్లకెళ్లి ‘మనోజ్  ఏమైనా మీ ఇంటికి వచ్చాడా?’ అని అడిగింది. అందరూ రాలేదని చెప్పారు. సాయంత్రం వరకు ఇద్దరు దాదాపు ఊరంతా గాలించారు.  ప్రయోజనం లేకపోయింది. సాయంత్రం ఎవరో సలహా ఇస్తే పోలీస్స్టేషన్లో మనోజ్ ఫోటో జతచేసి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరికీ కాళరాత్రి అయ్యింది.

********

          దాదాపు ఏడు నెలలు గడిచింది. మనోజ్ ఆచూకీ దొరకలేదు. స్కూలుకు వెళ్లిన నారాయణస్వామి అక్కడి పిల్లలతో గడుపుతూ కొంతబాధను మర్చిపోయే ప్రయత్నం చేశాడు. తోటి ఉపాధ్యాయుల సానుభూతి మాటలు వినలేక స్టాఫ్ రూమ్ కు వెళ్ళడం మానేశాడు. కోమలాదేవి బాధ వర్ణనాతీతం. గర్భశోకాన్ని భరించడం ఆమె చేత కాలేదు. మనోజ్ వెళ్ళినప్పటినుండి ఆమెకు కడుపునిండా తిండి లేదు. కంటి నిండా నిద్ర లేదు. ఆనందం ఆ యింటినుండి ఆమడ దూరానికి  తరిమివేయబడింది.

          ఒకరోజు సాయంత్రం టౌన్ పోలీస్ స్టేషన్ నుండి నారాయణస్వామి ఇంటికి ఒక కానిస్టేబుల్ వచ్చి తమ ఎస్సైగారు పిలుస్తున్నారనీ, స్టేషన్ కు రమ్మనీ కోరాడు. మనోజ్ విషయమై వుంటుందని నారాయణస్వామి కోమలాదేవిలు  ఆదరబాదరాగా  పోలీస్ స్టేషన్ కు పరిగెత్తారు.

           సబ్ ఇన్స్పెక్టర్ నారాయణస్వామితో “మీ బాబు ఆచూకీ తెలిసింది. గుజరాత్ లోని కాండ్లాలో ఉన్నాడట. అక్కడి  సేట్ ఒకాయన మీ పిల్లవాడి వివరాలు చెబుతూ కర్నూలు ఎస్పీ ఆఫీసుకు ఫోన్ చేశారట.  ఎస్పీ ఆఫీస్ వారు మన టౌన్ స్టేషను సంప్రదించారు. వారు పంపిన ఫోటో మీరు కంప్లైంట్ సమయంలో ఇచ్చిన ఫోటో ఒకటే. నేను కన్ఫర్మ్ చేశాను. సేట్ నెంబర్ తీసుకొని మాట్లాడాను కూడా. అతడు తన  చిరునామా మెసేజ్ పెట్టాడు. మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండి.  అతడి ఫోన్ నెంబర్, అడ్రస్ మీకు వాట్సాప్ లో షేర్ చేస్తా” అంటూ “ మీ నంబర్ చెప్పండి” అంటూ నెంబర్ తీసుకొన్నాడు.

           నారాయణస్వామి ఎస్సై గదిలోనుండి బయటకు వచ్చి  సేట్ కు రింగ్ చేశాడు. ఇంగ్లీష్ లో తను మనోజ్ నాన్న అని పరిచయం చేసుకొన్నాడు.  సేట్ కూడా చక్కటి ఇంగ్లిష్ లో  “అన్ని వివరాలు మీరు ఇక్కడకు వచ్చిన తర్వాత చెబుతాను.  మీ మనోజ్ మా దగ్గర క్షేమంగా ఉన్నాడు.  ఆందోళన చెందవద్దు. ఒకటి రెండు రోజులు ఆలస్యం అయినా పర్వాలేదు.  మీరు ముంబై వచ్చి , అక్కడ నుండి ట్రైన్ లో  గాంధీధామ్ జంక్షన్ కు రండి.  గాంధీధామ్ జంక్షన్ నుండి కాండ్ల పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాండ్ల బస్ స్టేషన్ లో  దిగి ఈ నెంబర్కు ఫోన్ చేయండి. నేను బస్ స్టేషన్ కు మనిషిని పంపుతాను” అని నారాయణస్వామి తో చెప్పాడు.

          కాండ్లా లో ఉన్న మనోజ్ ను తీసుకురావడానికే  ప్రస్తుతం నారాయణస్వామి, కోమలాదేవిలు ఆదోని రైల్వే స్టేషన్లో ముంబాయి వెళ్లే ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నారు. సేట్ ఎంత ధైర్యం చెప్పినప్పటికీ ఇద్దరిలో ఆందోళన తగ్గడం లేదు.  ఇద్దరి మనసులు అల్లకల్లోలంగా వున్నాయి.  బహుశా ఆ కల్లోలం మనోజ్ ను చూస్తే గాని తగ్గేది కాదు.  అప్పుడు సమయం సాయంత్రం మూడు గంటల పదిహేను నిమిషాలు. ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ మరో ఐదు నిమిషాల్లో రెండోనెంబర్ ప్లాట్ఫామ్ మీదకు వస్తుందని ప్రకటన వెలువడడంతో  నారాయణస్వామి కోమలాదేవి ఈ లోకంలోకి వచ్చారు. కోమలాదేవి మనోజ్ కోసం నిన్న రాత్రంతా మేల్కొని చేసిన గారెలు, తీపి గవ్వలున్న సంచిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకొని ప్లాట్ ఫాం వైపు బయలుదేరింది. ట్రైన్ శబ్దం వారి ఇద్దరి గుండెల ఆందోళన శబ్దాన్ని మింగివేస్తున్నట్లుంది.  నారాయణస్వామి, కొమలాదేవిలు ముంబై నుండి గాంధీధామ్ జంక్షన్ వరకు ట్రైన్ లో వచ్చి అక్కడనుండి బస్సులో కాండ్లా వెళ్లారు. సేట్ చెప్పినట్లుగానే కాండ్ల బస్ స్టేషన్ నుండి అతడికి ఫోన్ చేశారు.

          ఫోన్ రిసీవ్ చేసుకున్న సేట్ “మా డ్రైవర్ పప్పుసింగ్ మిమ్మల్ని తీసుకురావడానికి బస్ స్టేషన్ కు  వస్తాడు.  మీ ఫోన్  నెంబర్ ఆయనకు ఇచ్చాను. అతడి నంబర్ మీకు కూడా మెసేజ్ చేస్తున్నాను” అని చెప్పి ఫోన్ కట్ చేశాడు.

           పదిహేను నిమిషాలకు నారాయణస్వామి ఫోన్ మోగింది.  పప్పుసింగ్ నంబరే!అనుకొంటూ “ హలో! హం మనోజ్ కా ఫాదర్ బాత్ కర్తాహు”  అన్నాడు.

          “సార్! నేను పప్పుసింగ్ మాట్లాడుతున్నాను. సేట్ జీ మిమ్ములను తీసుక రమ్మని పంపారు. మీరు బస్ స్టేషన్ ముందుండే మెయిన్ గేటుదగ్గరకు రండి. ఇక్కడే ఉంటాను”అన్నాడు. పప్పుసింగ్ తెలుగులో మాట్లాడం విన్న నారాయణస్వామి  ఆశ్చర్యపోయాడు.

          నారాయణస్వామి, కోమలాదేవిలు కాండ్లా బస్ స్టేషన్ మెయిన్ గేట్ దగ్గరకు వెళ్లారు. పప్పుసింగ్ నేరుగా వీరి దగ్గరకు వచ్చి “ నారాయణస్వామీ” అంటూ దీర్ఘం తీశాడు.

          “ అవును. నేనే నారాయనస్వామిని” అంటూ పప్పుసింగ్ కు నమస్కరించాడు.

          పప్పుసింగ్ నవ్వుతూ “సార్! నాకు తెలుగు వచ్చు. ఆరు సంవచ్చరాలు  హైదరాబాదులో వనస్థలిపురంలో లారీ బాడీబిల్డింగ్ వర్క్ షాప్ లో పనిచేసాను. అప్పుడే కొంచెం కొంచెం తెలుగు నేర్సుకున్నా! మేం పంజాబీలం.ఎక్కడికి వెళితే అక్కడి భాషను నేర్చుకొంటాం” అని వివరణ ఇస్తూ నారాయణస్వామి చేతిలోని లగేజ్ ను అందుకోబోయాడు.

          నారాయణస్వామి “ఫరవాలేదు. బరువుగా లేదు. నేను తీసుకురాగలను”అని వారించాడు.

          “మా సెట్ తన ఇంటికి దగ్గరలో హోటల్ చందన్ లో మీకి  రూమ్ తీశాడు.  ముందు అక్కడకు పోదాం. మీరు స్నానంచేసి భోజనం చేసిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడదాం” అని పంజాబీ యాసలో  చెపుతూ అటో వాడిని రమ్మన్నట్లుగా సైగ చేశాడు. పప్పుసింగ్ ఆటోవాడితో గుజరాతిలో ఏదో మాట్లాడాడు. నారాయణస్వామి కోమలాదేవిలు ఆటోలో వెనుక సీట్లో కూర్చోగా పప్పుసింగ్ డ్రైవర్ సీట్ ప్రక్కన కూర్చున్నాడు. లాడ్జ్ వైపు ఆటో బయలుదేరింది.

          “పప్పుసింగ్ గారూ! మా మనోజ్ ఎక్కడ?”అని ఆత్రుతతో నారాయణస్వామి అడిగాడు.

          అడగాలనుకొన్నా కొమలాదేవి కొత్త ప్రదేశము, కొత్త వ్యక్తులు కావడం మూలానా భయంతో మౌనంగా, మనోజ్ ను త్వరగా చూడాలనే బెంగతో వుంది.

          “తొందర లేదు సార్!  మీరు ప్రయాణంచేసి వచ్చారు. మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత మీరూమ్ కు వస్తా” అని చెబుతూండగానే లాడ్జి దగ్గరకు వచ్చారు.

          ఇద్దరినీ రూమ్ లో దింపిన పప్పుసింగ్ “ఒక గంట వుండి వస్తా” అన్నాడు.

          కోమలాదేవి మనోజ్ సమాచారం తెలుసుకోవాలనే ఆత్రుతతో ధైర్యంచేసి “అన్నా! మా మనోజ్ బాగున్నాడా? నీకు మనోజ్ తెలుసా?  ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

          పప్పుసింగ్ నవ్వుతూ “బెహెన్ !  మీ మనోజ్ దొరికిందే నాకు. చెబుతా! అన్నీ చెబుతా! ముందు మీరు ఫ్రెష్ అప్ అవ్వండి”అని చెబుతూ బయటకు వెళ్లిపోయాడు.

*******

          నారాయణస్వామి కోమలాదేవి పప్పుసింగ్ కోసం ఎదురుచూస్తూ టెన్షన్ గా కాండ్లాలోని చందన్ హోటల్ రూంలో  కూర్చొని ఉన్నారు. చెప్పినట్లుగానే గంటతర్వాత పప్పుసింగ్ వీరి గదికి వచ్చాడు.

          కొమలాదేవి “అన్నా! మనోజ్ గురించి తెలుసుకొన్న తరువాతే భోజనం చేస్తాం”అని పప్పుసింగ్ తో అన్నది. ఇద్దరి ఆతృతను అర్థం చేసుకొన్నా పప్పుసింగ్ చెప్పడం ప్రారంభించాడు.

          “నా పేరు పప్పుసింగ్. మాది పంజాబ్ లోని బటిండా జిల్లాలో రాంపూర్ పూల్ అనే గ్రామం. నాకు పెళ్లికాక ముందు ఆరు సంవచ్చరాలు హైదరాబాదు వనస్థలిపురంలో  మా అన్నయ్య లాబ్ సింగ్ దగ్గర లారీబిల్డింగ్ వర్క్ చేస్తుండేవాడిని. పెళ్లయిన తరువాత మా వూరు వచ్చేసాను. ఇప్పుడు లారీడ్రైవర్ గా పనిచేస్తున్నాను. గాంధీధామ్ నుండి కాండ్లా పోర్ట్ కు సరుకులు లారీలో తెస్తుంటాను. మా సేట్ పేరు అనిల్ కుమార్ షా. ‘మెరీడియన్ షిప్పింగ్ సర్వీసెస్ కంపెనీ’ ఓనర్. చాలా మంచోడు. మమ్మల్ని బాగా చూసుకుంటాడు. నేను ఒకరోజు ముంబై నుండి గాంధీధామ్ కు లారీలోడ్ తో వస్తున్నా. గాంధీధామ్ కు ముప్పైకిలోమీటర్ల దూరంలో టీ తాగేందుకు లెఫ్ట్ సైడ్ వెనకాల ఏవైనా వెహికిల్స్ వస్తున్నాయేమో అని లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూడడానికి ఆ వైపు తిరిగినా. ఎవడో పిల్లోడు రెండు చేతులెత్తి ‘అన్నా! నీకు మొక్కుతా!  లారీ ఎక్కించుకొన్నా’ అని అడుగుతున్నాడు. మేము రోడ్లపై ఇలాంటి వారిని పట్టించుకోము. అయితే వాడు తెలుగులో మాట్లాడడం వలన నాకు కొంచెం ఆసక్తి అనిపించి లారీను సైడుకు దింపా. పరాయి ప్రదేశాల్లో మనకు వచ్చిన భాషలో ఎవరు మాట్లాడినా వారితో మనకు మాట్లాడాలనిపిస్తుంది. కిందకు దిగి వాడి దగ్గరకు పోయా. మాసిపోయిన బట్టల్లో ఉన్నాడు. చాలా రోజులు స్నానం చేసినట్లు లేడు. ఎక్కడికి వెళ్లాలని తెలుగులో అడిగా. ‘ఈ లారీ ఎక్కడికి పోతాదన్నా’ అని అడిగాడు. గాందీదాం అని చెప్పా.  ‘అక్కడ వరకు వస్తా అన్నా’ అన్నాడు. నాతోపాటు బిస్కెట్ తిని టీ తాగాడు. మానాన్న టీచర్ అన్నా అని చెప్పాడు.  వాడి కుడికాలు నుండి రక్తం కారుతోంది. ఎందుకు రక్తం కారుతోంది అని అడిగా. గాజు కుచ్చుకుందని చెప్పాడు.లారీ ఎక్కిన ఐదు నిమిషాల్లోనే నిద్ర పోయాడు.

          టీచరు కొడుకని చెప్పినపుడు వాడిమీద కొంచెం నమ్మకం కలిగింది. కాండ్లా పోర్ట్ లో మా సేట్ ఆఫీస్ పక్కన లారీ గ్యారేజ్ ఉంటుంది. డ్రైవర్ల రెస్ట్ కోసమని మా సేట్ ఒక చిన్న రేకుల షెడ్డు వేయించాడు. షెడ్డులో అన్ని సదుపాయాలూ ఉన్నాయి. పిల్లోడికి  స్నానం చేయమని చెప్పాను. బయటకు వెళ్లి ఒక షార్ట్, ఒక టీ షర్టు కొనుక్కొచ్చా. స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళదామా? అని అడిగా. డాక్టర్ అన్న వెంటనే వద్దువద్దని గట్టిగా అరవడం, చేతులతో తలను కొట్టుకోవడం చేశాడు. అప్పుడు పిల్లవాడి మైండ్ సరిగా లేడని అర్థం అయ్యింది. సరే వద్దులే టిఫిన్ తిను అంటూ బయటకు తీసుకువెళ్లి తినిపించా. తిన్న తర్వాత కొంచెం హుషారు అయ్యాడు. ఒక వారం రోజులు తినడం, మా గ్యారేజ్ హాల్లో పడుకోవడం చేశాడు. టీవీ చూడడం ఇష్టం అనుకొంటా. షెడ్ లో ఎప్పుడూ టీవీ చూసేవాడు. నేను కూడా ఉంటాడులే అనే నమ్మకంతో గ్యారేజిలోనే వదలిపెట్టి డ్యూటీకి పోయివచ్చేవాడిని.

          నాకు పెళ్లయి ఆరు సంవచ్చారాలు అయ్యింది. మా అమ్మనాన్నలకు మాకు  పిల్లలు కాలేదని ఒకటే బాధ. నాకు పిల్లలు లేరు కదా! అందుకే  వీడంటే కొంచెం ప్రేమ కలిగింది. నిదానంగా వీడి నుండి విషయాలు తెలుసుకుందాం అనుకొన్నా. కానీ వీడు మాట్లాడే మాటలు అర్థం  అయ్యేవి కాదు.  తన పేరు మనోజ్ అనీ,  తనది కర్నూల్ జిల్లా యమ్మనూరు అనీ చెప్పాడు. నాన్న ఇంగ్లీష్ టీచర్ అని చెప్పాడు. ‘ఇక్కడకు ఎందుకొచ్చావు’ అని అడిగితే  ‘ ఆ….వచ్చా…’ అని చెప్పేవాడు. మీ ఊరుకు వెళతావా?  అని ఒకటి రెండు సార్లు అడిగా.  ‘కొడతారు పోను’ అన్నాడు. నాకు అప్పుడు ఇంట్లో కొట్టినందుకు పారిపోయి వచ్చి వుంటాడని అర్థమయింది. అయితే మైండ్ ఎందుకు అలా అయ్యిందో అర్థం కాలే. అప్పుడప్పుడు నాతో లారీలో వచ్చేవాడు. కొన్నిసార్లు వీడు ఇక్కడి నుంచి పారిపోతే ఎలా అని భయం అయ్యేది. తిండికి ఇబ్బంది పడొద్దని  నాను డ్యూటీ పోయేప్పుడు ఇక్కడ హోటల్ లలో అందరికీ మనోజ్ వస్తే టిఫిన్ , భోజనం ఇవ్వండి. నేను వచ్చిన తర్వాత లెక్క ఇస్తానని చెప్పేవాడిని. ఆకలి అయితే హోటల్ కి వెళ్లి భోజనం అడిగేవాడు.  హోటల్ వాళ్ళు ‘తూ కోన్ రే’ అని అడుగుతే ‘హం! పప్పుసింగ్ కా బేటా’ అని వీడుచెప్పేది.  మా డ్రైవర్స్ ‘పప్పుసింగ్ కా బేటా’ అని వాడితో గమ్మత్తు చేసేది. ఆ మాట పిల్లలలేని నాకు వాడి మీద ప్రేమ కలిగేట్టు చేసింది. అలా ఆరు నెలలు గడిచింది. మనోజ్  బాగుంటాడు. అంతలోనే ఏదేదో చేస్తాడు. ఎక్కువ మాట్లాడడు. ఇక్కడ అందరికీ వాడితో అలవాటైపోయింది.

          ఒకరోజు మా సెట్ గ్యారేజ్ కి వచ్చాడు. మనోజ్ ను చూసి ఈ పిల్లవాడు ఎవరు అని అడిగాడు. నేను జరిగినదంతా చెప్పా. సేట్ నన్ను తిట్టి వాడిని ఇక్కడ ఉంచితే మరలా ఎక్కడికైనా పారిపోతే ఎలా? కనీసం వాడి తల్లిదండ్రులకు చెప్పాలి కదా! ఎందుకు చెప్పలేదు? అని అడిగాడు.  ‘బాబుకు వెళ్లడం ఇష్టం లేదని’ చెప్పా. టీవీ ఉంటే చాలు ఎక్కడికీ వెళ్ళడు అని కూడా  చెప్పా. ‘వాడికి ఇష్టం లేదని ఇక్కడే పెట్టుకొంటావా? అక్కడ వాడి తల్లిదండ్రులు ఎంత బాధ పడుతూ ఉంటారో ఆలోచించావా?’ అని తిట్టారు. సాయంత్రం వాడిని  మా ఇంటికి తీసుకురా! కాంపౌండ్ లో ఉన్న రూంలో ఉంటాడు. గేట్ దగ్గర ఇరవైనాలుగు గంటలు గూర్కాలు కాపలా ఉంటారు కదా! వీడు వెళ్ళిపోయే ఛాన్స్ ఉండదు. వాడి తల్లిదండ్రులకు తొందరగా విషయం తెలుపుదాం. ఇలా ఉంచుకోవడం తప్పు’ అని చెప్పి వెళ్లిపోయారడు.

          ఆరోజు సాయంత్రమే నేను మనోజ్ ను సేట్ వాళ్ళింటికి తీసుకెళ్లా. ఇంటి ముందున్న గదిలో మనోజ్ ఉండేందుకు ఏర్పాట్లు చేయించాడు. మనోజ్ కు టీవీ ఇష్టమని ఆ గదిలో టీవీ ఒకటి ఏర్పాటు చేసి తెలుగు ఛానల్లు వచ్చేటట్లు చేశాడు. నెల రోజులుగా మనోజ్ సేట్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. నేను నాలుగు రోజులకు ఒకసారి మనోజ్ దగ్గరికి వెళ్లి వస్తున్నా. సేట్ కు కూడా మనోజ్ అంత వయస్సున్న కొడుకున్నాడు. అప్పుడప్పుడు ఇద్దరూకలిసి  కాంపౌండ్ లో ఆడుకొంటారు. సేట్ మనోజ్ తో మాట్లాడుతూ వివరాలన్నీ రాబట్టాడు. మీది ఆంద్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా యమ్మనూరు అనీ, మీరు ఇంగ్లీష్ టీచర్ అనీ తెలుసుకొన్నాడు.  గూగుల్ మ్యాప్ ద్వారా కర్నూలు ఎస్పీ ఆఫీస్ నంబర్ తెలుసుకొని మనోజ్  విషయం వాళ్లకు చెప్పాడు. ఇలా మీ దగ్గరకు మనోజ్ విషయం వచ్చింది. మనోజ్ మైండ్ ఇప్పటికీ బాగాలేదు. నాలుగు రోజులుగా సేట్ మనోజ్ ను మీతో పంపడానికి వాడిని సిద్దం చేస్తున్నాడు. సడన్ గా  మీరు కనిపిస్తే ఏమవుతాడోనని  మా సేట్  భయం.  అందుకే మిమ్ములను రెండు రోజుల తర్వాత మనోజ్ దగ్గర తీసుకువెళ్లాలనేది అతని ఆలోచన. అందుకోసమే మిమ్మల్ని ఇక్కడ దింపాడు. భోజనం చేయండి. సాయంత్రం వెళదాం” అంటూ చెప్పడం ముగించాడు పప్పుసింగ్.

          అంతా విన్న కోమలాదేవికి కన్నీరు ఆగలేదు.  పప్పుసింగ్ కు  రెండుచేతులు జోడించి నమస్కరిస్తూ “అన్నా!మేం నీ రుణం ఎలా తీర్చుకునేది? కన్న తల్లిదండ్రులమైన మేమే వాడిని అర్థం చేసుకోలేకపోయాము. నీవు ఎంత గొప్ప మనసు ఉంటే మా వాడిని ఇంత అపురూపంగా చూసుకొన్నావు” అంటూ దుఃఖంతో మాట్లాడలేక పోయింది.

          “బెహెన్! ఏడ్వకు. కొన్ని అలా జరుగుతుంటాయ్. మనం ఏమీ చేయలేం. మనోజ్ మైండ్ బాగవుతుంది . భయపడవద్దు” అంటూ పప్పుసింగ్ కొమలాదేవికి ధైర్యం చెప్పాడు.

          నారాయణస్వామికి దుఃఖం ఆగలేదు. అపరాధ భావంతో నోట మాట రాలేదు.

          అతి కష్టంగా “ నీవూ, మీ సేట్ నిజంగా మాకు దేవుళ్లే అయ్యా!  మేం మీకు ఆజన్మాంతం  రుణపడి ఉంటాం” అంటూ విలపించ సాగాడు.

          పప్పుసింగ్ నారాయనస్వామిని దగ్గరకు తీసుకొని వీపుపై చేతితో నిమురుతూ “ఏడవకండి సార్! మా మనోజ్ ను మంచిగా చూసుకోండి.” అంటూ ఓదార్చాడు.

********

          సాయంత్రం నారాయణస్వామిని కోమలాదేవిని పప్పుసింగ్ అనిల్ కుమార్ షా ఇంటికి తీసుకెళ్ళాడు. వీళ్ళు వస్తున్న విషయం తెలిసి సేట్ ఇంట్లోనే వున్నాడు. సేట్ వారిని మనోజ్ ఉండే రూమ్ కు  తీసుకెళ్ళాడు. టీవీ చూస్తున్న మనోజ్ హఠాత్తుగా వచ్చిన తన అమ్మా నాన్నలను ఎటువంటి ఉద్వేగం లేకుండా కన్నార్పకుండా చూశాడు.  కోమలాదేవి పరుగున వెళ్లి కన్నీటితో కొడుకును కౌగిలించుకుంది. సేటు ఏడవకమ్మా!  అని కొమలాదేవిని వారించాడు.

          “ఈరోజు అంతా మనోజ్ తో ఇక్కడే ఉండండి. రేపు మీ ప్రయాణం ఏర్పాట్లు చేస్తాను” అనే అర్థంలో  ఇంగ్లీష్ లో  చెప్పాడు. కోమలాదేవి, నారాయణస్వామి సేట్ కాళ్లకు మొక్కడానికి ముందుకెళ్లారు.

          “ మీరు ఉపాధ్యాయులు. నాకు మొక్కడం తప్పు. అయినా ఇందులో నా గొప్పదనం ఏమీ లేదు. అంతా మా పప్పుసింగ్ దే! ఆయన ప్రేమాన్వితమైన హృదయమే మీ మనోజ్ ను ఇక్కడకు తీసుకొచ్చింది. కృతజ్ఞతలు తెలుపవలసినది ఆయనకు, నాకు కాదు. మనోజ్ ను బాగా చూసుకోండి. ఎందుకు ఇంటిలోనుండి పారిపోయి  వచ్చాడో మాకు తెలియదు. ఎందుకు మానసికంగా అనారోగ్యం పాలయ్యాడో కూడా తెలియదు. అప్పుడప్పుడూ అపసామాన్య ప్రవర్తన ఉంటోంది. నేను నా స్నేహితుడైన ఒక సైక్రియాటిస్టును పిలిపించి చూపించాను. బాబు మానసికంగా షాక్ కు గురి అవ్వడం వలన ఇలా అయింది. ట్రీట్మెంట్ అవసరం అన్నాడు. నేను మీ అనుమతి లేకుండా ట్రీట్మెంట్ ఇప్పించడం భావ్యం కాదని ఇప్పించలేదు. డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తే మనోజ్ తప్పక  మామూలు మనిషి అవుతాడని చెప్పాడు. మీ ఊరు వెళ్ళినతరువాత ట్రీట్మెంట్ ఇప్పించండి. మీకు ఆర్థికంగా ఇబ్బంది అవుతే చెప్పండి. నేను సాయం చేస్తాను” అని ఇంగ్లీష్ లో  అనిల్ కుమార్ షా చెప్పాడు.

          అనిల్ కుమార్ షా మాటలకు నారాయణస్వామి చలించిపోయాడు. “ఆర్ధిక ఇబ్బందులు ఏమీ లేవు సార్. నేను ట్రీట్మెంట్ ఇప్పించగలను. మీ ఇద్దరివలన ఈరోజు మాఇంటికి సంతోషాన్ని తీసుకెళుతున్నాం” అని గద్గద స్వరంతో చెప్పాడు.

          సేట్ పప్పుసింగ్ వైపు చూస్తూ “ పప్పుసింగ్!  ఈరాత్రికి వీరికి భోజనం ఏర్పాట్లు చేయ్.  ఉదయమే బయలుదేరి వీరిని బాంబే వరకు వీళ్లను దిగబెట్టి రా!  అనే అర్థంలో గుజరాతీలో చెప్పి కొంత నగదును పప్పుసింగ్ కు ఇచ్చి గదినుండి బయటకు వెళ్లిపోయాడు.  పప్పుసింగ్ బయటకు వెళ్లి భోజనం తీసుకొచ్చాడు. పప్పుసింగ్, నారాయణస్వామి, కోమలాదేవిలు భోజనం చేశారు.  కోమలాదేవి మనోజ్ కు అన్నం కలిపి తినిపించింది. ఊరి నుండి తెచ్చిన గారెలు, తీపి గవ్వలు చేతిలో ఇచ్చింది. వాడు వాటిని తినే ప్రయత్నమే చేయలేదు.  నిర్వికారంగా ఉన్నాడు. అసంకల్పితంగా అమ్మ పెడుతున్న ముద్దలను తిన్నాడు.  

          “ఉదయం ఆరు గంటలకే వస్తా!  రెడీ అయి ఉండండి”  అని చెప్పి పప్పుసింగ్ ఇంటికి వెళ్లిపోయాడు.

          గదిలో నారాయణస్వామి కోమలాదేవి మధ్యలో మనోజ్ పడుకున్నాడు. మనోజ్ గాఢ నిద్రపోయాడు. నారాయణస్వామిని అపరాధ భావన దహించి వేస్తోంది. ఎవరు ఈ పప్పుసింగ్? ఎవరు ఈ అనిల్ కుమార్ షా? వీళ్ళకు ఎందుకు మనుషుల మీద ఇంత ప్రేమ? చదువుకున్నాను. పిల్లలను ఎలా అర్థం చేసుకోవాలో శిక్షణ తీసుకున్నాను. అన్నింటికన్నా నేను మనోజ్ కు తండ్రిని. అయినా ఎందుకు ఇంత అమానవీయంగా ప్రవర్తించాను. స్కూలులో ఇంజనీరింగ్ చదువుకున్న ఒక గ్రాడ్యుయేట్ మనోజ్ సమస్యను ఎందుకు అర్థం చేసుకోలేక పోయాడు? పెద్దగా చదువుకోని పప్పుసింగ్ ఎంత గొప్పహృదయాన్ని కలిగి ఉన్నాడు. మానవత్వానికి చదువు అవసరం లేదనిపిస్తోంది. ప్రేమించే గుణం ఉండాలి. అది పప్పుసింగ్ లో ఉంది. అనిల్ కుమార్ షా లో ఉంది. కొమలాదేవి లో కూడా ఉంది. నేనే అమానవీయంగా తనను ఏడు ఫెయిల్ అయిన దానివని అవమానంగా మాట్లాడాను. సున్నిత మనస్కుడైన మనోజ్ పట్ల రాక్షసంగా ప్రవర్తించాను. నిజంగా నేను వారి వ్యక్తిత్వం ముందు  మరుగుజ్జుని.  ఇప్పటికీ కూడా నా ఆలోచనలో పరివర్తన రాకపోతే నేను మనిషిని కాను’ అనుకుంటూ మనోజ్ నుదుటిపై ముద్దు పెట్టాడు. నారాయణస్వామి కన్నీటి చుక్కలు  మనోజ్ నుదుటి మీద పడ్డాయి. అటువైపు తిరిగి పడుకొన్న కోమలాదేవి మనోజ్ ను మామూలు మనిషిగా చేసుకోగలననే ఆత్మా విశ్వాసంతో వుంది.  మనోజ్ దొరికినందుకు ఆమె మనసు ఇప్పుడు నిర్మలంగా వుంది.

                                                          *********

మారుతి పౌరోహితం

Spread the love

4 thoughts on “విప్రతీసారము

  1. సూపర్ సార్…. మళ్ళీ కళ్ళల్లో నీళ్లు తెప్పించారు…

  2. ఇటీవలి కాలంలో ఇంత చక్కని తెలుగు‌లో వచ్చిన కథ ఇదే.
    నారాయణస్వామి, కోమలమ్ మనోజ్ పేర్లు కాక కథకి అర్ధవంతమైన శీర్షిక విప్రతీసారము కాకపోతే పాఠకులలో ఎంత మందికి అర్ధం
    ఔతుందో!
    ఇక కథాంశం …చాలా కథలు ఇదే ఇదివృత్తం మీద వచ్చినా మారుతి గారు కథనం ప్రత్యేకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *