ఈ దారిలో
నేను వేరొకరినయ్యుంటే
వెనక్కి తిరిగి చూసేవాడినే కాదు
ఒక బాటసారి
తన సహచరునితో చెప్పేదే
నేనూ చెప్పేవాడిని
అపరిచితుడా!
నీ చేతిలోని గిటార్‌ను నిద్రలేపు!
మన రేపటిని
ఇంకా కొంచెం ఆలస్యంచేయి
పాటతో మన బాట విస్తరించి
ఈ ఇరుకు చోటు
ఇంకాస్త విశాలమవొచ్చు
ఇద్దరం కలిసికట్టుగా
మన పాత వెతల కథ నుండి
బయటపడొచ్చు
నువ్వు అచ్చంగా నువ్వే
నీ ముందున్న నేను మాత్రం
నేను కాదు!
నేను వేరొకరిని అయ్యుంటే
ఈ దారికి
స్థానిక బాటసారినయ్యేవాడిని
నువ్వైనా
నేనైనా
ఈ దారిలో ఇక తిరిగి రాలేము!
ఆ గిటార్‌లోని పాటల్ని నిద్రలేపు
మనల్ని ఊరించే
తెలియని తోవ ఏదో తోచవొచ్చు
నడుస్తున్న ఈనేల
గురుత్వాకర్షణను పరీక్షించడానికి
నేను అడుగును మాత్రమే!
నా దిక్సూచివైనా
అగాధమైనా
నువ్వే
ఈ బాటలో
నేను ఇంకొకరిని అయిఉంటే
నా భావోద్వేగాలను
భద్రంగా సూట్‌కేస్‌లో దాచి ఉండేవాడిని
అప్పుడు నా కవిత
లోతైన నీరులా సగం మార్మికంగా
తెల్లగా తేలికగా
జ్ఞాపకం కంటే బలంగా
మంచు బొట్టు కంటే బలహీనంగా ఉండేది
అప్పుడు
ఈ విస్తీర్ణమంతా
నా అస్తిత్వమేనని ప్రకటించేవాణ్ణి
ఈతోవలో
నేను ఇంకొకరిని అయ్యుంటే
ఇంకో కొత్త స్వరాన్ని నేర్పమని
నా గిటార్‌ను అడిగేవాణ్ణి
ఎందుకంటే
ఇల్లు ఇంకా చాలా దూరంలో ఉంది
ఎంత దూరమైనా
ఇల్లు చేరే దారి అందమైనదని
నా కొత్త పాట చెప్తుతుంది
దారి పొడవు పెరినప్పుడల్లా
నడక అర్థం
మళ్ళీ మళ్ళీ కొత్తగా పుడుతుంది
నేనీ దారిలో ఇద్దరవుతాను
నేనూ
ఇంకా...
నా వేరొకరు!
మూలం: (If I Were Another)
నేను వేరొకరినయ్యుంటే…
