Chapter-I
వాతావరణం బాగా లేనప్పుడు కూడా వారందరు ఒక దగ్గర చేరి ఆడతారు;
టేబుల్ కి ఇప్పుడు యాభై లేదా, దేవుడి దయ ఉంటే, దానికి రెండింతలు పందెం కడతారు, మరి గెలిచినప్పుడల్లా ఎంత గెలిచారో, ఆ మొత్తాన్ని అక్కడున్న పలక మీద రాస్తారు. ఈ ప్రతికూల వాతావరణంలో
వాళ్ళంతా బిజీగా ఆడుతున్నారు.
ఒకరోజు హార్స్ గార్డ్( రష్యా యొక్క అశ్వ దళం) సభ్యుడు అయిన నరుమోవ్ ప్యాలెస్లో వాళ్ళంతా పేకాట ఆడుతున్నారు.ఆ ఆటలో మునిగిపోయిన వాళ్ళు,చలికాలపు సుదీర్ఘ రాత్రి గడిచిపోవడం కూడా గమనించలేదు.తెల్లవారు జామున అయిదు గంటలకు డిన్నర్ చేయడానికి కూర్చున్నారు.గెలిచిన వారంతా సంతోషంతో కడుపు నిండుగా తిన్నారు;ఓడినవారు ఖాళీ ప్లేట్ల ముందు కూర్చుని ఇవేమి పట్టించుకోకుండా బాధ, ఆలోచనల్లో మునిగిపోయారు. కానీ షాపైయిన్ బాటిల్ ఓపెన్ అవ్వగానే, అప్పటిదాకా మౌనంగా ఉన్న వాళ్ళ మధ్యలో మాటల ప్రవాహం మొదలైంది. అందరు చర్చలు పెట్టడం, మాట్లాడడం మొదలుపెట్టారు.
“ఈరోజు ఎలా గడిచింది సూరిన్?”అని అడిగాడు హోస్ట్.
“ఎప్పటిలాగానే..ఓడిపోయాను.నేను దురదృష్టవంతుడిని అని ఒప్పుకోవాల్సిందే. రోజూ మిరండోల్ ఆడతున్నాను. కానీ నాకు ఏమి తగలట్లేదు.నేను ఓడిపోతూనే ఉన్నా.”
” అయినా,ఒక్కసారి కూడా నువ్వు ఈ ఆట వదిలేయాలి అనుకోలేదా?…నీ పట్టుదల నాకు ఆశ్చర్యంగా ఉంది.”
“మరి ఆ హెర్మన్ గురించి చెప్పండి?”అని ఒక గెస్ట్ అక్కడున్న ఒక యువ ఇంజనీర్ వైపు చెయ్యి చూపిస్తూ అడిగాడు.
“అతను ఇంతవరకు ఒక్క పేక ముక్క కూడా పట్టుకోలేదు.ఇంతవరకు ఒక్క సింగల్ పరోలి కూడా ఆడలేదు.కానీ రోజూ మా దగ్గర కూర్చుని, మేము ఆడే పేకాటని పొద్దున్న అయిదు దాకా చూస్తూ ఉంటాడు.”
“నాకు పేకాట చాలా ఆసక్తి కలిగిస్తుంది.”అన్నాడు హెర్మన్.”కానీ అక్కర్లేని వాటిని పొందాలనే ఆలోచనతో, అవసరమైన వాటిని త్యాగం చేసే స్థితిలో నేను లేను.”
“హెర్మన్ ఒక్క జర్మన్ వ్యక్తి కదా.అతను సాధ్యాసాధ్యాలను లెక్కలు వేసుకుంటూ ఉంటాడు.అంతే !” అని టామ్స్కీ తన పరిశీలనను చెప్పాడు.”కానీ నాకు ఇంతవరకు అర్ధం కానీ వారు ఎవరైనా ఉన్నారంటే అది మా అమ్మమ్మ, రాణి అన్నా ఫిడొటోవ్న.”
“ఏంటి?” “అవునా?” “ఎలా?” అని అక్కడున్న గెస్ట్లు ఆశ్చర్యంతో టామ్స్కీ ని అడిగారు.
“నాకిప్పటికీ అర్ధం కానీ విషయం ఏంటి అంటే,మా అమ్మమ్మ ఇంతవరకు ఎప్పుడు ఓడిపోలేదు !”
“ఏంటి?ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది.ఎనభై ఏళ్ళ వయసైనా మహిళ ఓడిపోదా ?”అన్నాడు నరుమోవ్.
“అయితే మీ ఎవ్వరి ఆమె గురించి ఏమి తెలియదా?”
“లేదు,ఏమి తెలియదు!!”
“ఓహ్, అయితే వినండి:
మా అమ్మమ్మ అరవై ఏళ్ళ ముందు పారిస్ కి వెళ్లి అక్కడి ఫాషన్ రంగాన్ని ఏలింది.అక్కడ జనాలు ఆమె వెంట పరిగెత్తేవారు..కేవలం ఈ రష్యన్ అందగత్తెని చూడడం కోసం.రిచెలియూ అప్పటి ప్రముఖ పొలిటిషన్ మా అమ్మమ్మ చుట్టే తిరిగేవాడట.ఆమె కోసం తనని తాను కాల్చుకునే దాకా వెళ్లాడని మా అమ్మమ్మ చెప్తుంటుంది.
ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఫారో ఆడేవారు. ఒకసారి కోర్టులో ఆడినప్పుడు తాను చాలా నష్టపోయి, ఫ్రాన్స్ రాజుకి భారీగా అప్పుపడింది.ఇంటికి రాగానే అమ్మమ తన బ్యూటీ మేకప్ మొఖం నుండి తొలగించుకుంటూ,తన లోదుస్తులు విడుస్తూ ఈ అప్పు గురించి మా తాతకు చెప్పి;ఆ డబ్బు ఇచ్చేయమని ఆదేశించింది.
నాకు గుర్తున్నంత వరకు మా దివంగత తాతని ఒక పనివాడిలా చూసేది అమ్మమ్మ.ఆమె అంటే అతనికి చచ్చేంత భయం;కానీ ఇంత పెద్ద మొత్తంలో నష్టపోవడం వినగానే అతనికి విపరీతమైన కోపం వచ్చింది.వెంటనే అబాకస్ తీసుకుని-ఈ ఆరునెల్లలో దాదాపు అయిదు లక్షలు ఖర్చు అయింది,పారిస్ దేగ్గర్లో ఎస్టేట్లు కూడా ఏమి లేవు.ఎందుకంటే మన ఎస్టేట్లు ఉన్నవి మాస్కో మరియు సరటోవ్లొ అని అమ్మమ్మకు చూపించి,డబ్బు ఇవ్వడం కుదరదు అని తెగేసి చెప్పాడు.ఆ మాట విన్న అమ్మమ్మ అతన్ని మొఖం మీద చాచి కొట్టి,చికాకుగా ఒకత్తె వెళ్లి బెడ్ మీద పడుకుంది.
తరువాతరోజు ఆమె తన భర్త దెగ్గరికి వెళ్ళింది.నిన్న కొట్టిన దెబ్బలకు అతను భయపడిపోయి ఉంటాడు.తప్పకుండ దారికి వస్తాడు అనుకుంది.కానీ అతను తన నిర్ణయం మార్చుకోలేదు.జీవితంలో మొట్టమొదటి సారి ఆమె తన భర్తకి వివరణ ఇచ్చుకుంటూ,చర్చలు జరిపింది.తాను అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయం చెప్పి అతన్ని ఒప్పించాలని ప్రయత్నించింది.ఓడలు బళ్ళు అవడం అంటే ఇదేనేమో.కానీ ఎటువంటి ఉపయోగం లేదు.తాత తిరగబడ్డాడు.ఎట్టిపరిస్థితుల్లో డబ్బు ఇవ్వనని చెప్పాడు.అప్పుడు అమ్మమ్మకి ఏం చేయాలో తెలియలేదు.
“అయితే ఆమెకు ఒక ప్రముఖ వ్యక్తితో చాలా సాన్నిహిత్య పరిచయాలున్నాయి.అదెవరో కాదు కౌంట్ ఆఫ్ సెయింట్ జర్మన్, అతీంద్రియశక్తులు గల వ్యక్తిగా ఇతని గురించి చాలా కథలు మనకు ప్రచారంలో ఉన్నాయి. మీరూ వినే ఉంటారు.అతను తనిని తానో ‘సంచరించే యూదుడుగా’చెప్పుకున్నాడు.సంచరించే యూదుడు అంటే మరెవరో కాదు,అతనికి చావు ఉండదు,దైవ అంశం కలిగిన వాడు అంతే కాదు దేన్నీ పట్టుకున్న బంగారంగా మార్చగలిగేవాడు(ఆల్కెమిస్ట్ )అయినప్పటికీ అతనో పిచ్చి వ్యక్తి అని,మూఢనమ్మకాలున్న వ్యక్తి అని చాలా మంది హేళన చేసేవారు.కాసనోవా, ఆత్మకథలో కౌంట్ ఆఫ్ సెయింట్ జర్మన్ ని ఒక గూఢచారిగా పేర్కొన్నాడు.ఏదేమైనప్పటికీ కౌంట్ ఆఫ్ సెయింట్ జర్మన్,సమాజంలో చూడడానికి చాలా పద్దతిగా మరియు స్నేహపూర్వకంగా ఉండేవాడు.అమ్మమ్మ ఇప్పటికి అతన్ని ప్రేమిస్తుంది.కానీ అతనేమైనా మర్యాద తక్కువగా మాట్లాడితే కోపం తెచ్చుకునేది. కౌంట్ ఆఫ్ సెయింట్ జర్మన్ దెగ్గర చాలా డబ్బు ఉంటుందని అమ్మమ్మకి తెలుసు.అతన్ని సహాయం కోరాలని నిర్ణయించుకుంది.ఒక జాబు రాసి,అతన్ని వెంటనే ఆమె వద్దకు రమ్మని కోరింది.
ఆ వయసైనా మర్మ వ్యక్తి అక్కడికి చేరుకొని,ఆమె విపరీతమైన బాధలో ఒత్తిడిలో ఉండడం గమనించాడు.ఆమె వీలైనంతవరకు తన భర్తని ఒక జాలిలేని మృగంలా చిత్రీకరించింది.చివరకు కౌంట్ ఆఫ్ సెయింట్ జర్మన్ స్నేహము,దయ మాత్రమే తనకున్న ఒకే ఒక దిక్కు అని చెప్పింది.
సెయింట్-జర్మన్ ఆలోచించాడు.
“నీకు ఈ డబ్బు నేను ఇస్తాను.ఇవి కట్టే వరకు నీకు ప్రశాంతత ఉండదని నాకు తెలుసు.కానీ మళ్ళీ నువ్వు ఓడిపోతే -ఈ సమస్యలు పునరావృతం అవ్వడం నాకిష్టంలేదు.కాబట్టి నా దెగ్గర ఇంకో మార్గం ఉంది.నువ్వు కోల్పోయిన సొమ్మంతా తిరిగి పొందచ్చు.”
“నువ్వు ఎనలేని దయార్థుడవు.కానీ నా దెగ్గర ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు.”
“అసలు డబ్బు అవసరమే లేదు.ముందు నేను చెప్పేది శ్రద్ధగా విను.”అని సెయింట్ జర్మన్ ఆమెకి ఒక రహస్యం చెప్పాడు.అదే మనకి చెప్పి ఉంటే మనం అతనికి తిరిగి పెద్ద మొత్తం ఇచ్చేవాళ్ళం.
అక్కడున్న యువకులు చాలా శ్రద్ధగా కళ్ళు విప్పారించి వినసాగారు.టామ్స్కీ తన సిగరెట్ పైప్ ని వెలిగించి,పొగని గాలిలోకి వదిలి తిరిగి చెప్పసాగాడు.
“ఆ సాయంత్రం అమ్మమ్మ వేర్సైలిస్ కి వెళ్ళింది.అక్కడ ఫ్రాన్స్ రాజు అప్పు తిరిగి తీసుకోవడం కోసం బ్యాంకర్స్ ఎదురుచూస్తున్నారు.ఆమె మొదటిగా రాజుగారికి క్షమాపణ చెప్పుకుని,డబ్బు తీసుకురాలేకపోయినందు ఒక చిన్న పిట్ట కథ అల్లింది.తిరిగి రాజుకు ఎదురుగ ఆడడం ప్రారంభించింది.ఆమె మూడు పేక ముక్కలను తీసింది.ఒక పేకముక్క తరువాత ఇంకో పేక ముక్కతో ఆడడం మొదలుపెట్టింది.ఆ మూడుముక్కలతో ఆట గెలిచింది.అమ్మమ్మ కోల్పోయిన డబ్బు తిరిగి గెలిచింది.”
“ఎదో అదృష్టం అయ్యుంటది అంతే !”అన్నాడు ఒక గెస్ట్.
“ఇదో మంచి కట్టు కథ!”అన్నాడు హెర్మన్.
“ఒకవేళ కార్డులను ముందే మార్కు చేసుకుని ఉండచ్చు కదా ?”అడిగారు ఇంకొకరు.
“ఇవేమి కాదనుకుంటా”టామ్స్కీ చాలా గర్వంగా చెప్పాడు.
“ఏంటి నువ్వనేది ? మీ అమ్మమ్మ మొత్తం మూడు కార్డులు ఒకటి తరువాత ఒకటి ఎదో మాయ వల్ల ఊహించి చేసి చెప్పగలిగింది అంటావా?అలా అయితే ఇంకా ఆ రహస్యమేంటో నువ్వు కనుక్కోలేదా ?”అని అడిగాడు నరుమోవ్.
“ఆ దెయ్యం నాకు చెప్తుందనుకుంటున్నావా ?ఆమెకి మా నాన్నతో కలిపి నాలుగు కొడుకులు.నలుగురికి పేకాట అంటే ఇష్టం.పేకాటలో మంచి రాశి గల వాళ్ళు కూడా.కానీ ఆమె ఆ రహస్యాన్ని నలుగురిలో ఒక్కరికి కూడా చెప్పలేదు.ఆమె చెప్పకపోయినా మాకు పెద్ద నష్టం ఏమి లేదు.కానీ మా అంకుల్ కౌంట్ ఇవాన్ ఇలీచ్ నాకు ఆ రహస్యాన్ని చెప్తానని మాటిచ్చాడు.దివంగత చాప్లిట్స్కీ,అదే కొన్ని లక్షలు దుబారాగా ఖర్చు చేసి చివరగా పేదరికంతో చనిపోయాడు కదా! అతను యవ్వనంలో ఉన్నప్పుడు జోరిచ్ దెగ్గర దాదాపు ముప్పై లక్షలు ఓడిపోయాడు.దాంతో తీవ్ర నిరాశకు లోనైయ్యాడు.సహజంగా యవ్వనంగా ఉన్నప్పుడు ఇలా మూర్ఖంగా ఓడిపోయినా వాళ్ళని చూస్తే మా అమ్మమ్మకు అస్సలు ఇష్టం ఉండదు.కానీ ఏమైందో తెలియదు.చాప్లిట్స్కీ పరిస్థితి చూసి జాలి పడి,ఆమె అతనికి ఒక మూడు కార్డులు ఇచ్చింది.వాటిని ఒక దాని తరువాత ఒకటి మాత్రమే వాడాలి,అలాగే ఇంకెప్పుడు పేకాట ముట్టుకోవద్దనే షరతు మీద.చాప్లిట్స్కీ తన పోటీదారుడికి ఎదురుగ కూర్చుని ఆడడం మొదలు పెట్టాడు.మొదటి కార్డుతో ఏకంగా యాభైవేలు గెలిచాడు.తరువాత ఇంకో పరోలి,ఇంకో డబల్ పరోలి అంతే !తాను కోల్పోయిన దానికన్నా ఎక్కువనే సంపాదించుకున్నాడు…”
“ఇంక ఇక్కడితో చాలు.తెల్లారింది.పావుతక్కువ ఆరు అయ్యింది.”అని ముగించాడు.
చీకటిని చీల్చుకుని సూర్యుడు బైటికి వస్తున్నాడు.అక్కడున్న యువకులు వల్ల గ్లాసులోని వైన్ ముగించుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్లారు.
Chapter-II
ఆ వయసైన రాణి డ్రెస్సింగ్ రూమ్ లో అద్దం ముందు కూర్చుంది.ఆమె చుట్టూ ముగ్గురు పనిమనుషులు ఉన్నారు.ఒకామె చేతిలో పింగాణీ జార్లో పౌడర్ ఉంది.ఇంకొకరి చేతిలో హెయిర్ పిన్నుల డబ్బా ఉంది,మూడవ ఆమె చేతిలో బంగారు రంగుగల రిబ్బన్ల టవర్ ఉంది.రాణి అందం కరిగిపోయిందన్న విషయాన్నీ అసలు జీర్ణించుకోలేదు. డెబ్భై ఏళ్ళ క్రితం వయసులో ఉన్నప్పుడు అందాన్ని కాపాడుకోవడానికి తీసుకున్న అన్ని జాగ్రత్తలు ఇంకా అలవాటుగా ఇప్పటికి పాటిస్తుంటుంది.అరవై ఏళ్ళ క్రితం ఉన్న ఫాషన్ ప్రకారం బట్టలు అంతే జాగ్రత్తగా వేసుకుంటుంది.అదే రూంలో,కిటికీ పక్కన ఒక యువతీ ఎంబ్రాయిడరీ చెయ్యడం కోసం కూర్చుంది.
“శుభోదయం రాణి “అంటూ ఒక యువ ఆఫీసర్ లోపలి వచ్చాడు.”భాంజోర్,మేడంఇసెల్లె,గ్రాండ్మామ్(ఫ్రెంచ్లో గుడ్ మార్నింగ్ చెప్పడం),నేను మీ దెగ్గరికి ఒక అభ్యర్ధనతో వచ్చాను.”
“ఏమిటది పాల్?”
“నా స్నేహితులతో ఒకరిని మీకు పరిచయం చెయ్యడానికి,శుక్రవారం రోజు బాల్స్ లో (ప్యాలస్లో అందరూ ఒక చోట చేరే ప్రదేశం) మీ ముందుకు తీసుకురావడానికి అనుమతిని ఇవ్వండి.”
“సరే!అతన్ని డైరెక్ట్ గా ఇక్కడ బాల్స్ కి తీసుకురా.నిన్న రాత్రి ఎక్కడున్నావ్ నువ్వు?”
“ఇంకేముంటుంది!చాలా ఉల్లాసమైన సమయం.మేమంతా పొద్దున్న అయిదు గంటల వరకు డాన్స్ చేసాము. ఎలేట్స్కాయ ఎంత అందంగా ఉందో!”
“సర్లే! అంత అందం ఏముంది తనలో?ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ ప్రిన్సెస్ దార్య పెట్రోవ్న లాగా ఉంటుందా?అవును మనలో మన మాట ప్రిన్సెస్ దార్య పెట్రోవ్న కు బానే వయస్సై ఉంటుంది కదా?”
“ఏంటి వయసు అయ్యి ఉంటుందా?ఏమంటున్నారు మీరు?”టామ్స్కీ ఆశ్చరంగా అడిగి “ఆమె చనిపోయి కూడా ఏడేళ్లు అయింది.”అని చెప్పాడు.
అక్కడ కూర్చున్న యువతి ఒక్కసారిగా తల ఎత్తి టామ్స్కీకి సైగ చేసింది.ఆ రాణి కి తన వయస్సు ఉన్న వాళ్ళు చనిపోయిన విషయాలు చెప్పకూడదు,దాచిపెట్టాలి.ఈ విషయం మర్చిపోయి నోరుజారినందుకు టామ్స్కీ తన నాలుకని తానే కరుచుకున్నాడు.కానీ ఈ విషయం ఇప్పుడూ ఆమె తెలుసుకుంది.ఆ వార్త ఆమెకి కొత్తగా అనిపించింది చాలా వింతగానూ అనిపించింది.
“చనిపోయిందా?నాకు తెలీదే! మేము ఇద్దరం కలిసి రాణి నివాసంలో ఉండేవాళ్ళం,రాణి నుండి ఎన్నో బహుమతులు అందుకున్నాము..”అంటూ ఆమె వందోసారి ఆ కథని టామ్స్కీకి చెప్పడం ప్రారంభించింది.
“సరే పాల్!నాకొక సహాయం చెయ్యాలి. లిజాన్కా నా స్నఫ్ బాక్స్ ఎక్కడుంది?”
తరువాత ఆమె స్నానంచేసి తయారుఅవ్వడంకోసం,పనివాళ్ళతో కర్టెన్ వెనక్కు వెళ్ళింది.
టామ్స్కీ అక్కడ యువతితో ఉన్నాడు.
“నువ్వు పరిచయం చేయాలనుకుంటుంది ఎవర్నో తెలుసుకోవచ్చా?”అని లిజావేట ఇవనోవ్నా అడిగింది.
” నీకు అతను తెలుసా?”
“తెలియదు.అతను మిలిటరీ చెందిన వ్యక్తా లేదా సాధారణ పౌరుడా?”
“మిలిటరీ.”
“ఇంజనీరా?”
“కాదు.అశ్వదళానికి చెందిన వ్యక్తి.ఎందుకు అతను ఇంజనీర్ అనుకున్నావు?
ఆ యువతి నవ్వి ఊరుకుంది కానీ జవాబు చెప్పలేదు.
“పాల్!”అని కర్టెన్ వెనుక నుండి పిలిచింది రాణి.”నాకు ఏదయినా కొత్త నవల పంపించు,ప్లీజ్,కానీ అది ఇప్పటివాళ్ళు రాస్తున్నట్టు ఉండకూడదు.”
“ఏమంటున్నారు అమ్మమ్మ?నాకర్ధం కాలేదు.”
“నేనేమన్నాను అంటే, ఏ నవలల్లో హీరో తన అమ్మ నాన్నని గొంతుపిసికి చంపేయాడో,ఏ నవలల్లో నీటిలో మునిగిన శవాలు ఉండవో అలాంటివి.నాకు నీటిలో మునిగిన శవాలు అంటే చాలా భయం!”
“ఈమధ్య కాలంలో అలంటి నవలలు ఏవి లేవు.ఒకవేళ మీరు రష్యన్ నవలలను ఇష్టపడతారా?”
“రష్యన్ నవలలా?…సరే ఒకటి పంపించు,ముసలోడా,ప్లీజ్ ఒక నవల పంపించు!”
” ఎక్స్క్యూజ్ మీ గ్రాండ్మా,నేను తొందరగా వెళ్ళాలి…ఎక్స్క్యూజ్ మీ, లిజావేట ఇవనోవ్నా!దేన్నీ బట్టి నరుమోవ్ ఇంజనీర్ అని అనుకున్నావ్ ?”
అని టామ్స్కీ డ్రెస్సింగ్ రూమ్ నుండి బైటికి వచ్చాడు.
లిజావేట ఇవనోవ్నా ఒంటరిగా మిగిలిపోయింది.ఆమె తన పని వదిలేసి,కిటికీ నుండి బైటికి చూస్తుంది.ఇంతలో ఒక యువ ఆఫీసర్ ఆ ఇంటికి ఎదురుగ ఉన్న రోడ్ చివరన కనపడ్డాడు.
తన బుగ్గలు ఎర్రబడ్డాయి.ఆమె తిరిగి తన పని చేయడం కోసం,తల వంచుకుని కాన్వాస్ మీద పని ప్రారంభించింది.సరిగ్గా అప్పుడే రాణి మొత్తం అలంకరించుకుని బైటికి వచ్చింది.
“జట్కాని పిలువు లిజాన్కా,మనం అలా బైటికి వెళ్దాం.”అంది రాణి.
లిజాన్కా ఎంబ్రాయిడరీ పని పక్కకి పెట్టి లేచింది.
“ఏంటి లిజాన్కా?ముసలిదానా,నీకు చెవుడు వచ్చిందా ఏంటి? వాళ్ళని తొందరగా జట్కా తీసుకుని రమ్మను.”అని అరిచింది.
“ఒక్క నిమిషం!”అంటూ ఆ యువతి పరిగెత్తుకుంటూ హాల్లోకి వెళ్ళింది.ఒక పనిమనిషి వచ్చి,కౌంట్ పావెల్ అలెగ్జాండరోవిచ్ నుండి కొన్ని పుస్తకాలు తెచ్చి-రాణి చేతిలో పెట్టింది.
“వెరీ గుడ్ !అతనికి థాంక్స్ చెప్పు”,”లిజాన్కా,లిజాన్కా ఎక్కడికి పరిగెడుతున్నావ్?”అని అడిగింది రాణి.
“తయారవడానికి.”
“అంత పరిగెత్తక్కర్లేదు ముసలిదానా.ఇక్కడ కూర్చో.మొదటి వాల్యూం ఓపెన్ చేసి గట్టిగ చదువు…”
లిజాన్కా ఆ పుస్తకాన్ని తీసుకొని కొన్ని లైన్లు చదివి వినిపించింది.
“గట్టిగా! ఏమైంది నీకు ముసలిదానా?నీ గొంతు పోయిందా, లేదా ఏదైనా సమస్యా?…ఆగు:ఆ పీటని నా కాళ్ళదెగ్గరికి జరుపు..దెగ్గరికి..ఆ కరెక్ట్!”అంది రాణి.
లిజావేట ఇవనోవ్నా ఇంకో రెండు పేజీలు చదివింది. అంతే రాణి ఆవలించడం మొదలుపెట్టింది.
“ఇంక చాలు ఈ పుస్తకం!ఏంటి ఈ చెత్త!ఇది తిరిగి ప్రిన్స్ పావెల్ కి పంపించి థాంక్స్ చెప్పా అని చెప్పు…అదిసరే జట్కా చెప్పావా లేదా ?”
“జట్కా రెడీగా ఉంది,”లిజావేట ఇవనోవ్నా బైటికి చూసింది.
“నువ్వెందుకు ఇంక తయారుఅవ్వలేదు?ఎప్పుడూ నీ కోసం ఎదురుచూస్తూ ఉండాలా నేను?నీ ప్రవర్తన ఇలా ఉండడం అస్సలు సహించలేను,ముసలిదానా!”
లిజా తన రూమ్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది.ఆమె వెళ్లి రెండు నిముషాలు కూడా అవ్వలేదు.ఇంతలోనే ఆ రాణి బెల్ రింగ్ చేయడం మొదలుపెట్టింది.ముగ్గురు పనిమషులు ఒక తలుపు నుండి పరిగెత్తుకుంటూ వచ్చారు.ఇంకో తలుపు నుండి వాలెట్ (మేన్స్ క్లాత్ డిజైనర్) వచ్చాడు.
“మిమల్ని పిలిచినప్పుడు రాలేరా?లిజావేట ఇవనోవ్నాకి నేను ఆమెకోసం ఎదురుచూస్తున్నా అని చెప్పు.”అంది రాణి.
లిజావేట ఇవనోవ్నా ఒక స్లీవ్లెస్ కేప్,బోనెట్ ధరించి వచ్చింది.
“అబ్బా,వచ్చావా ముసలిదానా! ఆహ ఏంటీ ఈ డ్రెస్!ఎందుకు ఇది వేసుకున్నావ్?ఎవరిని వలలో పడేద్దామని?…మరి వాతావరణం ఎలా ఉంది?బాగా గాలి వీస్తున్నట్లు అనిపిస్తుంది.”అంది రాణి.
“అలా ఏం లేదు మేడం!వాతావరణం చాలా స్థిరంగా ఉంది.”అన్నాడు వాలెట్.
“నువ్వు ఎప్పుడూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటావ్!ఆ కిటికీ తెరువు: విపరీతమైన గాలి వేస్తుంది అది కూడా చల్లగా ఉంది.జట్కాని పంపించెయ్.మనం వెళ్లట్లేదు లిజాన్కా:ఇంత అందంగా అలకరించుని ఉపయోగమే లేదు.”
“ఇది నా జీవితం”అనుకుంది లిజావేట ఇవనోవ్నా.
చెప్పాలంటే లిజావేట ఇవనోవ్నా దురదృష్టవంతురాలు. ఒకరి దురదృష్టం ఇంకొకరి అదృష్టం అని డాంటే చెప్పినట్లు,చెప్పలేము ఇలా ప్రతి విషయానికి ఆధారపడ్డ ఈ రాణి జీవితము ఒక రకంగా దురదృష్టమే.రాణి ఏమి దుర్మార్గమైన వ్యక్తి కాదు.కానీ ఆమె ఎప్పుడూ ఎలా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలియదు.కానీ ఆమె సంపన్నుల మధ్య తిరిగి అక్కడున్న పొగరు,క్రూరమైన ప్రవర్తన అలవరుచుకుంది.ప్రతి వయసైన వాళ్ళలాగానే ఆమె గతంలో చాలా ప్రేమించబడింది కానీ ప్రస్తుతం తనొక అజ్ఞాత వ్యక్తి.తనలో సంపన్నుల భావాలూ పొణికిపుచ్చుకుని బాల్స్ కి వచ్చి ఒక చివరన కూర్చుంది.చూడడానికి అసహ్యంగా ఉన్నా తప్పక వేసుకోవాల్సిన ఆభరణంలా,పౌడర్ వేసుకుని పాత ఫ్యాషన్ బట్టలు వేసుకుని వచ్చి బాల్ రూమ్ లో కూర్చుంది.అక్కడికి వస్తున్న అతిధులంతా ఒకరి తరువాత ఒకరు వచ్చి ఆమె ముందు వంగి నమస్కరించి,తరువాత అస్సలామె గురించి ఏమి పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు.దాదాపు ఊరి జనమంతా ఆ హాల్లోనే ఉన్నారు.వారందరిని ఆమె సాదరంగా ఆహ్వానించింది.వారి వస్త్రధారణ చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నా,ఆమెకి వారెవ్వి ముఖాలు పరిచయమునట్లుగా అనిపించలేదు.ఆమెకున్న సేవకులు ఎవరికున్న స్థానాల్లో వాళ్ళు నించున్నారు.పనిమషులు వాళ్లకు నచ్చిన పని వాళ్ళు చేస్తూ ఆ అవసాన దశలో ఉన్నా రాణిని దోచుకుంటున్నారు.లిజావేట ఇవనోవ్నా ఆ ఇంట్లో బానిస.ఒక గ్లాస్ లో టీ పోసుకుని దాంట్లో చెక్కెర ఎక్కువ అవ్వడంతో అదక్కడే వదిలేసింది.నవలలు గట్టిగ చదివి వినిపిస్తూ,రచయితలు చేసిన తప్పుకి తను తిట్లు తింటూ ఉండేది.రాణితో పాటు నడకకు తోడుగా వెళ్తుంది.అలాగే వాతావరణం,రోడ్ల పరిస్థితికి కూడా ఆమె జవాబు చెప్పాల్సి వచ్చేది.వీటన్నిటికీ కలిపి నెలకి ఒక ఫిక్స్డ్ జీతం ఉన్నప్పటికీ,అది ఇప్పటివరకూ చెప్పిన మొత్తం జీతం ఒక్కసారి కూడా ఇవ్వలేదు.దానికితోడు ఆమె అందరిలాగా బట్టలు వేసుకోవాల్సి వచ్చేది.ఆ ప్యాలస్ లో ఉండే కొంత మంది లాగా.సమాజంలో ఆమెకి చాలా సానుభూతి ఉంది.అందరికి ఆమె తెలుసు కానీ ఎవరూ ఆమెని పట్టించుకోరు.బాల్స్ లో ఆమె చాలా తక్కువ సార్లు డాన్స్ చేసేది.అక్కడున్న ఆడవాళ్లు వచ్చిన వెంటనే లిజావేటని వెంటబెట్టుకుని డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తారు,వాళ్ళ బట్టలు సరి చేయించుకోవడానికి.ఆమె తన స్థాయిని చూసి చాలా గర్వపడేది.తనని కోరి ఎవరైనా వస్తారని ఎదురుచూసేది.కానీ అక్కడున్న యువకులు ఆమె ప్రాముఖ్యతని గుర్తించలేరు.వారి కళ్ళకు ఆమె అనలేదు.లిజావేట ఇవనోవ్నా అక్కడున్న సంపన్న పెళ్ళిపిల్లల కంటే వంద రేట్లు ఎక్కువ అందంగా ఉంటుంది.కానీ ఎవ్వరు గుర్తించరు.దీనితో చాలా సార్లు ఆమె మౌనంగా ఆ ప్రదేశాన్ని వదిలి తన రూంకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది.ఆ రూమ్లో ఒక మడబెట్టగలిగే ఒక కర్టెన్,ఒక కప్బోర్డు,చిన్న అద్దం,పెయింట్ వేసిన మంచం మరియు మంద్రమైన ఇత్తడి కాండిల్ స్టిక్స్ మీద నిలబెట్టబడిన,ఒక జార్లో సగం వెలిగించబడిన కాండిల్ ఉన్నాయి.
ఈ కథ మొదటిలో చెప్పిన ఒక సాయంత్రం తర్వాత రెండురోజులకు లిజావేట ఇవనోవ్నా కిటికీ పక్కన కూర్చుని ఎంబ్రాయిడరీ చేసుకుంటుంది.అప్పుడొక యువ ఇంజనీర్ రోడ్ మీద నించుని ఆమె కూర్చున్న కిటికీ వైపు కన్నార్పకుండా చూస్తున్నాడు.అది ఆమె చూసి తిరిగి తల దించుకుని,ఎంబ్రాయిడరీ పని కొనసాగించింది.అయిదు నిమిషాలాగి ఆమె మళ్ళీ చూసింది-ఆ యువ ఆఫీసర్ అక్కడే నించుని,అలానే చూస్తున్నాడు.ఆమెకి అపరిచిత వ్యక్తులతో కనీసం సైగలతో కూడా మాట్లాడే అలవాటు లేకపోవడంతో,వంచిన తల ఎత్తకుండా ఒక రెండు గంటలపాటు ఎంబ్రాయిడరీ పని కొనసాగించింది.డిన్నర్ కి పిలవడంతో,ఆమె లేచి ఎంబ్రాయిడరీ పక్కకి పెట్టి,అనుకోకుండా కిటికీ నుండి బైటికి చూసింది.ఆ ఆఫీసర్ ఇంక అక్కడే ఉన్నాడు.ఇది ఆమెకు చాలా వింతగా అనిపించింది.డిన్నర్ చేసాక, అర్ధంకాని ఒక వింత ఇబ్బందితో వెళ్లి కిటికీ నుండి చూసింది.అతను అక్కడ లేదు-ఇంక ఆమె అతని గురించి మర్చిపోయింది.
ఒక రెండు రోజుల తరువాత,రాణి తో బైటికి జట్కాలో వెళ్తున్నపుడు అతన్ని మళ్ళీ చూసింది.అతను ఇంటి ముందు తప్పు దెగ్గర నించుని ఉన్నాడు.మొఖమంతా బీవేర్ కాలర్తో కప్పుకుని దాచిపెట్టాడు.అతని టోపీ కింద నుండి నల్లని కళ్ళు మెరిసాయి.లిజావేట ఇవనోవ్నా భయపడింది.కానీ ఎందుకో తనకే తెలియదు,ఆ భయంతో వణుకుతూ జట్కాలోకి ఎక్కి కూర్చుంది.
తిరిగి ఇంటికి రాగానే మళ్ళీ కిటికీ దెగ్గరికి వెళ్లి చూస్తే,ఆ ఆఫీసర్ ఇంతకుముందు ఉన్న ప్రదేశంలో నించుని ఉన్నాడు.అతని కళ్ళు ఆమె వైపే చూస్తున్నాయి.ఆమెకి ఆతృతగా ఉన్నా కూడా వెనక్కి తిరిగింది.ఎదో తెలియని ఇంతకుముందెన్నడూ లేని ఒక కొత్త భావం ఆమెలో మొదలైంది.
అప్పటినుండి ప్రతిరోజు అతను ఏదోఒక సమయంలో కనపడకుండా ఉన్నా రోజు లేనే లేదు.
వారిద్దరి మధ్య మాటలు లేకపోయినా, ఒక విధమైన మౌనబంధం ఏర్పడింది.ఆమె ఎంబ్రాయిడరీ పని కోసం అక్కడ కూర్చుని అతన్ని గంటలు గంటలు చూస్తూ గడిపేది.ఆ యువకుడు కూడా ఆమె అతన్ని చూడడాన్ని ఇష్టపడుతున్నాడు.వాళ్ళ కళ్ళు కలిసినప్పుడల్లా అతని బుగ్గలు ఎరుపెక్కడం ఆమె గమనించింది.ఒక వారం తరువాత ఆమె అతన్ని చూసి నవ్వింది..
టామ్స్కీ తన స్నేహితుడిని పరిచేయం చెయ్యాలని అడిగినప్పుడు,పాపం ఈ అమాయకురాలి గుండె జారినంత పని అయ్యింది.కానీ నరుమోవ్ – ఆ వ్యక్తి అశ్వ దళాధిపతి,ఇంజనీర్ కాదని తెలిపినప్పుడు,ఆమె నోరు జారీ ఇంజనీర్ గురించి అడిగినందుకు పశ్చాత్తాప్పడింది.అనవసరంగా తన రహస్యాన్ని సంబందించిన క్లూ ఇచ్చినందుకు బాధపడ్డది.
రష్యాకు చెందిన జర్మన్ వ్యక్తి కుమారుడు హెర్మన్.హెర్మన్కు అతని తండ్రి కేవలం కొంత సొమ్ము మాత్రమే ఇచ్చాడు. కానీ హెర్మన్ తన స్వేచ్ఛ కోసం ఆ డబ్బు ముట్టుకొనే లేదు.తన సొంత జీతంతో ఉన్నంతలో హాయిగా జీవించసాగాడు.అయినప్పటికీ హెర్మన్ ఎవరి అంచనాలకు అర్ధం కాడు.అతని జీవితానికి సంబందించినవి,ఆశయాలు ఇవి ఏవి బైటికి తెలియకుండా చాలా రహస్యంగా బతుకుతాడు.అందుకనే హెర్మన్ పిసినారిగా ఉన్నపటికీ అతని పిసినారితన్నాని వెక్కిరించే అవకాశం అతని తోటి సైనికులకు ఎప్పుడూ కలుగలేదు.అతను చాలా గొప్ప ఆశయాలు,ఇష్టాలు మరియు వాటి గురించి కలలుకంటూ ఉంటాడు.కానీ అతని స్థిరత్వం,పట్టుదల వల్ల ఎటువంటి నష్టాలలో కూరుకోలేదు.అందుకనే అతనికి మనసులో పేకాట ఆడాలని ఎంతగానో ఉన్నా;ఒక్క సారి కూడా పేక ముక్క ముట్టుకోలేదు.‘కానీ అక్కర్లేని వాటిని పొందాలనే ఆలోచనతో, అవసరమైన వాటిని త్యాగం చేసే స్థితిలో నేను లేను-అని చెప్తూ’,ప్రతిరోజు రాత్రి టేబుల్స్ వద్ద పేకముక్కలు,వణికించేలా ఆటలో మలుపులు చూస్తూ గడుపుతాడు.
ఆరోజు టామ్స్కీ చెప్పిన ఆ మూడుపేకముక్కలు -అమ్మమ కథ అతని మనసుని వదిలిపోవట్లేదు.”ఒక వేళ..”అనుకుంటూ మరుసటిరోజు సాయంత్రం వరకు ఆలోచనల్లో మునిగిపోయాడు.”ఒక వేళ ఆ రాణి మూడుముక్కల రహస్యాన్ని నాకు చెప్తే?లేదా ఆ మూడుముక్కల కార్డులు పేర్లు నాకు చెప్తే ?నా అదృష్టాన్ని ఎందుకు పరీక్షించుకోకూడదు?…ఆమెని పరిచయం చేసుకుని,ఆమెకి చాలా దెగ్గర వ్యక్తిని అయితే,ఒకేవేళ ఆమె నన్ను ప్రేమించేలా చేసుకుంటే,ఆమెకి అవసరమైనవి అన్ని తెలుసుకొని తెచ్చిపెడితే -కానీ ఇవన్నీ జరగడానికి చాలా సమయం పట్టచ్చు-ఆమెకి ఇప్పుడు 87 ఏళ్ళు -ఆమె ఇంకో వారమో,వారం దాక ఎందుకు రెండు రోజుల్లో కూడా చనిపోవచ్చు.అయినా అసలు టామ్స్కీ చెప్పిందంతా నిజమేనా..?నమ్మచ్చా ?ఎనాలిసిస్,నిజానిజాల పరిశీలన మరియు ఈ పనికి మనం పెట్టె శ్రమ ఎంత వచ్చే లాభమెంత,పొయ్యే నష్టం ఎంత,ఇవి మూడే నా జీవితానికి మూడు పేకముక్కలు.వీటివల్లనే నా డబ్బు రెట్టింపు,రెట్టింపు ఏం కర్మ !ఏడురెట్లు ఎక్కువ సంపాదించగలుగుతాను.అంతేనా ఈ విధంగా ఆచి తూచి అడుగేయడం వల్ల ప్రశాంతత,స్వేచ్ఛ లభిస్తాయి.”అని పీటర్స్బర్గ్ మొత్తం తిరుగుతూ తనలో తాను అనుకోసాగాడు.
అతను పీటర్స్బర్గ్ మెయిన్ రోడ్లో ఉన్న ఒక పాత బంగాళా ముందు ఆగి ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు.ఆ వీధి అంత వచ్చే పోయే వాహనాలతో చాలా రద్దీగా ఉంది. నిమిషానికొకసారి జట్కాలు,వాహనాల నుండి ఎవరో ఒకరు దిగి మిల మిల లాడుతున్న ఆ ఇంటి ద్వారం వైపు వెళ్తున్నారు. నిమిషానికొకసారి లేలేత పాదాలు ఉన్న అందమైన యువతులు,మెరిసే బూట్లు లేదా ఆఫీస్ బూట్లు ధరిస్తూ వ్యక్తులు,మోకాలి వరకు స్ట్రిప్స్ ఉన్న స్టాక్స్ వేసుకున్న వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్తున్నారు వస్తున్నారు.
జూలుతో తయారు చేసిన కోట్లు,మెరిసే చేతి గడియారాలు ఆ ఇంటి వాచ్ మాన్ ని దాటుకుని వెళ్తున్నాయి.హెర్మన్ అక్కడ ఆగాడు.
“ఈ బంగాళా ఎవరిదీ?”అని ఆ విధి చివరనున్న సెంట్రీ ని అడిగాడు.
“ది గ్రేట్ రాణి…గారిది “అని బదులిచ్చాడు సెంట్రీ.
హెర్మన్కి ఒక్కసారిగా ఆతృతగా అనిపించింది.మళ్ళీ ఆ రహస్యాన్ని సంబందించిన అతని ఊహలు మొదలయ్యాయి.వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఆ బంగాళా చుట్టూ తచ్చాడుతున్నాడు.ఆరోజు అతను తన ఇంటికి చాలా ఆలస్యంగా వెళ్ళాడు కానీ నిద్రపట్టలేదు.చాల సేపటి తరువాత నిద్రపోయినా కూడా పేకముక్కలు,పచ్చ రౌండ్ టేబుల్,కుప్పల కుప్పల బ్యాంకు నోట్లు,బంగారు నాణేల రాసులు అతని కలలో వస్తున్నాయి.ఒకదాని తరువాత ఒక ఆటలో గెలుస్తున్నాడు.బంగారం మొత్తం సొంత ఎంచేసుకున్నాడు.బ్యాంకు నోట్లు అన్నీ జేబులో పెట్టుకున్నాడు.నిద్రలేవగానే ఈ ఖరీదైన కలలు ఆగిపోయినందుకు చింతిస్తూ,మళ్ళీ ఊరంతా తిరుగుతూ తిరుగుతూ రాణి ఇంటిముందు ఆగాడు.ఎదో తెలియని ఒక వింత శక్తి తనని ఇటు చుట్టూ లాగుతునట్టు అనిపిస్తుంది అతనికి.అతనక్కడ ఆగి కిటికీల వైపు చూడసాగాడు. అలా చూస్తున్నపుడు ఒక కిటికీ దెగ్గర నల్లని జుట్టుతో ఒక తల కిందకి వంగడం చూసాడు.పుస్తకం చదవడానికో లేదా ఏదైనా కుట్టు పనై ఉండచ్చు అనుకున్నాడు.కొంతసేపటికి ఆ తల పైకిలేచింది.హెర్మన్ నల్లని కళ్ళు కలిగిన ఒక లేత మొఖాన్ని చూసాడు.ఆ క్షణమే అతని జీవితాన్ని మార్చేసింది.
Chapter-III
లిజావేట ఇవనోవ్నా అలా తన డ్రెస్ మార్చుకుందో లేదో మళ్ళీ రాణి పిలిచి మళ్ళీ జట్కా తీసుకురమ్మని ఆదేశించింది.ఇద్దరు వెళ్లి జట్కాలో కూర్చోడానికి బయలుదేరారు.ఇద్దరు సేవకులు రాణి ని ఎత్తి జట్కాలో కూర్చోబెడుతున్న సమయంలో,లిజావేట ఆ ఇంజనీర్ జట్కా చక్రం పక్కన నించుని ఉండడం చూసింది.వెంటనే అతను ఆమె చేతిని గట్టిగ పట్టుకుని,ఒక ఉత్తరాన్ని పెట్టి,ఆమెకి భయం మొత్తం ఆవరించేలోపే కనుమరుగైపోయాడు.ఆమె ఆ ఉత్తరాన్ని తన గ్లౌవ్స్ లో దాచిపెట్టి,దారంతా ఏమి జరగనట్టు కూర్చుంది.రాణి కి ఎప్పుడూ ఎదో ఒకటి అడుగుతూ ఉండే అలవాటు ఉంటుంది.”ఎవరది ఇటు వైపు వెళ్ళింది?””ఈ బ్రిడ్జి పేరేంటి?””ఆ బోర్డు మీద ఏమి రాసుంది?”ఇలా.ఈసారి లిజావేట ఈ ప్రశ్నలకు అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్పింది.దానితో రాణికి కోపం వచ్చింది.
“ఏమైంది నీకు ముసలిదానా?నువ్వేమైనా పరధ్యానంలో ఉన్నావా ఏంటి ?అయితే నేను చెప్పింది నువ్వు వినట్లేదా లేదా నీకు నేను అడిగేది అర్ధం కావట్లేదా?…ఆ దేవుడి దయ వల్ల నాకు ఇంకా మాట్లాడే శక్తి ఉంది అలాగే నేనేమి పిచ్చిదాన్ని కాదు.”
లిజావేట ఆమె తిట్లని కూడా పట్టించుకోవట్లేదు.బంగాళా చేరుకోగానే ఒక్క పరుగున తన రూమ్ కి వెళ్లి గ్లౌవ్స్ లోపల ఉన్న ఆ ఉత్తరాన్ని తీసింది.ఆ ఉత్తరం సీల్ చేసి లేదు.లిజావేట ఆ ఉత్తరాన్ని చదివింది.ఆ ఉత్తరం హృదయం ఆకారాలతో డెకరేట్ చేసి ఉంది;అందులోని పదాలు చాలా సున్నితంగా, గౌరవంగా ఉన్నాయి;ఒక్కో పదం జర్మన్ నవల నుండి తీసి రాసింది.కానీ లిజావేటకి జర్మన్ రాదు కానీ ఆ ఉత్తరంతో మురిసిపోయింది.
కానీ ఆ ఉత్తరం తనని కొంత ఇబ్బంది పెట్టింది.ఇది ఆమె జీవితంలో మొట్టమొదటి సారి,ఒక యువకుడితో రహస్య సన్నిహితమైన బంధంలో ఉండడం.అతని ధైర్యం ఆమెని భయపెడుతుంది.అయినా ఆమె మళ్ళీ మళ్ళీ అతనిని చూస్తూనే ఉంది.ఏమి చేయాలో తెలీదు కూడా.ఒకవేళ కిటికీ పక్కన కూర్చోడం ఆపేస్తే,ఒక వేళా కూర్చున్నా-అతన్ని చూడకపోతే అతను ఇలానే ఉంటాడా?ఇప్పుడు ఈ ఉత్తరం తిరిగి పంపాలా?లేదా బదులు రాయాలా?తనకి సలహా ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు,కనీసం స్నేహితులు కూడా లేరు.ఆలోచనల తర్జన భర్జన తరువాత ఆమె తిరిగి జవాబు రాయడానికి నిర్ణయించుకుంది.
లిజావేట ఒక పెన్ను-పేపర్ తీసుకుని,తన చిన్న రైటింగ్ టేబుల్ దెగ్గర కూర్చుని ఏమి రాయాలా అని ఆలోచించసాగింది.చాల సార్లు తాను ఉత్తరం రాసి చింపేసింది.ఎందుకంటే వాటిలో రాసిన పదాలు అతన్ని చాలా సాన్నిహిత్యంతో పిలిచినట్టు లేదా చాలా తీవ్రమైన కోపంతో రాసినట్టో అనిపించింది.బాగా అలోచించి ఆఖరికి కొన్ని లైన్లు ఆమెకి సబబు అనిపించాయి.”మీ అభిప్రాయాలకి నేను గౌరవం ఇస్తున్నాను కానీ మీరు తొందరపడి ఎదో చేసి నన్ను అవమాన పరచడం నీ ఉద్దేశం కాదని నాకు తెలుసు.కానీ మన బంధం ఇలా కాదు మొదలవాల్సింది.మీ ఉత్తరం మీకు తిరిగి ఇస్తున్నాను.ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తులో నా దెగ్గర అమర్యాదగా ప్రవర్తించే లేదా నన్ను అవమాన పరిచే అవకాశం మీకు ఇవ్వకూడదని.”అని ఉత్తరం రాసింది.
తరువాత రోజు హెర్మన్ రావడాన్ని గమనించిన లిజావేట,తన ఎంబ్రాయిడరీ పని నుండి లేచి,రిసెప్షన్ రూమ్ కి వెళ్లి,కిటికీ తెరచి ఒక ఉత్తరాన్ని బైటికి విసిరేసింది.అది హెర్మన్ తీసుకుంటాడని అంచనావేసి.ఆమె అంచనాలకు తగట్టు గానే హెర్మన్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ ఉత్తరాన్ని తీసుకుని,పక్కనే ఉన్న బేకరీ షాప్ కి వెళ్ళాడు.ఆ ఉత్తరం సీల్ ఓపెన్ చెయ్యగానే హెర్మన్ కి అతను రాసిన ఉత్తరమే మొదలు కనిపించింది తరువాత లిజావేట ఉత్తరం ఉంది.తన పథకం ప్రకారం ఊహినట్టే ఆమె ఉత్తరం ఉండడంతో అది తీసుకుని ఇంటికి వెనుదిరిగాడు.
సరిగ్గా మూడు రోజుల తర్వాత ఒక ఫ్రెంచ్ యువతి ఒక డ్రెస్ షాప్ నుండి వస్తూ లిజావేటకి ఒక ఉత్తరాన్ని ఇచ్చి,డబ్బులు అడిగింది.లిజావేట భయంతో ఉత్తరాన్ని తెరిచి హెర్మన్ చేతిరాతని గుర్తుపట్టింది.
“నువ్వు ఎవరికీ ఇవ్వాల్సిన ఉత్తరం నాకు ఇచ్చావు ?ఈ ఉత్తరం నాకు చెందాల్సింది కాదు.”
“లేదండి.ఇది మీకోసం ఇచ్చిందే.చదవండి.”అని ఆ యువతి గట్టిగా చెప్పి,మూసి మూసి నవ్వులు నవ్వింది.
లిజావేట ఆ ఉత్తరాన్ని త్వరగా చదివింది.హెర్మన్ ఆమెని కలవడానికి ఒక మంచి సమయం, అలాగే ప్రదేశం చెప్పమని రాసి ఉంది.
“ఇది జరగదు!”ఆమె చేతులు భయంతో వణుకుతున్నాయి.ఎవరైనా చూస్తారేమో అన్న కంగారు ఆమెలో పరిగెడుతుంది.”ఈ ఉత్తరం నాకు వచ్చింది కాదు!”అని అంటూ దాన్ని ముక్కలు ముక్కలుగా చింపి పారేసింది.
“ఈ ఉత్తరం మీకు వచ్చింది కాకపోతే దాన్ని ఎందుకు చింపేసారు?మీది కాకపోతే ఇచ్చినవాళ్ళకి తిరిగి ఇచ్చేది కదా!”అంది ఫ్రెంచ్ యువతి.
“ప్లీజ్ !భవిష్యత్తులో కూడా ఇలా ఎవరైనా ఉత్తరం ఇచ్చి ఇవ్వమంటే నా దెగ్గరికి తీసుకురాకు.అలాగే ఇది ఇచ్చిన వ్యక్తికి చెప్పు అతను ఈ పని చేసినందుకు సిగ్గుపడాలి అని..”అంది లిజావేట.
కానీ హెర్మన్ తగ్గలేదు.లిజావేటకి రోజుకో ఉత్తరం,వేరు వేరు వ్యక్తులతో పంపసాగాడు.ఈ ఉత్తరాలలో జర్మన్ భాషకూడా లేదు,ఈ నవలల పదాలు లేవు.తన సొంతంగా ఇష్టంతో ఏరికోరి రాసి పంపడం మొదలుపెట్టాడు.ఈ ఉత్తరాలలో తన అదుపులేని ప్రేమ,కోరికలను,ఊహలను లిజావేటకి తెలియపరిచాడు.లిజావేట కూడా ఉత్తరాలని వెనక్కి పంపడం ఆపేసింది.తాను వాటిని చదివి వాటికీ బదులు పంపడం మొదలుపెట్టింది.రాను రాను ఉత్తరాలు గంటలు గంటలు రాయడం మొదలుపెట్టింది.చివరికి ఒక రోజు లిజావేట:
“ఇవాళ రాత్రి ఎంబసీలో బాల్ ఉంది.రాణి కూడా వెళ్తుంది.అక్కడ రాత్రి రెండు గంటల దాక ఉండచ్చు.నువ్వు నన్ను ఒంటరిగా కలవాలనుకుంటే ఇంత కన్నా మంచి ఛాన్స్ దొరకదు.రాణి బైటికి వెళ్ళగానే,సేవకులందరు ఇంటికి వెళ్ళిపోతారు.వాచ్ మాన్ ఒక్కడు ఉంటాడు కానీ అతను అతని రూంలోకి వెళ్ళిపోతాడు.రాత్రి 11 :30 కి రా.నేరుగా మెట్లు ఎక్కి పైకి రా.ఒకవేళ హాల్ లో ఎవరైనా నిన్ను కలిస్తే రాణి ఉన్నారా అని అడుగు..వాళ్ళు లేరు అని చెప్తారు.అప్పుడు నువ్వు అలాగే తిరిగి వెళ్ళచ్చు.వెళ్ళిపోవాలి కూడా.ఒకవేళ ఎవ్వరు చూడకపోతే.ఎందుకంటే పనిమనుషులు కూడా వాళ్ళ రూంలకి వెళ్ళిపోతారు.హాల్ నుండి ఎడమ వైపు తిరిగితే నేరుగా రాణి బెడ్ రూమ్ వస్తుంది.అందులోకి వేళ్ళు.బెడ్ రూమ్ లో కర్టెన్ వెనుక నీకు ఒక రెండు చిన్న తలుపులు కనిపిస్తాయి.కుడి వైపు తలుపు రీడింగ్ రూమ్ కానీ రాణి అక్కడికి ఎప్పుడూ వెళ్ళదు.లేదమ్మా వైపు తలుపు తెరిస్తే ఒక కారిడార్ ఉంటుంది దాని నుండి మెట్లు ఉంటాయి.ఆ మెట్లెక్కి వస్తే రా రూమ్ ఉంటుంది.”అని రాసింది.
హెర్మన్ మాటువేసి పులిలా ఆ రోజుకు ఎదురుచూడసాగాడు.చెప్పిన రోజు రానే వచ్చింది.ఆ రోజ్ ఆరాత్రి 10 గంటలకే రాణి ఇంటిముందు పడిగాపులు కాసాడు.వాతావరణం చాలా అద్భుతంగా ఉంది.చల్లని గాలి వేస్తుంది,మంచు పడుతుంది,స్ట్రీట్ లైట్లు చాలా డిమ్ గా మెరుస్తున్నాయి,వీథిలో ఎవ్వరూ లేరు.అప్పుడప్పుడు ఒకటో రెండో బళ్ళు కస్టమర్స్ కోసం వెతుకుతున్నాయి.హెర్మన్ అలాగే నించున్నాడు.అతని మందమైన కోట్ వల్ల చలి కానీ గాలి కానీ అతనికి తెలియట్లేదు.ఆఖరికి రాణి గారిజట్కా వచ్చింది.హెర్మన్ సేవకులు ఆమెని ఎలా మోసుకుని జట్కాలో కూర్చోబెడుతున్నాడో చూస్తూ ఉన్నాడు.అమెచుట్టూ మందమైన జూలు కోట్ కప్పబడి ఉంది.ఇద్దరు తమ చేతుల మీద జాగ్రత్తగా ఆమెని లేపి,లోపల కూర్చోబెట్టారు.ఆమె తల నిండా పూలతో అలంకరించుకుంది.జట్కా డోర్ వేసిన వెంటనే కదిలిసింది.ఆ మంచు మీద జట్కా చాలా వేగంగా వెళ్ళిపోయింది.వాచ్ మాన్ తలుపు మూసేసాడు.వెలుగుతూ ఉన్న కిటికీలని ఒక్కసారిగా అంధకారం అయిపోయాయి.హెర్మన్ సమయం కోసం ఎదురుచూస్తున్నాడు,అక్కడే తచ్చాడుతూ వాచ్ ని స్ట్రీట్ లైట్ వెలుగులో చూసాడు.సమయం 11:20 అయింది.అక్కడే ఆ లైట్ కింద నించుని 10 నిముషాలు లెక్కపెట్టసాగాడు.11 :30 అయ్యింది.నేరుగా ఆ బంగాళా లోపలి వెళ్ళాడు.వాచ్ మాన్ లేడు.హెర్మన్ మెట్ల పైకి వెళ్ళాడు.హాల్ తరుపు తెరవగానే అక్కడ ఒక సేవకుడు ఒక చెక్క కుర్చీలో,దీపం పక్కన పడుకుని ఉండడం గమనించాడు.హెర్మన్ నెమ్మదిగా చప్పుడు లేకుండా పిల్లిలా అతన్ని దాటుకుని నడవసాగాడు.రిసెప్షన్,డ్రాయింగ్ రూమ్ చీకటిగా ఉన్నాయి.హాల్ లో ఉన్న వెలుతురు ఇక్కడ కొంచెం పడసాగింది.ఆ వెలుతువల్ల హెర్మన్ వాటిని దాటుకుని నేరుగా రాణి బెడ్ రూమ్ కి వెళ్ళాడు.
ఒక స్టాండ్ నిండా బంగారంతో ఉన్న చిహ్నాలు,దీపపు వెలుగులో మెరిసిపోతున్నాయి.పాలిపోయిన ఒక పాత కుర్చీ,సోఫా నిండా దిండ్లు,వెలిసిపోయిన గోడలకు కప్పబడిన చైనీస్ సిల్క్,గోడలకి ఎం ఎం ఈ లిబ్రన్,పారిస్లో గీసిన రెండు చిత్రపటాలు ఉన్నాయి.ఒకటి నలభైలలో,ఎర్రని ఛాయా కలిగి -లేత ఆకుపచ్చ రెండు యూనిఫామ్ ధరించిన ఒక వ్యక్తి ఫోటో.ఇంకొకటి ఒక అందమైన యువతి కొచ్చని ముక్కు,వెనక్కి దువ్వబడిన జుట్టు,పౌడర్ రాసుకుని అలంకరించుకుని ఒక రోజా పువ్వు పెట్టుకుంది. అక్కడున్న ప్రతి మూలలో, తెల్లని సిరామిక్ తో గొర్రెలను కాచే ఆడవాళ్ళ శిల్పాలు,పేరుగాంచిన రాజుల ఫొటోలతో గడియారాలు,చిన్న డబ్బాలు,బాండలొర్,ఫ్యాన్లు మరియు పోయిన శతాబ్దం చివరిలో ఉపయోగించబడిన,ఆడవాళ్ళ మేకప్ కి సంబంధించి చిన్న చిన్న వస్తువులు వాటితో పాటు మాంటగొల్ఫైర్ బెలూన్,మెస్మెర్ మాగ్నెటిజం సంబందించిన వస్తువులు ఉన్నాయి.హెర్మన్ కర్టెన్ వెనక్కి వెళ్ళాడు.అక్కడ ఒక చిన్న ఇనుప మంచం ఉంది.దానికి అనుకుని ఉన్న కుడి గది రీడింగ్ రూమ్,ఎడమ గది కారిడార్.హెర్మన్ ఎడమవైపు ఉన్న గది తెరచి చూసాడు.ఆ కారిడార్ చిన్నగా ఒక మెట్ల మార్గంగా మారింది.కానీ ఆ తలువు వేసి అతను కుడివైపు ఉన్న చీకటి స్టడీ రూమ్ కి వెళ్ళాడు.
సమయం చాలా నెమ్మదిగా వెళ్తుంది.అంతా నిశ్శబ్దంగా ఉంది.డ్రాయింగ్ రూమ్ లో గడియారం 12 వ గంట మోగింది మళ్ళీ నిశ్శబ్దంగా ఉంది.హెర్మన్ అక్కడ చల్లని స్టవ్ కి అనుకుని అలాగే నించున్నాడు.అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు.అతని గుండెసహజంగా కొట్టుకుంటుంది.అతనొక ప్రమాదకరమైన కానీ తప్పనిసరిగా చేయాల్సిందే అని అనుకున్నాడు.నెమ్మదిగా గడియారం ఒకటి, రెండు గంట కూడా కొట్టింది.దూరాన వస్తున్న జట్కా చప్పుడు అతనికి వినిపించింది.ఎదో తెలియాలి కోపం అతన్ని ఆవరించింది.జట్కా ఆగింది.కింద నుండి అడుగుల చప్పుడు అతనికి వినిపిస్తుంది.ఆ ఇంట్లో హడావిడి మొదలైంది.సేవకులు పరిగెడుతున్నారు,గట్టిగా అరుస్తున్నారు,ఇల్లంతా దీపాలు వెలిగించారు.ముగ్గురు వయసైనా పనిమనుషులు రాణి బెడ్ రూమ్ కి పరిగెత్తుకుంటూ వచ్చారు.రాణి నిద్రమత్తులో ఉన్నారు.ఆమె వచ్చి రాగానే వోలటైర్ కుర్చీలో కూలబడ్డారు.హెర్మన్ తలుపు మధ్యలో ఉన్న సన్నని గ్యాప్ నుండి చూస్తున్నాడు.లిజావేట ఆ తలుపుని దాటుకుని వెళ్ళింది.హెర్మన్ కి ఆమె మళ్ళీ మెట్లు వేగంగా ఎక్కుతున్న చప్పుడు వినిపిస్తుంది. ఎదో అతని హృదయంలో ఒక అలజడి చెలరేగినట్టే ఉంది మళ్ళీ అది ఆగిపోయింది.అతను రాయిలా బిగుసుకుపోయాడు.
రాణి అడ్డం ముందు తన బట్టలు విప్పసాగింది.పనిమనుషులు ఆమె డ్రెస్ పిన్నులు తీశారు,పువ్వులు తీశారు,ఆమె నెరిసిన చిన్న జుట్టుకి పెట్టుకున్న విగ్గుని తీశారు.ఆమె చుట్టూ పిన్నులు వర్షంలా వడ్డాయి.ఆమె వేసుకున్న సిల్వర్ బోర్డర్ ఉన్న పసుపు రంగు గౌన్-వాచిపోయిన ఆమె పాదాల మీద పడింది.హెర్మన్ ఆమె అసహ్యమైన టాయిలెట్ రహస్యాలను చూసాడు.ఆఖరికి రాణి బెడ్ జాకెట్ తొడిగి,నైట్ క్యాప్ పెట్టి పడుకోబెట్టారు.ఇప్పుడు వేసుకున్న ఈ బట్టలు ఆమెకి,ఆమె వయసుకి సరిగ్గా సరిపోయాయి.ఈ బాధలలో ఆమె కొంచెం తక్కువ భయంకరంగా,తక్కువ అసహ్యంగా ఉంది.
అందరి ముసలివాళ్ళ లాగానే రాణి కూడా ఇన్సోమేనియా తో బాధపడుతున్నట్టు ఉంది.
తన సేవకులందరిని వెళ్లిపొమ్మని చెప్పి,బట్టలు విప్పేసి కిటికీ పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది.రూమ్ లో ఉన్న కొవ్వొత్తులు అన్ని తీసుకెళ్లిపోయారు.కేవలం ఒక చిన్న లైటు మాత్రమే వెలుగుతూ ఉంది.రాణి అక్కడ అలాగే కదలకుండా కూర్చుని తన పెదాలు మాత్రం అటు ఇటు ఆడిస్తుంది.రాణి అలసిపోయిన కళ్ళు చూస్తే ఆమె ఏమి ఆలోచించట్లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది.ఎవరైనా యామిని ఇలా చూస్తే ఆమె సహజంగా కుర్చీలో ఉగుతునట్టు ఉండదు.ఎదో ఎలక్ట్రిక్ కరెంటు పెట్టి ఆమెని ఉపుతున్నటు ఉంటుంది.అంతలా జీవం లేదు ఆమెలో.
సడెన్గా ఆమె ముఖంలో జీవం వచ్చింది.పెదాలు కదలడం ఆగాయి.కళ్ళు కూడా సాధారణంగా మారాయి ఎందుకంటే ఆమె ముందొక తెలియని అపరిచితుడు నించున్నాడు.
“భయపడకు!భయపడకు!నేను నీకు ఏ హాని చెయ్యను.నేను నీ నుండి ఒక సహాయం కోరి వచ్చాను.”అన్నాడు హెర్మన్.
ఆ రాణి అతన్ని నిశితంగా,నిశ్శబ్దంగా చూస్తుంది.ఇంతకుముందెప్పుడు అతని గొంతు విన్న జ్ఞాపకం ఆమెకి లేదు.హెర్మన్ ఆమెకి చెవుడు ఏమో అనుకుని,ముందుకు వంగి ఆమె చెవిలో కూడా అదే చెప్పాడు.ఆమె మళ్ళీ అలాగే నిశ్శబ్దంగా ఉంది.
“నా జీవితాన్ని సంతోషం చేయగలిగిన దానివి నువ్వు.నీకు దాని వల్ల ఎలాంటి నష్టం లేదు,పోయే సొమ్ము లేదని నాకు తెలుసు.నీకు మూడు పేక ముక్కాలా రహస్యం తెలుసని నాకు తెలుసు…”అని చెప్పి హెర్మన్ ఆగాడు.
రాణికి అతను ఎం చెప్తున్నాడో అర్ధమైనట్టు అనిపించింది.ఆమె బదులు చెప్పడం కోసం పదాలను ఆలోచిస్తుంది.
“అదొక జోక్!నీమీద ఒట్టు అది ఒక జోక్ !”అంది రాణి.
“ఇదేమి జోక్ కాదు!నాకు తెలుసు.చాప్లిట్స్కీ గుర్తున్నాడా.అదే ఎవరికైతే నీ సహాయం వల్ల పోయిందంతా తిరిగొచ్చిందో అతను,” అన్నాడు హెర్మన్ కోపంగా.
రాణి చాలా కోపంగా ఉంది.ఆమెలో మార్పు కనిపిస్తుంది.కానీ వెంటనే ఆమె ఇంతకుముందులా నిశ్శబ్దంగా మారిపోయింది.
“ఆ మూడు ముక్కలు ఏంటో నాకు చెప్పగలరా?”అడిగాడు హెర్మన్.
రాణి ఏమి మాట్లాడలేదు.
“ఎవరికోసం నువ్వు ఈ రహస్యాన్ని దాచిపెడుతున్నావ్?నీ మనవళ్ళ కోసమా?వాళ్ళకి ఇవేం అక్కర్లేకుండానే వాళ్ళు సంపన్నవంతులు,అంతే కాదు వాళ్ళకి డబ్బు విలువ తెలియదు.
నీ ఈ రహస్యం డబ్బుని దుబారాగా ఖర్చుచేసేవాళ్ళకి ఉపయోగం లేదు.ఒక వ్యక్తి తన తాతల తండ్రుల ఆస్తిని కాపాడుకోలేకపోతే,వాడి కర్మ కాలి ఎలాగూ పేదరికంలోనే చస్తాడు.కానీ నేను దుబారా మనిషిని కాదు.నాకు డబ్బు విలువ తెలుసు.నీ రహస్యం-మూడు ముక్కలు నాకు చెబితే పనిరాకుండా పోవు.కాబట్టి…”అని హెర్మన్ మాట్లాడి రాణి బదులు కోసం ఆగాడు.రాణి ఏమి మాట్లాడలేదు.హెర్మన్ ఆమె కాళ్ళ మీద పడ్డాడు.
“మీకు ప్రేమ ఎలా ఉంటుందో ఒక్కసారైనా తెలిసిన,అది ఎంత ఆనందాన్ని ఇస్తుందో గుర్తుందా?మీకు అప్పుడే పుట్టి ఏడుస్తున్న పిల్లాడిని చూసి ఒక్కసారైనా నవ్వినా?ఎవరైనా ఒక్కసారైనా మీ రొమ్ములను తాకినా,గుర్తుతెచ్చుకోండి;నా భార్య,ప్రేయసి,తల్లి వాళ్ళ పరిస్థితుల్లో ఉండి ఆలోచించండి.ప్లీజ్ నా అభ్యర్ధనను తిరస్కరించవద్దు.ఆ రహస్యాన్ని నాకు చెప్పండి.దాని వాళ్ళ మీకేం లాభం అని ఆలోచిస్తున్నారా?…అది మీరు చేసిన పాపాల నుండి మిమల్ని విముక్తి చేస్తుంది.ఆలోచించండి మీకు వయసైపోయింది.మీరు ఇంకా ఎక్కువ రోజులు బతికి ఉండలేరు.మీ పాపాలు నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను.మీ రహస్యం ఏంటో చెప్పండి.ఆలోచించండి:నా ఆనందం అంతా మీ చేతుల్లో ఉంది.నాది మాత్రమే కాదు,నా పిల్లలది,వాళ్ళ పిల్లలది,వాళ్ళ మనవాళ్ళు కూడా మిమల్ని ఎప్పుడూ జ్ఞాపకాల్లో తలుస్తూ మిమల్ని పూజిస్తుంటారు.
రాణి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
హెర్మన్ నించున్నాడు.
“ముసలిదానా !”అని పళ్ళు కొరికాడు.”నీతో ఇప్పుడు ఎలా చేపిస్తానో చూడు..”అంటూ జేబులోనుండి పిస్టల్ తీసాడు.
పిస్టల్ ని చూడగానే రాణి రెండవసారి భయపడింది.ఆమె తన తలని వద్దు అన్నారు ఊపి,చేతులు పైకి ఎత్తింది..అంతే వెనక్కి పడిపోయి అలాగే చలనం లేకుండా ఉండిపోయింది.
“చిన్నపిల్లల్లా నటించడం ఆపేయి”అని హెర్మన్ ఆమెని చేతుల్లో తీసుకుంటూ అన్నాడు.”ఆఖరిసారిగా అడుగుతున్నా:ఆ మూడు ముక్కాలా రహస్యం కానీ వాటి పేర్లు కానీ చెప్తావా లేదా ?”
రాణి ఎటువంటి జవాబు ఇవ్వలేదు.ఈలోపు హెర్మన్ ఆమె చనిపోయిందని గుర్తించాడు.
Chapter-IV
లిజావేట ఇవనోవ్నా,ఇంకా తన రూంలో,ఇంటికి బాల్ గౌన్లోనే ఉంది దీర్ఘంగా ఆలోచిస్తుంది.బంగళాకి రాగానే ఆమె డ్రెస్,మేకప్ తొలగించడానికి సహాయం చేస్తా అన్న నిద్రమొఖంతో ఉన్న పనిమనిషి వద్దని,తానే చేసుకుంటా అని చెప్పి-హెర్మన్ వచ్చి ఉంటాడని చూడడానికి రూమ్ కి వెళ్ళింది మనసులో హెర్మన్ లేకపోయుంటే బాగుండు అనుకుంది.రూమ్ చూడగానే హెర్మన్ లేడు అని ఆమెకి అర్ధమైంది.ఏదైతేనేమి అతను రానందుకు ఆ అదృష్టానికి థాంక్స్ చెప్పుకుంది.తాను కూర్చుని కొద్దీ సమయంలోనే హెర్మన్ విషయంలో తాను ఈ స్థితి దాక రావడానికి జరిగిన సంఘటనలు అన్ని గుర్తుచేసుకుంటుంది.మూడు వారాల ముందు ఒక వ్యక్తిని కిటికీ దెగ్గర చూసి-ఇవాళ అతన్ని రాత్రి కలవడానికి రమ్మనడం!అంతా ఆశ్చర్యంగా అనిపించింది.అతని పేరే కొన్ని ఉత్తరాలలో ఉన్న సంతకం చూసి తెలుసుకుంది.అంతే కానీ ఇంతవరకు అతని గొంతు కూడా వినలేదు,అతని గురించి కూడా ఏమి తెలియదు…కానీ ఆ రోజు సాయంతం మొత్తం తెలిసింది.ఒక విచిత్రమైన విషయం జరిగింది.ఆరోజు సాయంత్రమే బాల్ దెగ్గర టామ్స్కీ యువరాణి పోలినా కి గాలిలో ముద్దులుపెట్టి పంపిస్తున్నాడు.కానీ పోలినా ఇందుకు పూర్తి భిన్నంగా ఇంకొకళ్ళతో కలిసి గడుపుతుంది.పోలినకు మంచి గుణపాఠం నేర్పాలని టామ్స్కీ లిజావేట ఇవనోవ్నా ని పిలిచి,ఆమెతో కలిసి ఆపకుండా మజురెక్ డాన్స్ చేసాడు.తర్వాత ఆమెతో ఇంజినీర్ల గురించి మాట్లాడుతూ,జోక్స్ చేస్తూ ఆటపట్టించాడు.టామ్స్కీ మాట్లాడిన విధానాన్ని బట్టి ఏదయితే తెలియకూడదు అనుకుందో అంతకన్నా ఎక్కువే అతనికి తెలిసినదని లిజావేటకి అర్ధమయ్యింది.
“నాకిదంతా ఎవరు చెప్పారు ?”అడిగింది నవ్వుతూ.
“నా స్నేహితుడు,నీకు కూడా బాగా తెలిసిన వ్యక్తిలో,ఒక ప్రత్యేకమైన వ్యక్తి.”అన్నాడు టామ్స్కీ.
“ఎవరు ఈ ప్రత్యేకమైన వ్యక్తి?”
“అతని పేరు హెర్మన్.”
అది విన్న వెంటనే లిజావేట ఏమి మాట్లాడలేదు.ఆమె చేతులు కళ్ళు చల్లబడ్డాయి.
“ఈ హెర్మన్,నిజంగా చాలా రొమాంటిక్ క్యారెక్టర్.అతనిలో నెపోలియన్ జాడలతో పాటు,మెఫిస్టోఫేల్స్ ఆత్మ కూడా ఉందనుకుంటా.అతను ఇప్పటిదాకా కనీసం ఒక మూడు తప్పులైనా చేసిఉండాలి.అదేంటి నువ్విలా పాలిపోయావేంటి?”
“నాకు తల నొప్పిగా ఉంది…హెర్మనో ఎదో అతని పేరు ఏదయితే ఏంటి -అతను ఇంకేం చెప్పాడు నీకు?
“హెర్మన్ అతని స్నేహితురాలి ప్రవర్తన వల్ల ఇబ్బందిపడ్డారు. అతను కనుక ఆ స్నేహితురాలి స్థానంలో ఉంటే వేరేలా ప్రవర్తించే వాడిని అని చెప్పేవాడు…అతను నిన్ను వలలో పడేయాలని చూస్తున్నాడని నాకు అనుమానంగా ఉంది.ఎందుకంటే అతను మా స్నేహితుల్లో ఎవరైనా రొమాంటిక్ సంభాషణలు తెచ్చినప్పుడు వాటిని వినడానికి శారదా చూపిస్తున్నాడు.”
“కానీ అతను నన్నెక్కడ చూసాడు?”
“చర్చిలో అవచ్చు,లేదా పబ్లిక్ ప్లేస్ లో అవచ్చు! ఆ దేవుడికే తెలియాలి.ఒకవేళ నీ రూంలో నువ్వు నిద్రిస్తున్నపుడే చూసి ఉండచ్చు:అతను అంత పని చేసే సమర్ధుడు కూడా..”అని మాట్లాడుతుండగా ముగ్గురు యువతులు ‘మమల్ని మర్చిపోయావా ?’ అంటూ అక్కడికి వచ్చారు.అందువల్ల ఒక బాధ కలుగుతున్నా- ఆసక్తిగా ఉన్న సంభాషణ ఆగిపోయింది.
టామ్స్కీ ఇష్టపడ్డ యువరాణి పోలినా అతనితో మాట్లాడి,ఎక్కువ సేపు లిజావేట కుర్చీకి ఎదురుగ,టామ్స్కీతో కలిసి డాన్స్ కూడా చేసింది.తిరిగి టామ్స్కీ అతని కుర్చీలో కూర్చున్నప్పుడు అతనికి హెర్మన్ కానీ,లిజావేట తో ఆపేసిన సంభాషణ కానీ గుర్తులేదు.కానీ లిజావేట ఈ సంభాషణ తిరిగి కొనసాగించాలనుకున్నా,మజురెక్ అయిపొయింది.రాణి కూడా బయలుదేరింది.
టామ్స్కీ చెప్పినవన్నీ లిజావేటకి చాలా మధురంగా అనిపించాయి.ముందే ఆమె ఊహల్లో అతనికి ఒక క్యారెక్టర్ ఇచ్చింది దానికి టామ్స్కీ చెప్పినవి కూడా కలవడంతో ఆ వ్యక్తి ని పూర్తిగా తను తెలుసుకోగలిగింది.ఈమధ్య చదివిన నవలలకు థాంక్స్ చెప్పుకుంది,వాటి వల్లే తను కొంచెం భయపడిన,తనలో ఊహాశక్తిని నింపింది నవలలే.ఆమె ఖాళీ చేతులు ఒకదాని మీద ఒకటి వేసుకుని కూర్చుని,తల కిందికి వంచుకుని,ఆమె ఛాతీమీద ఉన్న పువ్వుల్ని చూస్తూ ఉంది..ఈలోపు సడెన్ గా తలుపు తెరుచుకుంది.హెర్మన్ లోపలి వచ్చాడు.ఆమె భయపడింది.
“ఎక్కడున్నావు ఇంతసేపు?”అని భయంతో గుసగుసగా అడిగింది.
“రాణి గారి బెడ్ రూమ్లో,నేను ఇప్పుడే అక్కడి నుండి వచ్చాను.ఆమె చనిపోయింది.”అన్నాడు హెర్మన్.
“దేవుడా!..ఏంటి నువ్వు చెప్పేది?”
“ఆమె చనిపోవడానికి నేనే కారణం అనుకుంటా..”అన్నాడు హెర్మన్.
లిజావేట అతన్ని తేరిపారా చూసింది.టామ్స్కీ చెప్పిన మాట గుర్తొచ్చింది.”ఈ మనిషి ఇప్పటికి కనీసం మూడు తప్పులైనా చేసుండాలి.”హెర్మన్ ఆమెతో కిటికీపక్కన కూర్చుని జరిగిందంతా చెప్పాడు.
లిజావేట భయపడుతూ అతను చెప్పేదంతా విన్నది.అంటే ఆ ప్రేమ,ఆ ఉత్తరాలు,వద్దన్నా వెంటబడడం,తెగించిన సందర్భాలు ఇవేవి ప్రేమ కోసం కాదన్నమాట!డబ్బు కోసం.అతనికి కావాల్సింది డబ్బు.ఆమె కాదు అతనికి సంతోషాన్ని ఇచ్చేది.ఒక పెద్ద పిల్లని ఆఖరికి,ఒక దొంగ -హంతకుడైన వ్యక్తికి అసిస్టెంట్గా పనిచేసాను.అది కూడా నాకు అన్నం పెట్టె రాణి ని చంపడానికి!…ఆమె గుండెపగిలి వెక్కి వెక్కి ఏడ్చింది.
హెర్మన్ ఆమెని నిశ్శబ్దంగా చూసాడు.అతని మనసుకీ గాయం అయ్యింది.కానీ ఆ అమాయకురాలు ఏడుపొ,లేదా ఆమె బాధనో అతని రాయిలాంటి మనసుని కరిగించలేవు.అతనికి ఎటువంటి పశ్చాత్తాపము లేదు.ఆ రాణి చనిపోవడంతో,ఆ రహస్యం శాశ్వతంగా ఎవ్వరికి తెలియదు-అందువల్ల అతను సంపన్నుడు అవలేడు అనే బాధనే అతని ఇబ్బందిపెడుతుంది.
“నువ్వో రాక్షసుడివి.”లిజావేట అన్నది.
“నేను ఆమె చనిపోవాలని కోరుకోలేదు.నా పిస్టల్ లో గుళ్ళు కూడా లేవు.”హెర్మన్ చెప్పాడు.
ఇద్దరు మౌనంగా ఉన్నారు.
తెల్లవారుతుంది.లిజావేట తన రూంలో ఉన్న కొవ్వొత్తిని ఆర్పేసింది.బైటినుండి ఒక డిమ్ వెలుతురు ఆ గదిని నింపేసింది.ఆమె తన కన్నీళ్లు తుడుచుని,హెర్మన్ ని చూసింది.అతను కిటికీ పక్కన కూర్చుని,ముఖం చిట్లించి,తన చేతులని జేబు కోటులో పెట్టుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.హెర్మన్ ని అలా చుసిన లిజావేట కు నెపోలిన్ చిత్రపటం జ్ఞాపకం వచ్చింది.అతను అలానే చేతులు జేబులో పెట్టుకుని ఉంటాడు.ఈ పోలిక ఆమెని ఆశ్చర్యపరిచింది కూడా.
“ఇప్పుడు నువ్వు ఈ బంగాళా నుండి బైటికి ఎలా వెళ్తావ్?”అడిగింది లిజావేట.”నేను నిన్ను రహస్యంగా,సొరంగ మార్గంలో ఉన్న మెట్ల ద్వారా తప్పిద్దాం అనుకుంటున్నాను కానీ దానికి మనం బెడ్ రూమ్ దాటి పోవాలి,నాకు భయంగా ఉంది.”
“ఆ సొరంగ మార్గం ఎక్కడుందో ఎలా వెళ్లాలో చెప్పు.నేను వెళ్తాను.”అన్నాడు హెర్మన్.
లిజావేట లేచి,సొరుగునుండి ఒక తాళం తీసి హెర్మన్కి ఇచ్చి,ఎలా వెళ్ళాలో వివరంగా చెప్పింది.హెర్మన్ ఆమె చల్లని చలనం లేని చేతులని పట్టుకుని,ఆమె నుదిటిన ముద్దు పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళాడు.
అతను తిరిగి మెట్ల ద్వారా కిందికి దిగి రాణి బెడ్ రూమ్ కి చేరాడు.ఆ చనిపోయిన శవం రాయిలా కదలకుండా అలానే ఉంది.రాణి మొఖం మాత్రం చాలా శాంతంగా ఉంది.హెర్మన్ ఆమె ముందు ఆగి,చాలా సేపు అలాగే చూస్తూ ఉండిపోయాడు-ఆమె నిజంగానే చనిపోయిందో లేదో ఇంకోసారి పరీక్షించడానికి.తర్వాత అక్కడి నుండి స్టడీ రూమ్ కి వెళ్లి,అక్కడ గోడకున్న చిత్రపటం వెనుక ఉన్న తలుపు వెతికాడు.ఆ తలుపు గుండా ఒక చీకటి మార్గంలో,మనసులో రకరకాల ఆలోచనలతో వెళ్తున్నాడు.
“ఒకవేళ ఈ మెట్ల ద్వారానే అనుకుంటా,అరవై ఏళ్ళ క్రితం,ఈ సమయంలోనే,ఈ రాణి బెడ్ రూమ్ లోనే,ఎంబ్రాయిడరీ చేసిన కఫ్తాన్ డ్రెస్లో,అతని జుట్టుని-పక్షి ఈకలు పొదిగిన టోపీతో,ఒక యువకుడు వచ్చి దొంగిలించాడు,వాడు ఇప్పటికి స్మశానంలో మట్టైపోయుంటాడు.ఇవాళ వయసైపోయిన అతని ప్రేయసి గుండె ఆగిపోయింది…”అనుకున్నాడు.
మెట్ల చివరన హెర్మన్ కి ఒక తలుపు కనిపించింది.తన దెగ్గర ఉన్న తాళంతో,ఆ తలుపు తీస్తే,అతను వచ్చిన విధిలోకి వచ్చేసాడు.
Chapter-V
రాణి చనిపోయిన మూడు రోజుల తరువాత,ఉదయాన్న తొమ్మిది గంటలకు హెర్మన్ చనిపోయిన రాణి అంత్యక్రియలు నిర్వహిస్తున్న కాన్వెంట్ కి వెళ్ళాడు.అతనిలో పాశ్చాతప్పం ఏమి లేకపోయినా,అతని మనస్సాక్షిని మాత్రం ఆపలేకపోయాడు.”ఆ ముసలావిడను చంపినా హంతకుడివి నువ్వే.”అని పదే పదే అతని మనస్సాక్షి చెబుతూ ఉంది.హెర్మన్ కి ఆధ్యాత్మికమైన విషయాల్లో విపరీతమైన నమ్మకం ఉంది.అలాగే అతను ఎన్నో మూఢనమ్మకాలను విశ్వసిస్తాడు.ఈ చనిపోయిన రాణి వల్ల అతని జీవితంలో చాలా చెడు జరగచ్చు అన్న సందేహం ఉంది అతనికి.అందుకే ఆమె అంత్యక్రియలకు వెళ్లి తను చేసిన దానికి రాణి ఆత్మని క్షమాపణ కోరలనుకున్నాడు.
చర్చి మొత్తం జనాలతో నిండిపోయింది.ఆ జనాలలో నుండి హెర్మన్ ముందుకు వెళ్లలేకపోతున్నాడు.శవపేటిక మొత్తం కాటాఫల్క్ తో,ఖరీదైన వెల్వెల్ట్ గుడ్డతో కప్పబడింది.
చనిపోయిన శవాన్ని అందులో పడుకోబెట్టారు.చేతులను మడిచి రొమ్ము భాగం మీద పెట్టారు.శవానికి లేస్ క్యాప్-తెల్లటి శాటిన్ గౌన్ తొడిగారు.ఆ శవం చుట్టూ ఆ ఇంట్లో పనిమనుషులు,సేవకులు భుజం మీద ఆర్మోరియాల్ రిబ్బన్ ఉన్న, నల్లటి కఫ్తాన్ బట్టల్లో,చేతిలో కొవ్వొత్తి పట్టుకుని నించున్నారు.చుట్టాలంతా చాలా బాధలో ఉన్నారు.పిల్లలు,మనవళ్ళు,మునిమనవళ్లు.ఎవరు ఏడవలేదు;కన్నీళ్లు నిజమైన ప్రేమకి చిహ్నం.రాణికి వయసు చాలా పైబడింది.అందుకని అక్కడివారికి ఆమె మరణం ఆశ్చర్యంగా అనిపించలేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళందరూ ఆమె బతికి ఉండాల్సిందనికన్నా ఎక్కువ రోజులే బతికి ఉందన్న ఆలోచన వాళ్ళందరి ముఖంలో స్పష్టంగా తెలుస్తుంది.ఒక యువ బిషప్ అంత్యక్రియల ఉపన్యాసం ఇచ్చాడు.
చాలా సులభమైన పదాలతో అతను-ఆ గొప్ప మహిళకు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాడు.ఒక మధురమైన క్రిస్టియన్ వీడ్కోలు అది.”మరణం యొక్క దూత ఆమెని చేరుకుంది.మీ ఆలోచనల్లో జాగ్రత్తగా ఉండండి.లేదంటే ఈ మృత్రువు ఏ అర్ధరాత్రైనా అలంకరించిన పెళ్లికొడుకులా రావచ్చు.” వీడ్కోలు చాలా విచారంగా జరిగింది.మొదటిగా అక్కడి నుండి చుట్టాలు వెళ్లిపోయారు.తరువాత చాలా మంది ఒకరి తరువాత ఒకరు వెళ్లి అక్కడ నమస్కరించి వచ్చారు.వీళ్లందరి పార్టీలకి ఆమె ఎప్పుడూ వెళ్ళేది.తరువాత ఇంటి సేవకులు,పనిమనుషులు వెళ్లారు.ఆ ఇంటి వయసైనా పనిమనిషి-దాదాపు రాణి వయసు ఉన్న ఆమెని ఇద్దరు అమ్మాయిలు తమ చేతులతో పట్టి తీసుకెళ్లారు.ఆమె వంగి నమస్కరించి లేకపోయింది.నించునే తమ యజమానురాలి చలనం లేని చల్లని చేతిని ముద్దు పెట్టుకుని,కన్నీళ్లు పెట్టుకుంది.ఆమె తరువాత హెర్మన్ ఆ శవపేటిక దెగ్గరికి వెళ్లాలనుకున్నాడు.అతను వంగి నమస్కరించి,అక్కడే చల్లని నెల మీద కొంచెం సేపు కూర్చున్నాడు.లేచే నించునే సరికి,అతనూ ఆ రాణి శవంలా పాలిపోయి ఉన్నాడు.తరువాత అతను మెట్లెక్కి కాటాఫల్క్ చేరుకొని అక్కడ నమస్కరించాడు..ఆ సమయం చనిపోయిన రాణి,ఒక కన్ను కొడుతూ అతన్ని వెక్కిరిస్తూ చూస్తున్నట్టు అనిపించింది అతనికి.హెర్మన్ భయపడిపోయి ఒక్క ఉదుటున వెన్నకి జరిగే సరికి జారీ కిందపడ్డాడు.నడుముకు దెబ్బ తగిలింది.అక్కడున్న వాళ్ళు అతన్ని లేపారు.అదే సమయంలో లిజావేట ఇవనోవ్నను కళ్ళు తిరిగి పడిపోతే అక్కడి నుండి మోసుకువెళ్తున్నారు.దీని వల్ల అక్కడున్న నివాళి కార్యక్రమం లో హుందాతనం కొంత సేపు డిస్టర్బ్ అయింది.అక్కడున్న ప్రజలలో గుసగుసలు మొదలయ్యాయి.అక్కడున్న ఒక బక్క బ్రిటిష్ పొలిటిషన్,రాణికి దెగ్గర చుట్టం పక్కనున్న ఇంగ్లీష్ వ్యక్తి చెవిలో ‘ఈ యువ ఆఫీసర్ రాణి కుమారుడని’చెప్పాడు.దానికి అతను “ఓహ్?” అని బదులు చెప్పాడు.
హెర్మన్ ఆరోజంతా చాలా బాధగా గడిపాడు.అతని అలవాట్లకు విరుద్ధంగా బైట రోడ్డు మీద చిన్న కొట్టు -చావడి లాంటిది అక్కడ భోజనం చేసాడు.తనలోపల రగులుతున్న ఆలోచనల్ని అణగదొక్కడానికి మందు తాగాడు.కానీ మందు వల్ల అతని ఊహలు ఇంకా ఎక్కువయ్యాయి.ఇంటికి చేరుకోగానే,డ్రెస్ కూడా మార్చుకోకుండా అలానే బెడ్ మీద పడిపోయి నిద్రపోయాడు.
అతను నిద్రలేచేసరికి ;రాత్రి అయింది.రూమంతా చంద్రుని వెలుగులో మెరుస్తుంది.గడియారం వైపు చూసాడు.సమయం పావు తక్కువ మూడు అయింది.అతనికి నిద్రపోయింది.లేచి బెడ్ మీద కూర్చుని,ఆ రాణి అంత్యక్రియల గురించి ఆలోచించసాగాడు.
సరిగ్గా అప్పుడే ఎవరో బయట నుండి కిటికీలో తొంగి చూసి,వెంటనే వెనక్కి జరిగారు.కానీ హెర్మన్ దాన్ని గమనించలేదు.కొంతసేపటికి ముందు రూమ్ తలుపు తెరుచుకోవడం వినిపించింది హెర్మన్ కి.హెర్మన్ మొదలు అది ఎవరో వయసైనా వాళ్ళు తాగి తలుపు తెరవడానికి ప్రయత్నిస్తున్నారనుకొని ఊరుకున్నాడు.కానీ కొద్దీ సేపట్లో ఏవో తెలియని అడుగుల చప్పుళ్ళు అతన్ని సమీపిస్తున్నట్టు వినిపించింది.ఇవాళో చెప్పులు ఈడుస్తూ నడుస్తున్న శబ్దం అది.రూమ్ డోర్ తెరుచుకుంది.అందులో నుండి ఒక మహిళా తెల్లటి డ్రెస్ లో వచ్చింది.హెర్మన్ ఆమె ఒక ఓల్డ్ నర్స్ అనుకుని,ఈ సమయం లో ఎందుకొచ్చిందో అని ఆలోచిస్తున్నాడు.కానీ ఆ మహిళా నెమ్మదిగా నడుస్తూ -ఒక్కసారిగా అతని ముందొచ్చి నించుంది-హెర్మన్ ఆమెని గుర్తుపట్టాడు.ఆమె ఎవరో కాదు రాణి.
నేనిక్కడికి నాకు ఇష్టం లేకపోయినా వచ్చాను.కానీ నాకో ఆజ్ఞ ఉంది అది ముగించుకోవాలి.మూడు,ఏడు,ఆసు -పేకముక్కల వరస ఇది,ఇవి తీస్తే నువ్వు గెలుస్తావు.కానీ ఒక్క షరతు.ఇరవై నాలుగు గంటల్లో కేవలం ఒక పేకముక్క మాత్రమే వాడాలి.ఒకటి తరువాత మరొకటి ఉపయోగించుకోవాలి.ఈ పేకముక్కలు అన్ని వాడక మళ్ళీ జీవితంలో ఎప్పుడూ వాడకూడదు.నా మరణానికి కారణమైన నిన్ను నేను క్షమించాలంటే నువ్వు లిజావేట ఇవనోవ్నని పెళ్లి చేసుకోవాలి…”అని గంహిరమైన కంఠంలో చెప్పింది.
తరువాత ఆమె మౌనంగా వెనక్కి తిరిగి,తలుపు వద్దకు వెళ్ళి మాయమైపోయింది.హెర్మన్ తలుపు మూసుకున్న చప్పుడు విన్నాడు.ఎవరో కిటికీ నుండి చూసినది కూడా గమనించాడు.
చాలా సేపటి వరకు హెర్మన్ స్పృహలోకి రాలేకపోయాడు.అతను పక్కనున్న గదికి వెళ్ళాడు.అతని పనిమనిషి తాగి కింద పడుకున్నాడు.ఎంత లేపిన లేవట్లేదు.హాల్ గదిలో తలుపు తాళం వేసి ఉంది.హెర్మన్ తిరిగి తన రూంకి వెళ్ళి,కొవ్వొత్తి వెలిగించి అతని విజన్ రాసుకున్నాడు.
Chapter-VI
ఫిజిక్స్ లో రెండు వస్తువులు ఒకేసారి,ఒకటే ప్రదేశంలో ఉండలేవు అన్నట్టు-రెండు స్థిరమైన ఆలోచనలు కూడా కలిసి ఒకచోట ఉండలేవు.మూడు,ఏడు,ఆసు ఇవి తలుచుకోగానే హెర్మన్ మనసులో చనిపోయిన ఆమె ముఖం జ్ఞాపకం వచ్చింది.మూడు,ఏడు,ఆసు ఇవి అతని బుర్ర నుండి వెళ్లట్లేదు.నోట్లో కూడా అవే నానుతూ ఉన్నాయి.ఒక అమ్మాయిని చూసి “ఎంత మంచి శరీరాకృతి! నిజమైన మూడు హార్ట్స్ సింబల్లా ఉంది!”అనుకున్నాడు.టైం ఎంత అని అడిగినపుడు “అయిదు నిమిషాల తక్కువ ఏడు”అని చెప్పాడు.ప్రతి పొట్ట ఉన్న మనిషి అతనికి ఆసులా అనిపించారు.మూడు,ఏడు,ఆసు అతనికి నిద్రలో కూడా అదే ధ్యాస.ఆ మూడు ఆకృతులు కలిగినవి ఎవున్నాయా అని ఆలోచించసాగాడు.మూడు ఆలోచించగానే ఒక మంచి ఖరీదైన గడ్డిగులాబీ,ఏడు -యురోపియన్ కట్టడ శైలి గోతిక్ గేట్,ఆసు ఒక పెద్ద సాలెపురుగులా తోచింది.ఈ ఆలోచనలన్నీ అతనికి ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉన్నాయి.ఈ రహస్యం కోసమే కదా అతను అంత కష్టపడింది.అతను తరువాత ఆర్మీ నుండి రిటైర్ అయ్యి,హాయిగా ఊర్లు తిరగాలనుకున్నాడు. అతను అదృష్ట దేవతని బలవంతగా ఒప్పించాడు.
మాస్కోలో బాగా సంపన్న వంతులైన గ్యాంబ్లర్స్ అందరు చేకలిన్స్కీఅధ్యక్షతన భైటి అయ్యారు.చేకలిన్స్కీ ఒకప్పుడు జీవితమంతా పేకాట మాయం.పేకాటలో కొన్ని లక్షలు గెలుచుకున్నాడు-గెలుపులెప్పుడు ప్రొమిసోరీ నోట్లలో తీసుకునేవాడు,ఓడిపోయినప్పుడు నగదు రూపంలో చెల్లించేవాడు.అతని జీవిత అనుభవాల వల్ల అందరు అతన్నెంతో మర్యాదగా చూస్తారు.అతనిప్పుడు పీటర్స్బర్గ్ వచ్చాడు.ఎక్కడెక్కడినుండో యువకులంతా అతను ఇదెగ్గర వచ్చారు-బాల్స్ మర్చిపోయి పేకముక్కలాట కోసం.నరుమోవ్ హెర్మన్ ని ఆయన దెగ్గరికి తీసుకెళ్లాడు.
వాళ్ళు అటెండెంట్లు నించున్న,పెద్ద పెద్ద రూంల నుండి లోపలి నడుస్తూ ఉన్నారు.కొంతమంది జనరల్స్,కౌన్సిలర్లు అక్కడ పేకాట ఆడుతున్నారు.యువకులంతా సోఫా మీద కూర్చుని,ఐస్ క్రీం తింటూ,సిగరెట్ తాగుతున్నారు.డ్రాయింగ్ రూమ్లో, ఒక పొడవాటి టేబుల్ చుట్టూ ఒక ఇరవై మంది ఆటగాళ్లు చుట్టూ కూర్చున్నారు.అక్కడ హోస్ట్ బ్యాంకు పట్టుకుని మౌనంగా కూర్చున్నాడు.అతనికొక 60 ఏళ్ళ వయసుంటుంది,చాలా పద్ధతైన ఆహార్యం,అతని జుట్టు నెరిసింది,అతని ముఖం మంచితనాన్ని ప్రతిబింబిస్తుంది,కళ్ళు మెరుస్తున్నాయి,ఒక చల్లని చిరునవ్వు. నరుమోవ్ ఆయనికి హెర్మన్ ని పరిచయం చేసాడు.చేకలిన్స్కీతల ఊపి,ఇక్కడ నించోవద్దని చెప్పి,ఆట డీలింగ్లో కూర్చున్నాడు.
ఆ రౌండ్ చాలా సేపు ఉంది.దాదాపు ముప్పై కన్నా ఎక్కువ పేకముక్కలున్నాయి టేబుల్ మీద.
చేకలిన్స్కీ ప్రతి ఆట తరువాత అక్కడున్నవాళ్ళకి తిరిగి ఆరెంజ్ చేసుకోవడానికి,వల్ల తప్పులు,నేర్చుకున్న మెళకువలు రాసుకోడానికి సమయాన్ని ఇస్తున్నాడు.చివరికి ఆఖరి రౌండ్ ముగిసింది.చేకలిన్స్కీ పేకముక్కలు కలిపి,వేరే డీల్ కోసం తయారుగా ఉన్నాడు.
“నన్ను ఒక్క సారి ఆడడానికి అనుమతించండి”అని అడిగాడు హెర్మన్.చేకలిన్స్కీ నవ్వి,సరేననట్టుగా తల ఊపాడు.నరుమోవ్ నవ్వుతు హెర్మన్ కి కంగ్రాట్స్ చెప్పి అతను గెలవాలని కోరుకున్నాడు.
“ఇదిగో ఇదే మొత్తం!”అంటూ హెర్మన్ చాలా పెద్ద మొత్తాన్ని తీసి అతని పేకముక్క మీద బెట్ కాసాడు.
“ఎంత సార్!సారీ ఇందులో ఎంత ఉందో నేను చూసి చెప్పలేను.ఎంత ఉందో చెప్పరా?”అని హోస్ట్ అడిగాడు.
“నలభై వేలు”అన్నాడు హెర్మన్.
వెంటనే అక్కడున్న వారందరి కళ్ళు హెర్మన్ వైపు తిరిగాయి.
“అతనికి పిచ్చెక్కింది”అనుకున్నాడు నరుమోవ్.
“ఒక్క చిన్న సలహా ఇవనివ్వు”అన్నాడు చేకలిన్స్కీ.”నీకు ఇది కొత్త ఏమో.నేను కొంచెం కష్టమైన అపోనెంట్ ని.నాకు ఎదురుగ ఇక్కడ ఎవరు డెబ్భై అయిదు,రెండు వందలు దాటి ముందుకు పోలేదు.దానికి వారు కోల్పోయారు.ఆలోచించుకో.”
“అయితే ఏంటి?ఇపుడు నా డీల్ తీసుకుంటారా లేదా ?”అన్నాడు హెర్మన్.
చేకలిన్స్కీ సాధారణంగా నవ్వి.
“నేను కేవలం నీకు ముందే చెప్పాలనుకున్న అంతే.అంతే కానీ నా దెగ్గర డబ్బు కూడా సిద్ధంగా ఉంది.ఒక మంచి ముక్క ముందు డబ్బు ఉంచు.”
హెర్మన్ తన దెగ్గర ఉన్న బ్యాంకు నోట్ తీసి చేకలిన్స్కీ కి ఇచ్చాడు.దాన్ని హెర్మన్ ఎంచుకున్న కార్డు మీద పెట్టారు.
డీల్ మొదలైంది.హెర్మన్ తొమ్మిది వరసలో ఉన్న పేకముక్కలు చూసి మూడు అనే సంఖ్యా ఉన్న పేకముక్క వైపు వేలు చూపించాడు.”నా ముక్క గెలిచింది”అన్నాడు హెర్మన్.
అక్కడి జనాలందరూ గుసగుసలాడడం మొదలు పెట్టారు.చేకలిన్స్కీ కనుబొమ్మలు ఎగరేసినా,అతని ముఖం చూసి చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు.
“నీకు ఎలా అనిపిస్తుంది ఈ గెలుపు?”అన్నాడు చేకలిన్స్కీ.
“మీరు డబ్బులిస్తే..”అన్నాడు హెర్మన్.
చేకలిన్స్కీ తన జేబు నుండి డబ్బుల నోట్లు తీసి అతనికి ఇచ్చేసాడు.హెర్మన్ అతనికి రావాల్సిన డబ్బు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.నరుమోవ్ ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నాడు.హెర్మన్ ఒక గ్లాస్ నిమ్మరసం తాగి,ఇంటికెళ్ళాడు.
తరువాతి రోజు మళ్ళీ అతను చేకలిన్స్కీ కి ఎదురుగ డీల్ కోసం వచ్చాడు.హెర్మన్ అక్కడ ఆట జరుగుతున్న టేబుల్ దెగ్గరికి వెళ్ళాడు.చేకలిన్స్కీ అతనికి స్నేహపూర్వకంగా తల వంచాడు.
హెర్మన్ కొత్త రౌండ్ మొదలవ్వడానికి ఎదురు చూసాడు,కార్డు పెట్టి,దాని మీద నలభై ఏడు వేలు పెట్టాడు.
చేకలిన్స్కీ డీల్ మొదలుపెట్టాడు.కుడి వైపు జాక్,ఎడమ వైపు ఏడు ఉంది.హెర్మన్ ఏడుని ఎంచుకున్నాడు.గెలిచాడు.
అందరు తీక్షణంగా, ఆతృతగా,ఆశ్చర్యంగా చూడసాగారు.చేకలిన్స్కీ చూడడానికి కొంచెం చికాకుగా కనిపించాడు.అతను తొంబై నాలు వేలు లెక్కబెట్టి హెర్మన్ కి ఇచ్చాడు.హెర్మన్ ఆ డబ్బుని సంతోషంగా తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
తరువాతి రోజు సాయంత్రం హెర్మన్ మళ్ళీ టేబుల్ దెగ్గరికి వచ్చాడు.అందరు అతని కోసం ఎదురు చూస్తున్నారు కూడా.జనరల్స్,కౌన్సిలర్లు వల్ల ఆట వదిలేసి హెర్మన్ ఆట చూడడానికి వచ్చారు.యువ ఆఫీసర్లు సోఫా లో ఇరుక్కుని కూర్చున్నారు.అటెండర్లు అందరు అక్కడ చేరారు.అందరు హెర్మన్ చుట్టూ నించున్నారు.మిగతా ఆటగాళ్లు పేక ఆడటం ఆపేసి అక్కడికి వచ్చి నించున్నారు.హెర్మన్ టేబుల్ దెగ్గర నించున్నాడు- చేకలిన్స్కీ చూసి నవ్వాడు.ఇద్దరి దెగ్గర సీల్ తీసిన పేకముక్కలు తీశారు.చేకలిన్స్కీ పేకముక్కలని కలిపాడు.హెర్మన్ అతని కార్డు తీసి దాని మీద బ్యాంకు నోట్లతో నింపేసాడు.అది డబల్ అయ్యేలా డీల్ కుదుర్చుకున్నాడు.చేకలిన్స్కీ చేతులు వణుకుతున్నాయి.అతను డీల్ ప్రారంభించాడు.
కుడి వైపు రాణి,ఎడమ వైపు ఆసు ఉన్నాయి.
“ఆసు !అదే గెలుస్తుంది.”అన్నాడు హెర్మన్.అతని కార్డు తీసి చూపిస్తూ.
“నీది రాణి.నువ్వు ఓడిపోయావు.”అన్నాడు చేకలిన్స్కీ గట్టిగా.
హెర్మన్ వణికిపోయాడు.ఆసు కాదు అది క్వీన్ అఫ్ స్పేడ్స్ -స్పేడ్ రాణి అతని ముందుంది.అతను తన కళ్ళను నమ్మలేకపోయాడు.అతనికి ఇది ఎలా జరిగిందో ఎందుకు తప్పయ్యిందో అర్ధం కాలేదు.
ఆ సమయంలో ఆ స్పేడ్ రాణి అతని చూసి కన్నుకొట్టి-నవ్వినట్లు,వెక్కిరించినట్లు అనిపించింది.ఆ రాణి ముఖం కూడా అతనెక్కడ చూసాడా గుర్తొచ్చింది.
“ఆ ముసలి రాణి!”హెర్మన్ గట్టిగా భయంతో అరిచాడు.
చేకలిన్స్కీ హెర్మన్ నుండి రావాల్సిన సొమ్ము వాసులు చేసుకుని,వేరే ఆటకి తాయారు అయ్యాడు.హెర్మన్ చలనం లేకుండా నించున్నాడు.అతను టేబుల్ని వదిలి వెళ్లే సమయానికి అక్కడ అందరు గట్టిగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
“చాలా అద్భుతంగా ఆడారు!”అని ఆటగాళ్లందరూ చేకలిన్స్కీని మెచ్చుకున్నారు.చేకలిన్స్కీ తిరిగి కార్డులను కలిపి,తరువాతి డీల్ కి సిద్దమయ్యాడు.
హెర్మన్ కి పిచ్చెకింది.ఒబుఖోవ్ ఆసుపత్రిలో రూమ్ నెంబర్ 17లో కూర్చుని,ఏది మాట్లాడకుండా,ఎవరు పిలిచినా పలకకుండా కేవలం ‘మూడు,ఏడు,ఆసు!మూడు,ఏడు,ఆసు!..”అంటూ పదే పదే కలవరిస్తూ ఉండేవాడు.
లిజావేట ఇవనోవ్న ఒక గౌవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న మంచి యువకుడిని పెళ్లి చేసుకుంది.అతను రాణికి ఇంతకు ముందు సూపర్ వైజర్గా పనిచేసిన వ్యక్తి కొడుకు. లిజావేట ఇవనోవ్న తమ కుటుంబలో పాపని పెంచుకుంటుంది.
టామ్స్కీ కెప్టెన్గా ప్రమోట్ అయ్యి,ప్రిన్సెస్ పోలినాని పెళ్లాడాడు.