అసాంఘిక శక్తులకో చురక

Spread the love

15% – 85% ప్రజల మధ్య జరుగుతున్న మానసిక సంఘర్షణ, ఓ కథకుడి అంతఃర్వాణి.

ఫాసిస్టు భావజాలాన్ని ఎండగట్టిన వందల ప్రశ్నల సమాహారంలో మనుషుల్లోని మానవత్వం పై జరుగుతున్న దాడిని ఖండిస్తూ మోగించిన “నగారా”

మనుషులమనసు మర్మాలు కనుక్కోవడం ఎవరి తరం, ఒకే కడుపున పుట్టినోళ్లే అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో తోడ పుట్టిన వారి అసలు మర్మపు మాట కనిపెట్టలేని కాలం నడుస్తుంటే, మనతో ప్రయాణించే స్నేహాల్ని,పరిచయస్తుల్ని మనుషుల్ని చదువ ఎవరి తరం.

అయినా మనమంతా మనుషులం కాబట్టి ప్రేమించడం, ప్రేమించబడడం పైన మానవ సంబంధాల మధ్య విలువల పట్ల ఆశ, పాశం ఉంటుంది. అటువంటి ఆశా, పాషాల మధ్య మానవ సంబంధాలు ఎట్లా వీగిపోతున్నాయో చెప్పడానికి ప్రయత్నించిన పుస్తకమే ఇది. సంస్కృతి సంప్రదాయాల మధ్య లౌకిక, స్వామ్యవాద రాజ్యాన్ని నిర్మించాలన్న అంబేద్కర్ ఆశయం అడుగడుగునా మనకు దర్శనమిస్తుందీ పుస్తకంలో… నిబద్ధత కలిగిన మానవ సంబంధాలను ఆశిస్తాడు ఈ రచయిత. సమాజంలో చెందే పరిణామాలు,మనసు ముద్రలు, రాజకీయ చదరంగంలో సామాన్యుడు పావుగా మారడాన్ని రాజకీయాల మధ్య సామాన్యుడి జీవిత గమనాన్ని వివరిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.

సాంప్రదాయ ముసుగుల్లోని మనుషుల గుండెల్లో మండే వేసవి తాపాన్ని పరిచయం చేస్తాడు.

మన చుట్టూ ఉన్న సమాజంపై అనేక ముద్రలు ఉంటాయి. ప్రతి ముద్రలో సగటు జీవితంలో మార్పుల్ని కథల రూపంలో చిత్రించాడా అనిపించక మానదు. మానవ సౌభ్రాతృత్వ లౌకిక తత్వం, మీడియా ప్రభావంతో యాంత్రికమైపోతున్న నవ మానవ మనుగడ, ఇతని రచనల్లోని ముఖ్య కథా వస్తువులు.

మరి ఇటువంటి కథా వస్తువుతో ఫాసిజానికి వ్యతిరేకంగా తన కలాన్ని ప్రయోగిస్తున్నవాడి వాక్యం పదును చూడండి

“ మనం నిత్యం సేవించే గంగాజలం అన్నింటినీ పవిత్రం చేస్తుంది., కానీ మనుషుల మనసుల్ని మాత్రం పవిత్రం చేయలేక పోయింది” అంటాడు

చాపకింద నీరులా ప్రవహించే రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ పరిణామక్రియలు, ఓ పెద్ద సంపాదకీయమే నిండి ఉన్న వార్త వాహిక ఇది., చరిత్రను తిరగరాస్తున్నాడా అస్తిత్వ ప్రకటనపై అనిపించింది.

చరిత్రలో…

ఆ రాముడే మనతో సంభాషిస్తున్నాడా!!

అవును అనే అనిపిస్తాడు.

రాముని రూపంలో సంభాషణ ఎవరు జరిపినా అది రచయిత మునివేళ్లపైన మనోఫలకాన్ని చిత్రిస్తూ ఉంటుంది.

రాముని రూపంలో సంభాషణ జరిపింది రచయితే అనే విషయం కూడా గుర్తుపట్టనివ్వని ఝలక్ చూపిస్తూ ఉంటాడు ఈ కథకుడు. తను ప్రజాపక్షంలో నిలబడి ఏ దేవుడు మాట్లాడినా ఒక్కటే అయితే ఈ దేముళ్ళే దిగి వచ్చి మనుషులుగా ఆలోచిస్తే ఎలా ఉంటుంది, ప్రజలని వెర్రి బాగుల్ని చేస్తున్నారు అని ఆ శ్రీరాముడిచేతే ఒప్పించి చెప్పించడం కథకుడు ఎత్తుగడ.

చూద్దాం ఎంతవరకు అతని శ్రమ ఫలిస్తుందో.

ఇతను ఓ రచయితగా కంటే దేశం పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తిగా ఈ వాక్యం చదివి చెప్పొచ్చు “ వాళ్లు జైశ్రీరామ్ అన్నప్పుడల్లా ఒక దేవుడిగా ఆ అంత భక్తిలో మునిగిపోతే ఇవేవీ సమస్యల్లా అనిపించేవి కాదు కానీ చెవులు మూసుకుని మనిషిలా ఆలోచిస్తే మాత్రం దేశం ప్రమాదపటంచుల్లో ఉందని అర్థమైంది “

కథలో శ్రీరాముడు తన మనో వేదన మనిషితో చెప్పుకుంటున్న మాటలు ఇవి
ఇటువంటి ఆలోచన చాలామంది మనుషుల్లో మొదలైంది అంటూ ఆ దేవుడి మాటలుగా మనకి నిజాల్ని ఎండగట్టి దేశం ఏ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుందో చూపిస్తాడు.

ఫాసిస్టు ప్రభావం ప్రపంచాన్ని పట్టిపీడిస్తుందని “జోక్” కథ ద్వారా మనల్ని హెచ్చరిస్తాడు. అయితే దీన్ని కథా అనేకంటే సంపాదకీయం అనవచ్చు కొన్ని కథల విషయంలో సంపాదకీయంగానే బావున్నాయనిపించింది.

స్వచ్ఛత లేని మనుషుల మధ్య పోరాటం కుల ఆదిపత్యాలతో రగిలి విద్వేషపు మంటలు కుటుంబ వ్యవస్థలో చీలికలు రూపురేఖల్ని వివరిస్తాడు
మతవిద్వేషాలని చూపి రాజకీయం భయపెడుతుంది కానీ కులాల కార్చిచ్చుల వల్లే మనుషుల మధ్య అగాధాలు ఉన్నాయని చెప్తాడు
ఎక్కడో ఒక అమ్మాయిపై జరిగిన దాడిని తీసుకొని వచ్చి మనం నివసించే ప్రాంత వాసులకు కులం కార్చిచ్చుగాను, మత విద్వేషంగానో మార్చి వారి జీవితాలని రాజకీయం ఎలా ప్రభావితం చేస్తుందో చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వివరిస్తాడు తన కథా వస్తువుతో.

ఎన్నికలవేళ 2021 నుండి ఈవీఎంల హైజాక్ ప్రక్రియ వలన ప్రజలు ఎన్నుకున్న పాలకులు కాక ఇతరులు గద్దెనెక్కుతున్నారని ఇంత టెక్నాలజీ పెరిగింది కదా మరి ఇప్పటి వరకు ఈవీఎంల జోలికి ఆ టెక్నాలజీని తీసుకువెళ్లలేదే అంటూ ప్రశ్నిస్తాడు.

కళ అన్నా, కళాకారులు అన్న ఎంతో గౌరవం చూపేవారు కళాకారులు ఆదర్శాలు పంచేవారు కూడా కుల మతాల నలుపు రంగులోనే జీవిస్తూ అమాయక ప్రపంచానికి మాత్రం నీతుల ఇంద్రధనస్సును చూపిస్తారని ఆవేదన చెందుతాడు

ఫాసిస్టు వ్యతిరేక చర్యలపై జరిగే దాడిలో మత చాందసంలో కొట్టుకొని పోయే పార్టీలలో యువతను ఏ రకంగా తప్పు దోవ పట్టిస్తున్నారు తేల్చి చెప్పడానికి ప్రయత్నిస్తాడు.

ఎక్కడో ఉన్న స్థలాల జోలికి పోలేదు ఇతను తన కథల్లో, మన ప్రాంతపు వాసులే నేడు ఎదుర్కొంటున్న పరిస్థితిని చరిత్రగా రాశాడు తన చుట్టూ ఆవరణం ఎంత కుల కల్లోల భరితంగా ద్వేష విద్వేషాల మధ్య బంధాలు వీగిపోయేటి మనుషులు పావుల్లా మారి కుట్రదారుల మధ్య నలిగిపోవడం కనిపిస్తుంది ఈ కథల్లో.

చాలా సందర్భాల్లో ఇతని కథల్లోని ప్రాంతాల పేర్లు చాలా కథల్లో వచ్చిన పేర్లే ఉంటాయి బషీర్, పర్వీన్, రాజు అనే పేర్లు మళ్లీ మళ్లీ ఉపయోగించడం ఆ కథల్లో కంటెంట్ కూడా ఒకేలా ఉండడం గమనించవచ్చు.

కథా వస్తువు ఒక్కటే, కంటెంట్ మాత్రం డిఫరెంట్. చెప్పదలుచుకున్న విషయంపై స్పష్టత ఉంది. అయితే మొఘల్ కాలంలో జరిగిన విషయాల్ని నేటికి ఆపాదించాలన్నప్పుడు చరిత్ర అధ్యయనం చేసి ఉంటే బాగుండేది. హిందూ ముస్లింల విభజన పాలన కంటే ముందు నుండి యూదుల చరిత్రలోని అంశాలనుండి పట్టుకు వస్తే కథ ఇంకా బలంగా వచ్చేదేమో., ఇటువంటి సంఘ పరమైన విషయాలు చర్చల్లోకి తీసుకొచ్చేముందు పరిధిని నిర్మించుకున్నట్లు కనిపిస్తూ ఉంటుంది.

ఒక జోనర్ నుండి తన గొంతు వినిపిస్తాడు ఈ కథకుడు.

కథకుడిలో ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడే వర్గం ఏకీభవించవచ్చు మనుషుల్లోని అంతర్గత విశాలతను గుర్తించి చూపించిన తీరు అభినందనీయం.

ఇవి ఏ ఒక్క వ్యక్తినో , వర్గాన్నో , ప్రతిబింబించే కథలు కావు.

ఈ కథలన్నీ ఒకే వస్తువుగా తీసుకొని, జీవన అధి రేఖకు దగ్గరగా వుండే మూలాలలోనుండి ఒక సమూహ గొంతుకని తన గొంతుగా చేసుకొని వేరువేరు భావ ప్రకటనలు చేశాడు.

అభినందనలు సంఘీర్,

సంఘీర్ వంటి కథకుల అవసరం నేటి యువతకు అవసరమనుకుంటే సామాజిక అవగాహనతో ఆలోచన చేయాలి. ఇదే సామజిక అవసరం అనే కదా కథనాల జోలికి వెళ్లకుండానే తన రిప్రజెంటేషన్ ఆఫ్ కంటెంట్ సబ్మిట్ చేయడంలో కాస్త చాకచక్యం ఉన్న రచయితగా గుర్తించవచ్చు. ఫాసిస్ట్ వాదులు ఈ కంటెంట్ చదివితే రెండు రకాలుగా ఉండొచ్చు వాస్తవాల్ని అర్ధం చేసికుని నవతరం నడతని విద్వేషాల చిచ్చు కట్టబెట్టకుండా వుంటారు, లేదు వ్యతిరేకిస్తూ తన కథల్లో రూపాన్ని అనుసరించవచ్చు. ఓ పాఠకూరాలిగా మాత్రం ఈ పుస్తకంలోని సామజిక పరిస్థితులతో ఎకీభవిస్తున్నాను.

Rupa Rukmini

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *