3
పండారం తెల్లారక ముందే లేచాడు. స్నానం ఇంట్లోనే కానిచ్చి విభూది పూసుకుని తాటిబెల్లం కాఫీ తాగి నస్యం పీల్చడం ప్రారంభించాడు.
“రెండు దోశలేవన్నా కట్టిచ్చేదా?” ఏక్కియమ్మ వంటింట్లోంచి అడిగింది.
“నీకు తెలివుందా, దార్లో రెండిడ్లీలు దొరకవా? నేను అడవుల్లోకి పోతున్నానా, కొండలెక్కిపోతున్నానా?”అన్నాడు పండారం.
“అప్పా! నాకు ఈ సారి కచ్చితంగా గాజులు కావాలి!” అంది మీనాక్షి.
“నువ్వు పడుకో! బయట బాగా చలిగా ఉంది. గాజుల సంగతి తర్వాత చూద్దాం” అంది ఏక్కియమ్మ.
మీనాక్షి మౌనంగా తల వంచుకుంది. పండారానికి ఆమె ఏడుస్తోందని అర్థమైంది. “అమ్మా, నువ్వు అడిగితే నేను తేకుండా ఉంటానా? నా బంగారు తల్లివి కదా?” మీనాక్షి మౌనంగా తలాడించింది. “పడుకో, తల్లీ! లేదంటే పడిశెం పడుతుంది.” అని అన్నాడు పండారం.
“నాకు ఒక వాచి కూడా తెస్తావా?”
“వాచీనా?”
“తిరక్కపోయినా పరవాలేదు కానీ వాచీ బంగారంలాగా ఉండాలి.”
“సరేలే, ఇప్పుడు పడుకో!”
“పడుకోవడమా…అదా? ఎప్పుడూ పరుగులూ గంతులూ!” అంది ఏక్కియమ్మ లోపలికొస్తూ. “ఎక్కడా పిల్ల? నీ పెట్టె సర్దుకున్నావా?’
“అప్పా, నీ ట్రంకు పెట్టెలో పొగాకు పెట్టేదా?” అడిగింది సుబ్బమ్మ.
“ఏం అంటోందో చూడు ఈ పనికిమాలింది! కొత్త గుడ్డల్లో పెడితే అవన్నీ పొగాకు కంపు కొట్టవా? పసుపు పచ్చ సంచీలో పెట్టు. విభూది పెట్టె, పొగాకు, గోచీ గుడ్డలు ఆ సంచీలోనే పెట్టాలి.”
“అప్పుడు గోచీ కంపు కొట్టదా?” అడిగింది మీనాక్షి.
“ఏందీ?”
“ఆహా, ఏం లేదు.”
ఏక్కియమ్మ లోపలికెళ్ళింది.
“ఏక్కి, జాగ్రత్త!” అన్నాడు పండారం. “నేను లేనప్పుడు మన మూడు గుళ్ళకీ రోజుకు ఒకసారన్నా వెళ్ళి చూసిరా! మనవాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచు. సరేనా? కొంత సరుకుని ఇక్కడే వదిలి వెళుతున్నాను. కుమరేశన్‍ని తోడు తీసుకుపో.”
మసక బారిన హెడ్ లైట్ల వెలుగు చిమ్ముకుంటూ వ్యాన్ ఒకటి ఇంటి ముందరకొచ్చి ఆగింది.
“అప్పా! బండొచ్చింది!” అంది సుబ్బమ్మ.
“శవాలను నిద్రలేపుతున్నట్టు ఎందుకే ఆ గొంతేసుకుని అరుస్తావు? నీ మొగుడేమన్నా కార్లో ఉన్నాడా?” విసుక్కుంది ఏక్కియమ్మ.
“పిల్లలు… ఊరికే వాళ్ళని కసురుకోమాక. వడివు ఏదీ?”
“నిద్ర పోతోంది.”
“దానికి, ఎప్పుడు చూసినా నిద్రే!”
“అప్పా! వడివు చెప్పింది, దానికి పొద్దున్నే మంచి కలలొస్తాయట… ఆహ్! చూడు నాన్నా, అక్క గిచ్చుతోంది!”
“నువ్వు లోపలికెళ్ళవే, ఊరికే ఏదో ఒకటి వాగుతూ ఉండమాక” అంది పెద్దది సుబ్బమ్మ, మీనాక్షిని పక్కకు తోస్తూ.
“నిజ్జంగా, వడివు చెప్పింది. కల్లో…”
“నువ్వు లోపలికి పో!”
మాధవపెరుమాళ్ వ్యాన్‍లోనించీ దిగాడు. “అన్నా, ఎండొచ్చే లోపల నాగర్కోవిల్ దాటాల. తొందరగా రండి.”
“సరే, పోయొస్తాను. అరె, దీనమ్మ! నా చెప్పులేవీ, ఎక్కడికి పొయ్యాయి?”
“ఒకటిక్కడుంది” అంది ఏక్కియమ్మ.
“మీ అబ్బ నాణప్పన్ పొయ్యి రెండోది తీసుకొస్తాడా? నీ బుర్రలో మట్టి తప్ప ఏముందే?”
“అప్పా! ఇక్కడుంది…” అంది సుబ్బమ్మ.
“తీసకరా!”
“మరి గొడుగు?”
“గొడుగు కూడా!” అన్నాడు పండారం. “వడివు నిద్ర లేస్తే నేను పెందరాడే వెళ్ళిపోయాను అని చెప్పు.”
“అప్పా! నా గాజులు…”
“వచ్చేటప్పుడు తీసుకొస్తా చిట్టి తల్లీ” మీనాక్షి బుగ్గ నిమురుతూ అన్నాడు పండారం. టెంపో ట్రావెలర్ ముందు సీట్లో, డ్రైవరు పక్కన పండారం కూర్చున్నాడు. “బండి కండిషన్లో ఉందా?”
“కండిషన్ లేని బండిని బయట తిప్పం, సార్.”
తల కిటికీ బయటికి పెట్టి “సరే పద!” అన్నాడు పండారం. వ్యాన్ ఒకసారి గర్జించి దుమ్మూ ధూళీ పైకి లేపుతూ బయలుదేరింది.
హెడ్ లైట్ల వెలుగులో కరెంటు స్తంభాలు ఒక్కసారిగా లేచి నిల్చున్నట్టు కనిపించి వెనక్కి పరుగెత్తి వెళ్ళిపోతున్నాయి. చీకట్లో మెరుస్తున్న కళ్ళతో కుక్క ఒకటి ఒక్కసారిగా రోడ్డు పక్కకి దూకింది.
ముత్యాలు, కుమరేశన్ చెరువు దగ్గర నిలబడి వేచి చూస్తున్నారు. ముత్యాలు భుజాన చిన్న బిడ్డ, పడుకుని నిద్ర పోతోంది.
“లైటు వెయ్! ” అన్నాడు పండారం బండి నించీ కిందకు దిగుతూ. “ఏరా నిద్ర పోతున్నావా?”
“లేదు సారూ” అన్నాడు కుమరేశన్.
“ఆఱుముగం గాడేడీ?”
“సరుకుని ఇక్కడికి తీసుకొచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు.”
“వెళ్ళిపోయాడా? దీనికింకా రక్తం ఆగలే, ఏదన్నా కుక్కో, నక్కో మీదబడితే? బండెక్కు.”
“అయ్యో! నా బిడ్డ” అరిచింది ముత్యాలు.
“నీ దగ్గరే ఉంచుకో. దీనెమ్మ ఇంకా కొన్ని రోజులు నా బిడ్డ, నా బిడ్డ అని మనల్ని చంపేసిద్ది!”
కుమరేశన్, మాధవపెరుమాళ్ ఇద్దరూ ముత్యాలుని ఎత్తి బండ్లో ఎక్కించారు. వ్యాన్ లోపల సీట్లు తీసేసున్నాయి. బిడ్డ ఒక్కసారిగా నిద్రలేచి గట్టిగా ఏడ్చింది.
“ష్ ష్..ఏం లేదు, ఏం లేదు… బజ్జోమ్మా, నా బంగారు తండ్రి, నా రాజు…”
“పాలు పట్టు” ఆజ్ఞాపించాడు పండారం.
మాధవపెరుమాళ్ బండెక్కాడు. వ్యాన్ మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టింది.
“పెరుమాళ్, వండిమలై ఎట్లాంటోడు?”
“బలే పనిమంతుడు. రాతిరి నాటు సారాకు ఇరవై రూపాయలిస్తే ఎవడి తల కావాలంటే ఆడిది తెచ్చిస్తాడు.”
వ్యాన్ అటూ ఇటూ కుదుపులకు లోనౌతూ ముందుకెళుతోంది. పండారం చిటికెడు నస్యం పీల్చాడు. పుక్కిట పొగాకు పెట్టుకున్నాడు. పొగాకు నోట్లో లేకపోతే పండారం ప్రయాణం చెయ్యలేడు.
నాగరాజా దేవాలయం మైధానం దగ్గర వండిమలై చెయ్యి ఊపుతూ కనపడ్డాడు. వ్యాన్ ఆగింది. కొన్ని వికృతాకారాలు నేల మీద ముడుచుకుని పడివున్నాయి.
“ఏవయ్యింది?”
“ఒక పోలీసోడొచ్చి రెండు వందలడిగాడు. ‘అన్నొచ్చేదాకా ఆగు’ అని చెప్పాను. చెయ్యెత్తాడు. నూటయాభై ఇచ్చాను.”
“సంపాయించేదంతా వీళ్ళకే చాలట్లా! సరే, సరుకును లోపలికెక్కించు!”
ఎనిమిది మంది మగవాళ్ళు, ఆరుగురు ఆడవాళ్ళు, నలుగురు పిల్లలు నేలమీద పడివున్నారు. అందరికీ ఏదో ఒక వైకల్యం ఉంది. వాళ్ళ శరీరాలన్నీ చూడ్డానికి వికృతంగా ఏ కీలుకు ఆ కీలు మెలికలు తిరిగి ఉన్నాయి. సగం మందిలో అసలు కదలికలు లేవు.
“అన్నా, ఈటన్నిటికీ లోపల చోటు ఉందా?”
“ఈటిని ఊటీ టూరుకు తీసుకపోతున్నావా ఏంది? ముందు పెద్ద సరుకుని లోపలెయ్. చిన్న సరుకుని ఆటిమీద పడేయొచ్చు.”
మాధవపెరుమాళ్, వండిమలై పెద్ద శరీరాల్ని ఒక దాని తర్వాత ఒకటి లోపలవేసి కుక్కారు. “అయ్యో… అమ్మా!” కీచుగొంతుకతో అరిచాడు చీమకళ్ళోడు.
“ఇప్పుడేమైందిరా?”
“నడుములు నొప్పేస్తున్నాయి, దొరా!”
“నీ నడుముకు బంగారు మొలతాడు చేయించమన్నాలే! ఇప్పుడు మూసుకోని పడుండు.”
వ్యాన్ కదలంగానే “ఆమ్మో! ఆమ్మో!” అంటూ లోపలున్న పిల్లలు, ఆర్తనాదాలు చేస్తున్నారు. ఒక పిల్లవాడికి భీకరంగా కనపడే పెద్ద తలకాయ ఉంది, మిగతా శరీరం అంత కుచించుకుపోయినట్టు చిన్నదిగా ఉంది. ‘గుర్రు, గుర్రు’ మని మూలుగుతున్నాడు.
“బండతలోడు ముక్కుతున్నాడు, ఒంటికో రెంటికో వస్తోందేమో. బండి ఆపమంటున్నాడు.”
“మూడు, నాలుగు వచ్చినా బండి సాత్తూరు దాకా ఎక్కడా ఆగే పనేలా!”
“దొరా, నా బిడ్డ…” అంటూ కేక పెట్టింది ముత్యాలు.
“నీ బిడ్డ బండి కుదుపులకేం చావదులే. రేయ్ పెరుమాళ్, ఉన్నట్టుండి దానికి ఏమయిందిరా? దీంతో పెద్ద తలనొప్పిగా ఉందే!”
“ఇప్పుడే గద సారూ, కానుపయ్యింది. ఈ టైములో వాటికి ఒంటిమీద గోరోజనం ఉంటాది.”
“దానికి బిడ్డను కనడం మొదటిసారా, ఏంది? కోడి గుడ్లు పెట్టినట్టు పిల్లల్ని పెడుతానే ఉంది కదా?” అన్నాడు బండి తోలుతోన్న డ్రైవరు.
“నేను కొంచెంసేపు నిద్ర పోతా, సాత్తూర్ రాంగానే లేపు?” అన్నాడు పండారం.
“మధ్యలో చెక్ పోస్ట్ ఉంది, సారూ.”
“వాళ్ళకి ఓ యాభై కొట్టు. దొంగ సారా తీసుకపోతున్నావా ఏందీ? ఈళ్ళంతా మనుషులే గదా!”
వ్యాన్ కిందికీ పైకీ లేచి బాగా కుదిపేస్తుంటే వెనకాలున్న వాళ్ళు భయంతో కేకలు పెడుతున్నారు. “దొరా! పానాలు పోతున్నాయి దొరా!” అంటూ.
“ఎహె, నోరుముయ్యండి!” అని అదిలించాడు ఎనక వ్యాన్ మెట్లమీద నిల్చున్న వండిమలై.
వ్యాన్ అంతా పీతి వాసన ఒక్కసారిగా గుప్పుమంది.
“ఎవడ్రా అదీ?”
‘‘బండతలోడు, దొరా!”
“వాడెమ్మ, చూడ్డానికి అరకిలో కండ కూడా ఉండదు. రోజూ తొమ్మిదికిలోలు దింపుతాడు.”
“ఆ లండీకొడుక్కి లాగి ఒకటిచ్చుకో!”
“వాడ్ని కొట్టి లాభం లేదు వండిమలై. ఎవడు కొట్టాడో ఎందుకు కొట్టాడో కూడా ఆడికి అర్థం కాదు. వాడు ఏడుపు మొదలు పెడితే ఇంకాపడు.”
“భలే ఇరుక్కున్నామే?”
“అద్దీ! డబ్బుల మీద దెబ్బలెయ్యకూడదు!” వెనకాల్నించి ఒక గొంతు పైకి వినపడింది, “తెలివిగలోడివి!”
“ఎవడ్రా అదీ?” అరిచాడు మాధవపెరుమాళ్. ఎవరూ కిక్కురుమనలేదు.
“ఎవరూ… మయిల్‍సామీ, నువ్వా?”
“నేనెందుకు అంటాను సామీ? అన్నీ మూసుకుని ముడుక్కువి పడున్నాను.”
“మళ్ళీ నాలుక లేచిందంటే కోసి పారేస్తా, గుర్తుపెట్టుకో!”
“డబ్బుల గురించి మాట్లాడితే నీకు ఒళ్ళు మండిపోద్దిలే!”
“ఎవర్రా అదీ? ఒరేయ్… నలభై ఎనిమిదీ, నువ్వేనా?”
“లేదు, సామీ!”
“ఇక్కడే బండి ఆపి ఎనక్కొచ్చి మిమ్మల్ని సావదెంగుతాను, నాగురించి తెలుసుగా?”
“తెలిసిందీ తెలియనిదీ, ఉన్నదీ లేనిదీ అంతయు ఎరుగుదుము మేము!”
“రేయ్, వ్యాన్ ఆపరా, ఆపు! ఈ సంగతేందో చూడాల ఈరోజు.”
బండి ఆగింది. లోపల లైటు వెలిగింది. పెరుమాళ్ నిక్కించి వెనక్కి చూసాడు. రకరకాల కళ్ళు అతనికేసి చూశాయి… కొన్ని ఉబ్బి పోయినవి, కొన్ని ఎర్రబడ్డవీ, కొన్ని కంటి గూడులోంచి దాదాపు బయటకొచ్చేసినవీ, కొన్ని నక్షత్రాల్లా మెరుస్తున్నవీ.
“ఏం జరుగుతోందిరా?” అడిగాడు పండారం అరచేత్తో కళ్ళు నులుముకుంటూ.
“సారూ, ఈళ్ళు మమ్మల్ని వెక్కిరిస్తున్నారు” అన్నాడు వండిమలై.
“ఎవరు?”
“ఈళ్ళే!”
“ఈ పీనుగులా? బుర్రావుండదు… అందులో గుజ్జూ ఉండదు. నీకు రెండూ కొంచెం ఉన్నాయి కదా? ఆళ్ళతో పోటీ ఏందిరా నీకు? బండిని పోనీ రా… ప్రతి చిన్న ఇషయానికీ నువ్వు వ్యాన్ ఆపమాక!”
వ్యాన్ మళ్ళీ కదిలింది. రోడ్డు మీద గతుకులకి వ్యాన్ లయబద్ధంగా ఊగుతూంటే, చిన్నగా దరువు మొదలైంది. అప్పుడు వినపడింది మాంగాండి స్వామి పాట-
వలుపు తోటలన్నీ వదిలెళ్ళిపోతావా
ఇన్నాళ్ళ బంధాలూ తెంచుకుని పోతావా
అందాల పొందులో మిగిలేది వగపేనా
“గుద్ద మూసుకొని కూర్చో!” గద్దించాడు వండిమలై. మాంగాండి స్వామి పట్టించుకున్నట్టు కనపళ్ళేదు.
కన్నీటి హారాన్ని నా మెడకు చుట్టిందీ
చేతిలో చెయ్యేసి కళ్ళలోకి చూసిందీ,
నా తోడు వీడననే బాసలెన్నో చేసిందీ
కలల్లోని కల్లలా, నీటిమీది రాతలా?
అతని కంఠం మోగుతోంది ; వ్యాన్ కిర్రు, కిర్రు చప్పుళ్ళను పక్కకు తోసి చెవులను నింపేస్తోంది.
తిండేదీ గొంతుకెక్కదు, కంటికేమో కునుకు లేదు,
ఏసుకున్నా నగలెన్నో ఒంటినిండా,
గాయాల మంటలే మనసు నిండా!
పండారం వ్యాన్ డ్యాష్ బోర్డ్ మీద చేత్తో తాళం వేస్తున్నాడు. మూలుగులూ శాపనార్థాలూ తిట్లూ వినిపిస్తోన్న వ్యాన్ నెమ్మదిగా నిశ్శబ్దాన్ని సంతరించుకుంది. పాట బండిని ముందుకు లాక్కెడుతోందేమో అనిపిస్తోంది. పదిహేడేళ్ళ క్రితం పండారం మాంగాండి స్వామిని పళనిలో ఎనిమిది రూపాయలకు కొన్నాడు. రెండు కాళ్ళూ లేవు గానీ ఒక చెయ్యి ఉంది, పైన ఒక చిన్న తల. కొమ్మలు నరికేసిన చింత మొద్దులా ఉంటాడు. ఎప్పుడు చూసినా నవ్వుతున్నాడేమో అనిపించే మొహం, తళుక్కుమంటూ మెరిసే కళ్ళు. మాంగాండి స్వామి తన చేతిలో అద్భుతదీపం! అని పండారం నమ్ముతాడు. సామిని కొనేముందు పండారం ఇంకో రెండు సరుకుల్ని కొంటే, ఒకటి వెంటనే చచ్చిపోయింది. రెండోది ఎవరో దొంగతనం చేశారు. అప్పటికప్పుడు ఏక్కియమ్మ తాళిని అమ్మేసి వచ్చిన డబ్బులతో, మాంగాండి స్వామిని కొని మురుగడికి దండం పెట్టుకుని వేలప్పన్ కోవెల ముందర కూర్చోబెట్టాడు. మొదట్లో రోజుకు ఏడెనిమిది రూపాయలు సంపాదించిపెట్టేవాడు మాంగాండి స్వామి. ఆ దెబ్బతో పండారం తన అప్పులన్నీ తీర్చేసాడు. మిగిలిన సంపాదనతో ఒక ఇల్లు, ఇంకొన్ని సరుకులు కూడా కొన్నాడు. పొద్దున్నే మాంగాండి స్వామి మొహం చూస్తే ఆ రోజంతా బావుంటుంది అని నమ్మే వాళ్ళు ఉన్నారు. రోజూ ఒక్క పావలాబిళ్ళ అయినా మాంగాండి స్వామి ముందర పెడితే మంచి జరుగుతుందని అనుకునేవాళ్ళూ ఉన్నారు. ఇప్పుడు మాంగాండి స్వామిని నాగరాజా దేవాలయం దగ్గర కూర్చోబెడితే రోజుకి కనీసం వంద రూపాయలు తెచ్చిపెడతాడు. అతని బొచ్చెలో పడే డబ్బులను కాయడానికి పక్కనొక మనిషిని నిలబెట్టాల్సి ఉంటుంది.
మాంగాండి స్వామికి తెలిసినవి కొన్ని పాటలే. అసలు అతను భక్తి పాటలు పాడంగా పండారం ఎప్పుడూ వినలేదు. పండారం దగ్గరికి వచ్చిన తొలిరోజుల్లో సామి, తమిళ సూఫీ కవి కుణంగుడివారు రాసిన పాటలను పాడేవాడు. అన్ని పాటలూ నాయకి తనను విడిచెళ్ళిపోయింది అని ఆ ప్రేమికుడు పాడే ప్రేమ గీతాలే; వాటి నిండా విరహం, ఆవేదన, ప్రేమే. ఆ తర్వాత సామి తాను తయారు చేసిన పాటలు పాడడం మొదలుపెట్టాడు. అన్నిటిలో భావం ఒకటే. ‘తీసుకెళ్తానన్నావు, వదిలేసి వెళ్ళావు! నా ప్రపంచం బూడిదైంది. అంతా చేదే మిగిలింది.’ సామి గొంతులో వేదన కానీ వేడుకోలు కానీ ఉండదు. పాడుతున్నంత సేపూ అదే ఖంగుమనే గొంతు. ఆ పాట అలా సాగుతూ ఉంటే పండారం మనసు కూడా బరువెక్కి పోతుండేది.
వగపు బాకీలు, వలపు బాకీలు
జన్మజన్మలకీ మోయలేని భారాలు
బంగారమా, వలపు సింగారమా
గడిచిన కాలం కలేనా!
మిగిలిన దూరం వ్యధేనా!
మాంగాండి సామి తాళం వేస్తూ ‘మిగిలిన దూరం వ్యధేనా!’ అని మళ్ళీ మళ్ళీ పాడుతున్నాడు. కొంతసేపటి తర్వాత పాట ఆగిపోయి తాళం ఒక్కటే విన్పించింది. తాళం ఆగే సమయానికి బండిలో ఉన్న సరుకంతా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. సేదదీరుతున్న వాళ్ళ ఉఛ్వాస నిశ్వాసాలు లయబద్ధంగా వినిపిస్తున్నాయి.
పండారం వెనక్కి తిరిగి సామి వైపు చూసాడు. సరుకు పైన సామిని పడేసినా, వ్యాన్ కుదుపులకి కిందికి జారి రాసప్పన్ కాళ్ళ మధ్యలో పడివున్నాడు. సామి చిన్ని పగడాల్లాంటి కళ్ళు మాత్రం మెరుస్తూ కనపడుతున్నాయి. మొహం శిలలా ఉంది, ఏదో జరుగుతున్న జగన్నాటకాన్ని నిర్వేదంగా చూస్తున్నట్టు!