పార్వేట కథకులు సురేంద్ర శీలం గారు. ఇటీవలే రాసిన నడూరి మిద్దె నవల పాఠకుల్ని ఆవేదనకి గురిచేస్తుంది. పేదోడి కన్నీటిపాటగా రాయలసీమ యాసలో వచ్చిన గొప్ప నవల ఇది. ఇప్పటి వరకు వచ్చిన గొప్పగొప్ప నవలల్లో ఇది కూడా చేరుతుందని భావిస్తున్న. ఇది దళితుల జీవితాల్లో జరిగే సంఘర్షణ మాత్రమే కాదు ప్రతి సామాన్యుని బ్రతుకు సిత్రంలో సాగే చెమట సుక్కల తడి సప్పుడుతో డొక్కలు మెతుకుల కోసం చేసే ఆర్తనాదం. కనీసం మౌలిక వసతుల కోసం ప్రతి పేదోడు సగం నిండిన కడుపుతో కంటున్న కల నూతన గృహం. కొట్టం నుండి మిద్దెలోకి వెళ్లి తన కుటుంబం బ్రతుకు ఇపుడు మెరుగ పడాలని పరువు మర్యాదగా బతకాలని సగటు మనిషి చేసే జీవన కన్నీటి యాత్రగా సాగే నెత్తురు చిమ్మిన కథే ఈ నడూరి మిద్దె.
పాఠకులుగా ఒక మంచి పుస్తకం చదివమనేగాకుండా మనల్ని ఎన్నో ఆలోచనల్లో పడేస్తుంది ఈ నవల. మనకి మనమే చర్చలు జరుపుకొనేకి సిద్దమవుతాం. 1996లో “గద్దలాడతాండాయి” అనే నవల రాసిన బండి నారయణస్వామి గారిని గుర్తుకు తెచ్చేలా చేశారు రచయిత సురేంద్ర. ఈ కథ ప్రస్తుతం నుంచి ముందుకి చాలా ప్రభావం చూపుతుందని అనుకుంటున్నాను. తనలో దాగున్న ఎన్నో భావోద్వేగాలను చెప్తూ ప్రతిఒక్కరిని కన్నీరు పెట్టిస్తాడు.సామాన్యుని పక్షంగా సురేంద్ర అక్షరాలు తోడుగా నిలుస్తాయి. దళితుల జీవితాన్ని ఎందరో ఎన్నో రకరకాలుగా చిత్రీకరించారు. కానీ ఈ నడూరి మిద్దే మాత్రం యాదర్థ సంఘటనలకు చాలా దగ్గరగా ఉంటుంది. దళితుల్లోనూ, అగ్ర కుల్లాలోనూ, బహుజనుల్లోనూ దుర్మార్గులు వుంటారు. అయితే సిన్నోడు , పెద్దిరెడ్డి లాంటి స్నేహితులు మాత్రం చాలాచాలా అరుదుగా ఉంటారు. వయస్సుతో సంబంధం లేకుండా వారి మనస్సులో ఒకరిమీద ఒకరికి నాటుకుపోయినా గౌరవం, అభిమానం, ఇంకా చెప్పాలంటే స్వచ్ఛమైన మనుషుల, స్వార్థంలేని అపారమైన ప్రేమ వీళ్లది. బ్రతికిన నేలంటే ఇద్దరికీ ఒకేరకమైన నెర్లు కల్గిన మనుషులని చెప్పొచ్చు.
ఇందులో సిన్నోడు, సిన్నోడి భార్య శాంతి, పెద్దిరెడ్డి పాత్రలు ఎంత బలహీనంగా ఉంటాయో వారి వెనుక జరిగే సంఘర్షణ ఓ యుద్ధమంలో జరిగే సంఘటనంతా బలంగా ఉంటాది. ఆ ప్రాంతపు అస్తిత్వాన్ని కూడా అంతే బలంగా చెప్పారు రచయిత. ఊరిని వదిలేయడం ప్రాణాలు వదిలేయడం రెండు సమానమనే భావిస్తారు కొంతమంది. అలాంటి వ్యక్తులే సిన్నోడు, పెద్దిరెడ్డి.
ఇందులోని కథాంశం చాలా డిఫరెంట్గా ఉంటుంది. గీతలను చెరపాలని ప్రతిఒక్కరూ సమానంగా బ్రతకాలనే చూసే పెద్దిరెడ్డి. గీతలు చెదిరిపోతే సిన్నోడు పెద్దోడు అయిపోతాడు అని వాటిని అలాగే ఉండాలనే చిన్నచూపు ధోరణి, అహంతో నిండి కులాన్ని నరనరాల్లోకి జీర్ణించుకొని జీవిస్తున్న పసిడెంట్ నారాయణ రెడ్డి, రామిరెడ్డి, హరినాథరెడ్డి, తుల్సీ, రాముడు , పెద్దిరెడ్డి భార్య సంతోషమ్మ, కొడుకు ఇంకా ఇలా ఎన్నో పాత్రలు సిన్నోడిని , పెద్దిరెడ్డి స్నేహాన్ని ఆయన చేసిన సాయాన్ని ఓర్వలేకుండా ఊరంతా కక్ష్య సాదింపుతో సాగుతుంది ఈ కథ.
మన ప్రాంతంలో నేటికీ అక్కడక్కడ దళితులపై జరుగుతున్న సంఘటనలను గుర్తుచేస్తూ ప్రతి గ్రామీణ వాతావరణంలో ఉండే సమస్యను తీసుకొని చాలా అద్భుతమైన యాస కవితా వర్ణనలతో కథను తీసుకుపోతాడు రచయిత. చదివే ప్రతి పాఠకుడు ఇందులో నిమగ్నమైపోతారు. చదవడం మొదలెట్టిన దగ్గరి నుంచి పాఠకుల్ని పక్కకి కదలకుండా చేస్తుంది ఈ నడూరి మిద్దె. స్వచ్ఛమైన పల్లెటూరును చెప్తూ ఒకపక్క, స్వార్థంతో నిండుకొని ఎన్నో ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే రాక్షసి స్వభావాలను కల్గిన, మనతోటి వాడు ఎదుగుదలను ఓర్చుకోలేని అమాయకత్వ తోలును కప్పుకొని విషపు మాటలను ఉచిత పథకాల్ల పంచిపెట్టే మృగాలను ఈ పుస్తకంలో తెరపైకి తెచ్చాడు రచయిత.
ప్రాచీన కాలం నుండి ఆధునీకరణ వరకు సీమలో ముఖ్యంగా కులం వ్యత్యాసం కొనసాగుతూనే ఉంది. నాటి నుంచి నేటి వరకు ఎన్నో వెలివేతలు, వెనుకడుగులు మరింతా వెనక్కి నెట్టివేస్తాయని ఈ విధంగా ఎవరుగూడ ఉండకూడదని తనదైన శైలిలో ప్రశ్నిస్తూ ప్రాంతపు అస్తిత్వంతో సాగే నవలే ఈ నడూరి మిద్దె.
రచయిత దృక్పథం దళితుల సమస్యలొక్కటే కాదు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి అసమానతలకు గురైతున్న ప్రతిఒక్క సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని కొందరి అగ్రవర్ణాల అరాచకాలు నేటికీ తగ్గడం లేదని కొన్ని చోట్ల మూర్ఖపు సమాజంతో చేతులు కలిపి ఇంకా అంటరాని తనాన్ని చూపిస్తూ ఊర్లల్లో వెలివేస్తున్నారని దీన్ని ఆరికట్టడానికి సిన్నోడి భార్య లాంటి ఎందరో మారేమ్మల ఉగ్రరూపామవతారం ఎత్తుతారని ఎత్తాల్సిన అవసరముందని ఈ కథ ఎందరో దళితలకు , స్త్రీలకు ధైర్యాన్ని నూరిపోయాడనికి నడూరి మిద్దె నవల ఆదర్శంగా నిలుస్తుంది.
ఈ నడూరి మిద్దెలో కోళ్లు, కుక్కలు, రాంసిలకలు, దాసరి పాము , కుందేరు చెరువులు ఇవన్నీ కూడా పాత్రలలో జరిగే సంఘటనలకు సమాంతరంగా సాగుతుంటాయి. పాత్రలకు ఏమౌతుందో ముందే ఈ దాసరిపాము, రాంసిలకలతో పాఠకులకి కథ అర్థమయ్యేలా ఒక పాత సినిమా సన్నివేశంలా ఫైట్ జరిగే క్రమంలో ముంగీసా పాము పోట్లాట జరగడం మనం సినిమాల్లో చూసే ఉంటాం. ఈ కథంతా సినిమా స్క్రీన్ ప్లే లాగా చాలా అందంగా వర్ణించారు. వీటివలన కథెక్కడ ఎలాంటి ఇబ్బందీ మలుపులు లేకుండా కథ చివరి వరకు పాత్రలతో పాటే సాగించేలా చేసి పాఠకులకు ఆసక్తిని రేకెత్తించారు. కథ జరుగుతున్నంత సేపు మనల్ని మనం మర్చిపోతాం. గొప్ప నవలలు చరిత్రలో నిలబడిపోతాయి అంటుంటారు కదా. బహుశా ఈ నడూరి మిద్దే నవల కూడా ఆ కోవకే చెందుతుంది అనుకుంటా. దళితుల జీవితాన్ని స్పర్శించే నవలగా ప్రసిద్ధి పొందుతుంది. దళితుల కుటుంబం ఆర్థిక స్థితిగతులలో మార్పుల రాకపోతే దళితుల జీవనం ,భవిష్యత్తు అస్తవ్యస్తమవుతుందనేటట్లు పాత్రలను తీర్చిదిద్దారు రచయిత.
చాలా మంది కులాలు లేవని అంటుంటారు. అదంతా ఆపద్దం. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఉత్సవంలోనూ, గుళ్ళలో ప్రవేశాలలోనూ, ఇంట్లోకి రానివ్వకపోవడం, కొన్ని చోట్ల ప్రేమ పెళ్ళిళలోను, రాజకీయాలలోనూ ఇలా ఎన్నో రోజురోజుకీ మనుషుల్లో కులం వర్గాలతో నిండుకొని ఎక్కువైపోతోంది కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. బాధాకరమైన విషయం ఏమిటంటే దేశంలో ఎక్కువ శాతం నేడు చదువుకున్న వారే వీటిని ఎక్కువుగా ప్రోత్సహిస్తున్నారని ఒక సర్వే కూడా తెలిపింది.
ప్రతి పాఠకుడు నడూరి మిద్దె నవల చదివితే తప్పకుండా ఒక గొప్ప అనుభూతి చెందుతాడు. అందులో ఎటువంటి సందేహాలు అక్కర్లేదు. ఇప్పట్లో చాలామంది యువకులు రచించిన కథలు, నవలలు సామాజిక కోణంలో కంటే అనుభవాలు, జ్ఞాపకాలు, ప్రేమ, వ్యాపారం ఈ మాధ్యమంగా సాగుతున్నాయి. అయితే ఆ ప్రాంతపు అస్తిత్వం నిలబెట్టే భాష యాసను బ్రతికించేది మాత్రం సురేంద్ర శీలం లాంటి సామాజిక సృహకల్గిన కథకులేనని ప్రగాఢంగా నమ్మొచ్చు. భవిష్యత్లో ఇతను రాతలు మరింతగా తారా జువ్వలా రాజేసుకొనే అవకాశం ఉంది. నడూరి మిద్దెను ప్రతి పేదోడి కలను సిన్నోడి భార్య శాంతి కలగా రూపుదిద్దిన నవల తెలుగు సాహిత్యానికి అందించిన రచయిత సురేంద్ర శీలం గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మరెన్నో కథలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..!