సాహిత్య యితిహాసంలో భాషకు చాలా ప్రాధాన్యత ఉంది. కాని భాష సాధనం మాత్రమే సాహిత్యకారుడు అదృశ్యంగా భాషద్వారా భావాలు వ్యక్తం చేస్తాడు. అతని శ్రోతల సంఖ్యాపరిధి చాలా విస్తృతమైంది. రచనలో వాస్తవం, సహజత్వం ఉంటే శతాబ్దాలపాటు మానవ హృదయాన్ని కదిలిస్తూనే ఉంటుంది.
రాసిందంతా సాహిత్యం కాదు. అందమైన భాషలో సత్యాన్ని వ్యక్తీకరిస్తూ మనస్సుమీద మేథస్సుమీద ప్రభావాన్ని కల్గించేది మాత్రమే సాహిత్యం. జీవితంలోని నగ్న సత్యాన్ని అనుభూతుల్ని యధాతథంగా వర్ణించినపుడే పైలక్షణాలు సాహిత్యానికి అబ్బుతాయి.
సాహిత్యాన్ని అనేకమంది అనేక రకాలుగా నిర్వచించారు. నా దృష్టిలో “జీవితాన్ని విమర్శించేదే” సాహిత్యం. వ్యాసం, కథ, కావ్యం, నవల ఏ రూపమైనా కావచ్చును. జీవితాన్ని తప్పనిసరిగా వ్యాఖ్యానించాలి. భాష్యం చెప్పాలి.
జీవితం అంటే అర్ధం తెలియని యుగం నుండి బయట పడ్డాం. ఆనాటి సాహిత్యకారులు కల్పనని కేంద్రం చేసుకుని గారడీకథలు అల్లేవారు. వాటి ఉద్దేశం అద్భుతాల్ని చెప్పి మనోరంజనం కల్పించడం కవులు వ్యక్తివాద ప్రభావాలకులోనై శృంగారభావాల్ని ప్రకటించడం కోసం తమ కల్పనా ప్రతిభనంతా వెచ్చించేవారు.
ఇతివృత్తం జీవితానికి ఎంతదూరమైందైనా కొత్త అలంకారాలు కల్పనలు ప్రయోగిస్తే అదే యశస్సుకు గీటురాయిగా నిలబడి పోతుందనుకొనేవారు. ఆ నైపుణ్యం అంతా విరహదశలో గుండెని కరిగించే నిరాశ, వేదనల వర్ణనకే. ఇలాంటి రచనలు ఇప్పుడుకూడా పాఠకుల మనసుల్ని ఎలా పట్టుకుంటాయో మనకు తెలుసు.
సాహిత్యం నిస్సందేహంగా మన అనుభూతుల తీవ్రతని ఉన్నతస్థాయికి తీసుకెళ్ళాలి. అయితే మానవజీవితం అంటే. కేవలం స్త్రీపురుషుల ప్రేమ సంబంధమైంది మాత్రమే కాదుకదా. శృంగారం విరహతాపాలు అందులోని నిరాశకే పరిమితమైపోయే సాహిత్యం ప్రపంచంలోని వాస్తవిక అనుభవాల్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది.
ఆనాటి రచయితలు చాలామందికి రచనలే జీవనాధారం. రాజులు జమీందార్లు పోషకులు. సాధారణజీవితసమస్యలు వాటి ప్రభావాలు తెలుసుకునే స్థితికి కవులు ఎదగలేకపోయారు. అందువల్ల రచనల్లో మానసిక బౌద్ధిక జీవనం లుప్తమైపోయింది. అయితే ఈ దోషాన్ని సాహిత్యవేత్తలకు అంటగట్టకూడదు. సాహిత్యం ఆయాకాలాలకి ప్రతిబింబం ఏ భావం ఏ ఆలోచన మానవహృదయాన్ని స్పందింపచేస్తుందో అదే సాహిత్యం మీదకూడా నీడలు పరుస్తుంది.
సాహిత్యంలో ప్రతిశబ్దం నైరాశ్యంలో మునిగి తేలుతూ కాలానికి విరుద్ధంగా రోదిస్తూ కేవలం శృంగారానికి ప్రతిబింబమై నిలిస్తే మానవజాతి పతనమైపోయి జడత్వ పంజరంలో చిక్కుకుపోతుంది. కృషికిగాని సంఘర్షణకుగాని ఆధారమే లేకుండాపోతుంది. మనిషి ఉన్నతలక్ష్యాన్ని గ్రహించలేదు. ప్రపంచాన్ని అర్ధంచేసుకొనే శక్తి కోల్పోతాడు.
మన సాహిత్యశక్తులు వేగంగానే పరివర్తన చెందాయి. ఇప్పటి సాహిత్యం కేవలం మనసును ఉల్లాసపరచే వస్తువుమాత్రమేకాదు ఇంకా అనేక ఆదర్శాలున్నాయి. నాయికానాయకుల సంయోగవియోగ గాధలు విన్పించి ఊరుకోదు. జీవిత సమస్యల్ని చర్చిస్తూ పరిష్కారాన్ని సూచిస్తుంది. స్ఫూర్తిప్రేరణల కోసం అద్భుత ఆశ్చర్యఘటనల్ని వెతకడంకాదు. వ్యక్తి, సమాజాలపై ప్రభావం కలిగిస్తున్న సమస్యలే సాహిత్యానికి ఆధారమౌతున్నాయి. సాహిత్యంలోని ప్రజల ఉతృష్ట అనుభూతుల తీవ్రత రచయితల భావాల్ని ఉద్దేశాల్ని పరిణమింపచేస్తున్నాయి.
నీతిశాస్త్ర సాహిత్య శాస్త్రాల లక్ష్యాలు ఒక్కటే. అయితే ఉపదేశపద్ధతిలో భేదముంది. నీతిశాస్త్రం తర్కాన్ని తీసుకుంటే, సాహిత్యం మానసికసంఘర్షణ భావాల ఆధారంగా ఉపదేశిస్తుంది. వాస్తవ అనుభూతులే కల్పనగా పరిణమించి సాహిత్య నిర్మాణం సాగుతుంది. కవిలో అనుభూతుల తీవ్రతను బట్టి రచనకూడా అంత ఆకర్షణీయంగా ఉదాత్తలక్ష్యాలతో ఉంటుంది. ఆ భావాలేలుప్తమైతే, సౌందర్య ప్రేమజాగృతం కాకపోతే నిజమైనసంకల్పాన్ని సాధించే దృఢదీక్ష కల్పించేది కాకుంటే ఆ సాహిత్యం నిరుపయోగం అసలు అది సాహిత్యమేకాదు. పూర్వసమాజం మతాధీనం. మనిషి ఆధ్యాత్మిక నైతిక ప్రవర్తనకు పుణ్య పాపాల సాధనాలతో భయపెట్టి “ధర్మం” తన కార్యం సాధించుకున్నది. ఇప్పుడు ఆ బాధ్యత సాహిత్యానికి వచ్చింది. అయితే సౌందర్య ప్రేమ యిక్కడ సాధనం. మానవుడి ఔన్నత్యానికి దివ్యతకు, అవరోధంగా ఉన్నవాటన్నింటినీ ఎదుర్కొంటారు. రచయితలు దళితులు పీడితుల పక్షపాతం వహిస్తారు. సమాజం అనే న్యాయస్థానంలో తీర్పు చదివి ప్రజలలో ఉదాత్త ప్రవృత్తి, సౌందర్యదృష్టి జాగృతం చేస్తారు. అయితే సత్యం నుండి వాస్తవికత నుండి ఏమాత్రం దూరం కానపుడే సమాజ హృదయంలో పరిణామం తేగలుగుతాడు. భౌతికంగా మనిషి నిర్మాణంలో రక్తమాంసాలు, ఎముకలు కండరాలు ఎలాంటివో వాస్తవికత, సజీవత, భావవ్యంజత, మానవ పరిశీలన మానసికశాస్త్ర అధ్యయనం వంటివి ప్రతి పాత్ర నిర్మాణంలో రచయితలకు ఆధారం కావాలి.
కొందరు విమర్శకులు సాహిత్యం రచయిత మానసికజీవితానికి ప్రతిబింబం అంటారు. ఒకే ఘటన అందరి మీదా ఒకే ప్రభావం కల్గించకపోవచ్చు. దృష్టికోణం మనఃప్రవృత్తినిబట్టి వేరుగా ఉంటుంది. అయితే రచయిత ఏ దృక్కోణాన్ని ఇస్తాడో పాఠకుడు అదే అనుసరిస్తాడు. ఇదే రచయిత సాఫల్యం. రచయితలోని ఉదాత్త సంస్కారస్థాయిని చేరుకోవాలని ప్రతి పాఠకుడు వాంఛిస్తాడు.
రోగి తన రోగాన్ని అసహ్యించుకున్నట్టు మానసికంగా నైతికంగా విలువలు కోల్పోయిన మనిషి కూడా తన స్థితిని అసహ్యించుకుంటాడు వైద్యుడిపాత్రని రచయిత వహించాలి. సౌందర్య భావన లేకపోవడం వల్లనే ఈ బలహీనతలు. సౌందర్యం కోసం ప్రతి హృదయం అన్వేషిస్తుంది. సాహిత్యం కళాకారుడి భావాత్మకమైన సామ్యతని వ్యక్తీకరిస్తుంది. అది సౌందర్యాన్ని సృష్టిస్తుంది విశ్వాసాన్ని, సత్యాన్ని, సానుభూతిని, న్యాయప్రియత్వాన్ని, మమతను, మానవత్వాన్ని నింపుతుంది. ఇవి ఉన్నచోటే దృఢత్వం, నిజమైన జీవితం. లేనిచోట శత్రుత్వం, ద్వేషం, ఈర్ష్య, మృత్యువు, అనారోగ్యంలో అపథ్యం చేసినట్టు సాహిత్యం జీవితాన్ని స్వాభావికంగా స్వతంత్య్ర్యంగా చేస్తుంది హృదయానికి సంస్కారంకల్గిస్తుంది. దాని ఉద్దేశ్యమూఅదే.
సాహిత్యకారుడు లేదా కళాకారుడు స్వభావసిద్ధంగా ప్రగతికినిగానే ఉంటాడు. ఒకవేళ ఈ స్వభావం లేకపోతే అసలు సాహిత్యకారుడు కానే కాడు, తన కల్పనద్వారా వ్యక్తిలోగాని సమాజంలోగాని ముఖస్వచ్ఛందతలను ఊహించలేనివారు, వర్తమాన సామాజిక పరిస్థితులకు దూరంగా ఉండిపోతాడు.
బానిసత్వం నుండి పేదరికంనుండి మన జాతి విముక్తి పొందాలనే వేదన సంఘర్షణ ఎంత వ్యాకులతతో అనుభవిస్తాడో ఆసాహిత్యకారుడి రచనలో అంత వాస్తవికత వెలుగు నింపుకుంటుంది. అనుభూతుల్ని క్రమపద్ధతిలో వ్యక్తీకరించే విధానమే కళాకౌశలత్వ రహస్యం. ఈ అంశం ఇంతలా చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే ఔన్నత్యానికి ప్రగతికి ఒకే అర్థాన్ని అందరూ చెప్పడంలేదు కొంత మంది ఒక పద్ధతి ఔన్నత్యాన్ని సాధనం అనుకుంటే మరికొంతమంది తద్విరుద్ధంగా భావిస్తారు. ప్రతివారూ తన మనోభావాలు వ్యక్తీకరించడమే కళ అనుకుంటారు. అయితే దాని ప్రభావం వ్యక్తిమీద, సమాజంమీద ఎలా ఉంటుందో అని గమనించే స్థితిఉండదు. మనల్ని నిర్జీవ జడత్వస్థితిలో నిర్బంధించిన అంతర్భాహ్య కారణాలని దూరంచేసి కర్తవ్యాన్ని, కర్మని ఇవ్వగలదాన్నుంచి ఔన్నత్యం లభిస్తుంది.
క్షణికమైన ఇతివృత్తంతో నైరాశ్యంలో ముంచే రచనలు, ప్రస్తుతం అనేక మాసపత్రికలలో పడే ప్రేమ కథలు మనలో ఆదర్శంగాని, ఆవేశంగాని, సృష్టించవు, ఇక్బాల్ అంటాడు “నువ్వు జీవితంలో రహస్యాల్ని తెలుసుకోవాలంటే సంఘర్షణలలో తప్ప మరెక్కడా లభించవు – సముద్రంలో విశ్రాంతి తీసుకోవడం నది సిగ్గుపడాల్సిన విషయం-ఆనందం కోసం నేను గూడులాంటి ఇంట్లో బతకలేను”.
అహంకారం, వ్యక్తిగత దృక్కోణమే సర్వస్వం అనుకోవడం జడత్వంలోకి, పతనంలోకి విసిరేస్తుంది అలాంటి కళ వ్యక్తిగతంగా గాని సాముదాయకంగా గాని నిరుపయోగం.
అన్య వస్తువులలాగే కళకూడా అవసరమైన ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారని చెప్పడానికి సందేహించను. జీవితావసర సమస్యల్ని పరిష్కరించలేని మానసిక ఆధ్యాత్మికానందాలు నిరుపయోగం ఆనందం స్వభావసిద్ధంగా ఉపయోగకరమైన వస్తువు. ఆకాశంలో లాలిమ నిస్సందేహంగా సుందరదృశ్యం, కాని ఆషాడంలో మాత్రం నల్లని మబ్బులు కనిపిస్తేనే ఆనందం. ప్రకృతితో మనజీవన స్వరాలను మేళవిస్తేనే మనకు భావావేశంతో కూడిన ఆనందం కలుగుతుంది. అనందం కల్గించే భావాలు, అనుభూతులు అన్నీ వృద్ధి వికాసాలకు తోడ్పడేవే. కళాకారుడు సౌందర్యాన్ని సృష్టించిసామాన్య పరిస్థితిని వికాసోన్ముఖంగా చేస్తాడు. ఇతర వస్తువుల్లాగా సౌందర్యానికి ఆకారంలేదు. ఆ ఆనందమూ అందరికీ ఒకే పాళ్ళలో లభించదు.
సంఘజీవనం ఆరంభించినప్పటి నుండి బంధుత్వం, సమత, సభ్యత, ప్రేమ అనేవి ఆదర్శవాదులకు తీపి కలలుగానే మిగిలిపోయాయి. ధార్మిక వాదులంతా నైతిక ఆధ్యాత్మిక పరిమితులతో ఆ కలలను యదార్ధాలు చేయాలని శతధా యత్నించారు. బుద్ధుడు, క్రీస్తు, మహ్మద్ లాంటివారు నీతి పునాదుల మీద సమతా నిలయాన్ని నిర్మించాలని కృషి చేశారు. ఎంలాభం? ప్రస్తుత సమాజంలో ఉన్నన్ని కులమత భేదాలు బహుశా ఏకాలంలోను ఉండి ఉండవు. ఇప్పుడు కూడా నీతి ధర్మాల అంచులు పట్టుకుని సమతోన్నత లక్ష్యాలను చేరాలంటే వైఫల్యం తప్పదు అయితే ఈ కలలు “ఉత్తేజిత మస్తిష్కాల సృష్టి” అనుకుని విస్మరిస్తామా? అదే జరిగితే మానసిక ఔన్నత్యానికి పూర్ణత్వానికి ఒక్క ఆదర్శం కూడా మిగలదు. అలా ఆదర్శం లేకపోవడం కన్నా మానవుడి ఉనికే లేకుండా పోవడం మేలు.
ఏ ఆదర్శాన్ని మనం సభ్యతతో బాటు నిలబెట్టామో. దేనికోసం మానవుడు అనేక త్యాగాలు చేశాడో, ఏ పరిణామం కోసం ధర్మాలసృష్టి జరిగిందో, ఏ ఆదర్శం కోసం మానవ సమాజ చరిత్ర నిల్చిందో దాన్ని శాశ్వతసత్యంగా భావించి ఔన్నత్య సోపానాలమీద అడుగు పెట్టాలి. సమత కేవలం నైతిక బంధనాల్ని ఆశ్రయించకుండా ప్రత్యేక రూపం ధరించినప్పుడు మనం నూతన సంఘటనకు సర్వాంగాల్ని సృష్టించి పరిపుష్టం చేస్తాం. ఈ ఆదర్శాన్నే సాహిత్యం మన ఎదుట నిలబెట్టాలి.
సౌందర్యం అర్ధాన్ని మార్చాల్సిఉంది. యిప్పటివరకు అది ధనం, విలాసాల పరిధుల్లోనే ఉంది. కళాకారులు బతుకు తెరువుకోసం ధనవంతుల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఆ శ్రీమంతుల గొప్పతనాలే రచనలకు మూలవస్తువు. వాళ్ళ సుఖదుఃఖాలు, ఆశ, నిరాశలు వీటిని చిత్రించడమే కళ ఉద్దేశ్యమై పోయింది. ఆ దృష్టి ఎప్పుడూ అంతఃపురాలు, బంగాళాలవైపే పరిగెడుతుంది. శిథిలాలు గుడిసెలు ఆ కళ్ళకి కనిపించవు – బి గుడిసెలు శిథిలాలు మానవత్వ పరిధుల అంతర్భాగం కాదని వారి ఉద్దేశ్యం, అక్కడక్కడ వాటిని వర్ణించినా హాస్యం కోసమే, వల్లెటూరివారి వేషభాషలు హాస్యం సృష్టికి వస్తువనుకుంటారు. నిజానికి వారి హృదయాలు, ఆశలు, అవేశాలు గ్రహించడమే కళ.
భక్తి వైరాగ్యాలో, ఆధ్యాత్మిక భావాలో, జీవితపు క్షణిక ఆలోచనలో కళకి కల్పనలుగా తీసుకొనే కళాకారుడి చరమోద్దేశం కూడా ఆ పరిధుల్ని దాటదు. జీవిత సంఘర్షణలో సౌందర్యోత్స్వర్పచూసే శక్తి వారికుండదు. వాస్తవంలోని సౌందర్యం ఉనికిని వారు అంగీకరించరు. యవ్వనభారంతో ఉరకలేస్తున్న విలాసినే అతడికి సౌందర్యం, గట్టుమీద పిల్లల్ని నిద్రపుచ్చి పొలంలో చెమటోడ్చే స్త్రీలోని ఉదాత్త సౌందర్యాన్ని చూడలేదు. చిందరవందరైన కేశాలు, పాలిపోయిన అధరం, వాడిన కపోలాలలో సౌందర్యం చూడలేకపోవడం దృష్టిలోపం. దృష్టిలో వున్నత భావం ఉంటే సిరితో మిడిసి మెరుస్తున్న పెదవులు, చెక్కిళ్ళ వెనక గర్వాన్ని, క్షణికత్వాన్ని గమనించగల్గుతారు. వాడిపోయిన పెదవుల్లో చెక్కిళ్ళమీద ప్రవహించే కన్నీటి ప్రవాహంలో త్యాగం, భక్తి, శ్రద్ధ, ఓర్పులను చూడగల్గుతారు. యిందులో వారనుకొనే “అందం, ఆకర్షణ, సౌకుమార్యం” ఉండవు.
మన కళలు యవ్వనపు ఉన్మత్తతలో మునిగి తేల్తున్నాయి. యవ్వనం గుండెల మీద తల ఉంచి కవిత్వం చెప్పడం, శృంగారనాయిక ఆస్వాభావిక భావావేశాన్ని చిత్రిస్తూ రోదించడం. ఆ నాయిక రూపగర్వాన్ని మత్తెక్కిన కన్నులతో చూపడం వల్ల కళ ఉద్దేశ్యం నెరవేరదు. యవ్వనపు ఆవేశం ఆదర్శాలకు కష్టాల్ని ఎదుర్కొనే సాహసానికి, ఆత్మ త్యాగానికి మాత్రమే ప్రతిబింబం కావాలి.
“ప్రవాహ వేగాన్ని లక్ష్యపెట్టని తరంగాల లాగే నా జీవితమును, ఈ అపార సాగరంలో నేను మాత్రం గట్టును వెదుక్కోడం లేదు” అంటాడు ఇక్బాల్, సౌందర్య దృష్టికి ఉన్నత లక్ష్యాలున్నప్పుడు, సృష్టి మొత్తాన్ని ఆ దృష్టి పరిధిలోకి యిముడ్చుకో గల్గినప్పుడు, మనకు కూడా ఇక్బాల్ వంటి స్థితి కలుగుతుంది. చెడుని సహించలేనినాడే దాని నిర్మూలనకు నడుం బిగిస్తాం, మానవ జీవితాలు అత్యాచారాలు, బానిసత్వం సహించలేనపుడు కేవలం అది మాత్రం కాయితాలమీద రాసుకుని సంతృప్తిపడం, సౌందర్యం, నీతి, ఆత్మ గౌరవం మానవత్వాల్ని సృష్టించి తీరాలంటాం.
విలాస మందిరాల్ని సృష్టించడం మనోరంజక సామగ్రిని పోగుచేయడం సాహిత్యకారుడి లక్ష్యం కాదు. సాహిత్యస్థితి గతుల్ని ఆ దుర్గతికి దిగజార్చకూడదు. దేశభక్తి, రాజనీతిని అనుసరించడంతో బాటు, సాహిత్యం వాటి ముందునిల్చి వాస్తవికతా కరదీపిక చేపట్టిన మార్గదర్శి కూడా కావాలి.
తన చుట్టూ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకుని అదే సర్వస్వం అనుకునే జమీందార్లను ఆశ్రయించే జీవితాలనే చిత్రిస్తూ ఆందోళనలకు, విప్లవాలకు దూరంగా ఉండేది అసలు సాహిత్యమే కాదు. వ్యక్తివాదానికి పరిమితమైపోకుండా సామాజిక దృక్పథం పెంపొందించుకున్న సాహిత్యకారుడు వ్యక్తిని, సంఘాన్ని వేరుగాకాక, వ్యక్తికూడా సంఘంలో ఒక అంశ మాత్రమే అని గ్రహిస్తాడు. అప్పుడు సంఘం మీద వ్యక్తి అధికారం లేదా వ్యక్తి స్వార్ధంకోసం పనిముట్టుగా ఉండాలన్న వాదాల్ని. సంఘానికి వ్యక్తికి శతృత్వం ఉందన్న అభిప్రాయాన్ని తిరస్కరిస్తాడు. సమాజ నిర్మాణంతో బాటే వ్యక్తి ఔన్నత్యం, సమాజం నుండి వేరయితే వ్యక్తి విలువ శూన్యం అని గ్రహించగలుగుతాడు. రచయితా తత్వవేత్తా కూడా యింతకన్నా భిన్నంకాదు. వారికీ ఆ బాధ్యత ఉంది.
అంతర్జాతీయ సాహిత్య సభల కార్యక్రమాలు చూస్తే శాస్త్రీయ సామాజిక ఇతిహాసిక విజ్ఞాన రంగాలలో అన్ని అంశాలపై సుదీర్ఘంగా, లోతుగా వరిశీలిస్తున్నారు. వాటితో పోలిస్తే మన అజ్ఞానానికి సిగ్గుపడాలి. సాహిత్యరచన ఆశువుగా చెప్పగల స్తోమతకు వేగం ఉంటే చాలనుకుంటాం. కాని ఈ భావమే మన సాహితీ సంకోచ, వినాశాలకు హేతువు. సాహిత్య ప్రమాణాలను ఉన్నతం చేసి, సంఘం మీద అధికారం సాధించి, సమాజంలోని ప్రతిభాగాన్ని సునిశితంగా వ్యాఖ్యానించాలి. అయితే ఇందులో అన్య భాషా సాహిత్యాన్ని గుడ్డిగా అనుకరించడం కాదు. స్వశక్తి ఉంటేనే ఉన్నత లక్ష్యాలు సాధ్యం.
అంతర్యాలు సౌందర్య ప్రేమ జ్యోతితో ప్రకాశితమైతే సేవా ఆదర్శాలు దారులుగా నిలబడితే ప్రతి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొని జయించవచ్చు. కాని ధనాన్ని విలాసాన్ని ఆరాధించే వారికి సాహిత్య మందిరంలో స్థానంలేదు. సేవే జీవితాదర్శంగా హృదయంలో కష్టాల అనుభూతుల్ని పొదువుకున్నవారూ ప్రేమావేశంగల ఆరాధకులు ఉదాత్త సాహిత్యాన్ని నిర్మించగలరు. చిత్తశుద్ధితో సేవిస్తే కీర్తిప్రతిష్టలు పాదాల్ని చుంబిస్తాయి – ఇక గౌరవ ప్రతిష్ఠలకోసం బాధపడ్డం దేనికి? కీర్తిరాకపోతే నిరాశ వద్దం దేనికి? సేవలో కలిగే ఆత్మానందమే అమూల్యమైన బహుమతి – ధనవంతుల జాబితాలో చేరాలన్న కోరిక ఎందుకు బాధించాలి? సంఘాన్నే పతాకంగా ధరించి సాగిపోయే సిపాయిలం. సామాన్య జీవితంలో ఉన్నత లక్ష్యాలను పొందాలన్నది మన ఆదర్శం. నిజమైన కళాకారుడు స్వార్ధ పూరిత జీవితాన్ని గడపడానికి యిష్టపడడు. కృత్రిమత్వాన్ని అసహ్యించుకుంటాడు. అప్పుడే ప్రతి కళాకారుడు ఇక్బాల్గా మారుతాడు.
మన ప్రగతిశీల రచయితల సంఘం కొన్ని విశిష్ట సిద్ధాంతాల ప్రాతిపదికగా నూతన పద్ధతులను ఆచరణలోకి తెచ్చింది. సాహిత్యాన్ని కృత్రిమంగా విలాసంగా చేయడం కోసంకాదు. అందంగా అర్థవంతంగా చేయడానికి. ఈ ఆదర్శంతో భాష నిరాడంబరంగా మారుతుంది.
సామాన్య ప్రజలమీద సానుభూతి కలవారు సరళ శైలిలోనే రచిస్తారు. దేశంలో ఉదాత్తమైన ఉద్దేశాలుగల సాహిత్యాన్ని సృజించి వికసింప చేయడం మాధ్యేయం. నియమపూర్వకమైన సాహిత్యచర్చలు జరిపి నిగూఢవిషయాలపై ఉపన్యాసాలు ఇప్పించి, వాళ్ళ విమర్శలతో సాహిత్యమంటే ఏమిటో తెలియజెప్పాలి. అప్పుడే సాహిత్యంలో నూతన యుగారంభానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
దేశంలోని ప్రతిభాషలోను మన సందేశం అందించేందుకు అన్నిచోట్ల మనం మన సంస్థని నెలకొల్పాలి. దేశంలోని సాహిత్య సేవకుల హృదయంలో ఐకమత్యభావనలు నిండుగా ఉన్నాయి. ప్రతి భాషలోనూ ఈ ఆదర్శంనాటి వాటి లక్ష్యాలసాఫల్యానికి కృషి చేయడం మన కర్తవ్యం.
ప్రస్తుతం సాహిత్యకారుల్లో సృజనాత్మక క్రియా శక్తి లోపించింది. ఈ అంశంపై దృష్టి సారించకుండా ఉండలేము. ఇప్పటి వరకు సాహిత్యానికి ఉన్న ఆదర్శాలకు సృజన అవసరం లేకపోయింది. కేవలం మనోరంజనానికి పరిమితమై జోల పాడి నిద్రపుచ్చి కన్నీర్ను కార్పించి దానితో గుండెతేలిక పర్చడమే పనిగా సాహిత్యం ఉన్నంత వరకు క్రియా శక్తితో అవసరంలేదు. గత సాహితి ఆవేశం ఉన్మాదంలాంటిది ఫలితం మాత్రం ఇంకొందరిది కాని మన సాహిత్య ఉద్దేశ్యం వేరు మన గీటురాయి మీద సాహిత్యానికి మెరుగు పెట్టాలి.
ఉన్నత భావాలు, స్వతంత్ర ఆలోచనలు, సౌందర్యారాధన, ఆత్మవికాసం జీవిత యధార్దఘటనలు, అందులో ఉంటాయి. అవే మనలో ఉత్తేజాన్ని సంఘర్షణల్ని, ఆదర్శాల్ని సృష్టిస్తాయి వాటిని నిద్రపుచ్చడానికి ప్రయత్నించకూడదు.
అధికనిద్ర మృత్యువుతో సమానం కాదా?
