నువ్వు వస్తున్నావన్న
మాట చెవిన పడిందో లేదో
అప్పటిదాక ముడుచుకున్న ఇల్లు
ఒక్కసారి పురివిప్పిన నెమలైపోయేది
ఆ ఒక్కమాటనే మంత్రసమమై
రోజూ ఇంట శబ్దంగా నిశ్శబ్దంగా ప్రతిధ్వనించేది
ఏ అలికిడీ లేక
పూర్తిగా స్తంభించిపోయిన గాలి
హుషారుగా వీస్తూ
ఇంటిని నవపరిమళభరితం చేసేది
పెద్దర్వాజ
తలుపులు తెరచినా మూసినా
మూతపడని కనురెప్పలకు
ఇంతల కన్నులతికించుకు
ఎదురుతెన్నులు చూసేది
నువ్వుమాత్రం
అంత ఆతురతను
ఉఫ్ మని కొండెక్కించి
ఒక్కసారి
ఈదురుగాలిలా
వచ్చి వెళ్లిపోతావు
ఉన్న ఆ కాస్సేపు
ఒక తరంగంలా
ఇంటి ఒంటిని చుట్టేసి
వణికించి పులకలు రేపి
మనసుకింత హాయిపంచి
మాయమై పోతావు
నీవు రాక మునుపు
నీ రాకకై ఎదురుచూపుగా..,
వచ్చి వెళ్లాక
పూడ్చలేని ఆ వెలతి
లోలోని లోయగా..,
నీ జ్ఞాపకాలుగా
అటూ ఇటూ.. మొత్తంగా...;
నీవు లేకున్నా
నీ చిత్తరువున నిను చూసుకుంటూ
వర్తమానాన్ని గతంగా నీ ఆగతంగా
నెమరేసుకుంటూ..ఆ ఇల్లు..
భవిష్యత్తున
తనతోనే ఉండిపోతావని
కలలుకంటూ
బతుకునీడుస్తుంటుంది.