బ్లాక్ డాగ్ ను కుక్కని
అని పదపదే అనద్దంటే
వినిపించుకోరేం
మా కుక్కనల్లదని
తెగ ఆడిపోసుకుంటారేం
నల్లదే కావొచ్చు
జర్మన్ షప్పర్డ్ జాతిది
మా ముద్దుల అమ్మాయి మీ మాటలన్నీ
భలే ఆలకిస్తుంది
బంతిలా ఆడుతూ ఆడిస్తుంది
ఎవరైనా గేటు తీసి
గడియపెట్టకపోతే
అరచి అరచి సరిచేయిస్తుంది
తిడితే అలిగి మంచంకిందకు
దూరిపోతుంది
ఏదిపడితే అది తినదూ
గుడ్ డే బ్లూ కవర్ బిస్కెట్లకు మారాం చేస్తుంది
పగలు గొప్ప
శాఖాహార ఫోజూలుకొడుతుంది
రాత్రికి మాత్రం
గప్ చిప్ గాచికెన్ లెగ్ పీసులు లాగేస్తుంది
దానిని కుక్కంటే
అసలు ఊరుకోను
ఆడపిల్లే కావొచ్చు
మా బిడ్డలాగే గారాలుపోతుంది.
రాత్రుళ్ళు మా అబ్బాయి కోసం
మెలకువకాళ్ళతో
పడకగది వీధిగేటు మధ్య
నిరీక్షల పచార్లు చేస్తూ వుంటుంది
పరీక్షలుకు సిద్ధమవుతున్నట్టు
పక్కలో ఓ చోట పడుకోదు
స్థలం మారుస్తూంటుంది
లేదా ఎవరి పక్కనైనా దూరుతుంది
కాళ్ళవద్దో..వీపుని తన్నిపట్టో
పక్కకు తోసేసో తనదే రాజ్యమన్నట్టు
తొలి కోడి కంటే ముందే లేచి
మేలుకొలుపుల గీతం పాడుతుంది
పరిచయస్తులను
తోకతో పలకరిస్తుంది
కొత్తవారిని నోటితో పలకరిస్తుంది
ఇక సెలవులకో మా కూతురు అల్లుడు
మనవళ్ళొస్తే దానికి ఆటవిడుపే
క్షణం కూడ విడవకుండా వాళ్ళతోనే
గడుపుతుంది.
మూడునెలల పిల్లప్పుడు దానిని
పాలుపోసి లాలించిన పక్కింటి
అనురాధంటే ఎంతో ప్రేమ
మాట విన్నదంటే చటుక్కున చెవులురిక్కరించి
రమ్మనన్నట్టు అరుస్తుంది
గోడవద్దకు తీసుకెళ్ళితే
చేతులానించి తనతో
కబుర్లాడటంకోసం
ఆత్రంగా పిలుస్తుంది
నేనింట్లో లుంగీ మీదున్నంతసేపు
ఏమనదు కాని
ఫాంటు చొక్కా వేసుకోగాని
ప్రశ్నించినట్టు తీక్షణంగా చూస్తుంది
నేనే కాదు ఇంట్లో ఎవరు బయటకెళ్ళడానికి
తయారైతే జాగిలంకదా ప్రశ్నించడం దాని నైజం...
నచ్చచెప్పాల్సిందే
వానలో తడవడం
నీళ్ళపంపుదగ్గర ఆడటం ఎంతో యిష్టం
స్నానం చేసినప్పుడుల్లా దుప్పటితో
యుద్ధం చేసికాని ఒళ్ళు తుడుచుకోదు
ఎంత ఆనందమో ఇల్లంతా
ఉరుకులు పరుగులు పెడుతుంది
ఆకలి అని అడగదు కాని
సమయానికి మనమందిస్తేచాలు
అల్పసంతోషం ప్రదర్శిస్తుంది.
మంచిదే
గయ్యళిది కాదు కానీ
బంధువులు , స్నేహితులు
దాని ఆకారాన్ని చూస్తే హడల్
దానిని కుక్క అనొద్దని
కోటిసార్లు చెప్పాను
పరిచయం చేసుకుంటే
అసలు వదిలిపెట్టదు
వెళ్ళిపోతుంటే
కాళ్ళకు సంకెలై ఆపుతుంది
చేతులు చాపి ఐదడుగుల ఆకారంతో హత్తుకుకోమంటుంది
కొందరు కుదిరిపోతారు
కొందరు బెదిరిపోతారు
మనకుండే అన్ని భావాలు వ్యక్తీకరిస్తుంది
తోకకూడిపోతుందన్నట్టు
ప్రేమ పంచుతుంది
మళ్ళెప్పుడొస్తారో రారేమోననే అనుమానంతో
కూనిరాగాలెడుతుంది
ఇంట్లో ఎవరిమైనా ఊరెళ్ళేటప్పుడు
దాని అనుమతి తప్పనిసరి
ఒకటి రెండు రోజుల పిదప
కనపడీతే చాలు
బెంగటిల్లినదానిలా
కుసింపుమొదలెట్టి
ఒడిలోపడుకుని
కరువుతీర వగలుపోతుంది
అందుకే దానిని కుక్క అనకండి
అది మా ఇంటి బిడ్డ స్వీటీ.
