మా యింటి బుట్టిన పసరాలు బలే సురుగ్గా వుంటాయని పేరెత్తుకునె. బుడ్డగిత్త మా పెద్దావుకి రొండో యీతలో బుట్టిన కోడెదూడ. వొక సలికాలం రేతిరి నిండు చూలాలు పెద్దావు పొణుకుంటా, లేచ్చా ఆపసోపాలు పడ్తావుంటే ఈన్తాదేమోనని నేనూ, మాయన్నా గొడ్ల వసారాలో దాని గాటి కాడ రూంచేపు కూసుంటిమి. ఎంత సేపుటికి ఈనక పొయ్యేతలికి అద్దరేతిరి దాకా దానికాడ కూసున్న మేము నిద్దర కాగలేక, యింట్లేకి పొయ్యి పొణుకున్నాం. తెల్లారి కప్పర కప్పర సీకట్లో లేసిన మా వొదిన గాటికాడికి పొయ్యి సూచ్చే, అప్పుడే పుట్టిన దూడని నాకుతాండాదంట పెద్దావు. ఏందూడని సూచ్చే కోడి దూడంట. ఆమి పరిగిచ్చా వొచ్చి ‘లెయిండి… లెయిండి! పెద్దావు ఈనింది కోడి దూడగానే’ అంటా మమ్మల్నందరినీ తట్టి నిద్ర లేపేసింది. మిగల మాగిన నేరేడు పండు రంగులో నల్లంగా నిగనిగలాడ్తా పుట్టేతలికి, యిదేంది కొడకా! మని యింటా వంటా లేని కర్రి దూడ పుట్టిందే! అనుకుంటిమి. నొస్టన తెల్లనామంతో నల్లరూపాన బలే నాణ్ణెంగా వుండె. అది వొక్క రూంత నిగువయ్యి కాల్లు జారేసి పరిగిచ్చే టయానికి, దాని ఆటలు అలివిగాకండా వుండె. యింట్లో మాయన్న సన్న పిల్లోల్లు దియ్యమ్మ, సక్కిరిగోడు దాంతోనే ఆడుకునేది. పిల్లోల్లు పైనా, పక్కలా పడ్తా వున్నాగాని తులిపిగా తోకతో వొక దెబ్బ ఏసేదే గాదు. గమ్ముగా సగిచ్చినట్టుండేది. రొండు బంట కొచ్చేతలకి రూంత కొమ్ములు తేలినాయి. దానెమ్మ జతన కాడి గట్తే బలే సాలుగా పొయ్యేటిది. బుడ్డగిత్తకి సురుకు జాచ్చి, ముల్లుగట్టి తగలనిచ్చేదే ల్యా! మడక దున్నుతా కొండ్ర బేచ్చే సక్కంగా గీత కొట్టినట్టే వుండేది. ఆయింపాయింతో ఆరుబంట కొచ్చేతలికి పిడికిలంత కొమ్ముల్తో, కుదిమట్టంగా బలే సక్కదనంగా తీరె! గుండు బాన బోల్లిచ్చినట్టు చెండుతేలి, అది తలూపుతానడుచ్చావుంటే వొయ్యారంగా వుండె. మోరసిక్కమేసి, మువ్వల పట్టీలు, రంగురంగుల బొడ్డారు తాల్లు కడ్తే అది యిచ్చుకోని యిరగబడ్తా వుండె. మేతకి బీడుకి పసరాల్ని తోలకపోతామా, నేనేడుంటే ఆడ నన్ను కనిపెట్టుకోనుండేది. అడివికి పోతే గొడ్లన్నీ చెట్టుకీ, పుట్టకీ తారుకోని పోతాంటే, ‘బుడ్డ గిత్త ఎట్ట బొయిందబ్బా’ అని ఎతుక్కుంటే నా ఎనకనే బుసపెడ్తా నిలబడుకోనుండేది. దానికా గుంపు పొదలంటే బిత్తర బయిం, చెట్టల్లోంచి ‘బుర్’మని పిట్టెగిరినా, చెవులునిగిడిచ్చి వులిక్కిపడేది. అది వుత్త పిరిగ్గొడ్డు. వొక్కక్కసారి దానికి కుశాలనిపిచ్చినప్పుడు దగ్గిరికొచ్చి కొమ్ములు మోటిచ్చి జల్లాటం ఆడేది. మురికంగా కాల్లూ, చేతులూ నాకేది. దాని నాలిక గరుకు కదా! బలే మంట పుట్టేది.
వొకసారి నేను మాలాడుకి ఎగుదాల గట్టుమింద గుర్రప్ప సోమి మానికాడ పసల్ని మేపుకుంటాండా. ఆ తావు ఆడాడ గుట్టలూ, గుంపు చెట్లతో చిన్న అడివి మాదిరుంటాది. పసరాలు మేచ్చా చెట్టల్లోంచి తెరపలోకి వచ్చె. బుడ్డగిత్త వొగటే ఎట్ట బొయిందోగాని మందలో లేదు. దానెమ్మ మింద కలవరం పుట్టి అదే వచ్చాదని సూచ్చి. మాటేలయితాన్నా దాని జాడే ల్యాకపాయ. ఎతుకుతా వూళ్లో దావదాటుకోని, కాలిబాట్లో పెదబాయికాడికి పొయ్యే తలికీ, బుడ్డగిత్త మువ్వల పట్టీ మోగుతాండేది యినపడె. యీడేం జాచ్చా వుండాదబ్బా అనుకుంటా, ఎవురైనా దాన్ని పట్టుకోనుండారేమో అనుకోని గొంజి చెట్టల్లో దాంకోని సాటుగా సూసినా, ఆడ వూళ్ళేకి పొయ్యే దావలో ఐవోరు సేకరయ్యని అడ్డగిచ్చుకోనుండాది బుడ్డగిత్త. ఐవోరు సేకరయ్య దినాం పోల్లోపల్లికి పోయి సన్నపిల్లోల్లకి బడిజెప్పి, మాటేలకి యింటికి తిరుక్కోనొచ్చా వుంటాడు. ఆయన్ని వైదొలగి పోనీకుండా తలకాయి యిదిలిచ్చా జల్లాటం ఆడ్తా వుండె బుడ్డగిత్త. అదట్ట జల్లాటం ఆడేది తమాసకని తెలీని ఐవోరికి సెమట్లు కార్తాండాయి. దీని తమాసా ఐవోరికి అమాసవుతాండాదని నేను గబక్కన బాట్లేకి పరిగిచ్చి ‘హేయ్ బుడ్డా! పో పక్కకి’ అంటా అదిలిచ్చినా. అంతే నన్ను సూచ్చానే అది కుక్క పిల్లలయిపొయ్యి దగ్గిరికొచ్చి చేతులు నాకబట్టె. దీంతో తెప్పరిల్లుకొన్న సేకరయ్య నవ్వుతా ‘దీనివాటం జూసి పొడుచ్చాదని బయిపడి సచ్చినాన్నా’ అంటా వూరిదావ బట్టిపోయా. అట్టుంటాది బుడ్డగిత్త వులగరం. జల్లాటం ఆడేదేగాని కొమ్మిసిరేది దాని జలమలో లేదు. సూసేవోల్లకి ఆముపట్టిందానాల అగుపిచ్చాది గాని, బలే యిగితి గల్లా పసరం గదా బుడ్డగిత్త.
అప్పుడు నేను తుమ్మానిబాయిగడ్డ మింద పసల తోలకపోతాండా. బిన్నా మేత బయిల్లోకి పోదామని పసల్ని అడ్డదావ మల్లిచ్చినా. ముందు పోతాండిన బుడ్డగిత్త వున్నట్టుండి టక్కన నిలిసిపాయా! అదే దావన దూరంగా పైరయిన తరుపుని తరుంతా, మా ఎనకన్నే ఎద్దులు మిడిమేలంగా పరిగిచ్చాండాయి. అది జివాలు నడిసే యిరుకు దారి అయిందాన, యిరువల్లా గచ్చాగోరింత పొదలు అల్లుకోనుండే. పక్కకి వైదొలగను దావే లేదు. ఎంత అదిలిచ్చినా బుడ్డగిత్త మొండికి తిరుక్కున్నెట్టు రాతి బసవన్న మాదిరి నిలబడె. మా ఎనకన్నేతరుపుని తరుంతా గిత్తలు దగ్గిరిగా వచ్చాండాయి. తిక్కరేగినట్టు పరిగిచ్చే వోటిలి గిట్టల కింద పడ్నామంటే, నుగ్గునుగ్గు అయిపోవడం కాయిం. నేనప్పుడు బుడ్డగిత్త పగ్గం వొదిలేసి, ఆడపడుండే ఎండు కట్టినొకదాన్ని ఎత్తుకోని ఏమైనా గానీ అని ‘గూర్ బేర్’మని అరుచ్చా వోటికి ఎదురు పరిగిచ్చినా. నన్ను జూసయ్యి బెదురుకోని తలొక దిక్కు చెదిరిపొయినాయి. ఎనక్కి తిరుక్కోనొచ్చి బుడ్డగిత్త ఎందుకట్ట మొండికేసిందా? అని వొక్క రవ్వ ముందుకి నడిసి సూచ్చిని గదా, నా గుండెకాయిలు లొటలొటా కొట్టుకున్నాయి! మాకు రూంత దూరంలో ఆకులు అలుముల్తో తీర్నాటకంగా అల్లుకోనుండే పిల్లబాయి కంటికి కనబడకుండా వుండాది. పసువులూ, నేనూ అప్పిటికే బాయి వొరగడ్డాన వుండాం. ఎప్పుడ్తో అది పూడుబాయి. సూసేదానికి బయికారంగా వుండె. దాంట్లో పడ్తే సావే గతి! దిక్కులేని సావు సచ్చావుంటిమే! అనుకుంటి. కొడకా! అందుకేనేమో బుడ్డగిత్త నేనెంత అదిలిచ్చినా, కొట్టినా అడుగు ముందుకెయ్యికపోయా! పసల కుండే తెలివి మనుసులకేడిది? పాణం కాపాడిరదని దాని సాయి జూచ్చే నా మొనుసు ఎట్నో అయిపాయ.
మల్లొకసారి ఏమైందంటే…
మాలాడుకి ఉత్తరంగా గట్టు. తూరూగా సెరువు దాటుకోనిపోతే అడివొచ్చాది. అది పండగ నెలయిందాన చలమాలోల్లు అడివికి పొయ్యి కట్టిలు కొట్టి, బండ్లో తోల కొచ్చా వుండారు. బర్తీ బండి మాలాడు కొచ్చేదావలో ఎద్దులు యీడ్సలేక నిల్సిపాయా. ఆడ ఎక్కుడు నిట్టనిలువుగా వుంటాది. వొట్టి బండి లాగడానికే ఎద్దులాడ రొప్పుతాయి. బండినిండా గుజ్జులపైకి పచ్చి కట్టి పేర్చిండారు. ఆ బొరువు యీడ్సడానికి చలమాలోల్ల గిత్తలకి సిత్తరశమయిపొయింది. మాలాడ్లో మొగోల్లంతా గుంపుగా వుండారాడ. వోల్లల్లో మాయన్న గూడా వుండె. పొద్దుగూకి సీకటి ముసురుకుంటా వుండాది. మొబ్బు కమ్ముకుంటాండాదని అందరూ ఆత్రంగా మాట్లాడుకుంటావుండారు. మేం పసల తోల్కోని యింటిసాయి మల్లేది సూసిన చలమాలాయిన ‘అద్దో! మీ గిత్తా, ఆవుని కట్టండి లాగుతాయేమో’ అనె మాయన్నతో. మా యన్న తల అడ్డంగా వూపుతా! బండే మరగలేదే ఎట్ట లాగుతాయ్యా! అనె చలమాలాయిన్తో. అయినా సూచ్చామని వోల్లగిత్తల పట్టీలిప్పి పెద్దావుని, బుడ్డగిత్తని బండికి కట్నారు బుడ్డగిత్త మెడ బండి బర్తీకి జివ్వన వొంగిపాయా. దాని వాటం జూసి మాలాడోల్లంతా గొల్లున నగినారు. వోల్లల్లో తాటిమా ముండి చలమాలాయిన్తో ‘అహా! బలే లాగబోతాయిమావా! ఈ జంట్లా కోడిలు. వొగటేమో గుల్లిమంతది, యింకొకటి ఆవయిపాయ. యియ్యి బండి పెరికేది మనిమింటికి పొయ్యేది నిజమే మావా’ అంటా గేలిజేశె. మాయన్న మొకం ఎర్రబడిరది. అసలికే ముక్కుమింద కోపమోడు మాయన్న. ‘కోతోడు బతకలేక కోతినాడిపిచ్చి పొట్టపోసుకున్నట్లు’ ఈల్ల మాటలికి రోసానికి పొయ్యి యాడ ఈటిలి పాణాల మిందకి తెచ్చాడో కొడకా! అని నాకు బలే గుబులుగా వుండిరది. మాయన్న వుక్కురోసానికి బొయ్యి తాటిమావ సాయి జూచ్చా ‘ఏయ్! ఆపు నీ ఆడింగిమాట్లు, ఈటిల్తోనే బండి లాగిపిచ్చా! లేకపోతే నీకాళ్ల కింద దూర్తా’ అంటా శాబ్ది తీసి, ఎగ్గిరి నొగల్లో కూసోని పగ్గాలు పట్టుకోని ‘స్సొ… ప్పా… పా’ అన్నాడు. చేలాకోడి ఆడిచ్చా. అంతే వొక్కడుగు ఎనక్కేసి తనకలాడిన పెద్దావు, బుడ్డగిత్తా పెద్దంగా బుసిడిసి అంతలావు కనికిరాళ్ల బండ్ల బాటని, బండిగాన్లు గరగరలాడ్తా జారిపోతాన్నా అంత ఎక్కుడ్ని వొక్క లగువుతో లాగిడిశె. ఆడంతా ఊలలు కేకల్తో దుమ్మురేగిపొయింది. మాలాడు గుంపంతా అరిసోద్దకపొయ్యిరి. ఏనాడూ బండిలాగెరుగని పెద్దావు, బుడ్డగిత్తా అంత ఎక్కుడ్లో బర్తీ బండి లాగి వోటిలి శెగితెంతో వూరూ, వాడకి నిరూపణ జేశె.
* * *
ఆ పొద్దు చిట్టేలి నుంచి యింటి కొచ్చేతలికి మాటేల అయ్యె. సూరుడు పరమట పక్కకి వొంగుతా వుండాడు. సివరాత్రి పండగ పొయ్యి నాల్గయిదు దినాలె అయ్యింది. సివరాత్రికి ‘సివసివా’ అంటా సలి ఎల్లబారి పొయ్యి, వొక్కరవ్వ ఎండ ముదుర్తా వుండె. నాలుగు మైల్లు నడిసి వొచ్చిందాన వొల్లంతా సెమట పట్టి సిమసిమలాడ్తా వుండె. మాలాడు నిస్సద్దుగా వుండాది. వొక్క గువ్వపిట్టి గడకా తిరుగాడ్డంల్యా! మల్లా పొద్దు పొద్దు గూకేయాలకి సద్దు మొదులయితాది. పొద్దననంగా అడివికి మేతకి పొయ్యి, మాటేలకి యిండ్లకి తిరుగొచ్చే సన్నజివాలు, పసరాల్తో పసల్డొంక దావంతా దుమ్ము రేగుతాది. సేపు కొచ్చిన పొదుగులు యింతింతలావు పెట్టుకోని, మందకంటే ముందుగా వోటిపిల్లల కోసరం పరిగెత్తే తల్లి మేకలు, గాటికాడ తలుగులు వూడబెరుక్కోని వోటి అమ్మల కోసరం మందకి ఎదురు పరిగిచ్చే లేగదూడలూ, ఈటన్నిటి ఆగిత్తం సూసేదానికి బలే తమాసగా వుంటాది.
మా యింట్లో ఎవురూ లేరు. తలాకిడి కాడ తడికేసి, దట్టంగా బిర్రు పెట్టిండారు. తడికి తీసి లోనకి అడుగు పెట్టీ పెట్టక తలికే గొడ్ల వసారాల్లోంచి పెద్దావు నన్ను జూసి ‘అంబా’… అని అరిశె. పెద్దావుతో పాటి దాని బిడ్డలు బుడ్డగిత్తా, రొండు తరుపులు డొక్కలు వొక్కిలిచ్చుకోని గాటికాడ తొక్కులాడ్తాండాయి. ‘యింట్లో అందురూ ఎట్ట బొయినారబ్బా..! పసలిడిసే యాలయితాన్నా, నాలుగు పసరాల్ని గాటికాడ నిలగట్టేసిండారే’ అనుకుంటా జలదాట్లోకి పొయ్యి కాల్లూ, మొకం కడుక్కోని దాలబంద్రం మింద పెట్టిన బీగం దీసి యింట్లేకి పొయినా. సంగటి సట్లో సూచ్చే వొక ముద్ద సంగటుండాది. ఆదరాబాదరా వొట్టి మిరక్కాయిల వూరిబిండేసుకోని సంగటి తింటి. గబగబా పసల తలుగులిప్పి, డల్లాయ్యొంక సాయి తోల్నా. వొంకకట్టెక్కి సూచ్చే, మాలాడ్లో పసులన్నీ ఎట్ట బొయినాయో! వురువు పత్తా లేవు. కట్టకి దిగుదాల మాలోడి కయ్యిల్లో పసిరిక పచ్చంగా కంటికి నవురుగా కనబడితే అట్ట మల్లిచ్చినా పసల్ని. ఆ చేలల్లో గెనాలకి గెరికి పోసలు పచ్చంగా వుండె. మా పసులు సచ్చిమో, బతికితిమో అంటా గెడ్డి పోసల్ని పరపరా పెరుకుతా మేచ్చా వుండాయి. అప్పిటికే తుమ్మానిబాయి కాడ తూరుపు తట్టు రాగి చెట్టు చేలో గుర్రమ్మోల్ల గంగిరెడ్డిగిత్తలు మేచ్చావుండె. దూరంగా బాట మల్లి చెట్టు కింద కుచ్చోని ఎవుర్తోనో మాట్లాడ్తా, అరువులు జేచ్చా వుండిన గంగిరెడ్డి నన్ను జూసి, ‘ఏమొరే… సిదగరీ…! సిదిగేది ఐపాయెనా…? పసలకాడికి దిగినావె… సేద్దిగాడిగా…? అనె ఎక్కిసంగా. నేనేమి మారు పలక్కుండా, వోల్లకి ఎడంగా రూంత దూరంలో యాపచెట్టు కిందకి పోతావుండా నీడ కోసరం. నే పలక్కుండా పోతా వుంటే ఆయిన్ని బగిశీనం సేసినానుకున్నాడేమో! ‘బలే పొకండం గదరానీకు! పిలుచ్చాంటే పలక్కండా పోతాండావు.’ అనె నన్ను వొదలకుండా, మల్లా గంగి రెడ్డే ‘ఐనా మీ తగ్గు జాతోల్లకే రా వుజ్జోగాలు! ఆనా కొడుకు గవుర్మెట్టోడు మీ మాలా, మాదిగోల్లనే సూచ్చారు. మీ మెట్టేటే బాగుంటా దంట వోల్లకి’ అని అదేమో బలే కుశాల మాటయినట్టు కిలారిచ్చా నవ్వుతా వుండె పెద్దంగా. ‘వోణ్ని పానీ రెడ్డా! ఏం పని మనికి’ అంటా వుండారాడెవురో. అయినా మా వూరోల్లంతా యింతే…! ఏమాటైనా ఎట్ట దిరిగీ, కులం కాడికే తెచ్చి, యీనంగా అగుమానం సేసేది బలే అలవాటు యీల్లకి. వోల్లతో వొకటి మాట్లాడితే తక్కువ, రొండు మాట్లాడితే ఎక్కువ. ఈ యవ్వారం యాడికో పోతాదిలే సోమీ అనుకోని గమ్ముగా వుంటి.
అప్పుటిదాంకా గెనింవార బెమ్మేడి సెట్లసాట్న మేచ్చా వుండిన గంగిరెడ్డిగిత్తలు, మాపసల్ని సూచ్చానే తోకమిటారిచ్చి బుసగొడ్తా పరిగిచ్చె. వూరికీ, మాలాడకి శానా దూరం వుంటాది కదా నేనెప్పుడూ చూళ్లా వోటిల్ని, ఈ నడమనే సేద్దానికి పట్టకొచ్చినట్టుండాడు గంగిరెడ్డి. వోల్ల రొండు గిత్తలూ ఆవు మొకం యేసుకోని, చెండనే మాటే లేకండా, గూనొంపుగా బలే తమాసగా వుండాయి. మా పసరాల్లో పెద్దావు, రొండు తరుపులే. యింక బుడ్డగిత్తే పోట్లాడే ఎద్దు. గంగిరెడ్డి రొండు గిత్తలూ బుడ్డగిత్త సాయిల బుసపెడ్తా వొచ్చా వుండె. అయ్యట్ట పరిగిచ్చేది సూసి ‘వోన్నా…! పోట్లాడతాయాన్నా మీ గిత్తలు’ అంటి వోటి వూపు జూసి. గంగిరెడ్డి యికారంగా నవ్వుతా ‘లేదురో! పోట్లాడవు, మీ గిత్తల్కి సక్కలిగిలి పెట్టనొచ్చాండాయిరా’ అని ఎగతాలి పడె. వోటల్ని అదిలిచ్చి, నిలవరిచ్చేలోగానే – రొండు గిత్తలూ బుడ్డగిత్తమింద పడిపాయా! అయి రొండూ యిరువల్లా పొడుచ్చాంటె బుడ్డగిత్త ఎల్లకితలా పడిపాయ. పడిందాన్ని పడ్నట్టే కుమ్ముతాండాయా చిత్తనాపి గిత్తలు. యిది సూచ్చా బాట మల్లికింద మనుసులు లేసి నిలబడుకోని పెకాటిచ్చి నవ్వుతాండారు. గంగిరెడ్డికయితే వొల్లుమింద గుడ్డే నిలబల్లా తువ్వాలెగరేసి వూలలేశె. కింద పడిన బుడ్డగిత్త ‘అంబా… అంబా…’ అంటా బెబ్బరగొట్టుకుంటా అరుచ్చా వుండినా, యిడ్సకుండా ఆ మిడిమాలం గిత్తలు కుమ్ముసుద్దంగా పొడ్సినాయి. వాటేటుకి తట్టుకోలేక, ఎట్నో కట్టా లేసి పరిగిచ్చాపొయి తుమ్మాని బాయికాడ యినపకంచి ఎగ్గిరి దూకి దెసందార్లసాయి పరిగిచ్చా ఎట్టబాయినో బుడ్డగిత్త కంటికి కనబడకుండా. పెద్దావు, తరుపు దూడలు తలావొక దావన చెల్లాచెదురయి పొయినాయి. బయింతో బెదురుకోని పరిగిచ్చా పొయ్యే బుడ్డగిత్త ఎనకాల్నే రూంత దూరం రిక్కేచ్చా, ఎంబడిచ్చినా గాని అది బెదిరి పొయ్యి వుండిందాన, వొడిసి లొంకలో దిగి సెట్ల జీబులో దూరి జాడే లేకండా పొయింది. దాని పాణానికి రొండు గిత్తలు సుట్టుకొనే తలికి బుడ్డగిత్తకి దిక్కే తెలీకపాయ…! బుడ్డగిత్త పరిగిచ్చేది సూసి పక్క చేలో పన్జేసుకుంటా వున్న గొల్లోల సినబక్కాయిన ‘మాల్నాయాలా..! నీ గిత్తెంత, నువ్వెంత? గంగిరెడ్డి గిత్తలమిందికి వొదుల్తా? కండ్లు కనపల్లావాయ్…! యిప్పుడు జూడు గంగిరెడ్డి గిత్తలు దెంగేతలికి పరారయి పొయింది నీ బుడ్డగిత్త’ అంటా అన్నాయంగా తిట్టె. ‘ల్యా సోమీ! వోల్ల గిత్తలే వొచ్చి కుమ్మినాయంటే’ యినిపిచ్చుకోకండా ‘ఛా…! పో… మల్లా ఎదురు మాట్లాడ్తా వుండావే…! ఈడ నాగిరెడ్డి గిత్తలుండాయని తెల్సిగుడకా ‘నేంన్ర’ మేపడానికి తోలకచ్చినా మాలాణ్నించీ ఎంత దయిర్నంరా నీకు’ అంటా కోపంగా కసిరె. అదేమి కరమ్మోగాని మేమంటే యీల్లకి బలే సులకన. ఎదురు మాట్లాడినామంటే యిరుడ్డంగా కొట్లాడతారు. పైనబడి కొట్టనయినా కొడ్తారు. పైగా చేలల్లోకి చెట్టల్లోకి రానీకండా బిగేచ్చారు. సెంటు బూమి లేని మేం పసలెట్ట మేపుకోవాల. ఎట్టబతకాల. యిట్టుంటాయి ఈల్ల న్యాయాలు.
మా పసల్ని మలేసుకోని, యింటికాడ కట్టేసి బుడ్డగిత్తను ఎతకను పొయినా, వొడిసిలొంక వారంబడీ, చెవ్వోల్ల మాడితోపు, వొడ్లోల్ల బాయి, వొంటోల్ల చేలూ అంతా ఎతికినా యాడా కనపల్లా బుడ్డగిత్త. పొద్దు గూట్లో పడేయాలకు దెసందార్ల దగ్గిర యింటికొచ్చే దావన కుంటుకుంటా వొచ్చావున్నింది బుడ్డగిత్త. దాన్ని సూచ్చానే నాకు పాణం పెరుక్కోనొచ్చింది. దెగ్గిరికి పొయ్యి దాని పెయ్యంతా నిమిర్నా. దాని ఎనక్కాలు దెబ్బ తగిలి మెత్తబడినట్టుండె… చిన్నంగా నడిపిచ్చుకోని యింటికి తోలకొచ్చినా. ఆ రేతిరి నన్ను మాయన్న మాంతంగా తిట్టె. అనావశింగా పోట్లాట పెట్టి బుడ్డగిత్తకి ఆగతి పట్టిచ్చినానని. సూదులేపిచ్చి, ఆకుపసుర్లు రుద్దీ కన్నగసాట్లు పడినా… అది కాలు మోపుకోని నిలబడ్డానికి వారం దినాలు బట్టె. పాపం బుడ్డగిత్త సచ్చిబతికినట్టాయె. నాకు పడిన తిట్లూ, దాని పాట్లూ జూసి పొద్దు పొద్దు గాచ్చారంగదా యిది అనుకుంటి.
ఆ రేత్రి బుడ్డగిత్తకి వైదిగం చెయ్యను మా యింటికొచ్చిన రెడ్డిగోడు మాట్లాడ్తా ‘అయ్యిబలే ముండమోపి గిత్తలు సోమీ!’ అనె బుడ్డగిత్త కాలికి పసురు పూచ్చా. రెడ్డిగోడు మాలాడ్లో పిల్లోడే. వోడికీ పసులుండాయి. మంచిసేద్దిగాడు. గంగిరెడ్డి గిత్తల సంగతంతా తెలిసిన రెడ్డిగోడు ‘అసలికి వోల్ల రొండు గిత్తలూ వొగటేసారి మోటు కోవు మావా! వొగటి పోట్లాడ్తా వుంటే యింకొకటి మేతమేసినట్టు సుట్టూకారం తిరుగుతా వుంటాది. ఎప్పుడు కాడిగిత్త మెత్తబడి ఎనక్కి తగ్గుతాదో, అప్పుడు రెండోది కలబడతాది. యిట్ట వొగటి మార్చి వొకటి అలుపు తీర్చుకుంటా ఎదరగిత్తని వూపిరాడనీకుండా కుమ్ముతాయ్ సోమీ’ అని వోటిలి మోసమంతా యిడమరిసి చెప్పె రెడ్డిగోడు. ‘ఏమోరా నాయాలా…! ఈ పొద్దుమటుకు రొండూ కలబడి బుడ్డదాని వూపిరి తీశె. అంటిన్నేను. వోడు నవ్వుతా ‘బుడ్డగిత్త అదవగా కనబడింటాది మావా! అయినా బలే మోసకారి గిత్తలయ్యి జాగర్తగా వుండాల సోమీ మనం’ అని అయ్యి తిరిగాడే జాగాలో పసల్ని ఎట్ట కనిపెట్టుకోనుండాలో చెప్తా వోల్ల యింటిసాయిల యలబారి పొయినాడు.
అది సుతా! నెల దినాల దాకా ఆసాయిలకి పసల తోలకపోలా నేను. అట్టాంటిది వొకనాడు మాలాడు పసలతో మందగా పొయినాం మాళింగు బాయికాడికి. ఎవుర్దో చేను సుట్టూ కంచి కట్టి వొదిలేసిండారు. ఆ పైరు పంటా లేని చేలో మోకాటెత్తుండాది గెడ్డి. ఆ బీట్లో తోలినాం పసల్ని. అయ్యి బలే సగిచ్చినట్టు మేచ్చా వుండె. తొట్టిబాయి కాణ్నించి మడవ ఎగేసుకోని, వోల్ల చేని కాడికి పోతాండిన గంగిరెడ్డి నన్ను జూసి ‘‘ఏమిరో! మొన్న సాల్లా! మల్లా వొచ్చినావె ఈ తట్టుకి’ అని కళ్లెగరేచ్చా ఎగతాళి పడె. వోర్నాయినా బుద్దినేరక వొచ్చినే ఈ పక్కకి అనుకుంటి. వోల్లగిత్తలు యాడుండాయిరా సోమీ అనుకుంటా సుట్టూ సూసినా కనుచూపు మేరా యాడా కనపళ్లా. మొన్నటి దెబ్బకి అదురుపొయి న్నేను బుడ్డగిత్త పగ్గం వొదల్డమేల్యా, పగ్గం పట్టుకొనే మేపుతాండా. పసలకాడి పిల్లోల్లు నరిసిమ్ములు, రెడ్డిగోడు, గంగడు, తేజిగోడు, గంగాదార యింకా మాదిగిండ్ల పిల్లోలంతా మాళింగుబాయి కావల్ల తెరపలో పేడాపుర్రి ఆటాడ్తా, పెద్దపెద్దంగా కేకలేచ్చా కేరింతలు కొడ్తా వుండారు. ‘ఆ గిత్తనాడ యిడిసిపెట్టి రా మావా…! పేడా పుర్రి ఆడ్దాం’ అంటా నన్ను పిలుచ్చా వుండారు. దిగుదాల బాడవలో వుండే తువ్వ సేలల్లో మాదిగిండ్ల ఆడోల్లు గెడ్డి దోక్కుంటా వుండారు. కలబంద కంచి కింద అలుం బలే వుండె. కంచి వారంబడీ మేపుతాండా బుడ్డగిత్తని.
‘యేటి గట్టున యాప చెట్టూ ఎన్నేలాయిలో
అది పూతరేగి కాపుకొచ్చా ఎన్నేలాయిలో’ అంటా పాట యినపడె. మాదిగిండ్ల ఆడోల్లే గెడ్డి దోక్కుంటా పాడ్తా వుండారు. ఎవురా! యింత నాణెంగా పాడేదని తలనిక్కి సూచ్చి. ఆదిలచ్చక్కే కోకీల గొంతుతో బలే పాడ్తా వుండాది. సూసేదానికి వొక్కలా ముక్కలా తిక్కపాడోల్లాల వుంటారు గానీ వోల్ల పాటల్కి అద్దులు లేవు. గొబ్బెమ్మ పాట్లేమి, యాల పాట్లయితే ఏమి నిజ్జంగా మాదిగిండ్ల ఆడోల్లు గొంతెత్తి పాడితే యిచ్చులూ పచ్చులూ ఆలకించాల.
ఆదిలచ్చక్కయితే గొబ్బెమ్మ తడతా,
‘గొబ్బీయాలో ఏడూగూరన్నా దమ్ములు ఎద్దల బేరం పోయిరీ గొబ్బీయాలో’ పాట పాడితే ఎంత కటీనులయినా ఏడ్సాల్సిందె. నాట్లు ఏసేటప్పుడూ, కలుపు తీసేటప్పుడూ కోతల కాలానా యీల్ల పాటల్తో మడికయ్యిలంతా పులకరిచ్చి పోతాయి. ‘తొణుకులాడ్తా నిండుగా పారే కాలవల పక్కన, పచ్చంగా వుండే గెనాల మింద తెల్లాటి కొంగలు బేరుగా నిలబడింటే, యీల్ల పాటలు యినడం కోసరమే అయ్యట్ట నిలబడింటాయా’ అనిపిచ్చాది. దూరా బారం దావన నడిసి పోతావున్నా పాటే ఈల్లకు తోడు. ఎంత కష్టిం జేచ్చా వున్నా, పాటల్తోనే ఆ కష్టాన్ని దాటేచ్చారు. నేం గూడా పాటలు పాడ్తానని ఆ యక్కోల్లకి నేనంటే యిష్టంగా మాట్లాడతారు. ఆదిలచ్చక్క పాటయి పొయినట్టుండాది. ‘నువ్వుపాడు మే… నువ్వు పాడుమే…’ అంటా నవ్వు కుంటావుండారు.
‘వోక్కా…! యింగొకటి పాడుక్కా…! అని నేను గెట్టింగా అరిసి సెప్పినా. ‘ఎవురాడ’ అంటా కంచి కిందనిలబడుకోనుండే నన్ను జూసి ఆదిలచ్చక్క ‘వో నాయినా…! సినబ్బీ! ఆడుండావేమి దాంకోని… దగ్గిరికి… రా నాయినా’ అంటా చేతులూపుతా పిలుచ్చాండాది. ‘నేనీడ ఎద్దును మేపుతాండా లేక్కా మల్లా వచ్చా’ అని కేకేసినా. బుడ్డగిత్త యియ్యేమీ పట్టనట్టు గమ్మున మేచ్చా వుండె. పరంటగా పొద్దు గూట్లో పడేదానికి పరిగిచ్చా వుండె.
పాటల గురించి ఆలాసిన జేచ్చా, వొక్కరవ్వ యామారినా. ‘నా ఎనక తట్టు ఏందబ్బా కలకలంగా వుండాదే’ అనుకుంటా తిరిగి సూసినా. యింకే ముండాది కొడకా! నా గుండెల్లో రాయి పడింది. యాణ్నుంచి వొచ్చినాయో గంగిరెడ్డి గిత్తలు వుగిత్తలగా పరిగిచ్చి, మా పసల మింద పడి మాలాడు ఎద్దల్ని పిచ్చిపట్టినట్టు తరిమినాయి. గిత్తలన్నీ చెట్టుకొకటి, పుట్టకొకటి చెల్లాచెదురుగా పొయినాయి. ఆ రొండు గిత్తలూ చేని నడీ మద్దెలో దెయ్యాలాల నిలబడి కాలు జివిరి దరిణి దద్దరిల్లేటట్టు ‘ఖణీ… ఖణీ…’మని రంకిలేచ్చా వుంటే… బుడ్డగిత్త చేతల్లో నిలబల్లా పగ్గం పెరుకుతా తొక్కు లాడతా వుండాది. చెల్లాచెదురుగా పొయిన పసల్ని మలేసుకుంటా మాలాడు పిల్లోల్లు ‘యిడుసు మావా! బుడ్డ గిత్తని, ఏంది ఆలాసిన జేచ్చాండావే.. ఆ పొద్దు గాదు బుడ్డగిత్తను తరమను యిప్పుడు సూజ్జాం యీటి కతేందో! అంటా వుండారు. గంగిరెడ్డి గిత్తలంటే అందరికీ కసిగా వుండాది. వోల్ల వుసారు బాగానే వుండాది గాని నాకే దయిర్నం సాల్లా. పోట్లాటంటే మనికి మటుకు తమాసగానే వుంటాది గాని, పోట్లాడే గిత్తలకి తెలుచ్చాది వోటి సావు. ముకుతాడు తెగిపొయ్యి, లోదెబ్బలు తగిలి, దొమ్మలు కుల్లిపొయ్యి, కొమ్ములిరిగి నెత్తర కార్తా సూసేదానికి బయికారంగా వుంటాయి. వొక్కక్కసారి బంగారట్టా ఎద్దులు గూడా కాల్లిరిగి పొయ్యి, సేద్దానికి పనికిరాకుండా కోతకి పోతాయి. ఆ కడుపుమంట అలివికాన్ది. ఏమైనా గాని ఈ పొద్దు మటుకు వోటి పొకురు అణసాల. బుడ్డగిత్తని పోట్లాటకి వొదలాల్సిందే అనుకుంటి. రొండు గిత్తలూ వొగటేసారి కలబడితే బయింగాని, వొక్కక్కటిగా వచ్చే వోటల్ని బుడ్డగిత్త పుట్టాచెండు ఆడ్తాదని పసలకాడి పిల్లోలందరికీ తెలుసు. మునుపు వోల్లు సూసిన బుడ్డగిత్త శౌర్రిం అట్టాంటిది.
గంగిరెడ్డి యాడుండాడోనని పొద్దు తిరుగుడు చేని సాయిల సూసినా, ఎత్తుగా పెరిగిన చేలో మనిసి అయిపే కనపల్లా. రోజూ వోల్ల గిత్తలకి ముకుతాడ్లో పగ్గాలిప్పి మేతకి యిడిసిపెట్టే గంగిరెడ్డి, ఈ రోజనంగా వోటిలికేందో శని ముసిచ్చినట్టు పగ్గాలిప్పకుండానే యిడిసి పెట్టుండాడు. సరే నేనొక వుపాయం జేసి బుడ్డగిత్త పగ్గాన్ని తేజిగాణ్ణి పట్టుకోమని, పరిగిచ్చా పొయ్యి గంగిరెడ్డి తెల్లగిత్తని పగ్గం పట్టుకోని కంచికాడ యాపచెట్టుకి కట్టేసినా. తేజిగాడిని కేకేసి ‘యింక వొదల్రా బుడ్డగిత్తని’ అన్నా. తేజిగాడు బుడ్డగిత్త ముకుతాడ్లో పగ్గం యిప్పి ‘పారా కొడకా! ఎట్ట జేచ్చావో వూరి గెమిటిదాంకా తరమాల’ అంటా వొదిలేసినాడు. బుడ్డగిత్త బుసకొడ్తా వొచ్చి గంగిరెడ్డి పుల్లగిత్తని మోటుకునింది. అదెంత వూపుగా వొచ్చిందంటే…! దాన్దెబ్బకి పుల్లగిత్త అట్నే పదిరింది. అది బలే బలమైన గిత్త, కాల్లు నిల్దొక్కుకోని పోట్లాటకి మల్లుకునింది. మాలాడు పసులన్నీ యీటి సుట్టూ సుట్టూకారం తిరుగుతాండాయి తోకలు మిటారిచ్చి. అయి రొండూ కొమ్ములు మోటిచ్చి ‘టకటకామని’ కుమ్ముకుంటా వుండాయి. దానేటుకి బుడ్డగిత్త కాల్లు తడబడతా వుండాయి. అయినా అది కొండ మాదిరుండె. దానిముందు పిడికిలంత వుండె బుడ్డగిత్త. అయినా గాని బిర్రొదలకుండా తట్టుకోని పొడుచ్చాండాది. వోటిలి కాల్లకింద మట్టిపెళ్లలు దుమ్ముదుమ్ము అయిపోతాండాయి. పుల్లగిత్త దాటీకి తట్టుకోలేక ఎనక్కెనక్కి మాళింగుబాయి గడ్డ మిందకి పోతాండాది బుడ్డగిత్త. గడ్డ ఎనకనే బాయిండాది. ఎప్పుడ్డో అది పాడుబడిన బాయి. దాంట్లోగనా గిత్తలు పడ్నాయంటె పిసురు దొరకదు. నా కండ్లు బైర్లు కమ్ముతాండాయి. వొల్లు సోదీనం తప్పి పోతాండాది. ‘సోమీ తల్లీ!’ మొన్నటాల బుడ్డగిత్త ఎనక్కి ఎల్తే బాగుంటాదని గురప్ప సోమికి దండం పెట్టుకున్నా. కానీ, బుడ్డగిత్త వుమాదం పట్టిందానాల పోట్లాడ్తా వుండె. గెడ్డిదోక్కునే ఆడోల్లు, పసలకాడి పిల్లోల్లు కటవలు గట్టినారు. వూపిరి బిగబట్టి కన్నార్పకుండా సూచ్చాండారు. ఆడోల్లయితే ‘చ్చొ… చ్చో అయ్యో కొడకా! ఆరాచ్చేసి గిత్త చేతల్లో కసురుగాయ గిత్త బతుకుతాదా’ అంటా దిగులుగా మాట్లాడ్తావుండారు. మాదిగోల్ల రామన్న నా దగ్గిరికొచ్చి ‘ఆ పోట్లాడే బుడ్డది మీదేగదా సినబ్బీ!’ అనే. ‘మాదేన్నా’ అన్నా. ‘నీకేమన్నా… మతి చెడిపొయిందాబ్బీ…! వోల్ల గిత్తలు పాణం పొయినా పోట్లాట యిడిసిపెట్టవే’ అన్నాడు. నాకు బయిం చెప్తా. గుంపు జనాల్లో ఎవురో ‘గంగిరెడ్డి గిత్తలకి ఎదురు నిలబడేదే ల్యాకంటే, యిదేంది వుసిరిక్కాయంత వుండాది. బలే వులగరంగా పోట్లాడ్తా వుండాదే’ అంటా వుండారు. ఆ రొండు గిత్తలూ వొకదాన్నొకటి నెట్టుకుంటా గడ్డ ఎగవకి పొయినాయి. అంతా అయిపొయింది! ఆ రొండు గిత్తలూ బాయిలో పడేది కాయిం అనుకున్నా. నా గుండికాయిలు నీల్లయిపొయినాయి. వోటిల్ని అదిలిచ్చి, ఎణంగా తోలేదానికి ఎవురికీ దొమ్మలు సాల్లా…! అందురూ హేయ్… హేయ్… హో… హో.. అని అరుచ్చాండారు. అంతే! ఎనక్కెనక్కి పొయ్యే బుడ్డగిత్తకి అంతశగితి ఎట్టొచ్చిందో గాని, టక్కన నిలబడి మోకాటి తుండేసి పుల్లగిత్త జబ్బలకింద కుమ్మింది. ఆ దెబ్బకది బొల్లుకుంటా బొల్లుకుంటా గెడ్డదిగువకొచ్చి పడిరది. తెపరాయిచ్చుకోని లేసి ‘గువ్వగదా వుచ్చులు తెంపుకోని పొయినట్టు’ వూరి దావ బట్టి పరిగిచ్చా పోయా….! సూసేవోల్లంతా గంగనా గోలగా కేకలేచ్చా వుండారు. నాకు బలే దయిర్నం వొచ్చింది. అప్పుడు కంచికి కట్టిండే గంగిరెడ్డి రొండో గిత్తని పగ్గం వొదిల్నా. అప్పిటికే బాయిగడ్డ నిండీ కిందికి దిగిన బుడ్డగిత్త దాని సుదూటి కొమ్ముల్తో యాడంటే ఆడ గాట్లు గాట్లుగా, నెత్తర చిమ్మేటట్టు చెలిగిపార్దెంగె. అది తట్టుకోలేక తొలీ గిత్త పరిగిచ్చినట్టు, యిది గూడా వూరిదావ బట్టి కనపడకుండా పాయ. పసలకాడి పిల్లోల్లు ‘సైరా… కొడ్కా..!’ అంటా వూలలేచ్చా, పైగుడ్డ లెగరేచ్చా ఆగ బోగంగా అరుచ్చా వుంటిరి. దూరంగా చేనికి నీల్లు గట్టుకుంటా వుండిన గంగిరెడ్డి యిదంతా జూసి ‘వోర్నా కొడకల్లారా…! ఎద్దల్ని వోగు బట్టిచ్చినార్గదరా…! పోయ్‌రా… గిత్తలు’ అంటా వాటెనకంబడే పరిగిచ్చా వుండె. ‘అదేందియో…! మాలోల్ల గిత్త దెబ్బకి, వూల్లోల్ల గిత్తలు పరిగిచ్చాండాయే పాపం’ అంటి ఎగతాలి జేచ్చా. గంగిరెడ్డి కండ్లు మిటకరిచ్చి సూచ్చా ‘వుండండ్రా కొడకల్లారా…! యిప్పుడు గాదు మీ కతా…! అంటా బెదిరిచ్చా పోతావుండె.’ పో.. పోయ్యా…! నీ గిత్తల్ని ఎతుక్కో పో… అయి బొయ్యి యాడ మాదిగిండ్ల మడుగులో దూకబోతాయో…! అని ఔలయిగా అరిసినా.
దానెక్కా కొడుకు బుడ్డగిత్త పోట్లాటకి మోటుకునిందంటే పాణం పొయినా ఎనక్కి తగ్గేదేల్యా..! అదెంత పెద్దగిత్తయినా సరే తలకాయీడమే. అది పోట్లాడ్తా వుంటే కండ్లూ, కాల్లూ చల్లబడతాయి. ఆ పొద్దు రొండు గిత్తలూ కలబడే తలికీ, దిక్కు తెలీకపాయగానీ, ఈ పూట యిడియిడిగా వొదిలేతలికి రొంటినీ తరింతరిం పొడిశా బుడ్డగిత్త. నాకు బలే కుశాలయిపొయింది. బుడ్డగిత్త సాయి జూసినా, అది గెంతులేచ్చా ‘అంబా…’ అని అరుచ్చా దానెమ్మ కాడికి పోతా వుండె. అదట్టా ‘అంబా…! అని అరసడమే గాని కాల్లు జివుర్తా… ‘ఖణీ… ఖణీ…’ మని రంకేసేది దాని జలమలో రాకపాయా…!

పుట్టా పెంచల దాస్
పుట్టా చలం దాస్, పెంచలమ్మ దంపతులకు జన్మించిన జానపద కళాకారుడు పుట్టా పెంచల దాస్ అన్నమయ్య కడప జిల్లాకు చెందిన వారు. చాలా తక్కువగా రాసే పెంచల దాస్ చిత్రకారుడు, గేయ రచయిత. సినిమాలకు స్వయంగా పాటలు రాస్తున్న ఈయన మంచి గాయకుడు కూడా.