కలైడొస్కోప్‌ని తెలుగులో చిత్రదర్శిని అనవచ్చని నిఘంటువు తెలిపింది. అది మన కళ్ల ఎదుట నిలిపే అద్భుత దృశ్యాలను విస్తుపోయి చూస్తూ, చిన్నతనంలో మనలో చాలామంది గంటల తరబడి ఆడుకున్న సాధనం. అందులో ఏముంటుంది? విరిగిన పెంకులూ, పగిలిన గాజుల ముక్కలూ, మహా అయితే నాలుగు బియ్యపు గింజలూ – ఇవే కదా? సదా కొత్త కోణాలను సంతరించుకుంటూ, ఎప్పటికప్పుడు విభిన్నమైన ఆకృతులను దాలుస్తూ, జీవిత వాస్తవికతలను వెంటాడే దృశ్యాలుగా ఆవిష్కరించే చిత్రదర్శిని – ఈ కథల సమాహారం. 2024 డిశెంబరులో ప్రచురితమైన 160 పేజీల ఈ చిన్న పుస్తకంలో 20 కథలున్నాయి. అన్నీ ఇంతకు ముందు ఎక్కడో వెలుగు చూసినవే; నిడివిలో చిన్నవేగానీ, సారంలో లోతైనవి, వైవిధ్యతను కలిగినవి. మనకు తెలియని జీవితాల లోతుల్ని మన కళ్ల ఎదుట నిలబెట్టేవి. ఇందులోని మూడు కథలను గురించి ముచ్చటించుకుందాం.
ఈ శిక్ష మాకొద్దు
మొదటి కథ, ‘ఈ శిక్ష మాకొద్దు’నే తీసుకుందాం. మరణశిక్షను రద్దుచెయ్యాలని కోరుకొనేవాళ్లూ, ఉద్యమించే వాళ్లూ చాలామందే ఉన్నారు; ఎన్నో దేశాల్లో అది రద్దయింది కూడా. ఇది కొత్త విషయం కాదు. అయితే ఈ కథకుగల ప్రత్యేకత – ఆ శిక్షను అమలుపరచే దురదృష్టవంతులైన తలారుల కుటుంబపు వెతలను వెలికితీయడంలోనే ఉన్నది.
అది తరతరాలుగా ఉరితీసే పనిలో ఉన్న ముస్లిం కుటుంబం. ‘ఆ ఒక్కరోజు పనికి పదివేలు ఇస్తాం కదరా?…ఎన్నిరోజులు అరటిపండ్లు అమ్ముకుంటే అంత మొత్తం వస్తుంది?’ అంటూ కబురుపెడతాడు, జైలు సూపర్నెంటు – వయసు పైబడ్డ తలారి జమాల్‌కి. కొడుకు ఇస్మాయిల్‌కి కులవృత్తిని అప్పగించి విశ్రమిద్దామంటే ఆ కుర్రవాడికేమో మనిషి ప్రాణం తియ్యాలంటే మనసొప్పదు.
ఖైదీ బరువును బట్టి ఉరితాడు నిడివిని నిర్ణయించడం, ముడికి మైనం పూయడం, బస్సు డ్రైవరు గేరు మార్చినంత సులభంగా లీవర్‌ని లాగడంతో బాధితుడు క్రిందికి జారిపోవడం, ఒకవేళ ఇంకా ప్రాణం మిగిలిపోతే కాళ్లుపట్టి గుంజడం – ఈ అంశాలను కొడుక్కి బోధించినా, ‘మెడపూసలు విరిగిన చప్పుడైతే, శ్రమ ఫలించినట్టే,’ అని ఉరితీతకు వెనుకనున్న సైన్సుని వివరించినా ఫలితం ఉండదు. ఎన్నాళ్లైనా ఇస్మాయిల్‌లో అదే జంకు. ఉరిశిక్ష పడ్డ ఖైదీలు అతని కంటికి మనుష్యుల్లా కనిపిస్తారు; ఇదే అతని అసలు సమస్య. ‘ఈ పని మీ స్టాఫ్‌తోనే చెయ్యించవచ్చు కదా?’ అని మేజిస్ట్రేటు చిరాగ్గా అడిగినప్పుడు, జైలరు తమ కష్టాలను వివరిస్తాడు. ఉరితీయబడే ముందు మనుషులందరి ప్రవర్తన ఒకేలా ఉండదుగానీ, ఎంతోకాలం దగ్గరగా చూసిన వ్యక్తులు కనిపిస్తారు జైలు సిబ్బంది కళ్లకి. ‘అసలీ మరణశిక్షను రద్దుచేసి పారేస్తే…?’ అని విసుక్కుంటాడు మేజిస్ట్రేటు.
ఈ ఎనిమిది పేజీల కథని వ్రాయడానికి ఎంత పరిశోధన, పరిశీలన అవసరం అయి ఉంటాయో అనిపిస్తుంది. ఫలితంగా వెలువడ్డ కఠోర వాస్తవికత (Stark Realism) కథా రూపంలో మన హృదయాలను బాధిస్తుంది. సున్నితమనస్కులైన పాఠకులు మరణశిక్ష రద్దుకావాలనే కోరుకుంటారు – ఈ కథ చదివాక.
కూటి విద్యలు
1990ల నాటి ఆర్థిక సంస్కరణల తరువాత పబ్లిక్ రంగం కుంటుబడింది; ప్రైవేటు రంగం పుంజుకుంది. తక్కువ పెట్టుబడితో, రిస్కులేని తక్షణ లాభాల వేట మొదలైంది. అలనాటి ఐటీ రంగంతో మొదలుకొని పారిశ్రామికోత్పత్తి కన్నా సేవారంగం, ఊహించని రీతిలో వృద్ధి చెందింది. నేటి అమెజాన్, ఊబెర్, ఓలా, జొమాటో, స్విగ్గీల వ్యవస్థలో – ఉత్పత్తి కన్నా పంపిణీ, లేదా సేవా వ్యవస్థపై ఉద్యోగావకాశాలు కేంద్రీకృతం అయ్యాయి. పెద్ద చదువులూ, నైపుణ్యం, విస్తారమైన అనుభవం అవసరంలేని యువతరానికివి మంచిరోజుల్లాగానే కనబడచ్చు. కానీ దీర్ఘకాలిక నియామకాలు దాదాపుగా అంతరించిపోయాయి. ఎవరైనా ఎప్పుడైనా ఒక పనిలో చేరవచ్చు, లేదా విరమించుకోవచ్చు. దీన్నే ‘గిగ్ ఎకానమీ’ అంటున్నారు. యాజమాన్యానికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, గ్రాట్యూటీ, పీఎఫ్, పెన్షన్ల బాధ్యత తొలగిపోయింది. చాలా చోట్ల ఉద్యోగులకై సదుపాయాలు, ఆఫీసు భవంతులు అవసరంలేకుండా పోయాయి. అన్నింటికీ ఏప్‌లు, గూగుల్ మ్యాపులు, ఓటీపీలు. ఇప్పుడు కొత్తగా ఏఐ భయం. అంతటా అనిశ్చిత, అభద్రత. ఇందుకు తోడుగా యువతరంలో నిరుద్యోగం పెరిగిపోయింది. పెట్టుబడిదారీ వ్యవస్థ కోరుకొనేదీ, కలలుగనేదీ ‘వాడుకో, వదిలేయ్’ వ్యవస్థ కోసమే.
వినిమయతత్త్వం (Consumerism), అలాగే ‘సరకుల మాయ’ (Commodity Fetishism)ను శంకించిన మార్క్స్, అది పరాయీకరణకు (Alienation) అనగా ఉత్పత్తి క్రమం నుండి కార్మికవర్గం దూరం కావడానికి దోహదం చేస్తుందని భావించాడు. మరి ఇప్పటి సేవారంగ విజృంభణలో ఉత్పత్తి అనేదే వెనకబడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ చారిత్రక నేపథ్యాన్నీ, ప్రశ్నలనూ, చర్చలనూ బాహాటంగా ప్రకటించకుండా నేటి ఉద్యోగరంగ అస్థిరతకు అద్దం పడుతుంది ‘కూటి విద్యలు’ కథ. ఈ కథలో గిగ్ ఎకానమీ తెరతీసిన వినిమయతత్త్వానికి, పరాయీకరణకు కొత్త దేశీయ పార్శ్వాల్ని నేర్పుగా జోడిస్తాడు రచయిత. అవి నేడు కట్టలుతెంచుకొని ప్రవహిస్తూన్న హిందుత్వవాదం, కాషాయీకరణలు. ఈ జోడింపే కథకు సమకాలీనతను, విశిష్టతనూ చేకూర్చింది.
ఊరూరా తిరిగే వ్యాన్‌లో (మొబైల్ టెంపుల్) కొలువైన వెంకటేశ్వరస్వామి, దర్శనానికి టిక్కెట్లు, కోరికలను శ్రీవారి దృష్టికి తీసుకురావడానికి చీట్లు కొనుక్కొని ఎగబడే భక్తులు సందడితో మొదలవుతుందీ కథ. కలిసొచ్చే ‘స’ అక్షరంతో మొదలయ్యే ‘సర్వాంతర్యామి’ అనే ఆధ్యాత్మిక మాసపత్రికతో కథ ముందుకి నడుస్తుంది. భక్తుల ఆదరణకు, చందాదారులకు, వ్యాపార ప్రకటనలకు ఎన్నడూ లోటులేదు. ఇక తరువాత వచ్చేది అధ్యాత్మిక కార్యక్రమాలకు, పాప పరిహారాలకు ఆవులను అద్దెకు తిప్పే గోశాల వ్యాపారం. వీటన్నిటి వెనుకా ఉండే ‘సర్వాంతర్యామి’ ఒక్కడే. ఆయనవే ఈ ఆలోచనలు, రిస్కులేకుండా, తక్షణ లాభాలను అందించే ‘ఆధునిక’ వ్యాపార సాహసాలు. ‘ఈ కొత్త తరం పెట్టుబడిదారుడు ఎప్పటికప్పుడు విభిన్న వ్యాపారాలను చేబడుతూ తన ఆదాయాన్నీ, పరపతినీ పెంచుకుంటున్నాడా, లేక దయాగుణం వల్ల నలుగురికీ బ్రతుకు తెరువులు కల్పిస్తున్నాడా?’ కథకుడిని ఈ సందేహం పీడిస్తూనే ఉంటుంది, పాపం. ఈ కథకు హాస్యరసాన్ని జోడించి ఉంటే ఇంకా బాగా పండేదనిపిస్తుంది.
జానకి విముక్తి
గుడిసెలలో ఉంటూ, గస్తీ పోలీసులతో సహా నిత్యం నడిరోడ్డుమీద పొయ్యేవాళ్లందరి కళ్లల్లో పడుతూ, పొట్టకోసమని నానా అగచాట్లూ పడే సెక్స్ వర్కర్ల కథ ‘జానకి విముక్తి.’ వాళ్ల బ్రతుకులు దయనీయమైనవీ, దుర్భరమైనవీ అని మనకు తెలుసు. ఇప్పుడు వాళ్ల గురించి కొత్తగా తెలుసుకొనేదేముంది? అని అనుకొనేవాళ్లుంటారు. అయితే ఈ కథ కొత్తకోణాలను ఆవిష్కరించి, మనకు కనువిప్పు కలిగిస్తుంది. శరీరాలను అమ్ముకొనే వ్యవస్థ ఎంత హేయమైనదో, దాన్ని సృష్టించిన సమాజం ఎంత అమానవీయమైనదో మనకు బలంగా తెలియజేస్తుంది.
జేబులో చిల్లిగవ్వలేకపోయినా ‘ఫ్రీ-షో’ని అస్వాదించేవాళ్లూ, బైక్‌లపై చక్కర్లు కొట్టే కుర్రకారు, చివరికి నోటీసులు అందజేసే కోర్టు బంట్రోతుతో సహా – అక్కడికి వచ్చే మగాళ్లంతా వెకిలిగా నవ్వే వాళ్లే, జగుప్సాకరంగా ప్రవర్తించే వాళ్లే; మోటు ‘సరసాలు’ ఆడేవాళ్లే. ఏమిచేసినా, ఎలా ప్రవర్తించినా చెల్లిపోతుందనీ, అడిగే వాళ్లుండరనీ – వాళ్ల ధైర్యం.
వయసు పైబడ్డ జానకి విటులకు ఆకర్షణీయంగా కనబడేందుకై చేసే విఫల ప్రయత్నాలు మనల్ని కలచివేస్తాయి. తాగొచ్చిన విటులుకూడా, ఆ చీకటి గుడిసెలలో ఆమె అసలు స్వరూపాన్ని గుర్తుపట్టేస్తారు. తాను పడుపువృత్తిలోని చివరి అంకాన్ని చేరుకున్నానని జానకి గ్రహిస్తుంది. వాళ్లను పట్టుకుంటే పట్టుమని పది రూపాయిలు రాలవని పోలీసులకు తెలుసు; అందుకే ఆ అభాగ్యుల జోలికిపోరు. ఇక వారికి మిగిలినదల్లా రోడ్డునపడి అడుక్కోవడమే. గర్భం దాల్చి, బేరాల్లేక అల్లాడుతూన్న చెల్లెలు బ్రతుకును జానకి ఏవిధంగా సరిదిద్దింది? అదొక చేదు అనుభవం; కఠోర వాస్తవం.
ఎప్పుడో ఏభై ఏళ్ల క్రిందట చదివిన అలెగ్జాండర్ కూప్రిన్ నవల ‘Yama the Pit’ (తెలుగులో ‘యమకూపం’) గుర్తుకొచ్చింది, ఈ కథను చదువుతూంటే. అయితే రచయిత మనముందు ఉంచిన వివరాలన్నీ మన చుట్టుపక్కల నిత్యం జరుగుతూన్నవే; ఎక్కడో ఒడెస్సా (నేటి యుక్రేయిన్) రేవులో, ఎప్పుడో అక్టోబర్ విప్లవానికి ముందు జరిగినవి కాదు. ఇదే మన సమాజపు విషాదం. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. ‘యమకూపం’ నవలలో కూప్రిన్ చేసిన వాస్తవచిత్రణ మోతాదును మించిపోయిందనీ, సాహిత్యం అన్నాక అంత కఠోరంగా ఉండనవసరం లేదనీ ఆనాటి రష్యన్ విమర్శకులు వ్యాఖ్యానించారు.
ముగింపు
నగిషీలు, చమక్కులు, వివరణలు, సంజాయిషీలు లేని కఠోర వాస్తవికత కథా ప్రక్రియకు చక్కగా అమరిపోతుంది. ఈ కథల్లో జరిగింది కూడా అదే. ఈ రచయిత చెయ్యతిరిగిన వ్యాసకర్త, సామాజిక విశ్లేషకుడూ కాకపోయి ఉంటే ఈ కథలను ఇంత బలమైన వచనంలో, ఇంత పొదుపుగా, సూటిగా వ్రాయగలిగేవాడు కాదు. సామాజిక గతిసూత్రాల విషయమై రచయితకొక బలమైన దృక్పథం ఉన్నది. అన్నింటినీ మించి రావిశాస్త్రి మాటల్లో చెప్పాలంటే – ‘మంచికి హానీ, చెడుకి మేలూ చెయ్యకూడదు,’ అనే స్పష్టత ఉన్నది. నిజ జీవిత విషాదాల్ని ఆవిష్కరించే రచనలు, కళారూపాలు హాస్యాన్నీ, కవితాత్మకతనీ జోడిస్తాయి. ఈ సంగతి గొగోల్‌కి తెలుసు; చాప్లిన్‌కి తెలుసు; రావిశాస్త్రికి తెలుసు. కరుణతో కూడిన విషాదం, కసిని రగిల్చే హాస్యం – రాబోయే రోజుల్లో బద్రి నర్సన్ ఈ దిశలో ప్రయోగాలు చెయ్యాలని నా కోరిక, ఆశ.
ఈ సంపుటిలోని కొన్ని కథలు నవలలు, లేదా నవలికలుగా రూపు దిద్దుకోగలిగినవి. ప్రింటు మీడియా అమలుపరచే పరిమితులకు లోబడి వాటిని మరీ కుదించివేసారు. (చూడుము: ‘ఇద్దరు రాక్షసులు, మంచం కథ’). వీటిని ఛేదించేందుకై వెబ్-మేగజైన్‌ల వైపు దృష్టి పెట్టాలని రచయితలకు మనవి. అప్పుడే నర్సన్ వంటి రచయితలు తమలోని చరిత్రకారుడికీ, అధ్యయనకారుడికీ, సామాజిక విశ్లేషకుడికీ న్యాయం చేయగలుగుతారు. పాత్రలలోని పరిణితిని ఒడిసిపట్టుకొని పాఠకుల ముందు ఉంచగలుగుతారు. ఇది ఇతడి తొలి కథా సంపుటి గనుక రాబోయే రోజుల్లో ఇది సంభవమే. ఎక్కడి భూమి పొరలనుండి, సముద్రాల లోతులనుండి తేమను స్వీకరించాలో, ఎక్కడికి మోసుకుపోయి దాహార్తులకై వర్షించాలో ఈ రచయితకు తెలుసు. ఎందుకంటే ఇది ‘దారి తెలిసిన మేఘం’.

“పదేళ్లుగా పత్రికలకు రాస్తున్న నాకు కథలే తొలి ఇష్టం. యాభై వరకు కథలు రాశాను. ఇది నా తొలి కథా సంపుటి. పుట్టి, పెరిగిన ఊరు జగిత్యాల. ఓయూలో చదివి, బ్యాంకులో చేరాక భిన్న మనుషులను కలిసే, వివిధ ప్రాంతాలను చూసే అవకాశం నన్ను విషయ సంపన్నం చేసింది. నేను చదివింది, చూసింది, ఆలోచించింది, కథలుగా మలచాలనే ప్రయత్నమే ఈ కథలకు మూలం. విశ్రాంత జీవితం హైదరాబాదులో గడుస్తోంది.”

‘దారి తెలిసిన మేఘం’ పుస్తక పరిచయంలో 20 కథలు ఉన్నాయంటూ అందులోని కొన్ని కథలని క్లుప్తంగా పరిచయం చేసారు సుధాకర్ గారు. ముఖ్యంగా వ్యవస్థలో ఉన్న లోపాలు ఏంటో తెలుపడమే కాకుండా అందుకు ప్రత్యామ్నాయంగా, లాజిక్ గా వాటిని ఎలా ఎదుర్కోవాలో, ఎదుర్కొని ఎలా మనుగడ సాగించాలో కథల్లోని పాత్రల ద్వారా తెలియజేశారు రచయిత నర్సన్. సామాజిక విశ్లేషకుడు అయిన నర్సన్ కు ఇలాంటి మరెన్నో కథలు సృష్టించడం ఏ మాత్రం కష్టం కాకపోవచ్చు. కథ చదివితే పాఠకుడికి అదొక అనుభవం కావాలి, అనుభవంలోంచి అతడు పాఠం నేర్చుకోవాలి, అప్పుడే ఆ కథ సార్థకం అవుతుంది, అదే ఆ రచయితకు సంతృప్తిని ఇస్తుంది. సుధాకర్ గారు చివరగా ‘ఎక్కడి భూమి పొరలనుండి, సముద్రాల లోతులనుండి తేమను స్వీకరించాలో, ఎక్కడికి మోసుకుపోయి దాహార్తులకై వర్షించాలో ఈ రచయితకు తెలుసు. ఎందుకంటే ఇది ‘దారి తెలిసిన మేఘం’ అంటూ వాఖ్యానించడం అద్భుతంగా ఉంది. దారి తెలిసిన మేఘం రచయితకు, పరిచయకర్త సుధాకర్ లకు అభినందనలు. జి. గంగాధర్.