అధో లోకం – 2

Spread the love

సుబ్బమ్మ వీధిలో గొంతుకు కూర్చుని ముగ్గు వేస్తోంది. ఇంకా పూర్తిగా ఆరని జుట్టు ఆమె వీపు మీది రవికకు చెమ్మని చేరుస్తోంది. ఆమె పాదాలకు కళ్ళాపు పేడ అంటుకునుంది. ఓ మూలనుంచి ముగ్గు వేసుకొస్తోంది. పండారం ఇంటి ముంగిటికొచ్చి జాగ్రత్తగా ముగ్గుని తప్పుకుని లోపలికి నడుస్తున్నాడు. అతన్ని చూడగానే సుబ్బమ్మ చేతిలో ముగ్గుపిండి గిన్నెతో లేచి నిల్చుంది. తడిసిన జుట్టు తన నుదుటి మీద నుంచి వెనక్కి తోసింది. “అప్పా, కాన్పు అయ్యిందా?” అడిగిందామె.

“అయ్యింది. ఇబ్బందేవీ రాలేదు. అంతా ఆ మురుగడి కృప… తిరిపగొట్టు సామి, పళని మురుగన్, అంతా ఆయనే చూసుకుంటాడు.”

“ఈ ఏడు కూడా పళనికి పోతున్నావా, అప్పా?”

“ఆయన రమ్మంటే కాదనడానికి నేను ఎవరు?” అన్నాడు పండారం. “మీ అమ్మేదీ?”

“దోశలు పోస్తోంది.”

ఇంట్లో నేల మీద పండారం చిన్న కూతురు మీనాక్షి బోర్లా పడుకుని పుస్తకాలు చుట్టూ పరుచుకుని ఒక పుస్తకం ముందరేసుకుని మీనమేషాలు లెక్కిస్తోంది. “పళ్ళు తోమావా?” లోపలికి వెళ్తూ అడిగాడు.

“తోమాను” అందామె.

“నారాయణన్ వస్తానన్నాడు, వచ్చాడా?”

“లేదు. నాణు మామ కొడుకొచ్చాడు.”

“ఏందంట?”

“అమ్మకేదో చెప్పెళ్ళాడు.”

రెండో కూతురు వడివమ్మ ఇంకా నిద్ర లేవలేదు. కాళ్ళు బార్లా చాపుకోని తొలిగిన బట్టలతో నోట్లోనుంచి ఒక పక్కకి చొంగ కార్చుకుంటూ పడి గాఢ నిద్ర పోతోందామె.

పండారం చేతికర్ర గోడకానిచ్చిపెట్టి కంబళి పక్కన పడేసి ఒక్క పిసర ముక్కు పొడి పీల్చాడు.

“ఒసేయ్ రాక్షసీ, నిద్ర నించి లే! జేష్టాదేవిలాగా బారెడు పొద్దెక్కాక కూడా ఎట్టా నిద్ర పోతోందో చూడు. దరిద్రం! అశోకవనంలో రాక్షసిలాగా… లేస్తావా లేదా వేణ్ణీళ్ళు తీసుకొచ్చి పొయ్యమంటావా, లే!” అంటూ కేకలేసింది ఏక్కియమ్మ.

“పోమ్మా ఇంకా పొద్దెక్కలేదు” అంటూ మత్తు గొంతుతో నసిగింది వడివమ్మ.

“అవును, పొద్దే ఎక్కలా! నువ్వింకా నిద్ర పోతా ఉంటే పొద్దే ఎక్కదు నీకు. లే ముందు నువ్వు, దరిద్రపు జేజమ్మా” అంటూ పండారం వైపు తిరిగి, “నీ సరుకు ఏవయ్యింది, బిడ్డ చేతికొచ్చిందా?” అనడిగింది.

“అంతా ఆ కుమారసామి దయ’ అన్నాడు పండారం. “అసలు పొద్దన్నే నీకు నోట్లో మాటలు మంచియి రావా? ఎప్పుడుబట్టినా నట్టింట్లో నిలబడి పిల్లలతో దరిద్రపు కూతలు, శని, శకుని అనుకుంటా… అయ్యేమన్నా పూజ మంత్రాలా?”

“ఏం చేసేది, చూడు, అదెట్టా పడి నిద్ర పోతోందో, తోడేలు పిల్ల మాదిరి!”

“మొండిది కానీ పిల్ల బంగారమే!”

“ఏమో, అంతా ఆయనే చూసుకోవాల!” అంది ఏక్కియమ్మ.

“నేను స్నానం కానిచ్చి గుడికి పోతాను, ఎండొచ్చేసింది బయట!” అన్నాడు పండారం.

“నారాయణన్ మధ్యాహ్నం వస్తానన్నాడు.”

“సరే!”

వడివమ్మ మళ్ళీ ముసుగు తన్ని పడుకుంది. అందరికంటే చిన్నది మీనాక్షి, సైన్సు పాఠం కంఠతా పడుతోంది, “కార్బన్ డయాక్సైడ్ సాంద్రత కల వాయువు. అది..” తలెత్తి పండారం వైపు చూసిందామె. “అప్పా, సరుకు పిల్లని పెట్టిందా?”

“ఊ, పెట్టింది.”

“ఎట్లుంది చూడ్డానికి?”

“పీత లాగుంది. నువ్వు ముందు చదూకో!”

“నేను చూడొచ్చా?”

“అది కళ్ళు తెరవంగానే గుడికి తీసుకొస్తాం, అప్పుడు చూడొచ్చులే! ఊరికూరికే ఈ వయసులో పొలాల్లోకి దిగకూడదు. నువ్వేం చిన్నపిల్లవిగాదు, నీక్కూడా ఏళ్ళొస్తున్నాయి!”

“నేను ఇంకా చిన్నపిల్లనే, పెద్దవ్వడం నాకస్సలు ఇష్టం లేదు.”

పండారం పెరట్లోకి వెళ్ళి పనసాకులో గుప్పెడంత బూడిద వేసుకుని దాన్ని చుట్ట చుట్టాడు. పెరట్లోనించీ సందులోకి వెళ్ళి ఉత్తరపు వీధిలో నడుచుకుంటూ మెట్లుదిగి చెరువు దగ్గిరికి చేరుకున్నాడు. గూనాచ్చేరి, కొచ్చు పిళ్ళై అప్పటికే చెరువులోకి దిగి స్నానం చేస్తున్నారు. పండారం లోపలకి దిగకుండా ఒడ్డునే నిలబడి పళ్ళు తోమడం మొదలుపెట్టాడు.

“కానుపు అయ్యిందా?” అడిగాడు కొచ్చు పిళ్ళై.

“అయ్యింది, అంతా ఆ పళని సామి దయ.”

“నువ్వు పెట్టిపుట్టావు పండారం. ఒక్క సారి పంట పండిందంటే, పదివేలు చేతిలో పడతాయి. అన్ని డబ్బులు ఒక్కసారి చూడాలంటే మేము ఎన్ని కష్టాలు పడాల?”

‘మురుగా!’ అన్నాడు పండారం, నోటిని నీళ్ళతో పుక్కిలిస్తూ. చూపుడు వేలు నోట్లో పెట్టుకుని పళ్ళను శుభ్రం చేసుకుంటూ, నీళ్ళను ధారగా బయటికి ఉమ్మేసాడు. నీళ్ళలోకి దూకి మునిగి అడుగు నించీ పైకొస్తూ, “అంతా ఆయనే చూసుకుంటాడు, ఆ పళని సామి. తిరిపెమెత్తే దేవుడైనా, ఆయనకన్ని లెక్కలూ తెలుసు. సర్వాంతర్యామి!”

“పండారం, మా ఓడు గూనాచ్చేరినిగూడా నీతో పాటూ తీసుకెళ్ళబ్బా! పళనిలో ఈడికి మంచి రేటు పలుకుతాది. రాజా లాంటి బతుకు, రోజూ విందుభోజనం.”

గూనాచ్చేరి వెకిలిగా నవ్వాడు, “హి హి హి” అంటూ.

“ఆట్టా మాట్టాడబాక, కొచ్చు పిళ్ళై! ఎకసెకాలు పడే విషయం కాదిది. ప్రపంచంలో అన్ని రకాల ఆత్మలూ ఉంటాయి, చిన్నవీ, పెద్దవీ అన్నీ. మహాత్మ అంటాం! అంటే గొప్ప ఆత్మ అని. మనవన్నీ అట్లా కాకుండా చిన్న-ఆత్మలు! మనం కూడా వేరే ఆత్మలన్నిట్నీ గౌరవించాల, ప్రేమించాల. మనకంటే చిన్న ఆత్మలు కూడా ఉంటాయి. ఆటినీ ఆటి బాగోగుల్నీ మనమే చూసుకోవాల, కాపాడాల! ఇప్పుడు ఈ సరుకులకి మనం లేకపోతే అయ్యన్నీ వీధుల్లో పడి ఆకలి చావులు చస్తాయి. కానీ మన చేతికిందుంటే మాత్రం అవింక దేనికీ చూసుకోనక్కర్లే! పూట పూటకీ కావాల్సినంత తిండి, నెత్తి మీద గూడు, మంచం పడితే మందులూ…” పండారం మునకేసి మళ్ళీ లేచాడు. “పశువులు, కోళ్ళు… ఈటన్నిట్నీ కాచుకోట్లే మనం! అయన్నీగూడా చిన్న చిన్న ఆత్మలే గదా!” అన్నాడు పండారం మళ్ళీ మునకేస్తూ.

“నువ్వు చెప్పేదాంట్లో ఇషయం ఉండాది!” అన్నాడు గూనాచ్చేరి నవ్వుతూ.

కొచ్చు పిళ్ళై తువ్వాలు పిండుతూ మెట్ల మీదికెక్కాడు. “పోయొస్తా, పండారం! ఈరోజు అప్పు పిళ్ళై కొబ్బరితోటలో కాపు దింపుతున్నాం.”

“ఎంత పలుకుతోంది?”

“ఏవుంది? మహా అయితే ఐదుకి ఒకటి. తిరువనంతపురంలో అయితే మూడూ, మూడున్నర ఉంటాదనుకో. మళ్ళీ కలస్తా!”

పండారం బయటికొచ్చి, తల విదిలించుకున్నాడు. రామకోనార్, సుబ్రమణ్య పంతులు కనపడ్డారు. “ఈనిందా అది?” అడిగాడు పంతులు.

“ఆహా, సామి దయవల్ల!” బదులిచ్చాడు పండారం. తువ్వాలు పిండుకుని రెండు కొనలు పట్టుకు తెరిచి విదిలించాడు.

“తైపూసానికి పళని పోవడంలే ఈసారి?” అడిగాడు కోనార్.

“ఖచ్చితంగా పోవాల! అంతా ఆయన దయే కదా!” అన్నాడు పండారం.

***

గుడిలోకి వెళ్ళే ముందర అక్కడున్న పాత్రలోంచి గుప్పెడు విభూది తీసుకుని ఒళ్ళంతా పూసుకున్నాడు, పండారం. “తండ్రీ, మహానుభావా, మురుగా” అనుకుంటూ గుడిలోపలికి దూరాడు.

మసలామె వల్లి మంటపం మెట్ల మీద కూర్చొని ఉంది. ఆమెకేసి చూసి “పోతి వచ్చారా?” అడిగాడు పండారం.

“వచ్చి చాలా సేపయ్యింది” చెప్పింది వల్లి.

పండారం ఒళ్ళంతా ఊపుకుంటూ గుళ్ళోకి పరుగులు తీసాడు. పెద్దపోతి గుడికి ప్రధానార్చకుడు. నెలకొకసారే గుడికి వస్తాడు. ఆయనకు రక్తపోటు ఉంది. గుళ్ళో రోజు వారీ పూజలు, ఆయన అల్లుడు సుబ్బపోతి చూసుకుంటాడు.

గర్భగుళ్ళోని నల్లటి మూల విరాట్టుకు పెద్దపోతి చందనం పట్టిస్తున్నాడు. సుబ్రమణ్య స్వామి విగ్రహం ఓ చెయ్యెత్తు మనిషంత పొడవూ వెడల్పూ ఉంది. మొత్తం విగ్రహానికి గంధంపూత పూయడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. ‘చలువపూత’అంటారు. నల్లటి మూల విగ్రహానికంతా చలువపూత పూస్తే దీపం వెలుగులో స్వామి పోతపోసిన బంగారంలా వెలిగిపోతాడు. పూర్వపు రోజుల్లో అయితే రాత్రంతా కూర్చుని కావాల్సినంత గంధం చెక్కను అరిగించేవారు. ఈ నడమ పోతి, దుకాణంలో గంధం పొడి కొనుక్కొచ్చి స్వామికి పట్టించడానికి చపాతీ పిండిలాగా తయారు చేసుకుంటున్నాడు.

“ఎవరదీ… పండారం?” అడిగాడు పోతి లోపలనుంచీ.

“నేనే సామీ!” అన్నాడు పండారం. “ఆలస్యం అయ్యింది.”

“నీకేం లే! ఎప్పుడు కావాలంటే అప్పుడొస్తావు. మనుషుల్నేలే మహారాజువి! మాలాగా కాదు కదా?”

“లేదూ. కొంచెం…”

“ఏందీ, కొంచెం? అసలు నువ్వు గుడికొచ్చేది దేనికి? నువ్వు చేసే బోడి సేవలు స్వామికి అవసరం లేదు. గుడి నుంచి వచ్చే చిల్లర పైసలు నీకెటూ లెక్కాలేదు.”

“అవి దేవుడి డబ్బులు కదా సామీ!”

“ఓహో! అట్లానా? బిచ్చగాళ్ళను అరువుకిచ్చి డబ్బులు చేసుకోవడంలో గౌరవం లేదు! ఆ విషయాన్ని పైకలా చెప్పుకోలేవు గదా. అందుకని మర్యాదగా, హుందాగా గుళ్ళో ఉద్యోగం చేస్తున్నట్టు పోజు. గుడి మెట్ల మీది యాపారం మాత్రం డబ్బులు చేసుకోడానికి. అంతేనా?”

“అల్పుణ్ణి! నేను ఏం చెప్పేది సామీ?”

“ఏం చెప్పనక్కర్లేదు” అన్నాడు పోతి. “గుడి చిమ్మడానికి వల్లిని పెట్టింది నువ్వే గదా? వెళ్ళి ఆ ముండనడుగు! పొద్దున వచ్చేముందర అసలు స్నానం చేసిందా లేదా అని? పో…”

“దేవుడి పాదాల దగ్గర ఉంటూ బూతుమాటలెందుకు సాఁవీ?” అని గొణిగాడు పండారం.

“ఏయ్, ఏందీ సణుగుతున్నావు? గుర్తుపెట్టుకో. దేవుడు పె‍‍డుతున్న తిండి తింటున్నావు. ఒక్క తప్పటడుగు వేసినా నాశనం అయిపోతావు. ముష్టోళ్ళ మీద పడి సంపాయించే డబ్బు కాదిది.” అన్నాడు పెద్ద పోతి.

పండారం మరింత వినయంగా చేతులు కట్టుకుని, “పోతి సామీ! ముష్టెత్తే వాళ్ళ గురించి మాట్లాడ్డం మొదలుపెడితే మనం పొద్దు గుంకే దాకా మాట్లాడుకోవచ్చు. అసలు మనలో ముష్టివాళ్ళు కాందెవరు? బతకడానికి మనమందరం ఎవడో ఒకడి ముందర చెయ్యి చాపతాం! అది సరే, గుండు కొట్టించుకోడానికి కావిళ్ళ మొక్కు చెల్లించడానికి ఈడకొచ్చే భక్తులకు రెండు తియ్యమాటలు చెప్పి స్తోత్రం చదివి చెయ్యి చాపితే దాన్నేమంటారు? మంత్రం చదివి చిటికెడు విభూది పడేసి చాపితే అది కూడా అడుక్కోడమే సామీ! అంతా ఒకటే. చెయ్యి చాపకుండా బతకాలంటే మన ఇళ్ళ కాడ ఎప్పుడూ పది గాదెల నిండా ధాన్యం పోగయ్యి ఉండాలి.”

పోతి మొహంలో కత్తి వాటుకు నెత్తురు చుక్క లేదు. గుళ్ళో సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం.

పండారం పెదాలు బిగించుకుని లోలోపలే నవ్వకుంటూ, “ఎవరో సీసా పుట్ట తేనె తీసుకొచ్చి మా ఇంట్లో ఇచ్చారు. కొండల్లోంచి వచ్చిన తేనె! తీసుకొచ్చి మీకందించమని మీనాక్షికి చెప్తాను. మొన్నెప్పుడోఅమ్మగారు అడిగారు, ‘రేయ్! కొంచెం మంచి తేనె తెచ్చిస్తావా?’ అని.”

“ఊ…ఊ!” అన్నాడు పోతి.

“తిరువనంతపురం నుంచి ఎవరొస్తున్నారు?’ అడిగాడు పండారం.

పోతి సర్రున వెనక్కి తిరిగి అడిగాడు “ఎవరూ?”.

“తిరవనంతపురంనుండి ఎవరో వస్తున్నారంటగా మీదగ్గరికి.”

“నీకెవరు చెప్పార్రా?”

“ తెలిసిపోద్ది!” అన్నాడు పండారం.

“ఊ…” గుర్రుమన్నాడు పోతి.

“ఇంక నేను బయలుదేరతా” అన్నాడు పండారం. “ పనుంది, మా పాత సరుకు ఈనింది! సామికి నైవేద్యం పెట్టాల. ఏక్కియమ్మ వస్తుంది.”

“సరే” అన్నాడు పెద్ద పోతి. పండారం ఇంక వెళ్ళిపోతాడు అని తెలిసి కొంచెం స్థిమిత పడ్డట్టు మొహం పెట్టాడు పెద్ద పోతి.

“నేను కులశేఖరం వరుకు పోయేసి రావాల” అన్నాడు మృదువుగా పండారం. “అక్కడ కొంచెం పనుంది.”

“ఈ ఏడు తైపూసానికి పళనికి వెళ్ళడం లేదా?”

“పోకుంటే ఎట్టా? యాపారం గదా, మీకు తెలీంది ఏవుంది?” అన్నాడు పండారం.

పుష్య మాసంలో వచ్చే పౌర్ణమిని ‘తైపూసం’ అంటారు. అన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలకూ విశిష్టమైన రోజు. ప్రత్యేకించి పళనిలో మరింత ప్రత్యేకం తైపూసం! ఎక్కడెక్కణ్ణుంచో భక్తులు తండోపతండాలుగా మొక్కు తీర్చుకోవడానికి ఆ రోజున పళనికొస్తారు.

వెళ్ళబోయే ముందర పండారం దేవుడి ఎదుట సాష్టాంగ దండ ప్రమాణం చేసాడు. ప్రదక్షిణ చేస్తూ కుమరగురుపరుడు రచించిన కందర్ కలివెణ్బా స్తోత్రం పఠిస్తూ ప్రాకారం చుట్టూ ఉండే పరివార దేవతల విగ్రహాలన్నిటికీ మొక్కి విభూది తీసుకుని గుడి బయటికొచ్చాడు. బయట ఎండ తీవ్రంగా ఉంది. వండిమలై, మాధవపెరుమాళ్ ఇద్దరూ గుడి కింద మెట్ల మొదట్లో పండారం కోసం ఎదురుచూస్తూ నిలబడున్నారు. పండారం మెట్ల మీది దుమ్ము, తన తువ్వాలుతో దులిపి కూచున్నాడు. ఒక పిసరు నస్యం పీల్చాడు. “ఊ…” అన్నాడు.

“నాగరాజా దేవాలయం దగ్గర చిన్న గొడవైంది.” అన్నాడు మాధవపెరుమాళ్.

“ఏమైంది?”

“అటు పక్కనించీ పొయ్యే దేశదిమ్మరి బిచ్చగాడు ఒకడు మన సరుకు బొచ్చెలో చెయ్యిబెట్టాడట. మన సరుకు గోల గోల చేసిందంట. వాడు దాన్ని ఒక్క దెబ్బ కొట్టి తప్పించుకున్నాడంట. నేను సాయంత్రం పోయినప్పుడు కలెక్షన్ తక్కువుంది. కనుక్కుంటే ఇదంతానిజమేనని తెల్సింది, పక్కనే మన సరుకులు ఇంకో రెండు అక్కడే కూచుని ఉన్నాయి. దొంగను పట్టుకొచ్చి ఉతికేసాను. ముసలి ముండాకొడుకు…”

“నువ్వు, ఈ దిక్కూదివాణం లేని దేశదిమ్మర్లతో జాగ్రత్తగా ఉండాల! వాళ్ళు మందలు మందలుగా ముఠా మాదిరి తిరుగతారు.”

“వీడు ఒంటరిగానే ఉన్నాడు!”

“అసలు ఈళ్ళంతా వచ్చి మనమీదెందుకు పడతారు? ఏ పళనికో, తిరుచ్చెందూరుకో పోయి అక్కడేసుకోవచ్చుగా ఈ ఏషాలన్నీ?” సణుక్కున్నాడు పండారం. “ఇంతకీ ఈ రోజు కలక్షన్ ఎంత?”

“ఘోరం అన్నా! ఇప్పుడు ఒక గ్రూపు వడివీశ్వరం నించీ వచ్చి అక్కడే కూర్చుంది. అది చాలదని ఇంకోటి రామేశ్వరం నించి! రాన్రాను కలెక్షన్ బాగా తగ్గిపోతోంది. ఆదివారాలు కొంచెం బానే వసూలవచ్చన్నా!”

మాధవపెరుమాళ్ మాసిపోయిన రూపాయనోట్ల ఉండొకటి పంచె చెరుగులోంచి తీసి పండారంకి ఇచ్చాడు. పండారం లెక్కబెట్టుకున్నాడు. ఒక క్షణం ఆగి ఇంకోసారి మళ్ళీ లెక్కబెట్టాడు. “అంటే ఇంకా నాలుగువేల బాకీ ఉంది” అన్నాడు.

“తైపూసం పోనిచ్చి, జనవరి అయ్యేలోపల తీర్చేస్తాన్నా!”

“ఎన్ని జనవర్లు చూడలేదూ? అదిసరేరా పెరుమాళ్! ఎప్పుడు చూసినా ఈ వండిమలై గాణ్ణి వెనకేసుకొని తిరగతావ్, దేనికి?”

“సరుకునెత్తాలంటే నాకంత బలం లేదు అన్నా! వీడుంటే అదొక సత్తా.”

“వీళ్ళను నెత్తిన బెట్టుకోమాక. పశువులీళ్ళు… బండ నాకొడుకులు!” వండిమలై వాళ్ళిద్దరూ ఇంకెవరి గురించో మాట్లాడుకుంటున్నట్టు తన పాటికి తాను గమ్మున రాతి విగ్రంహంలా నిల్చోనున్నాడు.

“సరే ఇంక నేను పోతున్నా” అంటూ “ఈరోజు పాత సరుకు పిల్లను పెట్టిందంటగా?” అడిగాడు మాధవపెరుమాళ్.

“ఎవడు చెప్పాడు?”

“ఇరుళప్పన్ దార్లో కలిసాడు.”

“ఏడ్చినట్టుంది! నాకేదో లాటరీ తగిలినట్టు, ఈళ్ళు ఊరంతా చెప్తున్నారు!” అన్నాడు పండారం మొహం మటుకు సంతోషంగా పెట్టి. “అవును, నిజమే. బిడ్డ దిట్టంగా బాగున్నాడు. సరే నువ్వు సోమవారం రా! తైపూసం గురించి మాట్లాడుకోవాల. కొత్త సరుకును తైపూసానికి మంచిగా మార్కెట్లో దించాల, ఏమంటావ్?”

“అట్లనే అన్నా!”’ అన్నాడు మాధవపెరుమాళ్. వండిమలై పక్కనే నడుస్తూంటే మాధవపెరుమాళ్ అక్కడ్నించీ బయలుదేరాడు.

పండారం ఇంటికొచ్చేటప్పటికి వడివమ్మ ఇంటి బయట అరుగు మీద అందమైన అమ్మాయిల ముఖచిత్రాలుండే ‘రాణి’, ‘దేవి’ లాంటి రంగు రంగుల మాస, వార పత్రికలను చుట్టూ వేసుకుని కూర్చోనుంది.

“నీకు చదువు సంధ్యలేం లేవా?”

“అంతా చదివేసానప్పా!”

“ఎప్పుడు?”

“ఇప్పుడే! కావాలంటే మీనాక్షిని అడుగు. ఏవే మీనా…”

“నీకు అది సాక్ష్యమా? బావుంది. నిన్ను చూస్తేనే దానికి నోట్లోంచి మాట బయటికి రాదు. అది సరే! ఈ చెత్తంతా ఏడ్నించి పట్టుకొచ్చావు?”

“ఓహ్ అప్పా, ఆపు! ఇదేం చెత్తకాదు” అందామె. అంటూనే ఒకటి తీసుకుని చదవడం మొదలుపెట్టింది.

ఏక్కియమ్మ లోపల వంట చేస్తోంది. “దోశలు తింటావా? కుమరేశన్ వచ్చెళ్ళాడు. మిరియాల గంజి కాచి ఇచ్చి పంపించా!”

దోసెలు పళ్ళెంలో పెట్టి చట్నీ గిన్నెలో గరిట పెట్టి రెండింటినీ నేల మీద పెట్టింది.

“ఓ మురుగా, తండ్రీ!” అని స్మరిస్తూ తినడానికి కూర్చున్నాడు పండారం. “పిల్లలు తిన్నారా?”

“సుబ్బమ్మకు సోమవారాలు ఉపవాసం గదా! వడివు మటుకు ఈరోజు దోసెలు తిననని చెప్పింది.”

“ఏం?”

“ఆమె అందంగా తయ్యారవ్వాలంట!”

“ఏం? దోసెలు తింటే అందం ఏడికి పోద్దంటా?”

“అదంతా నూనె అంటోంది. ఆ పుస్తకాలు ఏవో చదువుతోంది గదా! దాంట్లో రాసారంట. ఈ నడమ ఏది పట్టుకున్నా దాని ఆలోచన దానికేదో ఉంటాంది! కొంచెం కాఫీ తాగతావా?”

“ఇవ్వు.”

పండారం కొంచెం తాటిబెల్లం కాఫీ తాగి వెంటనే బయలుదేరాడు. “ఇప్పుడేగా ఇంటికి వచ్చింది. అప్పుడే ఎక్కడికి పోతున్నావు?” అతను చొక్కా తగిలించుకోవడం చూసి అడిగింది ఏక్కియమ్మ.

“పనులున్నాయి. కులశేఖరం దాకా పోవాల! నారాయణన్ వస్తే నేను వచ్చేదాకా ఉండమను.” గొడుగు తీసుకుని వెళ్ళబోతూంటే, వడివమ్మ “అప్పా, నేఁబొయ్యి పుట్టిన పాపను చూడొచ్చా?” అని అడిగింది.

“వడివు, నీకు వేరే పనేం లేదా?”

“మీనాక్షి, అది పీతలాగా ఉందని చెప్పింది.”

“ఇప్పుడు కాదు, తర్వాత.”

“అప్పా, అది ఏడుస్తుందా?”

“లోపలికి పోతావా లేదా? తాట తీస్తాను లేదంటే…”

పండారం మళ్ళీ గుడిసె దగ్గరికి వచ్చేటప్పటికి చెమటతో తడిసిపోయాడు. కుమరేశన్ బయట అరుగు మీద కూర్చోనున్నాడు. లోపల్నించీ రకరకాల శబ్దాలు వస్తున్నాయి.

“ఏరా! ఏదన్నా తిన్నావా?” అడిగాడు పండారం.

“గంజి తాగాను.”

“ముత్యాలు?”

“అది కూడా తాగింది.”

“సరే!” అన్నాడు పండారం గుడిసె లోపలికి చూస్తూ. బిడ్డ ముత్యాలు రొమ్ము పుచ్చుకుని పాలు తాగుతోంది. పూల మొగ్గల్లాంటి తన కాలి వేళ్ళను కదిలిస్తూ చేతి వేళ్ళను తెరుస్తూ ముడుచుకుంటూ ఉంది. ముత్యాలు బాన పొట్ట చుట్టూ కట్టిన గుడ్డ, బిడ్డ మూత్రంతో తడిసిపోయి వుంది. ముత్యాలు, “నా రాజా, నా చక్రొర్తీ, నా బంగారం” అంటూ తన బాగుండే చేత్తో బిడ్డ వీపు మీద తడుతూ తల చిన్నగా ఊపుతూ జోలపాడుతోంది. ఆమెకున్న ఒక కన్నూ మూసుకునివుంది. మాంసం ముద్దలా ఉండే ఇంకో కనుగుడ్డు కనురెప్ప కింద సళుపుతోంది. పరవశంలో మునిగి ఉన్న ఆమె ముఖాన్ని చూసి పండారం కొంతసేపు ఆశ్చర్యంలో మునిగిపోయాడు.

తిరిగి వెళ్ళడానికి వెనక్కి తిరిగాడు. “జాగ్రత్తగా చూసుకో!” అని కుమరేశన్‍ని హెచ్చరించి బయలుదేరాడు. గొడుగు మొన నేలలో గుచ్చుతూ, చేలల్లో నడుస్తూ, అప్రయత్నంగా తెల్లవారి కనపడ్డ ఒంటరి నక్షత్రం కోసం తలెత్తి ఆకాశంలోకి చూసాడు. సూర్యుడు అడ్డం వచ్చి కళ్ళు బైర్లు కమ్మాయి. సూర్యకాంతి కళ్ళల్లో పడకుండా గొడుగును తెరిచి పట్టుకున్నాడు.

 

Jeya mohan

జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దంపట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.

jeyamohan.writer@gmail.com

కుమార్, భాస్కర్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *