తెలుగు రచనలలో అక్కడక్కడ ఇంగ్లిష్ పదాలు రావడం ఈరోజుల్లో మనం తరచుగా గమనిస్తున్న విషయం. ఆధునిక కాలంలో దీన్ని పూర్తిగా నివారించడం కష్టం. నివారించే అవసరం లేదేమో కూడా. ఐతే, ఆ పదాలు వచ్చినప్పుడు అవి తెలుగులిపిలో ఉండాలా, లేక ఇంగ్లిష్ లిపిలో ఉండాలా అనే సందేహం కలుగుతుంది. నిజానికి రచన తెలుగులో ఉన్నప్పుడు అందులో వచ్చే పదాలన్నీ తెలుగులిపిలో ఉండటమే సబబు. కానీ ఇంగ్లిష్ పదాల స్వరూపాలను సరిగ్గా పట్టుకోవడం చాలా కష్టమైన పని. ఆ భాష అట్లాంటిది మరి. అందులో రాయడానికీ పలకడానికీ మధ్య పొంతన లేకపోవడం సర్వసాధారణం.
Kudos ను క్యూడాస్ అని తెలుగులిపిలో రాసి, ఈ వ్యాసరచయిత కూడా ఒకసారి చేయి కాల్చుకున్నాడు! దాని కచ్చితమైన పదస్వరూపం కుడోస్ అని తర్వాత తెలిసింది. ఆ పదాన్ని తెలుగులిపిలో రాయడంవల్లనే కదా ఇబ్బంది ఎదురైంది? ఇట్లాంటి పదాలు ఇంగ్లిష్ భాషలో ఎప్పుడో ఒకసారి తగుల్తాయని అనుకొని, సరిపెట్టుకునే పరిస్థితి లేదు. చాలా తరచుగానే తటస్థిస్తాయి అవి. కాబట్టి, అటువంటి మాటలను ఉపయోగించే ప్రతిసారీ చెక్ చేసుకోవడం అనివార్యం ఔతుంది. కానీ, రాయబోతున్న పదం తప్పు అని ముందు మనకు అనుమానం వస్తేనే కదా మనం జాగ్రత్త పడి చెక్ చేసుకోగలం!? ఇదే అసలు చిక్కు.
Confirm, conform లను గురించి మాట్లాడుకుందాం. కొన్నిరోజుల క్రితం ఒక పత్రికలో, “ఈ విషయాన్ని విపక్ష దళాలు కూడా కన్ ఫాం చేశాయి,” అనే వాక్యం కనపడింది. ఇక్కడ కన్ ఫాం ద్వారా చెప్పాలనుకున్న అర్థం నిర్ధారించుట లేక ధ్రువీకరించుట. అటువంటప్పుడు కన్ ఫాం అని కాకుండా కన్ఫర్మ్ అని రాయాలి. The tests confirmed the doctors’ suspicion అంటే, పరీక్షలు డాక్టర్ల అనుమానాన్ని ధ్రువీకరించాయి అని అర్థం. కన్ఫార్మ్ (conform) కు భిన్నమైన అర్థం ఉండటం ఇక్కడ పరిస్థితిని క్లిష్టతరం చేస్తున్నది. కన్ఫార్మ్ అంటే అనుగుణంగా ఉండుట. We have to conform to a norm అంటే, మనం ఒక ప్రమాణానికి లేదా పద్ధతికి అనుగుణంగా ఉండాలి, దాన్ని పాటించాలి అని అర్థం. ఈ రెండు పదాలలో r ను పూర్తి స్పష్టంగా పలకగూడదు. వంద శాతం కచ్చితమైన ఉచ్చారణను తెలుగులిపిలో రాయడం సాధ్యం కాదు. Content కూడా ఇటువంటిదే ఐన మరొక పదం. కవిత్వంలోని వస్తుశిల్పాలను ఆంగ్లంలో content, form అని అంటాం. వీటినే తెలుగులిపిలో రాయాలనుకున్నప్పుడు కంటెంట్, ఫామ్/ఫార్మ్ అని రాయకూడదు. కాంటెంట్ సరైన పదం. కాంటెంట్ అంటే వస్తువు. కంటెంట్/కంటెంటెడ్ అంటే తృప్తి పొందిన లేక సంతుష్టి పొందిన. కానీ రెండింటి ఇంగ్లిష్ స్పెలింగ్ ఒకటే. Quay అనే ఆంగ్లపదం ఉంది. బల్లకట్టు అనే అర్థం ఉన్న ఈ పదాన్ని తెలుగులిపిలో క్వే అని రాశామనుకోండి. అప్పుడు మనం పప్పులో (పెద్ద తప్పులో) కాలు వేసినవాళ్లమౌతాం! Quay కు సరైన ఉచ్చారణ, పదస్వరూపం కీ. అంటే, key ని ఎలా పలుకుతామో దీన్ని కూడా అలానే పలకాలన్న మాట. కానీ మనం కీ అని రాస్తే, మనకు ఆంగ్లభాష రాదనుకునేవాళ్లుంటారు! అదేవిధంగా indict ను ఇండైట్ అని రాశామా, మనకు ఇంగ్లిష్ అసలే రాదని భావిస్తారు చాలా మంది. కానీ ఇండైట్ సరైన పదం, ఇండిక్ట్ తప్పు. Decoy operation ను డీకాయ్ ఆపరేషన్ అని రాయాలి. ఒక e నే ఉంది కనుక, డెకాయ్ అని గానీ డికాయ్ అని గానీ రాయాల్సి ఉంటుంది కదా, అని ప్రశ్నించవచ్చు. కానీ అదంతే. ఎందుకంటే, ఇంగ్లిష్ విచిత్రమైన భాష. దాని నియమాలు అలా ఉంటాయి మరి.
పైన చెప్పిన kudos, conform, content, quay, indict, decoy లను తెలుగులిపిలో రాసినందుకే కదా తల బొప్పి కట్టటం! దానికి బదులు వాటిని ఇంగ్లిష్ లిపిలోనే రాస్తే దోషాలు దొర్లవన్నది స్పష్టం. ఆంగ్లంలో ఇట్లాంటి పదాలు చాలా ఉంటాయి. వెస్ట్రన్ (వెస్టర్న్), ఈస్ట్రన్ (ఈస్టర్న్), డిస్ట్రబ్ (డిస్టర్బ్), ఈస్థటిక్స్ (ఎస్తెటిక్స్), అలెర్ట్ (అలర్ట్), పెర్ఫెక్ట్ (పర్ఫెక్ట్), పెర్ఫ్యూమ్ (పర్ఫ్యూమ్), పెర్ఫామ్ (పర్ఫామ్), అలెర్జీ (అలర్జీ), టెర్మినల్ (టర్మినల్), సింబాలిజం (సింబలిజం), పారా బాయిల్డ్ రైస్ (పార్బాయిల్డ్ రైస్), క్రిమీ లేయర్ (క్రీమీ లేయర్), సంగీత ధ్వనికి సంబంధించిన బాస్ bass (బేస్), రోజువారీ ఇంటిపనులైన కోర్స్ chores (చోర్స్) … ఇలా ఎన్నో తప్పు పదస్వరూపాలను చూస్తుంటాం పత్రికల్లో, రచనల్లో. బి.బి.సి., ఢిల్లీ ఆకాశవాణి మొదలైన మంచి రేడియో స్టేషన్ల ద్వారా ప్రసారమయ్యే ఆంగ్లవార్తలను లేదా కార్యక్రమాలను తరచుగా వింటే, ఇట్లాంటి తప్పులను రాయడం నుండి తప్పించుకోవచ్చు. కాబట్టి, ఉచ్చారణ సరిగ్గా తెలిస్తే తప్ప ఇంగ్లిష్ పదాలను ఆంగ్లలిపిలో రాయడమే ఉత్తమం.
అసలు తెలుగులో రాస్తున్నప్పుడు ఆంగ్లపదాలను పూర్తిగా మానుకుంటే ఇబ్బందే ఉండదు కదా, అనిపించవచ్చు. కానీ, ఆంగ్లభాష మన జీవితాలలోకి విపరీతంగా చొచ్చుకునిపోయింది. ఆ ఇంగ్లిష్ మాటలకు ప్రత్యామ్నాయాలైన తెలుగు పదాలు కొన్ని దశాబ్దుల క్రితం ఎబ్బెట్టుగా అనిపించకపోయేవేమో కానీ, ఈ కాలంలో కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. పాఠశాల, ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు మొదలైన పదాలను ఆధునిక శైలి గల రచనలలో ఉపయోగిస్తే అవి కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. స్కూల్, టీచర్ అని రాస్తేనే ఈ కాలంలో సహజంగా, హాయిగా ఉంటుందని చాలామంది భావిస్తారు. పాఠశాలకు బదులు బడిని ఎంచుకోవచ్చు ననుకోండి. వ్యాసాలలో అక్కడక్కడ ఆంగ్లపదాలను విడిగా కాని, బ్రాకెట్లలో గాని రాస్తే అది కాంప్లిమెంటరీగా (పూరకంగా) ఉంటుందనడంలో సందేహం లేదు. సాహిత్య వ్యాసాలకు ఇది మరింత బాగా వర్తిస్తుంది. వ్యక్తిగత సంభాషణలలో, ఉత్తరాలలో, వ్యాఖ్యలలో, సామాజిక మాధ్యమాలలో ఇంగ్లిష్ మాటలను వాడితే దాన్ని సీరియస్ గా తీసుకునే అవసరం లేదేమో. ఎందుకంటే, ఇంగ్లిష్ ను నేర్చుకోవడం కోసం, లేదా అందులో ప్రావీణ్యం సంపాదించడం కోసం అప్పుడప్పుడు ఆ భాషను మాట్లాడటం, రాయటం ఉపయోగకారిగా ఉంటుంది. అదొక రకమైన అభ్యాసం (exercise, practice) మరి.
ఇక కవితలకు, కథలకు, నవలలకు ఆంగ్ల శీర్షికలను పెట్టడం గురించి చెప్పాలంటే, అనివార్యమైనప్పుడు మాత్రమే ఆ పద్ధతిని అవలంబించాలన్నది ఈ వ్యాసరచయిత ఉద్దేశం. డెజావు (Deja Vu), ఆరా (aura), పారనాయియా (paranoia) లాంటి ఆంగ్లపదాలను తెలుగులోకి అనువదించి శీర్షికలుగా పెట్టాలనుకుంటే, వాటిని ఒకటి రెండు పదాలలోకి కుదించలేము. ఒకవేళ కుదించగలిగినా అవి సంతృప్తికరంగా ఉండవు. అప్పుడు ఆ ఆంగ్లపదాలను ఉన్నదున్నట్టుగా రాయవచ్చు. ఐతే, వాటిని ఆంగ్లలిపిలో రాయాలా లేక తెలుగులిపిలో రాయాలా అనే సందేహం కలగవచ్చు. వాటి పదస్వరూపాలు (ఉచ్చారణలు) కచ్చితంగా తెలిస్తే తెలుగులిపిలో, అనుమానంగా ఉంటే ఆంగ్లలిపిలో రాయడం బాగుంటుంది. ఒక్కోసారి సమానార్థక తెలుగు పదాలు ఉన్నా వాటికన్న ఇంగ్లిష్ మాటలే ఎక్కువ ప్రభావవంతంగా (effectiveగా) ఉంటాయి కనుక, బాగా పొసగుతాయి. గుడిహాళం రఘునాథం రాసిన ఒక కవితా సంపుటి పేరు ఫోర్త్ పర్సన్ సింగ్యులర్. దీన్ని నాలుగవ వ్యక్తి, ఏకవచనం అని అనువదించి శీర్షికగా పెడితే ఎంత విడ్డూరంగా ఉంటుంది!? ఇక సందర్భం డిమాండ్ చేయకపోయినా మామూలు తెలుగు పదాలను సైతం ఆంగ్లంలోకి అనువదించే అవసరమేముంది!? గోడ, మంచం, మెట్లు, ప్రయాణంకు బదులు వాల్, కాట్, స్టేర్స్, జర్నీ అనే శీర్షికలు పెట్టడం విడ్డూరం అనిపించక మానదు. ఒక్కమాటలో చెప్పాలంటే, అదనపు ప్రయోజనాన్ని చేకూర్చేలా లేనప్పుడు తెలుగు రచనలలో ఆంగ్ల పదాలను మానుకోవడమే ఉత్తమం.