నీదో లోకం
నాదో లోకం
భిన్న ప్రపంచాలం ఇద్దరం
అయినా రెక్కల క్రింద
కలల గుడ్లను పొదిగేందుకు
ఒకే గూటిలో పక్షులమయ్యాం
కాలం నదిలో
అక్షరాల గవ్వల నేరుకుంటూ
పసిపిల్లాడిలా నేను
ప్రవాహపు వాలులో
ఒడుపుగా నావను నడుపుతూ
సరంగులా నువ్వు
అప్పుడప్పుడూ
ఒడ్డుకు చేరామనుకుంటాం కానీ
కొత్త ప్రయాణం మొదలు పెడతాం
ఎన్ని మజిలీల జీవనయానమో ఇది
చిలిపిగా తిట్టుకుంటూ కొట్టుకుంటూ
అనుభవాలను కూర్చుకుంటూ
అడుగులు వేద్దామిలాగే
ఒకరిలో ఒకరం
ఐక్యమవుతూ అలౌక్య మవుతూ

వి.ఆర్ తూములూరి
ప్రవృత్తి రీత్యా కవి, వ్యాసకర్త. వృత్తి రీత్యా తెలంగాణ ప్రభుత్వ అధికారి. పుట్టింది ఖమ్మం, ఉద్యోగ రీత్యా ప్రస్తుత నివాసం హైదరాబాద్. " దేశానికో అశ్రు లేఖ " వీరి ముద్రిత కవితల సంపుటి.