ఈ పాస్ పోర్ట్ లోని
నా రంగుని పీల్చేసిన నీడల్లో
వాళ్ళు నన్ను గుర్తించలేరు!
వాళ్లకు,
ఓ పర్యాటకుడు సేకరించే ఫొటోల్లా
నా గాయం వినోదాన్ని పంచే
ఒక ప్రదర్శనా వస్తువు,
అంతకుమించి వాళ్ళు నన్ను గుర్తించలేరు!
సూర్యుడు లేకుండా నా అరచేతిని వదలకండి
నన్నో పాలిపోయిన చంద్రునిలా వదలేయకండి!
ఎందుకంటే
నా స్థానికతను నా నేల మీది చెట్లన్నీ గుర్తిస్తాయి!
పక్షులన్నీ నా చేతిసైగను అనుసరిస్తూ
విమానాశ్రయం గేటుదాకా వొచ్చాయి
పండే గోధుమ చేలు
ఇరుకు జైళ్ళూ
తెల్లని సమాధి రాళ్ళు
ఆంక్షల ముళ్ళు వేలాడే సరిహద్దులు
అలలై ఊగే చేతి రుమాళ్ళు
చూపులు సారించే కళ్ళూ
అన్నీ నాతోనే ఉండేవి!
అవేవీ నా పాస్ పోర్ట్ లో లేకుండా చేసారు!
నా రెక్కల కష్టంతో ఎదిగిన నా నేలమీద
నా పేరు, నా ఉనికినీ చెరిపేసారా?!
ఈ రోజు అమాయకుల ఆర్తనాదం
ఆకాశమంతా నిండింది
ఇంకా నన్ను
సహనానికి ఉదాహరణగా చూపకండి!
ఓ పెద్ద మనుషులారా! చరిత్ర కారులారా!?
ఆ చెట్లను మీ పేరేటని అడగకండి!
ఆ లోయలను మీ తల్లి ఎవరని ఆరా తీయకండి!
నా నుదుటి నుండి వెలుతురు ఖడ్గం
దూసుకొస్తున్నది!
నా చేయి నది నీరై పరవళ్ళు తొక్కుతోంది!
నా జనం గుండెల్లో
నా అస్థిత్వం బలంగా ముద్రించబడింది!
ఇక నా పాస్ పోర్ట్ తీసేసుకోండి!
మూలం: Passport
నా పాస్ పోర్ట్ తీసేసుకోండి!
