నల్లనివెన్నెల

Spread the love

బజారు మొగని  “అడవి సరిహద్దు ఆరు మైళ్ళు” అని రాసి వున్న బల్ల చెక్కకి సమాంతరంగా ఒక లారీ నిలిచి వుంది. సరిగ్గా దానికి వెనకాలే అతను కారు పార్క్ చేశాడు. లారీ లోంచి కూలీలు పెద్ద పెద్ద రాళ్ళను దించుతున్నారు.

            “సిగరెట్లు అయిపోయాయి. కొనుక్కొని యిక్కడ వున్నట్టుగానే వచ్చే స్తాను. షర్బత్తేమన్నా తాగుతావా ?” అతను కారులోంచి దిగి డోర్ వేస్తూ  అడిగాడు.

            “అఖ్కర్లేదన్నట్టు తలవూపి, మళ్ళీ అంది ఆమె –  “సోడా మాత్రం పట్రండి, దాహంగా వుంది.”

            అతను కిళ్ళీ కొట్టు వేపు నడచి వెళ్లాడు. కొట్టుముందు ఏవేవో పత్రికలు రంగురంగుల ముఖచిత్రాలతో తోరణా లుగా వేలాడగట్టాడు. షాపువాడి వీపు మీద వృత్తాకారంలో చమట పట్టింది. ఆమె అదే పనిగా అతని వీపును చూస్తోంది కారులో కూర్చునే. ఆమెకి మహచెడ్డ చిరాగ్గా వుంది – ఎందుకనో.

            వాచీ చూసుకొంది. అప్పుడే మూడు గంటలు కావస్తోంది. ఈ లెఖ్కని   ప్రయాణం సాగిస్తే, గమ్యం చేరుకోడానికి మరో ఏడు గంటలయినా పట్టవచ్చు. ఆయన కూడా ఆదే మాట అన్నారు – కారు హోటల్ చేరుకునేసరికి ఎలా లేదన్నా రాత్రి పదిగంటలు అవుతుందని. రోజుకి నలభై రూపాయలు పెట్టి ఆ హోటల్లో ఓ పెద్దగదిని రిజర్వ్ చేయించి వుంచారుట. ఆ గది కిటికి దగ్గర నిలబడి బయటికి చూస్తే, పెద్ద ఉద్యానవనం, రంగురంగుల విద్యుద్దీపాల కాంతిలో ఫౌంటెన్లలోంచి పైకి ఎగజిమ్ముతున్న నీటిధారలు రంగుల హరివిల్లుల్ని సృష్టిస్తూ కనిపిస్తాయట. ఇదంతా ఆయన తనతో చెప్పారు. నాన్నగారితో అమ్మ కూడా ఆ ఉద్యానవనం అందాల్ని గురించి అదే పనిగా వర్ణిస్తూవుంటే తాను విన్నది. ఆ తర్వాత నాన్నగారు కూడా  ఆ హోటల్ ని,  ఉద్యానవనాన్ని చూసి వచ్చారు. తమ యింటికి వచ్చే ప్రతివారితోనూ ఆమ్మ ఆ హోటలులో రోజుకి నలభై రూపాయలు పోసి గది తీసుకున్న విషయం మరవకుండా చెబుతుంది.

            సగం తెరిచి వున్న కారు డోర్లోంచి ఒక కుర్రాడు కొన్ని పుస్తకాలు పట్టుకున్న  చేతిని లోపలికి సోనిస్తూ, కారుకి ప్రక్కగా నిలబడి వున్నాడు. వాడు తన ముందుంచిన పుస్తకాల వేపు చూసింది ఆమె. బాగా మాసిపోయి వున్న పసుపు పచ్చ రంగు కవరు మీద ఓం కారం, క్రింద ఎవరిదో స్వాములవారిది బొమ్మ, బొమ్మ క్రింద ఏదో ఆశ్రమం చిరునామా వుంది.  

            “అర్ధరూపాయి… పుస్తకం వెల, అర్ధ రూపాయి అమ్మగారూ!” అంటున్నాడు ఆ కుర్రాడు.

            పాపం! ఆ కుర్రాడికి నిక్కరు తప్ప వంటి మీద మరొక గుడ్డ లేదు. మెడ క్రింద ఎముకలు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. దీనంగా వున్నది మొహం. ఆలసిపోయినట్టుగా వున్నాయి కళ్ళు.

            ఆమె మొహం తిప్పేసుకొని, డేష్ బోర్డు మీద ఏవేవో పిచ్చి గీతలు గీస్తోంది. ఏమీ తోచక ఆమెను మళ్ళీ ఆలోచనలు ముసురుకున్నాయి. తాము గడపబోయే మధురమైన హనీమూన్ గురించి, క్రితం రోజున గడచిన శోభనం రాత్రి అనుభవం గురించి, తన జీవన ప్రాంగణంలో తొలిసారిగా అడుగు పెట్టిన వ్యక్తి గురించి ఇలా ఎన్నో ఆలోచనలు.

.           మధురమైన హానీ మూన్ రాత్రుల తియ్యటి అనుభవాల్ని గురించి ఆమె ముందుగానే చదివి వుంది పుస్తకాల్లో. తొమ్మిదో క్లాసు చదువుతున్న తన తమ్ముడు స్కూలు నుంచి తిరిగివస్తూ, గ్రంథాలయం నుంచి ఏవేవో పుస్తకాలు తెచ్చేవాడు. ఏ డాబా మీదనో, మెట్ల మీదనో, మెట్లకి ఆనివున్న వరండాలోనో ముడుకుల మీద కూచొని దొంగచాటుగా ఆ పుస్తకాల్ని తిరగేసేది తాను.

            గుప్పుమని సిగరెట్టు వాసన! భర్త తిరిగి వచ్చాడు. షర్టు ముందు భాగం చాలావరకు చెమటతో తడిసి పోయింది. ‘బ్రేవ్’ మంటూ త్రేన్చి, కారులోకి వచ్చి కూచున్నాడు. డేష్ బోర్డు తెరచి అందులో సిగరెట్ పేకెట్ పడేసి, ఎడమ చేతిని ఆమె భుజం మీద వేశాడు.

            ఇవాళ ఉదయం తలుపు తెరిచిన చప్పుడయి, ఆమె కళ్ళు తెరిచేసరికి తన ఒంటి మీద అతను చేయి వేసి నిద్ర పోతూ ఉన్నాడు. నెమ్మదిగా ఆ చేతిని తొలగించింది. అప్పుడు గాని ఆమెకు బరువు దించినట్టు అనిపించలేదు. తృప్తిగా  నిట్టూర్చింది.

            ఇంజను ‘గుఁయ్… గుఁయ్’ మంటుందే తప్ప స్టార్టు కావడం లేదు కారు. పుస్తకాల కుర్రాడు కారు. రెండో వేపుకి వెళ్ళి, ఒక చేతితో పుస్తకాలు అతనికి చూపిస్తూ, రెండో చేతితో మూసి వున్న కారు డోర్  ని గట్టిగా పట్టుకున్నాడు కారు ఎక్కడ పారిపోతుందో అన్నట్టుగా.

“అర్ధరూపాయి సార్! ఒక పుస్తకం వెల అర్ధరూపాయి!” అంటున్నాడు.

“అఖ్కర్లేదు!”

“సార్, సార్! ఎంతో కాదు సార్!  అర్ధ రూపాయే!”

ఇంజను స్టార్టు అయింది. అయినా కుర్రాడు డోర్ పట్టు విడవలేదు.

“దీని వల్ల నీకేం లాభంరా, అబ్బాయ్ ?”  

“పుస్తకానికి రెండణాలు యిస్తారు  సార్!”

“చూడవోయ్ ఆ డేష్ బోర్డులో చిల్లర డబ్బులుండాలి ! అందులోంచి ఏదీ రెండణాలు తీసియ్యి” ఆమెకి పురమాయించి, ఆ కుర్రాణ్ణి పరిశీలనగా చూశాడు అతను.

             అతను డబ్బులు ఇవ్వబోతుంటే, ఆ కుర్రాడు పుస్తకాలున్న చేతిని వెంటనే వెనక్కి లాగేసుకున్నాడు.

            “ఒట్టి పుణ్యానికే ఎందుకిస్తారు సార్! నాకు డబ్బులు? మిమ్మల్ని నేనేం అడుక్కోవడం లేదే?” అన్నాడు పుస్తకాల అబ్బి రోషంగా. అలా అంటున్నప్పుడు అలసి నట్టున్న వాడి కళ్ళలో క్షణం సేపు మంటలాంటిది మండి, మరుక్షణమే గుప్పుమని ఆరిపోయింది. ఆమె హృదయం వేగంగా కొట్టుకుంది. మనసు అనిర్వచ నీయమైన ఆనందానుభూతితో ఉప్పొంగిపోయింది.

“జులాయి  వెధవ!”

            కోపంతో అతని మొహం ధుమధుమ లాడింది. ఇన్నాళ్ళుగా తాను అందగాడని భ్రమించిన అతని మొహంలో అసలు రంగులు అప్పుడే బయట పడినట్లు అనిపించింది ఆమెకి. కారు పెద్దగా శబ్దం చేసుకొంటూ, ముందుకి దూసుకుపోయింది. ఆ పిల్లాడు రోడ్డు వారగా  అలాగే, నిలబడి పోయాడు- చేతిలో పుస్తకాలతో.

            ఆమెకి వెన్నెముక దగ్గర్నించి వీపంతా చెమట, చెమట- సీటుకి ఆనుకో కుండా, ముందుకి వంగి కూర్చొని, వెనక్కి వెనక్కి పారిపోతున్న రోడ్డుని అదేపనిగా చూస్తోంది.

            ఇంతకు ముందెప్పుడయినా ఈ త్రోవలో ప్రయాణం చేశావా?” ఆడి గాడు అతను. అతని మొహంలో ఇంకా ప్రశాంతత నెలకొన లేదు.

            “లేదు!” అందామె.

            “ఈ ఘాట్ రోడ్డు ఎంత బావుందో చూడు! దేశంలో అన్ని, ప్రాంతాలూ తిరిగిన వాణ్ణి. అంచేత చెబుతున్నా- ఈ రోడ్డు మీద కారు పోతున్నంత హాయిగా మరెక్కడా పోదని ఘంటాపథంగా చెప్పగలను” అన్నాడు అతను.

            ఇంకాస్సేపటిలో తాము దర్శించబోయే ఆ సుందరోద్యాన వనం గురించీ, ఆనకట్టుకి ప్రక్కని నిర్మించివున్న పేరు మోసిన ఆ హోటల్ గురించీ అదేపనిగా అతను వర్ణించేస్తున్నాడు. ఆమె ‘ఊ’ కొడుతోంది గాని ఆమె కళ్లు మాత్రం నిద్రతో కూరుకుపోతున్నాయి.  అతను వేసే ప్రశ్నలకి అవునని గాని, కాదని గాని చెప్పకుండా! ఊ…ఊ!” అంటూ వుంది.

            “నిద్ర వస్తోందా?”

            పెదిమల మీదికి చిరునవ్వుని తెచ్చుకోడానికి విఫల ప్రయత్నం చేసిందామె.

            “ఇప్పటికి- సరే నిద్రపో. కాని రాత్రి మాత్రం నిన్ను నిద్ర పోనిచ్చేది లేదు -ఆ !”

            అతను పళ్ళు యికిలిస్తూ, పెద్ద పెట్టున నవ్వాడు. ఆ మొరటు హాస్యానికి ఆమెకి ఒళ్ళంతా కంపరం పుట్టు కొచ్చింది. అతను ఆమెవేపు చూశాడు, తను చేసిన హాస్యానికి నవ్వక పోతుందా అన్న ధీమాతో, కాని, ఆమె ఏదో ఆలో చనలో పడి నవ్వలేదు- తన యింటికీ ఆయన యింటికీ మధ్య ముళ్ళకంచె  వుంది. అవతలి వేపున లేతఎరుపు రంగు పూల మొక్కలూ, పెంకుటిల్లూ, ఎత్తుగా క్రీపరు ప్రాకిన కిటికి, ఆ కిటికీలోంచి అడపా తడపా గాలిలో తేలివచ్చే నవ్వు ఇదేనా? తన శరీరంలోని ఆణు వణువునీ చక్కలి గింత పెట్టే నవ్వేనా ఇది? ఈనవ్వుని వినడం కోసమేనా తాను గంటల తరబడి నిరీక్షించేది? ఎక్కడో ఏదో పొరబాటు జరిగింది… ప్రభూ ! ఎక్కడ జరిగిందా పొరబాటు?

        “నచ్చాడు. నా మనసుకి నచ్చాడు. యువకుడంటే ఇలావుండాలి” అంటూ నిజాయితీ పరుడనీ, ముక్కుకి సూటిగా పోయేవాడనీ-నాన్నగారు ఆయన్ని గురించి తెగ మెచ్చుకున్నారు. ఒక మధ్యవర్తంటూ లేకుండా, తానుగా వచ్చి, తను పెళ్ళి విషయం ఆయనతో ప్రస్తావించడం నాన్నగారి మనసుకి బాగా హత్తుకుపోయినట్టుగా వుంది. అందుకనే ఆ పొగడ్త ! అల్మారులోంచి కప్పులు, సాసర్లు తీసే నెపంతోనూ, గదిలోంచి తిరిగివెళ్తూ, తలుపు రెక్క సందులోంచి దొంగచాటుగానూ ఆయన్ని తాను మొహం వాచిన దానిలా ఎన్నిసార్లు చూళ్ళేదు !…

        నిద్ర వస్తోందని చెప్పి కారు డోర్ కి ఆనుకొని కళ్ళు మూసుకొంది ఆమె. కానీ, చెక్ పోస్ట్ దగ్గర పడుతున్న కొద్దీ కారు వేగం తగ్గుతూ వచ్చింది.  ఆమె మళ్ళీ కళ్ళు తెరచి సర్దుకు కూచుంది. గాలిలో కొద్దిగా  నీరెండ పడుతూంది. చిరుచలి.

            ‘వేటాడుట నేరం’ అని రాసివున్న కర్ర బోర్డుని దాటుకొంటూ, కారు ఘాట్ రోడ్డు ఎక్కేసింది.

            “ఇది ఏనుగుల అడవి. ఓసారి అర్ధ రాత్రివేళ యీ ఘాట్ రోడ్డు మీద కారు  ప్రయాణం చేశాం.  కారుకి హెడ్ లైట్ లేదు, బ్రేకులు అంతకన్నా లేవు…” అతను చెప్పుకుపోతున్నాడు.

            … అవును ఆయన తనకి ఓసారి  రాసిన ప్రేమ లేఖలో యీ సంఘటన గురించి ప్రస్తావించారు. దానికి జవాబుగా  ఆ హడావిడిలో తాను ‘మళ్ళీ ఇలాంటి ప్రమాదాన్ని ఏరికోరి తెచ్చుకో మాకండి!’ అంటూ రాసింది కూడా…

            ఆయన ఆనాటి ప్రయాణం గురించే చెబుతున్నారు. ఆవేళ ఉత్తరంలో రాసిన మాటల్నే మళ్ళీ తన నోటివెంట వినాలని ఉబలాటంగా ఉన్నట్లుంది. ఆయన కూర్చున్న సీటు వేపుకి జరిగి లేని చిరునవ్వుని తెచ్చి పెట్టుకొని, రోడ్డు మీద దృష్టిని నిలిపింది తాను… నిన్న రాత్రి చంద్రుడు అస్తమిస్తున్న వేళ, ఆకాశంలో చిక్కుకున్న నల్లటి మబ్బుల్ని చూస్తూ అలాగే పడుకొంది. ఏవేవో ఆలోచనలు తన మనసుని ముసురుకొన్నాయి… తనలో ఈ మార్పేమిటి ? అసలు తనకేం జరిగింది ?

“మా రషీద్ గాణ్ణి గురించి నీకు చెప్పలేదు గదూ?”

“ఊ… హూఁ !”

            “లాల్ అండ్ రషీద్ కంపెనీ తాలూకు రషీదోయ్! ఒకనాడు వాడూ, నేనూ ఈ త్రోవనే వస్తున్నాం. సాయంత్రం కావచ్చింది. రోడ్డు మలుపులో కారుకి ఎదురుగా అడవి ఏనుగు ! కారుని ఆపేశాను. నాడేమో ఒట్టి పిరికి వెధవ! నేను ఇంజను ఆపుచేసినప్పుడు వాడి మొహంలోని ఆ అలజడిని చూసి తీరాల్సిందే ! ‘కూని రాగం తియ్యవోయ్’ అన్నా.” అంటూ అతను ఒకటే నవ్వు. ఆమె నవ్వడానికి ప్రయత్నించింది. నవ్వురాలేదు.

            “అప్పుడు మేము ఏం చెయ్యాలో ! పోనీ నువ్వేచెప్పు! తాన్ సేన్ కి  మల్లే రాగం ఆలాపించడం తప్ప. అసలే కీకారణ్యం! అందులోనూ చేతిలో తుపాకీ కూడా లేదాయెను. మనలో మనమాట.  ఉంటే మాత్రం జరిగేదేమిటి ? ఏం చెయ్యగలం ?”

            అతను అదేపనిగా చెప్పుకుపోతున్నాడు. ఆమెలో మళ్ళీ అలజడి మొదలయింది.

*    *  *

            ఓయ్ దేవుడా! ఏమిటి నాలో ఈ మార్పు? ఎలాటి కారణమూ కనిపించదే? ఒకసారి తనే ఆయనకి రాసింది ఓ ప్రేమ లేఖలో- ‘నా వుత్తరాలు చదివే వెంటనే చింపెయ్యండి’ అంటూ. అందుకు ఆయన ఏం రాశారు ?- ‘లేదు ! నీవు రాసిన వుత్తరాలన్నిటినీ బంగీలుగా కట్టించి, వరుసగా లండన్ కి పార్సిల్ చేస్తున్నాను. అక్కడ బ్రిటిష్ మ్యూజియంలో వాటినన్నిటినీ బంగారు పేటికల్లో భద్రపరచమంటాను” అంటూ. ఆ వుత్తరం చదువుకొని, ఎన్ని రాత్రులు తాను నవ్వుకోలేదు?

“ఒంట్లో బాగోడంలేదా?” ఆయన  అడుగుతున్నారు.

“తల నొప్పిగా వుంది” అంటూ తన సమాధానం.

ఘాట్ రోడ్డుకి రెండువేపులా ఎటుచూసినా ఆకుపచ్చని తివాచీ పరచినట్టుగా పసరిక. మైళ్లకి మైళ్ళు నిర్మానుష్యమైన ఘాట్ రోడ్డు. దాన్ని దాటుకొంటూ, కారు ముందుకు  దూసుకుపోతోంది. చీకటిపడింది రాత్రి అయింది. ఆమె మనసు ఒక్కసారిగా కుదుట పడింది…. కథల్లో చదివినట్టుగా శోభనం గది! రాధక్కయ్య వుంటుండే మేడమీద గదినే శోభనం గదిగా అలంకరించారు. అక్కయ్యా, పిల్లలూ మధ్య గదిలోకి మకాం ఎత్తేశారు. మేడ క్రింద గదుల్లోనూ, వరండాలోనూ మేను వాల్చుకోడానికి కూడా ఖాళీ దొరక్క, పెళ్ళికి వచ్చిన చుట్టాలూ, పక్కాలూ శోభనం గది ముందు వరండాలోనే పడుకున్నట్టున్నారు. అందుకే గావును నిన్న రాత్రంతా ఎవరో ఒకరు మేడ మెట్లు ఎక్కనూ, దిగనూ. అందంగా అలంకరించబడివున్న పందిరి మంచంమీద ప్రక్కకి ఒత్తిగిల్లి పడుకున్నదన్నమాటేగాని తనలో అలజడికన్నా ఎందుకో, భయమే హెచ్చుకాసాగింది. ఎన్నాళ్లుగానో తాను కలలు గంటున్న ప్రియుడు తనకి చేరువ అవుతున్న కొద్దీ తన గొంతు తడి ఆరిపోసాగింది. ఒళ్ళంతా జ్వరం వచ్చినట్టుగా సలసల కాలిపోతోంది. చప్పున లేచి నిలబడింది ఆకాశంలో దృష్టిని నిలిపి. తనకు తాను నచ్చ తాను నచ్చ చెప్పుకోజొచ్చింది – ‘పెళ్ళయిన ఇంట్లో సందడి తప్పదు. అందువల్ల మనసుని సరి పెట్టుకొని, తాను ఇన్నాళ్ళుగా కన్న కలలన్నీ పండించుకొని, స్వర్గసుఖాల్లో  తేలిపోవాలిగాని…

            కారు ఒక్క కుదుపుతో మలుపు  తిరిగింది.

            “ఆఁ! కుందేలు! అల్లదిగో కుందేలు” ఆయన వేసిన కేకకి ఆమె ఆలోచనల్లోంచి తేరుకొని, బిత్తరపోయిన చూపులతో రోడ్డు కేసి చూసింది. కారు హెడ్ లైటు కాంతిలో రోడ్డుకి మధ్యన మతి పోయినదానిలా నిలబడిపోయి ఉందో కుందేలు! ఆదే తొలి పర్యాయం తను ఆడవి కుందేలుని చూడటం. ఆయన కారుని స్టార్ట్ చేసి, అటూ, ఇటూ పోనిస్తూ సడన్ బ్రేక్ వేసి, సంతోషంతో ఎగిరి గంతేశాడు “ఆఁ! దొరికింది… కింది !” అంటూ -హెడ్ లైటు ఆర్ప కుండానే కారు దిగి ముందుకొచ్చి, వఁగి “పెద్ద  దేస్మీ కుందేలు!” అంటూ దాని రెండు చెవులూ దొరకపుచ్చుకొని, చేతితో ఎత్తి పట్టి తనకి చూపిస్తూ, కారు వేపు నడిచారు. అప్పుడు చూసింది తాను హెడ్ లైటు  వెలుగులో రక్తం ఓడుతూన్న ఓ మాంసపు ముద్దను.

            “వద్దోద్దు! పారెయ్యండి !” అని  అరిచింది. ఆమె మనసు ఎందుకో  చికాకు పడిపోతోంది. కొద్ది క్షణాల క్రితం వరకూ సజీవంగా ఉన్న ప్రాణి యింతలోనే ఎలాగయిపోయింది? నిలువునా ప్రాణాలు పోగొట్టుకుంది.

            “భలే దానివే! ఇంత మాంసాన్ని పారేసుకుంటారా ఎవరైనా?” అంటూ నవ్వుతూ ఆ చచ్చిన కుందేటిని ఆయన తన ప్రక్కనించే తీసుకువెళ్ళాడు. మొహం దాచేసుకుంది తను.  డిక్కీ  తెరచిన శబ్దమయి ఉలిక్కి పడింది.  స్టీరింగ్ వీల్ దగ్గరకి వచ్చి కూచున్న ఆయన కళ్ళు ఒక విధమైన విజయ భగర్వంతో మెరిసిపోతున్నాయి సీటులో పడి వున్న ప్లానల్ గుడ్డతో చేతులు  తుడుచుకొంటూంటే చూసింది – తెల్లని షర్టు మీద రక్తపు మరకల్ని,

            “భయపడ్డావులా వుంది?” నవ్వుతూ తన భుజం మీద చేతితో మెల్లగా తడుతూంటే తన శరీరం వణికింది. మనసు ఎందుకో అకారణంగా బుసలు కొట్టింది.

            “ఇక్కడికి దగ్గర్లోనే ఒక రెస్ట్ హౌస్ వుంది.  ఈ రాత్రికి మనం అక్కడే గడుపుదాం, ఏం?” అన్నా రాయన. తనకి జవాబు చెప్పాలనిపించ లేదు.

            మళ్ళీ ఆయనే చెబుతున్నారు- “చాలా చక్కటి రెస్ట్ హౌస్ ! పూర్వం అదొక రాజా వారి ప్యాలెస్. ఆయన్ని నేనొక సారి చూడ్డం కూడా జరిగింది. ఉన్న నాలుగు రాళ్లూ జల్సాగా ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు పాపం! చేతిలో చిల్లిగవ్వయినా లేకుండా బాధ పడుతున్నారు. వెయిటర్ నాగుకి పురమాయిద్దాం –  కుందేటి చర్మం అంతా తీసేసి, వుప్పు వేసి, ఫ్రిజ్  లో పెట్టి వుంచమని పుంచమని. ఉదయం దాన్నే బ్రేక్ ఫాస్ట్ చేద్దాం. సన్నగా విజిల్ వేసుకొంటూ ఆయన హుషారుగా చెప్పుకుపోతున్నారు- “ఏం, మాటాడవేం?  ఏమయినా కబుర్లుచెప్పు, లేదా పాటయినా పాడు” అన్నారు.

            తను నవ్వడానికి ప్రయత్నమయితే మయితే చేసింది గాని లాభం లేకపోయింది. ఒక్క రోజులో తనలో  ఈ మార్పేమిటి? కారణం ఊహించలేకపోతోంది తను.

            ఘాట్ రోడ్డు కుడివేపుకి తిరిగివుంది. కారు కూడా మలుపు తిరిగింది.

                        “ఎంత చక్కటి ప్రదేశం!  ఎప్పుడయినా ప్రశాంతంగా గడపాలన్న ఉద్దేశంతో రాజా వారు ముచ్చట పడి, కట్టించుకున్న మహల్ ఇది. శిథిలమైపోతూండటం చూసి, దాన్ని గవర్నమెంటుకి వొప్పగించేశారు. కావలసి వచ్చినప్పుడల్లా రాజ్యమంతట్నీ దఫదఫాలుగా అమ్మేసి, ఆ డబ్బుని  జూదంలో  తగలేశారు రాజా వారు.”

            ఇనుపగేటు ముందుకొచ్చి, కారు నిలిచిపోయింది. గేటు వేసి వుంది. హార్న్ వాయించారు. ఆయన. గేటుకి ఇరుప్రక్కలా ముళ్ళ కంచె వేసివుంది. లోపల్నుంచి  నల్లకోటు, చెడ్డీతో ఓ కుర్రాడు వచ్చి, గేటు తాళం తీశాడు. పోర్టికోలో లైటు వెలిగింది. కారుని పోర్టికోలోకి పోనిచ్చి, ఆపేశారు. కారులోంచి దిగి, ఆయన “నాగూ ఏడీ?” అంటూ ఆడిగారు.

             ఇంతలో ముసలివాడొకడు మెట్లు  దిగి వచ్చి, ఆయనకి సలాం చేశాడు. వాడి కన్నొకటి గుడ్డిది. గడ్డం బాగా పెరిగింది. మూడు గదుల్లోనూ ఒకటి మాత్రమే ఖాళీగా వుందని చెబుతున్నాడు నాగూ. ‘సరే! నువ్వుపోయి సామానంతా పట్టించుకురా’ అని వాడికి పని పురమాయించి, ఆయన డిక్కి తెరచి, చచ్చిన కుందేటిని తీసి, వాడి చేతికిచ్చి తనను  కారులోంచి దిగిరమ్మని చెప్పారు. తాను  కారు దిగివచ్చి, పోర్టికో స్తంభాన్ని ఆసరా చేసుకొని ఆసరా చేసుకొని నిలబడి చుట్టూరా కలియ జూచింది. అలా చూస్తుంటే తనలో రవంతయినా ఉత్సాహం కలగడం లేదు.

            కారులోంచి పెట్టే, బెడ్ యితర సామాగ్రి గదిలోకి తెచ్చారు నాగూ, ఆ కుర్రాడు. గదంతా ఒక విధమయిన  దుర్గంధం. నాగూ గదిలోని కిటికీలన్నిటినీ తెరిచేశాడు. ఆయన బాత్ రూం లోంచి తిరిగి వస్తూ, నాగూతో “బాత్ రూంలో మురుగు నీరంతా నిలవయిపోయింది. మరో గది చూడు” అని చెబుతున్నారు.

 “అలాగే బాబూ! సూసొత్తా”నంటూ నాగూ వెళ్ళిపోయాడు. ఆయనా, తనూ గదికి ముందున్న చిన్న హాలులోకి  వచ్చారు. లైట్ వెలిగించి, సోఫాలో కూచున్నారు.

            ఎదురుగా వున్న గది తలుపులు వేసి వున్నాయ్. అయినా లోపల్నిఁచి ఎవరివో కంఠాలు వినిపిస్తున్నాయి. శ్రద్ధగా వింది తాను. ఎవరిదో ఆడమనిషి కంఠం. అవతలి పేపు కారిడార్ లో చిమ్మచీకటిగా  వుంది.

            “బాగా అలిసిపోయి నట్టున్నావు” ఆయన కంఠం మృదువుగా పలికింది.

            “ఉహూఁ!”

             “ఆకలవుతోందా?”

         “లేదు”

            లోపల ఎక్కడో ఓ బాటిల్ నేల మీద పడి పగిలిన శబ్దం. ఆ మసక వెలుతురులో నాగూ కొరవి దెయ్యంలా అటూ, ఇటూ తిరుగుతున్నాడు. గట్టిగా అడుగులు వేస్తే ఎక్కడ శబ్దం అవుతుందో అన్నట్టుగా పిల్లి అడుగులు వేసుకొంటూ నడుస్తున్నాడు. తాను మొక్కు బడికి భోజనం అయ్యిందనిపించి, లేచి హాలులోకి వచ్చి సోఫాలో కూచుంది. పాపం! ఆయనకి బాగా ఆకలివేసోంది గావును. లొట్ట లేసుకొంటూ వండిన వంటకాలన్నిటినీ ఒక్కరే పట్టించేసి, చేయి కడుక్కొని వస్తూ నాగూతో ఏదో చెబుతున్నారు.

            “నీకో శుభవార్త! ఈ రాత్రికి మనం రాజావారి శయన మందిరంలో నిద్రించబోతున్నాం. ఈ మహల్ ని అమ్మేస్తూ  ఈ రాజావారు ఒక షర్తు పెట్టారట. తనకి ఎప్పుడవసరమైనా యిచ్చేట్టుగా ఓ గదిని విడిగా అట్టిపెట్ట మన్నారు. ఆ గదిని ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దెకి యివ్వరట. ఇప్పుడాయన పంతలూరు దగ్గర రెండెకరాల మాగాణి తీసుకొని, అందులో బంగాళా దుంపలు పండిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారుట “తన రెండు భుజాలు పట్టి కుదుపుతూ ఆయనెంతో ఉత్సాహంగా, హుషారుగా చెప్పుకుపోతున్నారు. ఏం వుంది ? ఆనాగూ గాడికి ఐదు రూపాయలు టిప్ పడేశా. అంతే అంతా సిద్ధమయి పోయింది. ఈ రాత్రికి- మన హనీమూన్ రాయల్ ఛేంబర్లో!” పెద్ద పెట్టున ఆయన ఒకటే నవ్వు. “మరి ఆలస్యం దేనికి? కమాన్ ! గెట్ అప్!” తన నడుంచుట్టూ చేతులు పోనిస్తూ ఆయన “ఏం? దేవిగార్ని చేతుల మీద ఎత్తుకు తీసుకెళ్లాలా?” ఇంగ్లీషువాడి హనీ మూన్ ఈ పద్ధతిలోనే జరుగుతుందని మేలమాడారు. వద్దని ఆయన్ని వారిస్తూ మందహాసం చేస్తూ, ఆయనతో కలిసి తాను కూడా రాజావారి శయన మందిరంలోకి అడుగు పెట్టింది.

*   *  *

            ఆ గదికి సున్నం కొట్టి ఎన్నేళ్ళు అయి వుంటుందో! బాగా మాసిపోయి వున్నాయి గోడలు. వాటి మీద అక్కడక్కడా పెద్దపెద్ద ఫ్రేముల్లో తైలవర్ణ చిత్రాలు వేలాడదీసి వున్నాయి. అవన్నీ  పాతబడి పోయాయనుకోండి. కిటికీలకి కట్టిన సాటిన్ పరదాలు అక్కడక్కడ చిరుగులు దేరి వున్నాయి. క్రింద పరిచి వున్న తివాచీ కూడా మాసిపోయి వుంది. ఎత్తు తక్కువ పందిరికోళ్ల మంచంమీద కూచుంది ఆమె. పాత స్ప్రింగులు కావడంవల్ల కిర్రు మంది మంచం. ఎదురుగా వున్న గోడకి చనిపోయిన చిరుతపులి శరీరం మీద కాలు మోపి, నిలబడివున్న వేటగాని చిత్రం. దాన్నే తదేకంగా చూస్తూ కూచుంది ఆమె.

            అతను గది తలుపు వేసి, షర్టు బొత్తాలు వూడదీసుకొంటూ వచ్చి ఆమె పక్కలో కూచున్నాడు. అతని షర్టు మీద పడ్డ రక్తపు మరకల మీదకి ఆమె దృష్టి పోయింది. గుండ్రంగా వున్న  తలగడ  మీద మోచేతిని ఆనించి, మంచం మీదికి మెల్లగా ఒరిగిపోయింది. మంచానికి చేసిన నగిషీ పనిని తిలకిస్తూ అవతల వేపుకి తిరిగి పడుకుంది. ఆమె హృదయంలో చెప్పరాని ఆ వేదన. ఎందుకో గట్టిగా ఏడ్చెయ్యాలని అని పిస్తోంది.

“నిద్రవస్తోందా ?”

ఆమె పలకలేదు- ఉలకలేదు.

“పద్మా !”

“పద్మా !” అతని కంఠం క్రోధంతో బుసలుకొడోంది.

“ఏమిటి? వులకవేం? పలకవేం ? నాకు ఫలానది కావాలని ఏడవ్వొచ్చుగా! పొద్దుట్నించి నీవాలకం అంతా కనిపెడ్తూనే వున్నాను” పద్మకి అతని కంఠం సరికొత్తగా వినిపించింది. ఆమె భుజంమీద అతను చెయ్యి వేశాడు. అది చెయ్యి కాదు. ఇనుప పిడికిలి.  క్షణం తర్వాత ఇద్దరూ విడిపోయారు. అతను కిటికీ దగ్గర కెళ్ళి సిగరెట్టు వెలిగించాడు. అవిచ్ఛిన్నంగా పొగ  వదుల్తున్నాడు.

            ఆమె తలగడలో మొహం దూర్చు కొని, ఉవ్వెత్తున వస్తున్న దుఃఖాన్ని అతికష్టం మీద ఆపుకుంటోంది- కాళ్ళ చప్పుడు మంచానికి దగ్గరయింది.

“ఏమిటి, పద్మా! ఏమయిందో  చెప్పు?”

“వెళ్ళండి! నన్ను ముట్టుకోకండి. దూరంగా పొండి” ఆమెలో ఏదో శక్తి ఆవహించినట్టయి క్షణం సేపు సర్వమూ మర్చిపోతూ పిచ్చిగా అరిచింది.

“చెప్పు, పద్మా ! ఏం జరిగిందో !” అంటున్నాడు అతను అనునయంగా-

            భర్త మాటకి ఆమె బదులు చెప్పడం లేదు. ఏం చెప్పాలో కూడా తోచ డం లేదు. గదంతా చిమ్మ చీకటిగా వుంది. ఆ చీకట్లో రాజావారి పందిరి మంచం మీద ఒక ప్రక్కకి ఒత్తి గిల్లి, కొద్దిపాటి జాగాలోనే సర్దుకొని, కదలక మెదలక పడుకొని, చెమ్మగిల్లిన కళ్ళతో ఆమె కిటికీ తెరగుండా అవతలి వేపు మసకగా వున్న వెలుతురులోకి దృష్టి  సారించింది.

*  *  *

ఎం.టి.వాసుదేవన్ నాయర్
నిర్మలానంద
కీర్తిశేషులు ముప్పన మల్లేశ్వరరావు గారు హిందీ సాహిత్య పరిచయంతో నిర్మలానంద వాత్సాయన్‌గా కలంపేరు పెట్టుకున్నారు.తన 84 ఏళ్ల జీవితంలో 66 ఏళ్లపాటు సాహిత్య సేవలోనే నిమగ్నమయ్యారు.1952లో భారతి పత్రికలో ఆయన స్వీయ రచన మార్పు కథ ప్రచురితమైంది. నిర్మలానంద, విపుల్ చక్రవర్తి, తెలుగు దాసు, ముప్పన రుక్మిణి, కొండపల్లి శైలజ వంటి అనేక పేర్లతో వందలాది కథలను తెలుగులోకి  అనువాదం చేశారు.  ఆయన ఆప్త మిత్రుడు జీవరక్షణ రావు(జీవన్) సూచన మేరకు స్వీయ రచనలకు స్వస్తి పలికాడు. అప్పటి నుంచి పూర్తిస్థాయిలో అనువాద రంగానికే పరిమితమయ్యారు. నిర్మలానందకు ప్రముఖ బెంగాలీ రచయిత మహా శ్వేతాదేవితో మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆమెపై 1997 మార్చిలో ప్రత్యేక సంచికను తెచ్చారు. అల్లూరి సీతారామరాజు శతజయంతి సందర్భంగా ఆయనపై ‘మన్యం వీరుని పోరుదారి’ అనే వ్యాససంకలనాన్ని ప్రచురించారు. దీన్ని మహా శ్వేతాదేవి చేతులమీదుగా ఆవిష్కరింపచేశారు తెలుగు నుంచి చలం, శ్రీశ్రీ,రావి శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, పాలగుమ్మి పద్మరాజు, వి.రాజారామ్మోహన్ రావు, అల్లం శేషగిరి రావు, బలివాడ కాంతారావు, భాలగంగాధర్ తిలక్, కుందుర్తి, శేషేంద్ర శర్మ, శీలా వీర్రాజు, శివారెడ్డి, ఛాయరాజ్, శీలా సుభద్రా దేవీ, కొప్పుల భానుమూర్తి, ఖదీర్ బాబు రచనలను హిందీ, మలయాళం, సింధీ, పంజాబీ, బెంగాలీ, ఒరియా, మైథిలీ, డోగ్రీ తదితర భాషల్లోకి అనువదింప చేశారు.. కేరళ నుంచి వెలువడే యుగ ప్రభాత్ పత్రికలో 1960లో అప్పటి పత్రిక ఎడిటర్ రవి వర్మ సహకారంతో దాదాపు మూడేళ్ల పాటు ఉగాది ప్రత్యేక సంచికలను హిందీలోకి తీసుకు వచ్చారు.

Spread the love

One thought on “నల్లనివెన్నెల

  1. అద్భుతమైన కథ .. కథనం .. అలవోకగా చదివించే అందమైన అనువాదం. గొప్ప కథని ఎంపిక చేసిన మీకు అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *