డాన్ నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది Part 22

Spread the love

ప్రోఖోర్ షామిల్ భార్య తన తలను గట్టిగా నెలకేసి బాదుతూ, పళ్ళ బిగువున బాధ భరిస్తూ ఏడుస్తూ ఉంది. తన భర్త సోదరుడు మార్టిన్ షామిల్ గర్భవతి అయిన తన భార్యను, పిల్లలనుఒళ్ళో కూర్చొబెట్టుకుని, వారికి బహుమతులు ఇస్తూ ఉన్నది చూస్తూ ఉంటే ఆమె దుఃఖం అధికమయ్యింది. ఆమె నేల మీద పాకుతూ ఏడుస్తూ ఉంటే, ఆమె పిల్లలు ఆమె చుట్టూ చేరి, బిత్తరపోయి భయంతో తల్లివైపు చూస్తూ ఉన్నారు.

   ‘పో, వెళ్ళి అతను ఆఖరి సారి ధరించిన చొక్కాను తెచ్చుకో! నిస్సారమైన జీవితం వల్ల పలుచబడిన నీ జుట్టుని కత్తిరించి పడెయ్యి. రక్తం స్రవిస్తూ ఉన్న నీ పెదాలను కొరుకుతూ, పని వల్ల గట్టిపడిన నీ చేతులను తల పక్కన పెట్టుకుని, ఖాళీగా ఉన్న నీ ఇంటి గడపకేసి నీ తలను కొట్టుకో! ఆ ఇంటికి ఇక యజమాని లేడు, నీకు ఇక భర్త లేడు, నీ పిల్లలకు తండ్రి లేడు. గుర్తు పెట్టుకో! ఇక నిన్ను కానీ అనాథలైన నీ పిల్లలను కానీ కష్టాల నుండి, పేదరికం బాధల నుండి కాపాడే వాడే లేడు. నువ్వు కన్నీళ్ళు పెట్టుకున్న రాత్రుల్లో నిన్ను తన గుండెలకు ఆనించుకుని, ‘ఏం బాధ పడకు! నేను చూసుకుంటాను!’అని భరోసా ఇచ్చే స్వరమే లేదు! ఇక నీకు ఇంకో భర్త దొరకడు ఎందుకంటే పని వల్ల నీ శరీరం శుష్కించిపోయింది; అర్థ నగ్నంగా నేల మీద పాకుతూ ఉన్న నీ కొడుక్కి తండ్రి కూడా లేడు. ఇక నుండి పొలంలో రొప్పుతూ ఎండలో సేద్యం నువ్వే చేయాలి. ఏదో ఒక రోజు నీలో ఉన్న రక్తం అంతా ఇంకిపోయి, నీలో జీవం పోయేవరకు నువ్వు ఈ చాకిరి చేస్తూనే ఉండాలి’, ఏదో అజ్ఞాత స్వరం ఆమెలో ధ్వనిస్తూ ఉంది.

      పాతవైన తన కొడుకు లోదుస్తులు చేతిలో పెట్టుకుని, అలెక్సి బెష్ నాయక్ తల్లి కొడుకును తలుచుకుంటూ రోదిస్తూ ఉంది.కానీ వాటిల్లో కొడుకు గుర్తులు ఏవి ఆమెకు కనబడలేదు. మిష్కా కొషివొయ్ తెచ్చి ఇచ్చిన  చొక్కా నుండే కొడుకు చెమట వాసన కొద్దిగా వస్తూ ఉంది, దానిలో తల దాచుకుని ఆ తల్లి ఏదో గొణుక్కుంటూ ఉంది.

  మానిస్కోవ్, అఫోంకా ఒజీరోవ్, యెవ్లాంటి  కాలినిన్, లిఖోవిడోవ్, యెర్మకొవ్,అలాగే ఇంకొందరి కొసాక్కుల కుటుంబాలకు మగవాళ్ళు లేకుండా పోయారు.

  కేవలం స్టీఫెన్ అష్టాకోవ్ గురించి మాత్రం ఎవ్వరూ కన్నీరు పెట్టలేదు-అలా పెట్టడానికి ఎవ్వరూ లేరు కూడా! కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న అతని ఇల్లు ఖాళీగా ఉంది. అక్సిన్య ఇంకా యాగ్డోనోయ్ లోని ఎస్టేట్ లోనే ఉంటూ ఉంది.ఆమె గురించి గ్రామంలో ఏ వార్త లేదు, గ్రామానికి ఆమె కూడా ఎప్పుడో ఒకసారి తప్ప వచ్చేది కాదు. ఆమెకు ఇక్కడ జరుగుతున్నవి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు.

  ఎగువ డాన్ ప్రాంతానికి చెందిన కొసాక్కులు మాత్రం బృందాల వారీగా, తమ తమ గ్రామాలకు తిరిగి వచ్చారు. డిసెంబర్ ఆఖరుకల్లా వ్యోషేన్ స్కాయా నుండి యుద్ధానికి వెళ్ళిన వారిలో బ్రతికి ఉన్నవారు తిరిగివచ్చేశారు.

   టాటార్ స్కీ గుండా రాత్రి పగలు తేడా లేకుండా డాన్ కి ఎడమ వైపు ప్రాంతానికి గుర్రాల మీద గుంపులుగుంపులుగా సైనికులు తిరిగి ఇళ్ళకు వెళ్తూనే ఉన్నారు.

   ‘ఎక్కడి నుండి వస్తున్నారు?’ ముసలి వాళ్ళు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి మరి వారిని అడుగుతూ ఉండేవారు.

   ‘కొర్నాయా రెచ్కా’, ‘జీమోవ్ని’, ‘దుబ్రోవ్స్కా’, ‘రెశెతోవ్స్కీ’, ‘దుదారేవ్కా’, ‘గోరోఖోవా’, ‘అలిమోవ్కా’, లాంటి ఎన్నో జవాబులు వచ్చేవి.

  ‘యుద్ధంతో అలసిపోయారా?’ ఆ వృద్ధులు వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉండేవారు.

   బాధ్యతగా వ్యవహరించే సైనికులు, కొంత సంస్కారం ఉన్నవారు చిన్నగా నవ్వుతూ, ఈ రకమైన జవాబులిచ్చేవారు.

   ‘ఇక చాలు!ఇప్పటికే విసిగిపోయి ఉన్నాం.’

   ‘ఇప్పటికే చావు లొట్టపోయి ఎలాగో ఇంటికి వెళ్తున్నాం.’

   ఇంకొందరైతే దురుసుగానే సమాధానం చెప్పేవారు.

    ‘పోయి, నోర్మూసుకుని ,ఇంత తాగి ఇళ్ళల్లో పడుకోండి, ముసలి పీనుగుల్లారా!’

   ‘అసలు మీకు ఏం కావాలి?తెలుసుకుని ఏం చేస్తారు?’

  ‘మీలాగా ఇప్పుడో అప్పుడో పోయేటట్టు ఉన్నవారి కన్నా ముందే పోయిన వారి శవాలతో నిండిపోయి ఉంది అక్కడ!’

  చలికాలం ఆఖరి రోజుల్లో ప్రచ్చన్న యుద్ధ ఛాయల బీజాలు నోవోచెర్కాస్క్ చుట్టూ బలపడసాగాయి. కానీ ఎగువ డాన్ ప్రాంతానికి చెందిన గ్రామాలు,స్టానిట్సాల్లో మాత్రం అంతా ప్రశాంతంగా ఉంది. బయటకు కనబడకపోయినా ఇళ్ళల్లో మాత్రం ఇవి బయటపడుతూ ఉండేవి. యుద్ధం నుండి వచ్చిన వారికి ఇంట్లో ఉన్న వృద్ధుల అభిప్రాయాలూ,వాదనలు పొసగేవి కావు.

    ఇక పోతే డాన్ సైన్య ప్రాంత రాజధాని దగ్గర నుండి వస్తున్న యుద్ధ వార్తలు వదంతులే తప్ప, వాటిల్లో వాస్తవాలు కూడా పెద్దగా తెలియరాలేదు. చుట్టూ జరుగుతున్న రాజకీయ మార్పుల గురించి అతి తక్కువ తెలిసిన ప్రజలు, ఓపికతో వాటి పరిణామాలు ఎలా దారి తీస్తాయో అని ఎదురు చూస్తూ ఉన్నారు.

   జనవరి వరకూ కూడా టాటార్ స్కై అంతా ప్రశాంతంగా ఉంది. యుద్ధం నుండి వచ్చిన కొసాక్కులు ఇంట్లో వారితో కులాసాగా ఉంటూ,కడుపు నిండా తింటూ, అంతా చక్కబడిందని అనుకుంటూ ఉన్నారు. కానీ యుద్ధానికి మించిన ఇబ్బందులు వారి కోసం వారి ఇంటి గుమ్మాల దగ్గరే వేచి చూస్తున్నాయని వారికి ఆ క్షణంలో తెలియదు.

                                                  *    *   *

                                    అధ్యాయం-2

  1917 జనవరిలో, గ్రెగరి మెలఖోవ్ సేవలకు గుర్తింపుగా అతనికి కొర్నెట్ పదవి, రెండవ రిజర్వ్ రెజిమెంటు బాధ్యతలు అప్పగించబడ్డాయి.

   సెప్టెంబర్ లో న్యుమోనియా నుండి అతను కోలుకున్నాక అతనికి సెలవు కూడా లభించింది. దాదాపు ఆరు వారాల పాటు అతను ఇంట్లోనే ఉన్నాడు,పూర్తిగా కోలుకున్నాక, జిల్లా వైద్య సమితి నిర్వహించిన  ‘ఆరోగ్య ధృవీకరణ పరీక్ష’లో నెగ్గాక, అతను తిరిగి తన రెజిమెంటుకి వచ్చాడు. అక్టోబర్ విప్లవం తర్వాత అతన్ని ఒక  వైమానిక దళ బృందానికి నాయకత్వ బాధ్యతలు ఇచ్చారు.ఆ సమయంలో అతని మనసులో వస్తున్న పరివర్తన, తన చుట్టూ జరుగుతున్న సంఘటనలు ; వీటితో పాటు , ఆ రెజిమెంటులోని లూయీటెంట్ యెఫిమ్ ఇజ్వారిన్ తో అతని సాన్నిహిత్యం- వీటి అన్నిటి తాలూకూ ప్రభావం అతన్ని ఓ భిన్న మనిషిలా రూపొందడానికి దోహదపడుతూ ఉంది.

    తాను సెలవు నుండి వచ్చిన తర్వాత గ్రెగరికి ఇజ్వారిన్ పరిచయమయ్యాడు. అప్పటినుండి పనిలో ఉన్నా లేకపోయినా అతనితో తన బంధాన్ని గ్రెగరి కొనసాగిస్తూనే ఉన్నాడు. తనకే తెలియకుండా అతని ప్రభావంలో పడిపోయాడు.

    గుండోరోవస్కాయా   స్టానిట్సా కి చెందిన ఒక సంపన్న కొసాక్కు కుటుంబానికి చెందినవాడు యెఫిమ్ ఇజ్రావిన్. నొవొచేరాస్క్ లో ఉన్న కళాశాలలో చదువుకుని, గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక, సరాసరి 10 వ డాన్ కొసాక్కు రెజిమెంటులో చేరిపోయాడు. ఒక సంవత్సరం అందులో ఉండి, 14 చోట్ల శరీరంలో అనేక చోట్ల తూటాలు దూసుకుపోయాక, అతని మెడలో ఒక సెయింట్ జార్జ్ క్రాస్ తో సత్కరించి, తర్వాత అతనికి మిగిలి ఉన్న సైన్య కాలాన్ని రెండవ రిజర్వ్ రెజిమెంటుకి పరిమితం చేశారు.

      మిగిలిన కొసాక్కు అధికారుల కన్నా గొప్ప మేధాపాటవాలు, అసాధారణ ధైర్యం, గొప్ప చదువు ఉన్నవాడు యెఫిమ్ ఇజ్రావిన్. అలాగే కొసాక్కుల స్వయంప్రతిపత్తి పట్ల అంకితభావం కలవాడు. ఫిబ్రవరి విప్లవం అతని ప్రతిభా సామర్థ్యాలకు అవకాశం ఇచ్చింది. కొసాక్కు ప్రాంతానికి స్వీయ అధికారం కావాలని గాఢంగా అభిలషిస్తున్న బృందాలతో కలిసి, కొసాక్కు సైన్య ప్రాంతానికి ఆ అధికారం కావాలని గట్టిగానే నిరసన చేశాడు. జార్ రాకముందు ఉన్న స్వాతంత్యం డాన్ ప్రాంతానికి తిరిగి వచ్చేలా చేయడమే ఈ తిరుగుబాటు ఉద్దేశ్యం. అతనికి చరిత్ర గురించి గొప్ప అవగాహన ఉంది, అలాగే ఎంతో ఉత్సాహవంతుడు కూడా. ఎంతో స్పష్టంగా డాన్ భవిష్య చిత్రాన్ని కళ్ళకు కట్టినట్టు ఊహించేవాడు. ఆ ఊహ వినే వారి కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేది. ఆ చిత్రంలో బయటి వారి అధికారం లేకుండా డాన్ కౌన్సిల్ పాలనలో ఉన్న డాన్ ప్రాంతం, ఒక్క రష్యా వాడు కూడా కనిపించని ప్రాంతం, ఆ ప్రాంత సరిహద్దులకు గట్టి కాపలా, ఉక్రేనియా ,రష్యా ల గురించి సమానంగా మాట్లాడే స్వేచ్చ, వారి ముందు తమ టోపీలు దించుతూ, లొంగి ఉండే దౌర్భాగ్యం లేకుండా, వారితో సమానంగా వర్తకవ్యాపారాలు కొనసాగించడం స్పష్టంగా అందరికీ కనిపిస్తూ ఉండేది. సాదా సీదా కొసాక్కులను,మిడిమిడి జ్ఞానంతో ఉన్న కొసాక్కు అధికారులను తన వైపుకి తిప్పుకోగలిగాడు ఇజ్రావిన్. గ్రెగరి కూడా అతని మాయలో పడిపోయాడు. మొదటి వారిద్దరి మధ్య వాడి వేడి వాదనలు ఎన్నో జరిగాయి. కానీ చదువు లేని గ్రెగరి, ఆ చదువుకుని ,అసాధారణ వాదనా పటిమ గలిగిన ఇజ్రావిన్ దగ్గర ఓడిపోయి లొంగిపోయాడు. వాళ్ళు సాధారణంగా బ్యారక్ గది వెనుక వాదులాడుకునేకునేవారు, కానీ ఎప్పుడూ వినే వారు ఇజ్రావిన్ తోనే ఏకీభవించేవారు. ఖండనకు లొంగని వాదనలు, డాన్ స్వాతంత్ర్యం, అందులోని గొప్ప జీవితం, వినేవారికి అద్భుతంగా తోచేవి.

   ‘కానీ మనం రష్యా లేకుండా ఎలా మనుగడ సాగించగలం? మన దగ్గర గోధుమలు తప్ప ఏమి లేవే?’ గ్రెగరి అడిగేవాడు.

  ఇజ్రావిన్ ఎంతో ఓపికతో వివరించేవాడు.

   ‘నేను డాన్ గురించి ఒక స్వాతంత్ర్యం సాధించిన ఒక ఒంటరి దేశంగా భావించడం లేదు. ఒక ఒప్పందం చేసుకుని మనం కుబాన్, తెరెక్,అలాగే కాకస్ పర్వత ప్రాంతాల వారితో కలిసి ఉందాం. కాకస్ లో ఎంతో ఖనిజ సంపద ఉంది; మనకి కావాల్సినవి అన్నీ అక్కడే దొరుకుతాయి.’

  ‘మరి బొగ్గు పరిస్థితి ఏమిటి?’

  ‘డొనేట్ల బొగ్గు గనులు మనకి నడక దూరంలోనే ఉన్నాయి.’

  ‘కానీ అవి రష్యాకి చెందినవి.’

  ‘అవి ఎవరికి చెందినవి, ఎవరి ప్రాంతంలో ఉన్నాయి అన్న ప్రశ్న మీద అనేక వాదనలు నడుస్తూ ఉన్నాయి. ఒకవేళ ఆ డొనేట్ల బొగ్గు గనులు రష్యాకు చెందినవి అయినా, మనకు పోయేది తక్కువే. అయినా మన యూనియన్ సమాఖ్య ఈ పరిశ్రమ మీద మాత్రమే ఆధారపడి ప్రతిపాదనలు చేయదు. అయినా మన దేశం వ్యవసాయ ఆధారితమైనది. కనుక మనకు కావల్సిన బొగ్గును రష్యా నుండి కొనుక్కుని, మనకున్న పరిమిత అవసరాలను తీర్చుకోవచ్చు. ఈ ఒక్క బొగ్గే కాదు, ఇంకా ఎన్నింటినో మనం రష్యా నుండి కొన్నుకోవాల్సి రావొచ్చు. అంటే కలప, లోహాలు, యంత్ర నిర్మిత వస్తువులు; ఇలాంటివెన్నో మనకు అవసరం; వాటికి బదులుగా మనం మన దగ్గర ఉండే గోధుమలు, నూనె రవాణా చేస్తాము.’

   ‘కానీ విడిపోవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి?’

   ‘ఎన్నో లాభాలు ఉన్నాయి. ముందు అసలు ఈ రాజకీయ కుట్రలకు దూరంగా ఉండొచ్చు. రష్యా జార్లు నాశనం చేసిన మన ప్రాంతాలను తిరిగి బాగు చేసుకోవచ్చు, బయటి దేశస్థులను తరిమికొట్టొచ్చు. ఒక పదేళ్ళల్లో బయటి దేశాల నుండి యంత్రాలు కూడా దిగుమతి చేసుకుని, మనం కూడా మన ఆర్థిక వ్యవస్థను వృద్ధి పరుచుకుంటూ ధనవంత దేశంగా మారవచ్చు. ఈ నేల మనది. ఈ మాతృభూమి మన పూర్వీకుల రక్తంతో తడిసి, వారి ఎముకలతో జవసత్వాలను పొందింది. కానీ రష్యాకి లొంగిపోయినప్పటి నుండి, ఈ నాలుగు వందల ఏళ్ళ కాలంలో ఆ దేశానికి ఊడిగం చేస్తూ మన గురించి పట్టించుకోలేదు. మనకు సముద్రమార్గాలు కూడా ఉన్నాయి.  మన దేశ రక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే సైన్యం మనకు ఉంది; కనుక అటూ రష్యా అయినా ఇటూ ఉక్రెయిన్ అయినా సరే ; మన స్వేచ్చను హరించే సాహసం చేయలేదు!’

   మధ్యస్థ ఎత్తుతో,  ధృఢకాయంతో, విశాలమైన ఛాతితో ఉండే ఇజ్వారిన్ ఒక ప్రత్యేక కొసాక్కు; పసుపు వర్ణంలో ఉన్న రింగులు తిరిగే జుట్టు, గోధుమ రంగు ముఖం, మంచి ఛాయతో ఉండే నుదురు,ఎండ ముఖం పెద్ద పట్టనివాడు కావడం వల్ల ఒక్క బుగ్గలు మాత్రమే కొంత సూర్యరశ్మి తాకిన జాడలతో ఉన్నాయి.అతను గంభీరంగా, నెమ్మదిగా మాట్లాడేవాడు. మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎడమ కన్ను కొడుతూ ఉండటం, ఏదో వాసన చూస్తున్నట్టు ముక్కు పుటాలు ఎగరెయ్యడం అతనికి అలవాటు.ఉత్సాహవంతమైన నడకతో, ఆత్మవిశ్వాసం శోభిల్లే కళ్ళతో ఉన్న అతని రూపమే రెజిమెంటులో మిగిలిన అధికారుల కన్నా అతన్ని ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండేలా చేశాయి. ఆ రెజిమెంటు కమాండర్ కన్నా కూడా కొసాక్కులు అతనికే ఎక్కువ గౌరవం ఇచ్చేవారంటే అతిశయోక్తి కాదు.

     అతను, గ్రెగరి గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండేవారు. అంతకుముందు మాస్కోలో స్నేగిర్యోవ్ కంటి ఆసుపత్రిలో గరంజాతో మాట్లాడినప్పుడు కలిగిన భావాలే ఇప్పుడు గ్రెగరికి కలుగుతున్నాయి. ఆ ఇద్దరి మాటలు పోల్చుకుంటూ, సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేశాడు. కానీ అది అతనివల్ల కాలేదు. మెల్లమెల్లగా అతను ఈ కొత్త ఆలోచనలను అంగీకరిస్తూ, వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు.

   అక్టోబర్ విప్లవం జరిగిన తర్వాత గ్రెగరికి, ఇజ్రావిన్ కి మధ్య ఈ క్రింది సంభాషణ జరిగింది.

   ఎన్నో ఆలోచనలు తొలిచి వేస్తూ ఉంటే, గ్రెగరి ఆలోచించుకుని, ఆచ్చి తూచి బొల్షివిక్కుల గురించి ఓ ప్రశ్న అడిగాడు.

   ‘సరే ఇది చెప్పు, యెఫిమ్ ఇవానిచ్. బొల్షివిక్కుల సంగతి ఏమిటి? వారి వల్ల నిజంగానే ఏదైనా సాధించారా ? వారి చేసింది తప్పా? ఒప్పా?’

  గ్రెగరి వైపు కళ్లెత్తి చూస్తూ, ఇజ్వారిన్ చిరునవ్వు నవ్వాడు.

  ‘సాధించారా  ……? హా…హా….. చూడు సోదరా, ఏదో ఇప్పుడే పుట్టిన పిల్లవాడిలా అడుగుతున్నావే! బొల్షివిక్కులకి వారిదైన కార్యప్రణాళిక, ఆశయాలు, లక్ష్యాలు ఉన్నాయి. మన వైపు నుండి ఆలోచిస్తే ఎలా మనకు సరైనదే అనిపిస్తుందో,అలాగే  వారి వైపు ఆలోచిస్తే వారు కూడా చేసింది సరైనదే. అసలు బొల్షివిక్కుల పార్టీని ఏమని పిలుస్తారో తెలుసా? తెలియదా? కానీ నువ్వు తప్పక తెలుసుకోవాలి. రష్యా సోషల్ డెమొక్రాటిక్ లేబర్ పార్టీ అని! అర్థమైందా? అంటే శ్రామికుల పార్టీ అని! ఆ సమయంలో వాళ్ళు సన్నకారు రైతులతోనూ, కొసాక్కులతోనూ సన్నిహితంగా ఉన్నట్టు కనిపించినా, వారు పని చేస్తుంది మాత్రం శ్రామికుల కోసమే. వాళ్ళు శ్రామికుల స్వేచ్చ కోసం రైతాంగ వ్యవస్థను నాశనం చేస్తారు. నిజ జీవితంలో ప్రతి ఒక్కరికీ అన్నీ సమానంగా లభించడమనేది జరిగే పని కాదు. ఒకవేళ బొల్షివిక్కులు ఈ విషయంలో విజయం సాధిస్తే, అది శ్రామికులకు మంచిది, మనకు మాత్రం కాదు!ఒకవేళ రాచరిక వ్యవస్థ అధికారంలోకి వస్తే, భూస్వాములకు, ఆస్తులు ఉన్న వర్గాలకు లాభం తప్ప మనకి ఓరిగేదేమి లేదు. మనకు ఈ రెండిట్లో ఏది అవసరం లేదు. మనకు కావాల్సింది మన సొంత ప్రభుత్వం, అన్నిటిని మించి కొర్నీలోవ్ ,కేరెన్ స్కీ లేదా లెనిన్ లాంటి వాళ్ళ రాజకీయ పెత్తందారీతనం నుండి విముక్తి పొందడం. అసలు మన భూమిని మనమే చక్కగా వృద్ధి చేసుకోగలము, దేవుడి దయ వల్ల కొందరు మిత్రులు ఉంటే చాలు; ఆ శత్రువులను కూడా భయపడేలా చేయగలము.’

   ‘కానీ ఎక్కువ మంది కొసాక్కులు మాత్రం బొల్షివిక్కులవైపు ఆకర్షితులు అవుతున్నారు.అది మీకు తెలుసా?’

  ‘గ్రీషా, నా ప్రియా మిత్రుడా,నువ్వు అసలు విషయం అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. ఇప్పుడు కొసాక్కులు, చిన్నకారు రైతులు కూడా బొల్షివిక్కుల మార్గంలోనే వెళ్తున్నారు. ఎందుకో తెలుసా?’

  ‘ఎందుకు?’

  ‘ఎందుకంటే …..బొల్షివిక్కులు త్వరితంగా శాంతిని నెలకొల్పుతామని చెప్తున్నారు. కొసాక్కులు ఇప్పుడే యుద్ధ రంగంలో ఉన్నారు!’ అంటూ ఇజ్వారిన్ గట్టిగా నవ్వాడు.

  తన బుగ్గ మీద తానే చిన్నగా కొట్టుకుని, తన కనుబొమ్మలు పైకి ఎత్తుతూ, ఇజ్వారిన్ గట్టిగా అరుస్తున్నట్టు అన్నాడు. ‘అందుకే కొసాక్కులు బొల్షివిక్కులపై ఆకర్షితులయ్యారు. కానీ యుద్ధం అయిపోగానే అదే బొల్షివిక్కులు మన కొసాక్కుల భూములు,ఆస్తులు లాక్కుంటారు. అప్పుడు కొసాక్కుల, బొల్షివిక్కుల మార్గాలు వేరవుతాయి. అది తప్పక జరుగుతుంది, చరిత్రలో నమోదవుతుంది కూడా. ఇప్పుడు కొసాక్కుల సామాజిక జీవితానికి, ఈ బొల్షివిక్కుల విప్లవం అనేది ఒక అగాథంలా మారుతుంది.’

   ‘నేను చెప్పేదేమిటంటే ….’ గ్రెగరి గొణుగుతూ కొనసాగించాడు, ‘నాకు ఒక్క విషయం కూడా అర్థం కాలేదు. దేనికి తలా తోకా లేనట్టు అనిపిస్తుంది. …ఏదో తెలియని అరణ్యంలో చిక్కుకున్నట్టు ఉంది”

   “నీకు అది అంత త్వరగా అర్థం కాదు. జీవితమే నీకు అన్ని బోధపరుస్తుంది. అదే నిన్ను ఏదో ఒక వైపు ఎంచుకునేలా చేస్తుంది”

  ఈ సంభాషణ అక్టోబర్ ఆఖరి రోజుల్లో జరిగింది. 

Mikhail Sholokhov
Author
Rachana Srungavarapu
Author & Translator

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *