అమ్మనెందుకు కొట్టావు.. నాన్న?

Spread the love

ఈ సాయింత్రం.. నా కొడుకు నన్ను అడిగిన ప్రశ్న.. ఇప్పటికీ నా బుర్రలో గిర్రున తిరుగుతూనే వుంది.

వాడు ఆ ప్రశ్న నన్ను అడిగినప్పుడు నాకు అదోలా అనిపించింది. ఏమి చెప్పాలో ఒక్కసారిగా నాకు అర్ధం కాలేదు. నా భార్య పట్ల నేనెందుకు ఆ క్షణంలో అలా ప్రవర్తించానా అని నా మీద నాకే అసహ్యమేసింది.  ప్రశ్న చిన్నదే కావొచ్చు. కానీ దానికి సమాధానం చాలా పెద్దదే అని అనిపించింది. 

వాతావరణం అంతా ఉక్కబోతగా వుంది… నా మనసులా. నిద్ర రావడం లేదు. బాల్కనీలో నిలుచొని బయటికి చూస్తున్నాను. ఆకాశంలో చందమామ భర్తపై అలిగిన భార్యలా మబ్బు దుప్పటి కప్పుకొని పడుకొంది. పక్కనే బిక్కు బిక్కు మంటూ రెండు చుక్కలు. 

కాస్త గాలి వీస్తుంది. ఆ గాలితో పాటు మందుల వాసన నా ముక్కుపుటాలను తాకింది. ఇక్కడికి మేము వచ్చిన కొత్తలో ఆ వాసన  కొంత ఇబ్బందిగా అనిపించినా..  అలవాటు  కావడంచేత ఇప్పుడు  పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఎదురుగా ఆకాశంలోకి చూశాను. దూరంగా ఆకాశపుటంచులలో ఓ వెలుగు కనబడుతుంది. అది ఫార్మాస్యూటికల్  కంపెనీ విద్యుత్ దీపాల కాంతి. నైట్ షిఫ్ట్ వాళ్ళు ఇప్పుడు పనిచేస్తూ వుంటారు. నన్ను పని నుండి తప్పించకుండా వుండి వుంటే ఈపాటికి నేను  కూడా   నైట్ షిఫ్ట్ లో డ్యూటి చేస్తూ వుండేవాడిని. నన్ను పనిలో నుండి తప్పించి ఆరు నెలలు కావస్తుంది. 

ఎదురుగా కొబ్బరి చెట్టుపై వున్న గూటిలోంచి పక్షి పిల్ల కాబోలు బెదురుగా..  అరిచింది. బెడ్రూంలోకి చూశాను. పిల్లలపై  చెదిరిన దుప్పటిని సర్ది..నిద్దట్లోనే వాళ్ళను  జోకొడుతుంది నా బార్య శ్రావణి. ఆ పక్కనే నా అయిదేళ్ళ కూతురు కీర్తి  నిశ్చింతగా పడుకుంది. నా ఆరేళ్ళ కొడుకు..భార్గవ్ నిద్దట్లో ఏదో కలవరిస్తున్నాడు. 

 నా చిన్నతనంలో  నా తండ్రిని.. నేను ఆడగలేని ప్రశ్నను.. నేడు నా కొడుకు నన్ను అడిగాడు “అమ్మనెందుకు.. కొట్టావు నాన్నా?” అని. 

ఇదివరకటి పిల్లల్లా కాదు.. నేటి కాలపు పిల్లలు ఏదీ మనసులో ఎక్కువ కాలం వుంచుకోరు. మొహం మీదనే అడిగేస్తారు. కాస్తా వెనకా ముందు.. అంతే. నా చిన్నతనంలో అయితే మా నాన్నని ఏదైనా అడగడం అటుంచితే. ఆయన కళ్ళలోకి సూటిగా చూడాలంటేనే భయం. కోపంగా వున్నప్పుడైతే చూడాలి ఆ కళ్ళను .. మండుతున్న చింత నిప్పుల్లా వుండేవి. 

అలా చింతనిప్పుల్లా మండటం నా చిన్నతనంలో చాలాసార్లు చూశాను నేను.

                                    @ @ @ 

వీధిలో స్నేహితులతో అడుకుంటున్నానే గాని నా చెవులు మాత్రం ఏదో వినడానికే ప్రయత్నిస్తున్నాయి. ఆడకుంటున్న పిల్లల అరుపులు తప్ప నా చెవులుకు మరేది వినబడటంలేదు.  ఊరిపైకి చీకటి కమ్ముకుంటుంది. టైమ్ ఎంతయ్యిందో తెలియటం లేదు. జ్యూట్ మిల్లు ఆఖరి ఊల అయిపోయిందో లేదో తెలియదు. అసలు ఈ రోజంతా నాకు మిల్లు ఊల వినబడనేలేదు. ఎందుకయినా మంచిదని ఇంటివైపు నడిచాను. మా నాన్న జ్యూటుమిల్లు నుండి ‘ఏ’ షిఫ్టు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి నేను ఇంటిదగ్గర వుండాలి. లేదంటే అంతే సంగతి.  

అప్పటికే ఇంటిలో పులి వుంది. నా కంటికి మానాన్న ఎప్పుడూ పెద్ద పులే.  భయం భయంగానే గుహలోకి చూసినట్టు బయటనుండే ఇంటిలోకి పరిశీలనగా చూశాను. వాతావరణం అంతా ప్రశాంతంగా వున్నట్టే అనిపిస్తుంది కానీ.. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలపెట్టింది. భయంతో నా గొంతు ఎండకు ఎండిపోతున్న భీడుభూమిలా మారిపోతుంది. కాళ్ళను ఎవరో బలంగా భూమిలోనికి పట్టిలాగుతున్నట్టుగా అనిపిస్తుంది. 

ఇంతలో ఇంటిలోనుండి బయటికి వస్తూనే నన్ను చూసి  “ఇంతవరకు ఎక్కడికెళ్ళావురా?”అని మా నాన్న అడిగేసరికి… ఎక్కడివాడిని అక్కడే కదలకుండా నిలుచుండిపోయాను. నా చూపులు నేలకు అతుక్కుపోయాయి. సమాధానం చెప్పడానికై నోరుపెగలడం లేదు. 

“ఎంతసేపూ.. ఆటలే.. చదువూ.. సామూ లేదా?…నేను బయటికెళ్ళి తిరిగొచ్చేసరికి.. పుస్తకాలు తీసి చదవలేదని తెలిసిందో… నేలకేసి కొట్టేస్తాను” అని అంటూనే సైకిలెక్కి బయటికి  వెళ్ళిపోయాడు మా నాన్న. అప్పటివరకు నీటిని పీల్చేసిన స్పాంజిలాగ వున్న నా గుండె ఒక్కసారిగా దూదిపింజలా తేలికయిపోయింది. 

ఇంటిలోకి అడుగుపెడుతూనే ఎందుకైనా మంచిదని.. ఇల్లంతా పరిశీలనగా చూడటం మొదలెట్టాను. అవతలవైపు మా అమ్మ వంట చేసుకుంటుంది. నా చెల్లి మంచంపై పడుకొని వుంది. ఇల్లంతా నిశ్శబ్ధంగానే వున్నప్పటికీ.. మనసులో ఏదో నాకు అలవాటైన అనుమానం పీకుతూనే వుంది. ఇల్లంతా నేలపై పరిశీలనగా చూశాను. ఎక్కడా చేతి గాజుముక్క నా కంటికి కనబడలేదు. మంచం కింద కూడా చూశాను… లేదు. హమ్మయ్య..గాజుముక్క లేదంటే  ఇంటిలో అమ్మకి.. నాన్నకి ఈరోజు గొడవ జరగలేదని ఊపిరి పీల్చుకున్నాక.. మా అమ్మ దగ్గరికి వెళ్ళి “ఏటి.. వండుతున్నావు.. అమ్మ” అని కాస్త ధైర్యంగా అడిగాను. 

“ఉలవకట్టురా..!”పొగగొట్టంతో పొయ్యని ఊదుతునే చెప్పింది. పొయ్యని ఊదినాక పైట అంచుతో రెండు కళ్ళను ఒత్తుకుంది. 

మా అమ్మ ముఖం వైపు పరిశీలనగా చూశాను. పొగ వలన కళ్ళు నీరు కారుతున్నాయో లేక మా నాన్న ఏదైనా అనడం వలన మా అమ్మ ఏడుస్తుందో నాకు అర్ధం కాలేదు. అయినా మా అమ్మతో మాటలను కొనసాగించడానికై “ఈరోజూ… ఉలవకట్టేనా” అని అన్నాను. 

“రోజూ ఏటుంటాదిరా.. వండడానికి.. అయినా ఇంతసేపు ఎక్కడికెళ్ళావు.. మీ నాన్న ఇంటిదగ్గరే వున్నాడు చీకటిపడేసరికి  ఇంటికి రాకపోతే తంతాడు.. అనే భయం నీకుందా అసలు. కాళ్ళు.. చేతులు కడుక్కొని పుస్తకాలు తీసి చదువు ఆ మనిషి వచ్చేసరికి.. లేదంటే ఏకీళ్ళుకి ఆ కీళ్ళు  ఇరిసేయగలడు” అని అంటూనే పొయ్య మీద వున్న ఉలవకట్టులోకి గరిటె పెట్టి తిప్పింది. పుల్లని వాసన గాలిలోకి కమ్మగా వ్యాపించింది. 

“ముందు అన్నం పెట్టేయ్యే.. ఆకలేస్తుంది.. తినేసిన తరువాత చదువుతాను” అని గోలెం దగ్గరకెళ్ళి  కాళ్ళు చేతులు కడుక్కుంటూ అడిగాను. 

“నోరుమూసుకొని ముందు పుస్తకాలు తియ్యి.. అన్నం తినేస్తే నువ్వు తొంగుండి పోతావు” అని అంటూనే “ఇష్టమొచ్చినట్టు నీళ్ళు తోడేయకు.. మొయ్యలేక చావాలి నేను”అని అంది.

“బాగా.. ఆకలేస్తుంది.. ముందు అన్నం పెట్టేయే.. తినేసి చదువుతాను” అని అంటూనే “ఈ రోజు.. మిల్లు ఊల వెయ్యలేదు ఏమిటమ్మా?” అని  అడిగాను. 

“ఇంకెక్కడి మిల్లు.. మిల్లు కట్టేసి మూడు రోజులయ్యింది”అంది. 

అందుకేనా ఈ రోజు మా నాన్న నేను ఆట నుండి ఇంటికి వచ్చేసరికి ఇంటిదగ్గర వున్నాడు. లేకుంటే మా నాన్న కంటే ముందే  నేను ఇంటికి వచ్చేసుందును  కదా” అని అనుకుంటూ.. చదివితేనే గాని అన్నం పెట్టదు మా అమ్మ అని నిశ్చయించుకొని.. పుస్తకాల సంచిని ముందేసుకున్నాను. 

“సూడు ఈ గుంట.. అన్నం తినకుండా తొంగుండి పోయింది” అని అనుకుంటూ ఇంటిలోని మిగతా పనులు చక్కబెట్టుకుంటుంది మా అమ్మ . పుస్తకాలు ముందేసుకున్నానే గాని నా మనసంతా ఆకలితో అన్నం చుట్టూనే తిరుగుతుంది. గోడకానుకొని కునుకేస్తున్న నన్ను లేపి.. తినమని నా ముందు కంచంతో అన్నం పెట్టింది. నిద్దుర కళ్ళతోనే అన్నం తిన్నాను. తింటూనే కునుకేశాను. 

                                    @ @ @

ఎదురుగా వున్న కొబ్బరిచెట్టుపై ఏదో అలికిడి అయ్యింది. పక్కింటి పెరటిలో  బొప్పాయి చెట్టు గాలితో ఊసులాడుతుంది. దూరంగా ఎక్కడో ఓ తీతువు పిట్ట కూసింది. అప్పటివరకు కాస్త గాలి వీచిందేమో.. కుర్చీలోనే కాసేపు  కునుకు పట్టేసిన నాకు మెలుకువ వచ్చేసింది.  

టైమ్ ఎంతయ్యిందో అని మనసులో అనుకుంటూ గదిలోకి వెళ్ళి మంచంపై చేరబడి పడుకోవడానికి ప్రయత్నించాను. కానీ నిద్ర పట్టలేదు. పక్కనున్న  సెల్ ఫోన్ ను అరచేతిలోకి తీసుకొని  సైడ్ బటన్ ప్రెస్ చేశాను. సెల్ లాక్ ఓపెన్ అయ్యింది.  డిస్ప్లే పై 3.20 అని కనబడింది. కాసేపు సెల్ ఫోన్ లో వీడియోలు చూస్తే నిద్ర అదే వస్తుంది అనుకోని యు ట్యూబు ఆన్ చేశాను. రకరకాల వీడియోలు డిస్ప్లే పై ప్రత్యక్షమవుతున్నాయి. కానీ ఏ ఒక్కటీ చూడటానికి నాకు మనస్కరించలేదు. లేటెస్ట్ మెసేజెస్ కోసం  వాట్సప్  అన్ చేశాను. వివిద గ్రూపులలో మెసేజెస్ చదవడం ప్రారంభించాను.  మా  యూనియన్ గ్రూపులో  వచ్చిన మెసేజ్ చదివాను. రెండు రోజులు తరువాత జరగబోయే మీటింగ్ కి సంబందించిన సమాచారం వుంది దానిలో.  బి. ఇ. డి  పూర్వ విద్యార్థులకు సంబందించిన గ్రూపులో వున్న మెసేజ్ ఓపెన్ చేశాను. పూర్వ విద్యార్థుల కలయకకు సంబందించిన సమాచారం వుంది దానిలో. అప్పుడే నా బి. ఇ. డి ట్రైనింగ్ పూర్తయ్యి పది సంవత్సరాలు అయిపోయిందా అని అనుకుంటూ మరలా ఆలోచలనలో పడ్డాను. 

గవర్నమెంట్ టీచర్ కావాలన్నదే నా కల. టీచర్ ట్రైనింగ్ పూర్తయినాక ఓ మూడు సార్లు డి. ఎస్. సి కూడా రాశాను. ప్రతిసారీ ఒకటి.. అర మార్కులలోనే ఉద్యోగాన్ని కోల్పోవల్సి వచ్చింది. మరోసారి ప్రయత్నించాలని మనసులో వున్నప్పటికి.. ఇంట్లో పరిస్థితులు ఏమంతగా బాగోలేకపోవడం వలన కొత్తగా పెట్టిన మందుల కంపెనీలోకి  పనికి కుదురుకోవాల్సి వచ్చింది. వచ్చిన జీతం వడ్డీలకే సరిపోకపోవడం వలన వెంటనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వచ్చిన కట్నంతో  అప్పటికే నా చదువుకై చేసి వున్న  అప్పులలో కొంత తీర్చగలిగాను.  శ్రావణి అప్పటికే నాలాగానే టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి వుంది. నేను సాదించలేకపోయినప్పటికి శ్రావణి రూపంలో నా కల నెరవేరుతుందనుకున్నాను. కానీ వెంట వెంటనే పిల్లలు..  వారి సంరక్షణలో పడి నా బార్య మునిగిపోవడం వలన..   అది కూడా కలగానే మిగిలిపోయింది. 

నాకు వీలుగా వుంటుందని మరియు పిల్లల చదువులుకు బాగుంటుందని మా కంపెనీకి దగ్గరలో వున్న అపార్ట్మెంటలో ముందు అద్దెకు దిగాం. బ్యాంక్ ఇచ్చిన లోన్ తో తరువాత  ఓ అపార్ట్మెంట్ కొనుక్కున్నాం. ఇటు ఇంటి ఇ. ఎం. ఐ అటు పిల్లల స్కూల్ ఫీజులు మరోపక్క నెల నెలా మా అమ్మ నాన్నలకు పంపించాల్సిన మొత్తం. ఇవన్నీ కలిసి తడిసి మోపుడవ్వడం వలన నా భార్య కూడా నా పిల్లలు చదువుతున్న స్కూల్ లోనే టీచర్ గా పనికి కుదురుకోవాల్సి వచ్చింది.

అదిగో అప్పుడు జరిగింది ఈ ఘటన…. ఆ వారం జనరల్ షిఫ్ట్ చేసి ఓ . టి. లో భాగంగా నైట్ షిఫ్ట్ కూడా చేశాను. మరసటి రోజు డ్యూటి దిగిపోవాలి. కానీ ఆ షిఫ్ట్ లో డ్యూటి ఎక్కాల్సిన వర్కర్ రాలేదు. జనరల్ డ్యూటియే కదా కాస్త ఓపికపడితే ఇది కూడా ఓ. టి లో కలుస్తుంది ఆ వచ్చిన డబ్బులు ఏ ఖర్చుకైనా సరిపోతాయనే యావలో ఆ డ్యూటీ కూడా చేయడానికి సిద్దపడ్డాను. శరీరం బాగా అలసిపోయు వుంది. ఎదురుగా బ్రాయిలర్ ఫుల్ ప్రెజర్ తో  వుంది. నాకు కాస్త కునుకు పట్టేసింది. సరైన సమయంలో సూపర్ వైజర్ వచ్చి ప్రెజర్ ను కంట్రోలు చేసాడు కాబట్టి సరిపోయుంది లేదంటే పెద్ద ప్రమాదమే జరిగుండేది. డ్యూటీలో నిర్లక్ష్యం వహించానన్న కారణంగా సస్పెండయ్యాను. 

                                                 @ @ @

బయటంతా చీకటిగా వుంది. ఆకాశం వుండుండి ఉరుముతుంది. ఓ మెరుపు కిటికీలోనుండి మా గదిలోకి తొంగిచూసింది. ఒక్కసారిగా కళ్ళు తెరిచాను. ఏమి జరిగిందో గాని మా నాన్న మా అమ్మతో కోపంగా మాట్లాడుతున్నాడు. నా పక్కన చెల్లి నిశ్చింతగా నిద్రపోతుంది. వాతావరణమంతా గంభీరంగా వుంది. భయంతో కళ్ళు మూసుకున్నాను గాని చెవులను మాత్రం మూసుకోలేకపోయాను. 

“ఎగ దెబ్బేయమ్.. ఇస్తాం అని చెప్పు”

“నీకేమి..  నువ్వు బాగానే సెబుతావు.. నిన్ను అడగలేదు కదా.. నన్ను కదా అడుగుతున్నారు.. నేను కదా తెచ్చింది” అని మా అమ్మ మా నాన్నతో అంటుంది. 

“ఇంతవరకు  నెల నెల కరెక్టుగా వడ్డీ కట్టేసాము  కదా.. ఈ నెలే ఇలగయ్యింది .. అయినా మిల్లు కట్టేస్తే.. మనం మాత్రం ఏటి సేత్తం.. మిల్లు తిరిగినాక మొత్తం ఒక్కసారి ఇచ్చెత్తం అని సెప్పు” అనేసి చెంబు ఎత్తిపట్టుకొని  నీళ్ళు తాగుతున్న చప్పుడు స్పస్టంగా వినబడుతుంది.  పళ్ళెం ముందు కూర్చొని అన్నం తింటున్నట్టున్నాడు మా నాన్న. 

“నెల.. నెల కరెక్ట్ టైంకి వడ్డీ కట్టేస్తాము అని.. అప్పు తీసుకొచ్చాను.. ఇప్పుడు మిల్లు కట్టేసారు.. తరువాత ఇత్తాం అంటే ఆలు వల్లకుంతారేటి?” అని మా అమ్మ బదులిచ్చింది. 

“వళ్ళకోకపోతే.. ఉరి..  ఏసేస్తారేటే .. అప్పు తీసుకున్నాక.. ఓ రోజు అటు.. ఇటు ఆవుద్దీ.. ఏదో రోజు ఇచ్చేత్తం గాని ఎగదెబ్బేయమ్ కదా!”

“ఆల గుమ్మం.. ఈల గుమ్మం ఎక్కి తెచ్చింది.. నేను కదా.. నువ్వు తెస్తే .. నీకు తెలుసును ఆ ఇబ్బంది”గిన్నెలు చక్కబెడుతున్నట్టు వుంది మా అమ్మ. పెద్దగా చప్పుడు వస్తుంది. 

“సమాదానం చెప్పుకోవడం సేత కానప్పుడు.. నిన్నేవడు ఎల్లి తెమ్మన్నాడు”

“ఆరోజు అదునొచ్చి మీద పడ్డప్పుడు..ఈ ఊరిలో నాకెవలు తెలుసు అని  కాలు చేతులు తేలేసిసినావు.. ఇదిగో ఈరోజు అదును తీరిపోయాక ఇలా మాటాడుతున్నావు.. ఒడ్డు దాటిపోయాక.. బెడ్డ చూపించే జాతి మీది”

“మీ అమ్మగారి ఇంటి నుండి తీసుకురమ్మనానేటే?”

“ఆల సంకెందుకు నాకుతావు ఇప్పుడు?”

“ఆల సంక నాకపోతే.. మరెవలు సంక నాకమంతావే?” మా నాన్న పళ్ళెం ముందు నుండి ఇసురుగా లేచినట్టున్నాడు. పళ్ళెం బోర్లా పడిన శబ్దం వినబడింది. 

“ఈ పౌరసంకి ఏమి తక్కువ లేదు.. ఏమైనా అంటే మనిషి మీదకి పెద్ద పులిలా పడిపోతావు.. ఎప్పుడూ.. తింతున్న కూడు నేల పాలు సెయ్యడమే.. అందుకే మన గతి ఇలగేడుస్తుంది”

 మాటా.. మాటా పెరిగింది. బయట అప్పుడు వరకు చిన్నగా ఉరిమి.. ఉరిమి ఒక్కసారిగా పెద్ద పిడుగు పడింది.  పనిలో పనిగా ఆకాశంలో మెరుపు మెరిసినట్టు మా అమ్మ చెంప చెల్లుమంది. ఊరుములతో పాటు చిన్నగా వర్షం మొదలయ్యింది. అప్పుడప్పుడు పిడుగులు పడిన శబ్దం కూడా వినబడింది. క్రమంగా నిద్రలోకి జారుకున్నాను. 

                                  @ @ @

ఫోన్ రింగయ్యింది. ఒక్కసారిగా మంచంపై లేచి కూర్చున్నాను. అప్పటికే చాలా సేపటినుండి చేస్తున్నట్టు వున్నారు. ఫోన్ ఎత్తి “హలో” అన్నాను. యూనియన్ మీటింగ్ వుంది రమ్మన్నదే ఆ ఫోన్ సారాంశం. మంచం దిగి హాల్లోకి నడిచాను. పక్క గదిలో పిల్లలు ఇంకా నిద్రపోతున్నారు. వంటగదిలో మా ఆవిడ తన పని తాను చేసుకుపోతుంది. మామూల రోజుల్లో అయితే నన్ను ఈపాటికే నిద్రలేపి అది తెండి.. ఇది తెండి అని పురమాయించేది. అలక మీద వుంది కదా.. అందుకే నన్ను అలా నిద్రలేపకుండా వదిలేసింది. 

మంచినీళ్లు తాగుతూ.. కొంచెం ధైర్యం తెచ్చుకొని తన పక్కన నిల్చున్నాను. తను నన్ను గమనించిందేమో.. నన్ను పట్టించుకొనట్టు తన పని తాను చేసుకుపోతుంది. గొంతు సవరించుకొని “సారీ.. నిన్న అలా నీపై చెయ్యి చేసుకొని వుండకూడదూ!” అని మెల్లగా అన్నాను. తనవైపు నుండి ఎటువంటి సమాధానం లేదు. మరలా నేనే కలుగజేసుకొని “కాస్త..  టీ పెడుదూ.. నిన్నటి నుండి ఒకటే తలనొప్పి” అని అన్నాను. 

“అసలు ఏమి జరిగిందో తెలుసుకోకుండానే.. నిన్న మీరు అలా ప్రవర్తించారు” అంది. 

“నాకేమీ తెలుసు.. నేను వచ్చేసరికి నువ్వు వాడి చెంప చెల్లుమనిపించావు.. చిన్నది మరోపక్క ఏడుస్తూ వుంది. దానికితోడు వీడుకూడా రాగమందుకున్నాడు. అప్పటికే నాకు మహా చిరాకుగా వుంది. ఉద్యోగం పోయి చాలా  రోజులయ్యింది దాని గురుంచి అతి పతీ లేదు . ఒకపక్క బ్యాంక్ లోన్ కట్టమని ఫోన్లు. మరోపక్క ఇంటి అవసరాలు. నీ ఒక్కదాని మీదనే ఇల్లు నడుస్తుందన్న బాధ. ఏదైనా ఓ టీచర్ గా నువ్వు పిల్లలను కొట్టకూడదు కదా కాస్త ఓపికగా చెప్పాలి.. నువ్వే అలా ప్రవర్తించేసరికి నాకు కోపం వచ్చి అలా నీపై చేయి చేసుకోవాల్సి  వచ్చింది.”అని అన్నాను. 

“ఎంతసేపు నీవైపు నుండే ఆలోచిస్తున్నావు కానీ.. నావైపు నుండి ఎప్పుడైనా ఆలోచించావా!.  ఒకపక్క స్కూలు.. మరోపక్క పిల్లలకు చేయించాల్సిన హోమ్వర్కులు.. ఇంకోపక్క ఇంటిలో పని.. ఎప్పుడూ నీ యాతన నీదే.. నువ్వు ఇంటిదగ్గర వుంటే పరవాలేదు. నువ్వు లేకపోతే చూడాలి ఇద్దరూ నాకు నరకం చూపిస్తారు.. ఆరోజు కూడా చిన్నదేదో వీడి చేతిలోంచి లాగేసుకుంది.. వీడేమో దానిని ఒక్కటి కొట్టాడు.. ఇక ఇద్దరూ కొట్టుకోవడం మొదలపెట్టారు. అటు వంటగదిలో నా పనిలో నేనున్నాను. నువ్వు ఏదో మీటింగ్ వుందని బయటికి వెళ్లిపోయావు. అప్పటికే ఇద్దరికీ చాలాసార్లు చెప్పి చూశాను. వినలేదు.. అందుకే వాడికి ఒక్కటి తగిలింది” అని నిన్న జరిగిన సంగతంతా చెప్పింది. 

“సారీ.. ఇంకెప్పుడూ.. అలా ప్రవర్తించను” అని మరోసారి అన్నాను.  ఇంతలో భార్గవ్ కళ్ళు నులుముకుంటూ.. బెడ్రూం లోనుండి వచ్చి మా వెనుక నిల్చున్నాడు. మరలా గోడవపడుతున్నారా! అన్నట్టు మొహం పెట్టాడు. వాడినెత్తుకొని బుగ్గపై ముద్దు పెట్టి బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాను. ఒక్కసారిగా మా నాన్న గుర్తొచ్చాడు నాకు. “అమ్మనెందుకు కొట్టావు… నాన్న?” అని నా కొడుకు నన్ను అడిగిన ప్రశ్నతో అంతవరకు మా నాన్నపై నాకున్న కోపమంతా జాలిగా మారిపోయింది. ఇంతలో మరలా ఫోను మోగింది.

“ఆ…ఇదిగో…ఇప్పుడే అక్కడికి వచ్చేస్తున్నా” అంటూ బయల్దేరాను.

‘చేసేది ఎవడు.. చేయించేది ఎవరు.. నువ్వు ఒట్టి నిమిత్తమాత్రుడువే’ అన్న భగవద్గీతలోని సంస్కృత  వాక్యాలు దగ్గర్లో వున్న కోవెలలో వున్న స్పీకర్ లోనుండి వస్తున్నాయి. 

మొయిద శ్రీనివాసరావు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *