అధో లోకం – 1

Spread the love

పోతివేలు పండారం జోగుతూ నిద్రలోంచి లేచాడు. మంచంమీంచి పైకి లేచి చీకట్లో తడుముకుంటూ దోమతెర చట్రాన్ని పట్టుకుని ఒక్క క్షణం నిల్చున్నాడు. కొంత మత్తు వదిలింతర్వాత గోడను తడుముకుంటూ అగ్గిపెట్టె ఉన్న గూడు వైపుకు నడిచాడు. నేల మీదున్న నీళ్ళచెంబు కాలికి తగిలి ఘణఘణమంటూ శబ్దం చేస్తూ పక్కకు దొర్లింది. ఏక్కియమ్మకు మెలకువ వచ్చింది. కళ్ళె నిండిన గొంతుతో “అర్థరాత్రి, అపరాత్రి అని లేకుండా ఏం దొర్లిస్తుం‍డావాడ?” అంది.

“అగ్గిపెట్టె ఏడబోయిందే” అడిగాడు పండారం. “ఆడేవుంది, దానికి కాళ్ళొచ్చి పారిపోద్దా! అయినా ఇప్పుడు నీకు అగ్గిపెట్టెతో పనేంది?”

“గంటెంత?”

“నాలుగయ్యుండదింకా… గమ్మున పడుకుంటావా లేదా?” ఏక్కియమ్మ మళ్ళీ కళ్ళు మూసుకు పడుకుంది.

పండారం ఎలాగోలా అగ్గిపెట్టె వెతుక్కుని బుడ్డి దీపం వెలిగించాడు. దీపం చేతిలో పట్టుకుని, కొంచెం వంగి గడియారంలోని ఆకుపచ్చ రంగు ముల్లు చూస్తూంటే కట్టుకున్న పంచె జారింది. ‘ఇంకా మూడే’ అని గొణుక్కుంటూ ఒక చేత్తో పంచె చివరని అందుకుని వెనక్కొచ్చి మంచం మీద కూర్చున్నాడు. నశ్యం డబ్బా దిండు కింద నించి తీసి కొంచెం అరచేతిలోకి తీస్కుని ఒకట్రెండుసార్లు నలిపి వేళ్ళతో ముక్కులోకి తీసుకెళ్ళి గట్టిగా పీలుస్తూ తల వెనక్కి వంచి అదే భంగిమలో ఉండిపోయి రవ్వంత సేపు ఆ మధుర క్షణాల్ని ఆస్వాదిస్తూ తుమ్మకుండానే తుమ్మతున్నట్టు మొహాన్ని అష్టవంకర్లు తిప్పి స్థిమితపడ్డాడు. ‘మురుగా, తండ్రీ!’ అనుకుంటూ ఇంకో వైపుకు తిరిగి పడుకొని ఉన్న భార్య పక్కకు తిరిగాడు. “ఏమే, ఆ రగ్గు ఇవ్వు” అనడిగాడు భార్యని.

“ఇంత రాత్రి పూట, ఇప్పుడేడికి?” అడిగింది ఏక్కియమ్మ.

“నిద్ర పట్టడం లేదే! రాత్రి తొమ్మిదికి ఆడ్నించి ఇంటికొచ్చేముందర దాని పొట్ట మీద చెయ్యి పెట్టి చూశాను. కదలతావుంది. బాగా కిందికి జారిపోయుంది. ఉమ్మ నీళ్ళు కూడా కారతన్నాయి. పొద్దుటికల్లా కానుపయ్యిద్ది, ఖాయం! ఉనుకుల్ని బట్టి తెలస్తావుంది.”

“కుమరేశన్ అక్కడే ఉన్నాడు గదా?”

“ఆ శవాల్ని దెంగేటోడా! పూటుగా తాగేసి పడి పోయి ఉంటాడు ఈపాటికి. దాని కడుపులోంచి ఏనుగు పిల్ల బయటికొచ్చి ముందు పడ్డా ఇప్పుడు ఆడికి తెలీదు. కుక్కలో నక్కలో వచ్చి ఈడ్చుకుపోయినా వాడికి పోయేదేముందీ? కొంచెం శొంఠి కషాయం పెట్టియ్యి. గభాల్న వెళ్ళి చూసొస్తాను.”

“బావుంది సంబడం, నేను పురిటి మంచం మీదున్నపుడు కూడా ఇంత కంగారు పడ్లా నువ్వు,” అంటూ పక్క మీద లేచి కూర్చుని, “మండకాటమ్మ తల్లీ, కాపాడు!” అని నిట్టూరుస్తూ చేతులూనుకుని పైకి లేచింది ఏక్కియమ్మ.

“కరెంటు ఒచ్చుద్దంటావా?” అడిగాడు పండారం.

“ఎవరికి తెలుసు? దోమలు కుట్టి కుట్టి చంపేస్తున్నాయి. పాపం పిల్లల్ని చూడు. వడివు మొహం చూసినావా! దోమలు కుట్టి మొహమంతా ఎర్రగా దద్దులు.”

“ఏం చేసేది! కొనడానికి కరెంటు ఏమన్నా అంగట్లో దొరుకుద్దా ఏంది?”

ఏక్కియమ్మ అప్పటికే వంటింట్లోకెళ్ళిపోయింది. పండారం పొడుం డబ్బా బొడ్లో దోపుకున్నాడు. పక్కనున్న చిన్న కిటికీలోంచి బయటికి చూసాడు. రాతిరి మసక వెలుగులో పొగమంచు అంతటా మందంగా కమ్ముకుని కనిపిస్తోంది. గదిలోంచి బయటికొస్తూ వేలప్పన్ కోవెల దిక్కు చూసి అప్రయత్నంగా లెంపలేసుకుని చేతులు ఒకసారి జోడించాడు. ముందు గదిలో అతని ముగ్గురు కూతుళ్ళు నేల మీద రకరకాల భంగిమల్లో తలో దిక్కుకు తిరిగి పడుకుని నిద్ర పోతున్నారు. రెండో కూతురు వడివమ్మకు ఎప్పుడూ నిద్రలో పైట నిలవదు. ఆమె నోరు తెరుచుకుని నిద్ర పోతోంది. వడివమ్మ  పళ్ళు బయటకు కనపడుతున్నాయి. పళ్ళు అచ్చం ఏక్కియమ్మకున్నట్టే ఎత్తు పళ్ళు. దాటుకుని వెళ్తూ ‘పిచ్చి పిల్ల’ అని గొణుక్కుంటూ పెరటి వైపుకు వెళ్ళాడు పండారం.

“పళ్ళు తోంకుంటున్నావా?”

“లేదు! ఇప్పుడే గదా వచ్చి పడుకుంది” అంటూ చెంబుతో నీళ్ళు ముంచుకుని మొహం కడుక్కున్నాడు. నీళ్ళని నోట్లో పోసుకుని పుక్కిలించి ధారగా కాల్వలోకి ఉమ్మేసాడు. పందికొక్కు ఒకటి కాలవలోంచి బయటికి దూకి మళ్ళీ మరుక్షణంలో మాయమైంది.

“కాలవ మూసేయించమని చెప్తావున్నా గదా! చెప్పిన మాట ఇనే పనేలే నీకు” అన్నాడు.

ఏక్కియమ్మ ఇత్తడి చెంబును చెయ్యి కాలకుండా కొంగుతో జాగ్రత్తగా పట్టుకుని బయటకి వచ్చింది. గాలంతా ఘాటైన శొంఠి వాసనతో నిండి పోయింది. కషాయం ఒక గుక్క తాగి, “ఇంక వారం కూడా లేదు, తైపూసం తిరనాళ్ళు వచ్చేస్తోంది. సరుకు ఈనకుంటే నేను ఈ ఏడాది పండక్కి పళనికి వెళ్ళేది అనుమానమే. చూడు, రెండూ ఒకేసారి వచ్చేసి ఎంత గందరగోళమో! నెల నించీ నిద్రే పట్టడంలా! ఈ రోజు కాన్పు అయ్యి నోట్లో చన్ను పడితే, చీకూ చింతా లేకుండా పళనికి వెళ్ళి రావచ్చు” అన్నాడు పండారం.

“దాందేవుందిలే, ఆ పళని దేవుడే చూసుకుంటాడు” అంది ఏక్కియమ్మ.

“కిందటి సారి ఇది ఇట్టానే నాలుగు రోజులు లాగింది. నీకు గ్యాపకంలే? ఇప్పుడు దీని ఒళ్ళు బాగా వడిలిపోయింది. కడుపు కూడా మెత్తబడి సాగిపోయింది. ఎక్కువ మాట్లాడితే ఇంకో చూలు, అంతే! దాని తర్వాత ఇంక కష్టం. ఈ ఏడు కుదర్లేదు కానీ వచ్చే ఏడు తైపూసానికి పళనిలో మంచి ధర మాట్లాడుకుని దాన్ని అమ్మేస్తా!”

“అసలు ఇన్ని సరుకుల్ని పెట్టుకోని సాకడం దేనికీ? సగానికి సగం అమ్మేసి డబ్బులు బ్యాంకులో పెట్టుకుంటే పెద్ద పిల్లకు పెళ్ళిజెయ్యాలంటే అక్కరకొచ్చుద్ది…”

“నీకేం తెలుసే అమ్మడం, కొనడం? దానికి తెలివి ఉపయోగించాల! మన కాడ ఉండే పది సరుకుల్లో ఎనిమిది బంగారు గుడ్లు. ఈటన్నిటినీ అమ్మేస్తే, నెలనెలా సీటీ పాటకి, నీ రంకు మొగుడి గోచీ అమ్మి డబ్బులు కడతావా, ఏందీ?”

“ఆ! ఆడికేదో నా చుట్టూ రంకుమొగుళ్ళు గోచీలిప్పి బంగారం చూపిస్తా తిరగతా ఉన్నారా, ఏందీ?”

“ఊరికే అన్నా, లేవే!” అంటూ పెద్దగా నవ్వుతూ త్రేంచి పైకి లేచి నిల్చున్నాడు పండారం. కంబళి ఒంటి చుట్టూ రెండు చుట్లు తిప్పి తలగుడ్డ చెవులు దాగేట్టు కట్టుకున్నాడు. బేటరీలైటూ, చేతికఱ్ఱ తీసుకుని వీధిలోకి అడుగుపెట్టాడు. ఎదురింటి కుక్క లేచి నిలబడి మొరిగింది. వాసన తెలిసిందేమో వెంటనే అరూపాపి మూలుగుతూ ముడుచుకు పడుకుంది. రాతిరి ఆకాశమంతా పలచని వెలుగు పరుచుకునుంది. ‘సింగారవేలనే, నీ సిందయిల్ వారాయ్’ (సుందర సుబ్రమణ్యా, నా డెందము నిండవా!) అని కూని రాగం తీస్తూ నడవడం మొదలుపెట్టాడు పండారం. వీధి చివరనున్న బలి మండపం ఎక్కి ఇంకో పక్క దిగి కోనార్ తోపు గుండా నడిచి అక్కడున్న కాలవ దాటుకుని ఒడ్డెక్కి వరి పొలాల్లోకి ప్రవేశించాడు. పొలాల మింటిన మరింత వెలుతురు కమ్మి ఉంది. తెల్లటి మంచు పరదా వేలాడదీసినట్టు కనుచూపు మేరంతా కప్పేసి ఉంది. కంటికి కానరాని గాలి తెమ్మెర మంద్రంగా వీస్తుంటే మంచుకు తడుస్తున్న వరి పైరు నెమ్మదిగా ఊయలలు ఊగుతోంది. తెలిమంచుతో తడిసిన పొలం గట్ల మీది గడ్డి అతని పాదాలను చల్లగా తాకుతోంది. ప్లాప్, ప్లాప్ అంటూ కప్పలు గట్ల మీదినుంచి నీళ్ళు పెట్టిన పొలంలోకి ఎగిరి దూకుతున్నాయి.

పొలాలకవతల మసక మసకగా యక్షి దేవళం, ఆ వెనక వెదురుపొదలు, ఆపైన పోక చెట్ల తోట కనపడుతోంది.  తోటకు అవతల ఉన్న గుడిసె ముందు చూరుకు కట్టిన లాంతరు గాలికి నెమ్మదిగా ఊగుతోంది. ఆ అరుగుమీద కంబళి కుప్పబోసినట్టు కుమరేశన్ ముసుగుతన్ని నిద్రపోతున్నాడు. పండారం మెట్లెక్కి చేతికఱ్ఱతో నేలను ఒకట్రెండుసార్లు తాటించాడు.

“ఒరేయ్, కుమరేశా” గట్టిగా పిల్చాడు.

కుమరేశన్ మరో పక్కకు దొర్లి, లేచి కూర్చుని “ఆ…” అంటూ బదులిచ్చాడు.

“ఒరేయ్, నేన్రా…”

కుమరేశన్‍కు నిద్ర పూర్తిగా వదిలింది. చలికి రెండుచేతులతో ఒళ్ళంతా కప్పుకోడానికి ప్రయత్నిస్తూ వెనక్కి తిరిగాడు. “అట్టానే నిద్ర పొయ్యా” గొణిగాడు.

“పడి దున్నలాగా నిద్రపోయినట్టున్నావ్! లోపల ఏవన్నా పని జరుగుతోందా?”

“లేదన్నా!”

“తొంగున్నోడికి ఏం తెలస్తదీ, నీ యబ్బ లక్షణాలూ బుద్ధులూ నీకు రాకుండా యాడికిపోతాయి!”

లోపల లాంతరు సన్నగా వెలుగుతోంది. నేల మీద వెడల్పాటి చాప పరిచివుంది. గుడిసెలోకి అడుగుపెడుతూంటే చాప మీద ఎవరిదో కాలు నెమ్మదిగా అటూ ఇటూ కదుల్తున్నట్టు కనపడుతోంది.

“ఎవరొచ్చినారూ! దొరా, మీరేనా?” ముత్యాలు అడిగింది.

“నేనే! ఎట్టున్నావు?”

“నా చాత కావడంలా దొరా!”

“ఏవయింది, బైటికి రావడంలా?”

“లేదు దొరా! భుజాలు, కాళ్ళు బరువనిపిస్తాంది. చేతులు వాచి నొప్పులేస్తున్నాయి.”

“నీకు తెలవంది ఏవుంది, మొదటి సారి కంటన్నావా ఏందీ?” లాంతరును సరిచేస్తూ అడిగాడు పండారం.

ముత్యాలు చాప  మీద నగ్నంగా పడుకునివుంది. ఆమె ఒంటిని కప్పిన దుప్పటి పూర్తిగా పక్కకి తొలిగి, ఒక గుట్టలా పడి ఉంది. ముత్యాలు పెద్ద వికృత జంతువులా కనపడుతోంది. ఒక కాలు, ఒక చెయ్యి పెద్దవిగా, దృఢంగా ఆరోగ్యంగానే ఉన్నాయి. ఇంకో కాలూ చెయ్యీ మటుకు పొట్టిగా ఉండి వికారంగా సంవత్సరం వయసు పిల్లలవిలా ఉన్నాయి. వెంట్రుకలే లేని ఆమె పెద్ద తలకాయ ఒక పక్కంతా బల్లపరుపుగా ఉంది. ఒకటే కన్ను. ఇంకో కన్ను ఉండాల్సినచోట చిన్నగుంట ఉంది. అందులో చర్మం ముద్దగా చేరి కదుల్తోంది. ముక్కు బదులు రెండు రంధ్రాలున్నాయి. తెరుచుకుని ఉన్న పెద్ద నోటిలో, పాచి పట్టి నానా దిక్కుల్లో ఎగుడుదిగుడుగా పెరిగిన పళ్ళు పసుపుపచ్చ రంగులో ఉన్నాయి. బాగా ఉబ్బిన పొట్ట మెరుస్తూ జారి పోయివుంది. బొడ్డు పూర్తిగా సాగిపోయి పొట్ట మీద గీతలా కనపడుతోంది.

పండారం ఆమె పొత్తికడుపుమీద చేతులు పెట్టి గట్టిగా నొక్కాడు. “అమ్మా!” అని కేక పెడుతూ తన బాగున్న చెయ్యిని గట్టిగా విదిలిస్తూ నేలకేసి టపటపా కొట్టుకుంది, ఆమె.

“అదుగో, అంత నొప్పేస్తోందంటే బిడ్డ బయటికొస్తోంది. కుమరేశన్ గాణ్ణి మంత్రసాన్ని పిల్చకరమ్మని చెప్తాను. బిడ్డ తెల్లారేలోపలే బయటికొచ్చేస్తాది.”

“నా వల్ల అయితలా…” మూలిగిందామె. “చావు గూడా రాకపాయ…”

“దేనికే అరస్తావు, నీకేం తక్కువైంది ఈడ? ఇదేదో మొదటి సారి మాదిరి కేకలు పెడతా ఉన్నావు” అంటూ లేచాడు పండారం. “రేయ్! నువ్వు పొయ్యేసి ఆ ముసల్దాన్ని పట్టకరా” కుమరేశన్‍కి చెప్పాడు. కుమరేశన్ వెళ్ళగానే, బయటికి వచ్చి అరుగు మీద కూర్చున్నాడు. వెనక తలుపు గాలికి ఫట ఫటా కొట్టుకుంటోంది.

“ఆ పంది నాకొడుకు ఎనక తలుపు తీసి పడుకున్నాడు. ఏదైనా కుక్కో, నక్కో లోపలికొచ్చివుంటే?” తాడుతో కట్టి తలుపు మూయడానికి వెనక్కి వెళ్తూ లోలోన గొణుక్కున్నాడు.

“ఓ కుక్కనో, నక్కనో నా మీదకు తోలు తల్లీ…” అంటోంది ముత్యాలు.

“చీ, నోరు ముయ్యవే” అరిచాడు పండారం. “వాగతానే ఉండావు. చేటు మాటలు, చెత్త వాగుడు…”

“పజ్జెనిమిది… నాకు పజ్జెనిమిది మంది బిడ్డలు పుట్టినారు. అన్నిట్నీ కుక్కలు నక్కలే గదా పట్టకపోయినాయి?”

“ఏందే! ఏం మాట్లాడతన్నావ్? వెయ్యిసార్లు చెప్పాను. వాళ్ళకేం తక్కువ జెయ్యలా! తినడానికి, తాగడానికి కావాల్సినంత దొరుకుతోంది… వాళ్ళందరూ సంతోషంగా బాగున్నారు. నేను చెప్పేది నమ్మవా?”

“అమ్మా! తల్లీ…”

“ఏమవుతాందీ?” వింతైన వాసన ఏదో రావడం మొదలైంది.

“ఓహ్, బయటికి వచ్చేస్తోంది! దానెమ్మ… ఆ ముసల్ది ఇంకా రాలేదు” అన్నాడు పండారం.

“తల్లీ, నన్ను తీసకపోమ్మా, వల్లకాదు… వల్లకాదు, తల్లీ, మాతా, తట్టుకోలేనమ్మా, నా వల్లగావట్లా!” అని మలయాళంలో కేకలు పెట్టింది.

‘దీనికి ఒళ్ళు తెలీని నొప్పొచ్చినప్పుడే మలయాళంలో మాట్లాడుతుంది,’ అనుకున్నాడు పండారం. పండారంకు ఆమె ఇరవైతొమ్మిదేళ్ళుగా తెలుసు. ‘ఈ సరుకులన్నీ ఇంతే … రకరకాల భాషలు, దీన్లాగే.’

మంత్రసాని వచ్చింది. అడుగులో అడుగు వేసుకుంటూ మెట్లెక్కుతూ దగ్గరికొచ్చి, “వస్తోందా బయటికి?” అని అడిగింది.

“తల బయటికొస్తోంది, తొందరగా వచ్చి చూడు!”

“అదృష్టం అంటే నీదే, గ్రహాలు నీ పక్కనే ఉండాయి. నీ పంట పం‍‍‍డతా ఉండాది… కాసుల రాసులు పండిస్తున్నావు” అంది మంత్రసాని. పొగాకు తుంచి చుట్టి నోట్లో పెట్టుకుంటూ, “రొంత ఉడుకు నీళ్ళు కావాలి…” అంది.

కుమరేశన్ ఉడుకు నీళ్ళు తీసుకరావడానికి పరిగెత్తాడు. ముసిలామె బొడ్లోనుండి కొత్త బ్లేడు, టించరు సీసా బయటికి తీసింది. “గంట పట్టుద్ది, అర్థం అయ్యిందా? ఈ సరుకుల శరీరాలు మనలాగా కాదు; వేరే మాదిరి. బిడ్డను బయటకు లాగాలంటే ఆనుపానులు తెలియాల….”

“ఏం కావాలంటే అది చెయ్యి. ”

“ముందు నువ్వేం చెయ్యాలో అది సరిఁగా చెయ్యి. కిందటి సారి యాభయి రూపాయలు మటుకే అడిగినా, ఇవ్వకుండా అట్లనే పోయినావ్.”

“సరేలే, ముందు పని కానీ.”

“ఈ ఏడు తైపూసం పండక్కి పళనికి పోతున్నావా?”

“కచ్చితంగా పోవాల. ముందర ఇది సరిగ్గా బయటికొస్తే గదా!”

“ఇదేవుందీ? ఇప్పుడే అయిపోయిద్ది. దాని పొట్టమీద కాలేసి ఒక్కసారి తొక్కానా! చటుక్కున బయటికి వొచ్చేసిద్ది. ఏయ్ పండారం! నువ్వు పళనికి పోతే నాక్కూడా ఒక మంచి సరుకు చూ‍‍డు, సరేనా?”

“సరుకులవీ నీకెందుకూ? మంత్రసానిగా బానే ఎనకేస్తున్నావుగా?”

“నాలాంటి ముసల్దాన్ని ఎవడు పిలుస్తాడీదినాల్లో? ఏ మొగుడు చచ్చిన ముండో, జిల్లేడుకట్టె దూర్చి కడుపు తీమంటే తప్ప ఏం రాబడుందీ? దాని చేతిలో గుక్కెడు ఇషం తప్ప రెండు రూపాయలు గూడా ఉండవు. నేను నిన్ను ఊరికే అడగడంలా, నిజంగానే… చూసి మంచి సరుకు పట్టకరా!”

ముత్యాలు నొప్పితో మెలికలు తిరిగిపోతూ గట్టిగా ఓండ్ర పెడుతోంది.

“ముయ్యవే, నువ్వేదో ఈ జాగాకి రాణి, ఆడ తోసేవాడు రాకుమారుడు అయినట్టు” అంది ఆమె కాలిని పిడికిలితో గుద్దుతూ ముసల్ది.

“అమ్మా, తల్లా! ఈ బతుకొద్దు, నన్ను ఈడనుంచి తీసుకపో!”

“ఇది మలయాళీది కదా?”

“ఏ భాష అయితే ఏందీ? మనకు గావాల్సింది లెక్కే”

“మర్చిపోబాక, పదేళ్ళ వయసు లోపల మంచి సరుకు చూసి తీసకరా… నువ్వడిగినంత ఇచ్చేస్తా.”

“లేత పడుచయితే ఖర్చెక్కువ అయ్యిద్ది. ఈ రోజుల్లో పదికంటే తక్కువకి రాదు…”

“పదంటే?”

“పదివేలు.”

“ఏం మాట్టాడతన్నావ్, ఎక్కువ చెయ్యబాక!”

“కావాలంటే నువ్వుగూడా పళనికొచ్చి ఆడ రేట్లు కనుక్కో. ఆటలనుకున్నావా? డబ్బులు… ఇక్కడ డబ్బులతో యవ్వారం. పెద్ద పెద్దోళ్ళు ఎంతోమంది దిగేసున్నారు దీంట్లో, చేతినిండా డబ్బులు పెట్టుకుని, తెలిసిందా!”

“పదేలు పెడితే జెర్సీ ఆవు వొచ్చిద్ది.”

“నిజఁవే! కాని దానికి గడ్డి పెట్టాల. తవుడు, పిండి పెట్టాల. లీటరు పాలు ఎనిమిది రూపాయలు. నువ్వు యాభై పెడితే, పాతిక రూపాయలు లాభం. ఇంగ పశువు చూలుపెడితే ఆ ఏడాదంతా దమ్మిడీ రాదు. ఈ యాపారం అట్టాగాదు. మామూలు సరుకు గూడా ఏడాది పాటు రోజుకు యాభై ఇచ్చుద్ది, ప్రతి రోజూ! ఖర్చెంత? ఐదు రూపాయలు. పండగలు జాతర్లంటూ వచ్చి జనం గుళ్ళ మీద పడిపోతే, ఇంగ ఆ లెక్కే వేరు.”

ముత్యాలు కీచుమంటూ కేక పెట్టింది.

“బయటపడ్డాది!” అంది ముసలామె.

“పైకితీ!” అన్నాడు పండారం. “ఎట్టుంది సరుకు?”

పండారానికి కనపడేట్టుగా ముసలామె బిడ్డ కాలు పట్టుకుని లేపి వెలుగులోకి తీసుకొచ్చి వేలాడతీసింది. రక్తంలో తడిసి ఉన్న విచిత్ర ప్రాణి. ఒక కాలు చిటికెన వేలంత కూడా లేదు. చెయ్యి ఉండాల్సిన చోట ఒక మాంసపు ముక్క వేలాడుతోంది. పెద్దగా వికారంగా ఉన్న తలకాయ ఒకే కన్నుతో శరీరానికి రెండింతలుంది.

“సామీ, మురుగా, నా తండ్రీ!” తన్మయత్వంతో చేతులు జోడించాడు పండారం.

“దీని ప్రతి చూలుకీ మంచి గిట్టుబాటు” ముసలామె అంది. “అసలు చెయ్యి ఉండాల్సిన చోట ముడ్డి కనపడతావుంటే నీకు కాసుల వర్షం!” అంటూ ముసలామె బిడ్డ పిర్రల మీద ఒక దెబ్బ వేసింది. అది ఒక్కసారి కుదుపుకు గురైనట్టు కదిలి నోరు తెరిచి కేర్ మంటూ ఏడిచింది. ఆ శబ్దం విని ముత్యాలు కళ్ళు తెరిచింది.

“నా బిడ్డ, నా బిడ్డ, యాడుంది… యాడుంది?” గొంతులో ఆందోళన, ఆమె బాగుండే చెయ్యి గాల్లో గుడ్డిగా ఊగిపోతోంది.

“యాడికీ బోలే నీ బిడ్డ, ఈడ్నే వుంది.” అంది ముసలామె.

“బిడ్డ బాగుందా?” అడిగింది ముత్యాలు.

“అచ్చం నీలాగే వుంది. యువరాజే ఈడు. చిత్తిరై తిరునాళ్ రాజుకు మేనల్లుడుగదా! రాజ్యం అంతా ఈడిదే…”

“తల్లీ కరుణించినావా?” ముత్యాలు చిన్నగా గునుస్తూ ఏడవడం మొదలుపెట్టింది.

“వేణ్ణీళ్ళు ఎక్కడ?” ముసలామె అడిగింది. బిడ్డ ఏడుస్తూనే ఉంది.

పండారంకు ఎందుకో తెలీదు, అప్పటికప్పుడు పరిగెత్తిపోయి లఘుశంక తీర్చుకోవాలని అనిపించింది. కడుపంతా ఉబ్బరంగా ఉందతనికి. బయటికెళ్ళి అక్కడున్న చిన్న కొబ్బరి చెట్టు కింద చక్కగా గొంతుకు కూర్చున్నాడు. అతనికి ప్రపంచంలో ఉన్న ఈతిబాధలన్నిటి నించీ విముక్తి లభించినట్టనిపించింది. పైకి చూసాడు. ఒంటరిగా మెరుస్తున్న నక్షత్రం ఒకటి అతని కంటపడింది. ‘నక్షత్రాన్ని చూసి ఎన్నో రోజులైంది,’ ఆనుకున్నాడతను. ధగధగలాడుతూ ఎరుపాటి గులాబీ రంగులో మెరుస్తూ, వినీలాకాశంలో ఒంటరి నక్షత్రం.

గుడిసెలోకి వెనక్కి వచ్చినతర్వాత కూడా అతనికి ఏదో తెలీని ఇబ్బందిగా అనిపించింది. ఎవరో తననే కన్నార్పకుండా చూస్తున్నట్టు తోచింది. వెనక్కి తిరిగి చూసాడు. అదే, ఆ ఒంటరి నక్షత్రం!

“దాంతో నువ్వు మాట్లాడు. నన్ను బూతులు తిడతావుంది” అంది ముసలామె.

“ఏవైంది?’ అడిగాడు పండారం.”

“బిడ్డకు పాలివ్వదంట!”

“ఏం?”

“నేనివ్వను. చావనీ! ఆడు బతికి, ఎందుకు రోజూ చావాల. ఇప్పుడే సావనీ…” అంటూ మాట్లాడుతూ ముత్యాలు పళ్ళు కొరుకుతోంది.

“చూడూ! ఆడికి అదే రాసిపెట్టుంది. ఈ భూమ్మీద పడే ప్రతి వోడికీ ఎవడి రాత ఆడికి రాసిపెట్టి ఉంటాది. నా మాటిను!” అన్నాడు పండారం.

“ఈడ్నించి తీసి పడేయ్ ఆణ్ణి!” బుసలు కొట్టింది ముత్యాలు.

లేత వెదురుబద్దలా ఉన్న ముత్యాలు కాలు మీద కాలేసి తొక్కి, గట్టిగా అదుముతూ “ఇది మంచిగా చెప్తే ఇనేలా లేదు” అన్నాడు పండారం, ముసలామె వైపు చూస్తూ. నొప్పితో మెలికలు తిరుగుతూ అరిచింది ముత్యాలు. “ఇస్తాను, ఆడికి పాలిస్తాను… అమ్మా తల్లీ” ఆమె గుండెలవిసేలా అరిచింది.

“అట్టా రా, దారికి!” అన్నాడు కాలు తీసేస్తూ, పండారం.

“ఏందే నీకు పాలివ్వడానికి నొప్పి? నీ బిడ్డకే గదా ఇస్తుండావు? ఎవరన్నా నీ పాలు పిండి అమ్మేసుకుంటున్నారా ఏంది?” అంది ముసలామె, పళ్ళ మధ్య పొగాకు బిగిస్తూ.

“ఆణ్ణి చావనీ! నాకు వాడొద్దు.”

“నువ్వు ముందర నా చేతుల్లో ఛస్తావే, లండీకే!” అన్నాడు కోపంగా పండారం.

“నాకు వదిలేయ్, దీన్ని!” అంది ముసలామె, బిడ్డను ముత్యాలు పక్కనే పండబెడుతూ. ముత్యాలుకి ఒక వైపు చన్ను బాగా పెద్దగా ఉబ్బి ఒక పక్కకు ఒరిగిపోయివుంది. ఇంకో చన్ను ఉండాల్సిన ప్రదేశంలో ఏమీ లేదు. అంతా ఖాళీ.

ఒళ్ళు కదిలిపోయేలా వెక్కి వెక్కి ఏడుస్తున్న ముత్యాలు పక్కన బిడ్డను పడుకోబెట్టి చనుమొనను బిడ్డ నోట్లో పెట్టింది ముసలామె. గట్టిగా చన్నును అదిమి పట్టుకుంది బిడ్డ.

“చెయ్యీ కాలూ లేదు గానీ, నోరూ పొట్టా మాంఛి వేడి మీద ఉన్నాయి ఈడికి” అంది ముసలామె.

“ఎట్టా లాగుతున్నాడో చూడు, పంపు పెట్టి నీళ్ళు లాగినట్టే!” అన్నాడు పండారం.

ముత్యాలు కళ్ళల్లోంచీ నీళ్ళు జారి చెవులమీదకు కారుతున్నాయి. వెక్కి వెక్కి ఏడుస్తోందామె.

“దేనికే ఈ నాటకాలన్నీ?” అడిగింది ముసలామె.

“ప్రతిసారీ చూసేదేగా. కొన్ని రోజులకి సర్దుకుంటుందిలే! దాన్ని బాగా కడిగి ఒళ్ళంతా తోము. నేను గుడికెళ్ళి అక్కడ ఏం జరుగుతోందో చూసొస్తాను” అంటూ పైకి లేచి చేతికర్ర తీసుకుని బయలుదేరాడు పండారం.

“మరి నా డబ్బులు?” అంటూ అడిగింది ముసలామె.

“కుమరేశన్‍ గాడికి ఇచ్చా, తీసుకో! లెక్కలు తర్వాత చూసుకుందాం.”

పొలాల్లోకి వచ్చేవరకు ముత్యాలు ఏడవడం గురించే ఆలోచిస్తున్నాడతను. ‘సుఖ దుఃఖాలు ఏ జీవికీ తప్పవు. అంతా ఆ పైవాడి లీల!’ అంటూ సర్దిచెప్పుకున్నాడు.

పొలాల్లోకి పూర్తిగా వెలుగొచ్చింది. సూర్యుడింకా పైకిరాలేదు. చలి గాలి తట్టుకోడానికి కంబళి ఇంకొంచెం లాక్కుని భుజాలకు గట్టిగా చుట్టుకున్నాడు. అసంకల్పితంగా ఒక్కసారి కళ్ళు పైకెత్తి ఆ ఒంటరి నక్షత్రాన్ని మళ్ళీ చూసాడు. వెంటనే చూపులు పక్కకి తిప్పేసాడు. ఏదీ తెలీని ఇబ్బంది మళ్ళీ అతన్ని పట్టుకు కుదుపుతోంది. మనసు మరల్చుకోడానికి నేల మీద ఖాండ్రించి ఉమ్మేసాడు.

Jeya mohan

జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దంపట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.

jeyamohan.writer@gmail.com

కుమార్, భాస్కర్

Spread the love

One thought on “అధో లోకం – 1

  1. ఎదో తెలియని ఆతృత నడుమున ఆవేదనగా సాగింది.
    ‘ముత్యాలు’ రూపాన్ని కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించారు.
    చాలా కాలం వెంటాడుతుంది ఈ కథనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *