అండమాన్ దీవుల్లో .. 1

Spread the love

గతకాలపు అవశేషాలుగా కనిపించే అండమాన్ నికోబార్ దీవుల ఆదిమ జాతులు  చరిత్రలో మానవ జీవిత వైవిధ్యాన్ని తెలిపే సజీవ సంస్కృతుల వాహకాలు. ఈ సాంస్కృతిక సంపద గురించి, విలక్షణమైన వారి జీవనాన్ని గురించి నా అండమాన్ నికోబార్ దీవుల పర్యటనలో తెలుసుకున్న విషయాలు పంచుకునే ప్రయత్నం చేస్తాను. 

అద్భుతమైన అందం రాశులు పోసినట్లున్న దీవులు అండమాన్ నికోబార్ దీవుల్లో ఆధునిక నాగరికతకు అందనంత దూరంలో ఉన్న మానవజాతి ఉందని తెలుసు.  కానీ కనీసం ఒంటిమీద గోచీ కూడా లేని రాతి యుగపు మనుషులనుకోలేదు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న మూలవాసుల గురించి మేం వెళ్ళిన చోట్ల వింటూనే విన్నప్పటికీ, ఆంథ్రోపాలజీ మ్యూజియం లో ఆదిమ మానవుల జీవన విధానం గురించి ఎక్కువ తెలుసుకున్నాం. 

అలా తెలిసిన విషయాలు మీతో పంచుకుందామని ఇలా మీ ముందుకు వచ్చా. 

అక్కడి ప్రధాన తెగలు సెంటినలిస్, జార్వాస్, గ్రేట్ అండమానీస్, ఒంగే, షాంపేన్, నికోబారియన్స్. 

సెంటినలిస్, జార్వాస్, గ్రేట్ అండమానీస్, ఒంగే తెగలు అండమాన్ దీవుల్లో ఉండే అబోరిజినల్స్.  వీరు నెగ్రిటో జాతి కి చెందినవారు. 

నికోబారియన్స్, షాంపేన్  తెగల వారు 12 నికోబార్ దీవుల్లో ఉండే మూలవాసులు మంగోలాయిడ్ జాతికి చెందిన వారు.  అందుకే వారి రంగు రూపురేఖల్లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. 

వీరిలో అతి పురాతన తెగ ఒంగే. 

ఈ తెగలు వేట, సేకరణ తో పాటు ప్రకృతితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటారు.  ఏ తెగకు ఆ తెగ ప్రత్యేకమైన భాష, సంస్కృతి కలిగి ఉన్నాయి. వాటి ఆచారవ్యవహారాలను కాపాడుకోవడానికి బలంగా పనిచేస్తున్నాయి. 

అండమానీస్ 60 వేల ఏళ్ల  క్రితం దక్షిణ తూర్పు ఆసియా దేశాలు లేదా ఆఫ్రికా నుంచి వచ్చారని ఫిలోన్త్రోపాలజిస్టుల అభిప్రాయం.  వారిని చూస్తుంటే దక్షిణ ఆఫ్రికా దేశస్తులకు అండమాన్ అబోరిజినల్స్ కి  ఖచ్చితమైన పోలికలు కనిపిస్తాయి. మానవజాతి తొలిదశలో జరిగిన వలసల్లోనే వారు అండమాన్ వచ్చారేమో!

ఓ పక్క ప్రపంచం ఎంతో ఆధునికం అవుతూ, నాగరికం అవుతూ కొత్త కొత్త ఆవిష్కరణలతో కుగ్రామంగా మారిపోతూ ఉంటే మరో పక్క తమ తెగ /సమూహం తప్ప మరో ప్రపంచం తెలియని, సమకాలీన ప్రపంచ పోకడల వాసన సోకని జనం.. 

అండమాన్ నికోబార్ భూభాగంలో జరిగిన ప్రకృతి వైపరీత్యాలతో పాటు వలసవాదుల పోరాటాల కారణంగా అత్యంత పురాతన నివాసులైన ఈ తెగలు తీవ్రంగా నష్టపోయారు. 

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ఈ దీవుల్లో ఉండే తెగల ప్రయోజనాల రీత్యా బయటివారి రాకను నిషేధించారు. ఆదివాసుల రక్షణ కోసం 1956 లో నిబంధన అమల్లోకి వచ్చింది.  

వేలాది సంవత్సరాల క్రితం బర్మా -మలయ్ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు. వీరికి వ్యవసాయం వెన్నెముక. ద్వీప వాతావరణాన్ని బట్టి వ్యవసాయం చేస్తున్నారు. కొబ్బరి, పోక,  అరటి అనేక రకాల దుంపలు సాగుచేస్తున్నారు. పరిసరాల పట్ల లోతైన అవగాహన కలిగి ఉన్నారు. 

వ్యవసాయం ద్వారా ఆహారం పొందడంతో పాటు మిగులు అమ్ముతారు.  శాశ్వత నివాసాల్లో ఉండే వీరి పిల్లలు బడికి వెళ్లి, హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నారు.  ఇప్పుడిప్పుడే అన్ని రంగాలలో ప్రవేశిస్తున్నారు. పోర్ట్ బ్లెయిర్ లో అనేక రకాల ఉద్యోగాలలో ఉన్నారు. హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నారు. చదువుల్లో, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్ అందుకుంటున్నారు. తమ నివాస ప్రాంతాల నుండి వెళ్లి బయటివారితో సంబంధాలు కలుపుకుంటున్నారు. పట్టణాలలో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నికోబారియాన్స్  చాలా అభివృద్ధి చెందారు. కానీ తమ నివాస ప్రాంతాలకు అనుమతి లేకుండా బయట వారిని అనుమతించరు. 

నికోబారియన్స్ జనాభా సునామీ సమయంలో కొంత కోల్పోయినప్పటికీ క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుత జనాభా దాదాపు 27 వేలు. 

వీరు గ్రేట్ నికోబార్ దీవుల్లో అంతర్భాగం.  షాంపేన్ తెగ గురించి తెలిసింది చాలా తక్కువ. పాక్షిక సంచార జీవులు. ఇతర తెగల వారితో కలవడానికి ఇష్టపడరు. దట్టమైన అరణ్యాలలో నివసిస్తారు. 

ఆహారం కోసం వేటాడటం, సేకరించుకోవడం, కొద్దిగా వ్యవసాయంపై ఆధారపడతారు. 

సమూహం నిర్ణయాలు తీసుకుంటారు. సామాజిక ఐక్యత కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. కుటుంబంలో పురుషుడు కుటుంబ పెద్దగా వ్యవహరిస్తాడు. 

వీరికి బయట ప్రపంచంతో పరిచయాలు చాలా పరిమితమే.  కానీ పెరుగుతున్నాయి. 

సాంప్రదాయ జీవన శైలిలో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. నామమాత్రంగా దుస్తులు అంటే మూల చుట్టూ గోచీ గుడ్డ మాత్రమే ఉంటుంది.  

2001 -2010 మధ్యకాలంలో వీరి జనాభా 300 నుండి 50 కి పడిపోయింది. వారిలో 7గురు మొట్ట మొదటి సారి గత మే లో ఓటు వేయడం చరిత్రాత్మక విషయం. 

అండమాన్ నికోబార్ దీవుల్లో అతి పురాతనమైన తెగ ఒంగే. వీరికి వీరు తాము పర్ఫెక్ట్ పర్సన్స్ గా చెప్పుకుంటారట.  లిటిల్ అండమాన్ దీవిలో  నివసించే ఈ తెగ    దుగోంగ్ క్రీక్, సౌత్ బే ప్రాంతాలకే పరిమితం అయ్యారు.  జనాభా 136 అని అంచనా.  బ్రిటిష్ వారు వచ్చినప్పుడు 672  గా ఉన్న వీరి జనాభా క్రమంగా తగ్గి 2011 లో 101 గా ఉంది.  ప్రస్తుతం ఈ జనాభా కొద్దిగా 110 కి పెరిగింది.

వేట , సేకరణ చేస్తుంటారు. చేపలు, తాబేళ్లు, దుంపలు, పనస పండ్లు వారి ప్రధాన ఆహారం.  చేతితో అందమైన వస్తువులు తయారుచేసుకుంటారు.  

దుస్తులు లేకుండా తిరిగే వీళ్ళు మొల చుట్టూ ఆకులు లేదా చెట్టు బెరడు వాడతారు. 

ఈ మధ్య కాలంలో స్థానిక ప్రభుత్వం నుంచి రేషన్, బట్టలు తీసుకుంటున్నారట. 

ఈ భూమి మీద ఉన్న ఒక ఒంటరి సమూహం సెంటినలిస్. ఏ ఇతర తెగల సమూహాలను కలవడానికి సంబంధాలు పెట్టుకోవడానికి ఇష్టపడరు. గ్రేట్ నికోబార్ దీవిలో నివసిస్తారు. వంట చేసే అలవాటు లేదు. 

సెంటినలిస్ జనాభా 50 మాత్రమే లెక్కకు వచ్చింది. అయితే 150 వరకు ఉండవచ్చని అంచన.  వాళ్ళ దగ్గరకు వెళ్లి లెక్కించడం కుదరదు కాబట్టి పై నుంచి హెలికాఫ్టర్ల ద్వారా కనిపించిన వారిని లెక్కించేటప్పుడు 50 అని తెలిసింది. వారికి నాగరిక మానవునితో పరిచయం లేదు.  స్థిరమైన స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నవారు సెంటినల్స్.  బయటి ప్రపంచంతో సంబంధాన్ని ఈ తెగ ప్రతిఘటించడం వల్ల బయట వ్యక్తులకు తెలిసింది చాలా తక్కువ.  పరిచయం లేని తెగ అని చెప్పొచ్చేమో!

,ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరి నివాసమైన సెంటెనల్ ద్వీపం నుండి మూడు నాటికల్ మైళ్ళ దూరం వరకు ఎవరికీ ప్రవేశం లేదు.  2018 లో చట్ట విరుద్ధంగా సెంటినలిస్ ని చేరాలనుకున్న క్రిస్టియన్ మిషనరీ జాన్ అలెన్ చౌ ని  చంపిన వైనం మనందరికీ తెలిసిందే కదా! 

తమ జీవనానికి ప్రకృతిపై ఆధారపడే వీరి ఆయుధాలు బాణం, విల్లంబులు, బాకులు , ఈటెలు.  ద్వీపంలో లభించే పదార్థాలు ఉపయోగించి తయారు చేసుకుంటారు.  వేట కోసం వాడతారు. 

ఆకులతో గుడెసలు వేసుకుని అందులో నివసిస్తారు . నిప్పును చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. 

గ్రేట్ అండమానీ తెగ చెప్పునే వీరు ఒకప్పుడు 10 రకాల ఉప తెగలు గా ఉండేవారు. ఎవరికీ వారికి ప్రత్యేక భాష ఆచారవ్యవహారాలు ఉండేవి.

1789 లో వీరి జనాభా 10వేలు కాగా 1901 నాటికి 650కి పడిపోయింది. 1971 లో 24 కి తగ్గి 1991 నాటికి 41 పెరిగింది.  ప్రస్తుత జనాభా 53. 

విదేశీయుల యుద్దాలు, వారితో వచ్చిన అంటువ్యాధుల వల్ల గ్రేట్ అండమాన్ తెగ వారు చాలా నష్టపోయారు.  

ఇతర సంస్కృతుల వారితో పరిచయాలవల్ల వారి సంస్కృతి సంప్రదాయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఈ తెగ వారు స్ట్రైట్ ఐలాండ్స్ లో కనిపిస్తారు.  

దక్షిణ అండమాన్, మధ్య అండమాన్ పశ్చిమ భాగంలో నివసిస్తారు. 

జార్వా అంటే స్ట్రేంజర్ అని అర్ధం.  జార్వా ప్రజలు తమను ఆంగ్ (ANG) అని చెబుతారు. 

ఆడా మగా ఇద్దరూ దుస్తులు ధరించరు. శరీర కింది భాగంలో ప్రకృతి నుండి తీసుకున్న గడ్డి , ఆకులు వంటివి అడ్డంగా పెట్టుకుంటారు. పై భాగంపై ఏమీ ఉండవు. వేటాడే సమయంలో చెట్టు బెరడును ఛాతికి రక్షణగా పెట్టుకుంటారు. చెట్ల నారను మెడలో అలంకరించుకుంటారు. 

వీరికి పంట సాగు, ఆహారాన్ని వెతకటం, వంట చేయడం తెలియదు.  సముద్రంలో అడవుల్లో వేట వారి వృత్తి ప్రవృత్తి . వేట కోసం బాణం, విల్లు, కత్తి వాడతారు. వేటాడిన జంతువునో, చేపనో కోయడానికి కత్తి వాడతారు.  తమ చుట్టూ ఉన్న అడవి నుంచి కూరగాయలు పండో ఫలమో తెచ్చుకుని తింటారు. 

జార్వా ప్రజల జనాభా ఒకప్పుడు అధిక జనాభా ఉన్నప్పటికీ 19 శతాబ్దిలో వచ్చిన యూరోపియన్ దేశీయుల వల్ల వచ్చిన వ్యాధులు వల్ల వారి జనాభా తగ్గిపోయింది.    

జార్వా తెగ వారి జనాభా 341 అని ఒక అంచనా. ఉమ్మడి కుటుంబాలు కనిపించవట

జార్వా ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడే వ్యక్తులు కాదు. వారి బలం, బంధం అడవి. సంచారజీవులైన వీరు అడవిపందులు, తాబేళ్లు, చేపలు, పీతలు ఇతర సముద్ర జీవుల్ని, అడవిలో దొరికే పండ్లు, తేనె వారి ఆహారం.  ఆ క్రమంలోనే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. లేదా తమ సమూహాలను, బంధువులను కలవడానికి వెళ్తూ ఉంటారట.  ఆ అడవిలో ఆకులతో వేసిన చిన్న చిన్న నివాసాలు ఉంటాయి.  వంట తెలియదు.  నిప్పు రాజేసి పైపైన కాల్చుకుతినడం తప్ప. 

అటువంటి జార్వా తెగ ప్రజలు నివసించే భూభాగం నుంచి దట్టమైన అటవీ మార్గంలో బారటంగ్ కి మా ప్రయాణం.  అలా జార్వా తెగ వారిని ప్రత్యక్షంగా చూసే అవకాశం వచ్చింది.  అయితే వీరి భూభాగాన్ని సందర్శించడాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది. 

జార్వాలను చూడాలని అందరం కళ్లప్పగించి ఉత్కంఠతో చూస్తున్నాం. గత నెల తడోబా నేషనల్లో ఫారెస్ట్ లో  పులి కోసం చూసినట్లుగా చూస్తున్నట్లనిపించింది నాకు. 

మార్గమధ్యలో జార్వా తెగ వారు కనిపిస్తారని, ఎవరూ వారిని ఫోటో తీయకూడదని, వారిని చూసి చేతులు ఊపడం, నవ్వడం వంటి పనులు చెయ్యకూడదని మా వ్యాన్ డ్రైవర్ మాల్యాద్రి ముందే హెచ్చరించాడు. ఒకవేళ అలా చేస్తే జార్వాలు ఉద్రిక్తులై  బాణాలతో, రాళ్లతో వ్యాన్ పై దాడి చేస్తారని ఒక సారి తనకు చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా జరిగిన ముచ్చట చెప్పాడు. 

జార్వా తెగ వారి ఫోటోలు, వీడియోలు తీయడం చట్టవిరుద్ధం అని  తీవ్రమైన నేరంగా పరిగణిస్తారని, తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని అర్థం చేసుకొమ్మని మరీ మరీ హెచ్చరించాడు మాల్యాద్రి. 

ఒక వేళ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రభుత్వం తనను శిక్షిస్తుందని హెచ్చరించి ఉండడం తో అందరం బుద్దిగా కూర్చుని జార్వాల కోసం చూడడం మొదలు పెట్టాం.  

కొంత దూరం వెళ్ళాక అకస్మాతుగా మా డ్రైవర్ మాల్యాద్రి అరుగో .. అన్నాడు. 

ఒక స్త్రీ పురుషుడు , మరో టీనేజర్ కనిపించారు. 

స్త్రీ పురుషులిద్దరూ రోడ్డు పక్కన కూర్చొని ఉన్నారు. వాళ్ళ ఒంటిపై నూలుపోగు ఉన్నట్లు లేదు. గాఢమైన నలుపు రంగులో ఉన్న ముఖం , చేతులు, ఛాతీ చర్మంపై తెల్లటి చారలు.. తలపై నుదురు చుట్టూ సన్నని ఎర్ర దారంతో కట్టి ఉంది. చేతిలో కత్తి, విల్లు కనిపించాయి. 

వారి పక్కనే నుంచున్న టీనేజర్ వీరి వేషధారణకు బిన్నంగా.. సమకాలీన ప్రపంచపు ప్రభావాలు యువతరం పై కనిపిస్తూ జీన్స్ ప్యాంటు , ఫుల్ హ్యాండ్ షర్ట్, నల్ల కళ్ళద్దాలతో.. మొహంపై వారి పెద్దలకు ఉన్నట్లు తెల్లటి చారలు..  

ఆ అడవుల్లో దొరికే తెల్లటి మట్టిని వాళ్ళు అలా రాసుకుంటారని మాల్యాద్రి చెప్పాడు. 

కాస్త ముందుకెళ్ళాక వేగంగా మాకు ఎదురొస్తున్న ట్రక్ పై నించుని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్న ఇద్దరు జార్వా టీనేజర్స్. వాళ్ళ ముఖాన కూడా అదే విధమైన తెల్లటి చారలు. పొట్టిగా ఉన్నారు.  

ఇంకా కాస్త వెళ్ళాక 5గురు పిల్లలు. రోడ్డు పక్కన నుంచుని. అంతా ఐదు నుంచి ఏడెనిమిదేళ్ల లోపు వాళ్ళు ఉండొచ్చు. అందులో ఒక బుడతడు నవ్వు మొఖంతో చేతిలో ఉన్న పుల్లను జెండా లాగా ఊపుతూ.. 

వాళ్ళ నేలపై వాళ్ళు నచ్చిన విధంగా ఉంటే ఆ భూభాగం నుంచి పోతూ వింతగా జంతువుని చూసినట్టు చూడటం.. మనసుకు ముల్లు గుచ్చుకున్న బాధ. 

పురాతన మానవ సంస్కృతి లో ఒకటైన ఆఫ్రికా మూలాలున్న  వ్యక్తుల్లాగే కనిపించారు వారు నా కళ్ళకి.  

2002లో సుప్రీంకోర్టు జార్వా రిజర్వ్ నుంచి హైవే మూసేయాలని ఆదేశించినప్పటికీ అది ఇప్పటికీ తెరిచి ఉండడమే కాక మరింత విశాలమైన రహదారికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

మా తిరుగు ప్రయాణంలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు వంతెన పనిచేసే వారి పక్కనే కూర్చుని చూస్తున్న జార్వా పురుషులు కనిపించారు.  

కాసేపటికి ఏడుగురు జార్వా మహిళలు గాఢమైన రంగుల నైటీలతో.. ఇదంతా చూస్తుంటే ఎక్కడో తేడా కొట్టింది. హానికరమైన సమూహంగా పేర్కొనే జార్వాలు బయటివారితో స్నేహంగానే ఉండొచ్చనిపించింది. 

అండమాన్ నికోబర్ లో నివసించే ఆదిమ జాతుల రక్షణ కోసం అనేక ప్రత్యేక నియమాలు, జార్వాల సంక్షేమం కోసమే ఈ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటే ఉండొచ్చు కానీ జంగిల్ సఫారీ చేస్తున్న పర్యాటకుల కోసం  జార్వాలను ప్రభుత్వం షో కేసింగ్ చేస్తున్నదా అని సందేహం కలిగింది. 

జార్వాల నివాస ప్రాంతం నుంచి 1990 లలోనే 360 కి మీ గ్రాండ్ ట్రంక్ రోడ్డు వేశారంటే బయట మానవుల పరిచయం వాళ్లకు ఉన్నట్లేగా.  నైటీ వేసుకోవడం అందుకు బలాన్నిచ్చింది. 

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్తూ-  ఒక జార్వా వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురైతే గైడ్ సహాయంతో ఆస్పత్రిలో చేర్చారని, ఐదు నెలలు ఆసుపత్రిలో చికిత్స తర్వాత తిరిగి తమ సమూహం లోకి చేరిన ఆ వ్యక్తి వల్ల వారిలో కొంత మార్పు వచ్చిందనీ చెప్పారు మాల్యాద్రి. 

అరటి, కొబ్బరి తినడం అలవాటు చేశారు, అదే విధంగా వారు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు ఆసుపత్రికి తీసుకుపోవడం, బట్టలు, మందులు ఇస్తున్నదని, కానీ చదువుకునే అవకాశాలు ఇప్పటివరకు కల్పించలేదని చెప్పాడు. 

తీవ్ర ప్రమాదంలో ఉన్న అండమాన్ నికోబార్ తెగల వారసత్వాన్ని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఓ పక్క సంతోషం. మరో పక్క 

ఎంత వరకు సఫలమవుతుందో సందేహం. 

 కారణం కీకారణ్యంలో విశాలమవుతున్న రోడ్డు రహదారుల పనులు ఎవరి కోసం? 

ఆదిమ తెగల కోసమా? లేక ఆయా ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న బెంగాలీలు, తెలుగు, తమిళ, మలయాళీ తదితర ప్రజల కోసమా?  లేక ఆ సముద్ర జలాల్లో, అడవుల్లో దీవుల్లో దాగిన అపారమైన ప్రకృతి సంపద కోసమా?

రేపటి రోజు ఈ తెగల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇష్టారాజ్యంగా తెగనరికే అడవులు, జరిగే వాతావరణ మార్పులకు తోడు చట్టపరిధిలో /చట్టవిరుద్ధంగా వనరులను కొల్లగొట్టే గద్దల నుంచి మూలవాసుల సహజ నివాసానికి ఎంత ముప్పు వాటిల్లనుందో .. 

ఆధునిక సదుపాయాల వ్యాప్తిలో, పురోగతిలో వారి సంస్కృతి క్షీణించి పోనుందో ..  

మానవ సంస్కృతిలో భాగమైన ఈ తెగల వారు తమ భిన్నత్వంలో అలాగే ఉండాలా?

సమకాలీన ప్రపంచంలో భాగం అవ్వాలా?

అనేకానేక ప్రశ్నలు. 

వి. శాంతి ప్రబోధ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *