చిన్న వయసులోనే తల్లిని విడిచి ఇంటి నుంచి పారిపోయాడు కరుణ.
పిల్లలు ఇంటి నుంచి పారిపోవడానికి లక్ష కారణాలు ఉంటాయి. కాని పారిపోయిన పిల్లల తల్లుల వేదన మాత్రం ఒక్కటే. తల్లిని వదిలి, పలాసాను వదిలి, చెన్నైకి చేరిన కరుణకు తల్లి గుర్తుకు రాకుండా ఉంటుందా? తల్లిని క్షోభకు గురి చేసినందుకు పసిమనసులో కోత లేకుండా ఉంటుందా? ఏ తల్లయినా మంచిదే బిడ్డకు.
వాల్మీకీని ఏదో ఒకటి చేసి కుటుంబాన్ని సాకమని భార్య కోరిందిగాని తల్లి కాదు. మరి నా పాపాల్లో భాగం తీసుకుంటావా అనంటే నేనెందుకు తీసుకుంటానని భార్య అనింది కానీ అదే మాట తల్లితో అనుంటే అన్నీ పాపాలూ నాకే ఇచ్చి నువ్వు చల్లగా బతుకు నాయనా అనుండేది.
కరుణ మనసులో ఈ తల్లి అంశ సగం ఉండిపోయింది. మిగిలిన అంశ అంతా కఠినమైన సమాజమూ, దాని నిర్దాక్షిణ్యత, దానితో నిర్వహించవలసిన కపటమూ, అది చేసే అవమానమూ, అది కార్పించే కన్నీరూ, ఒక స్త్రీని తోడు చేసుకొని సంసారాన్ని ఈదమని అది వేసిన బరువు, ఆ బరువు కింద ఏ మగాడికైనా తప్పని అవిముక్త నలుగుబాటు … ఇవన్నీ మరో సగము. అలా కరుణ కుమార్ చూసే జగత్తు ఒక స్త్రీ రూపంలో ఉంటూ సగం మంచితో సగం చెడుతో నిండిపోయింది. ఇంటి నుంచి పారిపోయేలా చేసిన చెడు… పారిపోయి వచ్చిన పిల్లాణ్ణి పాసిపోయిన ఇడ్లీ పెట్టయినా సరే పెంచి మళ్లీ ఇంటికి పంపిన మంచి…. ఇటు మొగ్గు అటు వెగటు. అవి ఈ కథలు.
కరుణ మొదటి కథ ‘చున్నీ’ కావడం యాదృచ్చికం కాదు. గాఢమైన మస్తిష్క పొరల్లో నిండిపోయిన గిల్ట్‌కు ఎకో. నగరంలో ఎవరో ఒక యువతి. ఒకప్పుడు పారిపోయి నగరానికి చేరిన తన లాంటి మనిషి కూడా కావచ్చు. చిల్లర మల్లర మోసాలను చున్నీ చాటున చేసి బతుకుతోంది. ఈ చెడు చేసే అగత్యం ఆమెకు ఎందుకు అని కరుణ అనుకోడు. ఈ చెడును జాలి కలగని పచ్చిదనంతో చూపుతాడు. మీరు కదరా దీనికి కారణం అనే కోపం లోపల ఉండొచ్చు. లేదా ఎస్… ఇలాగే శాస్తి చేస్తూ బతుకూ అనే కసీ కావచ్చు.
మగాడిలో స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీకి మామూలు స్త్రీ వలే క్యార్‌బ్యార్‌మనే, ముక్కు చీదే, కష్టం వస్తే నలుగురితో మొరపెట్టుకునే, భీతిని వ్యక్తం చేసే అనుమతి లేదు. మోసేవాడు మగాడు. అతడు తనలోని స్త్రీని తొక్కిపెట్టి మగాడుగా బతకాలి. మగాళ్లు మగాళ్ల వలే బతకలేరు ఈ సమాజంలో– ముఖ్యంగా స్త్రీలతో తలపడినప్పుడు. లేదా స్త్రీలు వారితో దురుద్దేశాలతో తలపడినప్పుడు. మూగవేదన ఇది. బహుశా ఏ తండ్రో, కరుణ తండ్రి కూడా కావచ్చు… ఆ పూట ఇంట్లోకి గింజలు తేలేక భార్య చూపుకు విలవిలలాడిపోతే అది జన్యువుల్లో నిండిపోతే ఏం… ఈ కథను ఎందుకు చెప్పకూడదు? కుండ బద్దలేసి చెబుతానని రాస్తాడు ‘ఫోర్ నైంటీ ఎయిట్’ను. ఈ కథ మగాడి కథ కాదు. భర్త కథ కూడా కాదు. భర్తలోని స్త్రీ అంశ భార్య అనే మరో స్త్రీ ఎదుట ఓడిపోవడం.
స్త్రీలను భక్తిలో ఉంచడం మగాడికి అవసరం. అది వాడికి భరోసా. స్త్రీకి ఇంటి పనుల సమయం… తక్కినదంతా భక్తి సమయం. ఓహో. ఏ మతంలో అయినా మగాడు ఆశించేది భక్తి స్త్రీకి నైతిక సరిహద్దులు విధించగలదని, విధించాలని. స్త్రీలు 70వ దశకం నుంచి ఆధునిక విజ్ఞావం వైపు నడిచి, బాగా చదువుకుని, మేధావులుగా ఎదిగాక, అంత ప్రయాణం చేశాక, నేడు ఏ చదువు చదివినా ఏ పదవిలో ఉన్నా భక్తిని ప్రదర్శనగా చేసే స్థితిలోకి వెళ్లారు కారణాలు ఏవైనా. ఒకప్పుడు ఊళ్లలో అద్దె పుస్తకాల షాపులు ఉండేవి. నేడు పూజా సామాగ్రి దుకాణాలు ఉన్నాయి. ఈ పూజా సామాగ్రిని స్త్రీలు ఉపయోగిస్తూ బిజీగా ఉండాలి. ఆధ్యాత్మికత చాలా అవసరమే. భక్తీ అవసరమే. కాని కట్టడి రాయకీయాలలో భక్తిని ఒక పావుగా వాడటం ఉధృతం అయితే మూఢ భక్తిని వ్యాప్తి చేసే నకిలీ బేహారులు బయలుదేరుతారు. మూఢభక్తి కుటుంబాలను ఛిద్రం చేస్తుంది. స్త్రీలను చీకట్లో తోస్తుంది. పెను విషాదాలకు కారణం అవుతుంది. ఈ చీకటి ఎంత పేరుకుపోయి ఉందో అప్పుడప్పుడు వార్తలు వస్తే భయభ్రాంతం అవుతూ ఉంటాం. ‘చీకటి’ కథ చదివినా.
స్త్రీలు తమ హృదయ సంచలనాలను నెమ్మదింప చేయడానికి, బంధుమిత్రుల సపోర్ట్ సిస్టమ్ అంతగా అనుమతించని, ‘బయటికి చెప్పుకోవడం’ అనేది చెడ్డ నాగరికతగా చెలామణి అయ్యే మెట్రోలలో అలజడిని అదిమి పెట్టడానికి, పురుషుడు–కెరీర్–ప్రేమ ఈ త్రికోణంలో అతని ఆట అతనిదీ తన ఆట తనదీ అయినప్పుడు ఎదురయ్యే చావుదెబ్బల నుంచి కోలుకోవడానికఈ వేలకు వేలు కట్టి మెడిటేష¯Œ క్యాంపులకు వెళ్లడం, లైఫ్ కోచ్‌లపై ఆధారపడటం, బ్యాక్‌ప్యాక్ తగిలించుకుని ప్రయాణాలకు బయల్దేరడం… అత్యంత సహజ స్పందనలకు కూడా పాపపుణ్యాల బేరీజుతో స్వయం దోషత్వం ఆపాదించుకోవడం… అవును.. ఇవీ కథలే. ‘పురుగు’, ‘మేఘమాల’ చదివితే.
అయితే కరుణను ఈ సగం నుంచి చూడకూడదు. అతను చూపిన ఈ సగం గురించి ఈ పుస్తకం చదవకూడదు. కరుణ చూసింది, చూపాలనుకుంది వేరే ఉంది. అతను వత్తాసు పలికే పాత్రలు ఉన్నాయి. అక్కడే అతణ్ణి పరికించాలి. ఈ పుస్తకంలోని ‘పుష్పలత నవ్వింది’, ‘సాయమ్మ’ ఏ విధంగా చూసినా ఇప్పుడు ఉపదేశానికి నోచుకుంటున్న ‘ఆత్మ నిర్భరత’ అనే మాట పుట్టక ముందే ‘నిబ్బరంగా’ తమకు కావలసిందేమిటో, తమ బతుకును ఎలా నిభాయించుకుని రావాలో తెలిసిన పాత్రల కథలు. కరుణ బలమూ సారమూ అతను వలపక్షం వహిస్తున్న, తనలోని తల్లిసగానికి తన వంతు అర్పణ ఇస్తున్న కథలు ఇవి. ‘బయటి లైట్లకు అలవాటు పడితే ఇంట్లో లైట్లు చాలవు’ అనే పాత్ర మేఘమాలది అయితే, ఇల్లూ ఊరు దాటకుండా సామ్రాజ్యాలను ఏలిన దక్షత సాయమ్మది. ఈ రెండు పాత్రల కొసలకు వెళ్లకుండా నడి మధ్యన నడవగలిగితే స్త్రీలు ఇంట, బయట, ఉపాధిలో, ప్రేమలో ఒక సమతుల్యతను సాధించగలరేమో.
ఒకటి కచ్చితం. ఈ జగత్తులో మగ, ఆడ అనే అంశలు అన్నింటా ఉంటాయి. ఇవ్వగలిగే చేయి మగాడిది అయితే పుచ్చుకునే చేయి ఆడ. స్టేట్ మగ… సమాజం ఆడ. మెజారిటీ మగ. పక్కకు నెట్టబడిన చిట్ట చివరకు తోయబడిన వర్గాలు ఆడ. ‘షేర్నీ’ సినిమా రివ్యూలో రాశాను… ఎంత పెద్ద మగ అధికారి అయినా ‘మగ’ స్వభావాన్ని చూపే స్టేట్ అదుపాజ్ఞల్లో ఉండకపోతే అతణ్ణి అప్రధానమైన శాఖకు తరలించి నెత్తిన ముసుగేసి కూచోబెట్టే స్త్రీ వలే తయారు చేస్తారని. ఉత్తరాంధ్ర అంటే పోరాటాల నేల. చైతన్యాల నేల. పుచ్చుకునే చేయిగా మాది ఎందుకుంది… ఇవ్వడానికి నువ్వెవరు అనే ప్రశ్న లేవగానే శాసనాధికారం గల వేయి పురుష శక్తులు నిద్ర లేస్తాయి. బ్యూరోక్రాట్ శక్తులు, యూనిఫామ్ ధరించి ఊళ్లలోకి వచ్చే శక్తులు, ప్రయివేటుగా తయారు చేసి వదిలే శక్తులు… మరి అవతలి పక్షం న్యాయం కోసం తుపాకీ పట్టుకున్నా సరే స్టేట్ దృష్టిలో అది ‘స్త్రీ’యే. సంసారంలో నోరెత్తే స్త్రీకి ఎలాంటి గుణపాఠం చెప్పాలో సమాజంలో నోరెత్తాలని చూసే తుపాకీకి అంత గుణపాఠమూ చెప్పాల్సిందే. విషాదం ఏమంటే ఈ సిలబస్‌లో స్త్రీల కంటే అధమస్థితిలో ఉండే బక్కప్రాణాలెన్నో బలవుతుంటాయి. కరుణ ఇలాంటి చైతన్యానికి లోపలివాడు కాడు. లోపలివాడు అయివుంటే కథలు ఒకలాగా వచ్చేవి. ఇతను ఆ అవరణలోని టీ బంకు దగ్గర టీ తాగక తప్పని వాడై అలాంటి వాడికి అందే సమాచారం ఆధారంగా, ‘న్యాయమైన’ చూపుతో రాసిన కథలు ‘సవర్ల కొండ’, ‘వాంటేజ్ పాయింట్’. కరుణ పుట్టి పెరిగిన ప్రాంతాన్ని పరిగణిస్తే ఇవి రెండూ ముఖ్యమైన కథలు.
కరుణ ఒక నిరక్షరాస్య కథకుడు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో తర్ఫీదు లేకపోయినా మంచి నటన చూపే నటుడు లాంటి వాడు. ఆశు కవిలానే తక్షణ కథకుడు. సులువుగా కథ కట్టగలవాడు. ఒకప్పుడు హోటల్ సర్వర్ నేడు మన ముందుకు కథకునిగా రావడం చిన్న మిరాకిల్ కాదు. కాని తన సాహిత్య ప్రయాణంలో ‘ఇలా ఉంది’ దగ్గరి నుంచి ‘ఇలా ఎందుకు ఉంది’ అనే వైపుగా అతను నడిచి ఆ ఎందుకును కథలోకి తేగలిగితే తుపాకీ ఉన్నది తూటాలను గాల్లోకి పేల్చడానికి కాదు అని తెలుసుకుంటాడు. ఒక జీవితం తెలిసింది కదా ఇది తక్షణమే కథ చేద్దాం అనుకోడు. ఒక విజువలైజేషన్ ఉంది కదా మెస్మరైజ్ చేసేలా రాద్దాం అనీ అనుకోడు. సాహిత్యం మెస్మరిజం కాదు. అది రుద్ది రుద్ది శుభ్రం చేసే శాండ్ పేపర్. దానితో దేనిని శుభ్రం చేయాలో దానినే చేయాలి.
గొప్ప సెన్సాఫ్ హ్యూమర్ ఉండే కరుణ ప్రకటితం చేసే విదూషకత్వం అంతా అబద్ధం. అతని లోపల అమ్మ కంటే గొప్పదైన ఆర్ద్రత, తడి, పిరికిగానైనా సరే మనిషితనం కోసం నిలబడదామనే ఒక వాంఛా ఉన్నాయి.
మంచిని చెప్పబోతే పిడిగుద్దులు ఎదురవుతున్న ఈ రోజుల్లో ఆచి, తూచి, ఏమార్చి అతను పాఠకుల్లో మంచిని ఎక్కించాలని కోరుకుంటున్నాను.
సెలవు.
– డిసెంబర్ 5, 2024
మహమ్మద్ ఖదీర్‌బాబు
Mohammed Khadeer Babu is a Telugu short story writer, journalist and script writer for movies. His short story collections Dargamitta Kathalu and Polerammabanda Kathalu are known for their connection to their native identity and regional dialect. New Bombay Tailors, Beyond Coffee and Metro Kathalu are his other major works. He is primarily published by Kavali Prachuranalu.