డాన్ నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది Part 21

Spread the love

నవంబర్ మొదటి రోజుల్లో పెట్రోగ్రాడ్ లో ప్రొవిజినల్ ప్రభుత్వం కూలిపోవడం గురించి భిన్న వదంతులు కొసాక్కులకు వింటూ ఉన్నారు. ఈ విషయంలో మిగిలిన వారి కన్నా ఎక్కువ సమాచారం ఉన్న సైన్యంలో ఆర్డర్లీలు మాత్రం ప్రొవిజినల్ ప్రభుత్వం అమెరికాకు పరారైందని, కెరెన్ స్కీ ని మాత్రం నావికులు పట్టుకున్నారని, వారు అతనికి గుండు చేసి, గుండు చేసి, చితకబాది, పెట్రోగ్రాడ్ అంతా రెండు రోజులు తిప్పారని చెప్పారు.

   తర్వాత, ఎప్పుడైతే ప్రొవిజినల్ ప్రభుత్వం కూలిపోయిందని, అధికారం శ్రామికుల, కార్మికుల అధీనంలో ఉందని తెలిసిందో అప్పుడు కొసాక్కులు మౌనంగా అయిపోయారు.

ఎక్కువమంది దీని వల్ల యుద్ధం ముగిసి, శాంతి నెలకొల్పబడుతుందని భావించారు.కానీ కెరెన్ స్కీ, జనరల్ క్రాస్ నోవ్ నాయకత్వంలో మూడవ దళం పెట్రోగ్రాడ్ వైపు సాగుతూ ఉంటే,ఇంకో వైపు కాలేడిన్ డాన్ ప్రాంతపు కొసాక్కు రెజిమెంటులను ఒకటి చేసి దక్షిణం వైపు నుండే మొహరించే ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

   కానీ యుద్ధసరిహద్దు ప్రాంతాల్లో సైనికులు సహనం కోల్పోయారు. అక్టోబర్ నాటికి మెల్ల మెల్లగా కనిపించకుండా, గుర్తు పట్టని బృందాలతో కలిసిపోయారు.కానీ నవంబరు ఆఖరు కల్లా  మొత్తం బెటాలియన్లు, రెజిమెంట్లు, కంపెనీలు కూడా తమ పొజిషన్ల నుండి విరమించుకున్నాయి. కొందరు సంయమనంతో వ్యవహరించినా, ఎక్కువమంది మాత్రం రిజిమెంట్ల ఆస్తులను అపహరించి,ఆ ప్రాంతంలోని కొట్లను కొల్లగొట్టి, కొందరు అధికారులపై కాల్పులు జరిపి, దారిలో కనిపించినవి కూడా దోచుకుంటూ, ఒక రకమైన తిరుగుబాటు ధోరణిలో తమ మాతృభూమికి తరలిపోయారు.

   ఈ  పరిస్థితుల్లో 12 వ రెజిమెంటుకి యుద్ధభూమి నుండి వెనక్కి తరలిపోతున్న సైనికులని తిరిగి తీసుకురావడం అన్నదానికి అర్థమే లేకుండా పోయింది. తర్వాత ఆ రెజిమెంటును యుద్ధభూమిలో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో పూరించే ప్రయత్నం చేసినా, వాళ్ళు ఏ మాత్రం ఆసక్తి చూపక, రెజిమెంటు ఆస్తులైన ఆయుధాలను, గుర్రాలను అపహరించి, దగ్గరలో ఉన్న స్టేషన్ దగ్గరకి చేరుకుని, అప్పటికి అంతఃకలహాలతో అట్టుడుకిపోతున్న రష్యాకి బయలుదేరారు.

  డాన్ ప్రాంతానికి వెళ్ళే దారిలో రెజిమెంట్ల రైళ్ళు ఉక్రెయిన్ గుండా వెళ్ళాయి. నామెంకా దగ్గరలో బొల్షివిక్కులు వారిని ఆపే ప్రయత్నం చేశారు. చర్చలు ఒక అరగంట దాకా సాగాయి. ఆ దళపు విప్లవ కమిటీకి చైర్మెన్ అయిన కొషివోయ్, మిగిలిన ఐదుగురు కొసాక్కులతో కలిసి, తమను ఆయుధాలతో అక్కడి నుండి ముందుకు వెళ్ళనిమ్మని అడిగాడు. 

   ‘మీకు ఆయుధాలు ఎందుకు?’ సోవియట్ స్టేషన్ సభ్యులు అడిగారు.

   ‘మా సొంత అధికారుల పుర్రెలు పేల్చడానికి! కాలేడిన్ ను గద్దె దింపడానికి!’ అందరి బదులు కొషివోయ్ బదులిచ్చాడు.

  ‘ఆ ఆయుధాలు మావి,సైన్యానివి,మేము వాటిని ఇవ్వము!’మిగిలిన కొసాక్కులు ఎదురుతిరుగుతూ అన్నారు.

   చివరకు ఆ రైలు  వెళ్ళడానికి అనుమతి వచ్చింది. క్రెమెన్ చగ్ దగ్గర ఇంకోసారి ఆ రైలును అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అయినా ఆ అడ్డంకిని కూడా వారు దాటారు. తర్వాత యెకతెరినోస్లావ్ దగ్గర రెడ్ గార్డ్ బృందం వచ్చినప్పటికి ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే రెజిమెంటు మెషీన్ గన్స్ ని, వంద పెట్టెల ఆయుధాలను, టెలిఫోన్లను, వైర్లను కోల్పోయింది. వారి అధికారులను ఖైదు చేయమని మధ్యలో తిరుగుబాటుదారులు ఒత్తిడి తెచ్చినా,కొసాక్కులు ఆ చర్యను వ్యతిరేకించారు. ఆ మొత్తం ప్రయాణంలో ఒక్క అధికారిని మాత్రమే వారు కోల్పోయారు. అతనే చిర్ కోవిస్కీ. అతనికి కొసాక్కులే మరణ శిక్ష విధించారు; ఆ శిక్షను ఉర్యుపిన్, ఒక రెడ్ గార్డ్ నావికుడు అమలుపరిచారు.

   డిసెంబర్ 17 న మధ్యాహ్నం దాటిన తర్వాత సినేల్నికోవ్ స్టేషన్ దగ్గర కొసాక్కులు అతని శవాన్ని బయటకు విసిరేశారు.

   ‘వీడే కదా కొసాక్కులకు వ్యతిరేకంగా సమాచారం చేరవేసింది?’ ఎత్తు పళ్లతో, చేతిలో పిస్టల్ తో  ఉన్న ఓ అధికారి నవ్వుతూ అడిగాడు.

  ‘అతను ఎవరో మాకు తెలియదు అనుకుంటున్నారా?’ఇందులో ఏ తప్పు జరగలేదు, అతనే!’, ఉర్యుపిన్ రొప్పుతూ అన్నాడు.

  ఆ కుర్ర అధికారి, చెమట పట్టిన చేత్తో తన జుట్టు సరిచేసుకుంటూ, తీక్షణంగా చుట్టూ చూస్తూ ఉన్నాడు. ఉర్యుపిన్, ఇంకో సైనికుడు ఆ అధికారిని అక్కడి నుండి పక్కకు తీసుకువెళ్ళారు.

   ‘ఇలాంటి దయ్యాల వల్లే జనాలు తిరుగుబాటు చేస్తారు. అసలు ఇలాంటి వాళ్ళ వల్లే విప్లవం మొదలైంది, వీరి అరాచకత్వమే దీనికి కారణం……’అని అతను అంటూ ఉంటే, ఉర్యుపిన్ తన టోపిని తీసి, ‘గట్టిగా పట్టుకోండి,కెప్టెన్’అన్నాడు.

  ‘నువ్వు సిద్ధమేనా?’ ఆ అధికారి తన ఆయుధాన్ని  సరిచేసుకుంటూ పళ్ళు బయటకు కనిపించేలా నవ్వుతూ ఉర్యుపిన్ వైపు చూస్తూ అన్నాడు.

 ‘రెడీ!’

   ఉర్యుపిన్ ఆ అధికారి వైపు ఓ సారి చూసి, ఒక కన్ను మూసుకుని తన చేతిలో ఉన్న పిస్టోల్ తో గురి పెట్టి, ఒక చిన్న నవ్వు నవ్వి ,మొదట కాల్పులు జరిపాడు.

   చాప్లిన్ దగ్గర అనార్కిస్టులకు, ఉక్రేనియన్లకు మధ్య జరుగుతున్న యుద్ధంలో రెజిమెంటు కూడా కల్పించుకుంది. ఆ యుద్ధంలో ముగ్గురు కొసాక్కులు మరణించారు. అతి కష్టం మీద ఎలాగో ఆ ఘర్షణకు ముగింపు పలికి వారు ప్రయాణం కొనసాగించారు.

   మూడు రోజుల తర్వాత రెజిమెంటుకి చెందిన మొదటి రైలు మిల్లెరోవోకి చేరుకుంది.

  మిగిలిన రైళ్ళు లుగాన్స్క్ దగ్గరే ఉండిపోయాయి.

   రేజిమెంటులో సగం మంది (మిగిలిన వాళ్లు స్టేషన్ నుండే సరాసరి  ఇళ్ళకు బయలుదేరిపోయారు)  మాత్రం కార్గిన్ గ్రామానికి చేరుకున్నారు.తర్వాతి రోజు వారు అపహరించిన రెజిమెంటు ఆస్తులను, ఆస్ట్రియా సరిహద్దు దగ్గర పట్టుకున్న గుర్రాలని అమ్మేసి, వారిలో వారు పంచుకున్నారు.

   టాటార్ స్కై కి చెందిన కొషివోయ్, ఇతర కొసాక్కులు సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. ఒక కొండ మీదుగా వారు ప్రయాణం చేశారు. వారి కింద డాన్ పై భాగంలో ఉన్న కార్గిన్ గ్రామం, చిర్ నది మీదగా మంచుతో కప్పబడిన ఒంపులా కనిపిస్తూ ఉంది.మిల్లు చిమ్ని నుండి పొగ చిన్న చిన్న ముద్దలుగా  కనబడుతూ ఉంది, కూడలి జనాలతో సందడిగా ఉంది, సాయంత్రపు పాట సమయాన్ని గుర్తు చేస్తూ చర్చ్ బెల్లు మోగుతూ ఉంది. కార్గిన్ కొండ వెనుక ఉన్న క్లిమోవ్ గ్రామంలోని పచ్చికలు, అప్పుడే అస్తమిస్తూ ఉన్న సూర్యుడు కూడా దర్శనమిస్తూ ఉన్నాడు.

     గుర్రాల మీద వెళ్తూ ఉన్న పద్దెనిమిది మంది ఒక శ్మశానవాటికను దాటి, ఈశాన్యం వైపు సాగిపోయారు. ఆ రాత్రి వారికి మంచుపోతతో ఆహ్వానం పలికింది. తాము ధరించిన కోట్లను పైకి లాక్కుంటూ కొసాక్కులు మధ్యమధ్యలో వేగం తగ్గిస్తూ వెళ్తున్నారు. గుర్రపు డెక్కల శబ్దం,మధ్యమధ్యలో వారి మాటలు మాత్రమే  ఆ ప్రయాణంలో వారికి తోడుగా ఉన్నాయి.

    సూర్యుడు పూర్తిగా మాయమై,ఆకాశంలో చంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. కొసాక్కులు నిశ్శబ్దంగా ప్రయాణం చేస్తున్నారు. అంతకుముందు ఆ దారిలో ప్రయాణించిన వారి జాడలు డెక్కల ముద్రల్లో కనిపిస్తున్నాయి.

   *    *  *  

                        పార్ట్ -5

                        అధ్యాయం -1

                        1917 వసంతకాలం చివరి రోజుల్లో కొసాక్కులు యుద్ధభూమి నుండి ఇంటికి తిరిగి రావడం ఆరంభమైంది.తన వయసుకి మించిన వాడిలా మారిపోయిన  క్రిస్టోన్య 52 వ రెజిమెంటులో పని చేసిన ముగ్గురు కొసాక్కులతో కలిసి తిరిగి వచ్చాడు. తల మీద పెద్దగా జుట్టు లేకుండా ఉండే అనికె, ఆయుధ శాఖలో పని చేసిన ఇవాన్ టోమిలిన్, గుర్రపు నాడా యాకోవ్ లు ఒక జట్టుగా వచ్చారు. వారిని అనుసరిస్తూ మార్టిన్ షామిల్, ఇవాన్ అలెక్స్ యేవిచ్ కోట్లయారేవ్, జాకర్ కొర్యోలోవ్, పొడుగ్గా ఉండే బోర్స్ చేవ్ కూడా వచ్చారు.

                        డిసెంబర్ లో మిట్కా కొర్షునోవ్ హఠాత్తుగా వచ్చాడు. ఆ తర్వాత 12 వ రెజిమెంటులో ఉన్న మిష్కా కొషివోయ్, ప్రొఖోర్ జికోవ్, వృద్ధ కాషులిన్ కొడుకైన ఆండ్రి కాషులిన్, యెపిఫాన్ మక్సాయేవ్, యెగోర్ సినిలిన్ కూడా కలిసి వచ్చారు.చూడటానికి కాల్మిక్ లా ఉండే ఫెడోట్ బోడోవ్ స్కోవ్, తన రెజిమెంటు నుండి విడిపపోయి, ఒక ఆస్ట్రియా అధికారి నుండి తీసుకున్న ఓ మేలు జాతి గుర్రం మీద దర్పంగా తిరిగి వచ్చాడు. వోరోనేజ్ దారి గుండా వచ్చిన అతను ఆ తర్వాత చాలా రోజుల పాటు విప్లవ జ్వాలలతో రగిలిన వోరోనేజ్ ప్రావిన్స్ గ్రామాల గురించి, అక్కడ ఎర్ర సైన్యం నుండి తాను గుర్రం మీద చాకచక్యంగా తప్పించుకున్న తీరు గురించి కథలు కథలుగా చెప్పాడు.

                        ఆ తర్వాత బొల్షివిక్కుల ప్రభావంతో ఉన్న 27 వ రెజిమెంటు నుండి తప్పుకున్న   మెర్కులోవ్, పెట్రో మెలఖోవ్, నికోలాయ్ కొషివోయ్  కామెన్ స్కాయా నుండి వచ్చారు.వస్తూ వస్తూ వాళ్ళు ఒక వార్త కూడా మోసుకు వచ్చారు. రెండవ రిజర్వ్ రెజిమెంటులో పని చేస్తున్న గ్రెగరి మెలకోవ్ కామెన్ స్కాయా లో ఉన్న బొల్షివిక్కుల దగ్గరకు వెళ్ళి అక్కడే ఉండిపోయాడన్నదే ఆ వార్త. అంతకు ముందు వరకు గుర్రపు దొంగగా పేరు తెచ్చుకుని, నిర్లక్ష్యంగా ఉన్నట్టు కనిపించే మాక్సిమ్ గ్రిజ్ నోవ్ కూడా బొల్షివిక్కుల  ఆలోచనలతో ప్రభావితమై 27 వ రెజిమెంటులోనే ఉండిపోయాడు. అతనికి చూడటానికి  అసహ్యంగా ఉండే ఒక గుర్రం దొరికిందని, చూడటానికి బాగోలేకపోయినా  బాగా దూకుడు ఉన్న గుర్రమని చెప్పుకునేవారు. గ్రెగరి గురించి పెద్దగా చెప్పుకునేవారు కాదు. తమ దారినుండి అతని దారి వేరే అయ్యిందని, ఇక అతని గురించి మాట్లాడుకోవాల్సింది లేదని ఆ గ్రామంలో వారు అనుకోవడం వల్లే వారి మాటల్లో అతని ప్రసక్తి వచ్చేది కాదు. మరలా అంతా ఒకటవుతారో చెప్పలేని పరిస్థితి అది.

  ఏ ఇళ్లకైతే కొసాక్కులు తిరిగి వచ్చారో ఆ గృహాల్లో ఆనందం తాండవించింది. కానీ ఈ ఆనందం తమ ఇళ్ళల్లో మగవారిని కోల్పోయిన వారి దుఃఖ తీవ్రతను ఇంకా అధికం అయ్యేలా చేసింది. ఎంతో మంది కొసాక్కులు మాయమైపోయారు. గలిషియా, బుకొవినా, తూర్పు ప్రష్యా, రొమానియా ప్రాంతాల్లో వారి శవాలు తుపాకీల సంగీతంతో కుళ్ళిపోయాయి. ఇప్పుడు ఆ స్థలాల్లో ఎన్నో పిచ్చి మొక్కలు మొలిచాయి. వాన, మంచు అక్కడ వాటి మీద కురుస్తుంది  కూడా. తల నున్నగా గుండు చేయించిన కొసాక్కు స్త్రీలు ఎన్నిసార్లు బయటకు పరిగెత్తుతూ తమ ప్రియమైన వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నా, ప్రయోజనం లేదు;ఇక ఎప్పటికీ వారు కనిపించరు!వారు ఎన్ని కన్నీరు కార్చినా, ఎంత దుఃఖం మోసినా, ఆ బాధ వారి గుండెలను వీడి పోదు!వారి జ్ఞాపకాలను తలచుకుంటూ ఎంత బిగ్గరగా ఏడ్చినా కూడా, తూరుపు గాలి వారి ఏడుపులను గలిషియా, తూర్పు ప్రష్యాకు వారి ప్రియమైన వారి ఆత్మల దగ్గరకు మోసుకుపోదు.

   ఎలా అయితే పిచ్చి గడ్డి ఆ శవాలను కప్పేసిందో, అలాగే కాలం కూడా తనతో పాటు ఆ దుఃఖాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఎలా అయితే గాలితో పాటే ఆ మరణించిన వారి ఆనవాళ్ళు కొంతకాలానికి చెరిగిపోతాయో, అలాగే మరణించిన వారి జ్ఞాపకాలు, వారితో ఉన్న అనుబంధం కూడా కాలంతో పాటు మరుగున పడుతుంది. ఎందుకంటే ఈ మానవ జీవితం చాలా చిన్నది, కలకాలం ఉండటానికి రాని ఈ చోట కొందరితోనే జీవితాలు ఆగిపోవు.

Mikhail Sholokhov
Author
Rachana Srungavarapu
Author & Translator

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *