అస్పష్టంగా తెల్లారిందీరోజు
దట్టమైన పొగ మబ్బుల చాటుగా
అయిష్టంగానే ఉదయించాడు సూర్యుడు
బతుకు భవనాలు కాలి కూలిపోతూఉంటే
తూర్పు దిక్కును కప్పేసింది
ఖనిజపు బూడిద
మేఘాల సిరల్లో
కుళాయిల ధమనుల్లో గడ్డగట్డిన నీరు
బీరుట్ నగర జీవితంలో
ఇది చిక్కని నిరాశల శరదృతువు
రాజభవనం నుండి రేడియోకు
కోరికల సేల్స్ మాన్ కు
కూరగాయల మార్కెట్‌కు
మరణం గుబులు గుబులుగా వ్యాపించింది
సమయం సరిగ్గా ఐదు గంటలు
ఇప్పుడు మిమ్మల్ని నిద్ర లేపుతున్నదేమిటి?
బహుశా మృత్యువా?!
అప్పుడే ముప్పైమంది మరణించారు
తిరిగి పడుకోండి!
ఇదీ మరణ సమయం
ఇదీ మంటల సమయం
2
"ఇబ్రాహీం " ఒక అద్భుత చిత్రకారుడు
నీటిని ఒక బొమ్మగా చిత్రీకరించాడు
తన గుండెల మీద లిల్లీలను పెంచే
పూలకుండి అతడు!
తెల్లవారుజామున లేవడమంటే
మృత్యువును కళ్ళారా చూడడమేనని!
బహుశా అతనికీ తెలుసు గానీ
పాపం అతని పిల్లలకేం తెలుసు!
'లిలక్' పొదల పిలుపుతో
గోరువెచ్చని ఎండ స్పర్శతో
నిద్రలేచి చూస్తున్నారు
వాళ్ళ ఆకలి
పాలూ రొట్టెలు అడుగుతుంది
అంతుచిక్కని ఈరోజు
నా ముఖం
బుల్లెట్ల పొలంలో
గోధుమగింజలతో రాసిన టెలిగ్రామ్!
అదే
ఇప్పుడు మిమ్మల్ని మేల్కొల్పుతుంది!
సమయం సరిగ్గా ఐదుగంటలు
ముప్పైమంది మరణించారు
బేకరీలోని ఈ రొట్టెలకు
ఇంతకుముందెన్నడూ ఈ రుచిలేదు !
రక్తం గుసగుసలాడే ఈ రహస్యం
ఈ అనంత దిగులు నిండిన సారం ...
రొట్టెకు ఇంత మృత్యు వాసన
ఇంతకు ముందెన్నడూ లేదు!
సమయం సరిగ్గా ఐదు గంటలు
చనిపోతున్నదెవరు
బహుశా బాధితులేనా?
...చివరి రంగును
చేతుల్లోకి తీసుకున్నాడు ఇబ్రాహీం
అనేక రహస్యాలను కలిపిన
అతని రక్తపు రంగు అది
అతడు ఒక చిత్రకారుడు
ఒక తిరుగుబాటుదారుడు
పోటెత్తిన ప్రజలతో
ఓక్ చెట్లతో
యుద్ధంతో నిండిన నేల చిత్రాన్ని గీసాడు
సముద్రపు అలలు
శ్రామిక ప్రజలు
వీధి వ్యాపారులు
పల్లెటూర్లు
అన్నీ...
అద్భుతాన్ని చిత్రించాడు ఆ రొట్టెలో ...!
మూలం: ( Bread)
- మహమూద్ దర్విష్)