అవును ఇది అనుకొని చేసింది కాదు.
సుద్దముక్క తీసుకున్నట్టో
పుస్తకం చేతిలోకి తోసుకున్నట్టో
చల్లనిమాటతో పిల్లల్ని దగ్గరకు తీసుకున్నట్టో
తీయనినవ్వుతో భయం పోగొట్టినట్టో గానీ..
ఇది అనుకొని చేసింది కాదు.
కళ్ళల్లోంచి చిందే కొన్ని వెలుగుతునకలు
జలపాతాల్లోంచి చిందే కొన్ని నీటితుంపరలు
ఆ మొకాల్లో వెలిగే అమాయకత్వాలు
ఆ మొకాల్లో ఎగసే జీవనోత్సాహాలు
కెమెరాకనుల దోసిలి పట్టి
ఆ పంతులమ్మ అపురూపంగా
జ్ఞాపకాల దొంతరల్లో దాచడం
అనుకొని చేసింది కాదు.
అనుకోకుండా చేసిన తర్వాత
చేసింది దాచుకుందాం అనుకున్న తర్వాత
లోపలి లోకాలకు
ఎంత నెమ్మది..ఎంత శాంతం..
జారిపడ్డ జలపాత ఘోషలా
అతలాకుతలం అవుతున్న ఆలోచనాసుడి
ఇక సలిల సెలయేరు..నిస్వన నీటి మడుగు..
జీవితం దిగులుదీపమై రెపరెపలాడినపుడు
అవి కాస్తంత చేవచమురు పోస్తాయి..
నడిచి నడిచి వేసారిన పాదాలకు
అవి కాస్తంత జీవలేపం పూస్తాయి..
అంతకు తప్ప ఏం చేస్తాయా ఛాయాచిత్రాలు ?
నవ్వుల్ని నిలబెట్టి తుళ్ళింతల్ని ఒడిసిపట్టి
గుండె భరిణెలో భద్రంగా పొదువుకున్న చిత్రాలు
ఇంక ఏం చేయగలవు ?
గంప కింద బుజ్జి కోడిపిల్లల్లా
కువకువలాడతాయి..
గూడులో ఆకలిగొన్న కూనల్లా
కావురులాడతాయి..
పంతులమ్మ ప్రేమగా దగ్గరకు తీసుకొని
మెడ నిమిరి బుజ్జగించినపుడు
ఎత్తుకొని లోకాన్ని చూయించినపుడు
పాలు తాగి పొట్ట నిండిన పసిపాపల్లా
నిశ్చింతగా గుండెల మీద నిద్రపోతాయి.
నిదురరాక అశాంతిగా
కళవళపడే ప్రపంచం
ఆ చిత్రాలను చూసి
పెదాల మీద నెలవంకలు పూస్తుంది.
నెర్రలిచ్చిన మొకం మీద
తొలితొలకరి చినుకులు చిలకరించినట్టు
అర్ధనిమీలితమై
తనలో తాను మురుస్తుంది.
ఆ పంతులమ్మకి తెలీదు..
ఈ మారాం ముడుల ప్రపంచాన్ని ఒడిబడిలో వేసుకొని
ఈ చిన్నారుల చిత్రాలు చూయిస్తూ
కాస్తంత బతుకుతీపి పాఠాన్ని బోధిస్తున్నానని -
పడుతూ లేస్తూ ఉరుకులపరుగుల
నగర జనజగానికి
ఒక క్షణం ఆగి,
నింపాదిగా వెనక్కి తిరిగి చూసుకునే జీవితం
ఎంత మధురాతిమధురమో
రుచి చూపిస్తున్నానని -
ఆ పంతులమ్మకి తెలీదు..
ఆ ఛాయాచిత్రాల తరుఛాయల్లో
తానూ ఒక రంగుల చిత్రమయ్యానని -
వచ్చేపొయ్యే వాళ్ళకింత
బాల్యపరిమళ నజరానా ఇస్తున్నానని -
(సమ్మెట ఉమాదేవి గారి బడి పిల్లల ఫొటోలు చూసి)