దొస్టోవిస్కీ నవల – ది ఇడియట్ – పాఠకుడి నోట్సు
చదువరులకు ఆహ్వానం. ప్రపంచ ప్రసిద్ధ నవలల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ‘ఇడియట్’ నవల తొలి తెలుగు అనువాదం మీ చేతుల్లో వుంది. ఎంత ప్రఖ్యాతి గడించిందో అంత వివాదాస్పదమూ, విమర్శనాత్మకమూ అయిన ఈ నవలలో చిత్రించినది దొస్టోవిస్కీ జీవితమేనని చెబుతారు.
వివరాలలోకి వెళ్లే ముందు తెలుగు అనువాదాల పట్ల అత్యంత ఆసక్తి కలిగించిన అనువాదకులకు కృతజ్ఞతలు తెలియజేయడం నా ధర్మం అనుకొని ఈ కొన్ని మాటలు. ఇవి సార్వజనీనమైన అనుభవాలని నా నమ్మకం కూడా.
1
పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లడు
నేను చదివిన తొలి తెలుగు అనువాదం క్రొవ్విడి లింగరాజు చేసిన మాక్సిమ్ గోర్కీ ‘అమ్మ’. ప్రగతిశీల శిబిరంలో ఉన్న యువతీ యువకుల మీద అది వేసిన ముద్ర ఎంత గాఢమైనదో చెప్పనవసరం లేదు. సాహిత్యం కొనడానికి ఏ పుస్తకాల అంగడీ లేని కర్నూలు నుంచి చదువుకోసం తిరుపతి పోవడం నా జీవితానికి ఎన్నో మలుపులను ఇచ్చింది. అందులో ఒకటి తిరుపతి విశాలాంధ్ర బుక్ స్టాల్. డిస్కౌంట్ ఉందంటే చాలు అప్పుచేసి మరీ ఇబ్బడి ముబ్బడిగా పుస్తకాలు కొన్న వాళ్ళు, ఆ అప్పు తీర్చడానికి పార్ట్ టైం ఉద్యోగాలు చేసిన నాలాంటి వాళ్ళు చాలామందే వుంటారు. కోసక్కులు, గొప్పవారి గూడు, తండ్రులు కొడుకులు, జమీల్యా, పేదజనం-శ్వేతరాత్రులు, సమరము-శాంతి, అయిలీత, సమరంలో కలిసిన గీతలు, కాకలు తీరిన యోధుడు, నలభై ఒకటవ వాడు, పిల్లలకే నా హృదయం అంకితం…. ఇదీ వరుస… హాస్టల్ రూము గూటి నిండా రష్యన్ అనువాద పుస్తకాలే ఉన్న కాలమది.
ఆ కథల్లోని అందమైన యువతులందరినీ ప్రేమించాను. ముసలి రైతులను, కార్మికులను మన పెద్దయ్యలుగా అనుకున్నాను. తల పండిపోయిన రష్యన్ అమ్మలలో మా అమ్మ కనిపించేది. ప్రపంచ యుద్దానికి సైనికులను మోసుకుపోతున్న బొగ్గు రైలు కూతలు వినిపించేవి. శీతల గాలులకు వూగే గోధుమ కంకులు, స్తెప్ మైదానాల్లో మేస్తున్న బలిసిన తెలుపు గోధుమ రంగు యూరోపియన్ గుర్రాలు, ఆకాశాన్నిఅంటే పోప్లార్ చెట్లూ, వాటి మీదుగా పడుతున్న లేత ఎండలు, తుంపరాలుగా వెన్నెల రాతిరి కురిసే మంచు… అన్నీ రూములో నా కిటికీ పక్కన సాక్షాత్కరించేవి. ఒకానొక దశలో ఈ మోహం ఎంత దాకా వచ్చిందంటే ఆ అనువాదాలను అనుకరిస్తూ రష్యన్ వాతావరణాన్ని, పాత్రలను ఎన్నుకొని నా తొలికథ రాసేను. మాటకారి, మోసకారి అయిన ఒక సమిష్టి వ్యవసాయ క్షేత్రపు నాయకుడు శ్రమ మాత్రమే తెలిసిన, కమ్యూనిస్టుపార్టీకి నిబద్ధురాలైన ఒక అందమైన అమ్మాయిని మోసం చేస్తే ఆమె పదిమందిలో తిరగబడి అతని గుట్టు విప్పడం కథాంశం. అదృష్టవశాత్తు దాన్ని ఎక్కడో పోగొట్టుకోవడం వల్ల నా తొలి కథ తెలుగు కథే అయ్యింది.
నేను నేరుగా చదివిన ఇంగ్లీషు పుస్తకాలు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. ( ఉద్యోగ నిమిత్తం కెమిస్ట్రీ తప్ప మరేదీ ఇంగ్లీషులో చదవను) ఇప్పటికీ కల్పనా సాహిత్యాన్ని ఇంగ్లీషులో చదవడానికి ఇష్టపడను. ఎందుకో అవి మనసుకు దూరంగా అనిపిస్తాయి. నావంటి తెలుగు బడుద్దాయి, బడుద్దాయినుల కోసమే ఆ భగవంతుడు అనువాదకులను ఎప్పటికప్పుడు క్రమం తప్పక సృష్టిస్తుంటాడని మిత్రుల ఉవాచ.
రారా, ఆర్.వి.ఆర్, ఉప్పల లక్ష్మణరావు, నిడమర్తి ఉమా రాజేశ్వరరావు, కొడవటిగంటి కుటుంబరావు, నండూరి రామమోహనరావు, పురిపండా అప్పలస్వామి, ఆలూరి భుజంగరావు, మద్దిపట్ల సూరి, బెల్లంకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణ గార్లు ప్రపంచ సాహిత్యంలోకి నన్ను వేలుపట్టుకు నడిపించారు. మరుపూరు కోదండరామిరెడ్డి అనువదించిన బీదలపాట్లు (les miserables) చదివి డంగై పోయాను. సుమారు ఐదు వందల పేజీల పైగా ఉన్న పుస్తకంలో కేవలం ఒకే ఒక చోట ఇంగ్లీషు పదం వాడాడు. అటువంటి శ్రద్ధ చూపిన అనువాదకులకు చేతులెత్తి దండం పెట్టాలి. వీటి ప్రభావం కొనసాగుతున్న దశలోనే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ రూపంలో తూర్పు పవనం వీచింది. ఏడుతరాలు, భూమి, ఒకతల్లి, రక్తాశ్రువులు (నార్మన్ బెతూన్ జీవితం), ఎవరిదీ అడవి, ‘రైలుబడి’, పగటికల.… ఒకటా రెండా సృజనాత్మక సాహిత్యంతో సహవాసి, తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రాలతో బాలగోపాల్, వల్లంపాటి, సనగరం నాగభూషణంల అనువాదాల విశ్వరూపం చూసిన కాలమది.
మరోపక్క కేంద్ర సాహిత్య అకాడమీ భారతీయ భాషల అనువాదాలు, తగళి ‘రొయ్యలు’, కారంత్ ‘మరల సేద్యానికి’, పన్నాలాల్ ‘జీవితమే ఒక నాటకరంగం’ అఖిలన్ ‘చిత్ర సుందరి’ వైకం బషీర్ ‘పాతుమ్మా మేక’ కుర్రుతలిన్ హైదర్ ‘అగ్నిధార’ భారతీయ సంస్కృతినీ, జీవన వైవిధ్యాన్ని కళ్ళముందు నిలిపాయి.
చైనా నవల ఉదయగీతికతో మరొక వెల్లువ వచ్చింది. క్రాంతి ప్రచురణలు,అరుణతార, ప్రజాసాహితి,సృజన, పర్స్పెక్టివ్స్, స్వేచ్ఛ సాహితిల కృషితో అమెరికా, చైనా,ఆఫ్రికన్ సాహిత్య అనువాదాల రాక, దళిత, స్త్రీ వాదాల విస్తరణలో మరికొన్ని కొత్త పుస్తకాలు, కొత్త అనువాదకులు. ఎన్. వేణుగోపాల్, ఎస్. కాత్యాయని, కలేకూరి ప్రసాద్ (యువక), ఓల్గా, సుధాకిరణ్ మొదలు ఇటీవలి రంగనాథ రామచంద్రరావు, బాలాజీ, నలిమెల భాస్కర్, అవినేని భాస్కర్, పి.మోహన్, పూర్ణిమ తమ్మిరెడ్డి, నరేష్కుమార్ సూఫీల వరకు. ఒకచోట ఆగిందనుకునే లోపు కొత్త కెరటాల వెల్లువ వస్తూనే వుంది. అణా గ్రంధమాల, దేశీ ప్రచురణల కాలంనుంచి పీకాక్ క్లాసిక్స్ మీదుగా ఇప్పటి ఛాయా ప్రచురణల వరకు తెలుగు అనువాద సేద్యం అవిచ్చిన్నంగా కొనసాగుతూనే వుంది. ఒకప్పటి రష్యన్, ఫ్రెంచ్, ఇంగ్లీషు, బెంగాలీ, హిందీ భాషా సాహిత్య అనువాదాల స్థానంలో ఇప్పుడు మలయాళీ, తమిళ, కన్నడ, మరాఠీ సాహిత్యాలు వస్తున్నాయి. అయినా పాత క్లాసిక్స్ వాటి తేజస్సును కోల్పోలేదు, మళ్లీ మళ్లీ పునర్ముద్రణ కోరుతున్నాయి. ఆ అవసరమే సాహితిలక్ష్మి గారు, కూనపరాజు గారు చేస్తున్న ఈ ప్రయత్నానికి దారివేసింది. కొత్తగా వస్తున్న పాఠకుల అవసరం కూడా తీరాలి కదా.
తమ అనువాదాల ద్వారా మన ఆలోచనా సామ్రాజ్యాన్ని విస్తారపరచి, గొప్ప పఠనానుభవాన్ని అందించి, విలువలపరంగా మనసులను ఉన్నతీకరించిన, సదా మంచి వైపు మనలను నిలబెట్టిన తెలుగు అనువాదకులందరికీ (ఎవరి పేరైనా మరచివుంటే మన్నింపులు) మనందరి తరుపున ప్రణామాలు.
మన స్నేహితుల్లోనే మరొకడు అనువాదకుడు కావటం సంభ్రమమే కాదు ఒకింత గర్వం కూడా. యీ నవల అనువాదకుడు వై. వేణుగోపాల్ రెడ్డికి ఇది తొలి అనువాదం, పైగా ఎన్నుకున్న నవలేమో అనువాదానికి సులభంగా లొంగనిది. సంక్లిష్టత, శిల్ప విలక్షణత వున్న యీ నవలలో రచయిత ఆత్మను పట్టుకోవడం చాలా కష్టం. యీ నవలకు రష్యన్ భాష నుంచి ఇంగ్లీషులోకి వచ్చిన ఆరుకి పైగా అనువాదాల్లో ఏ రెండూ ఒకటిగా లేవని చెబితే మీరు నమ్మరేమో!. సాధికారికంగా రష్యన్ భాష వస్తే తప్ప మూల రచయిత ఉద్దేశ్యం ఏదో అర్థం కాని స్థితి. అయినా ఆంగ్ల సాహిత్యంతో విస్తృత పరిచయం ఉన్న వేణు చక్కగా అనువాదం చేసాడు. మొదటి ప్రయత్నాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తనకు అభినందనలు.
దొస్టోవిస్కీ, టోల్ స్టాయ్ నవలలతో (ప్రేమ్ చంద్ కూడా) పాఠకుడికి వచ్చే ఇబ్బంది ఏమిటంటే అందులోని విస్తారమైన జీవితం, అలా… వచ్చి పోతుండే లెక్కలేనన్ని పాత్రలు. అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవడం ఒక ఎత్తయితే వాటిలో కొన్నింటికి ముద్దు పేర్లు / అడ్డ పేర్లు కూడా వుండి నవలలో వాటి ప్రస్తావన మాటిమాటికి రావటం పాఠకుడిని చికాకు పరుస్తుంది. ఒక అరవై పేజీలు చదివి కథలోకి వెళ్ళే దారిచేసుకునే దాకా మనకు ఈ తిప్పలు తప్పవు, ఆ తరువాత పఠనం నల్లేరుమీద నడకే అని ఇన్నేళ్ల నా అనుభవం.
2
యువపాఠకుల కోసం
దొస్టోవిస్కీ (Fyodor Mikhailovich Dostoyevsky)
సాహిత్య రంగంలో చెహోవ్, హెమ్మింగ్వే,కాఫ్కాలను,
తాత్విక రంగంలో నీషే, సార్త్ర్ లను, వైద్య, మనస్తత్వ శాస్త్ర రంగంలో సిగ్మన్డ్ ఫ్రాయిడ్ ను ప్రభావితం చేశాడు. యీ మహా రచయిత తన రచనల్లో వాస్తవిక వాదం (realism) తో మొదలై క్రమంగా అస్తిత్వవాదానికి (existentialism) పునాదులు వేశాడు. సమాజం, మతం, రాజకీయాలు, నీతి వంటి విషయాలపై విస్తృతంగా వ్యాసాలు రాసాడు. అందువల్ల ప్రపంచం అతణ్ణి కేవలం రచయితగానే కాక తత్వవేత్తగా కూడా గౌరవించింది.
1821 నవంబరు 11 న మాస్కోలో పుట్టిన దొస్టోవిస్కీ ఇంజనీరుగా, జర్నలిస్టుగా పనిచేశాడు. మనస్తత్వ పరిశీలన, క్రైస్తవ మత భావనలు, ఆధునిక తాత్విక ఆలోచనల ఆధారంగా 19వ శతాబ్దపు రష్యన్ సమాజాన్ని చిత్రించాడు. అప్పటి రష్యన్ సమాజం రాజకీయ, సామాజిక, నైతిక సంఘర్షణల్లో కొట్టు మిట్టాడుతుండేది.
జార్ ప్రభువుల రాచరిక పాలనలో ఉన్న రష్యా అనివార్యంగా ఆధునికతలోకి ప్రవేశించిన కాలమది. పారిశ్రామిక విప్లవ ఫలితాలు ఆ దేశ ఆర్థిక రంగం రూపురేఖలను మార్చివేస్తున్న కాలం. దేశం అంతటా రైల్వే లైన్ల నిర్మాణం విస్తృతంగా జరుగుతున్నది. ( ఇడియట్ నవలలో మూడు నాలగు చోట్ల ఇది మంచిదా కాదా అని కూలీన సమూహాలు చర్చించుకుంటాయి.) ఫ్రెంచ్ విప్లవ తొలి సోషలిస్టు భావనలు జార్ రాజ్యంలోకి ప్రవేశించాయి. నిహిలిస్టు గ్రూపులు ఏర్పడ్డాయి. వాటి గురించిన చర్చ కూడా నవలలో చాలా చోట్ల వస్తుంది. ఇంగ్లీషు, ఫ్రెంచ్ సాహిత్యం తోను, తన ముందుతరం రష్యన్ రచయితలు గోగోల్, పుష్కిన్ రచనలతోనూ ప్రభావితం అయిన దొస్టోవిస్కీ యీ మార్పులనన్నీ తన సాహిత్యంలోకి తెచ్చాడు. అనారోగ్యం సహా తన జీవితంలోని ఆటుపోట్లు కూడా సాహిత్యంలో భాగమయ్యాయి. అందుకనే దొస్టోవిస్కీ జీవితాన్ని, సాహిత్యాన్ని వేరుచేసి చూడడం, చూపడం కష్టం. యీ ఎరుకతోనే కొత్త పాఠకులకు దొస్టోవిస్కీ జీవితాన్ని పరిచయం చేయటం అవసరం అనిపించింది.
దొస్టోవిస్కీది పేదకుటుంబమేమీ కాదు. తండ్రి మిలిటరీ డాక్టరు. నాలుగు ఏళ్ల ప్రాయంలో బైబిల్ ఆధారంగా చదవడం, రాయడం తల్లి నేర్పింది. కథలు చెప్పే నానమ్మ ఊహలు చేయడం నేర్పింది. ఇంట్లో కరంజిన్, పుష్కిన్, గోథే సాహిత్యం ఉండేది. తన బాల్యంలో తండ్రి పనిచేసే ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక తాగుబోతు తొమ్మిదేళ్ళ బాలిక మీద జరిపిన అత్యాచార ఘటన దొస్టోవిస్కీని జీవితమంతా వెంటాడింది. చాలా రచనల్లో (బ్రదర్స్ ఆఫ్ కర్మజోవ్, ది డెవిల్స్, క్రైమ్ అండ్ పనిష్మెంట్ ) అటువంటి ఘటననో, దాని ప్రభావాలనో చిత్రించాడు.
దొస్టోవిస్కీ శారీకంగా బలహీనుడు. మానసికంగా మొండివాడు. తన నవలల్లో చాలా వరకు ప్రధాన పాత్ర యీ లక్షణాలను కలిగివుంటుంది. (ఇడియట్ నవలలో ప్రిన్స్ మిష్కిన్.) బోర్డింగ్ స్కూలులో చదివేప్పుడు పాలిపోయిన శరీరంతో, అంతర్ముఖుడుగా, ఎప్పుడూ పగటికలలు కనేవాడు. పదహైదు ఏళ్లప్పుడు తల్లి చనిపోయింది. మిలిటరీ ఇంజనీరింగ్ అకాడమీలో వున్నా చదువుపట్ల ఆసక్తి కలుగలేదు, గణితం, సైన్సు, ఆర్కిటెక్చర్ లు నచ్చేవి కాదు. వేలాడుతున్న యూనిఫామ్, చిందరవందర ఆహార్యంతో ‘భుజాన బలవంతంగా ఎవరో తుపాకీ వేలాడదీసినట్టు’
కనిపించేవాడు. దీనికితోడు నలుగురిలో కలువలేనితనం, కుటుంబ వారసత్వంగా వచ్చిన గాఢమైన మత విశ్వాసాలు ( తండ్రివైపు పూర్వీకులు చర్చి పూజారులు). అతని మిత్రులు ‘మాంక్ ఫోటిస్’(క్రైస్తవ సన్యాసి) అని పిలిచేవారు. కులీనులైన సహాధ్యాయ మిత్రులమధ్య ఒంటరి. ‘తిరస్కృతులు’ మొదలు తన నవలల్లోని ఎక్కువ పాత్రలకు ఈ స్వభావమే ఉంటుంది. 1939లో తండ్రి చనిపోయినప్పుడు మూర్ఛ వ్యాధి (epilepsy), వణుకు, స్పృహ కోల్పోవడం వంటి నరాల జబ్బులు బైట పడ్డాయి. తిరస్కృతులు నవలలో నీలి నుంచి ఇడియట్
నవలలో మిష్కిన్ దాకా అన్ని నవలలోను ఏదో ఒక పాత్రకు యీ రోగ లక్షణాలు వుంటాయి.
పట్టభద్రుడయ్యాక కొంతకాలం ఇంజనీర్ గా (1843) పనిచేశాడు. ఆ కాలంలోనే అదనపు సంపాదన కోసం పుస్తకాల అనువాదాలు (బాల్జాక్ నవలలు) ప్రారంభించడంతో సాహిత్య సృజనకు బీజం పడింది.
1846లో తొలి రచన పేదజనం (poor folk నవలిక) రాశాడు. విమర్శకులు దీన్ని రష్యా మొదటి సాంఘిక నవలగా చెప్పుకుంటారు. యీ విజయంతో తన సాహిత్య సృజనకు అడ్డమని ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
ఇదే సమయంలో ఫోరియర్, క్యాబేట్, ప్రౌడలోన్, సెయింట్ సైమన్ ల ద్వారా సోషలిజమ్ తొలి భావనలు పరిచయం అయ్యాయి. బెలిన్స్కీ ద్వారా సోషలిజపు తాత్విక జ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాడు.
రచయితలు, రచనల గురించి ఇడియట్ లో చేసిన కొన్ని ప్రస్తావనలు చూడండి.
“సామాన్య ప్రజలను రచయిత ఏం చేస్తాడు. యీ ‘సామాన్యులు’ పట్ల చదువరులకు ఆసక్తి కలగటానికి వారిని ఎలా సృష్టిస్తాడు. వారిని వదలి కథ చెప్పడం అసాధ్యం. మానవ జీవన వ్యవహారాల గొలుసులో వీరు ముఖ్యమైన లంకె. వారిని వదిలేస్తే మొత్తం ‘ నిజాన్ని’ వదిలేసినట్టే. నవలను మానవ ప్రవృత్తులతో మాత్రమే లేదా అద్భుతమైన మనుషులతో మాత్రమే నింపితే అది అసహజం గానూ, అనాసక్తి కలిగించేదిగానూ వుంటుంది.
మన ఆలోచనలో రచయిత ఏమి రాయాలంటే సామాన్యుల మధ్య ఉండే భావాసక్తుల గురించిరాయాలి. సామాన్యుల ప్రవృత్తి వారి నిరంతర, తప్పించుకోలేని, జీవన శైలిలో వుంటుంది. వారు ఇక్కట్లనుంచి తప్పించుకునే ప్రయత్నాలలో వుంటుంది. రోజువారీ ఎడతెగని బతుకుల్లో వుంటుంది. బంధించిన బంధనాలను తెంపుకోవడంలో వుంటుంది. తమదైన పాత్ర ఏమిటో వాళ్లే చూపిస్తారు. అటువంటి పాత్రలు సహజంగా, స్వేచ్ఛగా, ఇంకా ఆ స్వేచ్ఛను పొదవి పట్టుకోలేని తనంతో వుంటాయి. నా నవల లోని కొన్ని పాత్రలు బాగా ధనవంతులై, దయగల హృదయముండి
అదే సమయంలో ఏ విధమైన ప్రతిభలేకుండా సొంత తెలివిలేకుండా చికాకు పుట్టిస్తారు.”
1846 the double నవలతో పాటు, 1846-48 మధ్యలో చాలా కథలు కూడా రాశాడు.(మనం చదివిన ‘శ్వేత రాత్రులు’ కథ ఆ కాలానిదే) సోషలిస్టు తాత్వికతలోని తర్కం, సామాజిక న్యాయ భావనలు, పేదలు, బలహీనుల పట్ల దాని అనుకూల వైఖరి ఆకర్షించినా దొస్టోవిస్కీ రష్యన్ సాంప్రదాయాలను, మతవిశ్వాసాలను వదులుకోలేకపోయాడు. బెలెన్ స్కీ నాస్తికవాదం, ఉపయోగితావాదం, శాస్త్రీయ, భౌతిక వాదాలతో అతనికి ఘర్షణ ఏర్పడింది. అయినప్పటికీ స్తూలంగా బలహీనుల పక్షానే నిలబడ్డాడు. తనదైన ఒక తాత్విక అవగాహన ఏర్పరచుకున్నాడు. బలహీనుల పట్ల బుద్ధిజీవులకు ఉండవలసిన సానుభూతి, ప్రేమ, మనుషుల హక్కుల పట్ల ప్రభుత్వాలకు ఉండవలసిన బాధ్యతను రచనల్లో ప్రకటించాడు.
(1847) The Landlady (నవలిక) రాసిన తరువాత
అతని జీవితం వూహించని మలుపు తీసుకుంది. పెట్రేషేవ్స్కీ సర్కిల్ అనే గ్రూపులో సభ్యుడయ్యాడు. అది జార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన పుస్తకాల గురించి చర్చించేది. ఆ సాహిత్య గ్రూపుతో సంబంధంలో వున్నందుకు 1849 లో మొదటిసారి అరెస్టుఅయ్యాడు.
వాళ్ళ చర్యలు విప్లవానికి దారితీసేట్టు వున్నాయని రష్యన్ పోలీసు అధికారులు వాదించారు. దొస్టోవిస్కీకి, అతని మిత్రులకు మరణశిక్ష విధించబడింది.
కాల్పులు అమలు జరిపే చివరి నిముషంలో అది రద్దుచేయబడి సైబీరియాకు ప్రవాస శిక్షగా మారింది.
( దీన్ని mock execution అంటారు. నేరస్తులను తీవ్రంగా భయ పెట్టడానికి, మానసికంగా ఒత్తిడికి గురిచేయడానికి అప్పటి జార్ ప్రభుత్వం అనుసరించిన వ్యూహం అనే వాదన కూడా ఉంది) నాలుగేళ్ల ప్రవాస శిక్ష కోసం సైబీరియా జైలుకు తీసుకుపోతున్నప్పుడు డిసెంబరిస్టు ఉద్యమకారిణి ఒకామె వీరందరికీ తిండి, కొన్ని బట్టలు, కొత్తనిబంధన (బైబిల్) పుస్తకం (అందులో పది రూబుళ్ల నోటు పెట్టి) ఇచ్చింది. జైలులో ఆ పుస్తకం మాత్రమే అతనికి పఠన గ్రంధం అయ్యింది. శిక్షకు భయపడి ఆత్మహత్యకు ప్రయత్నించిన తన మిత్రులను ఓదార్చి, స్వాంత పరిచాడు దొస్టోవిస్కీ. ఈ ప్రేమ, కారుణ్య లక్షణాలు నవలలోని మిష్కిన్ పాత్రలోనూ మనకు కనిపిస్తాయి.
ఈ ఘటనను భిన్న కోణాల్లో నవలలో మూడు నాలుగు చోట్ల ఇలా వర్ణించాడు
“ఒక వ్యక్తికి మరణశిక్ష వేసి చంపడం అతడు చేసిన నేరం కన్నా ఘోరమైన పాపం. న్యాయస్థానాలు మరణశిక్ష విధించడం నిందితుడు చేసిన హత్యకన్నా ఘోరమైనది. ఒక సైనికుడిని యుద్ధంలో ఫిరంగితో కాల్చు ఎక్కడో అక్కడ అతనికి బతికే ఆశవుంటుంది. కానీ అదే సైనికుడికి మరణశిక్ష వేసిన తీర్పు చదివి వినిపించు పిచ్చోడవుతాడు లేదా ఏడుస్తాడు. అటువంటి భయానక సంఘటనను తట్టుకొని పిచ్చివాడు కాని మానవుడు ఎవరైనా వుంటారా?”
“ పన్నెండు సంవత్సరాలు జైలులో గడిపిన ఒకరి గురించి విన్నాను. వ్యాకులత తో కొన్నిసార్లు బిగ్గరగా ఏడ్చేవాడు. ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసుకున్నాడు. జైలులో అతనికి ఉన్న ఒకే ఒక్క పరిచయం ఒక సాలెపురుగు. కిటికీ కింద పెరిగిన ఒక మొక్క మాత్రమే.”
సైబీరియాలో నాలుగేళ్ళ జైలు జీవితం “ఎండాకాలం భరించలేని ఉడక, శీతాకాలం రక్తం గడ్డకట్టేంత చలి. జైలు గదుల లోపల ఇంచి మందాన పేరుకుపోయిన మడ్డి… ఎప్పుడైనా జారి పడవచ్చు. పక్కకు తిరగాలంటే జాగాలేనంత క్రిక్కిరిసి, పొద్దున నుంచి రాత్రి దాకా పందులవలె బతుకు. 200 మందికి ఒకే మరుగుదొడ్డి. (దొస్టోవిస్కీకి మొలల సమస్య కూడా వుండేది). రాత్రిళ్లు శరీరం పొగలు కమ్మేది లేదా శీతలం ముంచుకొచ్చేది. ఎంత అనారోగ్యంతో వున్నా ఆసుపత్రికి అనుమతి వుండదు. చదవటానికి పుస్తకాలు, న్యూస్ పేపర్లు ఇచ్చేవారు కాదు. రాయడానికి తెల్లకాయితాలు ఇవ్వరు. ”
ఆ దుర్భరత వింటే నూటా యాభై ఏళ్ళ తరువాత కూడా మనదేశంలో అటువంటి పరిస్థితులే వుండటం విషాదమనిపిస్తుంది. స్టాన్ స్వామి, జి ఎన్ సాయిబాబా వరవరరావు, రోనా విల్సన్ వంటి వారి జైలు జీవితాన్ని గుర్తుకు తెస్తుంది.
1854 లో జైలు నుంచి విడుదల జరిగినా నిబంధనల ప్రకారం మరొక ఆరేళ్ళు సైబీరియా లోనే నిర్బంధ మిలీటరీ సేవ చేయవలసివుంది. 1856 లో దొస్టోవిస్కీ జార్ ప్రభుత్వానికి క్షమాపణ పత్రం రాసి ఇవ్వడంతో తన రచనలను ప్రచురించుకోడానికి అనుమతి వచ్చింది కానీ జీవిత అంతం వరకు ఆయన మీద పోలీసు నిఘా సడలలేదు. 1861 లో the house of the dead
( జైలు అనుభవాలు)తో రచనా వ్యాసంగం మళ్లీ మొదలైంది. అదే సంవత్సరం ‘తిరస్కృతులు’ (Humiliated and Insulted తెలుగులో సహవాసి అనువాదం) కూడా వచ్చింది. సైబీరియాలో పని చేస్తున్నప్పుడే స్కూలు పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. తద్వారా కొన్ని కూలీన రష్యన్ కుటుంబాలు పరిచయం లోకి వచ్చాయి. అక్కడే 1857లో వితంతువైన మారియాను వివాహం చేసుకున్నాడు. 1859 లో అంటే పదేళ్ల తరువాత తిరిగి రష్యా వచ్చాడు. 1862 లో జరిపిన యూరోప్ పర్యటన పెట్టుబడిదారీ విధానాన్ని దగ్గరగా చూడడానికి ఉపయోగపడింది. సామాజిక అభివృద్ధి పేరుమీద ఆత్మ కోల్పోయిన ఆధునిక సమాజం నిర్మాణమైందని winter notes on summer impressions లో రాసాడు. తనే ప్రారంభించిన అనేక పత్రికలకు సంపాదకుడుగా, ప్రచురణకర్తగా పనిచేశాడు.
పశ్చిమ యూరప్ పర్యటన కాలంలో పట్టిన గ్యాంబ్లింగ్ అలవాటు అతనికి అదుపులేని వ్యసనమైంది. ఆర్థికంగా దివాళా తీసి డబ్బులు అడుక్కోవలసిన దుస్థితి ఏర్పడిన కాలాలు తన జీవితంలో ఉన్నాయంటారు.
1864 లో notes from underground అచ్చు అయ్యింది
అదే సంవత్సరం మొదటిభార్య మరణంతో మళ్లీ ఒంటరి వాడైనా బాధ్యతలు మాత్రం దండిగా ఉండేవి. మొదటి భార్య కొడుకు పాషాకు సంరక్షకుడుగా వుంటూనే చనిపోయిన అన్న కుటుంబానికి ఏకైక ఆధారం అయ్యాడు. ఇంత తీవ్ర ఆర్థిక దుస్థితిలోనూ దివాళా తీసిన బంధువులకు, స్నేహితులకు ఆర్థిక సాయం చేసేవాడు. యీ లక్షణం ఇడియట్ నవల లోని ప్రిన్స్ మిస్కిన్ పాత్రలో చూడవచ్చు.
1866 లో నేరము-శిక్ష (crime and punishment) వచ్చింది. సెయింట్ పీటర్స్ బర్గ్ తిరిగి వచ్చాడు. అదే సంవత్సరం తన స్టెనో గ్రాఫర్ అన్నా గ్రేగరోవ్న్నా సాయంతో కేవలం 26 రోజుల్లో the gambler పూర్తిచేశాడు.
1867 లో అన్నాను పెళ్లిచేసుకున్నాడు. దొస్టోవిస్కీ ఆర్థిక లావాదేవీలను ఎక్కువ మటుకు ఆమెనే పర్యవేక్షించేది.
అప్పుడే The idiot ప్రారంభించాడు. ఆ రచనాకాలంలోనే మొదటి కూతురు సోఫియా న్యుమోనియాతో చనిపోయింది. ఆ దిగులు (gloomy ness) ఇడియట్ నవలలో పలుచోట్ల ప్రతిఫలించింది.
Peoples vengeance అనే సోషలిస్టు గ్రూపు తమ సొంత సంస్థ సభ్యుడినే హత్య చేశారన్న వార్త ఆధారంగా 1869 లో Demons నవల రాశాడు. బెర్లిన్ ప్రయాణ సమయంలో తన రాత ప్రతుల్ని కొన్నిటిని తగలబెట్టేసాడంటారు. ఆ ప్రతుల్లో రష్యన్ సాంప్రదాయ, ఆచారాలకు వ్యతిరేక భావనలు ఉండటం తనకే నచ్చలేదంటారు. అందులో idiot నవల రాతప్రతులు కూడా కొన్ని ఉన్నాయని అంటారు. పీటర్స్ బర్గ్ కు తిరిగి వచ్చాక అప్పుల బాధ పడలేక అపార్ట్మెంట్ అమ్మేసుకున్నాడు. ఇంకా మిగిలిన అప్పులు తీర్చడానికి
A writer’s diary పేరుమీద మతం, రాజకీయాలు, నైతికత కోణంలో వ్యాసాలు రాశాడు. అందుకుగాను ఏటా 3000 రూబుళ్ల ప్రతిఫలం అందేది. అప్పటికి
ఆరోగ్యం కూడా క్షీణించింది. 1875 లో Adolescent మొదలు పెట్టాడు. అప్పటి జార్ ప్రభువు అలెగ్జాండర్ II తన కొడుకులకు విద్యా బుద్ధులు నేర్పమని దొస్టోవిస్కీని కోరాడు. దీనితో రష్యన్ పాలక, కూలీన సమాజంలో అతని పేరు ప్రతిష్టలు పెరిగాయి. రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సభ్యుడు అయ్యాడు.
దొస్టోవిస్కీ రచనల్లో చివరిదైన (1880) brothers of karamazov ఆయన రచనల్లో సమగ్రమైనదని చెప్తారు. ఇది రాస్తున్నపుడే ఆరోగ్యం మరింత దిగజారి శ్వాసకోశ వ్యాధులు పొడసూపాయి. ఇది పూర్తి అయిన ఆరు నెలలకు (1881) ఈ మహా రచయిత లోకం నుంచి నిష్క్రమించాడు.
పై పరిశీలనలో ప్రస్తావనకురాని దొస్టోవిస్కీ ఇతర రచనలు
(1849) Netochka Nezvanova (అసంపూర్ణం)
(1859) Uncle’s Dream (నవలిక )
(1859) The Village of Stepanchikovo
((1870) The Eternal Husband
3
ప్రిన్స్ మిష్కిన్ ఇడియట్ ఎందుకయ్యాడు
దొస్టోవిస్కీ నవలలతో వొచ్చిన చిక్కేమిటంటే నాయకుడు వీడు, ప్రతినాయకుడు వీడు, ఈమె నాయిక అని చెప్పడం కష్టం. పాత్రలు ఉంటాయి అంతే. పరిస్థితులో, హఠాత్తుగా జరిగే ఒక సంఘటనో ఏదో ఒకటి నాయక, ప్రతినాయక పాత్రలు పోషించవచ్చు. అందువల్ల ఎవరి చుట్టూతా కథ అల్లబడిందో అతడిని నాయకుడని, కథ అంతమయ్యే దశకు ఎవరు దుష్ట స్వభావాన్ని నేరుగా బయలు పరుస్తాడో అతను ప్రతినాయకుడని ఉజ్జాయింపుగా అనుకుంటే ఇడియట్ లో మూడు ప్రధాన పాత్రలు అగుపిస్తాయి.
1.ప్రిన్స్ మిస్కిన్: కథా నాయకుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ. ఒక సంరక్షకుడి అండలో పెరిగాడు. మూర్ఛ, నరాల జబ్బుతో బాధపడుతుంటాడు. హృదయ స్వచ్ఛత వున్నవాడు. లోపాలు ఎన్నకుండా ప్రేమించే స్వభావం కలవాడు. పారదర్శకమైన మనిషి. లోపలా బయటా ఓకేరకంగా ఉండేవాడు. సత్యానికి కట్టుబడే వ్యక్తి. పరిచయం అయిన అరగంటలోపలే ఒక వ్యక్తి బాహ్య రూపాన్ని పక్కకు పెట్టి అతని లోపలి మనిషిని విశ్లేషించి, అర్థం చేసుకోగల అసాధారణ నేర్పు వున్నవాడు. తొలిపరిచయంలో ఎవరైనా అమాయకుడు లేదా ఇడియట్ (మూర్ఖుడు) అనే అనుకుంటారు. కానీ కాస్త పరిచయం తరువాత అతడిని ప్రేమించకుండా ఉండలేరు. యితని మంచితనం వల్ల, ముక్కు సూటిదనం వల్ల కొండొకచో ఇతరులు చిక్కుల్లో పడుతుంటారు.
2. నస్తస్య ఫిలిప్పోవ్నా: కళ్ళు చెదిరే అందగత్తె. చురుకైన వ్యక్తి. మానసికంగా దృఢమైనది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ. టోట్స్కీ అనే ఒక మోస్తరు ధనవంతుడు ఆమె పెంపకం బాధ్యతను తీసుకుంటాడు. అతనిది మధ్యవయసు. నస్తస్యకు పదహారేళ్లు దాటినాక ఆ పెద్దమనిషి ఆమెను లైంగికంగా వాడుకుంటాడు. దాంతో ఆమెకు మగవాళ్ళమీద ఒకరకమైన ద్వేషం ఏర్పడివుంటుంది. మగవాళ్లు అందరూ టాట్స్కీ వలే మోసకారులని భావిస్తుంది. వాళ్ళు చెప్పే నీతులు, చేతలలో చూపే నీతిబాహ్య ప్రవర్తన అంటే అసహ్యం. అట్లాగని వాళ్ళను దూరంగా ఏమీ ఉంచదు. వాళ్ళను ఆకర్షిస్తూనే మానసికంగా వాళ్ళతో ఆడుకుంటూ వుంటుంది. అదను చూసి వాళ్ళ లేకితనాన్ని ప్రపంచం ముందు బహిర్గతపరుస్తూ వుంటుంది. ఆమె స్వభావంతో కూడా కలిపి చూస్తే ఆమెది ‘వినాశకరమైన అందం’. తన పోషకుడితో సహా ఎవరినైనా ఎదిరించగల ధైర్యం, ఎంతటి అపాయకరమైన స్థితిలోనైనా ఒంటరిగా పనులు చెక్క బెట్టుకోగల సాహసం ఆమె సొత్తు. నవల ప్రారంభం అయ్యే నాటికే కులీన కుటుంబాల్లో ఆమెకు చెడ్డపేరు వుంటుంది. మగవాళ్ళలో కథానాయకుడు మిష్కిన్ ను మాత్రమే నమ్ముతుంది. అతను చూపే మంచితనం, కరుణ, ప్రేమపట్ల ఆమెకు విశ్వాసం వుంటుంది.
3. రొగోజిన్: ఒక ధనవంతుడి కొడుకు. తీవ్ర ఉద్రేకము,
Impulsive స్వభావము కలిగిన వ్యక్తి. తండ్రి ఇచ్చిన డబ్బును వాడుకొని నస్తస్యకు వజ్రపు ఉంగరం బహుమతిగా ఇచ్చివుంటాడు. తండ్రికి భయపడి వూరువదలి పారిపోతాడు. నస్తస్య అంటే తీవ్ర మోహావేశం. ఆమెను దక్కించుకోడానికి అవసరమైతే ఎవరి ప్రాణమైనా తీయడానికి, తనకు దక్కదు అనుకుంటే అమెనైనా హత్య చేయడానికీ వెనుకాడని స్వభావం అతనిది. తండ్రి చనిపోయాక అన్ననుంచి ఆస్తి
పంచుకోవడం కోసం సెయింట్ పీటర్స్ బర్గ్ కు వచ్చి వుంటాడు. నస్తస్య ప్రిన్స్ మిష్కిన్ ను ప్రేమిస్తున్నదని గ్రహించి ఒకసారి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు.
మొత్తం కథ ఈ మూడుపాత్రల చుట్టే చుట్టేసివుంటుంది.
కథ అంతా మీకు ఏకరువు పెట్టను గానీ దొస్టోవిస్కీ నైపుణ్యాన్ని చూపే మూడు నాలుగు సన్నివేశాలను మీకు చెబుతాను.
సంపన్న కుటుంబానికి చెందిన 26 ఏళ్ల ప్రిన్స్ మిష్కిన్
బాల్యంలోనే అనాధ అయ్యాడు.నరాల జబ్బు చికిత్స కోసం న్యూజిలాండ్ వెళ్లి నాలుగేళ్ళ తరువాత సెయింట్ పీటర్స్ బర్గ్ కు తిరుగుప్రయాణంలో రైల్లో వున్నాడు. అదే బోగీలో ఎదురుగా రొగోజిన్ వున్నాడు. అదీ కథ మొదలు. దొస్టోవిస్కీ కల్పించిన గమ్మత్తు ఏమంటే ఈ రెండు పాత్రలు చివరిసారి కలసుకోవడంతో కథ ముగుస్తుంది కూడా.
గ్రేట్ బ్రిటన్ కు ఎమోషన్ చార్లెస్ డికెన్స్ అయితే రష్యాకు దొస్టోవిస్కీ. ఇడియట్ నవల రాయటానికి దొస్టోవిస్కీకి ప్రేరణనిచ్చింది సెర్వాంటెస్ రాసిన ” డాన్ క్విసోట్”, చార్లెస్ డికెన్స్ “పిక్ విక్ పేపర్స్”. అని విమర్శకులు చెబుతారు.
19వ శతాబ్దపు రష్యన్ సమాజంలో మనుషులు స్వార్థపరులు, లోభులు అయ్యారు. సాటి మనుషుల్ని పట్టించుకోవడం లేదు. ప్రేమ, కరుణ అంతం అయ్యాయి. ఇటువంటి లోకంలో స్వచ్ఛమైనమనిషి, ఏ ముసుగులు లేని ఒక మంచివాడు వుంటే ఏమౌతాడు. ‘ఇడియట్’ అవుతాడు. దీన్ని ఋజువు పరచదలుచుకున్నాడు దొస్టోవిస్కీ.
‘లెవ్ మిష్కిన్’ పేరులోనే ఒక గమ్మత్తు ఉంది లెవ్ అంటే సింహం, మిష్కిన్ అంటే ఎలుక. మన నాయకుడు కూడా లోపల సింహం అంత బలమైనవాడు, బైటికి ఎలుక వలె మెత్తని, బలహీనమైనవాడు. దొస్టోవిస్కీ నవలలోని నాయకపాత్రలు చాలా వరకు శాంతమైనవి, బలహీనమైనవి. విరుద్ధంగా ప్రతినాయకుడు రోగోజిన్ శారీరికంగా బలమైన వ్యక్తి. Dark and evil in character. Intensive and impulsive in nature. రచయిత ఈ రెండు పాత్రలను నేరుగా, మూడవ ప్రధాన పాత్ర నస్తస్య ఫిలిప్పోవ్న్నా పాత్రను ప్రస్తావనగా మొదటి అంకంలోనే పాఠకులకు బహిరంగపరిచాడు.
రొగోజిన్ ఒక గ్యాంగ్ ను వెంటేసుకు తిరిగే జులాయివెధవ.
తండ్రి అతి కఠినుడు, పిసినారి. తండ్రి ఎక్కడో కట్టమని పదివేల రూబుళ్లు ఇస్తే దానితో వజ్రపుటుంగరం కొని నస్తస్యకు బహుమానంగా యిచ్చినా ఆనాడు ఆమె అతడిని పెద్దగా గుర్తించలేదు. తండ్రికి భయపడి రొగోజిన్ పారిపోయాడు. విషయం తెలిసిన రొగోజిన్ తండ్రి నస్తస్య ఇంటికి పోయి కిందామీదా పడి దొర్లుతూ నానా యాగీ చేసినపుడు ఆ ఉంగరాన్ని ఆమె తిరిగి ఇచ్చివేస్తుంది. కానీ ఆమెకు తొలిసారి రొగోజిన్ పై ఒక soft corner ఏర్పడింది. తండ్రి చనిపోయినది తెలుసుకొన్న రొగోజిన్ ఆస్తిపంపకం కోసం తగవు పెట్టుకోడానికి అన్న, అమ్మ దగ్గరికి వెళుతున్నాడు. వాడి మనసునిండా నస్తస్యనే ఉన్నది.
దేనిగురించి అయినా అనర్గళంగా మాట్లాడగల సర్వజ్ఞుడు, ఎవరిగురించి అయినా తీర్పులు చెప్పగల రంధ్రాన్వేషకుడు క్లర్కు లేబదేవ్ కూడా వీళ్ళతో పాటు ప్రయాణిస్తున్నాడు. అటువంటి సర్వజ్ఞుల గురించి దొస్టోవిస్కీ ఏమన్నాడో వినండి.
“యీ సర్వజ్ఞులు సమాజంలో తరచూ మనకు తారసపడుతూ వుంటారు. ప్రతి సమకాలీన విషయాన్ని తమ సహజ జ్ఞానంతో గుర్తుపెట్టుకోవడానికి తహ తహ లాడుతుంటారు.ఈ సర్వజ్ఞానులకు చాలా తక్కువ తెలుసు. వారి ఏకాగ్రత అంతా ఫలానా మనిషి ఎక్కడ పనిచేస్తాడు? వాని స్నేహితులు ఎవరు? ఉద్యోగమేంటి? ఎక్కడ ఎవర్ని పెళ్లిచేసుకున్నాడు? వాడిపెళ్లాం ఎంత కట్నం తెచ్చింది? వాని బంధువులెవరు? లాంటి విషయాల చుట్టూ వుంటుంది. జనాలకు వీరికి తెలిసిన జ్ఞానం పట్ల సానుభూతి వుంటుంది. వారు తరచూ ఈ విషయాలు తెలుసుకోడానికి యీ సర్వజ్ఞులను ఆశ్రయిస్తుంటారు. తమకు సకల శాస్త్రాలూ తెలుసునన్న ప్రచారం వల్ల వారికి వచ్చే గౌరవం తక్కువేమీ కాదు. ఈ శాస్త్రాల గురించి తెలుసుకోడానికి చాలామంది కవులు, రాజకీయ నాయకులు మేధావులు శాస్త్రవేత్తలు తపన పడటాన్ని వాళ్ళు తమ వృద్ధికి పునాదిగా వాడుకుంటారు.” యీ దొస్టోవిస్కీ వాక్యాలకు ఇప్పటి మన సోషియల్ మీడియాలో రోజూ కనిపించే వాట్సాప్ ప్రొఫెసర్లు, ఫేస్ బుక్ తీర్పరులు అయిన జస్టిస్ చౌదర్లు, చౌదరీమణులు, బొబ్బిలి బ్రహ్మన్నలు మీకు గుర్తుకొస్తే తప్పు నాదికాదని మనవి.
మళ్లీ కథలోకి వస్తే… తన చిత్రవేషధారణలో, ఒక చిన్న మూట సంచీతో మిష్కిన్ వాళ్లకు విచిత్రంగా అగుపిస్తాడు. వాళ్ళు అతన్ని అవహేళనగా చూస్తారు. తనమీద ఎవరైనా జోకులు వేస్తే మిష్కిన్ ఆగ్రహం తెచ్చుకోడు, మనసు నొచ్చుకోడు. వాళ్ళతో కలిసి హాయిగా నవ్వగల స్వభావం అతనిది. తన గతాన్ని, డబ్బు లేనితనాన్ని, జబ్బు వున్నతనాన్నీ, ఆఖరుకు మిత్రులు తనని ‘ఇడియట్’ అంటారనీ… ఏదీ దాచుకోకుండా ఒక క్షణం ముందే పరిచయంలోకి వచ్చిన వాళ్లతో చెప్పేస్తాడు. రొగోజిన్ అతని అమాయకత్వాన్ని ఇష్టపడతాడు. రొగోజిన్నే కాదు మిష్కిన్ తో మాట్లాడిన ఎవరైనా అరగంట లోపలే అతడిని ప్రేమిస్తారు. రైలు దిగి విడిపోయేముందు తనతో వచ్చేయమని, మంచి దుస్తులు, కొంత డబ్బు ఇస్తాననీ రొగోజిన్ చెప్పినా మిష్కిన్ వద్దంటాడు. ఇలా తొలి సన్నివేశంలో కథావస్తువును విస్తరించానికి అవసరమైన అన్ని నేపధ్యాలను, మనస్తత్వాలను పాఠకులకు పరిచయం చేసి వదిలేస్తాడు.
నాకు మామ వరుస ఒకాయన వుండేవాడు. ఎపుడైనా కర్నూలు వస్తే అందరి బంధువుల ఇళ్లకూ వెళ్లి తప్పసారిగా పలకరించి వచ్చేవాడు. వాళ్ళతో ఆయనకు పనేమీ వుండదు, ముందుముందు పని పడదు కూడా. అయినా ‘మన వాళ్ళు’ అని అలా చూసి రావటం ఆయనకు తృప్తి. అలాంటి మనిషే మిష్కిన్.
రైలు దిగి నేరుగా జనరల్ ఎపాంచిన్ ఇంటికి పోతాడు. ఆయన భార్య తనకు దూరపు బంధువు. వాకిలి దగ్గర నౌకరు మిష్కిన్ లక్షణాలను చూసి ధనవంతుల ఇళ్లకు డబ్బు అడుక్కోవడానికి వచ్చిన బాపతు అనుకుంటాడు.
నౌకరుతో తన చరిత్ర మొత్తం చెప్పుకుంటాడు. “నౌకరు కాబట్టి ఎడంగా ఉండాలి. తగుమాత్రమే మాట్లాడాలి” ఈ సామాజిక అంతరాల పట్టింపులు మిష్కిన్ కు వుండవు. మాట్లాడటానికి మనిషి అయితే చాలు.
దొస్టోవిస్కీని చదవడంలో పాఠకుడు చాలా జాగ్రత్తగా వుండాలి. లేకపోతే ఆ వాక్యాల మధ్య ముఖ్యమైనది ఏదో జారిపోతుంది. వాక్యం చదివాక కూడా అక్కడక్కడా ఆగి తరచి చూసుకోవాలి. ఏదో ఉద్దేశ్యంతో ఆమాట అని ఉండవచ్చు లేదా ఆ సన్నివేశాన్ని కల్పించి వుండవచ్చు.
లేకుంటే మరణశిక్ష గురించి నౌకరుతో మిష్కిన్ కు చర్చలేమిటి?
యూరప్ అంతటా మరణశిక్ష అమలులో ఉండగా రష్యాలో మాత్రం అప్పుడే మరణశిక్ష నిషేధింపబడింది.
దానిమీద అతని వాదం ఒకసారి వినండి. మిమ్ములను చంపాలనుకొని ఎవరైనా హాంతకుడో, రౌడీనో దాడిచేస్తే ఎదురుదాడి చేసి మనం తప్పించుకోవచ్చు. ఆశక్తులు అయితే కనీసం పారిపోవచ్చు. అలా ఏదో ఒక ప్రత్యామ్నాయం వుంటుంది. రాజ్యమే మరణశిక్ష విధిస్తే? మీకు మరే ఆశ మిగిలివుండదు. శిక్ష ప్రకటన నుండి అమలు జరిగే ఆఖరి ఘడియవరకు ఎంత మానసిక అశాంతి, ఘర్షణ. ఎంత హింస ఉంటుందో ఇలా చెబుతాడు
“ఇంకొక మనిషి గురించి చెబుతాను. రాజకీయ నేరం చేశాడని కాల్చి చంపడానికి ఉత్తర్వులు వచ్చాయి. తీసుకువెళ్లారు. ఇరవై నిముషాల తర్వాత అతనికి శిక్ష తగ్గిస్తూ మళ్లీ ఉత్తర్వులు వచ్చాయి. ఈ రెండు ఉత్తర్వుల మధ్యగల ఇరవై నిముషాల కాలంలో అతను తప్పకుండా చచ్చిపోబోతున్నానని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో అతని జ్ఞాపకాలు ఎలా వుంటాయి… బతకడానికి ఇంక ఐదు నిముషాలే వున్నాయి. ఆ ఐదు నిముషాలు అతనికి అనంతమైన ధనరాసి. ఆ ఐదు నిముషాల్లోనే అనేకసార్లు బతికాడు. ఇంకో మూడు నిముషాల్లో తను సూర్యకిరణాల్లో కరిగిపోతాడు. … అజ్ఞానం అసహ్యత కలగలిసిన దీర్ఘాలోచన… అంతకంటే భయపెట్టేది ఏముంటుంది?
ప్రతి నిముషాన్నీ వయసుగా మార్చుకున్నాడు. గడిచిన ప్రతి నిముషాన్నీ లెక్కించుకున్నాడు. తొందరగా తనను కాల్చివేస్తే బాగుండుననుకున్నాడు. ఫాదర్ ఇచ్చిన శిలువను అతడు గబ గబా ముద్దుపెట్టుకున్నాడు. అతనికా సమయంలో మతభావాలు ఉన్నాయో లేదో అనుమానమే”
విన్న నౌకరుకు అతనిమీద సదాభిప్రాయం ఏర్పడుతుంది.
ఈలోపు జనరల్ ఎపాంచిన్, వారి సెక్రెటరీ గన్యా కూడా
కలిశారు. అందరిలాగే డబ్బుకోసం వచ్చివుంటాడని జనరల్ కూడా భావిస్తాడు. లేకుంటే ఊరికే చూసిపోడానికి ఈ కాలంలో ఎవరొస్తారు? కొంతసేపు మాట్లాడాక మిష్కిన్ పైన విశ్వాసం కలుగుతుంది. గన్యా 28 ఏళ్ల యువకుడు. ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. నస్తస్య ఫిలిప్పోవ్నాను పెళ్లి చేసుకుంటే ఆమె సంరక్షకుడు డెబ్భై అయిదు వేల రూబుళ్ల కట్నం ఇస్తాడు. తన కష్టాలన్నీ తీరిపోతాయి. దీనికి తన యజమాని జనరల్ ఎపాంచిన్ ప్రేరేపణ, మద్దతు కూడా ఉంది. మరో వైపు అతను జనరల్ చిన్నకూతురు అగ్లయానూ ప్రేమిస్తున్నాడు. ప్రస్తుతం ఆ సంకటంలోనే వున్నాడు. అయినా గన్యా మొగ్గు డబ్బు వైపే వుంది. అది ఎవరికి చేదని?
నస్తస్య తన పుట్టినరోజు కానుకగా పంపిన చిత్తరువును గన్యా బైటికి తీస్తాడు. పాత్రగా నేరుగా ప్రవేశించక ముందే నస్తస్య చిత్రంగా ఒక మైండ్ గేమ్ రూపంలో ప్రవేశించింది చూడండి. మగవాళ్లను టీజ్ చేయటం ఆమెకు సరదా. అది పడుచు గన్యా నైనా, ముసలి జనరల్ నైనా.
అక్కడున్న ముగ్గురు మగవాళ్ల స్థితి ఇలా వుంది.
1. గన్యా : తనను పెళ్లాడతానా లేదా అనేది పుట్టినరోజు నాడు బహిరంగపరుస్తానని చెప్పి నస్తస్య ఉత్కంఠకు తెరతీసింది.
2. జనరల్ ఎపాంచింన్: యాభై ఏళ్ళు పైబడ్డ వాడు.
ముగ్గురు కూతుళ్లు పెళ్లికి సిద్ధంగా వున్నారు. నస్తస్య పై మోజువుంది. భార్యకు తెలియకుండా ఆమెకు ముత్యాల హారం ఇచ్చివచ్చాడు
3. మిష్కిన్: నిన్న రైల్లో ఆమె గురించి విన్నాడు. ఈ రోజు చిత్తరువు చూసి మాట పోయింది. వ్యసనమయ్యేంత అందగత్తె ఆమె.
మిష్కిన్ మేడమ్ లిజవేత ఎపాంచిన్ ను ఆమె కూతుళ్లు అలెగ్జాండ్రా, అడెలిడా, అగ్లయాలను కలిసాడు. ‘తనను అందరూ ఇడియట్ అని పిలుస్తారు’ సహా…వాళ్లకు కూడా చెప్పాడు. నౌకరుకు కూడా ఈ విషయాలు అన్నీ చెప్పినట్టు తెలిపి వాళ్ళను విస్మయపరిచాడు కూడా.
పనిలో పనిగా నస్తస్య చిత్తరువు జనరల్ ఇంటికి బహుమతిగా వచ్చిన విషయం కూడా అమాయకంగా చెప్పి జనరల్ ను, గన్యాను ఇద్దరినీ ఇరుకున పడేస్తాడు. మంచివాడు ఇడియట్ అవడమంటే ఇదే. మనిషి అంతరంగాన్ని చదవడంలో మిష్కిన్ సిద్ధ హస్తుడు. బాహ్యరూపం వెనుక వున్న లోపలి మనిషిని ఐదు నిముషాల్లో అంచనా వేయగలడు. ఒక్క అగ్లయా గురించి తప్ప ముగ్గురు ఆడవాళ్ళ గురించి వాళ్ళు విస్తుపోయేంత
ఖచ్చితంగా చెప్తాడు.. అగ్లయా cute, pretty, little princes అని చెప్పక చెబుతాడు రచయిత. అంతేకాదు ఆమె ఒక rebellious, తీవ్ర నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడని మనిషి అని మనకు ముందుముందు తెలుస్తుంది. మనుషులను అంచనా వేయగలిగేంత తెలివితేటలు ఉన్నాయి గనుకనే అగ్లయా కూడా గన్యా ప్రేమపలుకులను నమ్మదు. అతడిని తిరస్కరిస్తుంది.
ఇక్కడినుంచి అంకం గన్యా ఇంటికి మారుతుంది. మనవాడు మిష్కిన్ అక్కడ అద్దెకు రూము తీసుకున్నాడు. గన్యా నస్తస్యను పెళ్లిచేసుకోవడం ఆ ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. ముఖ్యంగా తల్లి, అక్క. నస్తస్య సక్రమమైన మనిషి కాదని ఈ ఇంటికి కోడలిగా తగదని వ్యతిరేకించారు. ఈ వాదోపవాదాలు జరుగుతుండగా ఎవరో వచ్చారు. మిష్కిన్ వెళ్లి తలుపుతీసి మ్రాన్పడి పోయాడు వచ్చినది అందాలరాసి నస్తస్య. మొదట ఆమె అతడిని ఆ యింటి నౌకరు అనుకుంటుంది. కొంత అమర్యాదగా కూడా ప్రవర్తిస్తుంది. అక్కడ వున్నవారు ఎవరూ ఆమె రాకను ఊహించలేదు. గన్యా అక్క వార్య, నస్తస్య గురించి ఆమె ఎదురుగానే మాట తూలుతుంది. గన్యా అమె మీద చేయి చేసుకోబోతాడు. మిష్కిన్ అడ్డుపోయి ఆ దెబ్బ తను తింటాడు. మిష్కిన్ స్వభావం, మంచితనం ఏమిటో మొదటి పరిచయ సన్నివేశంలోనే నస్తస్య కు తెలిసిపోతుంది. He is a pure soul.
నస్తస్య అంటే మిష్కిన్ కు ఎనలేని అభిమానం. ఆమె కూడా తనవలె చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ. కష్టాల కొలిమిలోంచి వచ్చినది. లోకం అనుకుంటున్నట్టు ఆమె పతనమైన వ్యక్తి కాదు. ఆమె హృదయం గాయపడి వున్నది. ఆమెకు ఓదార్పు, ఆమె మనసుకు స్వస్థత కావాలి. ఆ పని చేయటం తన బాధ్యత అని కూడా గ్రహిస్తాడు. దుడుకుతనంతో గన్యా
కొట్టినా మిష్కిన్ కోపగించుకోడు. “ఏం చేస్తాడు పాపం అతడికి ఇంట్లో సుఖం లేదు. బాధ్యత లేని తాగుబోతు తండ్రి, ద్వేషించే అక్క, బాధ్యతలకు ఇంకా ఎదగని తమ్ముడు, తీర్చలేనన్ని అప్పులు…” అని అర్థం చేసుకొని గన్యా క్షమాపణ అడగ్గానే చిరునవ్వుతో స్వీకరిస్తాడు.
నేను ప్రస్తావించదలచిన మూడవ ముఖ్య సన్నివేశం నస్తస్య పుట్టినరోజు వేడుక. ప్రముఖులను అందరినీ ఆహ్వానించింది. ప్రేమికుడు గన్యా, జనరల్ ఎపాంచిన్, తన సంరక్షకుడు టాట్స్కీ. పిలవని పేరంటానికి వెళ్లిన మన మిష్కిన్, సర్వజ్ఞాని, రంధ్రాన్వేషకుడు క్లర్కు లెబదేవ్, వీళ్ళతో పాటు మొరటాడు, గట్టి పిండం, కుండ బద్దలు కొట్టి మాట్లాడే నస్తస్య స్నేహితుడు ఫర్దిషేంకో వంటి ఎందరో….
నస్తస్య తన మైండ్ గేమ్ మొదలు పెడుతుంది. ’ప్రతి ఒక్కరు తమ జీవితంలో చేసిన చెడును నిజాయితీగా చెప్పాలి.’ ఇదీ ఆట. తనను లైంగికంగా వాడుకున్న తన సంరక్షకుడు టాట్స్కీ నిజంగా పశ్చాత్తాపపడితే అతనితో పూర్తి జీవితం గడపడానికి కూడా ఆమె మానసికంగా సిద్ధంగా వుంది. తనను వదిలించుకోడానికి టాట్స్కీ అతని స్నేహితుడు జనరల్ ఎపాంచిన్ తో కలసి గన్యాను సిద్ధం చేశారని, అందుకోసమే డెబ్భై ఐదు వేల రూబుళ్ల వరకట్నం ఇస్తానని టాట్స్కీ ప్రకటించాడనీ ఆమెకు తెలుసు. అయినా ఒక ఆట ఆడుకుందాం అని సరదా.
అక్కడవున్న ఒక్కరు కూడా నిజమైన పశ్చాత్తాపంతో తాము చేసిన చెడ్డపని గురించి చెప్పరు. అపద్దాలతో మసిబూసి మారేడుకాయ చేసిన వాళ్ళు కొందరైతే, ఏ పశ్చాత్తాపం లేకుండా ఆ సంఘటనను కూడా తన గొప్పదనం కోసం, ప్రచారం కోసం వాడుకున్న వాళ్లు మరికొందరు. ఒకరిద్దరు పశ్చాత్తాపపడినట్లు కనిపించినా అదేమీ వాళ్ళ హృదయపు లోతులనుంచి రాలేదు. ఈ ఆట బోరుకొట్టి ఆపేస్తుంది నస్తస్య. అర్ధాంతర నిర్ణయాలు తీసుకోవడం ఆమె లక్షణం. యీ పిల్లకు ఏమైనా పిచ్చా? అని అనుకునేట్లు వుంటుంది ఆమె అసాధారణ ప్రవర్తన.
కొత్త మైండ్ గేమ్ ప్రారంభిస్తుంది.
ఉన్నట్టుండి ‘తాను గాన్యను పెళ్లి చేసుకోవాలా వద్దా?’ నిర్ణయం చెప్పమని మిష్కిన్ ను కోరుతుంది. అతను చెప్పేదే తన తుది నిర్ణయం అని కూడా ప్రకటిస్తుంది. తన సమస్యలోకి మిష్కిన్ ను తెచ్చి ఇరికించింది.
ఎందుకిలా అంటే…
“మిష్కిన్ ఒక్కడే తన మనసును అర్థం చేసుకున్నవాడు. The only person who didn’t judge me like others”
ఇలా ఎందుకు చేస్తుంది? అంటే… 20,22 ఏళ్ళు వచ్చాక నస్తస్య మానసికంగా దృఢమైనదిగా తయారైంది. సైకలాజికల్ గేమ్ ప్రారంభించి ప్రతి వ్యక్తి తనకు దగ్గర కావడం వెనుక వాస్తవాలు ఏమిటో, ఏ స్వార్థం వుందో
లోకానికి చెప్పదలుచుకుంది.
‘గన్యాను పెళ్లి చేసుకోవద్దనీ, డబ్బు కోసమే తాను అందుకు సిద్ధపడుతున్నాడనీ’ మిష్కిన్ కుండబద్దలు కొట్టేస్తాడు.
తమ ప్రణాళిక విఫలం అవబోతున్నందుకు జనరల్ కంగారు పడ్డాడు. “నస్తస్య! ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకు”
అనబోతే “మీరు నాకు ఇచ్చిన ముత్యాల హారం మీ భార్య మెడలోకే బాగా నప్పుతుంది” అని ముసలి జనరల్ రహస్యంగా చేసిన పనిని పదిమందిలో పెట్టి పరువు తీస్తుంది. టాట్స్కీ మాట్లాడబోతే ‘నీవు నీతి గురించి చెప్పడమా? నా యీ స్థితికి నువ్వు కాదూ కారణం? నన్ను వదిలించుకోడానికి కాదూ నువ్వు పెట్టిన యీ 75000 రూబుళ్ల బేరం? యీ డబ్బు కోసమే కాదూ గన్యా నన్ను పెళ్లిచేసుకోడానికి సిద్ధపడింది?’
అన్నట్టు ప్రవర్తిస్తుంది.
‘మిష్కిన్! నన్ను పెళ్లిచేసుకుంటావా? అని అడుగుతుంది.
ఇలా లోపలి మనుషులు ఏమిటో వాళ్ళ ఉద్దేశ్యాలు ఏమిటో నస్తస్య మాటల ద్వారా, చేష్టల ద్వారా బయటపెడతాడు రచయిత. దొస్టోవిస్కీ నవలల్లో పాఠకుడు ఊహించని మలుపులు, హఠాత్తుగా ఎదురయ్యే ఉత్పాతాలు చాలా వుంటాయి. ఈ తతంగం జరుగుతుండగా లక్ష రూబుళ్ల డబ్బుతో, తన తాగుబోతు రౌడీ మిత్రుల గుంపుతో ప్రవేశిస్తాడు రొగోజిన్. తమను తాము పవిత్రులుగా భావించుకునే కూలీన సమాజపు పెద్దమనుషుల వాతావరణం ఒక్కసారిగా అపహాస్యం పాలవుతుంది. రొగోజిన్ ఇచ్చిన లక్ష రూబుళ్లు తీసుకొని అప్పటికప్పుడు మరో కొత్త ఆట మొదలుపెడుతుంది.
కథా నాయకుడు మిష్కినే అయినా నవల ఆద్యంతం నస్తస్య కనుసన్నలలోనే నడుపుతాడు దొస్టోవిస్కీ.
‘రొగోజిన్ యీ లక్ష నాదేకదా! నేను నీ దాన్ని అయితే ఈ సొమ్ము నేను ఏమి చేసుకున్నా నీకు అభ్యంతరం లేదు కదా?’ అడుగుతుంది.
‘నీ ఇష్టం’ అంటాడు రొగోజిన్.
గన్యాను ఆ డబ్బు తీసుకోమంటుంది నస్తస్య.
ఈ ఒక్క మాటతో ఇద్దరిని దెబ్బకొట్టినట్టు. తనను ఉద్ధరించే ఫోజు పెట్టి టాట్స్కీ ఇవ్వజూపిన 75000 ల రూబుళ్లు అందరిముందు బహిరంగంగా తిరస్కరించడం. ఆ డబ్బుకోసమే సిద్ధపడ్డ గాన్యతో పెళ్లి నిరాకరించినా అతనికి డబ్బు ఇచ్చి అవమానించడం. వాహ్… ఏమి యెత్తు! ఒకస్థితిలో గన్యా అవమానపడి డబ్బు తీసుకో నిరాకరిస్తే ఆ మూటను మండుతున్న పొయ్యిలోకి విసిరివేస్తుంది. ఎంత ఉద్రేక, నిర్లక్ష్య స్వభావం ఆమెది.
మిష్కిన్ వైపు తిరిగి ‘డియర్ నీవు మంచివాడివి. నీకు నేను తగను’ అని చెప్పి రొగోజిన్ తో వెళ్లిపోతుంది. మిష్కిన్ అమె వెంట పరుగెత్తుతాడు. గన్యా డబ్బు తీసుకొని వెళ్ళిపోతాడు.
నేను చెప్పిన ఈ మూడు సన్నివేశాల మీదే మొత్తం నవల
నడుస్తుంది.
నిజానికి నస్తస్య ప్రిన్స్ మిష్కిన్ ను ఇష్టపడుతుంది. కానీ తను తగనేమోనని అనుమానపడి జనరల్ ఎపాంచిన్ చిన్నకూతురు అగ్లయాను అందుకు సిద్ధపరుస్తుంది.
రొగోజిన్ తో వచ్చినా సరిగ్గా పెళ్లి సందర్భానికి పారిపోతుంది. అలా ఒకసారి కాదు అనేక మార్లు జరుగుతుంది. కారణం మిష్కిన్ పట్ల తన ప్రేమను వదలుకోలేదు. ఆమెది ఒక సంక్లిష్ట మానసిక స్థితి. ఇదే స్థితి మిష్కిన్ ది కూడా.
ప్రిన్స్ మిష్కిన్ కొంతకాలం టీచరుగా కూడా పనిచేశాడు.
(దొస్టోవిస్కీ కూడా) పిల్లల గురించి అక్కడ వెలిబుచ్చిన అభిప్రాయాలు దొస్టోవిస్కీ అభిప్రాయాలే.
“అప్పుడక్కడ అంతా పిల్లలే. నా సమయమంతా పిల్లలతో గడిచేది. నేను వాళ్లకు భోదిస్తూ ఉండేవాడిని అనడం కంటే వాళ్ళతో గడిపాను అనుకోవటం సమంజసం. ఏదీ దాచకుండా అన్ని విషయాలు వాళ్ళతో పంచుకునేవాణ్ణి. పిల్లలెప్పుడూ నా చుట్టూతానే వుంటారని వారి తల్లిదండ్రులకు, నాతోటి ఉపాధ్యాయుడికి కూడా కోపం, భయం. వాళ్లకెందుకు భయం? పిల్లలు నాతో అన్నీ చెబుతారనేగా! పెద్దగా ఎదిగిన తల్లిదండ్రులు పిల్లలను అర్ధం చేసుకోవడంలో ఇంకా చిన్నగానే వున్నారు.
పిల్లలు చిన్నవారనీ, విషయాలు వారికి తెలియకుండా ఉంచాలనుకోవడం దురదృష్టకరమైన ఆలోచన. వాళ్ళెంత వేగంగా అర్థం చేసుకోగలరో, కష్టమైన సందర్భాల్లో ఎంత మంచి సలహా ఇవ్వగలరో యీ ఎదిగిన పెద్దలకు తెలియదు. దేవుడా! ఈ అందమైన పిట్టలు (నేనువారిని పిట్టలనే అంటాను) సంతోషంగా వున్నప్పుడు వారిని మోసం చేయడమంత అవమానం ఇంకోటి వుందా?….
మనం పిల్లలకు భోధించనవసరం లేదు. వాళ్లే మనకు బోధిస్తారు.”
యీ అభిప్రాయాలు లెనిన్ నాయకత్వంలో విప్లవం విజయవంతమై కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత స్కూళ్ల డైరెక్టర్ గా పనిచేసిన సూహోమ్లీన్స్కీ (పిల్లలకే నా హృదయం అంకితం) ని ప్రభావితం చేశాయనడంలో సందేహంలేదు.
4
అర్థం – అంతరార్థం
ఇడియట్ నవలలో అనేక విషయాలు కలగలసి వున్నాయి
1. తాత్విక ఒప్పుకోలు (philosophical confession)
2. నేరపూరిత సాహసాలు ( criminal adventures)
3. మతపరమైన నాటకీయత (religious drama)
4. విస్తారమైన కథ
యీ అన్నీ కలిసి నవలకు ఒక సుడిగాలి వంటి ప్రభావాన్ని తెచ్చాయి – leonid grossman
ప్రతీ రచయిత తన జీవితకాలంలో పొందిన అనుభవాలను, ఎదుర్కొన్న ఘటనలను , ప్రభావితం చేసిన మనుషులను , పడిన దుఃఖాలను, ఎగసిన సంతోషాలను రచనలోకి తెస్తాడు. సమాజంనుంచి సేకరించుకున్న వస్తువును లోపలికి శోషించుకొని తనదిగా అనుభవిస్తాడు. తనదైన జ్ఞానంతో, తాత్వికతతో విశ్లేషించుకుంటాడు. మంచి చెడ్డల వివేచనతో రచనా వస్తువులోని విరుద్ధ శక్తులలో ఎవరి పక్షాన నిలబడాలో, వాదించాలో తేల్చుకుంటాడు. దుఃఖ భాజనమైన ఈ మధనంలో పలుసార్లు మరణిస్తాడు, పలుసార్లు జన్మిస్తాడు. ప్రతీ రచనలో ఒక కొత్త ‘నేనుగా’ పునరుద్ధానం పొందుతాడు. దొస్టోవిస్కీ, టాల్ స్తాయ్ ల రచనలు యీ క్రమాన్ని మనకు చూపుతాయి.
రచయిత ఒక రచనలో ఏమి ప్రదర్శించాలనుకుంటాడు?
పాత్రలను తోలుబొమ్మలు చేసి వెలికొసల ఆడిస్తాడా?
రచన ద్వారా తనను తాను ప్రదర్శించుకుంటాడా?
వాస్తవ సమాజపు మనిషికి భిన్నంగా ఉన్నతీకరింపబడిన మరొక మానవ రూపాన్ని దర్శింపజేస్తాడా?
దొస్టోవిస్కీ ఇడియట్ లో 19 శతాబ్దపు రష్యన్ ‘సంపూర్ణ సౌందర్యాత్మక మానవుణ్ణి’ చిత్రించాలనుకున్నాడంటారు? అది నిజమైతే అందులో విజయం సాధించాడా? చదువరులైన మీరే నిర్ణయించాలి. తన మేనకోడలుకు రాసిన ఒక ఉత్తరంలో తాను రాయ ఉద్దేశించిన దాంట్లో పదిశాతం మాత్రమే వ్యక్తీకరించగలిగానని దొస్టోవిస్కీ చెప్పాడు. ఏ రచయిత అయినా మనసులో ఉన్నదాన్ని సంపూర్ణంగా కాగితం మీద ప్రతిఫలించగలడా? ముమ్మాటికీ లేదనే నా నిశ్చితాభిప్రాయం. రచయితే కాదు ఎవ్వరూ తమ మాటలద్వారా పూర్తిభావాన్ని వ్యక్తీకరించ లేరు. దీన్నే సూత్రంగా పెట్టుకొని ‘ఇడియట్ ‘ రాసాడా? నవలలోని మూడు పాత్రలు మిష్కిన్, నస్తస్య, అగ్లయా
తమ మనసులో ఉన్న భావాన్ని ఎదుటి వారికి చెప్పలేకపోయినందుకు మాటిమాటికీ నొక్కుచ్చుకుంటుంటారు (ముఖ్యంగా ప్రేమ వ్యక్తీకరణ). అదే కథకు ఒక పునాది అనేంతగా మళ్లీ మళ్లీ పునరావృతం అవుతుంటుంది.
నాది ఇంకో పరిశీలన కూడా, నవల చదువుతూ మనం సహజంగానే వ్యక్తిత్వాలను తూకం వేస్తాం ఎవరో ఒకరి పక్షం వహిస్తాం. మిగతా వారి పట్ల దూరంగా జరుగుతాం లేదా వివక్ష వహిస్తాం. నవలలోని పాత్రలుకూడా సరిగ్గా
ఇదే పనిచేస్తాయి. అంటే రచయిత పాఠకుడిని కూడా నవలలో ఒక పాత్ర చేశాడా?
ఇడియట్ నవలలో నాలుగురకాల గొంతులు (tones) వినిపిస్తాయి
1. కూలీనవర్గాల డంబాచారాలను అవహేళన చేసే రచయిత గొంతు.
2. సమకాలీన భీభత్సాన్ని భీతావహంగా చూపెట్టే గొంతు
3. మనుషుల్ని వాళ్ళ పరిస్థితులనుంచి సానుభూతితో చూసే గొంతు
4. జరుగుతున్న ఘటనల నుంచి విడివడి నగరంలో వేగంగా వ్యాపిస్తున్న వదంతుల ధాటికి కొట్టుకుపోయే సాధారణ మానవులు.
లేబదేవ్ వంటి సర్వజ్ఞ పాత్రనే చూడండి. ఆవూరిలో వుండడు, వున్నా ఆ ఘటనలో వుండడు కానీ ఆ ఘటన తాలూకు వివరాలు అన్నీ తెలుస్తాయి. అతను వాటిమీద సాధికార తీర్పరి కూడా. నస్తస్య పుట్టినరోజు పార్టీలో ఏమి జరిగిందో మేడం లిజవేతకు అంగుళం అంగుళం సమాచారం వచ్చి చేరింది. దాన్ని విశ్లేషించి, వ్యక్తులను వూహించి వాళ్ళగురించి ఎప్పటికప్పుడు తీర్పులు ప్రకటిస్తూ వుంటుంది ఆ కులీన కుటుంబం. మనచుట్టూ ఇలాంటి వారిని ఎందరినో చూస్తున్నాం కదూ?
ప్రతీ రచయిత లోనూ అంతర్గత సారం (inner core) ఏదో వుంటుందనీ. స్థల, కాలాలతో సంబంధం లేకుండా అది అతని / ఆమె ప్రతి రచనలోనూ దర్శనమౌతూ వుంటుందనీ నా ప్రగాఢ విశ్వాసం. రచనలో సంఘటనలు మారవచ్చు, పాత్రలు మారవచ్చు, సన్నివేశాలు మారవచ్చు. అంతస్సారం మారదు. ఈ అద్భుతాన్ని నేను దొస్టోవిస్కీ నవలల్లో చూసాను.
ముందస్తు షరతులు లేకుండా ప్రేమించే కొందరు వుంటారు. ప్రేమను ఇవ్వడం మాత్రమే తెలుసు వాళ్లకు. దయతో ప్రేమను పంచుతూనే వుంటారు. తిరస్కారాన్ని, అవహేళనలను ప్రతిఫలంగా పొందుతుంటారు. అయినా ప్రేమించడం మానరు. తిరస్కృతులు నవలలో, ఇడియట్ నవలలోనూ అటువంటి పాత్రలే మనకు కనిపిస్తాయి.
తిరస్కృతులు నవలలో నీలి పాత్రకు నరాల జబ్బు. యీ నవలలో మిష్కిన్. ఆ నవలలోని రచయిత పాత్ర వాన్య, ఈ నవల లోని ప్రిన్స్ మిస్కిన్ లాగా అందరినీ భరించే మంచివాడు.
దొస్టోవిస్కీ మనుషుల అంతర్వేదనలను పసిగట్టగల నేర్పరి. నీ కష్టాలలో ఏదో ఒక అదృశ్య శక్తి నిన్ను కాపాడుతుంది అని నమ్మినవాడు. జైలుకు పోయేముందు డిసెంబరిస్టు మహిళ బ్రెడ్డు, బైబిల్ ఇవ్వటం
కాకతాళీయంగా జరిగింది కాదని ఆయన విశ్వాసం. అది ఒక అదృశ్య శక్తి అందించిన సాయం. బైబిల్ ఆయన వద్ద లేకపోతే, ఆ విశ్వాసం భవిష్యత్తుపై ఆశను కలిగించక పోతే జైలులోని మిగతా ఖైదీలవలె ఆత్మహత్య ఆలోచనలు చేసివుండేవాడు. “మతం పీడితజనుల నిట్టూర్పు. హృదయంలేని ప్రపంచానికి హృదయం, ఆత్మ కోల్పోయిన పరిస్థితులకు అది ఆత్మ. ప్రజలకు మత్తుమందు.” అని వూరకే అనలేదు మరి. మతమనో, దేవుడనో విశ్వాసమే లేకపోతే ఈ అసమ సమాజంలో, డబ్బే ప్రధానం అయిపోయిన లోకంలో, విలువలు లుప్తమైన రాజ్యంలో మనుషులు బతకడం సాధ్యమేనా? నిలబడి ఎదుర్కొనగలిగే సాహసమో, పోరాడగలమన్న నమ్మకమో లేకపోతే. ఈ రెండూ లేని మనిషి ఏమౌతాడు. నమ్మకం చచ్చి, కష్టాలతో కునారిల్లి, ఎందుకు ఏది జరుగుతున్నాదో అర్థం కాక బలవంతంగా తీసుకునే చావులను ఆపడం మనకు సాధ్యమా? బహుశా దేవుడనే గడ్డిపోచ సముద్రంలో మునగకుండా ఉంచుతుంది.
మనం ఎదిరించాల్సింది, నిరసించాల్సింది మతాన్ని, మత భావనల ప్రచారం వెనక వున్న కుత్సిత ప్రయోజనాల్ని. దిక్కు తోచక, దిక్కులేక మతం నీడన సేదతీరుతున్న సామాన్య మానవుల్ని కాదు.
బహుశా మరణశిక్ష ప్రకటింపబడిన నాటినుండి అమలుకు తెచ్చేవరకు దొస్టోవిస్కీ పడిన క్షోభ పైన చెప్పుకున్నాం.
బహుశా మరణ వేదిక ముందుకొచ్చాక హఠాత్తుగా మరణశిక్ష రద్దుకావటంతో తను నమ్మిన భగవంతుడికి వేల కృతజ్ఞతలు చెప్పుకొని వుంటాడు. అలాగని దొస్టోవిస్కీ ఏమీ పాత కాథలిక్ విశ్వాసాలను మోసినవాడు కాదు. తొలినాటి సోషలిజమ్ భావనల ఆధారంగా మానవత్వ పునాదిమీద తన తాత్వికతను నిర్మించుకున్నాడు. కొంతమంది దీనికి “క్రిస్టియన్ సోషలిజమ్” అని పేరు పెట్టారు కూడా. అయినా తొలి నాళ్ళలో దైవ భావన మీద తనకు ఏర్పడిన సందేహం చివరి వరకు అలాగే కొనసాగిందేమోనని నాకు అనుమానం. ఇడియట్ లో చాలాచోట్ల, కర్మజోవ్ బ్రదర్స్ లో నేరుగా దైవంతో సంభాషణ అందుకు రుజువులు. ఐడియట్ లోని యీ వాక్యాలు చూడండి.
“రొగోజిన్ ఇంట్లోని చిత్రపటం కళ్ళ ముందు కదలాడింది.
శిలువనుంచి దించిన యేసుక్రీస్తు బొమ్మలా ఉందది. శిలువ నెక్కడానికి ముందే పేదరికంతో చిక్కి శల్యమైన శరీరపు చిత్రమది. వంటినిండా గాయాలు, జనం వేసిన రాళ్లతోనూ, సైనికులు ఈటెలతోను చేసిన గాయాలవి. శిలువమోయలేక పడిపోయినప్పుడు ఏర్పడిన భయానక దృశ్యం. నిజానికి శిలువ ఎక్కించడం కంటే భయానకంగా వుంది….
రక్షకుడి శరీరాన్ని అలా చూడడం వింతగానే వుంది….
అంత ప్రత్యక్ష నరకాన్ని చూసి కూడా ఆయన పునర్జన్మిస్తాడని వీళ్ళు ఎలా అనుకుంటారు?…
మరణం అన్నది భయంకరమైనది. తన జీవిత కాలంలో అనేక అద్భుతాలు చేయటం ద్వారా దాన్ని జయించిన రక్షకుడికి కూడా చావు తప్పలేదు. అదికూడా భయంకరమైన చావు. ఆ చిత్రంలో ప్రకృతి భయంకరమైన దయ్యంలా కనిపిస్తున్నది. ఆధునిక కాలంలో మానవుడి అస్తిత్వాన్ని అమాంతం దునుమాడి మింగేసిన రాక్షసి యంత్రంలా “ అంటాడు.
చివరగా నవల శిల్పం గురించి రెండే పరిశీలనలు.
‘తిరస్కృతులు’ నవలలో ప్రధాన పాత్ర కథ చెబుతుంది.
‘నేరము-శిక్ష’ సర్వసాక్షి కోణంలో నడుస్తుంది.
‘ఇడియట్’ నవల సర్వసాక్షి కోణంలో కథ చెబుతూ అక్కడక్కడా హఠాత్తుగా ఉత్తమ పురుషలోకి మారిపోతుంటుంది. బ్రదర్స్ ఆఫ్ కర్మజోవ్ లో ఈ రెండు పద్ధతులు అతిపాతం (overlap) చెందాయి.
అంటే ఈ పద్ధతిని కొంత ప్రయోగాత్మకంగా ఇడియట్ నవలలో ప్రవేశపెట్టాడేమోనని నా అనుమానం.
5
నిరాశనే ఆశకు దారి దీపం
ఇదంతా చదివాక,అర్థంచేసుకున్నాక, విశ్లేషించుకున్నాక మన సమాజానికి ‘ది ఇడియట్’ నవల ప్రాసంగికత ఏమిటి? నాకు నేను ప్రశ్న వేసుకున్నాను.
కూలిపోతున్న ఒక సంధికాలపు వ్యవస్థ అంచున నిలబడి ముందుకు వెళ్ళవలసిన దారియేదో, మతాన్ని మానవతగా ఎలా అర్థం చేసుకోవాలో, మనిషిగా నిలబడడానికి ఎంచుకోవలసిన దారియేదో నీర్భీతితో చూపిన దొస్టోవిస్కీ, టాల్ స్టాయ్ వంటి సాహిత్య కారుల అవసరం మనకు ఇప్పుడు చాలా ఉంది..
తమ కాలం నాటి ఉద్యమకారులతో ఎన్ని
భేదాభిప్రాయాలు వున్నా తమ దేశంకోసం, దేశ ఔన్నత్యం కోసం నిరంతరం రాసిన, హక్కుల గురించి, మానవతా విలువల గురించి మాట్లాడిన సార్త్ర్, ఐన్ స్టీన్ ల వంటి మేధోవారసత్వం మనకు లేదేందుకు? తార్కుండే, మనోరంజన్ మొహంతి, బాలగోపాల్, బి.డి.శర్మ, ఎస్ ఆర్ శంకరన్, కన్న బీరన్, గౌరీలంకేష్, గిరీష్ కర్నాడ్, బొజ్జా తారకం లతోనే అంతరించిందా?
దొస్టోవిస్కీ చిత్రించిన 19 శతాబ్దపు రష్యన్ సమాజం లాగే ఇప్పటి మన సమాజమూ ఒక turbulent దశలో వుంది. కనీసపు నిరసనను కూడా సహించలేని జార్ కంటే క్రూరమైన ప్రభువుల పాలనలో నలుగుతున్నాం. రాజకీయ ప్రశ్నలు నేరంగా చూపబడుతున్నాయి. మరణశిక్షలు, అంతకు భయంకరమైన అండాసెల్ ఖైదులు అమలు అవుతూనే వున్నాయి. మదమెక్కిన మత ఛాందసం రాజ్యాంగ రూపం తీసుకుంటున్నది. రాజ్యాంగ, న్యాయ, శాసన వ్యవస్థలు అన్నీ పెట్టుబడి ముందు సాగిల పడ్డాయి. అడవులు, అడవుల్లోని సంపద పెట్టుబడిదార్ల అంగడికి తరలించడానికి దారులు సిద్ధమవుతున్నాయి. క్రూర చట్టాల, బుల్డోజర్, డ్రోన్ల దాడులతో హక్కులు లుప్తమయ్యాయి. ఎల్లెడలా భయంకర నిశ్శబ్దం. అక్కడక్కడా కొన్ని నిరసన గొంతులు… వినిపించిన వెంటనే హత్య చేయబడుతున్నాయి. సంస్కారహీనత, లేకి చేష్టలే కళలుగా, సంస్కృతిగా విరాజిల్లుతున్నాయి.
వాట్సాప్ వదంతులు,అబద్ధాలు, అర్ధసత్యాలే దేశచరిత్రగా కీర్తించ బడుతున్నాయి.
ఇంత జరుగుతున్నా నా దేశ మేధావులు, రచయితలు ఎందుకు మౌనంగా వుంటున్నారు?
వివేచించుకుని కదిలే సమయం ఎప్పుడొస్తుంది?
కలసి పాడే గళం కోసం మనందరం ఎదురు చూద్దాం.
దీనిని కొందరు అచారిత్రిక ఆశావాదంగా భావించవచ్చు. దొస్టోవిస్కీ కాలపు నిరాశ కొనసాగుతున్న కాలంలోనే నిహిలిస్టులు, డిసెంబరిస్టులు ఉనికిలో ఉన్న సందర్భం మరిచిపోరాదు. పారిస్ కమ్యూన్ విఫలం అయినంత మాత్రాన ప్రత్యామ్నాయ ఆలోచనలు ఆగిపోలేదు. మెరుగైన, అర్ధవంతమైన జీవనం కోసం మానవాళి ప్రయత్నాలు చేస్తూనే వుంది. మంచిని , మానవతను ఎత్తిపట్టే తన ప్రయత్నాలను ఏనాడూ ఆపలేదు. రష్యన్ సమాజం నరోడ్నిక్కులుగా, మెన్షివిక్కులుగా, బోల్షివిక్కులుగా తన ఆలోచనను ఆచరణను మెరుగు పరుచుకొని ఉన్నతరూపంలోకి ఎదిగింది. హిట్లర్ రూపంలోని ఫాసిజాన్ని ఎదుర్కోడానికి శిరచ్చేదనలకు, బలిదానాలకు, రక్తతర్పణకు సిద్ధపడింది. మన సంభాషణ మొదట్లో చెప్పుకున్న రష్యన్ సాహిత్యం ఆ మహోన్నత పోరాటాన్ని, సాహసాన్ని మన కళ్ళకు చూపింది. ఒకచోట విఫలమైతే పోరాటం ఆగిపోలేదు. మరోచోట ప్రయోగంగా కొనసాగుతూనే వుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ‘సకల పీడనల నుంచి విముక్తి ‘లక్ష్యంగా అన్ని దేశాలలో యిప్పటి ఉద్యమాలు నడుస్తున్నాయని నా విశ్వాసం.
యిది మానవ చరిత్ర నాకిచ్చిన నమ్మకం.
* * * *
ఇంత అద్భుతమైన నవల ఇన్నేళ్లూ తెలుగులో రాక పోవడం విచారకరం, ఇప్పటికైనా వెలుగు చూస్తున్నందుకు సంతోషంగా ఉంది ఈ మానవ మనస్తత్వ ఘర్షణామయ వేదనా ప్రపంచంలోకి మిమ్మల్నీ ఆహ్వానిస్తున్నా, పుస్తకం అంతా చదివి మూసేసిన తర్వాత దానిప్రభావం మీ మీద తప్పక ఉంటుంది.