Art and literature are collective obsessions and controlled schizophrenia. ఈ వాక్యం నన్ను ఆకట్టుకుంది. కానీ ఎవరన్నారో నాకు గుర్తులేదు. భావనలు పదిలం, వ్యక్తులు అపదిలం.
*
నా ఈ నాలుగు మాటలు ఈ పది కథలూ చదివాకే చదవండి. అప్పటికి కూడా మీ కుతూహలం ఆవిరికాకపోయివుంటేనే. ఎందుకంటే నా అనుభవంలో ముందు మాటలు చాలా మటుకు రాంగ్ గూగుల్ పిన్ లాంటివి. అవన్నీ ఇంకెక్కడికో చేరుస్తాయి మనల్ని. ఇక అక్కడ తచ్చాడడమే తదుపరి.
*
ఇది పది కథల గుచ్ఛం. ‘ఇతడు కథని భలే చందంగా చెప్తాడు.’ ఇందులో కొన్నే ముందు రాసినవీ, వెలుగు చూసినవీ. ఈ పుస్తకం కోసమే తక్కిన కథలు రాసానన్నాడు మహి బెజవాడ. ఈ పుస్తకం అలా చాలామటుకు తాజా.
*
ఈ కథలల్లో మహి బెజవాడ సృష్టించిన పాత్రలను పరిచయం చేస్తాను. ఊదారంగు, జోళ్ళు, సెలయేరు, ముగ్గు, జన్నత్, నారింజ రంగు, ఓల్డ్ స్మగ్లర్ బాటిల్ పైని గుబురు గడ్డం వాడు, బులుగు రంగు చేతిగుడ్డ, ప్రవాహం-ఒడ్డు, జీనత్ అమన్, మనోరంజని పూలవనం, బర్కిలీ సిగరెట్టు పెట్టె, చవక చెట్లు… ఇవన్నీ ఔచిత్యాలు, ఆయా కథల్లో కీలకాంకాన్ని నిభాయించే ప్రతీక ఆత్మలు. పాత్రలు.
మార్క్, బాబు, వెంకటేశ్వర్రావ్, జగతి, మైక్, జార్జ్, రీనా, మేఘా, భూమి, మిత్ర, లీలా శాంసన్, జే, జోసెఫ్, రాబిన్సన్, సిరిల్, మీరా, బ్లాండీ, కెప్టెన్ సనా, రంగ, క్రిష్ణారెడ్డి, కుమారి, శామ్, సారా, జె.పి. రెడ్డి, మీవ, రాజగోపాల్, రంగసాని, జాన్ బాబు, జీవా మామ, సుందర్రావు… ఎవరు వీళ్ళంతా? ఎక్కడుంటారు? అసలు వుండే వుంటారా? తెలియదు. నిజమే మనకు చాలా తెలియదు. కాదు తెలుసుకోం. కాదు పట్టదు. కాదు పట్టించుకోం. కాదు ఎక్కదు. కాదు ఎక్కించుకోం. కాదు మనకు ఏదీ తగలదు. కాదు మనమే ఏదీ తగిలించుకోం, విదులించుకుంటూ పోతుంటాం. వీళ్ళందరినీ మనం చూసే వుంటాం, కలిసే వుంటాం. మాట్లాడే వుంటాం. కరచాలించే వుంటాం. కానీ వీళ్ళంతా ఆగంతకులే, ఆవలి తీరాలే. అపరిచయస్తులే. వీళ్ళంతా మన అధో మనో ఆకారాలు, వికారాలు, సాకారాలు. అందుకే – The only person with whom you have to compare yourself is you in the past – అంటాడు సిగ్మండ్ ఫ్రాయిడ్.
ఈ కథల్లో మిస్సింగ్, బైపోలార్, గిల్ట్, రిజెక్టెడ్, డిజిల్యూజన్డ్, ఫెటిష్… లాంటి డీప్ అండ్ డార్క్ బిహేవియరల్ ప్యాటర్న్స్ రికరింగ్‍గా, రీఇటరేటింగ్‍గా వున్నాయి, తగులుతాయి. Haunted House లాగా ఇది ఒక అనివార్య Haunting story bouquet. గన్స్ అండ్ మాన్సూన్స్ అనే కథలో మహీ అన్నట్టు Haunted is hunted. అయితే ఏవి మనల్ని Haunt చేస్తున్నాయి? మనకు దక్కనివి, మనం వొంపేసుకున్నవి, మనం చేరనివి, చేరుకోలేనివి, మనం అకారణంగా కోల్పోయినవి, మనం ద్రోహగీతి రచించి మొహం చాటేసినవి, మనం ఆదర్శాలుగా ప్రదర్శనకి షెల్ఫుల్లో పేర్చుకున్నవి, మన రోజూవారీ రాజీలో రహస్యంగా కూలగొట్టుకుంటున్నవీ, మనం నిలబట్టుకోలేనివి, మనం నిలకడగా నిలబడకుండా మన మనాలని బోనెక్కించేవి వెంటాడుతుంటాయి. ఇంకా ‘కాలి పేరుకుపోయిన కరపత్రాలూ, చెల్లాచెదురైన సముద్రాలూ, గోడల వెల్ల వెనుక మరుగైన నినాదాలూ, మచ్చిక కాని పెంపుడు కుక్కల్లాంటి పేర్చిన పుస్తకాలూ, మానని గాయాల్లాంటి పేలని యవ్వనాలూ… మరీ మరీ వెంటాడూతూనే వుంటాయి.’
ఇ
లా.
*
మహి కథకుడి కన్నా ముందు నాకు ఒక మంచి ఫోటోగ్రాఫర్‍గా పరిచయం. ఒక చక్కని చిత్రకారుడిగా తెలుసు. కావలి నుంచి అందరిలాగే హైదరాబాద్ చేరుకున్నాక తన జోలె నుంచి ఎందుకో కెమెరానీ, కుంచెనీ ఒంపేసుకున్నాడు. అయితేనేం అవన్నీ కథనంలో తమ పని తాము చేసుకుని పెనవేసుకున్నాయి ఈ సంకలనం నిండా. నేను ‘వార్త’లో(1995) పనికి కుదిరి, దినపత్రికల తాలూకు డిజైనింగ్ నేర్చుకునేప్పుడు నా మిత్ర గురువు కె. శ్రీనివాస్ ఒక మాట తరచూ అనేవాడు, ‘పేజీలకే కాదండి, లే అవుట్ వుండాల్సింది, మన రూపుకూ, చూపుకూ, బతుకుకు కూడా.’ గుచ్చుకుని, నిలిచి, దారి చూపి, దారి కాచిన వాక్యం ఇది. ఈ కథల్లో రూపులో, చూపులో, పాత్రల బతుకుల్లో, రచన రీతిలో ఆ లే అవుట్ పట్ల శ్రద్ధ, పటిమ మీరు బహుదా పలవరింతురు గాక!
*
‘నగరంలో నువ్వు వుండటం కాదు, నువ్వే నగరమై వుండాలి.’ ఇది మహి వాక్యం. ఇది కావలిలో మొదలై హైదరాబాదులో తయారీ అయిన అతని వాక్యం. ఈ సంకలనంలో చాలామటుకు ఈ తరహా వాక్య విన్యాసమే, వైశాల్యమే. మనం వుంటూనే నగరాన్ని చూడటం మానేసాం. రోడ్లు వెడల్పు అవుతూ, మనసులు ఇరుకు, కురచ అవుతూ వుంటూంటే. గూగుల్ మ్యాప్ వచ్చేసాక ఇక ల్యాండ్ మార్క్‌లు కూడా మన కళ్ళకు కనిపించడంలేదు. అంతా మాయం అవుతున్నా ఆ మాయా లీలని అస్సలు చూడకుండానే మిగిలిపోతున్నాం. ఇక ఆవిరయిపోయిన వాటి ఆనవాలు ఊసు ఎవరు? ఎలా? కైగట్టేది?
ఇ
లా
నే.
*
మనుషులు తమతమ నైజాల్లో చాలామటుకు అయితే సూర్యుళ్ళో, లేదా చంద్రుళ్ళో అయివుంటారు. ఎందుకంటే చంద్రుడి ఆవలి ముఖం ఎన్నటికీ తెలియదు, సూర్యుడి అంతర్ముఖం ఇప్పటికీ పట్టుబడలేదు. తెలియనితనంలోంచీ, ఈ పట్టుబడని తలంలోంచీ కల్పనకూ, సృజనకూ విశాలమైన చోటు అప్పటికే పురుడుపోసుకుని వుండి వుంటుంది. ఈ చోటులో శాస్త్రవేత్తలు వున్నంత తరచుగా రచయితలు మనలేరు. అయితే కొన్ని మినహాయింపులేమంటే చంద్రుడిపై మనిషి కాలుమోపక ముందే రచయితల కల్పన షురూ అవ్వడం. బహుశా ఈ చోటునే బాలగోపాల్ ఖాళీ అంటున్నాడేమో! ఆ ఖాళీని పూరించడమే సాహిత్యం చేసే కార్యం అన్నాడేమో అని అనిపిస్తుంటుంది. అయితే ఈ చోటు/ఖాళీ తాలూకు తెలివిడి లేకపోతే, దాన్ని దర్శించాలన్న/చేరాలన్న కుతూహలత కొరవడితే, ఇక అక్కడికి వెళ్ళే ప్రసక్తి వుండదు, ఆ ఖాళీ భర్తీ చేయడమనే మాటే తలెత్తదు.
Objective reality కి అదనపు కొనసాగింపుగా అల్లిబిల్లి ఉల్లిపొరలుగా ఇవాళ Augmented Reality, Virtual Reality లు digitally yours అని మనల్ని ఊరిస్తున్నాయి, ఊరడిస్తున్నాయి, ఉనికిస్తున్నాయి, ఉల్లాసిస్తున్నాయి. ఈ మూడింటికీ నామకరణం జరగక ముందే మానవ కల్పన వీటిని వేల ఏళ్ళుగా ఊహల్లో, అక్షరాలలో ఆవిష్కరించింది. మానవ ఊహకు భౌతిక వాస్తవికతకి ఆవల కల్పించుకోగల, కాల్పనించుకోగల శక్తి, సామర్థ్యం అంతర్భాగంగానే వుంటూ వచ్చింది అని చెప్పడానికే ఇదంతా. స్టాకర్ సినిమాలో తర్కవిస్కీ సృష్టించిన జోన్ ఈ కోవలోనిదే. మహి మనముందు పరుస్తున్న పాత్రల ప్రొజెక్టైల్ కూడా ఇలాంటి జోన్‍లోకి మనల్నిసకల సంకోచాలతో, వ్యాకోచాలతో తోడుకొనిపోతుంది. మనకు Augmented Reality, Virtual Reality లని రుచి చూపిస్తాయి ఈ కథలు.
*
అందరికీ బాల్యం సుమధుర జ్ఞాపక కదంబమే కానక్కర్లేదు. నిన్నూ, నీ లోపలినీ నిలువునా దహించివేసిన, ఖాళీ చేసిన మహా అనివార్య పరిణామం కావచ్చు నీ బాల్య జ్ఞాపకం. చాలా సార్లు హింస అంటే రక్తం చిమ్మడం కాదు. మౌనం మారణాయుధం కావడం. నిర్లక్ష్యం ఒక క్షిపణి కావడం. “నేను మా సొంతూరు చేరినప్పుడు, రేగిపళ్ళ చెట్లన్నీ కొట్టేసారు, నాకు తెలిసిన వాళ్ళే.” – అని రాసుకున్నాడు అబ్బాస్ కియారొస్తమి. ఇది కదా హింస నమోదు. ఈ పలచని పొర ఊదారంగు చినుకులు కథలో కురిసింది.
మనం ఓ వీకెండ్ మధ్యాహ్నం మన హాల్‌లో తాపీగా డోపమైన్ రష్ కోసం గలీజబర్దస్త్ చూస్తున్నవేళల్లో మన చేతిలో అమాంతం రాలిపడిపోవడానికి ‘మహోన్నత ఆదర్శ సమజీవనం’ మాగిన పండేమీ కాదుగా మరి. ఒకవేళ ఎంత పండినా అది అలా పడదు. అందుకు మనం జోళ్ళు తొడుక్కోవాలి. మన నుంచి, ఇంటి నుంచి, మన బజారు నుంచి బయలు దేరి ఒక్క సారి బయట సన్నగా మోగుతున్న సామూహిక ధిక్కార స్వరాల బృందగానంలో గొంతు కలిపేందుకూ మనం ఇప్పుడిక జోళ్ళు తొడుక్కోక తప్పదుగాక తప్పదు. ఎందుకంటే ‘జీవితం సలీసుగా తనంతకదే మారదు; దాన్ని మార్చుకోవాల్సింది అంతిమంగా మనమే.’
అట్లాగే మనకోసం మరెవ్వరూ రెక్కలు కొనుక్కోరు, వాటిని మనకు కానుక పరచరు. మనమే కనుక్కుని మరీ తొడుక్కుని తీరాలి. చాలా సార్లు పెద్ద చిక్కల్లా రెక్కలతోనే. దిక్కులు తెలియక విప్పిన రెక్క చేరేది no man’s land కి. ‘బాధేం కొత్తది కాదే మాకు, అది వందల సార్లే పొడిచిన బాకు’ అనేసుకునే స్టోవోయిసిజంలో కూడా ఆశనీ, వెలుగునీ చూడగల జల్లెడ మనకు మన జీవిత ప్రస్థానాలే ప్రసాదించాలి. Then, perhaps, you have a keen ear for the song of a dead man that is playing in the corner.
సామాజిక శాస్త్రాలన్నింటిలోకీ చాలా సులువుగా, అంతే అలవోకగా ట్యాంపరింగ్‍కి గురయ్యేది చరిత్ర. నారింజ రంగు సిరా మరకలు కథ ట్యాంపర్ అయిన చిరకాలపు చిలకపలుకుల, చిలువలపలువల చరిత్ర రచన మీద flash fictional commentary. ఈ కథ protest literature లో చేరే భాగం.
ఈ నేలపైన శాంతి జెండాని ఎగరేయాలి? ఎలా? అందుకు, ముందు తరం ఆగిన చోట ఈ తరం మొదలు కాగలగాలి. కానీ, ఎలా సాధ్యం అవుతుంది? మనుషులకు చొరవ, పూనిక, జోక్యం, సహానుభూతి, ఆత్మాభిమానం ఏ విశ్వవిద్యాలయాలూ నేర్పవు కదా? అయినా శాంతి జెండా ఎగిరే తీరుతుంది అంటున్నాడు మహి. నేను నా నూనూగు మీసాల నూత్న యవ్వనం తలచుకుని అతనితో చేతులు కలుపుతున్నాను. శాంతి సముద్రం లాంటిది. పోరాటం నది లాంటిది. అన్ని ప్రవాహాలు సాగేది, చేరేది, లీనమయ్యేది సముద్రంలోనే. అయితే ఎలాంటి శాంతి నేను అంటున్నది? కళ్ళు పూరాగా, ముక్కు అరకొరగా మూసుకుని ధ్యాసగా ధ్యానం చేసుకుంటూ పొందే శాంతి కాదు. అసమానతలు, దోపిడి, వివక్షల అంతం కోసం జరిగే యుద్ధాల తరువాత అనివార్యంగా చేకూరే శాంతి గురించి. గన్స్ అండ్ మాన్సూన్స్లో మహి ఆ సహజాత రుతువునే ఆశిస్తున్నాడు.
భూమి ICU లోనే వుంది, అని మెమొరీస్ ఇన్ మోనోలాగ్ కథ మొదలవుతుంది. ఒళ్ళు గగుర్పొడిచింది. మై డియర్ డేవిడ్ అటెన్ బరో BBC కోసం చేసిన EARTH అనే డాక్యుమెంటరీ సీరిస్‍లో అన్న మాటలు ఇవే అచ్చంగా. ‘భూమి ఇప్పుడు ICU లో వుంది.’ అయితే, మహి కథలో భూమి ఒక అమ్మాయి, సైకాలజిస్ట్, సూసైడ్ అనే నేరానికి పాల్పడిన యువతి. అటెన్ బరో భూమికి, మహీ భూమికి ఏ సంబంధమూ లేదు. కానీ, నిజంగా లేదా? అని నిలదీస్తే నిరుత్తరులం అయిపోతాం. ఒక వాక్యంతో సమాంతరంగా వేర్వేరు భావాలను, అర్థాలను డ్రా చేయడం కేవలం నేర్పు మాత్రమే కాదు, ఎరుక కూడా. అయితే ఈ కథలో కూతురికి తన గతంలోని మిస్ ఫైర్ అయి, మూవ్ ఆన్ అయిన తన ప్రేమ కథని చెప్తాడే కానీ, కూతురి ప్రేమని అక్కున చేర్చుకోలేని conventional parenting తాలూకు counselling లోనే మిగిలిపోతాడు ఆ తండ్రి. అక్కడే భూమి తరానికి చిక్కు.
మనిషి తన అంతరంగ చదరంగంలో ఎత్తు వేసి చిత్తు చేసేదీ, నెగ్గేదీ తననే. నిజానికి అక్కడ పావు కూడా తనే. మెదడు చేసే పాత్ర నిర్వహణ అది. అందుకే నువ్వు ఒక్కటి కాదు. అనేకం. అమ్మకు ఒకలా, అక్కకు ఇంకోలా, భార్యకు ఒకలా, నేస్తుకు ఒకలా కనిపిస్తావు, అర్థం అవుతావు. కానీ, ఆ నిర్వహణ నీకు ముందే తెలుసు. రచయితకి ఈ పాత్ర నిర్వహణ ఇంత సహజాతంగా అలవడినప్పుడే విభజన రేఖలు విచ్చుకుంటాయి, ఆవిరీ అవుతాయి. ఎకోస్ ఆఫ్ మెలాంఖలిలో మీరా పాత్రను మహి మలిచిన తీరు ఒక ముచ్చట.
నీ ప్రమేయం లేకుండా జీవితం నీ చుట్టూ ఎన్నో సాలెగూళ్ళు అల్లే వుంటుంది. వైకుంఠపాళీలు రచించే వుంటుంది. ఇవేవీ లేకుండా, ఇవేవీ కాకుండా స్వచ్ఛమైన నీ నువ్వు అనేదంటూ ఒకటి వుంటుందా? వుంటే అక్కడికి చేరుకునేందుకు ఏ దూరాలను తగ్గించాలి? ఏ దగ్గరలను ఇరు తీరాలే కనిపించనంతగా సాగదీయాలి? కాగజ్ కె ఫూల్లో శామ్ దగ్గర బహుశా సమాధానం వుండే వుంటుంది.
ఈ సంకలనంలో మాండిలికంలో నడిచే కథలు రంగసాని, సుందర్రావు మరణాలు.
తుమ్ చలే జావోంగెతో సోచేంగే… హమ్ నే క్యా ఖోయా, హమ్ నే క్యా పాయా… నిజమే ఇష్టులు వెళ్ళిపోయాక ఆ ఖాళీ మనల్ని నిప్పు నీడయి వెంటాడుతుంది. ఇవ్వడం వల్ల పగిలిన గాజుకు అతుకు పడే అవకాశమే వుందంటే మనల్ని మనమే నిలువునా కోల్పోయేంత ఇవ్వడానికి సిద్ధం అవుతామా? అనే ప్రశ్న అడిగిన నవ్య నాటకమే రంగసాని.
సుందర్రావుదీ, కంజి వతనబెది (అకిరా కురొసావా తీసిన ఇకిరు సినిమాలో) ఒకే జీవితం కాదు, కానీ, ఒక్కలాంటి మరణమే. బతికి వున్న కాలంలో ఎన్ని సార్లు చనిపోతామో తెలిసిపోతుంటుంది మనకు, కానీ చనిపోయిన తర్వాత ఎన్ని సార్లు చంపబడతామో ఎవరికయినా ఎలా తెలుస్తుంది?సుందర్రావు మరణాలు కథ ఇదే.
ఈ కథల్లో LTTE, చరిత్ర రచన, నక్సలిజం, దళిత చైతన్య ఉద్యమం లాంటి సామాజిక ఇతివృత్తాలపై తన కామెంటరీని బేలగా కాకుండా చాలా సహానుభూతిగా నిలిపాడు. అయితే, మహి చేసిన అటెంప్ట్‌లో ఎలాంటి నిజాయితీ లోపం లేదు. కానీ ఇవి కామెంటరీలకు లొంగే ఇతివృత్తాలు కావు, లోతు కోరుకునేవి. అట్లానే ఇందులోని చాలా కథలు ఉగ్గపట్టుకున్న నవలికలు, నవలలు. ఇంకొన్నిమాత్రం నిశితమైన ఎడిటింగ్ కోరుకుంటున్నాయి.
మన దేహం, మెదడు అనే మరో సంక్లిష్ట అవయవం జమిలిగా చేసే కార్యకలాపాలలోంచి, ఆ ఉత్పత్తిలోంచి అదనపు విలువుగా మైండ్ (మనసు) అనే రిజర్వాయర్ మెరిసిందేమో అని నేను అనుకుంటాను. అందుకే – The mind is like an iceberg, it floats with one-seventh of its bulk above water- అని అన్నాడేమో సిగ్మండ్ ఫ్రాయిడ్.
ఈ కథల్లో మహి మీద సినిమా ప్రభావం ప్రస్తావించదగ్గది మాత్రమే కాదు, చర్చించి, పరిశోధించదగ్గది కూడా. మీకు అమృత, Into The Wild, Twice Born, Edge of Heaven, The Beautiful Mind, Ikiru, లాంటి సినిమాలు, అందులోని దృశ్య మాలికలు గుర్తుకు వస్తాయి ఈ పేజీలు తిప్పుతుంటే.
At the end, we all become stories, అని Margaret Atwood అనేసింది. కానీ, it is the beginning that marks the crucial start of the journey and only those who pursue it will have the chance to write it down- అనుకుంటాను నేను. మహి కుతూహలంలో ఇది అమరింది, పైగా ఈ పది కథల్లో తనికి ఇది అబ్బింది. చదివినానంతరం నాకూ అనిపించింది. ఇలాంటి అచ్చమైన కథలు మానవ ఊహలకు నమోదులు, మనిషి సృజనకు రశీదులు.
ఇ
లా
గే.
– అనంతు చింతలపల్లి
కార్తీకం, షేక్ పేట, 2024
మహీ కథలు ఒక సర్రిలియజంలో ముంచి తేలిస్తే, నీ ఈ ముందుమాట మరొక ఎత్తు!
బై ది వే నువ్వు కోట్ చేసిన మొదటి వాక్యం,”Art and literature are collective obsessions and controlled schizophrenia” ని is attributed to Susan Sontag. Her view on the nature of artistic and literary expression suggests that these forms are driven by a shared, intense focus that can border on madness, yet are structured and managed within societal norms.