దృక్పథం

Spread the love

‘అమ్మా, నీకో అద్భుతమైన వ్యక్తి గురించి చెప్పాలి’ తల్లి కళ్ళలోకి చూస్తూ వికాస్ 

‘నిజమా? ఎవరు? ఎక్కడ చూశావ్?’  కొడుకుని ఆశ్చర్యంగా చూస్తూ తల్లి అనసూయ. 

‘ఆ వ్యక్తికి ఇప్పుడు 83 ఏళ్ళు.  

కానీ అతని పోకడ చూస్తే 38 ఏళ్ల వాడిలా ఉంటుంది. అతని జీవితం చాలా విలక్షణంగా ఉంటుంది.  ప్రపంచాన్ని అతను చూసే దృష్టి భిన్నంగా ఉంటుంది. జీవన లక్ష్యం అతనికి తెలుసమ్మా .. 

చూడడానికి సాధారణంగా కనిపిస్తాడు కానిఅసామాన్యమైన జీవన విధానం అది. 

నిత్య చైతన్య శైలి జీవన శైలి చూస్తుంటే అబ్బురంగా ఉంటుంది.  అసలతను అంతటి శక్తి ఎక్కడి నుంచి వస్తుందో.. ” 

‘ఈ వయసులోనూ బంధు మిత్రులతో సంబంధ బాంధవ్యాలు చక్కగా నెరపుతూ అందరితో సరదాగా సౌమ్యంగా ఉంటాడు. ప్రపంచమంతా తనదే అనుకుంటాడు. ఎప్పుడు ఎక్కడికి పోవాలనుకుంటే అక్కడికి పోతుంటాడు. ‘

‘ఏంటీ ఆ వయసులో కూడా ..’

‘అవునమ్మా,  అతని సాహసాలు చూస్తే అందరికీ ఆశ్చర్యమే.  

ఇంకో విషయం ఏంటంటే అతను వాస్క్యులార్ డిమెన్షియా పేషెంట్.’ 

‘అంటే ?’

‘ అది చికిత్సకు లొంగని ఒక వ్యాధి. మెదడు వెళ్లే రక్తప్రసారం తగ్గటం వల్ల మెదడు దెబ్బతిని జ్ఞాపక శక్తి తగ్గుతుంది, ఏకాగ్రత ఉండదు. గందరగోళం, ఆందోళన ఉంటుంది. నిర్ణయాలు,  ఆలోచన చేయడంలో సమస్యలు, సమస్య పరిష్కరించలేక పోవడం వంటివి చాలా లక్షణాలు ఉంటాయి. 

పదిహేనేళ్ల క్రితమే అతన్ని వాస్కులర్ డిమెన్షియా వరించింది. అయినా నేను వందేళ్లు బతుకుతా అని ఎంత ధీమాగా చెబుతాడో తెలుసా?’

‘ఆశ్చర్యంగా ఉంది. చికిత్సకి లొంగని వ్యాధి అని తెలిసీ అంత నమ్మకంగా ఎలా చెబుతున్నాడు? అతనిది ఆత్మవిశ్వాసమా? అహంకారమా? ‘ 

‘అది తెలియాలంటే నీకు అతని గురించి తెలియాలి’

అయితే చెప్పు మరి 

***                      ***

సూరజ్ కి అమ్మ నాన్న పెట్టిన పేరు సూరయ్య. చిన్నతనం అంతా సూరయ్య గానే చెలామణీ అయ్యాడు. 

సూరయ్య పుట్టి పెరిగింది భైంసా దగ్గరలోని మారుమూల గ్రామం. తండ్రి నిరుపేద రైతు.  పంటలు పండక అప్పులపాలయ్యాడు. 

నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన సూరయ్య కి బాగా చదువుకోవాలని కోరిక. నాలుగు మైళ్ళు నడిచిపోయి 7వ తరగతి వరకు చదివాడు. హై స్కూల్ చదువుకు సమీపంలోని భైంసా వెళ్లాలని ఆశపడ్డాడు. 

కానీ వాళ్ళ నాన్న అతని చదువు కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేనన్నాడు. చదువు మాన్పించి తనతో పాటు పొలానికి తీసికెళ్ళి పనులు చేయించాడు.  చేసేదిలేక సూరయ్య వాళ్ళ నాన్నతో పాటు పొలంలో పార పని చేసేవాడు. గడ్డి కోసేవాడు. తర్వాత తర్వాత అరక దున్నడం, దమ్ము చేయడం నేర్చుకున్నాడు. 

తన పొలంలో పనిచేసే ఎద్దుల జత కి తనకు పెద్ద తేడా లేదని వాపోయేవాడు.  

ఏ పని చేస్తున్నా అతనికి చదువు మీద మమకారం పోలేదు. చదువుకోవాలనే తపన రోజురోజుకు మరింత పెరిగి అతన్ని నిలువనీయడం లేదు. 

తల్లిదండ్రులు కుటుంబ పరిస్థితి ఓ వైపు చదువుకోవాలన్న అభిలాష మరో వైపు ఆ పసి హృదయాన్ని నరక యాతన పెట్టాయి.  

చివరికి ఓ రోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కట్టుబట్టలతో ఇల్లు వదిలాడు. 

మూడు రోజులు తిప్పలు పడి ఎలాగైతేనేం హైదరాబాద్ మహానగరంలో అడుగు పెట్టాడు.  భాష, యాస కొత్తగా ఉన్నాయి.  వాతావరణం చల్లగా ఉంది.  పట్నం కొత్త. పట్టణ ప్రజలు కొత్త. పట్నం పనులు కొత్త. తిండి కొత్త. ఇదంతా అతనికి కొత్త అనుభవం. ఇలా ఉంటుందని కూడా అతను ఎప్పుడు వినలేదు. ఊహించలేదు. 

మొదట ఒక గ్యారేజ్ లో పనికి కుదిరాడు. అక్కడే రాత్రుళ్ళు పడుకునేవాడు. స్నేహితులకు, ప్రేమించే  తల్లిదండ్రులకు, అభిమానించే ఆత్మీయత పంచే అక్కలకు దూరంగా ఉండడం దుర్భరంగా తోచేదతనికి.  ఇంటికి తిరిగి పోవాలని మనసు పీకేది. మళ్ళీ అంతలోనే మనసును కట్టుదిట్టం చేసుకుని కొన్ని కావాలంటే కొన్ని వదులుకోక తప్పదని తనకు తాను నచ్చచెప్పుకునేవాడు. 

చేస్తున్న పని వదిలి ప్రింటింగ్ ప్రెస్ లో పుస్తకాల బైండింగ్ పనిలో చేరాడు. చాలా పుస్తకాలు చదివాడు. ఆ పని చేస్తున్నప్పుడు ఎందరినో కలిశాడు. కొత్త జీవితం అతనికి చాలా ఉత్సాహంతో పాటు కొత్త ఆలోచనలు ఇచ్చింది. జీవితాన్ని కొత్తగా చూడటం నేర్పింది. 

కాలం సూరయ్య జీవితాన్ని మార్చేసింది. సూరజ్ గా కొత్త అవతారం ఎత్తాడు. 

ఆ ప్రెస్ యజమాని సహకారంతో అక్కడ పనిచేస్తూనే 10 వ తరగతి పరీక్షలు రాశాడు. ఆ తర్వాత ఓపెన్ డిగ్రీ చదివాడు. ఈవెనింగ్ కాలేజీలో చేరి లా చదివాడు. చదువు దాహం తీరడం లేదు. 

రకరకాల పుస్తకాలు చదవడం తో పాటు దేశమంతా తిరిగాడు. రకరకాల పనులు చేశాడు. ఎక్కడ పనిచేసిన చాలా నమ్మకంగా పని చేసాడు. కొంత సొమ్ము   జమ చేసుకోవడం కొత్త ప్రదేశాలకు వెళ్లి రావడం అతని జీవితంలో భాగమైంది. మనుషుల స్వభావాలను, ప్రపంచ రీతిని అర్ధం చేసుకున్నాడు. 

నిరంతర యాత్రికుడే కాదు నిరంతర చదువరి అయిన సూరజ్ ఎప్పుడు డబ్బు గురించి ఆలోచించలేదు. సంపాదించడం దేశదిమ్మరి లా తిరగడం అతని జీవన విధానంగా మారింది. 

తనకు నచ్చని విషయాలు ఎవరు మాట్లాడిన పట్టించుకునే వాడు.  ఎవరేం చెప్పినా చిరునవ్వుతో వినేవాడు.  మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తించేవాడు. 

నలభై ఏళ్ళకు దగ్గర పడుతున్న సమయంలో తన కుటుంబాన్ని చూడాలనిపించింది. వెతుక్కుంటూ ఇంటికి తిరిగి వచ్చాడు. 

కొడుకు కోసం ఎదురు చూసి చూసి అలసిన తల్లిదండ్రులు కాలగర్భంలో కలిసిపోయారని దిగులు పడ్డాడు.  తన ఎదుగుదలను చూసి ఎంతో సంతోషించిన పెద్ద అక్క తండ్రి అప్పగించిన రెండున్నర ఎకరాలు తమ్ముడికి అప్పగించి తన బాధ్యత తీర్చుకుంది. 

వ్యవసాయం మొదలు పెట్టాడు. అక్కలు చూపిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పట్నంలో అధునాతనమైన జీవితం గడపాలనే కోరిక గల భార్యతో  వివాహ జీవితం మధురానుభూతి నివ్వలేదు.  ఆమె తన కలల ప్రపంచం ఇది కాదని కొత్త జీవితం వెతుక్కుంది. పిల్లాజెల్లా బంధాలు లేవు. 

తన కాళ్లకు చుట్టుకుని అడ్డుపడే బంధాలు, బంధాల బలహీనతలు లేవు. సోలో లైఫ్ ఈస్ సో బెటర్ అనుకున్నాడు. ఈ జీవితం తనకు ఓ లగ్జరీ గా భావించాడు. 

కారులో దేశమంతా తిరిగి రావాలనే ఒకప్పటి కల నెరవేర్చుకోవాలని అనుకున్నాడు. కారు కొనడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. కొద్దిగా భూమి అమ్మాడు.  వచ్చిన సొమ్ముతో సెకండ్ హ్యాండ్ అంబాసిడర్ కారు కొన్నాడు. దాన్ని తన ప్రయాణానికి అనువుగా మలుచుకున్నాడు.  కార్లు సామాన్యుడికి అందుబాటులో లేని సమయంలో సూరజ్ కారులో దేశాటన చేస్తాననడం ఆ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద వార్తయింది.  

దాదాపు ఏడాదిపాటు దేశాటన చేసి సూరజ్ ఇంటికి చేరడం స్థానిక పత్రికల్లో వార్త అయింది. నీకు తోడు మేమున్నామంటూ వచ్చిన మోకాళ్ళ నొప్పులను మరిపించింది ఆ ఉత్సాహం.  

మనసు మళ్ళీ ప్రయాణానికి సిద్ధం కమ్మని పోరుపెడుతున్నప్పటికీ ఇంటి దగ్గర కొంత కాలం విశ్రాంతి తీసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో అతనికి ఇతరుల సహాయం కొంత అవసరమైంది. కానీ, సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు. తన పనులు తాను తప్పనిసరిగా చేసుకోవాల్సిన స్థితి. 

భార్య ఉండి  ఉంటే అన్ని అందించి సేవలు చేసేది, మళ్ళీ పెళ్లి చేసుకొమ్మని అక్కలు, మిత్రులు సలహా ఇచ్చారు. 

భార్య అంటే సేవకురాలు కాదు, జీవితాంతం వెన్నంటి ఉండే తోడు.  తాడు బొంగరం లేకుండా తిరిగే నాకు తోడుగా ఎవరూ ఉండలేరు. అలాగే నేను ఎవరికీ తోడు కాలేను. నేను ఎంచుకున్న జీవితంలో నన్నిలా నన్నుగా బతకనీయండి అని స్పష్టం చేయడంతో తోబుట్టువులు ఎవరూ అతన్ని పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి చేయలేదు. తన తిప్పలేవో తానే పడతాడని వదిలేశారు. 

రాను రాను అతనిలో మార్పు వస్తున్నది. తెలిసిన వాళ్ళ పేర్లు మర్చిపోతున్నాడు. వాళ్ళు పలకరిస్తే వాళ్ళని ఎక్కడ చూశాడో ఎప్పుడు చూశాడో ఏమీ గుర్తు రావడం లేదు. వయసు పెరుగుతుంటే వచ్చిన సమస్య అని పట్టించుకోలేదు.  

తాను తిరిగిన ప్రదేశాల గురించి రాయాలనుకున్నప్పుడు తెలిసింది చాలా విషయాలు అతని మదిలోంచి చెరిగిపోయాయని, 

అలా ఎలా చెరిగి పోయాయో అర్థం కాలేదతనికి. భాషలో కూడా మార్పులు వచ్చాయి. ఏకాగ్రత తగ్గిపోయింది.  పదాల కోసం తడుముకోవడం, ఒక పదం బదులు మరో పదం వాడటం జరుగుతున్నది. రోజూ చేసే ఇంటి పనులు, వంట చేసే క్రమం మరచిపోతున్నాడు. జీవితం పరిమితమైపోతున్నది. అది అర్ధమైన మరుక్షణం పట్నం వెళ్లి డాక్టర్ ని కలిశాడు. 

ఆ డాక్టర్ చేసిన చికిత్స వల్ల ఏమాత్రం మార్పు లేదు. మరో వైద్యుడిని కలిశాడు. ఈ లోగా మరికొంత కాలం కరిగిపోయింది. 

రెండో వైద్యుడు  రకరకాల పరీక్షలు చేసి చివరికి వాస్క్యులార్ డిమెన్షియా అని తేల్చారు.  వ్యాధి గురించి ఇంతకు ముందు ఎప్పుడు వినలేదు.  వ్యాధి లక్షణాలు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాడు. నిరాశలో కూరుకుపోయాడు.  కానీ అది అతి కొద్ది కాలమే. తర్వాత తాను డిమెన్షియా పేషెంట్ అన్న ఆలోచనే దగ్గరికి రానివ్వలేదు. 

జీవితాన్ని తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో భాగంగా పొగ పీల్చే అలవాటు వదిలేశాడు. గతంలో లాగా ఏది పడితే అది తినకుండా పద్ధతి ప్రకారం పోషకాహారం తీసుకుంటూ, శారీరక వ్యాయామం, ప్రాణాయామం ఆరంభించాడు. 

తనను తాను తిరిగి కనుగొనే ప్రయత్నం మొదలుపెట్టాడు. 

మర్చిపోయిన వాటిని మళ్ళీ మదిలోకి తెచ్చుకోలేనా, నేను గుర్తు తెచ్చుకోగలను అని తనకు తానే మళ్ళీ మళ్ళీ చెప్పుకునేవాడు. వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు  ప్రేరణ ఇచ్చుకుంటూ మానసికంగా దృఢంగా మారుతున్న అతని మనసు శరీరం క్రమంగా అతను అనుకున్న విధంగా స్పందించడం మొదలైంది. మోడువారిన చెట్టు చిగురించగానే రకరకాల పక్షులు, జీవులు తిరిగి వచ్చినట్లుగానే తన నుంచి వెళ్లిపోయిన ఒక్కొక్క విషయం తిరిగి వచ్చాయనుకున్నాడు. అది అతనికి ఉత్సాహాన్నిచ్చింది. జీవించగలనని నమ్మకాన్ని ఇచ్చింది. లేకపోతే కుంగిపోయే వాడేమో! 

వాస్కులర్ డిమెన్షియా అతన్ని వదలలేదు.  కాలచక్రాన్ని వెనక్కి తిప్పేసి డిమెన్షియా ని పూర్తిగా తరిమేయలేడని సూరజ్ కి తెలుసు. 

‘కాలంతో పాటు సాగుతూ, పరిస్థితుల్ని అడాప్ట్ చేసుకుంటూనే నా జీవితాన్ని నేనే నిర్ణయించుకోవాలి. డిమెన్షియాకి నేను లొంగకూడదు. వందేళ్లు బతకాలనే కోరిక నెరవేర్చుకోవాలి. బతుకుతా.. నేను వందేళ్లు బతుకుతా’ అని తనకు తాను బలంగా చెప్పుకున్నాడు. పదే పదే చెప్పుకున్నాడు. 

అందుకు అనుగుణంగా ఆహారంలో ఇంకా మార్పు చేసుకున్నాడు. మెదడు రక్తనాళాల ఆరోగ్యాన్ని పెంచే ఆహార పదార్ధాలపై దృష్టి పెట్టాడు. 

ఒక క్రమబద్ధమైన జీవితం తో పాటు వ్యాయామం అతని జీవితంలో భాగమైంది. 

ఇప్పుడు అతని జేబులో ఒక చిన్న చేతి పుస్తకం ఉంచుకోవటం అలవాటుగా మారింది.  ప్రతి రోజు తాను ఏమి చేయాలో రాసి పెట్టుకునేవాడు. ప్రతి రాత్రి పడుకోబోయే ముందు తాను చేసిన పనులు చూసుకుని విజయవంతంగా పూర్తి చేశాను అనుకునేవాడు. ఏదైనా మర్చిపోతే అరే, ఈ పని మర్చిపోయానే అనుకునే అని మరుసటి రోజు చేయాల్సిన పనుల జాబితాలో చేర్చేవాడు.  అయినా కొన్నిసార్లు మరపు అతన్ని వదలడం లేదు. అయినా తన నమ్మకాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు. 

బంధాలేవీ లేకపోవడం కూడా అతన్ని మరింత గట్టిబరచిందో లేక దేశదిమ్మరి అనుభవాలు శక్తివంతంగా మలిచాయో?! కానీ,  ఒంటరిగానే ఉన్నప్పటికీ తాను ఒంటరిని అని ఎప్పుడూ బాధపడలేదు. బెంగపడలేదు.  తనకు తాను ఇచ్చే ధైర్యాన్ని మరెవరూ ఇవ్వలేరని అతని నమ్మకం. 

డిమెన్షియా అని తెలిసినప్పటికీ అతనిలోని భ్రమణ కాంక్ష పోలేదు. సరికొత్త అనుభవాలు పోగేసుకోవాలనే ఆశ చావలేదు. కారు, పుస్తకాలు తీసుకుని మళ్ళీ బయలుదేరాడు.  

వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన వ్యక్తి , డిమెన్షియా బాధితుడైన బక్కపలుచని వ్యక్తి, ఒంటరిగా దేశాటన చేసి తిరిగి రాగలడని ఎవరు మాత్రం ఊహించగలరు.  సూరజ్ విషయంలోనూ అదే జరిగింది.   బంధు మిత్రులు అతను తిరిగి వస్తాడని ఊహించలేదు. 

డిమెన్షియా గతంలో కంటే ముందడుగు వేస్తున్నది.  తన పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నది. అవరోధాలు  పెంచుతూనే ఉంది. 

సూరజ్ డ్రైవింగ్ చేస్తుంటే కుడి ఎడమల గందరగోళం ఏర్పడుతున్నది. ఒకోసారి లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు అనిపించసాగింది.  ఇలాంటి పరిస్థితుల్లో వాహనం పక్కకు నిలిపి ఆగిపోతున్నాడు.

ఈ సారి అతని ప్రయాణం పల్లెలు, నగరాలు వదిలి ప్రకృతిలోకి సాగింది కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు లేవు. 

అడవులు, కొండలు కోనలు, ఆదివాసీల నుంచి చాలా తెలుసుకున్నాడు. న్యాయం వాళ్లకు ఎంత దూరంగా ఉందో అర్ధం చేసుకున్నాడు.  ఈ ప్రయాణంలో చిన్న చిన్న అవరోధాలు ఎదురైనా వెనుదిరగలేదు. నింగిని, నేలను, నీటిని కాపాడేది మనం కాదు ఆదివాసీలేనని నమ్మాడు.  లా చదివిన సూరజ్ నల్లకోటు వేసుకుని కోర్టులో ఎప్పుడు అడుగు పెట్ట లేదు. ఇప్పుడు  ఆదివాసీల వైపు నిలబడి పనిచేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. అప్పటికి అతని వయసు 75 ఏళ్ళు. 

అతని విషయం విని కొందరు కొట్టిపడేశారు. కొందరు మాత్రం సూరజ్ ఏది అనుకుంటే అది చేయగల సమర్ధుడు అని ప్రోత్సహించారు. 

సూరజ్ సంకల్పానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది అతని జబ్బు.  దాన్ని అధిగమించడానికి తనను తాను సాన పెట్టుకున్నాడు. కోర్టులో వాదించడం అతని శక్తికి మించిన పనిగా ఉంది. అకస్మాత్తుగా భాష పదాలు మాయమై పోతున్నాయి. అతన్ని గందరగోళ పరుస్తున్నాయి.  అది అతన్ని ఒత్తిడికి గురిచేస్తున్నది. 

కాలం తన పని తాను చేసుకుపోతున్నది.  కానీ సూరజ్ తాను అనుకున్న పని చేయలేకపోతున్నాడు. అది అతన్ని ఆందోళనకు గురిచేసింది.  వైద్య సలహాల మేరకు నల్లకోటు వేసుకోవడం మానేశాడు.  కానీ చతికల పడి బాధపడుతూ కూర్చోడం  అతని నైజం కాదు. మరో మార్గం ఎంచుకున్నాడు.  

సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు ఆనందించినట్లు వర్షాన్ని, అమావాస్య చీకటిని, ఆకాశంలో నక్షత్రాలు, పున్నమి చంద్రుని ఆనందించడం, ఆస్వాదించడం అలవాటైంది. మొక్కలు, జంతువులు, పక్షులు ప్రకృతి తో  స్నేహం మొదలైంది. 

ఇప్పుడతని చుట్టూ ఉండే మనుషులే కాదు పరిసరాలు, పక్షులు, జంతువులు, కొండలు గుట్టలు అన్ని అతని నేస్తాలే బంధువులే.  

ఉన్న కొద్దిపాటి భూమిలో లాభాపేక్ష లేని వ్యవసాయం పురుగుమందులు, రసాయన ఎరువులు లేని ప్రకృతి సహజమైన వ్యవసాయం ఇష్టమైన పని అయింది. 

మనకోసం తినడానికి ఎంతో ఇస్తున్న చెట్లు మొక్కలు  అంటే గౌరవం పెరిగింది. తల్లిదండ్రుల వంటి గాలి, నీరు కాపాడుకోవాలని తెలిసింది.  తనకు తెలిసిన విషయాలు నలుగురితో పంచుకోవాలని ఆరాటం పెరిగింది. దాగుడుమూతలు ఆడుతున్న పదాలతో అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూనే తనపని తాను చేసుకుపోతున్నాడు.  సరిగ్గా అదే సమయంలో వ్యవసాయంతో ప్రయోగాలు చేస్తున్న నేను సూరజ్ కి సహజ వ్యవసాయం పట్ల ఉన్న మమకారం తెలిసి అతని దగ్గరకు వెళ్ళాను. 

సూరజ్ న పొలంలో సృష్టించిన  అందమైన తోటలో కూరగాయలు, పండ్లు పండించాడు. బడి పిల్లల్ని సెలవుల్లో తన తోటకు తీసుకుపోయేవాడు. కూరగాయలు, పండ్లు బడి పిల్లలకు పంచేవాడు. 

ఏ పని చేసినా చాలా ఇష్టంగా చేసేవాడు. సంతోషంగా చేసేవాడు. ఎప్పుడు ఎక్కడైనా తను చేసే పని పట్ల ఎంతో సంతృప్తి అతనికి. చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా బడి పిల్లలు సూరజ్ తోటకు వచ్చి చూసేవారు. 

సూరజ్ దగ్గరకు వెళ్లడం నా దినచర్యలో భాగంగా మారిపోయింది. అతనితో పాటు బడి పిల్లలతో, గ్రామస్తులతో ప్రకృతి గురించి కలబోసుకోవడం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది.   

అతనితో పాటు గొప్ప గౌరవం, గుర్తింపు నాకూ లభిస్తున్నాయి. నిజానికి వాటిని అతను గానీ, నేను గానీ  కోరుకోలేదు.  కానీ అది అతనిపై అతనికి నమ్మకం, ఇంకేదో చేయాలన్న ప్రోద్భలం, ప్రోత్సాహం ఇస్తున్నాయి. జీవితేచ్ఛ పెంచుతున్నాయి.  నాకు కొత్త ఉత్సాహాన్ని, పని పట్ల ఇష్టాన్ని పెంచుతున్నాయి. 

తనకు డిమెన్షియా ఉందన్న విషయమే మర్చిపోయేవాడు.  మనం ఒక వయసుకు వచ్చే సరికి మన మెదడు మరో విధంగా పని చేయడం  మొదలుపెడుతుంది. కానీ నేను నా మెదడుని నా ఆధీనంలోకి తెచ్చుకుంటాను. నా చిత్తవైకల్యం నుంచి నన్ను నేను కాపాడుకుంటాను అని తనకు తాను పదే పదే చెప్పుకుంటూ మనోబలాన్ని పెంచుకున్నాడు. 

నేను తప్పకుండా గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకుంటాను అని నాకు నేను చెప్పుకున్నట్లయితే మన జ్ఞాపకాలు మళ్ళీ తిరిగి వస్తాయని అతని నమ్మకం. 

అతను సర్వ స్వతంత్రుడు. ఏ విషయంలో ఎవరి ఒత్తిడి లేదు. 

ఒంటరివాడు, అయ్యో పాపం అని ఎవరైనా ఆహారం పంపించినా తీసుకోడు. ఎవరి సహాయం అర్ధించడు. నన్ను నేను చూసుకోగలను. జీవితం ఎలా తీసుకువెళ్తే అలా వెళ్తాను అనుకుంటాడు. 

తన జీవిత అనుభవాలను, పర్యటనానుభవాలను రాయడం మొదలు పెట్టాడు.  రాయడానికి చేతులు సహకరించడం లేదు. 24 గంటలు తనతో ఉండే విధంగా ఒక సహాయకుడిని నియమించుకున్నాడు. గత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ చెబుతుంటే సహాయకుడు రాశాడు.  కొన్ని జ్ఞాపకం రాకపోయినా బాధపడలేదు. రాయడం ఆపలేదు. 

సూరజ్ కు భవిష్యత్ గురించి భయాలు లేవు, దిగుళ్ళు లేవు. నేను ప్రతిదీ చేయగలను. చేస్తాను అనుకుంటాడు. నేనున్నంత వరకు చురుకుగా ఉండాలి. ఇతరులకు సహాయం చేసే విధంగా జీవించాలి. ఉంటాను అని తనకు  తాను పదే పదే చెప్పుకుంటాడు. ప్రేరణ కలిగించుకుంటూ ఉంటాడు. 

చివరి శ్వాస వరకు తన పని తాను చేసుకోవాలని అనుకుంటాడు అతను. ఓపిక శక్తి ఉన్నప్పుడు వయసు గురించి చూడకుండా పని చేయాలంటాడు.  

నేను అనుకున్నది నేను సాధించుకున్నానని గర్వపడతాడు. నేను దేనికోసం బాధపడాల్సింది, భయపడాల్సింది ఏమి లేదనే దృక్పథంతో ముందుకు సాగుతున్న  సూరజ్ 83 ఏళ్ల వయసులో టింగు రంగడిలా మరోసారి దేశీయానానికి  సన్నద్ధమవుతున్నాడు. 

అయితే ఈ సారి ఒంటరిగా కాదు. తన సహాయకుడితో. 

***                                     ***

‘జీవితం మీద ఆశ, ఆశావాహ దృక్పథం బలంగా ఉంటే ఈ ప్రపంచం మనదేనేమో?’ ! ఆలోచనగా అన్నది తల్లి.    

‘అవునమ్మా, దృఢ సంకల్పం, పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడే తత్త్వమే అతని రోగాన్ని వెనక్కి నెట్టేస్తున్నదేమో ?!  

ఏదేమైనా అతని దృక్పథానికి  హ్యాట్సాఫ్.’  హృదయం నిండా సూరజ్ నిండుతుండగా వికాస్ . 

వి. శాంతి ప్రబోధ

Spread the love

One thought on “దృక్పథం

  1. కథ బాగుందక్క కొత్తగా..శుభాకాంక్షలు💐💐
    దృఢ సంకల్పం, పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడే తత్త్వమే అతని రోగాన్ని వెనక్కి నెట్టేస్తున్నదేమో ?!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *