మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన ‘వాన కురిసినప్పుడు మా ఇంట్లో’ పుస్తకానికి కవయిత్రి మానస చామర్తి గారి స్పందన

Spread the love

“నేను చదివిన పుస్తకాల్లో సగమైనా చదవనివాళ్ళతో నేను మాట్లాడనోయ్” అన్న పాలగుమ్మి మాటలను “నియోగి పోజు” అని తల్చుకునేవారట “అమృతం కురిసిన రాత్రి” తిలక్. తంగిరాల వారితో దొర్లిన కబుర్లలో. మా ఇంట్లో దానికి నియోగి నిక్కు అని పేరు. అది పొగరుకీ అభిమానానికీ మధ్య ఎక్కడో నిక్కి ఉంటుంది. పాలగుమ్మి గురించి ఆ మాటలు విన్న కొత్తల్లో, ఆయన రచనల్లో ఆ పొడ దొరుకుతుందా అని చూడటం నాకొక వ్యాపకమయ్యింది. ఇస్మాయిల్ గారు బివివి గారికి రాసిన ఉత్తరాల్లో ఒక చోట,

“స్వభావరీత్యా హైకూలు రాయగల అతికొద్ది మంది కవుల్లో మీరొకరు” అని రాశారు. బివివి గారి హైకూలే కాదు, కవిత చదివినా, నాకెందుకో ఆ మాట జ్ఞాపకంగా మెరిసిపోతూనే ఉంటుంది. పూడూరి రాజిరెడ్డి “రియాలిటీ చెక్” గురించి జ్యోతికో వ్యాసం పంపితే, ఆ సందర్భంగా దొర్లిన కబుర్లలో మెహెర్ “రాజిరెడ్డి చొరవా సంకోచం ఒకే లోపల గింగిర్లాడే మనిషి” అన్నాడు. అది చదివింది మొదలూ, నా మనసులో ఆ మాట అట్లా తిష్ట వేసుకుని కూర్చుండిపోయింది. రాజిరెడ్డిని కలిసినప్పుడు దొర్లిన ఆ కాసిన్ని మాటల్లో అయినా, మల్లికార్జున్‌తో పంతానికి పోయి సాధించుకున్న గంగరాజం బిడ్డ ఫస్ట్ కాపీని చేతుల్లోకి తీసుకు చదువుతున్నప్పుడైనా, ఆ మాటల్లోని సారం ఆయనలోనూ ఆయన రచనల్లోనూ యే మేరకు ఇంకిపోయిందో

గమనించి ఆశ్చర్యపోతూనే ఉండేదాన్ని.

వీళ్ళన్న ఈ మాటలు సాహిత్య విమర్శలు కావు. ఏదో నిరూపించాలని సభల్లో చెప్పినవి కావు. తీర్మానాలు అసలే కావు. మామూలు కబుర్లలో దొర్లిన గమనింపులు. ఉత్తరాల్లో, కబుర్లలో ఒక మనిషితో ఇంకో మనిషి స్నేహంగా, స్వేచ్ఛగా పంచుకున్న అభిప్రాయాలు. కానీ, వాటిలో తోసిపుచ్చలేని నిజం ఉంది. సాహిత్య విమర్శ ఒక్కటే ప్రాతిపదిక అయితే ఎప్పటికీ పట్టుకోలేని ఒక వ్యక్తిత్వ స్పర్శ ఉంది.

అందుకే నాకు రచయితల గురించి సాటి రచయితలు- వాళ్ళ స్నేహితులు మాట్లాడితే వినడం ఇష్టం. వాళ్ళ గురించీ, వాళ్ళ స్నేహాల గురించి, వాళ్ళు కలిసిన క్షణాల గురించి, కలిసి పని చేసే సందర్భాల గురించి

చెప్పించుకుని వినడం పట్ల వల్లమాలిన కుతూహలం. కానీ నా కుతూహలం వాళ్ళ వాళ్ళ జీవిత రహస్యాలను తెలుసుకోవడం కోసం మాత్రం కాదు. రచయితల జీవితంలోని ఏ పార్శ్వం, ఏ విలువ, యే ఇష్టం రచనల్లోకి అనాయసంగా ప్రవేశిస్తుందో, దాన్ని స్పష్టం చేసుకునే మాటల కోసం కాస్త ఆత్రపడతాను. మామూలుగా అయితే ఈ కుతూహలం ఈ లోకపు మర్యాదల్లో పడి నుజ్జునుజ్జుగా నలిగిపోతుంది. అవమానపడుతుంది. అందుకనే సంభాషణలూ తెగిపోతాయి. అలా తెగే వీల్లేదు కనుకనే నాకు లేఖా సాహిత్యం, ఆత్మకథా సాహిత్యం చాలా సార్లు ఆసక్తిగా అనిపిస్తాయి. ఆచంట స్మృతిపథంలో చదివి ఉబ్బితబ్బిబ్బైనదందుకే. ఇంద్రగంటి హనుమఛ్ఛాస్త్రీ కబుర్లు చెప్పినట్టే గుర్తు.

కృష్ణశాస్త్రి బసవరాజు గురించి రాసింది చూస్తే, వందో సారి చదవనీండీ, నా హృదయం మెలిపడిపోతూనే ఉంటుంది.  

ఈ ఆపాతకాలాలను దాటుకుని, నా నిన్నా మొన్నల్లోని కొందరు కవులు రచయితలు వాళ్ళ వ్యక్తిత్వాలు, ఖదీర్‌తో వాళ్ళ స్నేహాలు ఇట్లా “వాన కురిసినప్పుడు మా ఇంట్లో” పుస్తకంలో చదవడం నాకు విందుభోజనంలానే అనిపించింది. ఈ పుస్తకంలో ఉన్నవి –  నేను దూరంగా ఉండి గమనిస్తూ ఊహిస్తూ వచ్చిన రచనా ప్రపంచాన్ని ఇంకాస్త దగ్గరగా చూపించిన రాతలు. ఆ ప్రపంచపు మూలాలు. ఆ స్నేహపు పునాదులు.

ఖదీర్ మృణాళిని గారి గురించి. ఖదీర్ కాత్యాయని గారి గురించి. ఖదీర్ అనంత్

పాటల గురించి. ఆగండి, లేపాక్షి గారి హైకూల గురించి. మా కవుల గుండెల్లో పోట్లు పొడిచి కూడా నవ్వించే రీతి తెలుసు ఖదీర్ గారికి. ఆర్టిస్ట్ అక్బర్ బొమ్మల్లో ముఖాలకి కళ్ళుండవూ, దేహాలకు ముఖాలుండవు – ఎందుకూ అంటే, ఖదీర్ జవాబు చదివి నేను కాసేపు ఆగిపోయాను.   దళితుల కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎప్పుడు చూశామనీ, దాస్యం చేసేవారికి ముఖాలెక్కడ ఉంటాయనీ అక్బర్ ఎదురు ప్రశ్నించడం గురించి ఈ పుస్తకంలో చదవాలి. ఆర్టిస్ట్‌ల గురించి మాట్లాడటమంటే అదీ. వాళ్ళ తరఫున, వాళ్ళు, వాళ్ళ కళ అర్థమయ్యేలా. సాహితీ సభల్లో మాట్లాడేవాళ్ళ గురించి శ్రీరమణ చతుర్లు వినాలి. “పెద్దగేం మాట్లాడను” అంటూ  చిన్న చీటీ తీసే ఆ ప్రమాదకారుల గురించి :))

యెస్…కథా ప్రయాణంలో 2020 నాటికి పాతికేళ్ళు పూర్తి చేసుకున్న ఖదీర్, ఆ పాతికేళ్ళ ప్రయాణానికి కృతజ్ఞతలు చెబుతూ రాసిన భాగం మొత్తం, పుస్తకానికి మధ్యకుట్టు పేజీలా, దానికదే ప్రత్యేకం.

*

అదనంగా…

కొన్ని పాటలు.

బాలుది డాన్సాడిన గొంతు అని ఖదీర్ రాస్తే, చెప్పకుండానే నవ్వింది మల్లె చెండు గుర్తొచ్చింది.

“కవిని మలచిన వనిత” కథ చెబుతూ, ఆ జంట ఆదర్శాన్ని తలచే యోగ్యతలో

అయినా ఉన్నామా అంటే ఉలిక్కిపడ్డట్టైంది. పాటలతో ముడిపడ్డ మధురమైన కథలు చదువుంటే, “ప్రేమకథా మధురము” అని జిక్కి చెవిలో పాడుతూనే ఉంది. అది పాటల పూదోట. గాలికి పూలు రాలిపడినట్టు, మాటకో పాట. వాన పడుతుందింతలోనే. రిం ఝిం గిరే సావన్.

దుఃఖంగా కూడా అనిపించింది మధ్యలో ఎక్కడో. “జో న టూటా కభీ వో దిల్ హీ క్యా” అని విరిగి ముక్కలైపోతున్న గొంతుతో నిన్న గాక మొన్నే నాతో కలబడ్డ పాట. ఏనాడూ బద్ధలవనిది హృదయమేనా అని గుండెల్లో గుచ్చి మరీ అడిగే అర్జీత్…ఎందుకు గుర్తొచ్చాడో గుర్తొచ్చాడు. ఈ పుస్తకం చదువుతూండగానే.

“గాయం చెయ్యనివాడు గాయకుడు కాదు,

మనని వెంటాడి వేధించనిది పాటా కాదు” అన్నాడు ఖదీర్. చెప్పి రాని వేధింపు కదా. పర్లేదు. ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మకి ఆధారం దొరగ్గానే దుమికి వెళ్ళే ఉడత పిల్లలా – ఒక కథ నుండి ఇంకో కథలోకి. ఒక పాట నుండి ఇంకో పాటలోకి. రజనీగంధా పరిమళాల్లోకి…

**

వాన దేన్ని దేంతో ముడేస్తుందో చెప్పడం కష్టం. ఈ పుస్తకం ఎన్ని ఊహాలోకాల్లోకి, “పసిడి రెక్కల పైన కాలం” ఎగిరిపోయిన యే పసితనాల్లోకి, యే యవ్వనాల్లోకి, యే ఊరి పొలిమేరల్లోకి, ఏ మనిషి సాంగత్యంలోకి రెక్క పట్టుకు లాక్కెళ్ళి వదిలేస్తుందో చెప్పడం కూడా కష్టం. జడివాన ముసిరే ముందు, తూఫాను హోరుతో గాలులు వీస్తున్నప్పుడు ఎన్ని వేల ఆకులో గాల్లో గిరికీలు

కొడుతూంటాయి. వాన గానీ మొదలైందా – ఏవి ఎటు పోతాయో తెలీదు. ఏవి నీ వాకిట్లోకి వస్తాయో కూడా తెలీదు. చేతులు చాపి నిలబడితే దొరికేదల్లా చురుక్కుమనిపించే చినుకుల చల్లదనం. కొంత తడి.

ఇష్టమైన పాట, ఇష్టమైన వ్యాపకం, ఇష్టమైన మనిషి జ్ఞాపకం – ఇష్టంగా చదువుకునేందుకు ఇదిగో ఈ పుస్తకం. 

థాంక్యూ ఖదీర్ గారు. చెప్పుకుని ముచ్చటపడేందుకు ఇన్ని కథలిచ్చారు. చెప్పుకుని నవ్వుకునేందుకు కొన్ని కబుర్లు. Creative Collaborationని కొత్త వెలుగులో చూపించారు. వాన కురిసినప్పుడు మా ఇంట్లో – ఓ స్నేహపరిమళదీపం వెలిగించారు. 

మానస చామర్తి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *