స్త్రీ జీవితం ఎన్నో రంగులతో అల్లుకున్న పొదరింటి పంజరం. ఈ పంజరంలో పక్షులు,స్త్రీలు ఒక్కటే, ప్రపంచం మొత్తం ఒక తాటిపైకి వచ్చి ఏక కంఠమై వినిపించేది నీతి, ధర్మ సూత్రాలు మరి ఇవన్నీ స్త్రీలకే సొంతమైనవి మరి పురుషుడు ఉండడా అంటే ఉంటాడు..
ఈ నేలపై ఈ చివర నుండి ఆ చివరి వరకు స్త్రీలపై ఒత్తిడి తేగలిగేది పురుష స్వామ్యప్రపంచమే… స్వేచ్ఛ అనే రెక్కల్ని బంధించి నీకేమీ చేతకాదు అని చెప్పి ఒప్పించి చుట్టూ ఓ రక్షణ వలయాన్ని సృష్టిస్తారు కారణం సృష్టికి మూలమైన స్త్రీ స్వేచ్ఛను కోరుకోకూడదు. తిండి,బట్టా, నివాసం కోసం మగవాడిపై ఆధారపడి బతకాలి, ఎట్టి పరిస్థితుల్లో ఒంటరి స్త్రీ బతకలేదు/కూడదు, అనే మాట ఏమీ ఈనాటిది కాదు, దాదాపు నూరు సంవత్సరాల క్రితం మామ్ రాసిన నవలలో ఆనాటి కాలమానాన్ని స్థితిగతులను వర్ణించిన తీరు, ఆనాటి మనుషుల మధ్య ప్రేమలు,ఆకర్షణలు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు..
కానీ కథ లోతుల్లోకి వెళ్లినప్పుడు మాత్రం ఏం మారాయి ఇప్పటికీ, ఆనాటి ఆ రోజులకి అన్న ప్రశ్న గుండెని బద్దలు చేస్తుంది.
ఈ పురుష స్వామ్య ప్రపంచంలో ఒకే తప్పు చేసిన స్త్రీ, పురుషుల్లో స్త్రీకి వేసే శిక్ష ఆనాడు-ఈనాడు సాంఘిక పరిస్థితులలో ఏ మార్పు లేదు. ఆధునిక స్త్రీ అనేక రూపాల్లో ఇంకా ఎక్కువ హింస అనుభవిస్తోంది అనేది నా భావన.
అందుకేనేమో మామ్ కథలు ఇంకో 200 ఏళ్ల తర్వాత కూడా చదువుతారు అనిపిస్తుంది. ఇప్పుడు మన చుట్టూ ఉన్న సాంఘిక స్థితిగతుల ప్రభావం చూసినప్పుడు ఎప్పుడూ ఏ సమయము మనది అనుకోవడం కుదరదు, అలాగే పరిస్థితులకు తలవంచ కూడదు, వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి మనసుని స్థిరం చేసుకొని నలుగురిలో స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే శక్తి ప్రతి స్త్రీకి ఉండాలని అంటాడు మామ్ తన కథల్లో. ఇది ఇతని కథల్లోని ప్రత్యేకత.
అయితే బినాదేవి గారి అనువాదం మనల్ని కాలంతో ప్రయాణింప చేసేదిగా ఉంటుంది. మామ్ కథలోని ఆ ప్రత్యేకతని, కథా శైలి గమనాన్ని, మనకు అందించారు.
అక్కడక్కడ కాలాన్ని గుర్తుచేసే కలరా రోజులు ఫ్రాన్స్ పరిస్థితులు చైనా ఇంగ్లాండ్ స్థల వివరణల వల్ల మనం కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఆ రోజుల్లోకి ఆ విషయంలో పరిస్థితుల్లోకి వెళ్లి మన కళ్ళ ముందర చూసిన కోవిడ్ వంటి కఠినమైన రోజులు, జరిగిపోయిన రోజుల్లో నిలబడి మానవత్వం చూపిన వైద్యువృత్తి ధర్మం మనల్ని పట్టి కుదిపేస్తుంది. మదర్ మేరీ ని చూసినప్పుడు సమాజంలోని సేవను మించిన ప్రేమ లేదని నమ్మే మనుషుల మానవత్వాన్ని గుర్తుచేస్తుంది.
కథలో కిట్టి పాత్ర అమాయకంగా తల్లి నీడలో పెరిగిన ఓ గాజు బొమ్మ జీవితాన్ని, మరియు పెళ్లి చేసుకున్నది తనను ప్రేమించిన వారే అయినా తనకు పెళ్లి పట్ల, ఆ వ్యక్తి పట్ల ఏర్పడ్డ విముఖతకి కారణం ఆమె అందం అంటూ విమర్శకు గురి అయినా, మనసుకు నచ్చని మనిషితో ఉండలేకపోవడం., ప్రేమించాను అన్నవాడు సమాజానికి ఒక రూపంలో, నాలుగు గోడల మధ్య ఒక రూపంలో ఉంటాడన్న సంగతిని అర్థం చేసుకోవడంలో ఆలస్యమైందనే ఆమె చింతన, మోసం చేసిన చోటే మోసం చేయబడ్డ మనిషిని అసహ్యించుకునే సమయంలో భర్త వాల్టర్ చూపిన ఆదరణ, ప్రేమ అతని కంఫర్ట్ లోని నిర్లక్ష్యాన్ని ఒకే సమయంలో చూపిస్తూ సమాజానికి కనిపించే రూపాన్ని భరించలేకపోయే కిట్టి చివరకు తన జీవితంలో తీసుకున్న నిర్ణయం తాను కోరుకున్న స్వేచ్ఛను తనకు అందించిందా లేదా అన్న అంశంతో ముగుస్తుంది.
కొన్ని కథలు సమాజంలోని కాలంతో సమానంగా ప్రయాణిస్తాయి అలాంటి ఒ గాధే ఈ కిట్టి కథ అదే ఈ రంగుల పరదా..