మాట్లాడే టీ కప్పులు
హరుటోఇంటి కిటికీ తెరలు ఈ రోజు కూడా పక్కకు ఒదిగివున్నాయి. కొలతలు వేసి కోసిన మంచుగడ్డలా కిటికీ ఆకారానికి సరిపోయేట్లు చలికాలపు వేకువ వెలుతురు గదిలో దీర్ఘచతురస్రాకారంలో పడుతుంది. ఆ చిన్న చెక్క ఇంట్లో అలవాటైన అతిథిలా సంచరించే సూర్యరశ్మి మెల్లమెల్లగా కమ్ముకుంది. కిటికీ వారగా ఉండే చెక్కకుర్చీ, మేజాపై ఒకడుగులోని బుద్ధవిగ్రహం, ఎరుపురంగు ఫోన్, విద్యుత్ ఫంకా గాలిలో సన్నగా కదిలే వెదురు పడక్కుర్చీ, నట్టింట్లో నాలుగు కాళ్ళను బార్లా చాపి, నిలువునా మనిషంత ఎత్తులో ఉండే చిత్రఫలకం, దాని కెదురుగా హరుటో చేతిలో నీలంరంగు కుంచెతో నిలబడున్నాడు. అనేక రంగులు చెదురుమదురుగా అంటుకొనున్న పైవస్త్రంపైన, వెంట్రుకలు నెరిసిన బావురుగడ్డంపైన వెలుగు ఒక గుండు చీమలా మెల్లగా పాక్కుంటూ వంకరటింకరగా ముడతలుపడ్డ అతని వయసైన ముఖాన్ని చేరుకోగానే పులకరించాడు.
ఆ ఉద్వేగమే హరుటో, ప్రకృతి మధ్య మాట్లాడుకునే భాష…పిలిచే గొంతు… పిలుపు వినగానే కిటికీ ఉండే దిశగా అసంకల్పితంగా తిరిగాడు. చేతిలోనున్న కుంచెలో అంటుకున్నటువంటి నీలంరంగు నుండి రెండు చుక్కలు నేలపై పడితే, అది మృదుస్వరంలా చెవినపడి తేరుకొని, మళ్ళీ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టినవాడిలా, నీలంరంగు పులుముకున్న కుంచెను, వాలు చిత్రఫలకానికి ఎడమవైపున ఉంచాడు. గీస్తున్నటువంటి చిత్రపటానికి అతడి అనుమతి లేకుండానే వేకువ పసుపురంగును దిద్దడం, పాపం పైకి చూస్తున్నట్లున్న అతడి నల్లని కనుపాపకు తెలియలేదు.
కుడివైపుకు సరిగ్గా పది అడుగులు లెక్కపెట్టి నడవగానే అద్దాల కిటికీ వచ్చింది. గుబురుగా లేకుండా, కుడిఎడమలు విడివిడి ఊడలుగా వంపులు తిరిగి, పొడుగ్గా ఉన్నటువంటి మీసాన్ని రెండువైపులా దువ్వుకొని హరుటో దీర్ఘశ్వాస విడిచాడు. కిటికీవారన రంగు ఊరి, శరీరమంతటా పగుళ్ళతో నిండిన రాతి బుద్దినిలా హరుటో కళ్ళు మూయలేదు. దృశ్యాలులేని నిశీధీమౌనంలో తడిసి, తన చుబుకాన్ని పైకెత్తి, నొసలు చిట్లించి స్నేహితుడిని సన్నని గొంతుకతో అడిగాడు.
“తను ఇప్పుడు ఏ రంగులో ఉంది?”
చలికి ఆహ్లాదంగా తను ధరించిన గొర్రెతోలుతో చేసిన కోటును విప్పి హాలులో తలుపు వెనక ఉండే కొక్కేనికి తగిలించడం కానీ, ఏసుప్రభువు చేతిలో ఉండే గొర్రెపిల్లలా తన గుండెకు హత్తుకుని ఉండే బక్కచిక్కిన శరీరమూ, పొడవైన తోకతో, లేత గోధుమరంగు జంగుపిల్లిని కిందకు దింపడము కానీ, హరుటో ప్రశ్నకు సమాధానమివ్వడం కానీ అతడి స్నేహితుడు అన్నీ మరిచిపోయాడు. కిటికీ నుండి వచ్చే తెల్లని పొగమంచు గుండా మౌనంగా ముందుకు సాగే యజమాని దృష్టిని, అతడి చేతుల్లోకి బిగుసుకుపోయి కూర్చునటువంటి జంగుపిల్లి కూడా వెంబడించింది.
వేకువజాము చలిలో మెల్లగా ఒళ్ళు విరుచుకొని, రోజువారీకి తనను తాను సంసిద్ధం చేసుకొనే ‘హాన్సు’ దీవిని, ఆకాశంలో ఆధునిక చిత్రపటాన్ని గీస్తున్నటువంటి సూర్యుడిని కూడా అధిగమించి అతని మౌనపు చూపులు నగరపు ఇరుసు తొలగిపోయిన ‘పుజి’ కొండపైనే నిలిచాయి. చూపులకందని ఒక పెద్దపక్షి తన తెల్లని మెడను పైకెత్తి చూస్తూ, విశాలమైన బూడిద రంగు రెక్కలతో నగరమంతటినీ, తనలో పొదివినట్లు ఆ ఫుజి కొండకు బ్రహ్మాండమైన సౌందర్యం. చిన్నచిన్న కోడిగుడ్డు ఆకారంలో ఆ కొండ దిగువన మనుష్యుల నివాస స్థలాలు ఉన్నాయి.
ఫుజికొండ చెదురుమదురుగా పేర్చినట్లున్న బండరాళ్ళ మరుగున పూచిన లేత నీలంరంగు ఉదయం, ఎదురుగా చలిలో గడ్డకట్టిన చెరువు అద్దపు ఉపరితలంపై కరిగి, కారుతున్న సూర్యుని మడుగులా ప్రతిఫలించింది. అందులో ప్రకంపనలుగా మెదిలే తన చెదిరిన ప్రతిరూపాన్ని వంగుని ఆస్వాదించే పర్వత శిఖరం కాస్త వాలుగా జారినట్టు దర్శనమిస్తోంది. విశాలమైనటువంటి ఆ మహత్తరదృశ్యాన్ని తన కొయ్యబారిన చూపుతో, ఒక్కో గుటకా వేస్తూ హరుటో మిత్రుడు మెల్లగా ఆస్వాదిస్తున్నాడు.
హరుటో తన వీపుని విల్లులా వంచి, ఆపై రెండు సార్లు చప్పట్లు కొట్టి, కిటికీ గుండా చేతులెత్తి ప్రణమిల్లాడు. హరుటో ఆ నమస్కారం నగరపు మకుటాయామనంగా నిటారుగా నిలిచిన ఫుజి కొండకు, దానిపై వజ్రంలా ప్రజ్వరిల్లే సూర్యునికి చెందినదని అతని స్నేహితుడికి అవగతమయ్యింది.
అంతసేపు అతడి పైవస్త్రపు నులివెచ్చదనంలో ప్రశాంతంగా కూర్చున్న జంగుపిల్లి సహనాన్ని కోల్పోయింది. తనను గట్టిగా పట్టుకున్న మణికట్టు నుండి తనకు తాను ప్రయత్నపూర్వకముగా ముందుకాళ్ళను బలంగా ఆన్చి, కిందకు దూకేందుకు సిద్ధమయ్యింది. ఆ స్నేహితుడు కూడా ఆ పిడిని కాస్త వదులు చేసి, దానిని అనుమతించాడు. దానికి కొన్ని గంటల సేపు ఒకే చోటులో కూర్చున్నటువంటి అలసత్వం. దాని శరీరాన్ని ఎంతో సునాయాసంగా నీటిసుడుల్లా వంచుతూ, తలను లాఘవంగా వెనక్కి తీసుకువెళ్ళి కుడివైపుకు కరుచుకుంటూ, మళ్ళీ కరిచిన చోటులో తద్విరుద్దంగా నాలుకతో నాకుతూవుంది. ఇప్పుడు ఫుజికొండ తన శరీరపు లేత గోధుమరంగులోనే పొలుసులు పొలుసులుగా ఉన్నట్లు దానికి అనిపించుండాలి. కొద్దిక్షణాలు ఆ దృశ్యాన్ని మిర్రున చూసి, ఆపై శరీరాన్ని విదుల్చుకొనేసరికి దాని లేత గోధుమరంగు రోమాలు దూదిపింజల్లా గాలిలో ఎగిరాయి.
చేతిలోనున్న పిల్లి కిందకు దిగగానే స్నేహితునికి మెడలో వేలాడుతున్న యాషికా కెమెరా గుర్తుకొచ్చింది. దానికి బయట తొడిగినటువంటి తొడుగు నుండి కెమెరాను బయటకు తీసినవాడు కాస్తా, ఖాళీగా ఉన్నటువంటి దాని పైభాగాన్ని తెరిచి, తన చొక్కా జేబులో కూరుకుపోయిన తెల్లరోలును లోపల పెట్టి మూసి, కుడివైపుగా చేతిపిడిని వేగంగా కుదిపాడు. కెమెరా చిన్న గాజులెన్సుతో ఫుజికొండను చూసేందుకు సన్నద్ధమై, మర్చిపోయినటువంటి లెన్స్ మూతను తియ్యగానే కుడికంటిని మూసి మళ్ళీ ప్రయత్నించాడు.
అతడు కెమెరా లెన్సును సరిచేసిన విధానం, చెట్టుతొర్ర నుండి తలను పైకెత్తి చూసి, ఆపై లోపలికి తన్ను తాను వెనక్కి లాగుకునే పక్షిచర్యను తలపించింది. చివరిలో ఏదో ఒక చోట తృప్తి పడ్డాయన, గుండెవైపున వేలాడుతున్న కెమెరాను వంగుని చూస్తూ పైనున్న బటన్ని నొక్కాడు. బూడిద రంగులోని ఫుజికొండ, అతడి కెమెరా కళ్ళకు చిక్కిన ‘క్లిక్’ మనే శబ్దం విని తిరిగి చూసిన హరుటో మళ్ళీ అదే ప్రశ్నను అడిగాడు…
“తను ఇప్పుడు ఏ రంగులో ఉంది?”
ఈసారి కూడా స్నేహితుడి నుండి వెంటనే సమాధానం రాలేదు. హరుటో కూడా స్నేహితుడి జవాబు కోసం ఎదురుచూడలేదు. ఒక రోజులో అనేకసార్లు ముఖం మార్చుకునే ఫుజికొండ ప్రస్తుతం ఏ రంగులో ఉంది? చేతితో బావురుగడ్డాన్ని నిమురుతూ, ఆలోచించి చూశాడు. అతడి మనోఫలకంపై ఫుజికొండ అనేక రంగులలో వరుసక్రమంలో నిలిచింది.
ఈలోపు అతడి స్నేహితుని కుడి చెయ్యి చూపుడు వేలు మరో మూడు సార్లు కెమెరా పైనున్న బటన్‌ను ‘క్లిక్’ మనిపించింది. తీసిన ఫోటోల్లో ఏదో ఒక దానితో తృప్తిచెందిన వ్యక్తి తర్వాత హరుటోను చూసి మెల్లగా బదులిచ్చాడు…
“కాసేపటి క్రితం, శిఖరం మాత్రమే తెల్లగాను, మిగిలింది బూడిద రంగులో ఉంటే, ఇప్పుడు పూర్తి నీలంరంగులో ఉంది.”
హరుటో గట్టిగా చప్పట్లుకొట్టి, బిగ్గరగా నవ్వుతూ ఇలా అన్నాడు. “ఈ ఫుజి కొండ ఉంది చూసావు. వగలమారి…ఆమె ఎప్పుడూ ఇంతే. నిముషానికి ఒకసారి రూపాన్ని మార్చేస్తుంది. నాన్న నా బాల్యంలో తరచూ అనేవాడు. ‘అది నీ అమ్మ లాంటిది, చటుక్కున నవ్వుతుంది, చటుక్కున కోపంతో మూతివిరుచుకుంటుంది. అదీ కాకుంటే ఏడుస్తూ ముఖాన్ని దుప్పట్లో దాచుకుంటుంది”
ఓ ఉదయాన తెల్లటి నీటిచినుకుల్లా మంచుకురిసి దుప్పటిలో కూరుకుపోయి, పడుకున్నటువంటి అమ్మను చూపించి, నాన్న ఇలా అనుకోవడం తలుచుకుని నవ్వుకుంది. ఫుజికొండ కూడా తరుచూ తన ముఖాన్ని మేఘపు దుప్పట్లో దాచుకోవడాన్ని హరుటో కూడా ఒకసారి దగ్గరగా పరికించి చూశాడు. అప్పుడు హరుటోకి తొమ్మిదేళ్ళ వయసు, అప్పటికింకా కంటిచూపు కూడా ఉంది.
వేకువకు నింగి తనను సిద్ధం చేసుకుంటున్న వేళలో, అమ్మానాన్నతో పాటు బాలుడైన హరుటో ఫుజికొండను ఎక్కడం మొదలుపెట్టాడు. తలెత్తి చూసి వేకువ ముందుండే చీకటి నుంచి ఫుజి కొండను వేరుపరిచేందుకు వీలు కాలేదు. అనుదినం ఇంటి కిటికీ గుండా ఫుజికొండను వింతగా చూసేవాడికి, దానిపై ఎక్కడం చెరగని పాదముద్రలా మనసులో ముద్రించబడింది. జపానీయులందరికీ ఫుజికొండ ఎక్కడం ఒక చెరగని కల అని భార్యతో విడమర్చి చెప్పిన హరుటో తండ్రి ఆ కొండని రెండోసారి ఎక్కుతున్నాడు.
ముగ్గురూ తెల్ల రంగు చొక్కాను, ఫాంటును ధరించుకున్నారు. చేతిలో పొడవైన కర్ర, మెడలోను అదే తెల్ల రంగులో గుండ్రంగా ఒక కట్టు. నాన్న కుడి భుజానికి వేలాడుతున్న గుడ్డసంచిలో ముగ్గురికి సరిపోయే ఆహారం, తాగేందుకు మంచినీళ్ళు ఉన్నాయి. అక్కడ గుమికూడినటువంటి కొందరు మొక్కుబడికై, కొందరు కలకై కొండను ఎక్కసాగారు…
హరుటో తండ్రి ఈ రెండు కారణాలకై తన కుటుంబంతో పాటు ఎక్కాడు. మసకబారుతున్నటువంటి కొడుకు చూపుకై మొక్కుబడి చెల్లించడం కోసమూ, ఫుజికొండ ఎక్కే కల కోసమును. చల్లారని కోపాగ్నితో ఎన్నో వందల ఏళ్ళక్రితం నుండి ఉంటున్న ఫుజికొండలో ఎర్రపువ్వులు పెల్లుబుకి కరిగిన జాడలు, ఎగుడుదిగుడైనటువంటి దారులుగా మారడం చేత వాళ్ళు పెద్దగా శ్రమ లేకుండా ఎక్కగలిగారు. ఫుజికొండ ఏమాత్రం ఎక్కలేని రాళ్లగుట్టనో, ఏటవాలైన దిబ్బనో కాదని నాన్న చెప్పిన విషయం కొండ ఎక్కడం మొదలెట్టగానే హరుటోకి అర్థమైంది.
“నాన్నా, ఇది అగ్నిపర్వతమే కదా, చటుక్కున అగ్గి రాదా?” భయం నిండిన ముఖంతో హరుటో నాన్నను అడిగేసరికి తెల్లవారసాగింది. కొండపైవాళ్ళు నిలబడిన ఎత్తునుండే, ఆకాశమంతటా కమ్ముకొని పైకి ఎగసిపడే అగ్ని గోళాన్ని పేర్చినట్లున్న బండరాళ్ళలో కాంతి గీసే పసుపు రేఖలను పూర్తిగా ఆస్వాదించేందుకు సాధ్యమయ్యింది.
సూర్యుడి చిత్రాలుగా, నింగి ముఖం మారేసరికి, సూర్యుని దిశగా రెండుసార్లు చప్పట్లు కొట్టి గాలికి తలాడించే చెట్లలా కిందకు వంగి అమ్మానాన్నలు ప్రకృతిని ప్రణమిల్లుతున్నట్లు బాలుడు హరుటో కూడా నమస్కరించాడు.
“ఇప్పుడు నీకు ఏ రంగులు కనిపిస్తున్నాయి?”
“ఫుజికొండ బూడిద రంగూ, బండరాళ్ళపై ఎగసిపడే పసుపు కాంతీ, ఆకాశంలో వ్యాపించిన నీలం కలగలిపిన నారింజ రంగు, అవేం రంగులో అంతుచిక్కని మరో రెండు మూడు రంగులు.”.
నింగిని చూసి చేతులు చాపిన హరుటో చెప్పిన రంగులన్నీ అంతులేని ఒక ఉదయంలా మనసులోతులో నిండిపోయాయి. తన చీకటి ప్రపంచంలో, ఈరోజు ఉదయం కూడా అటువంటి ఒక వేకువగానే ఉంటుందని యాభైయేళ్ళ హరటో నమ్మాడు. ఆ క్షణంలో దగ్గరలోని వంతెనపై బుల్లెట్ ట్రైన్ ఒకటి కలలవేగంతో అధిగమించి వెళ్ళింది. ఎప్పటిలానే ఈరోజు కూడా నగరపు ఉదయపువేళ పరుగులు తీస్తుంది.
“నేను నిన్న ఫోనులో పిలిచేటప్పుడు ఈరోజు వస్తారని ఏమాత్రం అనుకోలేదు. అది కూడా తెల్లవారుజామునే.” కాలిమడమకు తన ముఖంలోని మీసాలు, పొడవాటి తోకను రాసుకుంటున్న జంగుపిల్లి వైపు చీకటి దృష్టి మరల్చి హరుటో మిత్రునితో ఇలా చెప్పాడు.
“నిన్న నాకే ఒకనొక దశలో ఆ నమ్మకం ఉంది. మీరు నన్ను పిలుస్తారని. నేను ఫోన్‌ని చూస్తుండిపోయాను. ఏదో గుడ్డి నమ్మకం. నిజానికి మీరు నన్ను పిలవకపోయినా ఈరోజు నేనే, మీ ఇంటికి వచ్చే ఉద్దేశంతో ఉన్నాను. నేను ఈ మధ్య కాలంలో ఎవరి పిలుపు కోసము ఇంతగా ఎదురుచూసి, నిరీక్షించలేదు.
పిల్లి మళ్ళీ కాలిమడమతో రాసుకునేసరికి హరుటో చక్కిలిగింతలు తట్టుకోలేక కాలిని విదల్చడంతో, నిరాశతో అది వెనుతిరిగింది.
“ఏం ఏదైనా సమస్యా?”
“అదేమీ లేదు. నిన్న ఎప్పుడూ వెళ్ళే రోడ్డు మీద ఆఫీస్‌కి పోతున్నాను. ముందు వెళుతున్న వాహనాన్ని దాటి వెళ్ళడం కోసం నా ఎడమవైపు అద్దాన్ని చూసుకున్నప్పుడే గమనించాను. ‘సౌందర్యం’ అని ఒక్క మాటలో కుదించలేని నలుపుతెలుపుల చిత్రపటంలా దూరాన ఫుజికొండ కనిపించింది. నిండా ఒక క్షణం కూడా అయ్యుండదు. నా చూపు తనపై నుండి జరిగి మళ్ళీ ఎదురుగా ఉన్న రోడ్డులో కూరుకుపోయింది. ఆ క్షణాన అదే నిదర్శనం.
ప్రతిరోజు వెళ్ళే అదే దారే. అదే దృశ్యమే. అయితే ఒక్కసారి కూడా రోడ్డు వారనున్న వాహనాన్ని ఆపి నిటారుగా నిలిచిన ఫుజికొండనో, లేదా దాని వెనక దాగుడుమూతలు ఆడే పసుపు ఎండనో కొన్ని నిమిషాలు కూడా పూర్తిగా ఆస్వాదించియుండి ఉండను. ఇందులో ఏముంది. ప్రతిరోజు చూసే అదే సూర్యుడే కదా, అదే ఆకాశమే కదా అన్న సరాసరి ఆలోచన కూడా బహుశా అందుకు కారణమైయుండొచ్చు. ఒకరోజు…మీలా… క్షమించండి…నేను అనుకున్నది చెప్పేస్తాను.
“హ్మ్….”
మీలా నా కంటికి కూడా ప్రపంచం కనిపించకుండా పోతే…ఆ ఆలోచన రాగానే శరీరం మెల్లగా వణికింది. తర్వాతి వేకువను నిదానంగా, పూర్తిగా గమనిస్తూ ఆస్వాదించి, తర్వాతి రోజుల్లో ఒక ఆవులా ఆ జ్ఞాపకాలను మెల్లగా నెమరువేయాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే మీ ఫోన్ నుండి పిలుపుకై ఎదురుచూడసాగాను. నాకు సంబంధించినంతవరకు ఫుజికొండ సౌందర్యాన్ని ఏకాంతంలో ఆస్వాదించేందుకు మీ ఇల్లు తప్ప మరో గొప్ప చోటేది నాకు తెలియదు. అందులోనూ మరి ముఖ్యంగా, కర్టెన్స్ పక్కకు జరిగినటువంటి మీ ఇంటి కిటికీలు నాకు మాత్రమే కాదు. ఆ పసుపు కాంతికి కూడా ఇష్టమైన విషయాల్లో ఒకటి.
“ఉదయం లేవగానే కిటికీ కర్టైన్సును జరపడమన్నది నా బాల్యంలో నాన్న చేసిన అలవాటు. దానిని ఈరోజుకి కూడా పాటిస్తున్నాను. అందుకు ఆయన చెప్పిన కథ, దాని కారణాలు కూడా చిత్రమైనవి. అయితే, ఒక రకంగా సహేతుకమైనవి కూడా. తన శరీరాన మణులను ధరించి, శబ్దాన్ని రేకెత్తించి యాచించే ఒక ‘బౌద్ధ భిక్షువు’ కథని నాన్న చెప్పారు.
ఒకసారి ఒక పేదవాడి గుడిసె తలుపు తట్టిన ఆయన యాచకం అడిగేసరికి, ఉబ్బిపోయున్న పాత తలుపు మూసుకుపోయింది. ఆ పాపభీతితో ఆయన మనసు విరిగిపోయింది. ఆ రోజునుంచి ఆయన ఏ ఇంటి తలుపును తట్టి యాచించలేదు. అందుకు బదులుగా బుద్ధుడి సలహా ప్రకారం శరీరంలో మణులను ధరించి, శబ్దం రేకెత్తించి, తెరిచే తలుపు కోసం ప్రశాంతంగా ఎదురుచూడసాగేవాడు.
నాకీ కథను చెప్పి కిటికీ కర్టయిన్స్ రెండు వైపులా జరిపి, నాన్న బల్లగుద్ది చెప్పాడు. ‘ఒక రకంగా వేకువజామున సూర్యుడు కూడా ఆ బౌద్ధ బిక్షువు లాంటివాడే. తొలగనున్న తెరల కోసం మౌనంగా ఎదురుచూస్తున్నాడు.’
తెల్లచొక్కాలో కూరుకుపోయినటువంటి హృదయ గూటిని ఎడమ చేతితో మృదువుగా నిమిరి హరుటో కొన్ని నిమిషాలు మౌనంగా నిలబడ్డాడు. ఆ తర్వాతి బుల్లెట్ రైలు అక్కడి నుండి బయలుదేరింది. హరుటో స్నేహితుడు కిటికీ వైపుకెళ్ళి కిందకు వంగి రోడ్డును గమనించాడు. రోడ్డుపై ట్రాఫిక్ లైట్లు పచ్చ, ఎరుపు రంగులు మారుతూ కనిపించాయి. నలుపు కోటును, టై తోను మెరిసిపోతున్నటువంటి హుందా ఉట్టిపడే బట్టలు తొడుగుకున్న ప్రజలు రోడ్డులో వస్తూపోతూ ఉన్నారు.
“ఇదిగో, వీళ్ళు కూడా నాలానే. ఎదురుగా మెదిలే రంగుల ప్రకటనా బోర్డులను దాటి, నీలపు నింగినో, తెల్లని ఫుజికొండనో, పసుపు రంగు ఉదయాన్నో చూడాలని ఎవరికీ అనిపించలేదు. ఇది చూడగానే నాకు మీ పెయింటింగ్ ఒకటి గుర్తుకొస్తుంది.”
“కాంక్రీట్ మనుషులు పెయింటింగా?”
“అవును అదే. కాంతి నీడలో బ్రతికే ఊరు. ఊరు చుట్టూ నలుపును పూసి అంచలంచెలుగా ఎదిగిన అపార్ట్‌మెంట్ కట్టడాలు. ఒక వ్యక్తి ఆ కాంక్రీట్ కట్టడానికి నీళ్ళు పోస్తుంటాడు. ఆ తర్వాతి కట్టడం దానికంటే ఎత్తులో వుంటుంది. మధ్యన రోడ్డుపై గుంపుగా మనుష్యులు. అందులో ఏఒక్కరికి ముఖం ఉండదు. తలా ఒక్కో దిక్కున…అందరి నడినెత్తిన ఒక సన్నని తెల్లటి నూలుతో అల్లిన నల్లని ఆకాశంలో కంటికి కనిపించని ఏదో ఒక చోట్లో ముడివేయబడి కనుమరుగవుతున్నాయి.
“అవును, అది నా మనసుకు కూడా బాగా దగ్గరైనటువంటి పెయింటింగ్. పూర్తిగా నలుపు రంగులో నేను గీసినటువంటి మొదటి పెయింటింగ్ కూడా. నేను పూర్తిగా చూపు కోల్పోయి గీయడం మొదలుపెట్టిన రోజుల్లో, నన్ను అడిగేవారు. నీ కంటికి ఏం కనిపిస్తుంది?”
‘విశాలమైన పెద్ద వృత్తము, దాని పూర్తి కేంద్రం చుట్టూ ఏవో పిచ్చిగీతలు. ఎప్పుడూ దరిదాపుగా నేను చూసేది ఒక నలుపు సూర్యున్ని అంటాను. చూపు ఉండి కూడా ప్రపంచాన్ని ఆస్వాదించడం మర్చిపోయినవారు ఒక రకంగా నా వంటివారే, అందుకే వాళ్ళను నేను నిత్యం చూసే అదే నలుపు రంగులోనే గీసేవాడిని.”
హరుటో స్నేహితుడు మౌనంగా రోడ్డునే తదేకంగా చూస్తూ.
“టీ పెట్టబోతున్నాను. గ్రీన్ టీ…తాగుతారుగా?”
“మీకెందుకు అనవసరమైన శ్రమ…?”
“ఇందులో ఏముంది, మీరు వద్దన్నా కూడా ఎలాగు నా కోసం నేను టీ పెట్టుకునే కదా తీరాలి.”
“అలాగైతే నాకు కూడా పెట్టండి. ఈ చలికాలంలో లెక్కలేనన్ని టీలు తాగొచ్చు…”
“అవును గ్రీన్ టీకీ, భూకంపాలకి అలవాటు పడనివాడు జపనీయుడు ఎలా కాగలడు? ఒక రోజంతా నన్ను అదే పనిగా నీళ్ళకు బదులు కేవలం టీ మాత్రమే తాగాలి అంటే కూడా సంతోషంగా తాగుతూనే ఉంటాను.” భుజాలు కుదుపుకుంటూ హరుటో నవ్వాడు.
మిత్రుడు తన పైవస్త్రాన్ని రిసప్సన్ గదిలోని చెక్క తలుపు వెనకాల ఉండే కొక్కేనికి తగిలించేందుకు వెళ్ళాడు. అతడి కాళ్ళ మధ్యన పిల్లి మార్చి మార్చి దూరుతూ అతడిని వెంబడించింది. తన ఆకారం కంటే నీడ కొనసాగింపులో పెరుగుతూ పోయే తోకను, అది వంపులు తిప్పుతూ నడవడం గుంటనక్కను తలపించింది. కొక్కేనికి తగిలించిన యజమాని బూడిద రంగు షర్టులో తన గోళ్ళను ఆన్చి గీకడం మొదలెట్టింది.
“హేయ్ పరిగెట్టు…” అని అదిలింపు గొంతుతో వట్టి చేతులను మెల్లగా పైకెత్తితే, కుర్చీ కింద నాలుగు కాళ్ళను ముడుచుకొని పడుకుంది. అప్పుడే చిత్రఫలకంలో వాల్చి పెట్టిన హరుటో చిత్రపటాన్ని మిత్రుడు గమనించాడు…
తెల్లదారానికి వేలాడదీసిన టీ కప్పులు విద్యుత్ ఫ్యానుల్లా తలకిందులుగా వేలాడుతున్నాయి… కుడిఎడమగా, ముందూవెనకా వరుసగా అనేక ఖాకీరంగు టీ కప్పులు. ఒక్కొక్క కప్పు కింద దాని సాసర్ నేలపై ఉంది. సాసర్లకు, టీ కప్పులకు ఎటువంటి పనీ పడలేదు. ఒక్కొక్క కప్పునుండి బయలుదేరే మాటలు, వాటి వాటి సాసర్ దిశగా కిందకు పయనిస్తున్నాయి. మిగిలిన కొన్నిమాటలు పైన గాలిలోనూ, తెల్లని మేఘాల కిందా వేరొక టీ కప్పు దిశగా కదులుతున్నాయి.
హరుటో చిత్రాన్ని ఇంకొక్కసారి మిత్రుడు కనుబొమ్మను పైకెత్తి క్షుణ్ణంగా చూశాడు. ప్రశ్నలూ, గంధరగోళాలు నుదుటి ముడతల్లా మెలితిరిగాయి…
పొయ్యిలో వేడి నీళ్ళు కాగుతున్నటువంటి శబ్దం వినిపించింది. హరుటో తన మిత్రునికి గ్రీన్ టీని తయారుచేసి, వేడి తగ్గేలోపు మిత్రుడికి అందించి, తను కూడా ఒక టీ కప్పును అందుకున్నాడు. తేలు కొండిలా రెండు వైపులా వంపులు తిరిగిన మీసాన్ని పక్కకు దువ్వి టీ వాసనను గాఢంగా లోపలికి పీల్చుకున్న హరుటోకి, ఆ వాసన కంటే కంటికి కనిపించని దాని లేత పచ్చరంగు ఆలోచనే పరవశాన్ని రేకెత్తించింది.
మిత్రుడు ఇంకా టీ తాగలేదు. చిత్రపటం తన యజమాని ముఖంలో గీసినటువంటి ప్రశాంతతను, చెక్క కుర్చీ కింద తోక ముడుచుకొని పడుకున్నటువంటి జంగుపిల్లి మౌనంగా చూస్తుంది. ఆ బరువైన మౌనంలోని అర్థం అవగతమై తన చిత్రపటం గురించిన ప్రశ్నలు తలెత్తే ముందే దానికి సంబంధించిన సమాధానాన్ని కరకరమనే గొంతుతో హరుటో చెప్పసాగాడు…
“నాన్న అనే వాడు. ‘మన శరీరం కూడా ఒక విధంగా ఇంకా పూర్తిగా తాగనటువంటి ఒక టీ కప్పు లాంటిదేనని.’ నిజమే. మనమంతా మన్నుతో వేడిచేయబడ్డవాళ్ళం…మట్టి టీ కప్పుల మానవరూపాలం.
మన అనేక సంభాషణలు చాలావరకు చేతిలో టీ కప్పుతోనే సాగేవి. దాదాపు ప్రపంచం మొత్తం ఇంతే. ప్రపంచం తనలో మనసు విప్పి మాట్లాడుకోవడానికి చేతిలో ఒక కప్పు టీ కప్పు అవసరం ఉండనే ఉంటుంది. ఇక్కడ వక్త, శ్రోత మారుతూనే ఉంటారు. అయితే, టీకప్పులు మారవు…టీ కప్పులన్నీ ఒకరకంగా ఒకటే. అందుకే ఈ పెయింటింగ్‌లోని టీ కప్పులన్నీ చెక్కుచెదరకుండా ఒకేలా ఉంటాయి. ఎటువంటి చర్య లేకుండా.
విద్వేషాలు, ప్రపంచ రాజకీయాలు, వాదోపవాదాలు లేదా అనవసరమైన చర్చలు ఏదైనాసరే టీ కప్పు గుండానే చాలావరకు ఒకరు మాట్లాడుతుంటే, మరొకరు వింటుంటారు. దానినే నేను కూడా గీశాను. ఇక్కడ తేనీటి కప్పులు మాట్లాడటాన్ని దాని సాసర్లు వింటాయి.
ఈ పెయింటింగ్‌ని నిశితంగా గమనిస్తే మీకే అర్ధమవుతుంది…ఒక టీ కప్పు నుంచి వెలువడే కొన్ని పదాలు, మరో కప్పులోకి ప్రయాణిస్తాయి. వాటిని వేరొక సందర్భంలో ముఖం తెలియని ఇంకొకడి చేతిలో టీ కప్పుతో, మళ్ళీ గ్రహించి మాట్లాడవచ్చు, సూచించవచ్చు, వాదించవచ్చు లేకుంటే వినీవినకుండా ముందుకు సాగవచ్చు. అవే ఈ పెయింటింగ్‌లో మేఘాల కింద ప్రయాణించే పదాలు…ఇంకా వినిపించకుండా గాలిలో సంచరిస్తూనే ఉన్నాయి.
మనకి సన్నిహితమైనవాళ్ళు చెప్పిన విషయాలూ, పచ్చనిజ్ఞాపకాలు అంతెందుకు ఇష్టమైన మాటలు కూడా టీ కప్పుల్లో ఇంకా ఝుంకారం చేస్తూనే ఉంటాయి…. మనమే వాటిని వినే ప్రయత్నం చెయ్యము.
ఊరంతా ఊదా, తెల్ల పువ్వులు విరబూసి, కొద్దిరోజులకే రాలే ఆకురాలుకాలంలో ఒకరోజు కళ్ళు ముడుచుకుపోయిన ఎనభైయేళ్ళ ముసలావిడ దగ్గర కొని తెచ్చి, అమ్మ ఆ కిటికీ అంచున ఉండే బుద్దుడి శిలను ఇచ్చింది.
ముడతలుపడ్డ వస్త్రం, పొడవాటి చెవులు, మూసిన కనురెప్పలు, జడను ఒక్కొక్కటిగా ఇలా తడిమి చూస్తూ, ఆమె చెప్పేలోపే నేనే ఊహించి అడిగేశాను…
“సన్నంలోనే అత్యంత సన్నంగా తపస్సులో సన్నబడిన గౌతముని వసివాడిన ముఖమే! ఏ రంగులో ఉన్నాడు? పూర్తిగా తెలుపా? ఖాకీ రంగా ? బూడిద రంగా?”
అప్పుడు నాకు పదిహేనేళ్ళు. నా కళ్ళు దాదాపుగా వెలుగును కోల్పోయిన సమయమది…కాలువ నీరులా కనిపించే దృశ్యాలు, పక్కకు ఒదుగుతూ ఒక చోట కనుమరుగవ్వసాగాయి.
“బూడిద రంగు, గోధుమ రంగు అలుముకున్న ఖాకీరంగులో…” అని అమ్మ అన్నప్పుడు, ఆమె గొంతు జీరబోయింది.
“జడపైన వృక్షం ఉన్నట్టు అనిపించలేదు కదా! లేకుంటే ‘బోధిచెట్టు కింద బుద్ధుడు” అని ఎప్పుడో అనుండేవాడిని…… బుద్ధా! ఎందుకు కళ్ళు మూసుకునే ఉన్నావు..?”
“త్వరగా కళ్ళు తెరుస్తాడు…” అంటూ చెప్పి నా రెండు చెంపలనూ ముద్దాడింది. ముద్దుల తడి కంటే, అమ్మ కన్నీటి చెమ్మే ఎక్కువ.
అంతవరకు ఫుజి కొండను, సూర్యుడిని మాత్రమే గీస్తూవున్న నేను, ఆ రాత్రి నేను మొదటిసారి వర్షాన్నీ, మానవ రూపాలను గీసాను. నేను చూడలేని కాంతి తీక్షణతను పెయింటింగ్‌గా మలచడంపై దృష్టి పెట్టసాగాను. నాన్న నాకు అంతకు క్రితమే ఆయిల్ పెయింటింగ్ బ్రష్‌ల పెట్టెను బహుమతిగా ఇచ్చాడు. అందులో ఉండే వివిధ కుంచెలతో మొట్టమొదటిసారి గీసిన ఆ పెయింటింగ్ ఇప్పటికీ నాకు గుర్తుంది.
తుమ్మెద రంగు మేఘసమూహం. వాహనాల హెడ్‌లైట్‌ల వెలుగులో నిర్మానుష్యమైన రోడ్డుపై వర్షం పసుపు రంగులో వుంది. పచ్చని గొడుగులా ఆకులు విస్తరించిన చెట్టుకింద, వర్షానికి ఒదిగిన యువకుడు రోడ్డును చూస్తూ నిలబడియున్నాడు. ఆకులచివరల నుండి నీటిచుక్కలు వెండి తివ్వల్లా అతనిపై కురుస్తున్నాయి. వానతడో, చుట్టూ ఉన్న రంగురంగుల దృశ్యాలో అతనిలో చలనాన్ని రేకెత్తించలేదు. తల నుండి నీళ్ళు కారుతూ, కనురెప్పల కింద చూస్తూవున్న వ్యక్తి చూపులేని గుండ్రని ముఖంలో బుద్దిని ప్రశాంతతను చిత్రించాను.
మరుసటి రోజు తెల్లవారుజామున, ఫుజికొండ తెల్లటి రంగులోనే ఉండాలి… అని నేను కిటికీలోంచి ఊహించినట్లే కిటికీ వారగా నిలబడినప్పుడు, నా పెయింటింగ్ గురించి ఆమె ఒంటరిగా నాన్నతో మాట్లాడుతూ వుంది…
అదెలా, అప్పుడు కూడా నా చేతిలో ఒక టీ కప్పు ఉంది. గ్రీన్ టీ రుచి వ్యసనానికి లోనయ్యాను. నాకూ, అమ్మకు చేర్చి నాన్నే స్వయంగా ఆ రోజు టీ చేసి పెట్టడం అదే మొదటిసారి.
జీవితాంతం వెలుగు లేని ప్రపంచంలో పయనించేందుకు సిద్ధమవుతున్న నాకు వారి మాటల పట్ల పూర్తి ఆసక్తి లేకపోయినా, వారు మాట్లాడిన మాటలు నా చెవులకు ఎక్కించుకోకుండానే వాటి మానాన చెవిలో పడుతూనే ఉన్నాయి. అమ్మ చేతిలోని టీ బహుశా తాగకుండా ఉండి ఉండాలి, ఆమె ఏడుపు శబ్దం కొనసాగింది.
నాన్న మాత్రమే మాట్లాడుతున్నాడు, “నువ్వే ధైర్యంగా ఉండాలి… వాడి చెవిలో పడబోతుంది, ఏడవకు!’’
“వాడు గీసిన పెయింటింగ్ చూడండి! ఎంత అందంగా వచ్చింది. వాడికి మాత్రమే ఇలా ఎందుకు జరుగుతోంది? ఇంత చిన్న వయసులో ఎందుకు చూపు కోల్పోవాలి?” అమ్మ ఏడుపును కొనసాగించింది…
“ప్రకృతి వాడి చూపును లాక్కొని, ఇంకోదాన్ని వాడికి ఇవ్వాలనుకుంది. మనమిద్దరం వాడికి రెండు కళ్ళు కావాల్సిన సమయమిది. ఏడవకు, కన్నీళ్ళు తుడుచుకుని ఈ టీ తాగు…” అని అలా చెప్పగానే కొన్ని నిముషాల మౌనమూ, ఆపై ఇద్దరూ టీ తాగే శబ్దాన్ని నిరాఘాటంగా స్పష్టంగా వినగలిగాను.”
కిటికీ దగ్గర నిలబడియున్న నా దగ్గరకు వచ్చి నాన్న అడిగాడు “ఏంటీ దిక్కులు చూస్తున్నావు?”
“సూర్యుడూ, ఫుజికొండా. అయితే, నా వలన కావడం లేదు! దృశ్యాలన్నిటికి నల్లనితెర మూసినట్టనిపిస్తుంది…”
“నీవల్ల అవుతుంది! ఆ నలుపు తెర గుండా క్షుణ్ణంగా చూడు. బూడిద, తెలుపు రంగుల్లో ఫుజి కొండా, పసుపు కిరణాలూ, ఆకాశంలో ప్రకృతి గీసిన ఆధునిక పెయింటింగులా కనిపిస్తుంది.”
“పోను ఫోను తెలుస్తుంది. మేము చూసే ప్రపంచం కంటే నీకన్నీ వేరొక కోణంలో, రకరకాలుగా, రంగురంగుల్లో కనిపిస్తాయి. ఎప్పటికప్పుడు రంగులు మార్చే పుజికొండను చూపించి నువ్వే ఒక రోజు నన్ను అడుగుతావు “నాన్న పూజికొండ నాకు బంగారు రంగులో కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా అని. అప్పుడు నువ్వు చెప్పే రంగులను చూసేందుకు, అర్థం చేసుకునేందుకు వీలుకాక నేను కళ్ళు తేలయబోతున్నాను…” అని చెప్పి నా తలనిమిరాడు.
నేను గీసిన పెయింటింగ్‌ను అమ్మ నా చేతివేళ్ళతో తడమమని చెప్పి “నువ్వు ఇందులో ఏం అనుభూతి చెందావు?” అని అడిగింది.
“రకరకాల రంగులూ, వాటి డిఫరంట్ టోనులు” అన్నాను.
నన్ను గుండెకు హత్తుకుని “మేము రంగులను చూడగలం అంతే , నువ్వు వాటిని అనుభూతి చెందగలవు!” అని నుదిటిపై ముద్దుపెట్టింది. తర్వాత మేం ముగ్గురం టీ తాగుతూ కిటికీలోంచి ఫుజికొండ వైపు చూస్తున్నాం…
నిన్న ఉదయం, టీ కప్పు నా చెయ్యి జారీ కిందపడి విరిగిపోయింది. చెల్లాచెదురుగా పడిన మట్టి కప్పును చేత్తో తీసేటప్పుడు ఈ చిన్ననాటి సంఘటన మెదిలింది. నేలంతా ఆ రోజు మా నాన్న నాతో చెప్పిన మాటలు, ఆ రోజు సంభాషణ, ఆ మసకబారిన జ్ఞాపకాలే, పగిలిన టీ కప్పులు ముక్కలు ముక్కలుగా చెల్లాచెదురుగా పడివున్నట్టు ఒక ఆలోచన! చెల్లాచెదురైన మాటలకు రూపాన్ని, జీవాన్ని ఇవ్వాలనుకున్నాను. ఆ ప్రయత్నానికి నిదర్శనమే ఈ పెయింటింగ్!” అని హరుటో మాట్లాడటం పూర్తవ్వగానే, గది అంతా నిశ్శబ్దంతో నిండిపోయింది. ఇక చెప్పడానికి, వినడానికి ఏమీలేదని తన జీవితపు ఏదో ఒక టీ కప్పు సంభాషణతో తనని జతకలిపి స్నేహితుడు మౌనంగా నిలబడ్డాడు. జంగుపిల్లి సన్నగా ‘మియావ్’ అని అక్కడి మౌనాన్ని చెరిపేసే వరకు.
“పిల్లికి ఆకలేసుంటుంది…” అని హరుటో నవ్వినప్పుడు తన ముఖంలో వచ్చి వెళ్ళిన ముడతలు వయస్సు తాలుకా ఎన్నో రేఖలను చిత్రించింది.
“మతిమరుపులో విప్పని పొడుపుకథలను ఒక పెయింటింగుగా మీరు చిత్రించే విధానం బాహ్య ప్రపంచంలో నేటి ఉనికిని చిత్రీకరిస్తుంది. మీ మనోనేత్రానికి మాత్రమే అది సాధ్యం!”
“ప్రకృతి ఒకటి లాక్కొని మరొకటి ఇస్తున్నట్టు…” అని అన్న హరుటో, “చూడండి! ఇప్పుడు కూడా ఆ రోజు నాన్న అమ్మతో చెప్పిన అవే మాటలే నేను మీతో చెబుతున్నాను!” అనగానే, ఆయన స్నేహితుడు అతని చేతులను ఒడిసి పట్టుకున్నాడు. హరుటో చేతిరేఖల్లో అల్లుకుపోయిన కుంచె నుండి చెదరిన రంగులు, స్నేహితుడి అరచేతికి, మౌనంగా చేతులు మారాయి. ఆ వేళ ఫుజికొండ తన బాహ్యరూపం తాలుకా గోధుమరంగును కోల్పోయి, రంగు వెలిసిన పాత టీ కప్పు రంగులోకి దర్శనమివ్వడం ఎవ్వరూ గమనించలేదు, అక్కడున్న ఆ జంగుపిల్లి పచ్చకళ్ళు తప్ప…
Such a wonderful story
Mind blowing
Mind blowing story
Excellent narration