నేను అక్కడి నుంచి వచ్చాను
నాకు
స్వర్గస్తులైన నా వాళ్ళ
సజీవ జ్ఞాపకాలు ఉన్నాయి
నాకు అమ్మ ఉంది
అనేక కిటికీలు తెరచిన
ఎదురు చూపుల ఇల్లు ఉంది
సొదరులూ స్నేహితులూ
ఇంకా...
ఏమాత్రం స్నేహపూర్వకంగా లేని జైలు గది
నాకు ఉన్నాయి
సముద్ర కాకుల చేత లాక్కోబడ్డ
నాదైన కెరటం ఉంది
నా సొంత అభిప్రాయం నాకు ఉంది
నాదైన
పదునైన అంచుగల గడ్డిపోచ కూడా ఉంది
మాటలకందనంత దూరంగా ఉన్న జాబిలి
పక్షుల దానగుణం
అమరమైన ఆ ఆలివ్ చెట్టూ
నాదే!
కత్తులు ఈ నేల సజీవ దేహాన్ని
విశాలమైన భోజనపు బల్లగా మార్చక ముందే
నేనిక్కడికి నిరాసక్తంగా నడిచాను
నేను అక్కడి నుంచి వచ్చాను
తన తల్లి కోసం ఏడుస్తున్న ఆకాశంలా
నేను కూడా పుట్టిన నేలకు తిరిగొచ్చే
మేఘాన్నని తెలసుకున్నాను
నెత్తుటి న్యాయ స్థానానికి
ధీటైన వాదన కోసం పదాలన్నీ పోగేసుకున్నాను
నేనిప్పుడు నియమాలన్నీ తెంచేయగలను
'మాతృభూమి'అనే
ఒకే ఒక్క పదం కోసం
అన్ని పదాలను ముక్కలు చేయడం
నేర్చుకున్నాను
మూలం : (I Come From There )
-మహమూద్ దర్వీష్
స్వేచ్ఛానువాదం: రహీమొద్దీన్.