నవంబరు 4వతేది, 2024
పులిని దాని మహాసామ్రాజ్యంలో, సహజ నివాసంలో చూస్తే ఎలా ఉంటుంది?
అలా చూడాలనే ఆశతో మా ప్రయాణం మంచిర్యాల నుండి తడోబా నేషనల్ ఫారెస్ట్ కి ఉదయం 7.30 కి మొదలైంది. మేం ముగ్గురు అక్కచెల్లెళ్ళతో పాటు పెద్ద చెల్లి శైలూ స్నేహితురాలు సునీతను దారిలో కారు ఎక్కించుకున్నాం. మంచిర్యాల దాటాక 4 వరుసల కొత్తరోడ్డులో జుమ్మంటూ పరుగులెత్తించాడు చోదకుడు సంజయ్.
సునీత తెచ్చిన సర్వ పిండితో కబుర్లు కలిపి తింటూ తెలంగాణ బోర్డర్ దాటాం. మహారాష్ట్ర లోకి ప్రవేశించామో లేదో రోడ్డు కుంచించుకుపోయింది. రాజురా దాటి కొంత దూరం వెళ్లే వరకూ అదే పరిస్థితి. కాకపోతే మంచి సీతాఫలాలు కొనుక్కు తినడానికి వీలయింది.
ఎక్కడికి వెళ్లాలనేది మా పెద్ద చెల్లి శైలజకి తప్ప మిగతా ఎవరికీ తెలియదు. మొత్తం ప్లానింగ్ తనదే. తడోబా నేషనల్ ఫారెస్ట్ లో ఉన్న టైగర్ సఫారీ రైడ్స్ నెల ముందే రిజిస్టర్ చేసింది. అయినప్పటికీ కోర్ జోన్ లో దొరకలేదు. కేస్లా ఘాట్ గేట్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు మాకు రైడ్ దొరికింది.
అందుకే ఈ ప్రయాణం.
మేం చంద్రాపూర్ చేరే సరికి ఉదయం 10. 30 ఇంకా కాలేదు. పురాతనమైన మహంకాళి మాత గుడికి వెళ్ళాం . గోండు రాజులు నిర్మించిన దేవాలయం బయట నుండి చూస్తే గుడిలా అనిపించలేదు. అదేదో మహ్మదీయుల కట్టడంలా తోచింది.
కానీ అన్ని దేవాలయాల దగ్గర ఉన్నట్లుగానే కొబ్బరికాయలు, సాంబ్రాణి ఇతర పూజ సామాగ్రి అమ్మే దుకాణాలు అటు ఇటు దాదాపు యాభై పైనే ఉన్నాయి.
భూతలానికి పది అడుగుల దిగువన ఉన్నది అమ్మవారి విగ్రహం. అక్కడే వెనుక వైపు ఉన్న సొరంగంలో ఉన్న గదిలో అమ్మవారు సేదతీరుతుందట. గతంలో ఇక్కడికి భక్తులను అనుమతించేవారు కానీ ఇప్పుడు అనుమతి ఇవ్వడం లేదట. తెల్ల సున్నపు రాతి స్తంభాలపై చెక్కిన శిల్పాలు కొన్ని చెదిరిపోయి ..
ఈ ఆలయాన్ని గోండు సామ్రాజ్యం లోని ధుంద్య రామ్ షా అనే ఆదివాసీ రాజు 16వ శతాబ్దంలో నిర్మించారు. లోపల హనుమాన్ గుడి , గణపతి దేవాలయం ఉన్నాయి . శనీశ్వరాలయం ఉంది .
అక్కడి నుండి ఫోర్ట్ కి వెళ్దాం అని తీసుకెళ్లింది. కోట అనుకుని వెళ్లిన ఆ ప్రాంగణంలోనే ఉన్న శివాలయాన్ని చూసాం. అది కూడా భూ ఉపరితలాని కంటే కిందకే ఉంది. అక్కడ శివలింగం లో కనిపించే లింగం లేదు. లింగం చుట్టూ ఉండే ఆకారం మాత్రమే కనిపిస్తుంది. దాని మధ్యలో లింగం స్థానంలో సన్నటి షీట్ పరచి కనిపించింది. గతంలో అది కూడా ఉండేది కాదట. ఆ షీట్ కింద గుండం ఉందట. నీళ్లు ఎప్పుడూ అంటే అన్నికాలాలలో ఉంటాయట. ఆ నీరు తాగితే సర్వరోగాలు పోతాయని భక్తుల నమ్మకం అని చెప్పారు. చర్మ వ్యాధులు ఉన్న చోట ఆ నీటిని రాసుకున్నా తగ్గిపోతాయని నమ్మకం అట. 13 శతాబ్దిలో ఖండక్యా బల్లాల్ షా వేటకొచ్చినప్పుడు దాహమై ఆ నీటి గుండంలోని నీరు తాగాడట. కాళ్ళు చేతులు మొఖం కడుక్కున్నాడట. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. తన జీవితంలో ఎప్పుడూ లేనంత హాయిగా నిద్రపోయాడట . మరుసటి రోజు ఉదయం అతని శరీరంపై ఉన్న సెగ్గడ్డలు, చర్మ వ్యాధి లేకపోవడం చూసి అతని భార్య ఆశ్చర్యపోయిందట . అది ఎలా సాధ్యమైంది అని అడిగినప్పుడు రాజు తాను తాగిన నీటి గురించి చెప్పాడట.
ఆ తర్వాత ఆ ప్రాంతంలో చంద్రాపూర్ లో కోట నిర్మించారట. 15, 16 శతాబ్దాలలో నిర్మించిన చంద్రపూర్ కోటను ప్రస్తుతం జైలు వాడుతున్నారట. రాజవంశీకులు వీరేంద్ర షా ఆత్రం ఇప్పటికీ ఉన్నారు. ఆ చారిత్రక కట్టడాన్ని జిల్లా జైలుకు ప్రభుత్వానికి లీజ్ కి ఇచ్చాడని చెప్పారు .
ఆ గేటు బయట ఉన్న ప్రకారం లోపలికి వెళ్లాం . కోట ఆనవాళ్లు కనిపించలేదు. టోంబ్స్ కనిపించాయి . ఆ విషయమే అక్కడ కాపలాదారుని అడిగాం . అవి గోండు రాజు బీర్ షా సమాధి అని చెప్పాడు ధుంద్య రామ్ షా సమాధి , ఆయన భార్య సమాధి తో మరికొన్ని సమాధులు కూడా ఉన్నాయి ఆ విశాలమైన ప్రాంగణంలో.
కోట గేట్ లోంచి ఒక రౌండ్ వేసుకుని వెనుదిరిగాం.
శివాలయాన్ని అనుకుని జర్పట్ నది ప్రవహిస్తున్నది. కానీ అది నదిలాగా లేదు. మురికి కాలువలా కనిపించింది. బహుశా డ్రైనేజి అందులో కలుస్తుందేమో. మూసీ నీటి కంటే మరింత ఎక్కువ మురుగు. ఆ మురికి నీటిలోనే కొందరు బట్టలుతుకుతున్నారు.
చంద్రాపూర్ జిల్లాలో గోండు రాజులు నిర్మించిన మూడు కోటలు ఉన్నాయట. ఒకటి చంద్రపూర్ కోట , రెండోది మాణిక్ గర్ కోట , మూడోది బల్లాల్ పుర కోట .
చంద్రపూర్ నుంచి మేం మా గమ్యం తడోబా నేషనల్ ఫారెస్ట్ లోని టైగర్ సఫారీకి బయలుదేరాం.
ఆ అభయారణ్యంలో కోర్ జోన్ లో ఒక రాత్రి అయినా ఉండాలని మా ప్లాన్. నెల ముందు నుంచి వసతి కోసం శైలు ట్రై చేసింది కానీ ఖాళీలు లేకపోవడం వలన అదే రోజు తిరుగు ప్రయాణం అని ముందే నిర్ణయం చేసుకున్నాం.
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే టైగర్ సఫారీకి వెళ్లాలనుకునే వాళ్లు ముందే బుక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు దొరకడం చాలా కష్టం. అక్టోబర్ 1వ తేదీ నుంచి తడోబా అభయారణ్యం లోకి సఫారి అనుమతులు మొదలయ్యాయి. ఐదారు తేదీలకే కోర్ ఏరియా లో బుకింగ్ అయిపోయాయి. మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి రిసార్ట్ బుక్ చేసుకుందామని చూశాం. అవి మరో రెండు నెలల వరకు కాళీ లేవు. కారణం అది పూర్తిగా అడవి మధ్యలో ఉండడమే . కొద్దీ రొట్టె అన్నట్లు సదుపాయాలబట్టి రేట్లు ఉన్నాయి. కోర్ ఏరియాలో కాకుండా మరో చోట ఉండడం అంటే బయట రిసార్ట్ లో ఉన్నట్టుగానో, హోటల్ లో ఉన్నట్టుగానో ఉంటుంది. అది మాకు ఇష్టం లేదు. అందుకే ఓకే సఫారీకి పరిమితం అయ్యాం.
తడోబా టైగర్ సఫారీకి వెళ్ళడానికి చాలా గేట్స్ ఉన్నాయి. మనకి ఏ జోన్ లో కావాలో ఆ జోన్ లో బుక్ చేసుకోవచ్చు. అయితే మనకు కావలసిన సమయంలో అక్కడ అందుబాటులో ఉండాలి.
నావెగావ్ , ఖుత్వాన్ద , మోహార్లి , కొలారా , పంగిడి ఓర జరి ఇవి కోర్ జోన్ లో ఉన్న 6 గేట్లు.
కొర్ జోన్ అంటే నట్టనడుమ ఉన్న చిక్కనైన అడవి ప్రాంతం. చాలా నియమనిబంధనలు ఉన్న ప్రాంతం. పూర్తిగా అడవి జంతువుల నివాసం లేదా వాటి మహా సామ్రాజ్యం అని చెప్పొచ్చు. అక్కడ జనజీవనానికి తావు లేదు.
మొహ్రాలి జోన్ లో, కొలారా జోన్ లో పులులు ఎక్కువగా కనిపిస్తాయని రెండు మూడు సార్లు వెళ్లిన అనుభవంతో చెప్పాడు మా అబ్బాయి సాహిత్. అదే విషయం శైలు కూడా చెప్పింది.
బఫర్ జోన్ అంటే అటవీ కేంద్ర ప్రాంతానికి చుట్టూ ఉన్న ప్రాంతం. చిన్న చిన్న గ్రామాలు, పంట పొలాలు, చేలు ఉంటాయి. అంటే ఈ ప్రాంతంలో జంతువులతో పాటు మానవుడు కూడా నివాసిస్తున్నాడన్నమాట. ఇక్కడ మొత్తం పదహారు గేట్స్ ఉన్నాయి.
రెండు షిఫ్ట్ లలో సఫారీ రైడ్స్ ఉన్నాయి. ఒకటి ఉదయం ఆరు నుంచి పది వరకు, రెండోది మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు వరకు.
మేం కేస్లాఘాట్ గేట్ కి చేరేటప్పటికి 12.30 కూడా కాలేదు. అందమైన అడవి. చిన్న చిన్న షెల్టర్లు నాలుగు కుర్చీలు ఒక టేబుల్ తో ఉన్నాయి.
మా సఫారీకి చాలా సమయం ఉంది. కారు దిగగానే అక్కడి ఆఫీసులోకి వెళ్లి కలిసింది శైలు.
ఆ క్యాంపస్ లో మొత్తం 12 జిప్సి లు సిద్ధంగా ఉన్నాయి.
అక్కడ ఉన్న షెల్టర్ కూర్చుని మేం ఇంటి నుండి తెచ్చున్న ఫుడ్ తిన్నాం. గార్డెన్ లో అటు ఇటు తిరిగి పూలతో, సీతాకోకచిలుకలతో కబుర్లు చెప్పాం. కనిపించిన డ్రైవర్లను పలకరించాం.
ఆ ఉదయం సఫారీలో ఆడ, మగ పులులతో పాటు మూడు పిల్లలు కనిపించాయని చెప్పి మాకు కూడా కనిపిస్తాయన్న ఆశ పెంచారు.
మేమందరం మా ఫోటో ఐడి చూపించిన తర్వాత మాకొక జిప్సి కేటాయించారు. ఒక జిప్సి లో ఆరుగురిని అనుమతిస్తారు. కానీ మేం ఉన్నది నలుగురమే. మా కారు డ్రైవర్ సంజీవ్ కూడా మాతో సఫారీకి రావాలని చాలా ఆశపడ్డాడు. కానీ రిజిస్ట్రేషన్ అయింది నలుగురమే కాబట్టి అనుమతించం అని చెప్పారు.
సరిగ్గా రెండు గంటలకి మా జిప్సి బయలుదేరింది.
మా జిప్సి డ్రైవర్ భూషణ్, గైడ్ అమిత్. ఇద్దరూ చిన్నవాళ్ళే. భూషణ్ అయితే 16 ఏళ్ల పిల్లవాడిలా ఉన్నాడు. కానీ అతనితో మాట కలిపినప్పుడు 21 సంవత్సరాలని చెప్పాడు. ఆ ఇద్దరు స్థానికులే. బఫర్ జోన్ లో ఉన్న గ్రామాలకు చెందిన అడవి బిడ్డలు. అమిత్ కళ్ళు, చెవులు చాలా చురుకుగా..
కళ్ళు మాత్రమే కాదు చెవులు కూడా తెరిచి ఉంచి అడవి చేసే ప్రతి చిన్న శబ్దాన్ని ఆలకిస్తూ, పులిని ట్రాక్ చేయడానికి నేలమీద పాద ముద్రల్ని గమనించడం మేము గమనించాం.
మొదట్లోనే అడవికోళ్ళను, దుప్పిలు చూశాం. ఎత్తుపల్లాల , రాళ్ళూ రెప్పల బాటలో మధ్య మధ్యలో చిన్న చిన్న సెలయేళ్ళు , నీటి దారలు దాటుతూ ప్రయాణం. ఆ అడవిలో అక్కడక్కడా సోలార్ పానెల్స్ , రాత్రిపూట మాటు వేసి పులులను చూడటం కోసం వేసిన ఎత్తైన ఇనుప మంచెలు ఉన్నాయి. ఆ బాటలన్నీ ఎటునుంచి ఎటుపోతున్నాయో అర్థం కాకుండా ఉన్నాయి. నీటి గుంతలు, సన్నటి నీటి పారుదల ఉన్న ప్రదేశాల వైపు మా వాహనం ఎక్కువగా తిరిగింది.
మేమెవ్వరం మాట్లాడకుండా నిశ్శబ్దంగా పరిసరాలను కళ్ళతో జల్లెడ పడుతున్నాం. పులి కళ్లబడుతుందేమోనన్న కొండంత ఆశతో.
పులి కనిపించలేదు కానీ హార్న్ బిల్, వుడ్ పెక్కెర్, అడవి కోళ్లు, అడవి దున్నలు, జింకలు, దుప్పిలు, సాంబార్ డీర్, నెమళ్ళు, గబ్బిలం, పెద్ద గుడ్లగూబ వగైరా కనిపించాయి.
టేకు , వెదురు , మద్ది , నల్లమద్ది వంటి విలువైన కలపనిచ్చే వృక్షాలతో నిండిన అడవిలో అనేక ఔషధ మొక్కలు కనిపించాయి. మేము వెళ్లిన ప్రాంతంలో దట్టమైన అడవి మధ్యలో ఉన్న పచ్చిక బయలు. ఆ బయలు మధ్యలో ఓ సరస్సు.
మా వాహనం వెళ్లాల్సిన దారిన పచ్చికలో మేస్తూ కనిపించిన అడవి దున్న. మా వాహనం ఆగిపోయింది. మేమంతా మౌనంగా. చాలా పుష్టిగా ఉన్న అడవి దున్న తనపని తాను చేసుకుంటూ నిదానంగా కదిలింది. దాని వెంటే కదిలే కొంగలు. దానికి కోపమొస్తే జీప్ ని అలవోకగా లేపేస్తుందట. అదీకాక దాని నివాస ప్రాంతంలోకి మనం వచ్చాము కాబట్టి దానికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా వాటి ఉనికిని గౌరవించడం నాకెంతో నచ్చింది.
సాంబార్ డీర్ లు చాలా చోట్ల కనిపించాయి. అవి ఒకటిగా ఎప్పుడూ కనిపించలేదు.కనీసం మూడు అయినా కలిసి ఉన్నాయి. రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయాయేమో అక్కడక్కడా దుప్పి కొమ్ములు కనిపించాయి. వాటిని తీసుకోవాలనిపించింది. కానీ జిప్సి దిగడం, కొమ్ములు తీసుకోవడం రెండు నిషేధమేనట.
మేం తిరిగి వచ్చేటప్పుడు కాస్త దూరంగా పడుకుని సేదతీరుతున్న అడవిదున్న (బైసన్ ) చూడడానికి మరో సఫారీ బాట దిగి పచ్చిక బయళ్లపైకి వెళ్లి అక్కడ దిగబడిపోయింది. అది తీయడానికి మరోసఫారీ వాహనంతో తోసి తీయాల్సి వచ్చింది. అయినా ఆ బైసన్ కదలలేదు. మెదలలేదు. నిద్రపోతోందో. బద్దకంగా అలా ఒత్తిగిల్లిందో..
తడోబాలో బెంగాల్ రాయల్ టైగర్స్ దాదాపు రెండు వందల పైనే ఉన్నాయట. వాటికి పేర్లు కూడా పెట్టారు అటవీ శాఖవారు. ఎలా గుర్తిస్తారో మరి !
లియో పర్డ్, స్లోత్ బేర్స్ , అడవి కుక్కలు కూడా ఉన్నాయట కానీ మా కాళ్ళ పడలేదు. బహుశా కోర్ ఏరియా లో కనిపిస్తాయేమో.
పులికోసం మా వాహనాన్ని అటు ఇటు పరుగులు పెట్టించారు. ఒక చోట పులి పాద ముద్రలు కనిపించాయి. ఆ ప్రాంతంలో పులి కదలికను నిర్ధారించుకున్నారు. ఆడపులి ఆ సమీపంలో ఎక్కడో ఉందని చెప్పారు. పులి నడిచిన దిశను ఆ చుట్టుపక్కలే తిప్పారు. ఒక దగ్గర సిగ్నల్స్ అందుతున్నాయి అని వాహనం ఆపేసి మాటు వేసి కూర్చున్నాం. ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాం. పక్షులు , కోతులు ఒకదానికొకటి ఆడుతూ సంకేతాలు ఇచ్చుకోవడం అలారం కాల్ లను గమనించడం చేస్తున్నాడు. మచ్చల జింకలు, సాంబార్ జింకలు కూడా పులి ఉన్నప్పుడు ఇతర జంతువులను హెచ్చరించాడు చేసే విభిన్న శబ్దాలను బట్టి గైడ్ కి పులి ఆ ప్రాంతంలో ఉన్న విషయం తెలిసిపోతుంది.
పులి దేన్నో వేటాడిన దానికి నిదర్శనంగా ఏవో ఆర్తనాదాలు వినిపించాయి. మాకు మేము పులిని చూస్తామన్న నమ్మకం వచ్చింది.
మరో వైపుగా వాహనాన్ని తీసుకెళ్లారు. నీటి మడుగు దగ్గర కాసేపు అపి కూర్చున్నారు. లాభం లేదు పులి మా కళ్ల పడలేదు. ఆ రోజు మబ్బులు కమ్మిన వాతావరణం మాకు బాగా సహకరించింది లేకపోతే ఎండకి మాడిపోయే వాళ్ళం అనుకున్నాం కానీ ఎండ ఉంటే నీటికోసం బయటికి వస్తాయట.
వేసవిలో అయితే నీటికోసం వాటి దట్టమైన ఆశ్రయాల నుంచి బయటికి వస్తాయట. నీటిగుంటలు ఉన్న చోటకు, చెరువుల దగ్గరకొ మంచినీటికోసమో , వేసవి తాపాన్ని స్నానంతో చల్లార్చుకోవడం కోసమో వస్తాయట. అందుకే వేసవిలో వాటికి నీటికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం సోలార్ మోటార్ ద్వారా నీటి గుంటల్లో నీరు నింపుతారట.
మొత్తానికి నాలుగు గంటలు ఉత్కంఠతో, ఉద్వేగంతో గడిచిపోయాయి. సాయంత్రం ఆరు అవుతుండగా మా జిప్సి మమ్మల్ని దింపేసింది
ఒక సఫారీ రైడ్ లో కనిపించక పోయినా మరో సఫారీ రైడ్ లో కనిపించే అవకాశం ఉందని చాలామంది రెండు మూడు సఫారీ రైడ్స్ రిజిస్టర్ చేసుకుంటారట. అదే గేట్ నుండి కాకుండా మరో గేట్ నుండి చూస్తారట.
తడోబా టైగర్ సఫారీ తో పాటు తడోబా లేక్, ఎరి డాం చూడొచ్చు. చంద్రాపూర్ లోమహంకాళి ఆలయం చూడొచ్చు. సేవాగ్రాం కూడా పెద్ద దూరం కాదు కాబట్టి అక్కడికి వెళ్లి రావచ్చు .
తడోబా కి మూడు రోజులు /రెండు రాత్రులు ఉండేలా ప్లాన్ చేసుకుంటే అన్ని చూడొచ్చు.
మొబైల్స్ అనుమతించరని ముందే తెలిసి ఉండడంతో కార్లో పెట్టేశాం. శైలు సిమ్ కార్డు లేని మొబైల్ వెంట తెచ్చింది. ఆ విషయమే గైడ్ కి చెప్పింది. అతను వేరే సఫారీలు ఉన్నప్పుడు తీయకండి అని చెప్పాడు. సరే అని జాగ్రత్తగా మేం మాత్రమే ఉన్నప్పుడు కొన్ని ఫోటోలు తీసింది శైలు.
పులిని చూడాలంటే సాహసం కాదు సహనం. అడవి జంతువుల సహజ నివాసంలోకి ప్రవేశించడం కూడా మనకు గొప్ప అనుభవమే.
వి. శాంతి ప్రబోధ