సరిగ్గా ఒక గంట ముందు వారి మీద జర్మన్ల ఆకస్మిక దాడి జరిగింది.ఒక జర్మనీ వాడి కత్తి తన పేగుల్లో దిగబడి, శరీరాన్ని ఛిద్రం చేస్తున్నా,పళ్ళ బిగువున బాధను భరిస్తూనే,బెష్ న్యాక్ శక్తిని పుంజుకుని, ప్రతిఘటనకు సంసిద్దుడయ్యాడు. కొషివోయ్ తన వెనుక నుండి శరీరంలోకి దూసుకుపోయిన తూటా దెబ్బతో కంగు తిన్నాడు. కూలిపోయినట్టు పడిపోయిన అతన్ని ఒక సైనికుడు భుజాన వేసుకుని ఒక వెరస్టు దూరం వరకూ తీసుకువెళ్ళాడు.మిష్కా కి తన రక్తధారలోనే తను మునిగిపోతున్న భావన కలిగినా ; వెంటనే గట్టిగా గాలి పీల్చుకుని, శక్తిని కూడడీసుకుని, జర్మన్లను వెంబడిస్తున్నా, ఆగకుండా పరుగు పెట్టాడు. తూటాలు తరిమినా, పొదలు, చీకటి అతనికి రక్షగా నిలిచాయి.
ఎప్పుడైతే తమ మీద శత్రువులు జరిపిన వ్యూహన్ని రష్యా, రోమానియా సైన్యాలు తిప్పి కొట్టి, తమను తాము రక్షించుకోగలిగిన తర్వాత, 12 వ రెజిమెంటును ఆ ప్రాంతం నుండి ఎన్నో వెరస్టుల దూరానికి పంపబడింది. ఆ తర్వాత ఆ రెజిమెంటును రోడ్ల వెంబడి ఉన్న అవుట్ పోస్టుల దగ్గర పహారా కాస్తూ ఎవరైనా అనుమాన స్పదంగా అనిపిస్తే వారిని బలవంతంగానైనా పట్టుకుని ఆ విభాగ ప్రధాన కార్యాలయానికి తీసుకురావాల్సిందిగా ఆజ్ఞ ఇవ్వడం జరిగింది.
ఈ ఆజ్ఞ వివరాలను మొదట కొషివోయ్ కి వివరించారు.తర్వాతి రోజు ఉదయం సార్జెంట్ మేజర్ ఆజ్ఞ మీద, అతను మరో ముగ్గురు కొసాక్కులు గ్రామం వదిలి, రోడ్డుకి మరి దూరం కాకుండా ఉన్న జొన్న పొలంలో పహరా కాస్తున్నారు. ఆ రోడ్డు చుట్టూ ఓ అడవి, కాస్త ముందుకు వెళ్తే సేద్యపు భూములు ఉన్నాయి. కొసాక్కులు వంతుల వారీగా కాపలా కాస్తూ ఉన్నారు. మధ్యాహ్నానికి వారికి ఓ పది మంది సైనికులు గుంపుగా ఆ దారి గుండా వస్తూ కనిపించారు.ఆ కొండ కింద ప్రాంతంలో ఉన్న గ్రామానికి వారు వెళ్ళబోతున్నారని అర్థమవుతూనే ఉంది. అడవి దగ్గరకు వచ్చాక, వారు ఆగి సిగరెట్లు వెలిగించుకుని, ఏదో ముచ్చటించుకుని, తర్వాత ఎడమ వైపుకి తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగించారు.
‘వారి మీద కాల్పులు జరపమంటారా నన్ను?’ ఓ జొన్న మొక్క వెనుక ఉన్న కొషివోయ్ మిగిలిన వారిని అడిగాడు.
‘గాలిలో కాల్పులు జరుపు!’
‘ఆగండి అక్కడే!’
కొసాక్కులకు కూతవేటు దూరంలో ఉన్న ఆ సైనికులు ఒక నిమిషం పాటు ఆగి, దాన్ని పట్టించుకొనట్టే ముందుకు పోతూ ఉన్నారు.
‘ఆ-గం-డి!’ తన తుపాకితో గాలిలో కాల్పులు జరుపుతూ ఒక కొసాక్కు అరిచాడు.
ఒక్కసారిగా తమ తుపాకీలు సరిచేసుకుని, కొసాక్కులంతా నెమ్మదిగా నడుస్తూ వెళ్తున్న సైనికుల దగ్గరకు పరిగెత్తారు.
‘ఎందుకు ఆగకుండా వెళ్తున్నారు? ఏ యూనిట్ మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? మీ పత్రాలు చూపించండి!’ ఆ అవుట్ పోస్టుకి కమాండర్ అయిన కొలిచేవ్ ,పరిగెడుతూనే అరిచాడు.
సైనికులు ఆగారు. వారిలో ముగ్గురు తమ భుజాలకు ఉన్న తుపాకీలను కిందకు దించారు.
వారిలో ఆఖరి వాడు తన బూటు సరిచేసుకోవడానికి కిందకి వంగాడు. వారు నమ్మశక్యం కానంత దుమ్ము కొట్టుకుపోయి, అలసిపోయినట్టున్నారు. వారు అంతక్రితం రాత్రి ఎక్కడో కందకాల్లో గడిపిన దానికి చిహ్నంగా అక్కడి వృక్షాల గుర్తులు వారి బట్టలపై కనబడుతూ ఉన్నాయి. వారిలో ఇద్దరూ వేసవిలో వేసుకునే టోపీలు పెట్టుకుని ఉన్నారు. ఆ సైనికుల వెనుక నడుస్తూ ఉన్న ఒకతను, వయసులో పెద్దవాడిలా ఉన్నాడు,బహుశా ఆ దళానికి నాయకుడు అనుకుంటా; కోపంగా గట్టిగానే బదులిచ్చాడు. ‘మీకు మా గురించి ఎందుకు?మీకు మేమేదైనా ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తున్నామా? మమ్మల్ని ఎందుకు వేధించుకు తింటున్నారు?’
‘ ముందు మీ పత్రాలు చూపించండి!’సార్జెంట్ ఆ మాటలకు అడ్డు వస్తూ గంభీరంగా అన్నాడు.
నీలం రంగు కన్నుతో, ఎర్రగా కాల్చిన ఇటుకలాంటి ముఖంతో ఉన్న సైనికుడు ఒకడు , తన బెల్టు కింద నుండి సీసా ఆకారంలో ఉన్న గ్రేనేడ్ ను ఒకదాన్ని తీసి, సరాసరి సార్జెంట్ ముక్కుకి సమీపంలో ఉంచుతూ, తన చుట్టూ ఉన్న వారిని చూస్తూ, కోపంగా మాటల యుద్ధానికి దిగాడు.
‘ఇదిగో, ఇవే మా పత్రాలు! ఇక్కడే ఉన్నాయి! ఒక సంవత్సరం మొత్తం వాటికి ధృవీకరణ ఉంది. ముందు మీ ప్రాణాలు కాపాడుకోవడం గురించి ఆలోచించుకోండి, లేకపోతే కనీసం బూడిద కూడా మిగలకుండా చేస్తాను. అర్ధమవుతుందా? ఇంకా గట్టిగా చెప్పాలా…’
‘ఇక చాలు, బెదిరింపులు ఆపు’, సార్జెంట్ ముఖం చిట్లిస్తూ, పక్కకు లాగుతూ అన్నాడు. ‘పిచ్చి పిచ్చి వేషాలతో మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేయొద్దు. ఇప్పటికే ఇలాంటి బెదిరింపులు ఎన్నో చూసాము. మీరు పారిపోయి వస్తున్న సిపాయిలు. మీరు మారు మాట్లాడకుండా మర్యాదగా మాతో పాటు ప్రధాన కార్యాలయానికి రండి. మీలాంటి వాళ్ళను వాళ్ళు అదుపులోకి తీసుకుంటున్నారు.’
ఆ సైనికులు ఒకరివైపు ఒకరు చూసుకుని,అప్పటికి తుపాకీలు భుజాల మీదే ఉంచుకున్న వారు కూడా చేతుల్లోకి తీసుకున్నారు. నల్లటి మీసాలతో, సన్నగా, పొడుగ్గా ఉన్న ఒకడు, కొషివోయ్ వైపు, ఇతర కొసాక్కుల వైపు చూస్తూ, గుసగుసగా, ‘ఇప్పుడు మా ఆయుధాలు మీపై ప్రయోగిస్తే ఏం చేస్తారు? మర్యాదగా పక్కకు తప్పుకోండి! దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా, ఎవరన్నా అడ్డొస్తే మాత్రం వారి గుండెల్లో తూటా దిగుతుంది’,అన్నాడు.
నీలపు రంగు కన్నుతో ఉన్న సైనికుడుగ్రేనేడ్ ను పైకి ఎత్తాడు, పొడుగ్గా, కొద్దిగా నడుం వంగి ఉన్న వారి నాయకుడు,సార్జెంట్ కోటును తన చేతిలో ఉన్న కత్తితో చిన్నగా గుచ్చాడు; నల్లటి మీసాల వాడు తన తుపాకీ అంచును మిష్కా కొషివోయి నడుం కింద వెనుక గట్టిగా నొక్కాడు. దానితో తుపాకీ ట్రిగ్గర్ మీద ఉన్న వేలు వణికింది, అతని వెనుక భాగం జలదరించింది. ఆ సైనికుల్లో చిన్నగా ఉన్న ఒకడిని కొసాక్కులు అతని కోటు పట్టుకుని పక్కకు లాగుతూనే, ప్రతిచర్యగా చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారో అని భయంగా చూస్తూ ఉన్నారు.
జొన్న ఆకుల శబ్దం వినిపిస్తూ ఉంది ఆ నిశ్శబ్దంలో. దూరం నుండి చూస్తూ ఉంటే కొండ ముందు భాగం నీలం రంగులో కనిపిస్తూ ఉంది. ముదురు గోధుమ రంగులో ఉన్న ఆవులు కొన్ని గ్రామానికి సమీపంలో ఉన్న పచ్చికల్లో మేస్తూ ఉన్నాయి. అడవిలో బలమైన గాలి వల్ల దుమ్ము పైకి రేగుతూ ఉంది. ఆ అక్టోబర్ నెల ఆ గ్రామంలోనూ, ఇతర సమీప ప్రాంతాల్లోనూ ప్రశాంతంగానే ఉంది. కానీ ఇక్కడ మాత్రం అర్థం లేని కోపంతో సైనికులు మరలా హింసకు సిద్ధమయ్యారు.
కాసేపటికి వారి కోపాలు మాయమయ్యాయి. ఆ సైనికులు, కొసాక్కులు కొంత స్థిమితంగా మాట్లాడుకోసాగారు.
‘మేము ఇక్కడికి వచ్చి మూడు రోజులే అయ్యింది. మేమేమి వెనక్కి పిరికిపందల్లా పారిపోవడం లేదు. ఒకవేళ మీరు అలా చేస్తూ ఉన్నట్లయితే,మీరు సిగ్గు పడాలి. ఈ కష్ట సమయంలో మీరు మీ సోదరులను వదిలి పోవడం నిజంగా బాధ పడాల్సిన విషయం. ఇప్పుడు యుద్ధం ఎవరు చేస్తారు? మీరు బాగానే ఉంటారు! అంతదాకా ఎందుకు, మేము యుద్ధంలో ఉన్నప్పుడూ నా పక్కన మిత్రుడిని నా ముందే చంపేశారు,అలాంటి మేము అసలు యుద్ధానికి దూరంగా ఉన్నామని మీరు అంటారా? మేము చూసింది,అనుభవించిందే మీరు కూడా యుద్ధంలో చవిచూశారు!’ కొషివోయ్ కొంత కఠినంగా అన్నాడు.
‘అసలు ఈ వాదనలు ఎందుకు? సరాసరి వీళ్ళను కార్యాలయానికి తీసుకుపోతే సరిపోతుంది’, ఒక కొసాక్కు అడ్డుకుంటూ అన్నాడు.
‘కొసాక్కులారా! మర్యాదగా మీరు తప్పుకోండి. లేకపోతే మేము మీ పై కాల్పులు జరపాల్సి వస్తుంది. మేము తప్పకుండా ఆ పని ఛెస్తాము’, ఒక సైనికుడు బ్రతిమాలుతున్నట్టు అన్నాడు.
సార్జెంట్ నిస్సహాయంగా తల ఎగరేస్తూ,
‘మేము ఆ పని చేయలేము, సోదరులారా! మీరు మమ్మల్ని కాల్చినా తప్పించుకోలేరు. ఇంకా దళాలు గ్రామమంతా పహరా కాస్తూ ఉన్నాయి’అన్నాడు.
పొడుగ్గా నడుం వంగి ఉన్న ఆ సైనికుల నాయకుడు బెదిరింపుల నుండి వేడుకోలుకి వచ్చాడు. చివరకు అతను మురికి పట్టి ఉన్న తన సంచి నుండి గడ్డి పైన చుట్టి ఉన్న ఒక సీసా బయటకు తీసి, కొషివోయ్ వైపు చూస్తూ, అభ్యర్థిస్తూ అన్నాడు, ‘కొసాక్కులారా! ఇది తీసుకోండి. కావాలంటే డబ్బు కూడా ఇస్తాము. …ఇదిగోండి జర్మనీ వోడ్కా…మేము ఎలాగో సర్దుకుంటాము…..మమ్మల్ని వెళ్ళనివ్వండి…మా కోసం ఇంట్లో పిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు…ఈ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు కూడా తెలిసిందే…. మేము భరించగలిగినంత భరించాము….ఇంకా ఎంతకాలం…దేవుడా! మమ్మల్ని వెళ్ళనివ్వరా?’, అతను తన బూటులో ఉన్న పొగాకు సంచిలో నుండి నలిగిపోయిన రెండు కేరెన్ స్కీ నోట్లు బయటకు తీసి కొషివొయ్ చేతిలో పెడుతూ, ‘ఇది తీసుకో! మేము ఎలాగో వెళ్తాము. డబ్బు పెద్ద విషయం కాదు ……తీసుకోండి! ఇంకా కావాలంటే ఎలా అయినా ఇస్తాము’,అన్నాడు.
సిగ్గుతో,బాధతో కొషివోయ్ అతని ముఖం వైపు చూడలేక తల తిప్పుకున్నాడు. అతని ముఖంలోకి రక్తం ప్రవహిస్తున్నట్టు ఎర్రగా అయిపోయింది, దాదాపుగా అతను ఏడ్చాడు. ‘బేష్ నాయక్ కు అలా జరిగినప్పుడే నేను ఇలా బాధపడ్డాను, తర్వాత ఇప్పుడే’,తనలో తానే అనుకున్నాడు.
‘అసలు నేను ఇది ఎందుకు చేయాలి? అసలు నాకే యుద్ధం అంటే ఇష్టం లేదు,అలాంటప్పుడు వీరిని బంధించే హక్కు నాకు ఎలా ఉంటుంది? ఓ దేవుడా! కానీ అదే చేయాల్సి వస్తుందే!అలాంటి దుర్మార్గుడిగా తయారయ్యాను!’
అతను సార్జెంట్ దగ్గరకు వెళ్ళాడు,అతన్ని పక్కకు తీసుకువెళ్ళి,కళ్ళు కిందకి ఉంచి, ‘వారిని వెళ్ళనివ్వొచ్చు కదా? అసలు మనకు కూడా వాళ్ళు చేసిందే చేయాలని లేదు…ఇదంతా నటించడమే కదా?’అన్నాడు.
తర్వాత సైనికుల వైపుకి తిరిగి, ‘వెధవల్లారా! మీరేదో మంచి వాళ్ళు అని మేము అనుకుంటూ మీకు గౌరవం ఇస్తూ ఉంటే, మా ముఖాల మీదే డబ్బు కొడతారా? మా దగ్గర లేదనుకుంటున్నారా? మర్యాదగా మీ డబ్బు లోపల పెట్టుకోండి లేకపోతే మిమ్మల్ని కార్యాలయానికి నేనే తీసుకువెళ్తాను’, కందిపోయిన ముఖంతో అరిచాడు.
కొసాక్కులు దూరంగా నడుస్తూ వెళ్ళిపోతున్నారు. అప్పటికే నిర్మానుష్యంగా ఉన్న వీధులవైపు నడుస్తూ వెళ్తున్న ఆ సైనికుల వైపు చూస్తూ కొషివోయ్ అరిచాడు. ‘ఓయ్! బహిరంగమైన దారుల్లో వెళ్ళకండి. ముందు ఇంకో అడవి కూడా ఉంది. పగలు దానిలో ఉండి, రాత్రి వెళ్ళండి. లేకపోతే తర్వాతి అవుట్ పోస్టులో పట్టుబడతారు! వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు!’
ఆ సైనికులు వెనక్కి తిరిగి చూసి, తర్వాత ఒకర్ని ఒకరు చూసుకుంటూ, ఏం చేయాలో నిర్ణయించుకోలేక, చివరకు తోడేళ్ళ బృందంలా ఒకరి వెనుక ఒకరు సాగిపోయారు.
* * *