ఇది ప్రేమ కథే, కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ మాత్రమే కాదు.

Spread the love

సొంత ఊరి పై ప్రేమ…
కన్న తల్లి పై ప్రేమ…
పుట్టిన దేశం పై ప్రేమ…
దేశం కోసం చేసే యుద్దం పై ప్రేమ…

పచ్చని ప్రకృతి పై ప్రేమ…
తీయని సంగీతం పై ప్రేమ…
అందమైన అమ్మాయి పై ప్రేమ…
దెబ్బతిన్న యుద్ధ వీరుడు పాడే పాట పై ప్రేమ…

గాలికి తలలూపే స్టెప్ మైదానల పై ప్రేమ…
ఎత్తుపల్లాలు ఉండే కుర్గ్ లోయల పై ప్రేమ…
నిశబ్ధ రాత్రి పిల్ల కాలువ చేసే సవ్వడి పై ప్రేమ…
అప్పుడప్పుడు పడే వర్షపు చినుకుల పై ప్రేమ…

సమిష్టి వ్యవసాయ క్షేత్రాల లో పండించిన పంట పై ప్రేమ…
పంట కోతలో స్త్రీలు అనుభవించే కష్టం పై ప్రేమ…
యుద్ధ వీరుల కోసం పంట పంపే రైలు పై ప్రేమ…
ఆ రైలు తెచ్చే యుద్ధ వీర సోదరులు పంపే ఉత్తరాల పై ప్రేమ…

తను ప్రేమించిన ప్రేమ అందమైన మరొక ప్రేమతో ఎగిరి పోయినా ఆనందంగా స్వీకరించగల ప్రేమ.

ప్రేమంటే ఇదే అని తెలియని నిస్వార్ధపరుడు, అప్పుడే పసితనం వదిలి పరువం లోకి అడుగుపెట్టిన చిత్రకారుడు సయ్యద్ చెప్పే అందమైన ప్రేమ కథ జమీల్యా.

అత్తర్లీనంగా ఎంత వ్యధ ఉన్నప్పటికీ సున్నితంగా పాఠకుడికి అర్థమయ్యేలా అందంగా అద్భుతంగా జమీల్యా అందాన్ని, ధనియార్ దేశభక్తిని, వారిరువురి మధ్యన స్వచ్ఛమైన ప్రేమను, సయ్యద్ నిస్వార్థ ప్రేమతో వర్ణించిన తీరు ప్రపంచం వ్యాప్తంగా అభిమానులని తెచ్చింది.

పుస్తకం మెదలైన తొలి పేజీ నుంచే సహజమైన ప్రకృతి వర్ణన మనల్ని కిర్గిస్తాన్ స్టెప్ మైదానాల్లో విసిరేస్తుంది. అక్కడ ఆ నేలపై కూర్చుని దూరంగా కనిపించే పర్వతాలను, చిరుగాలి పలకరింపుకు మురిసిపోయే స్టెప్ గెడ్డి మైదానాలను, కుర్కురేవ్ పరిసరాలను ప్రత్యక్షంగా అనుభూతింపజేస్తుంది.

ఐత్మతోవ్ 1958 లో కిర్గిజ్ (రష్యా) భాషలో రాశారు. ఇప్పటికీ దీని అనువాదం తెలుగులో ఒక క్లాసిక్. అయినా కూడా నేటి తరం కోసం మరొకసారి అనువాదం చేయడం, పుస్తకం యొక్క గొప్పతనాన్ని తెలియ చేస్తుంది.

ఆ నాటి రష్యా యుద్ధ పరిస్థితులలో  కిర్గిస్తాన్‌లోని కుర్కురోవ్ గ్రామాల్లోని ఆడవాళ్లు పడే కష్టం, అంతటి కష్టం లో కూడా దేశం కోసం కష్టాలని కన్నీళ్లని  కష్టంగా గాక వారి భాద్యతగా, వారి జీవితం లో ఒక భాగంగా ఎంతలా స్వీకరించారో ఐత్మతోవ్ అంతర్లీనంగా, అతి సున్నితంగా వివరించగా, నరేష్ కుమార్ సూఫీ ఇప్పుడు వాడుకలో ఉన్న పదాలను ఉపయోగించి, పుస్తకం లోని భావాలను మనసుకి హత్తుకునేలా మరొకసారి అనువాదించారు. పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చిన ఎన్నెలపిట్ట ప్రచురణకు అభినందనలు.

వాణీ వీక్షణం

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *