[‘ఉదయిని’ కోసమని తెలుగు కథల ఇంగ్లీషు అనువాదాలవైపు చూడడం ప్రారంభించాక, పతంజలి శాస్త్రి ‘జెన్’ కథని చదవడం తటస్థించింది. అది నన్ను ఆకట్టుకుంది. సర్వ సాధారణమైన జీవితాంశాలను ఆధారంగా చేసుకొని, పాఠకుడి దృష్టిని లోతైన తాత్వికతవైపుగా, లేదా విస్తృతమైన సామాజికాంశాల వైపుగా మళ్లించగల విశిష్టమైన సామర్థ్యం ఈయనలో ఉందని బలంగా అనిపించింది. అప్పుడు గుప్తా ’91 కథలు నా చేతికి వచ్చాయి. వాటిల్లోని రెండు కథల గురించి వ్రాయకుండా ఉండలేకపోయాను.]
కథ అనే మైక్రో ప్రక్రియలో మొత్తం సమాజపు మేక్రో ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాడీ రచయిత. ఈ పనిని సైద్ధాంతిక ప్రకటనలూ, ఆవేశపూరితమైన వక్కాణింపులూ లేకుండా – హృదయాన్నీ, మెదడునీ ఏకకాలంలో ప్రభావితం చెయ్యగలగడం పతంజలి శాస్త్రి ప్రత్యేకత, విశిష్టత. అందుకే ఈ కథలు చాప క్రింద నీరులాగా మన లోలోపలికి జొరబడతాయి. కలకాలం గుర్తుండిపోతాయి. చదివినప్పుడల్లా కొత్త కోణాలను స్ఫురింపజేస్తాయి. నవలా స్థాయిలో సాధ్యపడే సామాజిక పరిణామాల చిత్రణనూ, పాత్రలలో పరిణితినీ, కథా రూపంలో దర్శింపజేయడం ఒక సవాలు. దీన్ని సునాయాసంగా అధిగమిస్తాడీ రచయిత. అందుచేత కథల్లో గాఢత పెరిగిపోతుంది; పాఠకుడే వాటిలోతుల్లోకి వెళ్లి అన్వేషించాల్సి ఉంటుంది. సహజసిద్ధమైన సంఘటనలనూ, సజీవమైన పాత్రలనూ ఆధారంగా చేసుకుంటూ కథలను అల్లుకుపోతాడు. ఆ అల్లికలో మనల్ని ప్రవేశపెడతాడు. కథల పొరల్లోకి వెళుతూనే మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండిపోతాం. ఉత్తమ కథల లక్షణం అదే మరి.
గుప్తా ’91
1991 నాటి ఆర్ధిక సంస్కరణలు, సరళీకరణ, తత్ఫలితంగా విజృంభించిన ప్రపంచీకరణలపై చాలా చర్చలు జరిగాయి; వివాదాలు నడిచాయి. వ్యాసాలేకాకుండా సృజనాత్మక సాహిత్యంకూడా వెలువడింది. ఇది తెలుగులో కూడా జరిగింది. ఆనాటి సంస్కరణలకు ఆద్యుడు, తెలుగువాడు, అయిన పీ.వీ. నరసింహారావుకి తగిన గుర్తింపురాలేదని వాపోయినవాళ్లూ, వాపోతున్న వాళ్లూ అనేకులున్నారు.
ఈ కథను – చదువు, ఉద్యోగాలు, వాటివెంట వచ్చే బదిలీలతో కూడుకున్న చిన్న పట్టణాల మధ్యతరగతి కుటుంబం చుట్టూ అల్లడం, అది సంసార పక్షంగా ఉండే సామాన్య వైశ్య కుటుంబం కావడం, ఇంటి యజమాని అతి జాగ్రత్తపరుడు, పొదుపరి, భయస్థుడు అయిఉండడం, కథకు ‘గుప్తా ’91 అనే శీర్షికను ఎంచుకోవడం – ఇవేవీ కూడా యాదృచ్ఛికాలు కావు. రచయిత పకడ్బందీగా ఎంచుకున్న సందర్భాలే.
చిన్ననాటి ఙ్ఞాపకాల గ్రామం తురకపాలెం కోసం నిత్యం తపించే తల్లి, ఆమెకు ఆ ఊరి ఊసులను గుర్తుచేసే మడేలు (చాకలి), అతనికి టిఫినూ, టీ సరఫరా చేస్తుందని తల్లిమీద విసుక్కొనే కొడుకు గుప్తా, ఒడుపుగా తన సంసారాన్ని ఈదుతూ, తనకు కావలిసినవన్నీ రాబట్టుకోగల చాతుర్యం కలిగిన అతని భార్య పార్వతి – కథలోని ఈ ప్రధాన పాత్రలలో ప్రత్యేకత ఏముంది? అని ప్రశ్నిస్తే, ‘ఏమీ లేదు’ అనే చెప్పుకోవాలి.
మడేలు తెచ్చిచ్చిన ‘నేరేడు పండు బుగ్గన పెట్టుకొని తురకపాలెం ఙ్ఞాపకాలలోకి వెళ్తూంటుంది తల్లి’. ఆమెగాని, కుటుంబ సభ్యులుగాని ఆ ఊరు వెళ్లకుండానే కథ ముగుస్తుంది. ఎన్‌టీవోడిని ప్రత్యక్షంగా చూశానని చెప్పుకొని, మురిసిపోతాడు మడేలు. తెలుగుదేశం పార్టీ స్థాపన జరిగిందని ఊహించుకోవచ్చు. ఇంట్లోకి మొదట ఫోను ప్రవేశిస్తుంది. దొంగచాటు ట్రంక్‌కాల్స్, పెచ్చుమీరిన బిల్సూ మొదవుతాయి. పై వాటాలో కలర్ టీవీ చూసినప్పుడు గుప్తాగారికి ‘రాజమండ్రి వెలిసిపోయినట్టు కనిపిస్తుంది’. ఇందిరాగాంధీ అంతిమయాత్రను పై వాటాలోని టీవీలోనే చూస్తాడుగానీ, చుట్టుప్రక్కల అన్ని ఇళ్లమీదా ఏంటెన్నాలు మొలుస్తూంటే, పిల్లల ఒత్తిడి భరించలేక, టీవీ కొంటాడు గుప్తాజీ.
భార్య పార్వతి చాకచక్యంగా వీడియో పార్లర్ ప్రతిపాదనతో వీడియో ప్లేయర్‌ని చేరుస్తుంది. సీరియల్స్‌లో అత్తాకోడళ్ల మధ్య జరిగే నిరంతర పోరాటాల నడుమ, కూతురు బ్యూటీ పార్లర్‌కి వెళ్లడం అలవర్చుకుంటుంది; నగరాలు ప్రసాదించే స్వేచ్ఛను, గోప్యతను కోరుకుంటుంది. కొత్త బైక్‌ని స్వతంచేసుకుంటాడు, కొడుకు.
తెలుగువాడు ప్రధాని అయ్యాడని సంతోషిస్తూండగానే ‘అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలు కాలువల్లా దేశంలోకి ప్రవహించాయి. గోడలు బ్రద్దలైపోయాయి’. ప్రపంచీకరణ మొదలైపోయిందని సూచనప్రాయంగా తెలిజేస్తాడు రచయిత. వైజాగు బదిలీ కావడం కుటుంబం అంతటికీ అనుకూల పరిణామం అవుతుంది. చేజారిన తురకపాలెం పట్ల ప్రగాఢమైన వాంఛతో మొదలైన కథ, అంతటినీ ముంచేస్తుందేమోననే భయాన్ని కలిగించే వైజాగు సముద్రంతో ముగిసిపోతుంది.
1980-1990లనాటి పెనుమార్పులను పట్టిచ్చిన తెలుగు కథల్లో ఇది ఉత్తమ స్థాయిలో నిలుస్తుంది. 1991నాటి ఆర్థిక సరళీకరణకు అప్పటికే ఒక సంసిద్ధత ఏర్పడి ఉందనే వాదనను ఈ కథ బలపరుస్తుంది. వినిమయతత్వం, పోటీతత్వం ఆనాటికే మధ్యతరగతి అభిలాషలకు ఆజ్యం పోసాయి.ఆ తరువాత మన సమాజం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని మనకు తెలుసు. ఈ మార్పు మంచికా, చెడుకా? అనే చర్చను మనకే వదిలిపెడతాడు రచయిత.
రమ సంగతి
‘ముప్ఫై ఏళ్లపాటు పరిశోధన చేసినా, స్త్రీలకు ఏమి కావాలి? అనే ప్రశ్నకు సమాధానం కనుక్కోలేకపోయాను,’ అన్నాడట మనో విశ్లేషణకు మూలపురుషుడైన వైద్యుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సిగ్మండ్ ఫ్రాయిడ్. స్త్రీల అవసరాలు భిన్నమైనవీ, ప్రత్యేకమైనవీ అనే వాదన 1960ల తరువాత కనుమరుగైంది.
ఈ కథలో – రమ పాత్ర ఏమి కోరుకుంటున్నదీ చూచాయగా తెలియజేస్తాడు రచయిత. ఆద్యంతం, రమ మనసులో ఏముందో మనకు తెలియదు. ఆమె మాటలు, ప్రవర్తన ఇవే మనకు కనిపిస్తాయి. కథ అంతా ప్రసాదరావు వైపునుండే ఆవిష్కృతం అవుతుంది. పార్ట్‌టైం లెక్చరర్‌గా లా కాలేజీలో పాఠాలు చెప్పే ప్రసాదరావు, సమర్థుడైన ఉపాధ్యాయుడు. అతడు విద్యార్థిని రమపట్ల ఆకర్షితుడవుతాడు. భార్య పురిటికని పుట్టింటికి వెళ్లడం ఈ ఆకర్షణను కొనసాగించడానికి చోటుని ఏర్పరుస్తుంది. తనకి పెళ్లైందనీ, తండ్రికూడా అయ్యాడనీ రమకు తెలియకుండా జాగ్రత్త పడతాడు. అతని పట్ల ఆమెలో కలిగిన ఆసక్తినీ, ఆకర్షణనీ రమకూడా దాచుకోదు.
ఒకనాడు పాఠం చెబుతూ, “చట్టం వేరు, నీతి వేరు. నీతి నీ వ్యక్తిగతమైన దృక్పథం…నీతిమంతుడై ఉండాలా అనేది నీ ఇష్టం. కానీ చట్టప్రకారం ఉండాలా లేదా అనేది నీ ఇష్టం కాదు,” అంటాడు ప్రసాదరావు.
అప్పుడు రమలేచి, “వ్యక్తి అయినా, సమాజం అయినా చట్టాల్ని నీతి-నిజాయితీలే కాపాడాలి. అవే మనస్సాక్షి,” అంటుంది.
“నీతికి మినహాయింపులుంటాయి,” అని ఆనాటి చర్చను ముగిస్తాడు ప్రసాదరావు.
ఈ చర్చ చుట్టూతా, కాస్త ఎడంగా, మిగతా కథ మలుపులు తిరుగుతుంది.
ఆమెను కలుసుకొనేందుకై ప్రసాదరావు తహతహలాడుతూంటాడు. ఒకసారి సినీమా హాల్లో కలుసుకుంటారు. ఊహించని విధంగా పుట్టినరోజు నాడు స్వీట్లు తీసుకొని ప్రసాదరావు ఇంటికి వస్తుంది రమ. అతనిలో ఉద్విగ్నత. శారీరకంగా మరింత చేరువయ్యేందుకై రమే స్వయంగా చొరవ తీసుకున్నప్పుడు, భయపడిపోయి,”ఏమిటిదంతా? నాకు పెళ్లైంది. బయటకు ఫో!” అనేస్తాడు.
ఇక్కడ – పనమ్మాయి కోసమని ఓరగా తెరచిఉంచే తలుపు ప్రస్తావన ఉంటుంది. ప్రసాదరావు ఉండేది చిన్న టౌన్‌లో, దిగువ మధ్య తరగతి మధ్యలో. అతడు ఏం చేసినా, చెయ్యకపోయినా నలుగురికీ తెలిసిపోతుంది. రమ లోనికి వచ్చాక తలుపు గడియ పెట్టేసిఉంటే అతడు తన స్వయం నిర్ణయాధికారాన్ని ప్రకటించుకున్నట్లుగా ఉండును. తన నీతివంతమైన జీవితంలో దాచిపెట్టాల్సిందేమీ లేదని తెలియపరచడానికి తలుపుకి గొళ్లెం వెయ్యడు. రమతో సాన్నిహిత్యం మరోస్థాయిలోకి చేరుకుంటూండగానే పనమ్మాయి తలుపుతోసుకొని లోనికి వచ్చేస్తుంది. తన నీతిని ప్రకటించుకోవడానికని, ‘బయటకి ఫో,’ అని రమ మీద అరుస్తాడు – ఆ కర్కశత్వం పనమ్మాయికి ధ్వనించేలా. అది అతని నిజస్వరూపం అని రమ గ్రహిస్తుంది. కోరికలెన్ని ఉన్నా, ఏం చెయ్యడానికీ ధైర్యం చాలక, మంచివాడుగా మిగిలిపోతాడు, ప్రసాదరావు. అలాగని అతని ‘మంచితనం’ నిలబడదు.
అత్యాచారం చెయ్యబోయాడని కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తుంది రమ. చెయ్యని నేరాన్ని ఎందుకు తనపై మోపిందో ప్రసాదరావుకి అర్థంకాదు. ఉద్యోగం ఊడుతుంది. మరికొన్నాళ్లకి తన ఫిర్యాదును వెనక్కితీసుకుంటుంది రమ. ఏమవుతోందో ప్రసాదరావుకి బొత్తిగా అర్థం కాదు.
ఉన్నట్టుండి ఒకరోజున ఫోన్ చేసి, “ఒకసారి మా ఇంటికి రండి, ఒక్కదాన్నే ఉన్నాను,” అంటుంది రమ. ప్రసాదరావు రక్తం దౌడు తీస్తుంది. ఆనాడు వారిరువురూ శారీరకంగా ఒకటవుతారు. వెళ్లిపోతూ, మళ్లీ ఎప్పుడు ఫోన్ చేస్తావు?” అని ప్రసాదరావు అడిగితే, విశాఖపట్నం వెళ్లిపోతున్నాను అని ప్రకటించి, ఆ సంబంధాన్ని అంతటితో త్రుంచివేస్తుంది రమ.
రమ, ప్రసాదరావులో ఏం చూసి దగ్గరయ్యేందుకు ప్రయత్నించింది? అతడు అందరిలాంటి భయస్థుడే అని తెలుసుకున్నాక, నిరాశచెంది కక్ష సాధింపుకు పూనుకుందా? తప్పుడు ఆరోపణ చేసిందా? తన మూలంగా ఉద్యోగం ఊడిందని జాలిపడి, అతను కోరుకున్నదాన్ని ఇచ్చి, ఉద్వాసన చెప్పిందా? ఈ ప్రశ్నలకు రచయిత జవాబులివ్వడు. పాఠకులు ఊహించుకోవాల్సిందే.
స్వల్పకాలికమైన ఈ బంధం ఇద్దరిలోనూ అసంతృప్తిని మిగిల్చిందనిపిస్తుంది. “పురుషుడు సెక్స్‌కోసమని ప్రేమని ఇస్తాడు; స్త్రీ ప్రేమకోసమని సెక్స్‌ని ఇస్తుంది. చివరికీ ఇద్దరూ అసంతుష్టులుగానే మిగిలిపోతారు,” అన్న అనిల్ ధర్కర్ మాట గుర్తుకొస్తుంది, ఈ సందర్భంగా.
అయితే ఈ విధమైన నిస్పృహతో కథ నిలిచిపోదు; మరో నాలుగడుగులు ముందుకి వేస్తుంది. రమకు ఉన్న స్పష్టత ప్రసాదరావుకి లేదు. ఆమె ఈ సంక్షోభం నుండి పాఠాలను నేర్చుకొని, ముందుకే నడిచిందని మనకు అర్థం అవుతుంది. అతను మాత్రం వివాహేతర సంబంధానికై అర్రులు చాస్తూనే, చివరి క్షణంలో బెదరిపోయాడు. ఇద్దరికీ అంగీకారం అయితే అది బలాత్కారం, అత్యాచారం కాజాలదనే అవగాహన రమ ఉన్నట్లు తోస్తుంది. చట్టబద్ధతకన్నా కూడా, నీతి-నిజాయితీలు, మనస్సాక్షి – ఇవే ముఖ్యం అని ఆమె భావించినట్లు మనకు అనిపిస్తుంది.
ఒక చిన్న కథను ఆధారంగా చేసుకొని ఇంత లోతైన చర్చను ప్రవేశపెట్టిన రచయిత అభినందనీయుడు. కథలో చెప్పని విషయాలే కథకు సమగ్రతను చేకూర్చడం, పాఠకులను ఆలోచింపజేయడం – ఈ కథలోని విశేషం, విశిష్టత. హృదయాన్నీ, మెదడునీ ఏకకాలంలో తాకే పతంజలి శాస్త్రి కథలకు ఇదొక ముచ్చటైన మచ్చుతునక.
‘గుప్తా ’91’. అనల్ప బుక్ కంపెనీ. 145 పేజీలు. రూ.175/-.
ప్రతులకు: www.analpabooks.com